రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, July 16, 2021

1050 : రివ్యూ

 

కోల్డ్ కేస్ ( మలయాళం)
దర్శకత్వం : తనూ బాలన్
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, అదితీ బాలన్, ఆత్మీయ రాజన్, సుచిత్రా పిళ్ళై, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి తదితరులు
రచన : శ్రీనాథ్ వి నాథ్, సంగీతం : ప్రకాష్ అలెక్స్, ఛాయాగ్రహణంగిరీష్ గంగాధరన్, జోమన్ జాన్  
బ్యానర్ : ఆంటో జోసెఫ్ ఫిలిమ్ కంపెనీ
నిర్మాత : ఆంటో జోసెఫ్, జోమన్ జాన్, షమీర్ అహ్మద్  
విడుదల : జూన్ 30, 2021, అమెజాన్
***

          తాజాగా ఒక క్రాస్ జానర్ మలయాళం థ్రిల్ కి గురిచేయాలనే సంకల్పంతో చిన్న తెర మీద ప్రత్యక్షమైంది. పెద్ద తెర మీద తేలిపోయే సినిమాలు చిన్న తెర మీద అద్భుతంగా అన్పించేస్తాయి. సైజు పుణ్యం. దాంతో కనికట్టు. ఇంకా మొబైల్లో సూక్ష్మ తెర మీద లాగిపెట్టి కనికట్టు చేస్తాయి. ఎక్కువగా తీసే సజాతి జానర్ల కలబోతకి భిన్నంగా విజాతి జానర్లని కలిపి తీయడం ఒక సాహసమే. తేడా వస్తే తెప్పరిల్లడం కష్టమే. కొత్త దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తనూ బాలన్, ఛాయాగ్రహణం నిర్వహించకుండా తొలిసారిగా దర్శకత్వం చేపట్టి తీసిన, కోల్డ్ కేస్ (పరిష్కారం కాని కేసు) అనే థ్రిల్లర్, రెండు విజాతి జానర్లతో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టే వుంటుందంటే, వినోదానికి ఇంకేదో అర్ధం వెతికి చెప్తున్నట్టే అనుకోవాలి.  
         
సలు ఎంటర్ టెయిన్మెంట్ కి అర్ధమేమిటో తెలిస్తే, కొత్తర్ధం కనిపెట్ట వచ్చు. అర్ధమే తెలియకేపోతే కొత్తర్ధం కనిపెట్టే ఆలోచనే పుట్టదు. విజాతి జానర్ల కలబోతలో తలమునకలై ఏదో చేయబోతే ఇంకేదో అర్ధం ప్రాణం పోసుకోవడ మవుతుంది. ప్రాణం పోసుకున్నాక ఎవరి ప్రాణం తీయవచ్చు? ఇదే తెలుసుకోవాల్సిన అసలు విషయం.
కథ
         
ఒక చెరువులో చేపలు పడుతున్న మత్శ్యకారుడి వలకి బరువుగా వున్న క్యారీబ్యాగేదో చిక్కుతుంది. దాన్ని విప్పి చూసి ఠారెత్తి పోతాడు. పోలీసులు వచ్చి బ్యాగులో పెట్టి వున్న పుర్రెని చూస్తారు. ఇదెవరి పుర్రె? ఎవరు వేశారు చెరువులో? విచారణ ప్రారంభిస్తాడు ఏసీపీ సత్యజిత్ (పృథ్వీరాజ్ సుకుమారన్).
        మేధా పద్మజా ( అదితీ బాలన్) అని సింగిల్ మదర్ ఒకామె కూతురు చిన్నూతో  వుంటుంది. విడాకుల కేసు కోర్టులో వుంది. ఒక ఛానెల్లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా పని చేస్తూంటుంది. అతీంద్రియ శక్తుల మీద ప్రోగ్రాములు చేయడం ఆమె విధి. ఒక ఇంట్లో ఆమె కూతురితో అద్దెకి దిగుతుంది. ఇంట్లో వింత సంఘటనలు జరుగుతూంటాయి.
         
