రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 24, 2019

844 :సందేహాలు - సమాధానాలు


Q:  మీరు బ్లాగ్ లో డిక్టేటర్’ మూవీ స్క్రీన్ ప్లే సంగతులు రాస్తూ, ఈక్వలైజర్’ సినిమా గురించి ప్రస్తావించారు. ‘ఈక్వలైజర్’  ఏమంత గొప్ప సినిమా కాదనీ, పాత్రతో, కథతో దాని బలహీనతలు దానికున్నాయనీ రాశారు. వాటి గురించి ఒక్కసారి విపులంగా వివరిస్తారా?
అశోక్ పొడపాటి, Asso. Dir.
A: 'డిక్టేటర్’ స్క్రీన్ ప్లే సంగతుల్లోనే ‘ఈక్వలైజర్’ గురించి ఇలా వుంది : ఈ క్యారెక్టర్ గతాన్ని చెప్పడం కోసం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళలేదు. పొడిపొడి మాటల్లో అతడిచేతే చెప్పిస్తారు. దీనివల్ల ఓ వెలితి వెన్నాడుతూంటుంది మనల్ని. గతంలో ఉద్యోగ రీత్యా అతను చేసిన పాపాలేమిటో  దృశ్య రూపంలో ప్రత్యక్షంగా చూపించి వుంటేఇప్పుడు అతను  చేసుకుంటున్న ప్రాయశ్చిత్తానికి మనకి ఎనలేని సానుభూతి కలిగే అవకాశం వుంది. కానీ ఈ పాత్ర గురించి ఏమీ చెప్పకూడదని నిర్ణయించామని రచయిత రిచర్డ్ వెంక్ వింతగా చెప్పాడు. ఇది టిపికల్ యాక్టర్ మూవీ కాదనీ, అతను సూపర్ హీరో కూడా కాదనీ, కానీ  ఏది తప్పో ఏది ఒప్పో అంతరాత్మకి తెలిసిన వాడనీ చెప్పుకొచ్చాడు. ఇది ఎంత వరకు కరెక్టో గానీ,  గతంలో 2005 లో రాం గోపాల్ వర్మ నిర్మించిన జేమ్స్అనే యాక్షన్ సినిమాలో కూడా హీరో ఎవరో, ఎక్కడ్నించీ వచ్చాడో, ఏమీ చెప్పకుండా నానా యాక్షన్ హంగామా చేయించారు. ఈ అట్ట ముక్క పాత్ర చూళ్లేక మొహం చాటేశారు ప్రేక్షకులు.
                పోతే, ‘ఈక్వలైజర్’  మిడిల్ ఒక దశ దాటాక డొల్లగా మారడమూ జరుగుతుంది. సాగుతున్న కొద్దీ కథ విస్తరించకుండా, కొత్త విషయాలు బయటపడకుండాఅదే హీరో- అదే మాఫియాతో  ఫ్లాట్ యాక్షన్ గా వెళ్లి ముగుస్తుంది.

