రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 26, 2021

1094 : రివ్యూ

రచన- దర్శకత్వం : మిలాప్ జవేరీ
తారాగణం : జాన్ అబ్రహాం
, దివ్యా ఖోస్లా కుమార్, హర్ష్ ఛాయా, జాకీర్ హుస్సేన్, అనూప్ సోనీ, నోరా ఫతేహీ తదితరులు
సంగీతం : సంజయ్ చౌదరి
, ఛాయాగ్రహణం : డడ్లీ
బ్యానర్స్ : టీ సిరీస్ ఫిలిమ్స్
, ఎమ్మే ఎంటర్ టైంమెంట్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్
, కృష్ణ కుమార్, మనీషా అద్వానీ, నిఖిల్ అద్వానీ
విడుదల : నవంబర్ 25
, 2021

***

        జాన్ అబ్రహాం తో సత్యమేవ జయతే (2018) తీసిన దర్శకుడు మిలాప్ జవేరీ దాని సీక్వెల్ సత్యమేవ జయతే 2 తో వచ్చాడు. మాస్ సినిమాలకే చెడ్డ పేరు తెస్తున్నాడని పేరున్న మాస్ డైరెక్టర్ జవేరీ, సీక్వెల్ తో ఇంకెంత చెడ్డ పేరు తెస్తాడోనని భయ సందేహా లేర్పడ్డాయి. పైగా 1980 ల నాటి సినిమాలకి నివాళిగా తీసినట్టు ప్రకటించాడు. నివాళిగా తీస్తే నీటుగానే తీసి వుంటాడని ఒక పక్క నమ్మకమేర్పడింది. జాన్ అబ్రహాం త్రిపాత్రాభినయం చేయడంతో మాస్ యాక్షన్ మస్తుగా వుంటుందని ఫ్యాన్స్ కూడా బుకింగ్స్ కి రెడీ అయ్యారు. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలంటే ముందు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడే మాస్ సినిమాలు తీయాలని ప్లాన్ చేసిన జవేరీకి, మొన్న సూర్యవంశీ మాస్ పెద్ద హిట్టవడంతో ధైర్యం వచ్చేసింది. మరి ఇది మాస్ సినిమాలకి మంచి పేరా, చెడ్డ పేరా చూద్దాం...

కథ

ఉత్తర ప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలో సత్య బలరామ్ ఆజాద్ (జాన్ అబ్రహాం) హోం మంత్రి. ఇతడి తండ్రి దాదా సాహెబ్ బలరాం ఆజాద్ (జాన్ అబ్రహాం) వ్యవసాయదారుడు. కవల సోదరుడు జై బలరాం ఆజాద్ (జాన్ అబ్రహాం) ఏసీపీ. సత్య బలరామ్ ఆజాద్ హోమ్ మంత్రిగా అసెంబ్లీలో అవినీతి నిరోధక బిల్లు ప్రవేశ పెడతాడు. దీన్ని కూటమి భాగస్వాములు వ్యతిరేకిస్తారు. దీనికి ఎమ్మెల్యే విద్య (దివ్యా ఖోస్లా కుమార్) కూడా వ్యతిరేకంగా ఓటేస్తుంది. ఈమె సత్య భార్యే, పైగా ముఖ్యమంత్రి చంద్ర ప్రకాష్ కుమార్తె. అసెంబ్లీలో బిల్లుని ఓడించడంతో సత్య ఇక స్వయంగా తనే అవినీతి పని బట్టాలనుకుంటాడు.

        ఓ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సమ్మెకి దిగుతారు. ఈ సమయంలో ప్రమాదానికి గురైన కూతురికి చికిత్స చేయమని ఓ తల్లి వేడుకుంటే, సమ్మెకి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ నిరాకరిస్తాడు. ఆ కూతురు చనిపోతుంది. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న హోమ్ మంత్రి సత్య, డాక్టర్ని చంపేస్తాడు. దీంతో భయపడి సమ్మె విరమిస్తారు. సత్య రాత్రికి రాత్రే హీరో అయిపోతాడు. ఇది సీఎం చంద్ర ప్రకాష్ కి నచ్చక, వాణ్ణి పట్టుకోమని పోలీసుల్ని ఆదేశిస్తాడు. సత్యని పట్టుకోవడానికి కవల సోదరుడు ఏసీపీ జై రంగంలోకి దిగుతాడు.        

