రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, అక్టోబర్ 2018, సోమవారం

693 : స్క్రీన్ ప్లే సంగతులు


        దొంగ రాముడు దొంగతనాలు అలవాటైన వృత్తి దొంగేమీ కాదు. ఎంతో తప్పనిసరై జీవితంలో రెండే సార్లు దొంగతనం చేస్తాడు. మామూలుగా చిన్నప్పట్నుంచీ కట్టుకథలు చెప్పి పబ్బం గడుపుకునే రకం. ఈ కట్టు కథలు వినేవాళ్ళ దృష్టిలో గొప్ప హీరోని చేస్తాయి. దీపావళికి టపాకాయలకి తల్లి దగ్గర అర్ధరూపాయి అడుక్కుని, దాన్ని ఐదు రూపాయలు చేసి బోల్డన్ని టపాకాయలు కొనుక్కు వస్తానని చెల్లెలికి చెప్పేసి, స్కూలెగ్గొట్టి టౌను కెళ్ళిపోతాడు. టౌనులో జూదమాడి అర్ధరూపాయిని ఐదు రూపాయలు చేసుకుని, సంచీ నిండా టపాకాయలతో సాయంత్రం ఇంటి కొచ్చేసరికి, ఇంటి దగ్గర బెత్తం పుచ్చుకుని పంతులు రెడీగా వుంటాడు. వెంటనే దొంగరాముడు తన ఎవర్రెడీ బాణం విసురుతాడు- టౌన్లో ఇళ్ళు తగలబడ్డాయనీ, మంటల్లోకి దూకి ఒక ఆవు దూడని కాపాడేననీ, దాంతో చైర్మన్ గారు బోలెడు టపాకాయలూ మిఠాయిలూ కొనిపెట్టారనీ చెప్పిపారేస్తాడు. కొడదామనుకున్న పంతులు కాస్తా వాడి హీరోయిజాన్ని నమ్మేసి విస్తుపోతాడు. 

         
దొంగరాముడు చెల్లెలితో కలిసి స్కూలుకెళ్తాడు. స్కూలుకొస్తే సాయంత్రం ఇంటి కెళ్ళేప్పుడు వాడి కాలికి సంకెళ్లేసి బండ కడతాడు పంతులు. ఆ బండ నెత్తిమీద మోస్తూ తిన్నగా ఇంటికే వెళ్ళాలి వాడు. అడ్డమైన తిరుగుళ్ళూ తిరగడానికి లేదు. తల్లి గుండె జబ్బు మనిషి. ఏ పనీ చేతగాదు. ఇల్లు గడవడానికి సామాన్లు అమ్మేస్తూంటుంది. ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోతుంది. డాక్టర్ అర్జెంటుగా తెమ్మని మందులు రాసిస్తాడు. ఆ మందులు కొనడానికి రెండు రూపాయలు అడుక్కుంటే, వాడి సంగతి తెలిసిన వాళ్ళెవరూ వాడి మాటలు నమ్మి సాయం చేయరు. దాంతో దొంగతనం చేసేస్తాడు. ఆ మందులతో ఇంటికి వచ్చేలోగా పోలీసులు పట్టుకుంటారు. ఇంటి దగ్గర తల్లి చనిపోతుంది. చెల్లెలు అనాధ అవుతుంది.

          ఈ బాల్య కథ సుదీర్ఘంగా 25 నిమిషాలుంటుంది. ఇందులో అన్నాచెల్లెల అనుబంధం చూపిస్తూ ఒక పాట కూడా వుంటుంది. ఈ బాల్య కథలో ముందు ముందు కథ కవసరమైన దొంగరాముడి పాత్ర తీరుతెన్నులతో పాటు, చెల్లెలి పట్ల బాధ్యత చూపించారు. ఈ బాల్య కథని ముగింపుకి తేవడానికి తల్లికి గుండె జబ్బున్నట్టు చిత్రించారు. తల్లి చనిపోవడం, మందుల కోసం దొంగతనం చేసి దొంగరాముడు పోలీసులకి చిక్కడంతో ఈ బాల్య కథ ముగుస్తుంది. ఈ ముగింపు రెండు ప్రశ్నల్ని లేవనెత్తుతుంది : తల్లి చనిపోయిందనీ, దాంతో చెల్లెలు అనాధ అయ్యిందనీ దొంగరాముడికి ఎప్పుడు తెలుస్తుంది? తెలుసుకుని ఏం  చేస్తాడు?... అన్నవి. 