పుర్రెతో సత్యజిత్ విచారణ సవాలుగా మారుతుంది. మేధా ఇంట్లో ఆత్మ సమస్యగా తయారవుతుంది. సత్యజిత్ చేతిలో పుర్రె ఎవరిది, మేధాని పీడిస్తున్న ఆత్మ ఎవరిది? రెండూ ఒకరివేనా? అదెవరు? ఎవరు చంపి వుంటారు? ఎందుకు చంపివుంటారు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ?
         
పోలీస్ ప్రొసీజురల్, హార్రర్ - రెండు విజాతి జానర్లని కలిపి చేసిన హైబ్రిడ్ జానర్ కథ. రెండూ విడివిడి ట్రాకులు. పోలీసుకీ రిపోర్టర్ కీ పరస్పర సంబంధం లేని విడివిడి కథలు. పుర్రె ఎవరిదో గుర్తించడానికి పోలీసు విచారణ, ఆత్మ ఎవరిదో తెలుసుకోవడానికి రిపోర్టర్ ప్రయత్నం రెండు విడివిడి ట్రాకులూ, కథ మధ్య కొచ్చేసరికి విడివిడిగానే కొలిక్కి వస్తాయి. ఇక్కడ చనిపోయిందెవరో ఇద్దరికీ తెలిశాక కూడా రెండు కథలూ కలవవు. మరెక్కడా కలవ్వు. దీంతో హార్రర్ కథ అర్ధం కోల్పోయి, పోలీసు కథగానే పేలవంగా ముగుస్తుంది.
         
కలపడం వేరు, కలిపి సమన్వయం చేయడం వేరు. సమన్వయం ఎలా చేయాలో జానర్ రీసెర్చి చేసినట్టు లేదు. మనమే రీసెర్చి లాంటిది చేస్తే, హార్రర్ కలిపిన ఫిలిం నోయర్/నియో నోయర్ జానర్ పోలీస్ ప్రొసీజురల్స్ కొన్ని కనిపిస్తున్నాయి. కథకి ఏకత్వం సాధిస్తూ, రెండు విజాతి జానర్లూ పాలూ నీళ్ళల్లా కలిసిపోయేట్టుగా, ఎలా సమన్వయం చేశారో తెలుస్తోంది. ఫ్రెంచి 1955
         
ది బీస్ట్ మస్ట్ డై (1974), ఫాసినేషన్ (1979), వుల్ఫెన్ (1981), ఏంజెల్ హార్ట్ ( 1987),  లెపర్డ్ మాన్ (1943), లే డయబోలిక్ ( ఫ్రెంచి, 1952), మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ప్రస్తుత కథ సెటప్ కి దగ్గరగా వున్నది, ది వికర్ మాన్ (1973) ఇందులో అదృశ్యమైన అమ్మాయి అన్వేషణలో వున్న ఇన్స్ పెక్టర్, క్రమేణా ఒక దీవికి చేరుకునే సరికి, అక్కడ  మాయలతో, మంత్రాలతో, నరబలులతో ఫోక్ హార్రర్ ఎదురవుతుందిఇలా పోలీస్ ప్రొసీజురల్ గా వున్న కథ కాస్తా, ఫోక్ హార్రర్ లోకి సునాయాసంగా ఫ్లో అయిపోతుంది అతికించినట్టు కనబడకుండా.
         
ప్రస్తుత కథలో కూడా పోలీసు కథ, హార్రర్ కథ ఒకటై లీనమైతేనే పోలీస్ -హార్రర్ హైబ్రిడ్ సార్ధక మవుతుంది. దేనిదారి దానిదే అయినప్పుడు క్రికెట్ మ్యాచే అవుతుంది. ఏది దేన్ని ఓడిస్తుందా అని ఆత్మహత్య చేసుకుంటున్నట్టే వుంటుంది. ఇక్కడ పోలీసు కథ హార్రర్ కథని హత్య చేసింది. ఇందుకోసం - క్రికెట్ కోసం - సినిమా చూడాలా? ఐడియా రీసెర్చి చేయకపోతే, ఐడియాలో కథలెలా ఇమిడాయో స్ట్రక్చర్ పరంగా క్రియేటివ్ యాస్పెక్ట్ చూసుకోక పోతే, కబడ్డీలు కూడా చూడాల్సి వస్తుంది. దొమ్మీలు కూడా చూస్తాం.
నటనలు- సాంకేతికాలు  
         
