రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 3, 2018

692 : స్క్రీన్ ప్లే సంగతులు


          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో పాతాళభైరవి తర్వాత దొంగరాముడు పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై అరవై యేళ్ళు దాటింది. ఈ అరవై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. పదేళ్లకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. దేశభక్తి ముందు అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో,  తొలివ్యాపార యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి (కల్తీ) వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే లపాకీ విలువలు. 

          యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తే?  అప్పుడు మలి (కల్తీ) వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరుగుతుంది. 

          నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే. ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

        మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి (కల్తీ) వ్యాపార యుగంలోనూ గత నాల్గైదు ఏళ్ల క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోకి ప్రయాణం కడుతోంది. అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం – మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

          దొంగరాముడు మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, లపాకీ విలువల మలి (కల్తీ) వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలింది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు - ఈ సర్కస్ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే... లాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

***
       దొంగ రాముడులో డైనమిక్స్ ఎక్కువ. కథ నిదానంగా దాని సమయం తీసుకుంటూ సాగినా, దృశ్యాల్లో కన్పించే డైనమిక్స్ ఎక్కువ. హీరో చిన్నప్పటి కథ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. అప్పుడు మాత్రమే ఎదిగిన హీరోగా దొంగరాముడు (అక్కినేని నా గేశ్వర రావు) కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలకి గానీ హీరోయిన్ సీత (సావిత్రి) కన్పించదు. ఆ తర్వాత 5 నిమిషాలకి గానీ ఇంకో ముఖ్యపాత్ర దొంగరాముడి చెల్లెలు లక్ష్మి (జమున) తెరపైకి రాదు. అంటే నాగేశ్వరరావు, సావిత్రి, జమునలు వంటి ప్రముఖ తారలు ప్రేక్షకులకి తెరమీద కన్పించడానికి అరగంట నుంచీ ముప్పావు గంట సమయమూ  తీసుకుంటారన్న మాట. అప్పటికి ఆక్కినేని –సావిత్రిల సూపర్ హిట్ దేవదాసు విడుదలై రెండేళ్ళయింది. అయినప్పటికీ కూడా అంతటి పాపులర్ తారల ఇమేజిని, ఫాలోయింగ్ నీ దృష్టిలో పెట్టుకుని దొంగరాముడు కథ చేయలేదు. అప్పట్లో ఇంకా హీరోయిజాలు ప్రారంభం కాలేదు కాబట్టి, తారలు కాకుండా కథ, అది తీసుకునే సమయమే ప్రధానమైంది. తర్వాత వ్యాపార యుగం నుంచీ ప్రారంభమైన తారల గ్లామర్ హంగూ ఆర్భాటాలతో పోలిస్తే, మలిస్వర్ణ యుగంలో కన్పించేది గ్లామర్ లేని పాత్రలే. ఏవైతే 1970 లలో ఆర్టు సినిమాలంటూ రావడం ప్రారంభించాయో, వాటిలో వుండే బీదాబిక్కీ తరహా గ్లామర్ లేని సామాన్య పాత్రల్నే మలిస్వర్ణ యుగంలో సహజత్వానికి ధర్మాసనం వేస్తూ ప్రేక్షకులకి అందించారు. 

          దొంగరాముడులో ఇంకో ముఖ్య పాత్ర కన్పించదు. అది విలన్ పాత్ర. విలన్ లేకుండానే దొంగరాముడికి కష్టాలుంటాయి. అతడి చేష్టలు చాలు తనకి తానే విలన్ అవడానికి. 

          దొంగరాముడు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు; దర్శకుడు – స్క్రీన్ ప్లే రచయిత కెవి రెడ్డి, కథ కెవి రెడ్డి, డివి నరసరాజు, దుక్కిపాటి మధుసూదన రావు; మాటలు డివి నరసరాజు, సంగీతం పెండ్యాల, ఛాయాగ్రహణం ఆడి ఎం ఇరానీ, ఇతర తారాగణం జగ్గయ్య, రేలంగి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం తదితరులు. 

          దొంగరాముడు కథ అరగంటకోసారి రిపీటవుతూ వుంటుంది. దీంతో మూడు క్లయిమాక్సులు వున్నట్టుగా అన్పిస్తుంది. భవిష్యత్తులో 1998 లో రన్ లోలా రన్ లాంటి మూడు క్లయిమాక్సుల మూవీ వస్తుందని అప్పుడే వూహించారేమో. కొన్ని అలా జరిగిపోతాయి. 

          దొంగరాముడు చిన్నప్పుడు అలా చేసి వుండకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు. విడుదలై  పెద్దోడుగా అలా చేసి వుండక పోతే మరోసారి జైలుకి వెళ్ళే వాడు కాదు. మళ్ళీ విడుదలయ్యాక అలా కూడా చేసి వుండక పోతే ఇంకోసారీ జైలుకి వెళ్ళే వాడే కాదు. మరి ఏంచేసి వుండాలి దొంగరాముడనే వాడు?



 రేపు!

సికిందర్