రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, March 21, 2018

623 : క్రియేటివిటీ సంగతులు!


 సినిమా కథంటే క్రియేటివిటీ మాత్రమేనని నమ్మకుండా, స్ట్రక్చర్ లోపల కథనానికి – కథ చెప్పే తీరుకీ చేసుకునే క్రియేటివిటీ అని అర్ధంజేసుకోగలిగాక, కథలతో ఆ క్రియేటివిటీని ఎన్ని రకాలుగా ప్రదర్శించవచ్చో తెలుసుకునే వ్యాసాల్లో భాగంగా,  ఈ చివరి వ్యాసంలో రోషోమన్, సర్క్యులర్, ఒనీరిక్ ప్లేల గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమాలు ఒకప్పుడు బాషా క్రియేటివిటీతో ఫ్యాక్షన్ సినిమాలుగా వచ్చేవి. తర్వాత టెంప్లెట్ క్రియేటివిటీ వచ్చింది. ఇవి ఫర్వాలేదు, ఎంతో కొంత స్ట్రక్చర్ లో వుంటాయి. కాకపోతే ఒకే పోతలో పోసిన కథల్లా విసుగు పుట్టిస్తాయి. ఇవలా వుండగా, మరికొన్ని క్రియేటివిటీలు తెలుగులో చేసుకుపోతున్నారు బేసిక్స్ పట్టని చాలామంది నవతరం కథకులు. అవి మిడిల్ మటాష్, ఎండ్ సస్పెన్స్,  సెకండాఫ్ సిండ్రోం క్రియేటివిటీలు.  వీటికి స్ట్రక్చర్ అసలే వుండదు. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలు ఎలా ఫ్లాపవుతాయో తెలుసుకోవడానికి ఈ సినిమాలు చూస్తే చాలు.

          డుం పట్టు టెంప్లెట్ క్రియేటివిటీలు తెలుగులో ప్రేమ సినిమాలని కూడా వదలడం లేదు. ప్రేమ సినిమాలన్నీ టెంప్లెట్ లే. అయితే అపార్ధాలతో విడిపోవడం, లేకపోతే ప్రేమ చెప్పలేకపోవడం. గత18 ఏళ్లుగా ఒకే పోతలో పోసిన ఈ రెండే కథలు. ఇది క్రియేటివిటీ కూడా ఎలా అవుతుంది? క్రియేటివిటీ ఎప్పటికప్పుడు కొత్తది కనిపెడుతుంది. ప్రేమకి అపార్ధాలతో విడిపోయే, ప్రేమ చెప్పలేకపోయే అంతర్గత సమస్యలే ఇంకా లేవు. బాహ్య పరిస్థితులు పరీక్షపెట్టే సమస్యలెన్నో ఇప్పుడున్నాయి. వీటిని కనిపెట్టి చెప్పకుండా ఇంకా మూసలోనే వుంటే, ఆ క్రియేటివిటీ లేజీ రైటింగే అవుతుంది. అంటే, క్రియేటివిటీ అంటే స్ట్రక్చర్ లోపల వుండేది మాత్రమే కాదు, మూస కథల్లోంచి  బయటికొచ్చేది కూడా. ఈ అందర్ - బాహర్ (ఇన్ అండ్ ఔట్)  ద్విముఖ కార్యాచరణ సరైన స్క్రిప్టు కోసం క్రియేటివిటీ  బాధ్యత అవుతుంది. 

          రోషోమన్ ప్లే తో 2004 లో తెలుగులో డబ్ చేసిన ‘పోతు రాజు’ వచ్చింది. దీనికి  కమల్ హాసన్ రచన, దర్శకత్వం. నటన కూడా. రోషోమన్ ప్లేలు ప్రేక్షకులు మేధస్సుతో చూడాల్సిన సినిమాలు. 1950 లో అకిరా కురసావా తీసిన ‘రోషోమన్’ మూవీ కథనమే రోషోమన్ ప్లేగా, రోషోమన్ ఎఫెక్ట్ గా  స్థిరపడిపోయింది. 

         ఒకే కథని విభిన్న వ్యక్తులు విభిన్న కథనాలుగా చెప్పడం. ఒక తెలుసుకునే పాత్ర, అనేక తెలియజెప్పే పాత్రలు. రోషోమన్ కథలో ఒక మానభంగ -  హత్యా సంఘటనకి కొందరు సాక్షులు ఇచ్చే వాంగ్మూలాలు. వీటిని విశ్లేషించుకుంటూ అసలేం జరిగిం దనేది తెలుసుకునేదే చివరి కథనంగా వుంటుంది. అంటే కథ ఒకటే,  కథనాలు వేర్వేరు. ఇవన్నీ ఫ్లాష్ బ్యాకులతో నడుస్తాయి. యూజువల్ సస్పెక్ట్స్, వింటేజ్ పాయింట్ అనే హాలీవుడ్ మూవీస్ వచ్చాయి. తెలుగులో తీస్తే వీటికి కమర్షియల్ విలువ ఎంతుంటుందో చెప్పలేం.

సర్క్యులర్ ప్లే 
         ఈ ప్లేలో కథలు మొదలైన చోటే ముగుస్తాయి, ముగిసిన చోటే మొదలవుతాయి. ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ లో కాలంలో ప్రయాణించే పాత్రల కథలుగా వుంటాయి. కథనం మధ్యకి వంపులు తిరిగి ఆది, అంతం రెండు చివరలూ కలిపి ముడేసినట్టు వుంటుంది. ఒక తాడు తీసుకుని మధ్యలో ఒక ముడి వేసి, రెండు చివరలూ కలిపి ముడేస్తే ఎలా వుంటుందో,  ఈ ప్లే అలా వలయంగా వుంటుంది. కథ బిగినింగ్ –మిడిల్ – ఎండ్ అనే స్ట్రక్చర్ లోనే వుంటుంది. బ్యాక్ టు ది ఫ్యూచర్, ప్రైమార్, లూపర్ వంటి మూవీస్ చూస్తె అర్ధమవుతుంది. ఈ ప్లేని ఇతర జానర్ల కథలకి కూడా వాడవచ్చు. లాస్ట్ హైవే, డెడ్ ఆఫ్ ది నైట్, ట్రయాంగిల్... మొదలైన సినిమాలు చూడవచ్చు.  


ఒనీరిక్ ప్లే  
          ఇది ప్రయోగాత్మక ప్లే. కానీ హాలీవుడ్ లో టామ్ క్రూజ్, పెనెలోప్ క్రజ్, కెమెరాన్ డయాజ్ ల వంటి స్టార్లతో  ‘వెనిల్లా స్కై’ ని కమర్షియల్ సినిమాగానే తీసి విజయం సాధించారు. రోమాంటిక్  థ్రిల్లర్ జానర్ కావడంతో ప్లే కూడా థ్రిల్లింగ్ గా అన్పిస్తుంది. హీరో తన గోల్ కోసం ఒక అందమైన కలలాంటి ప్రరంచంలోకి అడుగుపెడతాడు. దాన్ని సాధించే క్రమంలో అది దుస్వప్నమై వెంటాడుతుంది...స్వప్నావస్థలో వున్నట్టు కథనం వుంటుంది. వుంటూనే  ఆ స్వప్న ప్రపంచం,  నిజ ప్రపంచం కలసిపోయినట్టు తికమక పెడతాయి. ఏది నిజం, ఏది స్వప్నంగా ప్రశ్నార్ధక మైపోతుంది కథనం.  కథని పూర్తిగా దర్శకుడే చూస్తున్నట్టు పర్సనల్ స్టేట్ మెంట్ గా ఈ ప్లే వుంటుంది. బ్లూ వెల్వెట్, ఐస్ వైడ్ షట్,  బ్రెజిల్ కూడా ఒనీరిక్ ప్లేతోనే వుంటాయి.

(ఐపోయింది)
సికిందర్