నటనల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏసీపీ సత్యజిత్ పాత్ర నటించిన సుకుమారన్ ది నటనేనా అన్న ప్రశ్న వెంటాడుతుంది. సీను కా సీను డైలాగులు చెప్పేసి తప్పుకోవడమే. మోడలింగ్ చేస్తున్నాడా అన్నట్టు వుంటాడు. సీన్లలోని కంటెంట్ కి మోడలింగ్ చేయడం. ఎవరైనా స్టార్ మోడలింగ్ చేస్తే వస్తువు అమ్ముడు పోవడానికి చేస్తాడు. సుకుమారన్ మోడలింగ్ కి ఇది కూడా కుదర్లేదు. సీనూ అర సీను కూడా అమ్ముడు పోయే పాపాన పోదు. ఇన్వెస్టిగేషన్ మాత్రం హైరేంజిలో వుంటుంది. పుర్రె ఎవరిదో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ, పుర్రెలో దంతం ఎవరిదో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఓడొంటాలజీ వగైరా.
         
ఇన్వెస్టిగేషన్స్ లోంచి సస్పెన్సూ పుట్టదు, పరుగులు తీయించే అర్జెన్సీ ఉద్భవించదు. ఫోరెన్సిక్స్ పద్ధతుల్ని విజ్ఞానాన్ని బోధిస్తూ తీరిగ్గా డెమో ఇస్తున్నట్టే కథ వుంటుంది. కథలో భాగం చేసి పాత్రకి పని పెట్టే క్రియాత్మక సుగుణంతో వుండదు. ఫలితంగా ఎమోషన్స్ వుండవు, ఉత్థాన పతనాల క్యారక్టర్ ఆర్క్ వుండదు, టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫూ వుండదు.
         
ఇలా ఇన్వెస్టిగేషన్ హీరో పాత్రకి పనీ పెట్టక పోగా, ఎదురు పాత్ర లేకపోవడంతో ఇంకో అవస్థ వచ్చి పడింది. ఒక అనుమానితుడు, ఒక ప్రత్యర్ధి అంటూ లేకపోవడంతో, క్లయిమాక్స్ వరకూ హీరో లింగు లిటుకు మంటూ ఏకాకిగా దిక్కుతోచక తిరిగే పరిస్థితి వచ్చి పడింది.  ఇలా ఎందుకు జరిగిందంటే, దర్శకుడనే వాడు సస్పెన్స్ అనుకుంటూ ఎండ్ సస్పెన్స్ కథ సింగారించాడు కాబట్టి. సస్పెన్సు అనగా విషయమును ఎండ్ వరకూ సస్పెన్సుతో సురక్షితముగా వుంచుట - అనే సినిమాల కొంప ముంచే దుష్ట సాంప్రదాయాన్ని ఇష్టంగా పోషించే అద్భుత  దర్శకుల్లో ఒకడై పోయాడు కాబట్టి. దుష్టుడు కన్పించని ఎండ్ సస్పెన్స్ కథల్లో దర్శకుడే ప్రత్యక్ష నిరుపమాన దుష్టుడు - ప్రేక్షకులకీ, సినిమాకీ.
         
ఇక హీరోయిన్ అదితీ బాలన్ మేధా పద్మజా పాత్ర ఇంకా అద్భుతం. 2017 లో అరువి  (ప్రవాహం) అనే తమిళంలో హీరోయిన్ గా పరిచయమై, ఏకంగా ఆరు ఉత్తమ నటి అవార్డు లందుకున్న తను - ఎందుకీ సినిమా చేస్తున్నానన్నట్టు వుంటుంది. తాడూ బొంగరం లేని పాత్ర ఎందుకు నటిస్తున్నానూ అన్నట్టు ముఖ భావాలుంటాయి. పసుపు తాడు ఎలాగూ విడాకులతో కోర్టులో వుంది, ఆటవిడుపుకి బొంగరమైనా లేకపోతే ఎలా? బొంగరం గరిమానాభికి పెట్టింది పేరు. తన పాత్రకుండాల్సింది గరిమనాభియే.
         
