( జరిగిన కథ : జీహై – జూన్ హా ఇద్దరూ వూరి బయట భూత్
బంగ్లా కెళ్తారు. అక్కడ జీహై, జూన్ హాకి మానసికంగా దగ్గరవుతుంది. భూత్ బంగ్లా లో
దెయ్యాన్ని కాక పిచ్చోణ్ణి చూసి నవ్వుకుని బయల్దేరతారు...)
సీన్ : తిరిగి నదీ వారగా వచ్చేసరికి పడవ కొట్టుకు
పోతూ వుంటుంది. ఏం చెయ్యాలో అర్ధం గాదు. ఇంతలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమవుతుంది. జూహీ
వెనక్కి తిరిగి చెట్ల వైపు వురుకుతుంది. జూన్ హా కూడా వురుకుతాడు. ఆమెని దాటుకుని
పోతాడు. పోయే సరికి వెనుక ఆమె కాలు బెణికి కిందపడిపోయి అరుస్తుంది. వెనక్కి వచ్చి లేపుతాడు.నడవలేకపోతుంది. వీపు మీద ఎక్కమంటాడు వంగి. ఆమె తటపటాయించి అతడి వీపెక్కుతుంది,
మోసుకుంటూ వర్షపు జల్లులో పొలాల వెంబడి పరిగెడతాడు.
పాయింట్ : వెనక భూత్ బంగ్లా సీనులో ఒక షాట్ ని గమనించాం. మనం
బుర్రగొక్కుంటూ చూసేలా వున్న ఆ షాట్ ఏమిటో కూడా చెప్పుకున్నాం. దెయ్యం వుందనుకున్న
గది వైపుకి జూన్ హా, షాట్ లోకి వంగి
నడుస్తూ రైట్ ఎంట్రీ ఇస్తే, అతడి మీద వాలుతున్నట్టు జూహీ కూడా రైట్ నుంచి ఏటవాలుగా
ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు ఈ షాట్ ని ఇలాటి
బాడీ లాంగ్వేజీతో ఎందుకు తీశాడా అని మనం
బుర్ర గోక్కున్నాం. దీని సింబాలిక్ అర్ధం ఇప్పుడు ఈ సీన్లో చూస్తున్నాం. ఇక్కడ ఆమె
కాలు బెణికి అతడి వీపెక్కాల్సి వచ్చింది. అంటే జరగబోయేది ముందుగానే కాలం వాళ్ళ
అలాటి బాడీ లాంగ్వేజీలో చెప్పేసిందన్న మాట. కొన్ని మనకి తెలీకుండా చేసేస్తూంటాం.
అది కాలం చేస్తున్న హెచ్చరిక అనుకోం. కాలంలో ముందేం జరుగుతుందో మనం వూహించలేం. వూహించి
వుంటే జీహై అలా ఏటవాలుగా అతడి వెనకాల వెళ్తున్నప్పుడే - నేనేమిటి
ఇలా వెళ్తున్నాను, ఇతడి వీపెక్కే పరిస్థితి వస్తుందా అని అప్పుడే ఆలోచించి వుంటే, తర్వాత
పరిగెడుతున్నప్పుడు కాలు బెణక్కుండా జాగ్రత్త పడేదేమో. ఇలాటి గమ్మత్తులు చేస్తూ కాలం
వీళ్ళని ఎలా కలుపుతోందో చూస్తున్నాం. వెనక సీన్లో జూహీ మానసిక ఎటాచ్ మెంట్, దాని ప్రభావానికి
ఫిజికల్ గా ఆమె కింద పడిపోతే అతనూ కింద పడిపోవడం, ఇప్పుడీ సీనులో ఇలా
ఫిజికల్ గా ఇద్దరూ ఎటాచ్ అయిపోవడం.
ఈ సీనులో ఒక లోపమున్నట్టు అన్పించవచ్చు. వర్షం ప్రారంభం
కాగానే జూహీ వెనక్కి తిరిగి పరుగెత్తుతుంది. అలాగే ఆమెని దాటుకుని పోయి జూన్ హా
కూడా పరుగెత్తుతాడు. ఆమె కాలు బెణికి
పడిపోతే అప్పుడు వెనక్కి వచ్చి ఆమెని చేరుకుంటాడు. అప్పటి వరకూ ఇద్దరూ ఎవరి మానాన వాళ్ళు వురుకుతున్నట్టే.
ఒకర్నొకరు పట్టించుకోకుండా.
ఈ సినిమాని తెలుగులో కాపీ కొడితే మనమిలా చేస్తాం : వర్షం మొదలయ్యింది. ఇద్దరూ ఒక అనుభూతికి లోనయ్యారు. యంగ్ హీరోయిన్ చేతులు చాపి స్లో మోషన్ లో చిటపట చినుకులతో ఆడుకుంటోంది. తడిసిన ఆమె అందాలన్నీ సెక్సీ గా ఎక్స్ పోజ్ అవుతున్నాయి. యంగ్ హీరో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నాడు...వొళ్ళూ వొళ్ళూ రాపిడి. రగిలిన వేడి. ఎగిసిన ప్రేమ అలజడి!
లేదా – వర్షం మొదలవగానే ఇద్దరూ చేతులు పట్టుకుని పరిగెట్టడం మొదలెట్టారు. ఆమె కాలు బెణికి పడిపోయింది. అతను లేపి వీపునేసుకున్నాడు...
వాళ్ళు ఇన్నోసెంట్స్ అనీ, వాళ్ళల్లో ఇంకా అడాలసెన్సే తొంగి చూస్తోందనీ, పసిపిల్లల మనస్తత్వమనీ... ఇలా పాత్రలు ఎస్టాబ్లిష్ అయ్యాయనీ, గతంలోనే మనం చెప్పుకున్నాం. అయినా ఈ మానసిక స్థితిని, పాత్ర చిత్రణల్నీ కిల్ చేసి - రోమాంటిక్ జయ కేతనాన్ని రెపరెప లాడించెయ్యాలనీ ఉబలాట పడతాం మనం సగటు తెలుగు సినిమాల అద్దె బుద్ధి కొద్దీ.
కొరియన్ దర్శకుడు సంకల్పించిన ఈ సీను ఎందుకు కరెక్ట్ అంటే, హీరోహీరోయిన్లు స్పష్టంగా ప్రేమని ఫీలవడం లేదు. పిల్లల్లాగే తిరుగుతున్నారు. పిల్లలు ఏదైనా జరిగితే ఎవరి మానాన వాళ్ళు జంప్ అయిపోతారు. చిన్నపిల్లలు మొదట తమ సేఫ్టీ చూసుకుంటారు. తోటి పిల్లకాయ గోతిలో పడితే తర్వాత వచ్చి చూస్తారు. అందుకని భూత్ బంగ్లా సీనులో గదిలో ‘దెయ్యాన్ని’ చూసి హీరో కేకలేసుకుంటూ హీరోయిన్ని పట్టించుకోకుండా ఎలా పారిపోయాడో, తర్వాత ఆమె కేకలు విని నాలిక్కర్చుకుని ఎలా వెనక్కొచ్చాడో, అదే మనస్తత్వంతో వున్న హీరోయిన్ ఇప్పుడు వర్షం మొదలవగానే తన మానాన తాను పరుగెత్తడం మొదలెట్టింది. హీరో కూడా ఆమెని దాటుకుని తన మానాన తాను పరుగెత్తాడు. ఆమె పడిపోగానే వెనక్కొచ్చాడు. వాళ్ళు ప్రేమని ఫీలయితే అలా ఎవరి మానాన వాళ్ళు పరుగెత్తే వాళ్ళు కాదు. కాలం మాత్రమే వాళ్ళ మధ్య ప్రేమని ఫీలవుతోంది- వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తోంది. అందుకని వాళ్ళకేం జరుగుతోందో ఇంకా వాళ్లకేం తెలీదు.
ఈ సీన్ కట్ చేశాక దర్శకుడేం చేయాలి? ఇప్పుడామెని వీపెక్కించుకుని
వర్షంలో పొలాల వెంబడి పరిగెడుతూ వున్నాడు. దీన్తర్వాత సీనేం వేయాలి? ఇప్పుడెలాగూ వానలో శరీరాలు
అతుక్కున్నాయి కాబట్టి వాన పాటేసుకోవాలా? మనం ఇలాగే చేసి కుతి తీర్చుకుంటాం. మనం రాసేవన్నీ
ఇదివరకు సినిమాల్లో వచ్చేసిన టెంప్లెట్ సీన్లే కనుక, చూసిన తెలుగు సినిమాల్లో
సీన్లన్నీ గుర్తుచేసుకుంటూ, వాటిని పేర్చుకుంటూ
పోవడమే మనం కథ రాయడమంటే. ఇలాంటప్పుడు
చూసిన సినిమాల్లో రకరకాల వాన పాటలూ మనకి మెదుల్తాయి
తప్పక. కాబట్టి ఆ టెంప్లెట్ లో వాన పాటొకటి వేసేస్తే మనకి పని భారం కూడా తగ్గుతుంది. కవిగారూ, సంగీత
దర్శకుడూ ఆ అయిదు నిమిషాల స్క్రీన్ స్పేస్
ని ఎలా భర్తీ చేయాలో వాళ్ళ పాట్లేవో వాళ్ళు పడతారు. మనం పని తప్పించుకుని
వెళ్లిపోవచ్చు. పాట కాగానే హీరోయిన్ తాతగారి మనుషులతో హీరోకి ఫైట్ వేసేస్తే ఆ పావు గంట నిడివితో ఫైట్ మాస్టర్
తంటాలు పడతాడు. మనం మొత్తం కలిపి ఈ ఇరవై నిముషాలు సీన్లు రాయకుండా ఎస్కేప్
అవ్వొచ్చు! తక్కువ పని చేసి ఎక్కువ నష్టం
కలిగించే మన మోటోని వీటో చేసే వాళ్ళెవరూ వుండరు. మన జీవితం ఆరు స్క్రీన్ ప్లేలూ
ఇరవై కూలి దినాలుగా గడిచిపోతుంది...కమ్మగా నిద్రపోవచ్చు.
ఇలాటి విద్రోహపు ఆలోచనలు కొరియన్ దర్శకుడికి రాలేదు. తర్వాతి సీనేం చేయాలో మొదలెట్టిన సైకలాజికల్ ట్రాకుని అనుసరిస్తూనే పోతున్నాడు. పాత్రల సైకాలజీయే కథనం చేస్తుంది, సీన్లు వస్తాయి. ఇలాటి సైకలాజికల్ ట్రాక్ ని నియో నోయర్ మూవీ ‘బ్లడ్ సింపుల్’ లో కథానాయకుడు విస్సర్ పాత్రలో మనం గతంలో చూశాం. ఫారినోళ్ళు ఒఠ్ఠి పిచ్చోళ్ళు. క్యారక్టరైజేషనూ, పనికిమాలిన సైకలాజికల్ ట్రావెలూ అంటూ బొత్తిగా మనకి నీచాతినీచమన్పించే పనులేవో చేస్తారు. మనక్కావాల్సింది ఒక ఫ్లాపు తీయడానికి ఫ్లాపంటి పన్నెండు సూత్రాలు. ఫ్లాపే మన జీవన మాధుర్యం. అదెంతో తియ్యనైన పదార్ధం.
పడుచు హీరోహీరోయిన్లు పడవెక్కిన కాణ్ణించీ ఇప్పుడు వర్షంలో ఇలా వీపెక్కడం వరకూ ఇదంతా కథనం డిమాండ్ చేస్తున్న వాళ్ళ మానసిక - శారీరక సాన్నిహిత్యాల సెటప్ అన్నమాట. స్ట్రక్చర్ అంటే ఇదే. సైకాలజిస్టు చూసినా ఈ ట్రాకుని తప్పుబట్ట లేడు. ఇలా సెటప్ చేసిన తర్వాత ఇద్దర్నీ ఒక చోట సెటిల్ చేసి మాట్లాడుకోనివ్వాలి. జీవితంలో ఎవరి సైకలాజికల్ ట్రాకైనా ఇంతే. చర్యలన్నీ మానసికమైనవే. మనసులోనే పుడతాయి. ఇలా సెటప్, ఆ తర్వాత సెటిల్, దీంట్లో మాటలతో మరింత దగ్గరవడం. వీళ్ళెలా సెటిలయ్యారో కింది సీన్లో చూద్దాం.
సీన్ : కెమెరా టిల్ట్ డౌన్ చేస్తూంటే ఇద్దరూ మంచె
ఎక్కి కూర్చుని వుంటారు పొలాల మధ్య. వర్షం
పడుతూ వుంటుంది. ఆమె ముడుచుక్కూర్చుని వణుకుతూ వుంటుంది. అతను తడిసిన షర్టు
విప్పి, పిండి ఆమెకిస్తాడు. ఆమె తల, చేతులు తుడుచుకుని షర్టు అందిస్తుంది. ఆ నీళ్ళు పిండి
ఇంకోసారి ఇస్తాడు. చెంపలు తుడుచుకుతుంది. పొలంలో కాసిన పుచ్చకాయ తెంపు కొస్తాడు.
చేత్తో దాన్ని ముక్కలు చేసి ఆమెకో ముక్క ఇచ్చి తానొకటి తీసుకుంటాడు. అతను చేత్తో
ఒక్క దెబ్బకి పుచ్చకాయని పది ముక్కలు చేసినప్పుడు, చిన్న పిల్లలా ఆనందపడి నవ్వుతుంది. ఇద్దరూ
తియ్యగా తింటూంటారు. వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామంటాడు. పడవెలాగో
వస్తుందంటాడు. దీంతో సీను పూర్తవుతుంది. వర్షం వెలిసి లాంగ్ షాట్ లో ఇంద్ర ధనుస్సు
వెలుస్తుంది.
పాయింట్ : ఈ సీనులో భూత్ బంగ్లాలో కనపడ్డ పిచ్చోడితో గల సింబాలిక్ మీనింగు దర్శన మిస్తుంది. పిచ్చోడు చంకలో చుట్టి పెట్టుకున్న కోటు లోంచి గడ్డి పరకలు వేలాడుతూ వుండడం గమనించాం. గడ్డి ఇక్కడ ఈ మంచె మీద పరచి వుంది. పిచ్చోడు తలకి కోటు చుట్టుకుని వుండడాన్నీ గమనించాం. ఇక్కడ హీరో షర్టు విప్పి ఇస్తే హీరోయిన్ తడిసిన తల తుడుచుకుంది. ఈ కాకతాళీయాల్ని కాలమహాత్మ్యంగా చమత్కరించాడు దర్శకుడు. వెనుక సీన్లో కాలం చెప్తున్న పిచ్చోడి సింబాలిక్ అర్ధం – మీరు వానలో తడిసినా మంచె మీద తల దాచుకోబోతారనీ, అతడి షర్టుతో ఆమె తల తుడుచుకోబోతోందనీ...
నిజానికి ఇలాటి ఫోర్ షాడోయింగ్ సింబాలిజాలు ‘బ్లడ్ సింపుల్’ నిండా వున్నాయి. వాటిని విశ్లేషించుకున్నాం కూడా. ఫిలిం నోయర్, నోయో నోయర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు నిజానికి విధి రాత, తలరాత, చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టు కర్మ ఫలాలు అనుభవించడాల చుట్టూ కథలై సాగుతాయి. ఎక్కడైతే ట్రాజడీ, డ్రామా వుంటాయో అక్కడ సింబాలిజాలు చక్కగా వర్కౌటవుతాయి. ఎందుకంటే, ఈ జానర్లు సమయం తీసుకుని నిదానంగా సాగే సీన్లతో కూడి వుంటాయి గనుక. ట్రాజడీలూ డ్రామాలూ అంటేనే ఆలోచనాత్మక కథలు. నటీనటులతో సీన్లు ఆలోచింపజేసేవిగా వుంటాయి కాబట్టి, చుట్టూ వాతావరణ పరిస్థితుల్లో సింబాలిజలు నాటడానికి ఎక్కువ ఆస్కారముంటుంది. ఈ సింబాలిజలు ప్రేక్షకుల సబ్ కాన్షస్ (అంతరంగం) తో కనెక్ట్ అయి తదేకంగా సినిమా చూసేట్టు చేస్తాయి. కొన్ని యాక్షన్ సినిమాల్లో సబ్ కాన్షస్ కనెక్షన్స్ కోసం బ్లర్ చేసిన కలర్ లైట్స్ చూపిస్తారు.
దర్శకుడు వీళ్ళిద్దర్నీ మంచె మీద ‘సెటిల్’ చేసి కాసేపు కాలక్షేపం చేయించాడు. ఐతే ఎక్కువ మాట్లాడించలేదు. ఆమె అతడి షర్టుతో తల తుడుచుకోవడం, ఇద్దరూ పుచ్చకాయ తినడం లాంటి అనుభవాలున్నాక ఇక మాటలు అవసరం లేదు. ఇలా వున్న సీనులో ఒకే ఒక్క మాట – అదీ జూన్ హా చేత పలికించాడు - వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామనీ, పడవెలాగో వస్తుందనీ. జూన్ హా ఈ మాటనడం ఆమె పట్ల ఫీలవుతున్న బాధ్యతకి నిదర్శనం. ఆమెని క్షేమంగా ఇల్లు చేరుస్తానని అభయమిస్తున్నట్టు ఆ మాటలున్నాయి. ప్రేమికుడి చేత సమయస్ఫూర్తితో ఇంతకంటే ఏం పలికించాలి. జూహీ క్షేమం కోరుకునే కుర్రాడు జూన్ హా అని ఎష్టాబ్లిష్ అయింది ఈ మాటలతో.
సీనుకో ‘కీ’ డైలాగు వుంటుంది మంచి సినిమాల్లో. ఆ ‘కీ’ డైలాగు కథ గురించో క్యారెక్టర్ గురించో ఒక కొత్త సంగతి చెప్తుంది. ఆ ప్రకారంగా ఆ కథా లేదా పాత్రా సాగుతాయి. ఒక సీను ఉద్దేశం కథని ముందుకు నడిపించే అంశాన్ని లేవనెత్తడమో, లేదా క్యారెక్టర్ గురించి కొత్త విషయం చెప్పడమోగా వుంటుందని తెలిసిందే.
ఈ సీనులో దర్శకుడు ఆ ఒక్క డైలాగుతో ఆ రెండు కార్యాలూ నిర్వహించాడు. ఆ డైలాగు ఆమెకి అభయమిస్తున్నట్టుగా వుంటూనే, తిరిగి నది దగ్గరికి వెళ్ళబోతున్నారనీ తర్వాతి సీనుకి లీడ్ ఇస్తోంది.
ఈ సీను డైలాగ్ ఎజెండా ఏమిటి, దేన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డైలాగులు రాశారు - అన్నవి పరిశీలించదగ్గ అంశాలు. సెటప్ నుంచి సెటిల్ సెగ్మెంట్ కి కథనం మారేక, ఈ సెటిల్మెంట్లో సరస సంభాషణ మొదలెట్టలేదు తెలుగు సినిమాల్లోలాగా. వాళ్ళిలా సెటిలవడంలోని మజా వాళ్ళ చర్యల్లో విజువల్ గా బయట పడిపోతోంది. అతను తుడుచుకోవడానికి షర్టు ఆఫర్ చేయడం, తినడానికి పుచ్చకాయ ఇవ్వడం వగైరా. ఇంకా ఇంకా దీని తాలూకు డైలాగులు అవసరం లేదు. వెర్బల్ కథనం అవసరం లేదు. వాళ్ళ చర్యల సారం (సబ్ టెక్స్ట్) వాళ్ళ మధ్య పరిస్థితి ఏమిటో చెప్పేస్తోంది విజువల్ గా. ఇప్పటికి వాళ్ళు ఇలా కలిసిరావడం, కలిసి తిరగడం, కలిసి కూర్చోవడం అన్నీ కూడా మొదలవబోయే వాళ్ళ ప్రేమలో భాగమేనని మనకి బాగా తెలిసిపోయింది. తెలిసిపోయిన ఈ విషయం పాతబడిపోయింది. గత ఇరవై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ పది సెకెన్లే. పది సెకన్లకి మించి ఒకే విషయమ్మీద దృష్టి పెట్టి చూస్తూ కూర్చోలేరు. ఎప్పటికప్పుడు విషయం మారిపోతూ వుండాలి.
కాబట్టి
ప్రేమలో పడతారనే విషయం పాతబడి పోయాక ఇంకా దీన్నే వాళ్ళ మధ్య డైలాగులతో బాదుతూ
కూర్చోనవసరం లేదు. ఒక సీన్లో దృష్టిలో పెట్టుకోవాల్సిన సూక్ష్మ అంశాలు చాలా వుండి
చస్తాయి. వీటిని వివరించినా డిస్కషన్స్ లో అందరికీ అర్ధంకావు. అర్ధం గాకపోతే
నమ్మరు. నమ్మకపోతే నమ్మిందే చేస్తారు. అందుకని అరగుండు సినిమాలు గుండు గుత్తగా
వచ్చేస్తున్నాయి...ప్రేక్షకుడి వంద రూపాయల టికెట్టుకి సరిపడా పూర్తి స్థాయి కళా
మెళకువలతో సినిమాలు అందించడం ఇహ వల్ల కాదు.
ఈ సీనులో ప్రేమ గురించి మనకి తెలిసిపోయాక, ఇంకో కొత్త విషయం కావాలి. ప్రేక్షకుడ నుకుంటాడు- సరేనయ్యా, ఇంతసేపూ ప్రేమలో రకరకాల స్థితి గతులు చూపించావ్- వాళ్లిక ప్రేమలో పడతారని డిసైడ్ అయిపోయాం – దీన్తర్వాత ఏం జరుగుద్దీ చెప్పవయ్యా బాబూ, క్యారెక్టర్స్ ని ముందుకు తీసికెళ్ళి కాస్త చూపించవయ్యా బాబూ - అని డిమాండ్ చేసి కూర్చుంటాడు.
ఇదే సీను చివర డైలాగుతో తీర్చేశాడు దర్శకుడు. వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామనీ, పడవెలాగో వస్తుందనీ హీరో చేత చెప్పించి. ఈ డైలాగు ప్రాముఖ్యమేమిటో పైన వివరించుకున్నాం. కాబట్టి హీరో పాత్రని ముందుకు తీసికెళ్ళి అతనేమిటో చెప్పించడం పూర్తి చేశాడు దర్శకుడు. ఈ హీరో ఇక హీరోయిన్ క్షేమం కోరుకునే కుర్రాడన్న మాట.
క్యారెక్టర్ కి సంబంధించి ఈ ‘కీ’ డైలాగుని మాత్రమే రిజిస్టర్ చేయడం సీన్ ఎక్స్ టెండెడ్ ఎజెండా అయినప్పుడు, సీను ప్రారంభాన్ని వేరే డైలాగులతో కలుషితం చేయకూడదు. వాటిలాగే ఈ ‘కీ’ డైలాగు కూడా గాలిలో కలిసిపోయే ప్రమాదముంది.
ఇక లాంగ్ షాట్ లో మంచెమీద వీళ్ళు కూర్చుని వుండగా, వర్షం వెలసి ఇంద్రధనుస్సు కన్పించడం థీమాటికల్ గానూ వుంది, తర్వాతి సీనుకి అర్ధవంతమైన ట్రాన్సిషన్ గానూ వుంది. ఇంద్రధనుస్సు డిజాల్వ్ అయి మసక చీకట్లు ముసురుకుంటూ తారలు వెలుస్తాయి.
(ఇంకా వుంది)
―సికిందర్