అప్పట్లో బ్రహ్మోత్సవం,కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, డిక్టేటర్,
బ్రూస్ లీ, జ్యోతి లక్ష్మి, సైజ్ జీరో, ఆటోనగర్ సూర్య, దొంగోడు,
ధమ్... ఇప్పట్లో నిన్నే కోరి, నేనే
రాజు- నేనే మంత్రి, గరుడ వేగ...ఇవన్నీ సెకండాఫ్ సిండ్రోమ్ పాలబడి
ప్రశ్నర్ధకమయ్యాయి. కాకపోతే చివరి మూడు మాత్రం ఏదో అదృష్టం కొద్దీ గట్టెక్కాయి. ఈ
సిండ్రోమ్ ఎలా ఏర్పడుతుందో తెలిసిందే. ఫస్టాఫ్ లో చెప్పిన పాయింటు సెకండాఫ్ లో వేరే కథగా
మారిపోవడం ఎక్కువగా జరుగుతూంటుంది. అలాగే ఇంటర్వెల్ నిర్వహణ సరిగా లేకున్నా
జరుగుతుంది. గరుడ వేగది ఇంటర్వెల్ సమస్యే నని గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఇంటర్వెల్లో
ప్రేక్షకుల్ని ఆపకుండా కథనే ఆపేశారు. లేదా ఫస్టాఫ్ లో చెప్పుకొస్తున్న టెర్రరిజం విషయం ముగించారు. ఇక్కడ్నించీ
సెకండాఫ్ ఏమిటి? ఇంటర్వెల్లో ప్రేక్షకుడు ఏమాలోచిస్తాడు? ఇక పట్టుబడ్డ నిరంజన్
అయ్యర్ ని సెకండాఫ్ లో ప్రశ్నిస్తారు, అతను టెర్రర్ నెట్వర్క్ గుట్టు విప్పుతాడు, ప్రతాపరెడ్డిని
ఎందుకు చంపాలనుకున్నారో చెప్తాడు, అప్పుడా మొత్తం టెర్రర్ నెట్వర్క్ ని హీరో నాశనం
చేస్తాడు- ఇంతేగా?
కథ తెలిసిపోతూ ఇంటర్వెల్ కి ఇవిఆసక్తి కల్గించే అంశాల్లా లేవు.
అసలిలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే - ఈ కథ టెర్రరిజం గురించి కాదు, వేరే రాజకీయ
కుట్రల కథ కూడా కాదు, ఒకేవొక్క ప్లుటోనియం మైనింగ్ మాఫియా కథ. దీన్ని ఎక్కడా బయట
పెట్టకుండా సెకండాఫ్ లో ఇంకో అరగంట వరకూ దాచిపెడితే బోలెడు సస్పన్స్ ని సృష్టించ
వచ్చను కున్నారు. అంటే ఎండ్ సస్పెన్స్ అన్నమాట. ఎండ్ సస్పెన్స్ అవుతుందని తెలియక
చేయడమన్న మాట. అందుకని టెర్రరిజం కథలా ఫస్టాఫ్ లో పూర్తిగానూ, రాజకీయ కుట్ర కథలా
సెకండాఫ్ లో కొంతవరకూ నడిపేస్తే సరిపోతుందనుకున్నారు. అదే చేశారు. కథ చెప్పకుండా
కథ నడపలేరు కాబట్టి ఈ పిట్ట కథలతో కవరింగు, మభ్యపెట్టడాలు, తప్పుదోవ పట్టించడాలు, ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడాలూ వగైరా వగైరా. కథ
చెప్పడమంటే ముందు పాయింటు చెప్పడమే. పాయింటుని దాచి కథ నడపాలనుకుంటే, ఇలా ఎండ్ సస్పన్స్
అయి గరుడ వేగ అవుతుంది.
సింగం త్రీ వుంది. అందులో పాయింటు ఆస్ట్రేలియా నుంచి చట్టవ్యతిరేకంగా బయలాజికల్, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు తెచ్చి మన దేశంలో పారబోసే కుట్ర. స్పైడర్ వుంది. అందులో మనుషుల్ని చంపి వాళ్ళ బంధువులు భోరున ఏడుస్తూంటే ఆ శబ్దాన్ని ఆనందించే సైకో కుట్ర. వివేకం వుంది. ఇందులో కార్పొరేట్ శక్తులు అణుశక్తితో ప్రపంచంలో భూకంపాల్ని సృష్టించి వ్యాపారం చేసుకోవాలనుకునే కుట్ర. లై వుంది. ఇందులో చాలా పూర్వం నుంచీ నేరాలు చేసి తప్పించుకుంటున్న మాస్టర్ క్రిమినల్ ని పట్టుకునే ప్రయత్నం. ఇవేవీ ఎండ్ సస్పెన్సు లు కావు. ఇవన్నీ మనకి ముందు ఫస్టాఫ్ లో నే చెప్పేసి కథ నడుపుతారు. అయినా ఇవి ఫ్లాపయ్యాయంటే వేరే కారణాలున్నాయి : సింగం త్రీ లో పిచ్చి పిచ్చి షాట్లతో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తలనొప్పి తెప్పించడం, స్పైడర్ లో హీరోకన్నా విలనే హీరో అయిపోవడం, వివేకంలో ఇంటర్వెల్ నుంచి మిత్ర ద్రోహం కథగా మారిపోవడం, ఇక లై లో విలన్ ఎప్పుడో నేరాలు చేశాడని అనడమే గానీ, ఇప్పుడు కథలో ఒక్క కుట్ర కూడా చేయకపోవడం!