తను అతీంద్రియ శక్తుల ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. పేరుకే బిల్డప్. కనీసం మేధా పద్మజ అని పేరున్నందుకైనా మేధతో వుండదు. ఎక్కడ అలౌకిక సంఘటన జరిగినా ఛానెల్లో ప్రోగ్రాం చేసే తను, తన ఇంట్లోనే ఆత్మ సందడి చేస్తూంటే ప్రోగ్రాం చేయకుండా హడలిపోతూంటుంది. ఆత్మ కూతుర్ని కూడా ఇబ్బంది పెడుతూంటే, కూతురికి ఆత్మ పూనిందా అన్నట్టుంటే, పని మనిషికి కూడా అనుభవాలవుతూంటే, దీన్ని న్యూస్ ఐటెం చేయకుండా, ఏమీ లేదని కొట్టి పారేస్తూంటుంది
         
పరిస్థితి తీవ్రమవుతూంటే ఏం చేయాలో ఆత్మల ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా తనకి తెలియనట్టు కొలీగ్ ని అడుగుతుంది! అతను జరా జూక్కై ( సుచిత్రా పిళ్ళై) అనే పారా సైకాలజిస్టు దగ్గరికి తీసి కెళ్తాడు! ఇంత అమాయకంగా వుంటుంది ఈమె పాత్ర. తను పని చేస్తున్న ఫీల్డులో పారా సైకాలజిస్టులతో, భూత వైద్యులతో పరిచయాలు లేకుండా ఎలా వుంటుంది.
           
మరొకటేమిటంటే, వైపు పోలీసులకి పుర్రె దొరికి దాని ఇన్వెస్టిగేషన్ మీడియాలో సంచలనంగా వుంటూంటే, ఇది కూడా తెలియనట్టే వుంటుంది. వెళ్ళి ఏసీపీని కలిసి ఆత్మ గురించి చెప్పాలనుకోదు. సినిమాలు బోరు కొట్టడానికి ప్రధాన కారణం పాత్ర చిత్రణలు సరిగా లేకపోవడం. పాత్రే కథ కాబట్టి, పాత్ర నడుస్తున్న కథ కాబట్టి. పాత్రచిత్రణ గరిమనాబి నిస్తుంది కాబట్టి, ఆట ఆగిందా సీటు గోవిందా కాబట్టి.
       
ఇక చనిపోయిన అమ్మాయి ఈవా మరియాగా ఆత్మీయ రాజన్ కన్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈమెకి కూడా ఆత్మీయ కథ వుండదు. చాలా మలుపులతో భావోద్వేగాల్లేని, సానుభూతి లేని, మాత్రం కదిలించని పొడిపొడి కథ వుంటుంది. దీంతో కూడా ప్రేక్షకులకి ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు. ఇక ఎండ్ సస్పెన్స్ విప్పినప్పుడు ప్రవేశించే లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ప్రతినాయకి పాత్ర - అడ్వొకేట్ హరిత - ఎక్సైట్ మెంట్, థ్రిల్ పుట్టించని ఇంకో వ్యర్ధ సృష్టి.
           
మొత్తం సినిమాలో దృష్టిని మరల్చే పాత్ర పారా సైకాలజిస్టు జరా జుక్కై పాత్ర. బ్లాక్ స్పెక్ట్స్ ధరించి పాత్రకి గాఢమైన  మిస్టీరియస్ ఫీల్ ని కల్పిస్తూ, సుచిత్రా పిళ్ళై ఇచ్చిన స్టన్నింగ్ పెఫార్మెన్స్ చూస్తే - కథకి ఈమే విలన్ కావాలని వెంటనే పట్టేస్తాం. అప్పుడు కనీసం క్లయిమాక్సయినా బతికి బెనారస్ చీర కట్టేది.
         
కానీ దర్శకుడు, అతడి రచయిత మూలాలుండని సొంత క్రియేటివ్ వ్యాపకంతో పాత్రల్ని, వాటి కథల్నీ సరిగా ప్లానింగ్ చేయకపోవడంతో పరిస్థితేర్పడింది. స్ట్రక్చర్ తెలిసి వుండి స్ట్రక్చర్ చెప్పే సూత్రాల్ని పట్టించుకుని వుంటే, కోల్డ్ కేస్ కోల్డ్ స్టోరేజీ కెళ్ళేది కాదు.
         