          ఇందులో దొంగ రాముడు పెద్దయ్యాక ప్రేమకథకి పనికొచ్చే పునాదులెక్కడా వేయలేదు. ఓ దేవాదా ...అనే పాటతో అప్పటికే ‘దేవదాసు’ లో చిన్నప్పట్టి దేవదాసు - పార్వతిల ప్రేమ కథ, ఇదే అక్కినేని – సావిత్రిలతో తాజాగా వుండనే వుంది. మళ్ళీ దాన్నేఇక్కడా చూపించలేరు. పైగా దొంగరాముడు సినిమా ప్రేమకథ కాదనీ, అన్నా చెల్లెల ప్రేమ కథనీ ఈ బాల్య కథతో పొరపాటు లేకుండా చెప్పేశారు. కథ ఏ నేపధ్యంలో సాగుతుందో చెప్పేసి అందుకనుగుణంగా ప్రేక్షకుల్ని సిద్ధం చేసేశారు. నిజానికి స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగపు ప్రథమ కర్తవ్యం ఇదేనని స్ట్రక్చర్ గురించి అవగాహన వున్న మనకి తెలిసిందే.

          తల్లికి మందుల కోసం దొంగతనం చేయడమనే సన్నివేశం ఈ సినిమా తర్వాత కూడా ఒక ఫార్ములా టెంప్లెట్ లా గా అనేక సినిమాల్లో కొనసాగిందే. తమిళ,  హిందీ సహా. అయితే మందులు కొనడానికి ఎవరూ సాయం చేయలేదని సమాజం మీద కక్ష పెంచుకునే అవకాశం లేదు దొంగరాముడుకి. యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలు తయారుకావడానికి దీని తర్వాత ఇంకో రెండు దశాబ్దాల సమయముంది. అప్పటికి సమాజం అవినీతిమయమై హీరో నీతిపరుడయ్యాడు. కాబట్టి తిరగబడ్డం మొదలెట్టాడు. దొంగరాముడు నాటికి దొంగరాముడే అవినీతి పరుడు. అంటే యాంటీ హీరో. తన అలవాట్లతో తనకి తానే యాంటీ అయ్యాడు, ఇంకో విలన్ అవసరం లేకుండా. వూళ్ళో చెడ్డ పేరు తెచ్చుకుని నమ్మకం పోగొట్టుకున్నాడు. అందుకే మందులు కొనాలని నిజం చెప్పినా ఎవరూ నమ్మ లేదు. అంటే ఈ బాల్య కథ ముగింపు దొంగరాముడ్ని చిన్నతనంలోనే ఒక జీవితపు చౌరస్తాకి చేర్చిందన్న మాట. 

          తల్లి మరణంతో ఈ చౌరస్తాలో ఏం నేర్చుకుని ఎటు వెళ్ళాలి తను? ముందుగా అబద్ధాలతో మాయలు చేయడం మానెయ్యాలి, మంచివాడుగా పరివర్తన చెంది చెల్లెల్ని చూసుకోవాలి...పాత్ర ఈ కూడలికి చేరుకున్నాక, ఈ క్యారెక్టర్ ఆర్క్ తోనే తర్వాతి కథ ముందుకు నడవాలన్న మాట. అంటే ఏమిటర్ధం? ఈ మలుపు ఈ మొత్తం స్క్రీన్ ప్లేకే ఒక ప్లాట్ పాయింట్ వన్ అనే కదా?

