రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 1, 2020

949 : సందేహాలు -సమాధానాలు


Q:  పిరియాడిక్ కథలు (1970, 80 ప్రాంతాల్లో జరిగే రంగస్థలం’ లాంటివి ) రాయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? అప్పటి పరిస్థితులు, సమస్యలు సహజంగానే ఇప్పుడు ఉండవు కాబట్టి సమకాలీనత లోపిస్తుంది కదా, దాన్నుంచి బయటపడడం ఎలా? సమకాలీనత కచ్చితంగా ఉండాలా? లేకపోయినా డ్రామాతో నిలబెట్టొచ్చారంగస్థలం’ లాగే?  మహానటి’, జెర్సీ’ సినిమాల్లో ప్రాసంగికతను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలను వివరించగలరు. అలాగే ఒక పాత్ర జీవితం నుంచి మరొక పాత్ర ఇన్ స్పైర్ అయ్యే తీన్ మార్’ లాంటి స్క్రీన్ ప్లే లు చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. రిఫరన్స్ సినిమాలు కూడా ప్రస్తావించగలరు?
అశోక్, ఏడీ 

A:  ఒక కవి అన్నట్టు ఇప్పుడు కాలం కరోనా పూర్వంగా, కరోనా శకంగా రెండు ముక్కలైంది. ఈ లెక్కన ఇప్పుడు కరోనా శకంలో వున్నామని అనుకోవాలి. కూలీనుంచీ కుబేరుడి వరకూ, సూది నుంచీ విమానం వరకూ అందరూ, అన్ని రంగాలూ ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైన గడ్డు కాలం. ఈ విధ్వంసం లోంచి పునర్నిర్మాణ కాలమిది. ఈ కాలంలో కళ్ళు మూసుకుని ఇంకా కరోనా పూర్వపు అవే కథలు అలాగే తీస్తూ కూర్చోవడం సాధ్యమవుతుందా? ఒకతను ఒక బ్యాంకు అవినీతి కథ పట్టుకొచ్చాడు. ఇప్పుడు బ్యాంకులకి ఎగనామం పెట్టి విదేశాలకి ఉడాయించే కథలకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా? ఎవడి జేబుల్లోనూ డబ్బే లేదు, ప్రభుత్వాల దగ్గరా లేదు, ఇంకా అవే పాత అవినీతి కథలేమిటి? ప్రేక్షకుల జేబుల్లో డబ్బులు పెట్టే కథలు కావాలి. డబ్బుల కోసం పాట్లు కావాలి. 

        పీరియాడిక్ సినిమాలూ ఇంతే. ఇప్పుడు బ్రతుకులెలా అని ఆలోచిస్తూంటే ఎప్పటివో పీరియాడిక్ కథల సినిమాలకి మార్కెట్ వుంటుందా అనేది వేసుకోవాల్సిన ప్రశ్న. 2008 ఆర్ధిక మాంద్యంలో హాలీవుడ్ కుప్పతెప్పలుగా రోమాంటిక్ కామెడీలు తీస్తూ ఆర్ధిక బాధల్ని మరిపించే ప్రయత్నం చేసింది. మార్కెట్ యాస్పెక్ట్ హాలీవుడ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు కరోనా కాలపు కొత్త ఆర్ధిక, జీవన పరిస్థితులు బాక్సాఫీసుని నిర్ణయిస్తాయి. ఏం సినిమాలు తీయాలో ఎవరికీ తెలియడం లేదు. ఒకటి మాత్రం నిశ్చింతగా తీసుకోవచ్చు : ఎంటర్ టైనర్స్. పలాయన వాద కాలక్షేప ఎంటర్ టైనర్లు. 1896 లో నిమాల్ని కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ కీ, ఆ తర్వాత వచ్చిన నిర్మాతలకీ ఏం తీయాలో తెలియదు. ఎంటర్ టైనర్లే తీసుకుంటూ పోయారు. కాలప్రవాహంలో ఎందరెందరో నిర్మాతలు కలుస్తూ, కాలాన్నిబట్టి సినిమాల్ని శాఖోప శాఖల జానర్లుగా విస్తరింప జేస్తూ, 124 ఏళ్లలో ఇప్పుడు కరోనా నాటికి - ఒక మహావృక్షాన్ని నిలబెట్టారు. అది కుప్ప కూలింది అందరి జీవితాలతో బాటు. ఇప్పుడు నిలబెట్టాలంటే ఏ మందులు వేయాలో, ఏ కాయలు కాయించాలో ఎవరికీ తెలియడం లేదు. జీవితాలు అర్ధమైతే తప్ప సినిమా ఆర్ధిక శాస్త్రం పట్టుబడేలా లేదు. మళ్ళీ 1896 నుంచీ ప్రారంభమవడం తప్పదేమో. సినిమాలిప్పుడు తిరిగి 1896 కే చేరుకున్నట్టు. కాబట్టి బ్యాక్ టు ది ఎంటర్ టైనర్స్. 

