ఏ స్థాయి కథ
చేస్తున్నప్పుడు ఆ బరిలో వుండకపోతే ఆ కథకి స్థానభ్రంశం తప్పదు. ఇవ్వాళ సినిమా రకరకాల
స్థాయుల్లో వుంటోంది. స్టార్ మూవీస్ నుంచీ
షార్ట్ మూవీస్ దాకా. కాబట్టి ఏ స్థాయి మూవీ కథ చేస్తూంటే ఆ స్థాయి మేకింగ్ లో మాత్రమే కథ చేసుకోవాలని
కమిటవ్వాల్సి వుంటుంది. స్టార్ మూవీస్, స్మాల్ మూవీస్, వరల్డ్ మూవీస్, ఇండీ (ఇండిపెండెంట్)
మూవీస్, షార్ట్ మూవీస్...ఇలా వివిధ స్థాయి మేకింగులు కన్పిస్తాయి. ఇక్కడ స్మాల్ మూవీస్ గురించే
మాట్లాడుకోవాలి. తెలుగులో స్మాల్ మూవీసే అత్యధిక సంఖ్యలో విడుదలవుతూ, దాదాపు అంతే
సంఖ్యలో ఫ్లాపవుతూంటాయి కాబట్టి. దీనికి ప్రధాన కారణం స్టార్ మూవీస్, వరల్డ్
మూవీస్, ఇండీ మూవీస్, షార్ట్ మూవీస్... వంటి ఇతర దృశ్య మాధ్యమాలు స్మాల్ మూవీ మేకర్లని గందరగోళ పర్చడం. దాంతో స్మాల్
మేకర్లు మేకలై పోవడం. ప్రతీ అసోషియేట్ మొదట స్మాల్ మూవీస్ తోనే మొదలవుతారు కాబట్టి,
ఇక్కడేదో చూపించుకుంటేనే స్టార్ మూవీస్ కి ప్రమోటవగలరు. ఐతే స్మాల్ మూవీస్ కి దర్శకత్వం వహిస్తూ మొదలయ్యే
అసోషియేట్స్, తాము పని చేసి వచ్చిన స్టార్
మూవీస్ ని దృష్టిలో పెట్టుకుని స్మాల్ మూవీస్ కథలు చేయబోతే అట్టర్ ఫ్లాపవక తప్పదు. స్మాల్ మూవీ మేకర్స్ ఖచ్చితంగా
స్మాల్ మూవీస్ పరిమితుల్లో ప్రయోజనం చేకూర్చాల్సిందే తప్ప, స్టార్ మూవీస్ పరిధుల్లో,
ఇంకా వీలయితే వరల్డ్ మూవీస్ పరిమితుల్లో ప్రయత్నిస్తే కాదు. ఎందుకు కాదో కూడా
తెలుసుకుందాం.
జాన్ ట్రుబీ కొటేషన్ ఒకటుంది
: మానసిక లోపాలే సినిమా కథకుల విజయాలకి పెద్ద
అడ్డంకి అని. నిజమే, సినిమా కథ చేస్తున్నామనగానే మనసు చంచలమై పోతుంది. ఎటు పోతుందో
తెలీదు. చూసిన ప్రతీ స్టార్, స్మాల్,
వరల్డ్, ఇండిపెండెంట్, షార్ట్ ... వగైరా వగైరా మూవీస్ అన్నీ గజిబిజిగా బుర్రలో
గిర్రున తిరుగుతూంటాయి. ఇక రాయడం మొదలెడితే వాటి వాటి కళలన్నీ గజిబిజిగా ఆ కథల్లో కొచ్చేస్తాయి.
అలా తీసేది కోటి – రెండు కోట్ల అచ్చమైన
తెలుగు కమర్షియల్ మూవీయే అయినా, దానికోసం రాసేది
మాత్రం మానసిక చాంచల్యంతో అర్ధంపర్ధం లేని గజిబిజి అట్టర్ ఫ్లాపయ్యే పదార్ధమే. నీరవ్
మోడీ వెయ్యి కోట్లు వేసుకుపోగా లేనిది మనం కోటి – రెండు కోట్ల సినిమా పోగొడితే
ఏమైంది, ఇంకో అవకాశం రాదా అనుకోవచ్చు. కానీ కోటి రూపాయలైనా పాడు చేసే అసోషియేట్ భవిష్యత్తులో
కోటి రూపాయల దర్శకుడు కావడం కష్టం. అలాటి
కలలు గనే వెసులుబాటు కూడా వుండదు. అసోషియేట్స్ కావచ్చు, మరెవరైనా కావచ్చు, యేడాది కేడాది కనీసం 70 -80 మంది కొత్త
దర్శకులై వస్తున్న వాళ్ళందరూ అట్టర్ ఫ్లాపై
మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతున్న వాళ్ళే. ఇదిగాక,
విడుదల కాని స్మాల్ మూవీస్ కూడా
ఎన్నోవుంటాయి. వీటి దర్శకులైతే ఆ కర్మఫలం నుంచి విముక్తే పొందరు.
స్మాల్
మూవీస్ చేస్తూ ఎందుకు సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా వుండాలంటే, వుంటూ పైన
చెప్పుకున్న వివిధ ఇతర స్థాయుల సినిమాల ప్రక్రియల్ని మనసులోకి అస్సలు రానీయకూడదంటే, అవి కథల కుండాల్సిన
స్ట్రక్చర్ లో వుండవు గనుక. వరల్డ్ మూవీస్, ఇండీ మూవీస్, షార్ట్ మూవీస్...వీటి
కథలు స్ట్రక్చర్ లో వుండవు. అందుకని
కమర్షియల్ సినిమాలు ఆడే ఇండియాలో వరల్డ్
మూవీస్ ఎక్కడా ఆడవు. వాటి ఉత్పత్తి స్థానాలైన యూరప్ దేశాల్లో తప్ప ఎక్కడా ఆడవు. అవి ఆర్ట్
సినిమాల్లాంటివి. ఇక ఇండీ మూవీస్ కూడా కొంచెం తేడాతో వరల్డ్ మూవీస్ లాంటివే.
కాకపోతే ఇవి ఏ కథా సాంప్రదాయాలకీ లొంగని స్వతంత్ర ధోరణుల్లో వుంటాయి. ఆ దర్శకుల సొంత
పైత్యాల్ని ప్రదర్శిస్తూంటాయి. షార్ట్
మూవీస్ సరే, వీటికి హాలీవుడ్ లో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ నేర్పిస్తున్నా, మన దగ్గర పట్టించుకునే
వాళ్ళు లేరు. మరి త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో పావుగంట షార్ట్ మూవీస్ తీయలేని
మేకర్లు, రెండు గంటల తెలుగు కమర్షియల్ సినిమాలు తీసే అవకాశాలు పొంద గల్గుతున్నారు. ఇది వేరే విషయం.
ఇక స్టార్ మూవీస్ కొద్దాం. వెనకటి తరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల స్టార్ మూవీస్ వరకూ వుండినట్టు, ఆ తర్వాతి తరం స్టార్ మూవీస్ కి స్ట్రక్చర్ వుండడం లేదు. కాబట్టి ఇవి టెక్నికల్ గా స్క్రీన్ ప్లేలు కావు. స్క్రీన్ ప్లే అంటే స్ట్రక్చర్, ఇంకేవో సొంత క్రియేటివిటీలు కాదు. కాబట్టి వీటిని స్క్రీన్ ప్లేలు అనేకన్నా టెంప్లెట్స్ అంటే సరిపోతుంది. నేటి స్టార్ మూవీస్ ఒకే మారని టెంప్లెట్స్ నడకతో వుంటాయి. ఇక్కడ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గిక్చర్ అంటే చెల్లదు. యాక్టివ్ – పాసివ్, మిడిల్ మటాష్, సెకండాఫ్ సిండ్రోం, ఎండ్ సస్పెన్స్, జానర్ మర్యాద తప్పడం వంటివి దుష్ట శక్తులు బాబో అని అరిచి గీపెట్టినా నమ్మరు. స్టార్లు చెప్పినట్టు దర్శకులు స్క్రిప్టులు మార్చుకుంటూ పోవాల్సిందే. ఎవరో ఒకరిద్దరు మార్చే ప్రసక్తి లేదని స్క్రిప్టులు ఎత్తుకుని వెళ్లి పోతారు.