***
        దొంగరాముడు స్క్రీన్ ప్లేకి కథని ప్రారంభించే విషయంలో అర్ధం జేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే,  ఈ చిన్నప్పటి కథని తర్వాత హీరో పెద్దయ్యాక చూపించే కేవలం పాత్రచిత్రణ కోసం ఉద్దేశించలేదు, పక్కాగా కథా ప్రారంభం కోసమే ఉపయోగించారు. గంటంపావు ఫస్టాఫ్ కథంతా నడిపే కష్టమంతా లేకుండా, ఓ అరగంట సేపు చిన్నప్పటి సోసో ముచ్చట్లతో కాలక్షేపంగా భర్తీ చేసేద్దామనుకోలేదు. అలా అనుకుని వుంటే ఇప్పుడొస్తున్న ఎన్నో సినిమాల్లాగా డొల్లగా తయారయ్యేది ఫస్టాఫ్. ఇప్పుడొస్తున్న ఇలాటి సినిమాలేమిటి? చిన్ననాటి అచ్చిబుచ్చి ముచ్చట్లతో కాలక్షేపం చేసి, తర్వాతెప్పుడో  పెద్దయ్యాక కథ ప్రారంభించి చేతులు దులుపుకోవడమేగా? 

          ఈ పరుగులెత్తే గ్లోబల్ యుగంలో కూడా హీరో లేదా హీరో హీరోయిన్ల చిన్ననాటి ముచ్చట్లతో సినిమాలు ముసలితనంగా ప్రారంభించడమే ఒక చైల్డిష్ పని. స్పూన్ ఫీడింగ్ కూడా. చైల్డ్ ఆర్టిస్టులతో ఇప్పుడింకా ఈ చిన్నప్పటి కథలు చూపించడమే ఫూలిష్ నెస్. సినిమాల్ని పోషిస్తున్న యువప్రేక్షకులు తీరిగ్గా కూర్చుని బాలనటుల్నిచూడాలనుకుంటారా, లేక స్క్రీన్ మీద వెంటనే తమ అభిమాన స్టార్స్ ని చూడాలనుకుంటారా?  ఏది యూత్ అప్పీల్? ఏది మార్కెట్ యాస్పెక్ట్? ఈ మేకింగ్ స్పృహే లేకుండా స్టార్స్ ని పక్కన పడేసి, బాల నటుల్ని ఎత్తుకుని చూపిస్తూ, బచ్కానా దృశ్యాలతో తమ తృప్తి ఏదో తాము తీర్చుకుంటున్నారు దర్శకులు. 

          ఈ తీర్చుకోవడంలో కథాపరంగా ఏ ప్రయోజనమూ వుండదు. కేవలం పాత్ర పరంగానే తృప్తి తీర్చుకోవడం. అదెలాగంటే, చిన్నప్పుడు హీరో ఇంత తెలివిమంతుడనో, లేదా చిన్నప్పట్నుంచీ హీరో ఇంత బద్ధకస్థుడనో, ఇంకా లేదా చిన్నప్పుడే ‘ప్రేమించుకున్న’ హీరోహీరోయిన్లు విడిపోయారనో ...లాంటి కేవలం క్యారెక్టర్ ని లేదా అచ్చిబుచ్చి ప్రేమల్ని ఎస్టాబ్లిష్ చేసే బాల్య చేష్టలు చూపించడం వరకే చేస్తారు. స్క్రీన్ ప్లేలో ఇది ఏ విభాగానికి చెందుతుందంటే, ఏ విభాగానికీ చెందదు. ఎందుకంటే, బిగినింగ్ విభాగానికి చెందాలంటే దీంట్లోకథా నేపధ్యపు ఏర్పాటు, పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్యా స్థాపన అంటే ప్లాట్ పాయింట్ వన్ అనే నాల్గు టూల్స్ వుండాలి. తద్వారా ఆ ప్రధాన పాత్రకి ఒక గోల్ అంటూ ఏర్పడి కథా ప్రారంభమవాలి. ఇవన్నీ నేటి సినిమాల్లో చూపిస్తున్న బాల్య సంగతుల్లో వుంటున్నాయా?  

