రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జులై 2019, శుక్రవారం

ఎడిటింగ్ కీ అంతర్నేత్రం వుండాలి!
కోటగిరి వెంకటేశ్వర రావు, ఎడిటర్

    ఫిలిం ఎడిటింగ్ అంటే వెండితెర మీద సినిమా కథని సాఫీగా, సుందరంగా చూపే కత్తిరింపు కళ. రచయితా దర్శకుడూ ఎంతైనా రాసుకోనీ గాక, ఆఖర్న దాన్ని సంస్కరించి, సినిమాగా చూసేందుకు ఆసక్తికరంగా  దృశ్యాల్ని కూర్చి, అర్ధవంతంగా  తీర్చిదిద్దేది ఎడిటరే. అందుకే సినిమా మొత్తం ప్రొడక్షన్ అంతటినీ ఎడిటింగ్ కి ముడి సరుకు ఉత్పత్తి అన్నారు. ఈ రోజుల్లో బౌండ్ స్క్రిప్టు ఓ లగ్జరీ. ఐతే అది పట్టుకుని టిప్ టాప్ గా షూటింగ్ కి వెళ్ళే దర్శకుడికే తెలీదు- అంత నమ్మకంగా బడ్జెట్ పరంగా నిర్మాతని ఒప్పించిన ఆ బౌండ్ స్క్రిప్టులో కూడా ఎడిటింగ్ లో వుండేదెంతో పోయేదెంతో! తీయాల్సిన షాట్ కి ముడి ఫిలిం ఫుటేజీని అంత కచ్చితంగా  ఇన్నేసి అడుగులని అంచనా కట్టి షూట్ చేసే సత్తాగల కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి ల వంటి మహా దర్శకులు ఇప్పుడు లేరు, అది వేరే విషయం. గ్రాఫిక్స్ షాట్స్ చిత్రీకరణలో  ఎలాగైతే కెమెరా మాన్ ఎదురుగా లేని దృశ్యాల్ని ఉన్నట్టుగా మనో నేత్రం తో చూసి షూట్ చేస్తాడో, అలా ఏది ఎడిటింగ్ లో కత్తిరింపుకి గురవుతుందో ముందు ఊహించ గలిగిన వాడే నిజమైన టెక్నికల్ దర్శకుడు. ఇలాటి దర్శకులు సినిమా అక్షరాశ్యులుగా కన్పిస్తారు ఎడిటర్లకి.  దీనికి ఒక నిదర్శనం ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా- “ఎందరో యువదర్శకులు ఎడిటింగ్ ఐడియాల కోసం, నోట్స్ కోసం వాళ్ళ సినిమాల్ని తీసుకుని మా నాన్న దగ్గరికి వస్తూంటారు. వాళ్ళకి మా నాన్న ఒక ఫిలిం ప్రొఫెసర్ లాగా కన్పిస్తారంటే అతిశయోక్తి కాదు” -అని కపోలా కుమార్తె సోఫియా చెప్పుకొస్తుంది.

నాతో ఎడిటింగ్ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకుంటారు మన దర్శకులు” అంటారు తల పండిన ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు. ఆయన కె. రాఘవేంద్ర రావు దగ్గర నుంచి నేటి ఎస్ ఎస్ రాజమౌళి వరకూ రెండు తరాల దర్శకులనిఎడిటింగ్ లో మూడు యుగాల టెక్నాలజీ నీ చూశారు. అవి మూవీయోలాస్టెయిన్ బెక్ఎవిడ్ ఎడిటింగ్ పద్ధతులు.

  మూవీయోలా 
ఎవిడ్ తో కోటగిరి 



స్టీన్ బెక్ 
        ఎడిటింగ్ లో తొలి రెండు యుగాలైన మూవీయోలా, స్టీన్ బెక్ రోజుల్లో నెలల తరబడి ఫిలిం రీళ్ళని కత్తి రించుకుంటూ, అతికించుకుంటూ ఉండేవాళ్లమని నవ్వేశారు కోటగిరి. ఇప్పుడు ఎవిడ్ విధానంతో 15 రోజుల్లో ముగించేస్తున్నా మన్నారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రశాంతంగా కన్పించే కోటగిరి, ‘మగధీర’ లో ఒక్క ఆ సంక్షుభిత ‘శత శత్రు సేన వధ’  మెగా సీనుకే రోజుల తరబడీ ఎడిటింగ్ చేస్తూంటే, మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చా యన్నారు. ఇక్కడ పైన చెప్పుకున్న మనోనేత్రమే ఎడిటర్ కి ఇలా అనివార్య మవుతోందన్న మాట! గ్రాఫిక్స్ కాలం డిమాండ్ చేస్తున్న అదనపు యోగ్యత ఇది.