          దీంతో మీ సందేహాలు తీరే వుంటాయి. పాత్ర ఇప్పుడు కథలో పాల్పడుతున్న చర్యలకి మూలాలు గతంలో వుంటే, అది డైలాగ్స్ తో చెప్పేకన్నా విజువల్స్ లో చూపిస్తేనే  అప్పటి ఎమోషన్స్ బలంగా ప్రేక్షకుల్లో నాటుకుంటాయి. పాత్ర చెప్తే విన్నప్పటికన్నా ప్రేక్షకులకి కళ్ళారా చూపిస్తే  వుండే ప్రభావం వేరు. పాత్ర గతాన్ని కథ మధ్యలో రివీల్ చేయాల్సి వచ్చినప్పటి సంగతి ఇది. కథ చివరివరకూ అట్టి పెట్టుకుని రివీల్ చేస్తే, విజువల్స్ తో చెప్పాల్సిన అవసరం లేదు, డైలాగ్స్ తో చెప్తేనే ఎఫెక్టివ్ గా, షాకింగ్ గా వుంటుంది. విజువల్స్ వల్ల ఇక్కడి ఫినిషింగ్ టచ్ డ్రామా డైల్యూట్  అయిపోతుంది. ఇందుకుదాహరణగా  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ వుంది. ఇదే ‘ఈక్వలైజర్’ హీరో డెంజిల్ వాషింగ్టన్ తో, ఇదే దర్శకుడు అంటాయిన్ ఫుఖ్వా తీసిన రీమేక్ ఇది. ఇందులో ఎక్కడ్నించో వచ్చిన కౌబాయ్ హీరో డెంజిల్ వాషింగ్టన్, ఎందుకు ఒక వూరిని కాపాడడానికి పోరాడుతున్నాడో అర్ధంగాక అసంతృప్తి కల్గిస్తుంది. అప్పుడు చివర్లో విలన్ని చంపుతూ - నా మదర్ నీ, సిస్టర్స్ నీ చంపింది నువ్వు కదరా - అని రివీల్ చేస్తాడు. ఈ రహస్యం ఇప్పుడు ముగింపులో చెప్పడం వల్ల పాత్ర పట్ల వున్న సందేహాలన్నీ తీరిపోయి, సానుభూతి ఏర్పడుతుంది. ఇదే కథ కత మధ్యలో చెప్పివుంటే, ఈమూవీ రొటీన్ రివెంజి డ్రామాగా తెలిసిపోయి తేలిపోయేది. ఏదైతే బలహీనంగా వుంటుందో దాన్ని ముగింపులో చెప్పడం వల్ల బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ చెప్పాలి, చూపించకూడదు. ఇది అకిరా కురసావా టెక్నిక్.  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ రెండు రీమేకులకీ మూలం కురసావా తీసిన ‘సెవెన్ సమురాయ్’.  

      ఇక కథా పరంగా వున్న బలహీనతేమిటంటే, తమ ఏజెంట్ ని చంపినందుకు, రష్యన్ మాఫియా హీరో మీద ప్రతీకార దాడులకి దిగడం, దీన్ని హీరో ఎదుర్కోవడమనే  యాక్షన్ తో సాగడం. కేవలం దాడులు ప్రతి దాడులల్ని  రెండు గంటల సినిమాగా చూడాల్సి రావడం. మళ్ళీ దీనికి విరుగుడు ఈ దర్శకుడు ఫుఖ్వానే, రచయిత రిచర్డ్ వెంక్ నే ‘ఈక్వలైజర్-2’ లో కనిపెట్టారు. రెండు గంటల సినిమాలో కథని ఇరవై నిమిషాలకే కుదించేశారు. గంట నిడివి అంతా కథతో సంబంధం లేని కొన్ని సబ్ ప్లాట్స్ తో,  కొందరి పట్ల హీరో డెంజిల్ వాషింగ్టన్ సేవాగుణం చూపించారు. ఇక మిగిలిన 40 నిమిషాలు క్లయిమాక్స్ చూపించారు!

        ఇంటర్వెల్ కి పది నిమిషాల ముందు, హీరో మాజీ కొలీగ్ ని మాఫియాలు హత్య చేయడంతో ప్లాట్ పాయింట్ వన్ వేశారు. ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకి మఫియాలని పిలిచి -మీరు చావడనికి సిద్ధంగా వుండండి  - అని హీరోతో చెప్పించి, ప్లాట్ పాయింట్ టూ వేసేశారు. అంతే, ఇక నస పెట్టకుండా చంపడాలతో క్లయిమాక్స్ మొదలేట్టేశారు.

        సెకండాఫ్ పదినిమిషాలకే ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి, క్లయిమాక్స్ మొదలయ్యే  సినిమా ఎక్కడైనా వుందా? ఇక్కడుంది. నస పెట్టే రొటీన్ రివెంజి కథని రెండు గంటల సేపు ఈ కాలంలో చూపించలేమని ఇలా చేశారు. కథని బాగా కుదించి, కథతో సంబంధం లేని పాత్రలతో, వాటి ఉపకథలతో భర్తీ చేశారు. ఇంటర్వెల్ కి పదినిమిషాల ముందు ప్లాట్ పాయింట్ వన్ - ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకే ప్లాట్ పాయింట్ టూ - ఈ రెండిటి మధ్య ఇరవై నిమిషాలే మిడిల్. సినిమాలో యాభై శాతం వుండాల్సిన మిడిల్ ఇక్కడ నామమాత్రంగా వుండిపోయింది. ఈ ఇరవై నిమిషాల్లోనే కాసింత కథ. రివెంజి అని తెలిసిపోయాక ఇంకా కథెవరు చూస్తారు - అందుకే ఇరవై నిమిషాల్లోనే వేస్టు కథ ముగించి పారేసి క్లయిమాక్స్ కెళ్ళి పోయారు. ఈ క్లయిమాక్స్ 40 నిముషాలూ ఏక బిగి యాక్షన్ తో చాలా క్రేజీగా వుంటుంది. అదీ వర్ష బీభత్సంతో.
        క్లయిమాక్స్ పూర్తయాక సబ్ ప్లాట్ తో ముగించారు. అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన అన్నా చెల్లెళ్ళని హీరో కలపడం ద్వారా. ఈ సబ్ ప్లాట్స్ వల్లే హీరో ఉన్నతంగా కన్పిస్తాడు. కొన్ని రోజుల పాటు ఈ పాత్రలో డెంజిల్ వాషింగ్టన్ ని మర్చిపోలేం.

        అంటే,  కథాబలం లేని సినిమాలకి ఇదొక మోడల్ అన్న మాట. ఉపకథలతో, సెకండాఫ్ లో వెంటనే మొదలయ్యే క్లయిమాక్సుతో, బోరు కొట్టే కథనుంచి ఇలా తప్పించుకోవడమన్నమాట. వద్దన్నా ఇంకా ఎండ్ సస్పన్స్ లు, మిడిల్ మటాషులు తీస్తూ తీరా షాకిచ్చే ఫలితాల్ని చూసుకునే కన్నా, ఈ ప్రయోగం బెటరే.  

Q:  నేనింకా రైటర్ గా స్థిరపడలేదు. నాకొచ్చే సమస్యేమిటంటే రెమ్యునరేషన్ ఎంత అడగాలో అర్థం గావడం లేదు. ఎంత అడిగితే ఎక్కువన్పించి పొమ్మంటారో, ఎంత అడిగితే తక్కువై ఇబ్బంది పడతానో అర్ధం గావడం లేదు. స్ట్రగుల్ చేస్తున్న నాలాటి వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని రెమ్యునరేషన్ అడగాలి?
వినోద్, రైటర్ (పేరు మార్పు)
A: ఇలాటివి చెప్పడం కష్టం. సొంత జీవితంలోనే రైటర్ కి అర్ధంగాకపోతే, కథలేం రాస్తారు, పాత్రల చేత ఏం ప్రవర్తింపజేస్తారు, కదా? కాబట్టి రైటర్స్ సొంత ప్రాబ్లమ్స్ చెప్పుకోకుండా జాగ్రత్త పడితేనే బావుంటుంది. రచనల గురించి, కథల గురించి సందేహాలు అడిగితే వ్యక్తిత్వం పోదు. అడిగారు కాబట్టి చెప్పుకుందాం. రెమ్యునరేషన్ తీసుకునే మెట్టెక్కాలంటే కింద చాలా మెట్ల మీద ఉచిత సేవ చేయాలి. రెమ్యునరేషన్ తీసుకునే మెట్టెక్కాక ఇచ్చింది తీసుకోవాలి. ఇంకో చోట అవకాశం వస్తే ఇక్కడ తీసుకున్న అంకె అక్కడ చెప్పాలి. ఇదే బేస్. తడుముకోకుండా చెప్పాలి. చెప్పినప్పుడే డీల్ చేస్తున్నట్టు అన్పిస్తుంది. ఆలోచించి మీరే చెప్పండంటే మీరు ఫీలవుతున్నట్టు అన్పిస్తుంది. డీలింగ్స్ లో ఫీలింగ్స్, మొహమాటాలు వుండవు. బేర సారాలే వుంటాయి. ఆ బేస్ మీద ఎక్కువ తక్కువలు మాట్లాడుకోవాలి. ఎంత తీసుకుంటారని అడిగినప్పుడు ఆ అంకె చెప్పాలేగానీ ఎదురు ప్రశ్న వేయకూడదు. మీ మూవీ బడ్జెట్ ఎంతని ప్రశ్నించారో ఇక కట్ అయిపోతారు. తెలిసిన వాళ్ళయినా సరే ఇలా అడక్కూడదు. ఈ చిన్నపొరపాటుతో  కట్ అయిపోయిన వాళ్ళున్నారు. అడ్వాన్సు తీసుకున్నాక,  సబ్జెక్టు మీద కఠినమైన హోం వర్క్ తో మీవంతు కంట్రిబ్యూట్ చేస్తూంటేనే, ఇచ్చిన రూపాయలకి పది రూపాయలు ఎక్కువ వాళ్ళే ఇస్తారు. రెండో సారి పిలుస్తారు. పిలిచినప్పుడు మొదటి సారి ఇచ్చిన దానికి పెంచి ఇవ్వ బుద్ధి కాదు. అదంతే. ఇప్పుడు బయట మీరు ఎక్కువ పొందుతున్నా సరే, ఆ రేంజిలో ఇవ్వబుద్దికాదు. పెంపుదలలు ఇంకో చోటే  చూసుకోవాల్సిందే. ఇక్కడ మానవ సంబంధాలు నిలుపుకోవాలన్పిస్తే ఒప్పుకోవాలి, లేకపోతే గుడ్ బై చెప్పేయాలి...ఇలాటి ప్రశ్నలు అడిగే వాళ్లకి విన్నపమేమిటంటే, ఇలాటి ప్రశ్నలు అడక్కుండా కథల గురించి అడగాలని.

Q: నాది మరో అనుమానం. సీరియస్ కారెక్టర్ బోర్ కొట్టకుండా వుండాలంటే రచయిత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? ముఖ్యంగా హీరో గతం తాలూకు విషాదాన్ని మోస్తున్నప్పుడు, పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా ఎలా నిర్వహించాలి? ‘అరవింద సమేత’, జోష్’ సినిమాల్లో హీరో పాత్రలు ఇబ్బందిని ఎదుర్కొన్నాయి అనిపిస్తుంది. విషయంలో ఈక్వలైజర్’ పాత్ర నుంచి ఏదైనా నేర్చుకోవచ్చా?
అశోక్ పొడపాటి, Asso. Dir.
A: నేటి ఎంటర్ టైన్మెంట్ల కాలంలో సీరియస్ పాత్రలు తట్టుకుని నిలబడాలంటే గంభీరమైన కథ తప్ప మార్గం లేదు. ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ కథలోని గంభీర విషయంతో, పూర్తిగా సీరియస్సే. ‘దీవార్’ తో బాటు ‘శివ’ విషయ గాంభీర్యంతో సీరియస్ నెస్ కి ఒక పధ్ధతి, ఇది లీనియర్ స్ట్రక్చర్ తో. నాన్ లీనియర్ స్ట్రక్చర్ తో ‘ఖైదీ’ ఇంకో పద్దతి. సీరియస్ కథల్లో  లీనియర్ స్ట్రక్చర్ తో బిగినింగ్ విభాగం వరకూ పాత్ర ఎంటర్ టైన్ చేసినా, బిగినింగ్ ముగిసే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర విషాదయుక్త సీరియస్ గోల్ ఏర్పడ్డాక,  ఇంకాతర్వాత  సుదీర్ఘమైన మిడిల్, ఎండ్ విభాగాల్లో  పాత్ర అదే విషాద యుక్త సీరియస్ నెస్ తో వుంటుంది. దీవార్, శివలలో హీరో పాత్రలు బిగినింగ్ విభాగంలో ఎంటర్ టైన్ కూడా చెయ్యవు, పైగా తక్కువ మాట్లాడతాయి. అయినా ఇవి సక్సెస్ అయ్యాయి.

          ఇందుకే సిడ్ ఫీల్డ్ అంటాడు - పాత్ర అనుకుంటున్నప్పుడు ముందుగా దాని దృక్పథాన్ని నిర్ణయించాలని. ప్రపంచం పట్ల పాత్ర దృక్పథమేమిటి? ఏ భావజాలంతో పాత్ర వుంది? ఇది లేకుండా పాత్ర కథా ప్రపంచంలోకి అడుగు పెట్టజాలదు. మనందరికీ ప్రపంచాన్ని చూసే విధానంతో ఒక దృక్పథం వుండి తీరుతుంది. ఆ దృక్పథం ఏదైనా కానీ అదుంటే తమలాగే ఇది వుందన్న భావం ప్రేక్షకులకి ఏర్పడుతుంది. ప్రేక్షకులతో కనెక్ట్ చేయడానికి మొట్టమొదటి ఎలిమెంట్ పాత్ర దృక్పథం. ఈ దృక్పథమన్నది మామూలు విషయం కాదు. మొత్తం కథే ఈ దృక్పథాన్ని బట్టి కథనం మార్చుకుంటుంది. అప్పుడిక ప్రేక్షకులు కట్టేసినట్టు కూర్చుంటారు. ఉన్నట్టుండి కథ గంభీరమై పోతుంది. ఆ గాంభీర్యం పాత్ర దృక్పథంలోంచి వస్తుందే తప్ప, ఎన్ని రక్తాలు పారించినా రాదు.