మదర్సాలో విషాహారంతో అస్వస్థతకి లోనై ఆస్పత్రిలో చేరిన 40 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోతారు. దీనికి పాడైపోయిన ఆహార ధాన్యాలని సరఫరా చేసిన ఎమ్మెల్యే, ఆక్సిజన్ని సరఫరా చేయని ఎమ్మెల్యే, ఇద్దరూ  కూటమిలో భాగస్వామ్య పార్టీ సభ్యులే బాధ్యులని వాళ్ళిద్దర్నీ చంపేస్తాడు సత్య. ఒక ఫ్లైఓవర్ కూలిపోవడంతో అది నిర్మించిన కాంట్రాక్టర్ అవినీతిపరుడని అతణ్ణి కూడా సత్య చంపేస్తాడని ఏసీపీ జై ఆపడానికి ఉద్యుక్తుడవుతాడు...ఇక అవినీతిపరుల్ని చంపుతున్న సత్యకీ, అతణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించే జైకీ మధ్య తీవ్ర సంఘర్షణ ప్రారంభమవుతుంది...

నివాళి కాదు నిప్పు

1980 ల నాటి యాంగ్రీ యంగ్ మాన్ సినిమాలకి నివాళిగా ఈ సినిమా అందిస్తున్నట్టు చెప్పిన దర్శకుడు మిలాప్ జవేరీ, 1980 ల నాటి సినిమాలంటే నేటి తరం ప్రేక్షకులు భయపడేంత భీకరంగా తీశాడు. 1980 ల నాటి సినిమాలు ఇలా వుండేవా? ఆ నాటి దర్శకులు ఇంత నాటుగా వుండేవాళ్ళా? ఇది నివాళియా, నిప్పంటించడమా? జాన్ అబ్రహాం అవినీతి పరుల్ని నిప్పంటించి జుగుప్సాకరంగా చంపినట్టు - 1980 ల నాటి సినిమాల చరిత్రని ఇలా తుదముట్టించడమే. అప్పటి సినిమాల్లో దేశభక్తి ఇలా వుందా? దేశభక్తి పేరుతో ఇలా చేశారా? మిలాప్ జవేరీ చూపించింది థర్డ్ క్లాస్ దేశభక్తి. చెవులు పగిలి పోయేలా అరుపులు అరిచి వినిపించే దేశభక్తి. చంపినప్పుడల్లా తన్ మన్ ధన్ సే బడ్కర్ జన్ గణ్ మన్ (దేహం, గుండె, డబ్బు కంటే గొప్పది జనగణమన) అని గొంతు చించుకునే నాటు దేశభక్తి. ఏ దేశానికైతే గంగమ్మ తల్లిగా వుందో, అక్కడ రక్తం కూడా త్రివర్ణ పతాకమే - అనే రక్తదాహపు దేశభక్తి. హింసకి పర్యాయ పదంగా అతి దేశభక్తి.

మరిన్ని భీకర అరుపులు- ఒక్కో పాపిష్టోడ్నీ ఎలా చంపుతానంటే...మళ్ళీ జన్మలో వాడు అమ్మ కడుపులోంచి బయటికి రావడానికే కాదు, అయ్య వీర్య కణంలోంచే బయటికి రావడానిక్కూడా భయపడి చస్తాడు!

        నా కుతి తీరేలా నిన్ను కొడతా. నువ్వు పళ్ళు బయటపెట్టి పడీ పడీ నవ్వాల! నవ్వాపావో, మళ్ళీ మళ్ళీ కొడతా!

        చెత్త నాకొడుకుల్ని చంపాలంటే 56 ఇంచుల ఛాతీ కాదు, 56 కిలోల బండ (చెయ్యి) కావాలి!

        నా ఫండమెంటల్ దండి (దండి మార్చ్) కాదు, నా ఫండమెంటల్ దండా (లాఠీ). గాంధీజీకీ ఎప్పుడూ జై, కానీ నా భగత్ సింగ్ కి ఇంకా జై!  


నోట్లు తప్ప ఇంకేం మారలేదు. పేదోడు బరిబత్తెలు గానే వున్నాడు, ఇక ఇప్పుడు అవినీతైనా అంతమవ్వాలి, రక్తాలైనా పారాలి!

        సిగ్నల్ దగ్గర పోలీసుకి వంద రూపాయల మీద ఆశ. నీ పేరు ఖాన్ అయితే నీ ఖాందాన్ (వంశం) మొత్తం టెర్రరిస్టులే. రైతు వాడింట్లో వాడే ఫ్యానుకి వేలాడే నా దేశం మహాన్ హై!

        ఈ హీరోయిజాన్ని చూసి ప్రతీసారీ జనాలు కవితలు అల్లి మరీ జేజేలు పలకడం-హీరోనే ఎంట్రీ మారీ, పబ్లిక్ నే సీటీ మారీ, అబ్ తో షురూ మారామారీ! (హీరోగారు ఎంట్రీ కొట్టారు, జనాలు ఈలలు కొట్టారు, ఇక వీర కొట్టుడు మొదలు) ... కసమ్ సినిమాకీ, అబ్ దిఖాదే బేటీ తూ ధర్తీ మాకీ! (సినిమా మీదొట్టు, నేలతల్లి బిడ్డగా ఇహ నేల మట్టం చెయ్యమ్మా).

దినపత్రిక చదువుతున్నట్టు ఎత్తి రాసి తీసిన ఎన్నో సంఘటనలు. అమరుడైన తండ్రి పెన్షన్ కోసం ఓ యువతి పోతే అవినీతి అధికారి వెళ్ళ గొట్టడం, రాజకీయ నాయకుల అనుచరులు ఓ యువతిని మానభంగం చేస్తే ఆమె బహిరంగంగా కాల్చుకుని చనిపోవడం, రైతుల ఆత్మ హత్యలు, లోక్ పాల్ బిల్లు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, మత సహనం, సామరస్యం... ఇలా ఎన్నెన్నో.

        ప్రభుత్వాఫీసు ముందు ఖురాను, జానీమాజ్ పట్టుకుని నిలబడ్డ ముస్లిం స్త్రీని ప్రశ్నించిన అధికారికి జాన్ అబ్రహాం రాజ్యాంగం గురించి క్లాసు పీకడం. అసలామె అక్కడెందుకు నిలబడిందంటే, జాన్ అబ్రహాం రాజ్యూంగం గురించి కూడా ఓ క్లాసు పీకే సీను వుండాలి కాబట్టి. కానీ రాజ్యూంగ భక్తి లేకుండా దేశభక్తి పూని మనుషుల్ని నిప్పంటించి మరీ చంపడం. జాతీయ పతాకాన్ని కూడా అవమానించడం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపినప్పుడల్లా జాతీయ పతాకాన్ని చూపించడం.

        ముగ్గురు జాన్ అబ్రహాంలు అరుపులు, పెడబొబ్బలు, గాండ్రింపులు! అసలు సినిమాలో ఏ నటులు కూడా మాట్లాడరు, అరుస్తారు. మామూలుగా అరవరు, మ్యూజిక్ డైరెక్టర్ దిక్కులు పిక్కటిల్లేలా కొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పోటీపడి అరుస్తారు. ఈ మూవీ భారీ శబ్దాల హోరు. చెవులు తట్టుకోగల్గాలి.

1980 సినిమాలకే కాదు అప్పటి దర్శకులు మన్మోహన్ సింగ్, ప్రకాష్ మెహ్రా లకి కూడా నివాళీ అన్న దర్శకుడు, చెడగొట్టి చూపించడానికి దేన్నీ వదల్లేదు.  అర్ధం పర్ధం లేని కిచిడీ కథ; నాటు, మోటు, ఘాటు నటనలు, లాజిక్ లేని హాస్యాస్పదమైన ఫైట్లు...హెలికాప్టర్ ఎగరకుండా పట్టి లాగుతాడు అబ్రహాం. మోటారు సైకిలు మీద వున్న వాడితో సహా లేపి గాల్లోకి విసిరేస్తాడు. ఇవన్నీ చూసి మాస్ ప్రేక్షకులు మాత్రం చప్పట్లు కొడితే చాలనుకున్నట్టుంది. ట్రైలర్స్ విడుదల చేసినప్పుడే ట్విట్టర్ నిండా వెటకారాలు చేశారు యూత్.

ఒకందుకు మెచ్చుకోవాలి

జాన్ అబ్రహాం అరుపులు  అరిస్తే అరిచాడు, అతడికా శక్తి వుంది. అరవలేని ఇతర నటులు అరవడం సూట్ కాకపోయినా అరవడమే. ఇది ఇంకో టార్చర్. సిక్స్ ప్యాక్ జాన్ అబ్రహాం తను గౌరవం గల స్టార్ అన్న విషయం మర్చిపోయి, సక్సెస్ కోసం సృష్టించిన బీభత్సం వూర మాస్ ప్రేక్షకులకే నచ్చుతుంది. దేశభక్తితో అన్నితరగతుల ప్రేక్షకుల్ని ఆకట్టుకో లేక పోతే దేశభక్తినే అవమానించినట్టు అవుతుంది. పూర్వం సంగతి పక్కన పెడదాం, కనీసం 1980 నుంచీ నేటి వరకూ ఇంత నేలబారు చీప్ సినిమా ఏ భాషలోనూ రాలేదు. అయితే ఒక విషయంలో దర్శకుణ్ణి మెచ్చుకోవాలి- 1980 ల సినిమాల్లో దేశభక్తి మత ఫీలింగుతో లేదు. దీన్ని కాపాడినందుకు అభినందించాలి.

        ఈ సినిమాకి లేడీస్ కూడా వస్తారనేమో, ఈ బీభత్స కాండలో స్త్రీలు జరుపుకునే కర్వా చౌత్ పండగ పాట హీరోయిన్ దివ్య మీద పెట్టారు. ఇంకో పెళ్ళి పాట నోరా ఫతేహీ మీద పెట్టారు. విచిత్రమేమిటంటే ఈ రెండు పాటలూ బావున్నాయి- ముగ్గురు అబ్రహాంల అబ్బా అనే దెబ్బని మనం తట్టుకోవడానికి!

  సికిందర్