        ఇక మీరడిగిన చివరి రెండు ప్రశ్నలకి వివరణ ఇక్కడ సాధ్యం కాదు. మీరడిగిన ప్రశ్నలు నల్గురికి ఉపయోగ పడేవే. వీటికి ప్రత్యేక ఆర్టికల్స్ అవసరం. ప్రయత్నం చేద్దాం.

Q: మే 20 న Q & A లో ఒక ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం పెద్ద హోం వర్క్ ఇచ్చింది. పది రకాల స్క్రీన్ ప్లే లు అన్నారు కద. అవేంటి వెతికి, రకం సినిమాలు వెతకడం చాలా పని. తెలుగు సినిమాలు ఏడాదికి వంద వస్తాయి కద. అన్నీ ఒకే తరహా నెరేషన్. ఒకటి రెండు కొత్త రకం ఉంటాయి. అవే గొప్ప సినిమాలు మనకు. ఇంక సర్క్యులర్ నేరేషన్ తో సినిమాలు ఎపుడొస్తాయో. చిన్న సందేహం. కథ చెప్పే విభిన్న పద్ధతుల్లో హైపర్ లింక్  ఒకటి. ఇది మల్టిపుల్ నెరేషన్. ఉదాహరణగా సత్యజిత్ రేకాంచన్ జంగ’,  తెలుగు వేదం’,  తమిళ్ ‘సూపర్ డీలక్స్’  ఇచ్చారు. ఐతే తరహాలో రెండు, మూడు వేరు వేరు కథలతో మొదలుపెట్టి ఒకచోట ముడివేస్తారు. ఇవి వేరువేరు కథలకు ఒకే ముగింపు తప్ప, కథలు చెప్పే పద్ధతి లీనియర్ గానే ఉంటుంది కద? ఫెబులా, రోషోమన్ లలాగా హైపర్ లింక్ స్పెషల్ టెక్నిక్ ఎలా ఔతుంది? ఆదివారం సందేహం కింద తీర్చగలరు.
చందు తులసి, కథా రచయిత

A: హైపర్ లింక్ అంటే కేవలం ముగింపులోనే కథలన్నిటికీ లింకు పెట్టి ముగించడం కాదు. కథనంలోనూ వాటికి లింకులుంటాయి. ఒక కథలో ఒకరికి జరిగే ఓ సంఘటన ప్రభావం, ఇంకో కథలో ఇంకొకరి మీద వుంటుంది. ఇలా మనుషులంగా మనం ఎక్కడెక్కడో ఎవరెవరితోనో కనెక్ట్ అయి వుంటామన్న ఫీల్ ని కల్గిస్తుంది. అంతేగానీ విడివిడి కథలకి మాత్రమే చివర్లో ఒక ముగింపుతో లింకుపెట్టడం కాదు. కింద ఇచ్చిన రెండు లింకులు క్లిక్ చేసి, 10 రకాల ప్లేలు తెలుసుకోవచ్చు. 

Q: ‘అయ్యప్పనుం కోషియం’ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాం. మలయాళం సినిమాలు ఒక క్రేజ్ గా ఎందుకుంటున్నాయి? వాటిని రీమేక్స్ చేయడం కూడా జరుగుతోంది.
ఆది, ఏడీ 

A: రివ్యూ రెండు రోజుల్లో వస్తుంది. మలయాళం సినిమాలు అక్కడి మట్టి కథలు చెప్తాయి. అందుకని కమర్షియల్ మూస ఫార్ములాలకి భిన్నంగా అన్పిస్తాయి. మట్టి కథలకి మొహం వాచి వున్న ప్రేక్షకులకి ఇవే గిట్టుబాటు అవుతాయి. అక్కడి మట్టి కథల్ని ఇక్కడి మట్టి కథలుగా రీమేక్ చేస్తే చేయవచ్చు. తేడా ప్రేక్షకులకే తెలుస్తుంది. ఎక్కడిదో మట్టి ఎందుకు, ఇక్కడ మట్టి లేదా? ఇక్కడి మట్టిలో బాక్సాఫీసు కన్పించడం లేదా? లేక మట్టిని పిసికి బొమ్మెలా తయారు చేయాలో తెలీడం లేదా? ముందు పిసకడం నేర్చుకోవాలి. చేతులకి మట్టి అంటకుండా మీసం తిప్పితే లాభం లేదు.

సికిందర్
లింక్స్ : పది నమూనాలు-1
పది నమూనాలు-2