          ఈ మధ్య ఒక కథతో ఇదే సమస్య వచ్చింది. కథ చూస్తే  అనేక పొరలుగా, అనేక పాయలుగా గంభీరమైనది. దీన్ని వినోదాత్మకంగా చెప్పాలి. హీరో తనకో విషాద నేపథ్యముందని తర్వాత తెలుసుకుంటాడు. దీని కంటే ముందు ఒక గోల్ ఏర్పడి నప్పుడు ఈ ప్రపంచం ఎంజాయ్ చేయడానికే వుందన్న దృక్పథంతో అలాగే ఎంటర్ టైన్ చేస్తూ పోతాడు. అప్పుడు దీంతో వచ్చేసి విషాద నేపథ్యం ఢీకొంటే, దృక్పథం కూడా మారిపోయి-  ఇక ఎంటర్ టైన్  చేసే మాటే లేదు. కానీ ఎంటర్ టైన్ చేయాలి. లేకపోతే దీంట్లో వున్న విషయ గాభీర్యంతో సినిమా నిలబడదు. హిందీలో ప్రకాష్ ఝానే పెద్ద స్టార్స్ తో రిజర్వేషన్ల గంభీర కథ నడపలేక, ఇంటర్వెల్ తర్వాత కార్పొరేట్ కాలేజీల అక్రమాల కథంటూ తెచ్చి అతికించి, చతికిల బడ్డాడు.

          పాత్ర దృక్పథమైతే వుంది, కానీ తర్వాత తెలుసుకున్న విషాద  నేపథ్యంతో ఈ దృక్పథం ఏమవుతుంది? ఇలాగే  కామెడీలు చేస్తూ పోవడమేనా? అప్పుడు బెడిసి కొడుతుంది పాత్ర చిత్రణ. ఎక్కడ జరిగింది తప్పని చూస్తే, పాత్రకి దృక్పథాన్ని ఏర్పర్చేప్పుడు దాని గతం లోకి చూడలేదని అర్ధమైంది. పాత్ర కుటుంబ గతం చూస్తే ఘన కీర్తి, ఇప్పుడు వర్తమానం చూస్తే  వంకాయ. ఈ వంకాయతనం తోనే దృక్పథం ఏర్పాటయ్యింది. ఇందుకే ఇప్పుడు  బయటపడిన విషాద నేపథ్యంతో దృక్పథం కలవడం లేదు. ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలన్న దృక్పథం ఇప్పుడు విషాద నేపథ్యంతో కూడా ఎంజాయ్ చేస్తూ సంఘర్షించలేదు. అందుకని తన లోని వంకాయతనానికి- అంటే ఫన్నీ పార్టుకి-  ఇప్పుడు శాడిజాన్ని జోడించి పీడిస్తూ ప్రతీకారం తీర్చుకుంటే, విషాద నేపథ్యానికి న్యాయం జరగడమే గాక, ఎంటర్  టైన్మెంట్ ఏ ఇబ్బందీ లేకుండా కంటిన్యూ అవుతుంది.

          ఇంకో యాంగిల్లో చూస్తే, పాత్ర గత ఘన కీర్తి ప్రకారం వాళ్ళది శాసించే కుటుంబం. అప్పుడు తనకి తెలియకుండానే ఆ జీన్స్ వల్ల మొదట ఆదేశిస్తాడు, పని జరక్కపోతే ఫన్నీగా మారి ఆకర్షిస్తాడు. ఈ ద్వంద్వాలు ప్రదర్శిస్తాడు. అప్పుడు విషాద నేపధ్యం బయట పడ్డాక, తన లోని శాసించే గుణం ఎక్కడ్నుంచి వచ్చిందో అర్థమయ్యాక, ఇక దానికి మసాలా జోడించి  శాడిస్టిక్ వినోదానికి పాల్పడతాడు.

          సీరియస్ కథలతో ఎప్పుడూ సమస్యే. సినిమా అనే వినోద సాధనానికి వ్యతిరేకంగా పోవడం. ఇదంతా లీనియర్ కథల విషయంలో. నాన్ లీనియర్ తో సమస్య రాదు. ‘ఖైదీ’ లాంటి నాన్ లీనియర్ ని చూస్తే, చిరంజీవి ప్రేమా పాటలూ సరదాలూ ఇవి బిగినింగ్. రావు గోపాలరావుతో ఘర్షణ మిడిల్, విజయం ఎండ్. దీన్ని సినిమాలో ఇలా చూపించారు - మిడిల్ తో ప్రారంభించి, బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ చేసి చూపించి, ఎండ్ తో ముగించారు. అంటే సీరియస్ గా  వుంటున్న మిడిల్, ఎండ్ ల మధ్య ఎంటర్ టైన్ చేస్తున్న బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాకుగా చూపించడం. దీంతో బోరుకొట్ట కుండా ఏకబిగి సీరియస్ నెస్ సడలింది.

        ఇక సీరియస్ కథ సీరియస్ నెస్ తగ్గించాలంటే, పై ప్రశ్నకి చెప్పుకున్నట్టు, ‘ఈక్వలైజర్ -2’ మార్గం ప్రయత్నించడం. అంటే సీరియస్ కథని వీలైనంత తగ్గించి, ఉప కథలతో అర్ధవంతంగా నడిపి, సీరియస్ కథకి క్లయిమాక్స్ ని బారెడు చేయడం. 
          ఇలా లీనియర్ గా క్యారక్టర్ తో, నాన్ లీనియర్ గా స్ట్రక్చర్ తో, స్ట్రక్చర్ తో క్రియేటివిటీతో, సీరియస్ పాత్ర బోరు కొట్టకుండా చేయవచ్చు. 

Q:  నా ప్రశ్నలు ఏమిటంటే, 1. ‘ఏజెంట్ ఆత్రేయ’ సినిమా హిట్ అని అందరూ దాన్ని బాగా పొగుడుతున్నారు. కానీ మీరు మాత్రం సినిమా ఎవరేజి అంటూ 2.5 రేటింగ్ ఇస్తూ, ఎండ్ సస్పెన్స్ చేశారనీ, క్యారక్టర్ కొత్తగా ఏం ట్రై చేయకుండా అదే మూస పద్ధతిలో వెళ్ళారనీ రాశారు. సినిమాకి జనాల ఆదరణ లభించింది. మిగతా క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వచ్చాయి. ఒక వెబ్సైట్  వాళ్ళు అయితే సినిమాకి సీక్వెల్స్ లేదా సిరీస్ చేసుకోవచ్చనీ సలహా కూడా ఇచ్చారు. స్ట్రక్చర్ లో లేకుండా మూవీస్ హిట్టవుతున్నాయి, మీరేమో స్ట్రక్చర్  అంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది,  2. ‘ఏజెంట్ ఆత్రేయ’ స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు. 3. ఇతర భాషల మూవీస్ విశ్లేషణ అడిగాము, రాస్తానన్నారు. కానీ ఇంకా ఏదీ రాయడం లేదు, 4. బ్లాగ్ లో వారం వారం ప్రశ్నల కోసం ఒక రోజు కేటాయించండి. దీని వల్ల ప్రతీ వారంమా ప్రశ్నలకి  సమాధానాలు ఆశించే వీలవుతుంది. 
రవి, AD
A: ముందు ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. ఇదీ పరిస్థితి. ‘ఏజెంట్ ఆత్రేయ’ ఎవరేజిగా బయటపడుతుంది, అంత హిట్టేమీ కాదు. ఈ డిటెక్టివ్ పాత్ర దాని డ్రెస్ తో సహా ఏనాటిదో పాత మూసలోనే వుంది. ఎండ్ సస్పెన్స్ వున్నా సినిమా ఆడుతుందని మీకు నమ్మకమైతే అలాగే తీయండి. కానీ అసలు ఎండ్ సస్పెన్స్ అంటే ఏమిటో తెలుసా? ఈ సినిమాలో ఎండ్ సస్పెన్స్ విప్పుతూ డిటెక్టివ్ చెప్పే ప్రసంగ పాఠం మీకేమైనా అర్థమైందా? ఇది నవలలకి పనికొచ్చే ప్రక్రియ. సినిమాల్లో దీంతో ఎదురవుతున్న బాక్సాఫీసు ప్రమాదాల్ని  హలీవుడ్ ఏనాడో గుర్తించి, సీన్ టు సీన్ సస్పెన్స్ గా మార్చుకుంది. ఈ విషయం బ్లాగులో వంద సార్లు రాశాం. అయినా తప్పుబడుతున్నారంటే, ఏది ఒప్పో మీరే చెప్పాలి. ఎండ్ సస్పెన్స్ తో వచ్చిన తెలుగు సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి, రవితేజతో తీసిన ‘బెంగాల్ టైగర్’ సహా. ఈ విషయం తెలుసా? 