సాంకేతికంగా ఉన్నతమేకానీ కేవలం సాంకేతిక ఔన్నత్యాలు సినిమాని నిలబెట్టలేవు. అద్భుత సాంకేతిక విలువలుండొచ్చు. ఐతే ఏంటి? - అన్న ప్రశ్నతో సాంకేతికాలు సున్నాలై పోతాయి. దీనికి జవాబు స్క్రిప్టే చెప్పాల్సి వుంటుంది.
చివరికేమిటి  
        హైబ్రిడ్
జానర్ సమన్వయ లోపం, ఎండ్ సస్పెన్స్ కథ, చేసిన కృషిని కృశింప జేశాయి. పోలీస్ ప్రొసీజురల్ని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ గా నాలెడ్జిని అందిస్తూనే, ఇన్ఫో టైన్మెంట్ గా చేయకుండా, అదే డాక్యుమెంటరీగా చాలా మంది చేస్తున్న పొరపాటు మళ్ళీ చేసేశారు. సినిమా అంటే ఎంటర్ టైన్మెంటే కాదు, ఇన్ఫో టైన్మెంట్ కూడా ననే అర్ధంతో ఇవాళ్టి సినిమాలు ముందడు గేస్తున్నాయి.
         
ఆత్మ గురించి సస్పెన్స్ లో, హార్రర్ కి సింక్ లో వెంట్రుకలు, ఐస్, ఫ్రిడ్జి, బావి మొదలైనవి చూపిస్తూనే వాటర్ థీమ్ కల్పించారు. బెడ్రూం లోకి వాటర్ వచ్చేయడం లాంటిది. కానీ ఇవన్నీ హీరోయిన్ భయపడ్డానికే తప్ప, ఇవి చెబుతున్న అర్ధాన్ని కనుక్కునే  లీడ్స్ గా కథ కుపయోగ పడాలని మర్చిపోయారు. పారా సైకాలజిస్టు కూడా ఆత్మ ఎవరో కనుక్కుంటుంది గానీ, వాటర్ థీమ్ కి అర్ధం తెలుసుకోవాలన్న ఆలోచన చేయదు. ఇంతా చేస్తే వాటర్ థీమ్ తో ఆత్మకి సంబంధం లేదనీ, కేవలం ఫ్రిజ్ తోనే సంబంధమనీ క్లయిమాక్స్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది
              2003
లో అనురాగ్ బసు దర్శకత్వంలో, జాన్ అబ్రహాం, తారా శర్మ, మహిమా చౌధురీ లతో మహేష్ భట్ నిర్మించిన 'సాయా (నీడ) సాంతం వాటర్ థీమ్ బ్యాక్ డ్రాప్ తో వుంటుంది. బయటి నుంచి, పైకప్పులోంచి ఇంట్లోకి పారుతున్న నీటికి అర్ధమేమిటో  తెలుసుకునే ప్రయాణంలో అద్భుత రహస్యం బయట పడుతుంది జాన్ అబ్రహాంకిచనిపోయిన భార్య ఏదో రహస్యం చెప్పాలని చేస్తున్న ప్రయత్నమే ఇది. వరదల్లో జాడ లేకుండా కొట్టుకు పోయిన భార్య ఆదివాసీలకి దొరికి చనిపోతుంది. అబ్రహాం అక్కడికి వెళ్ళేసరికి చనిపోతూ భార్య ప్రసవించిన బిడ్డ ఆదివాసీల దగ్గర వుంటుంది. ఇదీ- ఫలప్రాప్తి అంటే ఇలా వుంటుంది. బ్యాక్ డ్రాప్ లో చూపిస్తూ వచ్చిన రహస్యమయ థీమ్ కి కదిలించే ఫలప్రాప్తి!
         