          కనుక ఈ బాల్య సంగతులిలా బిగినింగ్ విభాగపు బిజినెస్ నే ప్రదర్శించకుండా పోయాక – ఇక మిడిల్, ఎండ్ విభాగాల ప్రసక్తెక్కడిది? మరి స్క్రీన్ ప్లేలో ఈ బాల్యపు ముక్కని ఎలా పరిగణించాలి? దీన్ని జస్ట్ స్క్రీన్ ప్లేలోకి అనధికారిక చొరబాటు మాత్రంగానే పరిగణించాలి. ఈ ముక్క లేకపోయినా సినిమాకే నష్టం రాదు. ఏ రసాత్మక విలువనీ తగ్గించదు. ఎలాగంటే,  చిన్నప్పట్నించే వీడిలాటి వాడని చెప్పడానికే తప్ప ఇది పాత్రని పరిచయం చెయ్యదు. తర్వాత హీరో పెద్దయ్యాక ఇంకేదో చేస్తూ పరిచయమవుతాడు. అప్పుడే కథా నేపధ్యం ఏర్పాటవుతుంది, అప్పుడే మిగతా పాత్రలూ పరిచయమవుతాయి, అప్పుడే సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా జరుగుతుంది, అప్పుడే సమస్యా స్థాపనా జరిగి, ప్లాట్ పాయింట్ వన్ తో ఆ హీరో కి గోల్ ఏర్పడుతుంది...

          అంటే హీరో పెద్దయ్యాకే జరిగే బిజినెస్ ఇదంతా కాబట్టి స్క్రీన్ ప్లేలో ఇదే బిగినింగ్ విభాగమవుతుంది. దీనికి ముందు చూపించే  చిన్ననాటి కచాపచ్చా ముచ్చట్లన్నీ ఏ విభాగానికీ చెందని దర్శకుడి / కథకుడి ‘తుత్తి’ తో కూడిన సుత్తి అవుతాయి. ఈ సుత్తితో కూడిన తుత్తికి అరగంట, పోనీ పావుగంటా నిడిపి ప్రొడక్షన్ ఖర్చంతా బడ్జెట్లో నెత్తురు కక్కుకుని బలి అవుతుంది. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల్నీ, జంతువుల్నీ చూపిస్తే పిల్లలు మారాం చేసి పేరెంట్స్ ని వెంటబెట్టుకుని పొలోమని వచ్చేవాళ్ళు. ఇప్పుడే పిల్లకాయ బాల నటులున్నారని వస్తున్నాడు? ‘హలో’ లో అరగంట సేపు అంత అత్యద్భుతంగా బుడ్డోడినీ, బుడ్డిదాన్నీ చూపించినా ఒక్క బచ్చా కూడా అమ్మా బాబుల్ని వెంటబెట్టుకుని ఎగరేసుకుంటూ రాలేదు. పైగా కుర్ర ప్రేక్షకుడేమో  – సినిమా కొస్తే నా క్రేజీ స్టార్ ని చూపించకుండా, ఈ చైల్డ్ ఆర్టిస్టుల గోలేంట్రా సత్తెకాలపు డైరెట్రుకీ అని అప్పుడే సువాసనల జెల్ పట్టించుకుని వచ్చిన జుట్టంతా పీక్కోవడమే. ‘జవాన్’ లో కూడా ఇలాటిదే తుత్తి తీర్చుకుని సినిమాని అందమైన అట్టర్ ఫ్లాప్ గా తీర్చిదిద్దుకున్నారు. ‘మళ్ళీ రావా’ లో బాల నటుడి టాలెంట్ ముందు అసలు హీరో తగ్గిపోయి, బాల నటుడికే పేరొచ్చింది. యూత్ అప్పీలా? స్టార్ తో మార్కెట్ యాస్పెక్టా? ఎవడిక్కావాలి? బచ్చా కతలతో తుత్తి తీరాలి!