మూవీయోలా కాలంలో మొత్తం సినిమా షూట్ చేసి ఇచ్చాకఆప్టికల్స్ భాగాల్ని తర్వాత చిత్రీకరించి పంపేవారు. అవెలా ఉంటాయో నని ఊహించుకుంటూ గడిపేవాళ్ళం. ఇప్పుడు తిరగబడింది. ఇప్పుడు ముందుగానే బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అవసరమైన భాగాల్నిచిత్రీకరించేసిఎడిటింగ్ కి పంపిస్తున్నారు. దీంతో ఆ బ్లూ మ్యాట్ నేపధ్యంలోఎదురుగా లేని దృశ్య విశేషాల్ని మేము కూడా అంతర్నేత్రంతో చూసిఅ ప్రకారం ఎడిటింగ్ చేయాల్సి వస్తోంది” అని వివరించారు కోటగిరి.

   ఎందుకిలా? –అనడిగితే, “ఇలా కాకుండా సినిమా షూట్ చేసినట్టే గ్రాఫిక్స్ భాగాల్ని కూడా పూర్తి స్థాయిలో చేస్తే, ఎడిటింగ్ లో కోట్లాది రూపాయలు నష్ట పోతారు కాబట్టి!” అన్నారు. కనుక ఈ రియల్స్ ( అంటే ఎడిట్ చేసిన బ్లూ మ్యాట్ వెర్షన్ ) నే గ్రాఫిక్స్ కి పంపిస్తారన్నారు. 

   1977 లో రాఘవేంద్రరావు తీసిన ‘అడవిరాముడు’ కి పాక్షికంగా ఎడిటింగ్ చేసే అవకాశం  కల్పించడంతో, అప్పటిదాకా అసిస్టెంట్ గా వున్న కోటగిరి, ఎడిటర్ గా ప్రమోటయ్యారు. ఆ తర్వాత ‘వేటగాడు’ నుంచీ మొదలు పెట్టి చేసిన వందలాది సినిమాల్లో 80 శాతం రాఘవేంద్ర రావువే. ఇంకా సింగీతం శ్రీనివాసరావు, కె. కోదండ రామిరెడ్డి, బి. గోపాల్, కె. బాపయ్య, ఎస్ ఎస్ రాజమౌళి మొదలైన ఎందరో అగ్రదర్శకుల సినిమాలకి ఎడిటర్ గా ఉంటూ వచ్చారు.

    డిజిటల్ లో ఎడిటింగ్ పద్ధతిని 1987లో అమెరికాలో విలియం జె. వార్నర్ ప్రవేశపెట్టాడు. దాన్ని ‘ఎవిడ్’ అన్నాడు. అలా 1992లో ‘కిల్ ఆల్ ది లాయర్స్’ మొదటి ఎవిడ్ ఎడిటెడ్ సినిమా అయింది. అప్పట్నించీ ప్రపంచ వ్యాప్తంగా ఎవిడ్ లోనే సినిమాలు ఎడిటింగ్ జరుపు కుంటూ వస్తున్నాయి. 

      ఈ విధానంమేమిటో  వివరించారు కోటగిరి. మొదట ల్యాబ్ కొచ్చిన నెగెటివ్ ని డెవలప్ చేస్తారు.దాన్ని ఎడిటింగ్ కి పంపిస్తారు. ఇవి 400 అడుగుల నిడివి చొప్పున మేగజైన్స్ గా వుంటాయి. 4, 5 మేగజైన్స్ చొప్పున కలిపి ఒకటిగా చేసి, టెలిసినీ అనే యంత్రంలో లోడ్ చేస్తారు. ఇక్కడ అసిస్టెంట్లు కలర్ కరెక్షన్ , లైటింగ్ కరెక్షన్ వగైరా పూర్తి చేసి, డివి కామ్  కేసెట్ లో రికార్డు చేసి ఎవిడ్ విభాగానికి పంపిస్తారు. ఇక్కడ మళ్ళీ అసిస్టెంట్లు ఆ షాట్స్ లో ఓకే చేసిన టేక్స్ ని క్లాప్ బోర్డు రిఫరెన్సుగా తీసుకుని, వరుసక్రమంలో పేర్చి, నగారా నుంచి తీసిన సౌండ్ ని కలిపి ఎడిటర్ కి అందిస్తారు. అప్పుడు దర్శకుడితో కూర్చుని ఎడిటర్ తన పని ప్రారంభిస్తాడు. 
    నూజివీడు నుంచి అసలు ఎడిటర్ అవుదామని మద్రాసు వెళ్ళ లేదీయన. అక్కడి వాహినీ స్టూడియోలో అన్నగారైన సుప్రసిద్ధ ఎడిటర్ కోటగిరి గోపాల రావు తనని స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మోహన్ జీ- జగన్ జీ ల దగ్గర పెట్టించారు. కానీ ఆ డార్క్ రూమ్ లోనే తన జీవితం గడిచిపోవడం ఇష్టంలేక వచ్చేసి అన్నగారి సరసన చేరి, కాలక్రమంలో ఎడిటర్ గా 
రూపాంతరం చెందారు. 
‘సై’, ‘సుభాష్ చంద్ర బోస్’ లతో బాటూ ‘మగధీర’ కీ నంది అవార్డు లందుకున్న కోటగిరి ప్రస్తుతం ఐదారు సినిమాల ఎడిటింగ్ పనులతో బిజీగా వున్నారు.


సికిందర్(5 డిసెంబర్, 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం )