రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 19, 2019

843 ; స్క్రీన్ ప్లే సంగతులు - 3

Concluding part of  8 - 15 points have been  added to this article today, ie 20.6.19


లీనియర్ కథా విశ్లేషణ:
         
లీనియర్ కథలో మొదటి ప్లాట్ పాయింట్ తల్లీ కూతుళ్ళు వంశీని చంపితే, ప్రభాకర్ హెల్ప్ చేయడంగా; రెండో ప్లాట్ పాయింట్ ప్రభాకర్ పోలీసులకి లొంగి పోవడంగా వున్నాయి. నిజంగా జరిగితే రెండూ కరెక్టే స్ట్రక్చర్ విధుల రీత్యా. కానీ ఈ రెండిట్లో మొదటిది నిజంగా జరగలేదు. ఇదే సమస్య. ప్రపంచ సినిమా చరిత్రలో నిజంగా జరగని సంఘటనతో ప్లాట్ పాయింట్ వన్ రావడం ఇదే బహుశా. ఇదే విచిత్రం, ఇదే వింత. 

         
ల్లీ కూతుళ్ళు వంశీని చంపే దృశ్యంగానీ, ఆ తర్వాత ప్రభాకర్ హెల్ప్ చేసిన వైనంగానీ నిజంగా జరిగినవి కావు. డిసిపి కార్తికేయ ఊహాగానం మాత్రమే. సెకండాఫ్ లో అతను ఊహించి దృశ్యాన్ని అల్లి చెప్పినట్టుగా చూశాం. దీన్నే లీనియర్ కథ అర్ధమవడానికి ప్లాట్ పాయింట్ వన్ లో సెట్ చేసి, లీనియర్ కథ  రాయాల్సి వచ్చింది. కార్తికేయ తను జయంతి ఫ్లాట్ కెళ్ళినప్పుడు డోర్ చైన్ తోబాటు గ్రానైట్ దిమ్మె డ్యామేజీ అయివుండడాన్ని గుర్తు చేసుకుని, హత్యా దృశ్యాన్ని అల్లాడు. వంశీ వచ్చి మీటర్ రీడింగ్ అంటూ డోర్ బెల్ నొక్కిందగ్గర్నుంచీ, తల్లి కూతుళ్ళు అతణ్ణి చంపిన విధానం, ఆ తర్వాత ప్రభాకర్ వచ్చి హెల్ప్  చేస్తాననడం వరకూ దృశ్యాన్ని అల్లి చెప్పాడు. ఈ ఊహా గానాన్నే లీనియర్ కథలో ప్లాట్ పాయింట్ వన్ గా వాడుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందో తల్లీకూతుళ్ళు గానీ, ప్రభాకర్ గానీ చెప్తేనే నిజ సంఘటనగా నమ్మ వీలవుతుంది. కార్తికేయ ఊహించి చెప్తే కాదు. అంటే ప్లాట్ పాయింట్ వన్ లేనట్టే భావించాల్సి వస్తుంది. ఊహాజనిత ప్లాట్ పాయింట్ వన్ తో కథ వుండదుగా అంటే, ఇలా వుంటుందని దర్శకుడు భావించాడంతే, మనమేం చేస్తాం?         

      మనతో సహా ఈ కథలో ఎవ్వరికీ తెలీదు - అసలు తల్లీ కూతుళ్ళు వంశీని చంపారా, ప్రభాకర్ వాళ్లకి హెల్ప్ చేశాడా అన్న విషయం - కేవలం ఆ తల్లీ కూతుళ్ళకీ, ప్రభాకర్ కీ  తప్ప! ఊహాగానాలతో వాళ్ళ మీద అన్యాయంగా నిందమోపి వాళ్ళని క్షమించి వదిలెయ్యడం పెద్ద మనసు అన్పించుకోదు, కేసుని తేల్చలేని చేతగాని తనమన్పించు కుంటుంది. ఇలా పోలీసు ఉన్నతాధికారుల పాత్రచిత్రణలు లోపభూయిష్టంగా మారాయి, ఊహాజనిత ప్లాట్ పాయింట్ వన్ వల్ల. 

ఎందుకు హెల్ప్ చేశాడు?
          సినిమాలో చూపించినట్టుగా నాన్ లీనియర్ కథనంలో ఏం చేశారంటే, సూపర్ మార్కెట్ లో వంశీని చూసి జయంతి పారిపోయి రావడం, తల్లితో కలిసి భయపడుతూ వుంటే, డోర్ బెల్ మోగడం, అప్పుడు ‘ఎవరూ?’ అంటే, ‘మీటర్ రీడింగ్’ అంటూ సమాధానం రావడం (మీటర్లు ఫ్లాట్ లో వుంటాయా?) వరకూ చూపించి కట్ చేసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సెకండాఫ్ లో కార్తికేయ ఊహాగానంతో మాత్రమే దృశ్యం వేసి చూపించారు. దీనివల్ల మొత్తం కేసు దర్యాప్తే  అనుమానాస్పదమవడంతో బాటు, బూటకపు ప్లాట్ పాయింట్ వన్ సీను వచ్చింది. కథకూడా బూటకంగా తయారయింది. ‘మీటర్ రీడింగ్’ అన్న తర్వాత ఏదో సస్పెన్స్ పోషిద్దామనుకుని కట్ చేశారు. ఈ కట్ అవడం కట్ అవడం మొత్తం స్క్రిప్టులోంచి అన్నీ కట్ అయిపోయాయి. 

          కార్తికేయ ఊహాగానం కూడా పరిపూర్ణం కాదు, పాత్ర చిత్రణల్లేవు. ఈ సీన్ని ఊహాగానంగా కాకుండా నిజంగా చూపించి వుంటే, అంటే ‘మీటర్ రీడింగ్’ అన్న తర్వాత కంటిన్యూ చేసివుంటే ప్లాట్ పాయింట్ వన్ గా వుండడమే గాక, ప్లాట్ పాయింట్ వన్ ధర్మాల్ని నిర్వర్తించేది. పాత్ర చిత్రణల్ని సమగ్రం చేసేది. పైగా కథ పట్ల నమ్మకం కల్గించేది.

         కార్తికేయ ఊహాగానంతో తల్లీ కూతుళ్ళు వంశీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో మనకి అర్ధమైనా, అసలు ప్రభాకర్ ఎందుకు హెల్ప్ చేయడానికి వచ్చాడో అర్ధంగాదు. చనిపోయిన అతడి భార్య మానస జయంతి లాగే వుందని మనకి తెలుసు. ఆ ఫీలింగ్ తో హెల్ప్ చేయడాని కొచ్చాడా? అయితే అదిక్కడ చెప్పించి క్లియర్ చేయాలి. ఆ తల్లీ కూతుళ్ళు అడగాలి – మీరెందుకింత రిస్కు తీసుకుంటున్నారని. జయంతికి అనుమానాలు వచ్చేయాలి. ‘రోజూ మీరు బయటి వరకూ నన్ను ఫాలో అవుతున్నారెందుకు? ఒన్ సైడ్ లవ్వా? ఇప్పుడీ హెల్ప్ చేసి నన్ను మీ గ్రిప్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? సారీ, నేనింకో వంశీని కోరుకోవడం లేదు, ప్లీజ్ లీవ్...’ అనెయ్యాలి. 

          అతను మనసులో మాట చెప్పుకోలేని వ్యధ ననుభవించాలి -  ‘నువ్వు నా చనిపోయిన భార్యలాగే  వున్నావన్న ఫీలింగ్ తో ఫాలో అయ్యా, హెల్ప్ చేసున్నా’- అన్నాకూడా దొరికిపోతాడు. ఆమె అనుమానాల్ని నిజం చేసిన వాడవుతాడు. ఇదెలా కొలిక్కి వచ్చిందనేది ఇక్కడ చెప్పి ముందుకెళ్లాలి. ప్లాట్ పాయింట్ వన్ వరకూ బిగినింగ్ విభాగంలో జరిగిన సంబంధిత విషయాలు కొలిక్కి వచ్చేయాలి. అప్పుడే అర్ధం, బలం. పాత్ర చిత్రణలు కూడా సవ్యంగా వుంటాయి. 

     కానీ ఏం జరిగిందంటే, ఈ మొత్తం హత్యా దృశ్యాన్ని, అంటే ప్లాట్ పాయింట్ వన్ సీనుని – దీని తర్వాత శవాన్నిమాయం చేయడాన్నీ ఖండ ఖండాలు చేసి, ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ గా చూపడంతో, ప్రభాకర్ మనసులోనిమాట - అసలెందుకు హెల్ప్ చేయాలనుకున్నాడో -  సినిమా ముగింపులో అతడి చేతే  జయంతికి చెప్పించాల్సి వచ్చింది. నాన్ లీనియర్ కథకి ఇలా దాచి ముగింపులో చెప్పడం మంచిదే.

          అయితే ఇందువల్ల జయంతి పాత్ర డమ్మీ అయింది. ముగింపులో కూడా అతణ్ణి ప్రశ్నించలేని, అతను చెప్పిందే నమ్మాలన్న పాసివ్ నెస్ కి మారిపోయింది. నాన్ లీనియర్ కథనంలో సీన్ల ఏకత్వం చెదిరిపోక తప్పదు. దీంతో కొన్ని నష్టాలూ తప్పవు. ఇందుకే నాన్ లీనియర్ కథనాల్లో ప్లాట్ పాయింట్స్ తెలియవు, వీటిని లీనియర్ గా మార్చి చూసినప్పుడే లోపాలు సహా తెలుస్తాయి. 

మరికొన్ని లోపాలు :

          లీనియర్ కథని వరసగా చూసుకుంటూ వస్తే ఈ కింది కథన లోపాలతో వుంటుంది. అంటే నాన్ లీనియర్ కథనంలో ఈ లోపాలు తొలగిపోయాయని కాదు. లీనియర్ కథ వచ్చిందే నాన్ లీనియర్ ఆర్డర్ లోంచి. లోపాలు నాన్ లీనియర్ లోనే వున్నాయి. 

           1. మార్నింగ్ జయంతి ఆఫీసు కారెక్కి ఆఫీసుకి పోతూ ఏదో గుర్తు కొచ్చినట్టు సూపర్ మార్కెట్ దగ్గరాప మంటుంది. ఆ టైంలో షాపింగ్ చేయడమేమిటి. పైగా ఏం షాపింగ్ చేయడానికి వచ్చిందో లోపలికి వెళ్ళాక కూడా తెలీదు. రోజూ కారులో వుండే కొలీగ్ కూడా ఇప్పుడుండదు. అంటే వంశీ ఆమెని కనిపెడితే ఆమె పారిపోవడం కోసం, తద్వారా వచ్చే సీన్ల కోసం, కావాలని ఆమెని మధ్యలో సూపర్ మార్కెట్ లోకి పంపించారన్న మాట షాపింగ్ నెపంతో అసహజంగా. 

         2. కార్తికేయకి లాడ్జిలో వ్యక్తి  మిస్సయ్యాడని ఫోరెన్సిక్ టీముతో వెళ్ళినప్పుడు- ఇలాటి సీన్లు చూడడడం చాలా తమాషాగా వుంటుంది - ఆ ఫోరెన్సిక్ టీము లోపలికి వచ్చి - మనం ఏం వూహిస్తూ వుంటామో అదే చేసి పారేస్తారు!  చాలా సినిమాల్లో లాగే, గ్లవ్స్ తొడుక్కోకుండా ఉత్త చేతులతో వస్తువులు ముట్టుకుంటారు, తర్వాత గ్లవ్స్ తొడుక్కుంటారు! ఇప్పుడు కూడా ఫోరెన్ ‘సిక్’ మహానుభావుడు రూమ్ లోకి రాగానే ఉత్త చేత్తో లైటు స్విచ్ వేస్తాడు, తర్వాత గ్లవ్స్ తొడుక్కుంటాడు - శవ్వ శవ్వ!! ఇక్కడకొచ్చిందే సాక్ష్యాధారాల సేకరణ కోసం. ఆ సాక్ష్యాధారాల్ని తన వేలిముద్రలేసి కలుషితం చేస్తున్నానన్న ఇంగితం కూడా వుండి చావదు. 

           3. ఇక్కడ కొచ్చింది బీచ్ రోడ్డులో కాలిన గుర్తు తెలియని శవాన్ని కనుగొన్న నేపధ్యంలో. ఈ లాడ్జి కొచ్చాక ఈ రూము వంశీ బుక్ చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పుడు కాలిన శవం వేలిముద్రలతో ఇక్కడి వేలిముద్రల్ని టాలీ చేసి, కాలిన శవం వంశీదని డిక్లేర్ చేస్తాడు ఫోరెన్ ‘సిక్’ మహానుభావుడు! లీనియర్ కథలో కాలిన శవం ప్రభాకర్ హత్య చేసిన అలీదని మనం తెలుసుకున్నాం. ఆ అలీ వేలిముద్రలతో ఈ వంశీ వేలిముద్రలెలా కలిశాయి?  అలీ శవం వంశీ శవమెలా అయిపోయింది? దీనికి డిసిపి కార్తికేయ గారు సమాధానం చెప్పాల్సి వుంది. 

          4. 
హెల్ప్ లేకుండా ఇద్దరు లేడీస్ చంపి శవాన్ని తెచ్చి బీచ్ రోడ్డులో పడెయ్యడమా... ఎవరో హెల్ప్ చేసి వుండాలనీ, అతను లవరై వుండొచ్చనీ పై అధికారి విశ్లేషణ. ఎవరో ఎందుకు హెల్ప్ చేయాలి. ఆ లేడీసే వంశీని బీచ్ రోడ్డుకి రప్పించి ఫినిష్ చేసి వుండొచ్చుగా? వేలిముద్రల్ని అనుకూలంగా మార్చుకుని, అలీ శవాన్ని ఇంకా వంశీ దని నమ్ముతున్నాడు విశ్లేషణాధికారి కూడా. 

           5. ప్రభాకర్ జయంతికి కాల్ చేసి పోలీసులకి ఏం చెప్పావని అంటాడు. మీరు చెప్పిందే చెప్పామంటుంది. అతను చెప్పింది, మనమధ్య కాంటాక్ట్స్ వున్న విషయం బయట పెట్టవద్దని మాత్రమే.

     6. డిసిపి కార్తికేయ తల్లీ కూతుళ్ళని ప్రశ్నించినప్పుడు ఎవరో బ్లాంక్ కాల్స్ చేస్తున్నాడని తల్లి అంటుంది. ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారో కార్తికేయ తెలుసుకోవచ్చు. తల్లీ కూతుళ్ళ కాల్ లిస్ట్స్ కూడా తెప్పించుకుని పరిశీలించ వచ్చు. అప్పుడు ప్రభాకర్ కాల్స్ అందులో తెలిసిపోతాయి. ఇక ఆమె గూగుల్ మ్యాప్స్ హిస్టరీని కూడా చెక్ చేస్తే, ఏఏ రోజు ఏఏ సమయాల్లో ఎక్కడెక్కడుందో డేటా అంతా తెలిసి పోతుంది. ఇవేవీ చెయ్యడు. ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్  ని కూడా చెక్ చెయాలనుకోడు.  భూతద్దం మాత్రం పట్టుకుని వుంటాడు. 

           7. కార్తికేయ ప్రభాకర్ ఫ్లాట్ దగ్గర నిఘా వేసినప్పుడు, జయంతిని అనుసరించి వస్తూ కనపడతాడు ప్రభాకర్. వాళ్ళు మాట్లాడుకోకుండా ఎవరి దారిని వాళ్ళు  వెళ్లిపోతూంటే, వాళ్ళిద్దరికీ ఏ సంబంధమూ లేదని నిర్థా రించుకుంటాడు కార్తికేయ. హత్య కేసులో అనుమానితులుగా వున్న ఇలాటి వాళ్ళు సంబంధమున్నట్టు కన్పిస్తారా? అసలు జయంతి తన భార్యలా వుందని ప్రభాకర్ ఇంకా ఫాలో కావడమేమిటి? కేసు నేపధ్యంలో కాంటాక్ట్ వున్నట్టు కన్పించ కూడదని తనే ఆమెకి జాగ్రత్త చెప్పాక కూడా? ఇప్పుడు కథ మిడిల్ లో వుంది. ఈ ఫాలో అయ్యే వ్యవహార మంతా కేసుకి పూర్వం బిగినింగ్ విభాగం లోనిది. ఇది ఆటోమేటిగ్గా ప్లాట్ పాయింట్ వన్ లో హత్య తర్వాత అతను  హెల్ప్ ఆఫర్ చేసినప్పుడు కొలిక్కి వచ్చేస్తుంది- పైన చెప్పుకున్నట్టు, ‘మీరెందుకింత రిస్కు తీసుకుంటున్నారు? రోజూ మీరు బయటి వరకూ నన్ను ఫాలో అవుతున్నారెందుకు? ఒన్ సైడ్ లవ్వా? ఇప్పుడీ హెల్ప్ చేసి నన్ను మీ గ్రిప్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? సారీ, నేనింకో వంశీని కోరుకోవడం లేదు, ప్లీజ్ లీవ్...’ అని సహజాతిసహజంగా జయంతి అనడం ద్వారా, ఈ ఫాలో అయ్యే వ్యవహారం ముగిసిపోవాలి. కానీ ప్లాట్ పాయింట్ వన్ లేకపోవడం వల్ల, పాత్రచిత్రణల్లేక, ఇలా మిడిల్లో ఈ విషమ పరిస్థితిలో  కూడా ఆమెని ఫాలో అవుతూ తిరుగుతున్నాడు మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్!
(మిగిలిన భాగం రాత్రి)



Added on 20.6.19
      8.  ఒక కానిస్టేబుల్ వచ్చి ప్రభాకర్ ఎవరో తెలిసిందని వెబ్ సైట్లో చూపిస్తాడు. ప్రభాకర్  ని ఐపీఎస్ అధికారిగా  పేర్కొంటూ వున్న ఆ న్యూస్ చూసి స్టన్ అవుతాడు కార్తికేయ...అలీ గ్యాంగ్ ని పట్టుకున్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్ అని రివీలవుతుంది. ఇది చాలా విచిత్రంగా వుంటుంది. వంశీ హత్య కేసు సందర్భంగా కార్తికేయ ప్రభాకర్ ని ఒకసారి  కలిసి ఆరా తీశాడు. అప్పుడు ప్రభాకర్  మాజీ ఐపీఎస్సే నని గుర్తుపట్టకుండా వుంటాడా, ఈ రాష్ట్రంలోనే పని చేసినప్పుడు? గుర్తు పట్టడమే కాదు, అతడి గతమంతా తెలిసి కూడా వుండాలి. అతడి భార్య మానసని అలీ చంపాడనే విషయం సహా. ఆ తర్వాత అతను జాబ్ కి రిజైన్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడన్న విషయంతో బాటు.  ఈ నేపథ్యమంతా ప్రభాకర్ ని కలిసినప్పుడే గుర్తుకు రావాలి సాటి ఐపీఎస్ అయిన కార్తికేయకి, ఇప్పుడు వెబ్ సైట్లో చూపిస్తే కాదు. ఇది చాలా సిల్లీ. ఈ నేపథ్యంలో ఇంకో అనుబంధ  అంశమేమిటంటే, ఐపీఎస్ అధికారియైన ప్రభాకర్ భార్య హత్య కేసు నమోదు కాలేదా? పోలీస్ శాఖ దర్యాప్తు చేయకుండా వదిలేశారా? ఈ సినిమా ఇలా తీయడానికి వదిలేసి వుంటారు. 

          ఇక ప్రభాకర్ ఐపీఎస్ అని రివీలయ్యాక, అలీ గ్యాంగ్ ని వెంటాడుతున్న దృశ్యంతో ఇంటర్వెల్ వేశారు. అంటే ఐపీఎస్ కార్తికేయ పాయింటాఫ్ వ్యూలోనా? కాదు, దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో. ఇదేం చిత్రణో అర్థం గాదు, కథకి శిల్పం గిల్పం లేకుండా అల్పం. వెబ్సైట్లో చూడగానే కార్తికేయ తన పాయింటాఫ్ వ్యూలో ఈ షాట్ వేసుకోవడానికి అతడికి ప్రభాకర్ గురించేమీ తెలీదు- ఇంటర్వెల్ తర్వాత ఇంకో పై అధికారిని అడుగుతాడు ప్రభాకర్ గురించి.
ఇలా వుంది వ్యవహారం!     
     
          కాబట్టి ఇక్కడ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి ప్రభాకర్ ని ఐపీఎస్ గా చూపిస్తూ మధ్యలో దర్శకుడు తన పాయింటాఫ్ వ్యూతో ఎంటరవుతూ ఇంటర్వెల్ షాట్ వేసుకున్నాడు.  అలీ గ్యాంగ్ ని వెంటాడుతూ సడెన్ గా ఇదెలా వుంటుందంటే, ఏదో మూస మాస్ ఫార్ములా సినిమా లోంచి ముక్క వచ్చి పడ్డట్టుంటుంది. జానర్ మర్యాద చెడి రసభంగం కూడా అవుతుంది.

          9. సెకెండాఫ్ ప్రారంభంలో ఐపీఎస్ కార్తికేయ, ఇంకో పై అధికారికి కాల్ చేసి ప్రభాకర్ గురించి అడుగుతాడు. ప్రభాకర్ మాజీ ఐపీఎస్ అధికారి అనీ, అతడి గురించిన సమాచారం అతడి దగ్గర  పని చేసిన కోలా వెంకట్ అనే ఎస్సై కి తెలుసనీ అంటాడు పై అధికారి. కార్తికేయ కోలా వెంకట్ ని కలుసుకుంటాడు. ప్రభాకర్ చాలా మంచి ఆఫీసర్ అనీ, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నామనీ, ఆయన రెండేళ్ళ క్రితం రిజైన్ చేశారనీ అంటాడు కోలా వెంకట్. 

          ఈ ఎస్సై కోలా వెంకట్ కూడా ఎంత సిల్లీ ఫెలో అంటే, ప్రభాకర్ గురించి అన్ని విషయాలు చెప్పిన వాడు, ఎందుకు రిజైన్ చేశాడో చెప్పడు. ప్రభాకర్ భార్య మర్డరయిన ముఖ్య విషయమే గాలి కొదిలేసి మాట్లాడతాడు. అసలు ప్రభాకర్ గురించి అడగగానే అతడి ముఖం విషాదమవ్వాలి. కాకుండా తన్మయత్వంతో ప్రభాకర్ గుణగణాలు చెప్తాడు. 

        10. కార్తికేయ తిరిగి వచ్చి ప్రభాకర్ ని కలుస్తాడు. ఆ తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామనీ, ఇన్ఫర్మేషన్ కావాలనీ అంటాడు.  వాళ్ళనే పట్టుకుని అడగ మంటాడు ప్రభాకర్. ఇంతకీ కార్తికేయ కోలా వెంకట్ దగ్గర తెలుసుకున్న పనికొచ్చే ముక్కేమిటి? ఏమీ లేదు, మంచి వాడన్న పొగడ్తలు తప్ప. ఎందుకు రిజైన్ చేశాడని కూడా అడగాల్సిన అసలు ప్రశ్న అడగడు. ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ దగ్గరకి అనవసరంగా వచ్చి, తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామని అంటాడు. అసలు అనుమానాలు రావాల్సింది ప్రభాకర్ మీద. ఇప్పుడు కూడా అతడికి ప్రభాకర్ భార్య హత్య  గురించి ఏమీ తెలీదు. మీరెందుకు రిజైన్ చేశారని కూడా అడగడు. ఈ విషయం తను ఫోన్ చేసినప్పుడు ఆ ఇంకో పై అధికారియే క్లియర్ చేసి వుండాలి. అతనేమో కోలా వెంకట్ ని కలవమన్నాడు. కోలా వెంకట్ సోది చెప్పాడు.  

          ఇది ప్లాట్ పాయింట్ - 2 కి దారి తీసే పించ్ - 2 సీను. ఆ తల్లీ కూతుళ్ళనే పట్టుకుని అడగమని ప్రభాకర్ అనడం. తల్లీ కూతుళ్ళని కాపాడుతున్న వాడు నోరు జారి అనేశాడా? ఏమో తెలీదు. ఎక్కడా పాత్రల మనసులో ఏముందో బయట పెట్టాలనుకోడు దర్శకుడు, మనకి తోచింది మనం వూహించుకోవాలంతే.

          11. కార్తికేయ పై అధికారి నాజర్ ని కలుస్తాడు. ప్రభాకర్ కి జయంతితో కాంటాక్ట్ వుండి వంశీ హత్య విషయంలో ఆమెకి హెల్ప్ చేసివుంటే, కాంటాక్ట్ లేనట్టే  రోజూ ఉదయం ఆమెని ఎందుకు ఫాలో అవుతున్నాడని అంటాడు నాజర్. అంటే నాజర్ ఉద్దేశంలో ప్రభాకర్ హెల్ప్ చేయలేదు. మరెవరు చేశారు?

     12. తల్లీ కూతుళ్ళనే పట్టుకు అడగండని కార్తికేయతో అనేసినందుకు తల్లీ కూతుళ్ళని ప్రమాదంలోకి నెట్టాడని తనే వెళ్లి లొంగి పోతాడు ప్రభాకర్. ఇది ప్లాట్ పాయింట్ టూ సీను. వంశీని తనే హత్య చేశానంటాడు. తను చేసిన అలీ హత్యని వంశీ హత్యగా వర్ణించి చెప్తాడు. అంటే ఇప్పుడు కూడా అలీ శవాన్ని వంశీ శవంగానే నమ్ముతాడు కార్తికేయ తెలివితక్కువగా. లావుగా వున్న అలీ శవాన్ని బక్కగా వుండే వంశీ శవమనుకుంటాడు. విచిత్రంగా. ఇక  తల్లీ కూతుళ్ళనే పట్టుకు అడగమన్న ప్రభాకర్ ఇప్పుడొచ్చి లొంగిపోతే ఆంతర్యం ఆలోచించడు కార్తికేయ.  

          13. ప్రభాకర్ ని సైకియాట్రిస్టు విచారిస్తాడు. జయంతిని ప్రేమిస్తున్నానంటాడు ప్రభాకర్. నువ్వు జయంతిని ప్రేమించలేదు, వూహించుకుని చెప్తున్నావని అంటాడు సైకియాట్రిస్టు. ఇతడి మాటలు నిరాధారాలని కార్తికేయకి  చెప్పేస్తాడు.  కేస్ క్లోజ్ అని కార్తికేయకి నాజర్ చెప్పేస్తాడు. కేసుని ఏదో రకంగా కొలిక్కి తేవాలన్నట్టు సైకియాట్రిస్టు ఏదో సర్టిఫికేట్ ఇచ్చేస్తే, అది పట్టుకుని నాజర్ కేసు క్లోజ్ అనడం సిల్లీ. 

          14. హత్య రాత్రి 8 - 9 మధ్య జరిగినట్టు పీఎం రిపోర్టు వుందనీ, ఆ సమయంలో తల్లీ కూతుళ్ళ ఎలిబీలు చెక్ చేశాననీ, వాళ్ళు ఇంటి దగ్గరే వున్నారనీ, 8.30 కి వాటర్ బాయ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు చూశాడనీ, ఆ తర్వాత వాళ్ళు చంపి శవాన్ని తీసి కెళ్ళి బీచ్ రోడ్డులో పడేసి తగులబెట్టారనుకున్నా, 9 గంటలకి బీచ్ రోడ్డులో మంటని చూసినట్టు సాక్షి చెప్పినప్పుడు - అంత స్వల్ప వ్యవధిలో తల్లీ కూతుళ్ళు శవాన్ని తీసుకుని బీచ్ రోడ్డుకి చేరుకోవడం అసాధ్యమనీ, కనుక వాళ్ళని అనుమానించ లేమనీ వివరిస్తాడు నాజర్. తల్లీ కూతుళ్ళే చంపి వుంటే,  వంశీనే బీచ్ రోడ్డుకి రప్పించి చంపి వుంటారని ఇప్పటికీ ఎందుకను కోడు? వాళ్ళు  ఫ్లాట్ లోనే చంపారని ఇప్పుడు కార్తికేయ ఊహాగానం చేసినందుకా? ఆ ఊహాగానానికి సాక్ష్యా ధారాలేమున్నాయి? సాక్ష్యాధారాలకోసం కనీసం ఆ ఫ్లాట్ ని సీజ్ కూడా చేయలేదు. కేవలం డోర్ చైను, గ్రానైట్ దిమ్మె - ఈ రెండూ హత్య జరిగిందనేందుకు నిదర్శనా లవుతాయా? 

        15. కార్తికేయ జిల్లా వార్తల్లో ఒక కేసు చూస్తాడు – 4 వ తేదీ నదిలో కొట్టుకు వచ్చిన మంత్రి తమ్ముడు వంశీ శవం గురించి. ఆ శవాన్ని ప్రభాకరే  నదిలో పడేశాడనీ, అది పక్క జిల్లాకి కొట్టుకు పోయి దొరికితే అది జిల్లా వార్త అవుతుంది తప్పితే ప్రముఖ వార్త అవదని అనుకున్నాడనీ అంటాడు.  అసలు మంత్రి తమ్ముడి  శవం దొరికితే అప్రధాన వార్త అవుతుందా? జిల్లా ఎడిషన్ లో వేసి వదిలేస్తారా? ఐపీఎస్ ఇలాగే ఆలోచిస్తాడా? పైగా ఈ సీను ఎంత నిర్లక్ష్యంగా తీశారంటే. అతను చదివేది జిల్లా ఎడిషన్ కూడా కాదు. ‘ఈనాడు’ మెయిన్ ఎడిషన్. ఇది కూడా ఊహాగానమే. ప్రభాకరే  శవాన్ని నదిలో పడేశాడనడానికి ఏ సాక్ష్యాధారమూ లేదు. 

          ఇలా ఇన్ని పొసగని విషయాలతో ఈ హత్యా దర్యాప్తు కథ వుంది. నాన్ లీనియర్ గా ముక్కలు చేసి చూపించడంతో లొసుగులు తెలియడం లేదు. ఇక నాన్ లీనియర్ కథా కమామిషు చూద్దాం...

సికిందర్