          ఇక ఇలాటి ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలు కూడా సాహిత్యంలో, సినిమాల్లో లేవెక్కడా. 40 ఏళ్ల క్రితమే వాస్తవికతతో ప్రజలందరికీ తెలిసిన పోలీస్ డిటెక్టివ్ పాత్రలు వచ్చేశాయి! తెలుగులో నైతే యాక్షన్ ఓరియెంటెడ్ మధుబాబు ‘షాడో’ వచ్చేశాడు. అప్పుడే తెలుగు డిటెక్టివ్ సాహిత్యం కనుమరుగైంది. ఈ మొత్తం సబ్జెక్టు గురించి చెప్పుకోవాలంటే చాలా వుంటుంది.

         
స్ట్రక్చర్ లో లేకుండా మూవీస్ హిట్టవుతున్నాయా? ఎన్ని హిట్టవుతున్నాయి? ప్రతీ ఏటా 90 శాతం సినిమాలు స్ట్రక్చర్ వల్లే అట్టర్ ఫ్లాపవుతున్నాయా? అయితే వెంటనే ఫిలిం ఇనిస్టిట్యూట్స్ కెళ్ళి, మీరు స్ట్రక్చర్ నేర్పుతూంటే 90 శాతం సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయని ఆ కోర్సులు ఆపించాలి. ఈ బ్లాగు చదవడం మానెయ్యాలి. స్ట్రక్చర్ లో వుండే హాలీవుడ్, కొరియన్ సినిమాలూ చూడ్డం మానెయ్యాలి. స్ట్రక్చర్ వుండని వరల్డ్ మూవీస్ చూస్తూ, అలా సినిమాలు తీస్తూ, అట్టర్ ఫ్లాపుల పర్మనెంట్ శాతాన్ని  సదా కాపాడాలిలాగే.

          ఇక చివరి ప్రశ్నలకి- ‘ఏజెంట్ ఆత్రేయ’ స్క్రీన్ ప్లే సంగతులకి అవకాశం లేదు. ఎండ్ సస్పెన్స్ తో ఎక్కడెక్కడి క్లూలు ఎక్కడెక్కడ కలిపి ఊహాగానం చేస్తున్నాడో, ఆ తేదీలు, అనుమానితులు, స్థలాలకి ఎలా సంబంధాలు కలుపుతూ ప్రసంగిస్తున్నాడో, మెదడుకెక్కడం కష్టం. కష్టపడి రాసి ఇలా తీయొచ్చని కూడా చెప్పదల్చుకోలేదు.

          ఇతర భాషల సినిమాల గురించి రాసేంత టైము దొరకడంలేదు. దొరికినప్పుడు రాద్దాం. ఇక వారం వారం ప్రశ్నలూ సమాధానాల గురించి. ప్రశ్నలే రాకపోతే ప్రతీవారం శీర్షిక ఏముంటుంది. అప్పుడప్పుడు వచ్చిన ప్రశ్నల్ని కూడేసి ఒకసారి ఇస్తున్నాం. దీంతో అత్యవసరంగా సమాధానం ఆశించే వారు నిరీక్షించాల్సి వస్తోంది.

సికిందర్