ప్రస్తుత 'కోల్డ్ కేస్' లో రెండేళ్ల క్రితం అదృశ్యమైన ఈవా మరియా కేసు తేలక అపరిష్కృత (కోల్డ్ కేసు) గా  వుండిపోయింది. పుర్రె దొరకడంతో కేసు రీఓపెనైంది. ఇంటర్వెల్ ముందు ఆత్మ ఈవా మరియా అనే అమ్మాయిదని ఇటు హీరోయిన్ కి, అటు హీరోకీ ఒకే సారి తెలుస్తుంది. ఇప్పుడైనా రెండు ట్రాకులు కలవ్వు. ఫస్టాఫ్ అంతా చనిపోయిందెవరూ అన్న పాయింటుతో సుదీర్ఘ కథ నడిపారు. ఇంటర్వెల్లో ఈవా మరియా అని తెలిశాక ఏం చేయాలి? ఆమెని చంపిన వ్యక్తి ఎవరో తెలుసుకునే క్లూ కూడా అప్పుడే తెలివిగా  ఏర్పాటు చేసుకుని, సెకండాఫ్ వ్యక్తి కోసం వేటగా యాక్షన్లోకి కథని తేవాలి.
         
కానీ ఫస్టాఫ్ అంతా చనిపోయిందెవరో తెలుసుకునే కథ నడిపి, ఈవా మరియా అని తెలిశాక, మళ్ళీ సెకండాఫ్ ఈవా మరియా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే కథే క్లయిమాక్స్ వరకూ నడిపి దుంప తెంచారు. సినిమా ప్రారంభం మొదలు క్లయిమాక్స్ వరకూ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలని ఒకటే ఆరాట పడిపోతూ, బోలెడు విషయాలు తెలుసుకునే కథగా తయారు చేశారు. తెలుసుకుని ఏం చేస్తామో తెలుసుకోలేక పోయారు. ఏదో తిప్పలుపడి రాసేస్తే టెక్నీషియన్ల సపోర్టుతో అదే స్క్రీన్ ప్లే గొప్ప అయిపోతుందను కున్నట్టుంది.
         
దీంతో ఫస్టాఫ్ ఇన్వెస్టిగేషనే, సెకండాఫూ ఇన్వెస్టిగేషనే జరగడంతో సాంతం డైలాగులే కథలో వున్నాయి. ఒక్క యాక్షన్ సీనూ లేదు. క్లయిమాక్స్ లోకూడా యాక్షనే లేదు. కోల్డ్ కేసు చల్లారిన బిర్యానీ రైసు లాగే తయారైంది. విజువల్ మీడియాకి కూడా అర్ధాన్ని మార్చి పారేశారు. డైలాగులే కథనుకుంటే, డైలాగుల్ని రికార్డు చేసి రేడియోలో ప్రసారం చేస్తే సంక్షిప్త శబ్ద చిత్రం లాగానో, నాటకం లాగానో అర్ధమైపోతుంది. ఇంత ఖర్చుపెట్టి సినిమాగా తీయాల్సిన అవసరమే లేదు
         
ఇక ఎండ్ సస్పెన్స్ విషయానికొస్తే, ముగింపు వరకూ విలనెవరో చూపించకుండా ఓపికని పరీక్షించినప్పుడు, సస్పెన్స్ విప్పితే బిగ్ సర్ప్రైజ్ వుండాలి. అది లేదు. ఫ్లాష్ బ్యాకులోనే ఒక అడ్వొకేట్ ని చూపించి, ఈమె మరియాని చంపే కారణాన్ని పేలవంగా చూపించడంతో ఎండ్ సస్పెన్స్ గొప్ప దిబ్బ అయింది. కనీసం పారా సైకాలజిస్టుగా కథలో చూపిస్తూ వుండిన టెర్రిఫిక్ సుచిత్రా పిళ్ళైతో సస్పెన్స్ విప్పినా సర్ప్రైజ్ ఎండింగ్ గా వుండేది. అంతా సేపూ మన ఓపికని పరీక్షించినందుకు పరిహారంగా వుండేది.
           
మలయాళం సినిమాలు అద్భుతాలని అనుకోనవసరం లేదు. ఇలాటి దిగువ శ్రేణి పదార్ధాలు కూడా వుంటాయి. రివ్యూ చాలా రోజులు కోల్డ్ స్టోరేజీలో వుండి పోయింది,  ఇప్పుడు బయటికి తీసి వేడి చేశాం.

సికిందర్