కాబట్టి
ఇలా స్టార్ మూవీస్, వరల్డ్ మూవీస్, ఇండీ మూవీస్, షార్ట్ మూవీస్...ఏవైనా వాటి కుండేవి స్క్రీన్ ప్లేలు కావు. స్క్రీన్ ప్లే అనే పేరు పుట్టిందే హాలీవుడ్ లో సినిమాలు తీయడం మొదలెట్టినప్పుడు
కమర్షియల్ సినిమాలకి సంబంధించి. సినిమాలు పుట్టినప్పట్నించీ హాలీవుడ్ కమర్షియల్ సినిమాలే
తీస్తూ, వాటికోసం స్క్రీన్ ప్లేలు తయారు
చేస్తూ, వాటికో గౌరవం, వాటి పట్ల నమ్మకమూ తీసుకొస్తోంది. కమర్షియల్ సినిమాల్ని ఎలా
ఆడించుకోవాలా, స్క్రీన్ మీద ఎలా ప్లే చేసి క్లాస్, మాసే కాక, ఇంకా మిగిలుంటే నానా కచరా మనుషులనీ ఎలా లొంగదీయాలా, ఎలా మెప్పించాలా
అని రకరకాల కమర్షియల్, ఆడియెన్స్ సైకాలజీ సూత్రాల్ని
జొనిపి స్క్రీన్ ప్లే అనే వొకదాన్ని కష్టపడి తయారు చేసుకున్నారు. హాలీవుడ్ ప్రపంచంలో
పూచిక పుల్లని కూడా వదలదు. పూచిక పుల్ల కూడా సినిమాల్ని ఎంజాయ్ చేస్తుందంటే, దాన్నికూడా
కలిపేసుకుని సినిమాలు తీస్తారు. సూత్రాలు పాతబడి పోతే మార్చుకుంటూ పోతారు.
హాలీవుడ్ ని స్టడీ చేస్తూ పోతే టాలీవుడ్ కి
చాలా జ్ఞాన గుళికలు లభిస్తాయి. హాలీవుడ్
చుట్టుపక్కల పుట్టగొడుగుల్లా వెలిసిన స్క్రీన్ ప్లే పాఠశాలలు, వెబ్సైట్ లు
ప్రతినిత్యం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మీద, సూత్రాల మీదా పుంఖాను పుంఖాలుగా కంటెంట్
ని ప్రపంచం మీద వెదజల్లుతున్నాయి. కమర్షియల్ సినిమాలు ఇలా తీయాలిరా బాబూ అని ఘోషిస్తున్నాయి.
కానీ హాలీవుడ్ కావల బయటి ప్రపంచంలో వరల్డ్ మూవీస్, ఇండీ మూవీస్, ఆర్ట్ మూవీస్, షార్ట్ మూవీస్ అంటూ స్ట్రక్చర్
లేకుండా రాసుకునే స్క్రిప్టులకి కూడా
స్క్రీన్ ప్లేలనే కంటే, ఒఠ్ఠి స్క్రిప్టు
లనడమే న్యాయం. కన్ఫ్యూజన్ లేకుండా వుంటుంది.
కాబట్టి స్టార్ మూవీస్ లో కూడా కన్పించేది స్క్రీన్ ప్లే కాదు, టెంప్లెట్ లేదా స్టార్ ప్లేనే. అరుదుగా హిందీలో భజరంగీ భాయిజాన్, దంగల్ లాంటి ఘనవిజయాలు పూర్తి స్ట్రక్చర్ లో వుంటూ స్క్రీన్ ప్లే లన్పించుకుంటాయి.
ఇప్పుడు
స్మాల్ మూవీస్ విషయానికొస్తే, ఇవి కూడా స్టార్ మూవీస్ లాగే కమర్షియల్ సినిమాలే. స్టార్
మూవీస్, స్మాల్ మూవీస్ తప్ప మరేవీ కమర్షియల్ సినిమాలు కావు.