***
     దొంగరాముడులో ఇలా అర్ధం లేకుండా చిన్ననాటి 25 నిమిషాల సంగతుల్ని పాత్ర ఫలానా ఇలాటిదని చూపించడనికి వాడుకోలేదు. పాత్ర తత్త్వంతో బాటు పాత్రకి చిన్నప్పుడే కథని కూడా ప్రారంభిస్తూ గోల్ ని ఏర్పాటు చేసేశారు. తల్లికి మందులకోసం దొంగగా మారి పోలీసులకి పట్టు బడడం, తల్లి చనిపోవడం, చెల్లెలు దిక్కులేనిదవడం -  ఇవన్నీ స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగపు బిజినెస్ కి తార్కాణాలే. ఈ మూడు విపరిణామాలతో దొంగరాముడు చిన్నప్పుడే జీవితపు చౌరస్తాలో నిలబడ్డాడు – ఇప్పుడేం చెయ్యాలి? అన్న ప్రశ్నతో, గోల్ తో. అందుకని ఈ చౌరస్తా ప్లాట్ పాయింట్ వన్ అయిందన్న మాట. ఈ చిన్ననాటి అధ్యాయం స్క్రీన్ ప్లేలో నేరుగా బిగినింగ్ విభాగమే కాబట్టి, దీని కథనంలో పైన చెప్పుకున్న టూల్స్ నాల్గూ కన్పిస్తున్నాయి. 

          చాలా అద్బుతమైన ప్రక్రియని ఆనాడు చేపట్టారు కేవీ  - డీవీ - దుక్కిపాటి  త్రయం. హీరోకి చిన్నప్పుడు పాత్రచిత్రణతో బాటు, చిన్నప్పుడే కథని కూడా అందించేశారు. దీంతో ఇది పరిపూర్ణ బాల్య కథయ్యింది. ఇప్పుడెలా చేస్తున్నారు? కేవలం చిన్నప్పుడు పాత్ర లక్షణాలు చూపించి, కథనివ్వకుండా అసంపూర్ణ బాల్య కథ చేస్తున్నారు. కేవలం పాత్ర ఎలాటిదో చెప్పడానికి చిన్నప్పటి సీన్లు వేసి ప్రేక్షకులకి స్పూన్ ఫీడింగ్ చేయనవసరం లేదు. చిన్నప్పటి కథనం తీసి పారేసి నేరుగా స్టార్ ని ఆ లక్షణాలతో చూపించేసి, ఇతను చిన్నప్పట్నుబంచీ ఇంతేనని ఒక్కమాటలో చెప్పేస్తే సరిపోతుంది. 

          ఈ ప్రక్రియ దొంగరాముడి చిన్నప్పటి పాత్రతోనే చేశారు!
          పంతులు దొంగరాముడ్నిదండిస్తూ, ‘ఏరా బుద్దొచ్చిందా? చెట్లెక్కి కోతి కొమ్మచ్చి లాడతావా? బళ్ళో పిల్లల్ని అందర్నీ కొడతావా? తోటలో దొంగతనాలు చేస్తావా? రోజూ బళ్ళో కొస్తావా?’ అని పంతులుతో చెప్పించేయడంతో దొంగరాముడు చిన్నప్పుడు ఎలాటివాడో సీన్లు వేసే అవసరమే రాలేదు. వాడి ఈ లక్షణాలతో కూడిన రెండు సీన్లని – సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన - కోసమే ప్రయోజనకరంగా వేశారు. 

          ఇలా దొంగరాముడి స్క్రీన్ ప్లే  ఏకంగా చిన్ననాటి కథతోనే బిగినింగ్ విభాగంగా మొదలయ్యింది. ఇది విషాదంగా ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది ఒక గోల్ తో. ఇక పెద్దవాడుగా ఎంటరయ్యే దొంగరాముడికి, కథ నడపడానికి ఆల్రెడీ ఏర్పాటైన చిన్ననాటి గోలే అంది వచ్చింది. కనుక, అతడి ఎంట్రీతో ఇక మిడిల్ విభాగం ప్రారంభమైపోతుందన్న మాట! ఎంత సమయం ఆదా, ఎంత బడ్జెట్ ఆదా! అసలు హీరో ఎంట్రీతో ఏకంగా మిడిల్ విభాగం ప్రారంభమైపోయే సినిమా ఇంకేదైనా వుందా? ఇకముందు వుండడానికి ఇదేమైనా  స్ఫూర్తి అవుతుందా?

సికిందర్