అయితే ఒక్క స్మాల్ మూవీస్ కి మాత్రమే స్ట్రక్చర్ లో కథ చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటై! ఇది బాగా గుర్తుంచుకోవాలి.... ఒక్క స్మాల్ మూవీస్ కి మాత్రమే స్ట్రక్చర్ లో కథ చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటై! ....మరో సారి.... ఒక్క స్మాల్ మూవీస్ కి మాత్రమే స్ట్రక్చర్ లో కథ చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటై!!
ఎందుకంటే, స్టార్ మూవీస్ కథల్లాగా స్మాల్ మూవీస్ కథల్ని నియంత్రించే కారణాలు, శక్తులు వుండవు కాబట్టి. దర్శకుడిదే పూర్తి అదుపు కాబట్టి. అలాటిది అదుపు తప్పి స్మాల్ మూవీస్ దర్శకుడు స్టార్ –వరల్డ్- ఇండీ- షార్ట్ మూవీస్ అంటూ స్ట్రక్చర్ లేని నానాజాతి కథా కథన రీతులతో మనసుని కలుషితం చేసుకుని, స్మాల్ మూవీస్ చేస్తే, ఖచ్చితంగా అవి స్ట్రక్చర్ లేని – దాంతో సక్సెస్ లేని దుష్ట శక్తులవుతున్నాయి.
స్మాల్ మూవీస్ కథలిచ్చే ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని ఎందుకు వదులుకోవాలన్నది ప్రశ్న. స్టార్ – వరల్డ్ – ఇండీ – షార్ట్ వగైరా వగైరా మూవీస్ ఆకర్షణలకి స్మాల్ మూవీస్ మేకింగ్ ని తాకట్టు పెట్టి –బందీలుగా, బానిసలుగా వుండిపోతే, అవి వసూళ్లు కూడబెడతాయా, కూడు పెడతాయా?
డేల్
కార్నెగీ ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తాడు – నువ్వు చక్కగా జీవించాలనుకుంటే అటు గతం గది
తలుపు, ఇటు భవిష్యత్ గది తలుపూ మూసేసి, వర్తమానపు మధ్య గదిలో వుండిపో – అని. దీన్ని
స్మాల్ మూవీస్ కథలు ఆలోచించడానికి కూడా వర్తింప జేసుకోవచ్చు.
అన్ని రకాల సినిమాలు చూడవచ్చు. తృప్తి తీరేంత ఎంజాయ్ చేయవచ్చు. కానీ వచ్చిన అవకాశంతో స్మాల్ మూవీస్ చేస్తున్నప్పుడు, ఇటు చూసిన స్టార్ మూవీస్ కీ - అటు నానా జాతి ఇతర మూవీస్ కీ తలుపులు గట్టిగా మూసేసి - నా స్మాల్ మూవీ, నా స్ట్రక్చరు - అనుకుంటూ జపం చేయాలి. ఇతర జాతి సినిమాల గురించిన ఏ ఆలోచనా మనసులోకి రానీయ కూడదు. హాలీవుడ్ ధైర్యమిస్తోంది- ఫాలో ది హాలీవుడ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్! ఇంతటి చక్కని అవకాశం స్మాల్ మూవీస్ తోనే. మరెక్కడా లేదు తెలుగులో.
లేదు మేం స్ట్రక్చర్ ని నమ్మం, మా కవసరం లేదు, ఇలాగే మా ఇష్టమొచ్చినట్టు తీసుకుంటామనుకుంటే, అప్పుడు స్ట్రక్చర్ – స్క్రీన్ ప్లే వ్యాసాలు, పుస్తకాలు, రివ్యూలు ఏవీ చదవి టైం వేస్ట్ చేసుకోనవసరం లేదు. ఫ్యాషన్ కోసం కూడా వీటిని చదువుతూ, చర్చిస్తూ వుండనవసరం లేదు. లేదనున్నాక లేదన్నట్టే వుండిపోవాలి. అలా హాలీవుడ్ కథల వెనుకున్నశాస్త్రమేంటో, ఆ కష్టమేంటోపడకుండా, తెలుసుకోకుండా, కాపీ కొట్టుకో వచ్చు. లేదూ, ఇప్పుడున్న విధంగానే నానా జాతి సినిమాల ఆలోచనలతో గజిబిజి చేసుకుని స్మాల్ మూవీస్ ఇలాగే తీస్తూ పోవచ్చు.
***
డేల్
కార్నెగీ డోసు ఇంకో విషయంలో కూడా వర్తిస్తుంది - స్మాల్ మూవీ కథ ఆలోచించడానికి ఇతర
కేటగిరీ మూవీస్ కి తలుపులేసుకోవడమే కాదు, అదే సమయంలో ఇంకో పని కూడా చేయాలి : స్ట్రక్చర్
మీద నమ్మకం వుంటే క్రియేటివిటీకి కూడా నిర్దాక్షిణ్యంగా తలుపేసేయాలి. గెటవుట్ యూ ఈడియెట్
అని గెంటేయాలి. స్ట్రక్చర్ కి బద్ధశత్రువు
క్రియేటివిటీ. స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు అని అంగీకరించాలి. ఏదైనా నిర్మాణం జరిగాకే డిజైనింగ్ చేయడానికి
వీలవుతుంది. లేని నిర్మాణానికి డిజైనింగ్ ని వూహించలేం. అలాగే లేని స్క్రీన్ ప్లే
స్ట్రక్చర్ కి క్రియేటివ్ ఆలోచనలు చేయలేం. ముందు స్ట్రక్చర్, తర్వాతే దాని మీద
క్రియేటివిటీ. స్ట్రక్చర్ ని మెదడు ప్లాన్ చేసి మనసుకి అప్పగిస్తుంది. అప్పుడు
మనసు క్రియేటివిటీ చూసుకుంటుంది. కాబట్టి ముందు మెదడు పనిని మెదడు చేయనివ్వాలి. ముందుగా
మెదడు కథని స్ట్రక్చర్ లో ఆలోచించి, స్క్రీన్ ప్లేకి ఒక బ్లూప్రింట్ ని పక్కాగా
అందించాక మాత్రమే, ఆ బ్లూప్రింట్ ని ముందు పెట్టుకుని స్ట్రక్చర్ లో వున్న ఆయా సీన్లని ఎలా రూపొందించుకోవాలో
ఆలోచిస్తున్నప్పుడే, క్రియేటివిటీ
కార్యకలాపం అమల్లోకొస్తుంది. కథని స్ట్రక్చర్ దృష్ట్యా విశ్లేషిస్తే, అలవాటైన ఉత్త
క్రియేటివిటీతో కథ చేసుకుంటున్న వాళ్ళు – నమ్మకుండా కొట్టి పారేసి వెళ్ళిపోయే
వాళ్ళు ఇంకా వుంటున్నారు. ఉదాహరణకి ప్లాట్ పాయింట్ వన్ ప్రకారం ఇంటర్వెల్ వుండాలని
స్ట్రక్చర్ చెప్తుంది. అప్పుడా హీరో మీద కాకుండా, విలన్ మీదా కాకుండా, వీళ్ళెవరూ
లేని ఇంకేదో మైనర్ పాత్ర మీద ఇంటర్వెల్ వేస్తే
ఎలా వుంటుంది? క్రియేటివిటీయే పంచ ప్రాణాలై పోతే ఇంతే. ఇలాగే వుండాలని వాదిస్తారు. ఇదెలా కరెక్టో చెప్పడానికి
క్రియేటివిటీకి సూత్రాలు దొరకవు. ఎందుకంటే క్రియేటివిటీకి సూత్రాలనేవి వుండవు.
కేవలం స్ట్రక్చర్ కే సూత్రాలు అందుబాటులో వుండి, ఏది ఎందుకు తప్పో, ఏది ఎందుకు
ఒప్పో ఆధారాలతో సహా నిరూపించే వీలుంటుంది.
మరోసారి
జాన్ ట్రుబీని ప్రస్తావించుకుంటే, మానసిక లోపాలే సినిమా కథకుల విజయాలకి పెద్ద అడ్డంకి... స్ట్రక్చర్ పట్ల ద్వేషం
పెట్టుకుని క్రియేటివిటీనే ప్రేమించడం కూడా వైఫల్యాలకి తోడవుతున్న మరో మానసిక లోపం. స్ట్రక్చర్ + క్రియేటివిటీ స్కూలు – ఒఠ్ఠి
క్రియేటివ్ స్కూలు అని రెండుగా విడిపోయిన సినేరియాలో,
స్మాల్ మూవీస్ కి ఏ పాటి మోక్షం కల్గించాలన్నా
అంత సులభం కాదు.
కాబట్టి సిన్సియర్ గా – సిన్సియర్ గా మాత్రమే –స్మాల్ మూవీస్ చేయాలనుకుంటే, ఇది రెండో సూత్రం : ముందుగా స్ట్రక్చర్ గదిలో వుంటూ, క్రియేటివిటీ గదికి తలుపేసేయడం. మొదటి సూత్రం వచ్చేసి : చూసిన నానా జాతి సినిమాల ఆలోచనలకి తలుపేసుకుని, స్మాల్ మూవీ కథ మీద కూర్చోవడం. ఈ రెండూ సాధ్యమన్పించకపోతే ఈ వ్యాసం చదవడం ఇక్కడితో ఆపెయ్యడం మంచిది.
***
సినాప్సిస్ లే కాదు, పూర్తి స్క్రిపు కూడా రాసేయడం,
తీరా ఎదురయ్యే ప్రశ్నలకి తికమక పడ్డం ఇది కాదు ప్రాసెస్. ప్రాసెస్ కో ప్రోటోకాల్
వుంటుంది. రాసింది ఒక్క ముక్కలో లైను చెప్పడానికి తికమక పడ్డారంటే రాసిందాని
గురించి ఏమీ తెలియదన్న మాటే. ప్రోటోకాల్ తెలియకపోతే లైను చెప్పలేరు, అరగంట పాటు కథ చెప్తూ కూర్చునే పరిస్థితి
వస్తుంది. లైను కాదు పోనీ, ప్లాట్ పాయింట్స్ ఏమిటో కూడా చెప్పలేకపోయినా, స్ట్రక్చర్ ని నమ్మి కూడా ఎలా అమలు చేసుకోవాలో
తెలియకపోవడమే. ఇదంతా వద్దు, కథలో హీరో సాధించడానికి ఏర్పాటు చేసిన సమస్య లేదా గోల్
ఏమిటో కూడా చెప్పలేకపోతే, ఇది మరీ
అన్యాయంగా వుంటుంది.
ఐడియా అంటే పాత్ర - సమస్య - పరిష్కారమే. ఐడియాని విస్తరించి రాసే సినాప్సిస్ అంటే పాత్ర - సమస్య - పరిష్కారమే. సినాప్సిస్ తో వేసే వన్ లైన్ ఆర్డర్ అంటే కూడా పాత్ర -సమస్య – పరిష్కారమే. వన్ లైన్ ఆర్డర్ ఆధారంగా రాసే ట్రీట్ మెంట్ అంటే కూడా పాత్ర - సమస్య - పరిష్కారమే. ట్రీట్ మెంట్ ఆధారంగా రాసే డైలాగ్ వెర్షన్ అన్నా కూడా పాత్ర -సమస్య – పరిష్కారమే. ఇలా చిట్ట చివరికి వెండి తెర మీద ప్రేక్షకులు చూసేది కూడా పాత్ర –సమస్య- పరిష్కారమే తప్ప మరేదో న్యూసెన్సూ, ఇంకేదో కంగాళీ కాదు. థియేటర్లో ప్రదర్శితమయ్యేది పాత్ర –సమస్య- పరిష్కారమే తప్ప డస్ట్ బిన్నులు కాదు. బయ్యర్ వచ్చి కొనుక్కునేది కూడా పాత్ర -సమస్య- పరిష్కారమే తప్ప ప్లాస్టిక్ బకెట్టులు కాదు.
కాబట్టి ఎక్కడ్నించి పాత్ర - సమస్య – పరిష్కారాన్ని నింపుకుని బయల్దేరిన ఐడియా ఎక్కడికి చేరుతోందో గమనించుకోవాలి. అది కథకి డీఎన్ఏ. అది కథకి విత్తనం. అది కథకి టికెట్. కథకి అదే స్ట్రక్చర్. డీఎన్ఏ చెడితే కథలేదు. విత్తనం పుచ్చితే కథలేదు. టికెట్ డూప్లికేట్ అయితే కథ లేదు. స్ట్రక్చర్ లేక కథలేదు. అంతా ఐడియా దగ్గరే వుంది. ఐడియాని ఎలా సైంటిఫిక్ గా నిర్మించుకోవాలో తెలుసుకుంటే స్క్రీన్ ప్లేకి ఎదురేదీలేదు. ఐడియాని నిర్మించకుండా స్క్రీన్ ప్లేని నిర్మించలేరు. సూత్రబద్ధంగా ఐడియా కుదిరేవరకూ ఐడియాతో కసరత్తు చేస్తూ వుండాల్సిందే. ఐడియాతో కసరత్తు చేస్తున్నంత కాలం కథే ఆలోచించకూడదు. స్క్రీన్ ప్లే కి స్ట్రక్చర్ అనేది ఐడియాలో కూర్చడంతోనే మొదలవుతుంది. ఐడియాలో స్ట్రక్చర్ లేదంటే స్క్రీన్ ప్లే లేదు. ఒక సింగిల్ లైను ఐడియాలో బిగినింగ్ - మిడిల్ -ఎండ్ లు లేవంటే స్క్రీన్ ప్లే కూడా లేనట్టే.
ఈ
ప్రోటోకాల్ పాటించకుండా సినాప్సిస్ లు, స్క్రిప్టు లు రాసేస్తున్నారు. వీటికి అర్ధంపర్ధం
వుండడం లేదు. ఇది తెలిశాక, పడ్డ కష్టమంతా బూడిదలో
పోసిన పన్నీరైందని వాపోతున్నారు. కాబట్టి ముందుగా ఐడియాని మధించాలి. ఎంతకాలమైనా కుదిరేవరకూ
మధిస్తూనే వుండాలి. ఇదిమంచి మెంటల్ ఎక్సర్ సైజు. ఇదెలా చేయాలో బ్లాగు సైడ్ బార్లో ‘తెలుగు
సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ మొదటి భాగం
లో వుంది. క్లిక్ చేసి ప్రాక్టీసు చేయాలి. మొదటి లెసన్ గా ‘ఐడియా స్ట్రక్చర్’ మీద పూర్తి
అవగాహన కలిగేవరకూ కథతో ముందు కెళ్ల కూడదు. ఈ లెసన్ బాగా వొంటబట్టాకే రెండో లెసన్ సినాప్సిస్
గురించి పోస్ట్ చేయడం జరుగుతుంది.
స్మాల్ మూవీస్ తో దక్కే అదృష్టం స్ట్రక్చర్ తో చక్కగా కథ చేసుకోగల్గడమే. ఈ అదృష్టం ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ మూవీస్ కి లేదు. అవి స్టార్ పవర్ తో ఆడేస్తాయి. స్మాల్ మూవీస్ ని స్టోరీ పవర్ తో ఆడించుకోవాల్సిందే. మరి స్టోరీ అంటే స్ట్రక్చరే!
*స్మాల్ మూవీస్ రూల్ నంబర్ వన్ - నానా జాతి సినిమాల ఆలోచనలకి తలుపేసుకుని, స్మాల్ మూవీ కథ మీద కూర్చోవడం.
*స్మాల్ మూవీ రూల్ నంబర్ టూ– స్ట్రక్చర్ గదిలో వుంటూ, క్రియేటివిటీ గదికి తలుపేసేయడం.
విష్ యూ ఆల్ ది బెస్ట్.
―సికిందర్