Caring + Story Telling x Sincerity = CONNECTION అని ఒక ఈక్వేషన్ వుంది. గరుడ వేగలో ముఖ్యంగా చివరిదైన సిన్సియారిటీ లోపించడం వల్ల ( ఉన్నదున్నట్టు కథ చెప్పకుండా వేరే కథనాలతో మభ్యపెట్టడం) మొదటి రెండూ సాధ్యంకాక, సెకండాఫ్ ప్రేక్షకులతో కనెక్షన్ తెగిపోయింది. సెకండాఫ్ లో ఇంకొక విచిత్రమేమిటంటే, యాక్షన్ సీన్లు మైండ్ లెస్ గా వుండడం. మైండ్ లెస్ కామెడీలకి నవ్వుకోగలం. ఇంత హెవీ యాక్షన్ మూవీలో మైండ్ లెస్ యాక్షన్ కి కూడా నవ్వుకోవాలా?
ఇంతకీ ఏముంది సెకండాఫ్ లో?
సెకండాఫ్ మూడు ఎపిసోడ్లుగా
వుంది. రాజకీయ కుట్రని చెప్పి నిరంజన్ ని వేరే జైలుకి తరలించే మొదటి ఎపిసోడ్, హీరోతోబాటు తప్పించుకున్న నిరంజన్ ని చంపే ప్రయత్నపు రెండో ఎపిసోడ్, విలన్ షిప్
లో బయల్దేరిపోతున్నాడని అడ్డుకునే మూడో ఎపిసోడ్ .
మొదటి ఎపిసోడ్ : ఛానెల్స్ లో ప్రతాపరెడ్డి మీద బాంబు దాడి కుట్రని భగ్నం చేశారని ప్రకటనలు. ప్రతాపరెడ్డి ని చూపిస్తే అతను ఇది రాజకీయ కుట్ర అనీ, రూలింగ్ పార్టీయే చేసిందనీ ఆరోపిస్తూ చిందులేస్తాడు. ఇది టీవీలో చూస్తున్న విలన్ కన్పిస్తాడు. నిరంజన్ ఇంటరాగేషన్ మొదలవుతుంది. ఒక లాయర్ వచ్చి నిరంజన్ తో డీల్ కుదుర్చుకుంటాడు. సుల్తాన్ బజార్ లో రషీద్ సుల్తాన్ అనే టెర్రర్ గ్రూపు దగ్గరికి క్రిమినల్స్ వచ్చి ఓ కవరందుకుంటారు. ఇదీ మొదటి ఎపిసోడ్.
మొదటి ఎపిసోడ్ : ఛానెల్స్ లో ప్రతాపరెడ్డి మీద బాంబు దాడి కుట్రని భగ్నం చేశారని ప్రకటనలు. ప్రతాపరెడ్డి ని చూపిస్తే అతను ఇది రాజకీయ కుట్ర అనీ, రూలింగ్ పార్టీయే చేసిందనీ ఆరోపిస్తూ చిందులేస్తాడు. ఇది టీవీలో చూస్తున్న విలన్ కన్పిస్తాడు. నిరంజన్ ఇంటరాగేషన్ మొదలవుతుంది. ఒక లాయర్ వచ్చి నిరంజన్ తో డీల్ కుదుర్చుకుంటాడు. సుల్తాన్ బజార్ లో రషీద్ సుల్తాన్ అనే టెర్రర్ గ్రూపు దగ్గరికి క్రిమినల్స్ వచ్చి ఓ కవరందుకుంటారు. ఇదీ మొదటి ఎపిసోడ్.
ఈ మొదటి ఎపిసోడ్ తోనే, అసలు సెకండాఫ్ మొదటి దృశ్యంతోనే, ఏక సూత్రత అనే త్రాసు అమాంతం తలకిందులైపోయింది. తూకం వేసేవాడు త్రాసు ముల్లు దగ్గర వేలు పెట్టి తూకాన్ని ఏమారిస్తే దండి కొట్టాడు అంటారు. గరుడ వేగ లో గండి కొట్టుకున్నారు. అసలు ఏక సూత్రత అంటే ఏమిటి? మొదలెట్టిన పాయింటుతో అదే కథ చివరంటా చెప్పడం మాత్రమే కాదు, ఆ కథని ఆశ్రయించి వుండే సమస్త హంగులూ అదే ఫీల్ ని ప్రకటించడం కూడా. ఏక సూత్రత కింద జానర్ మర్యాద వుంటుంది. జానర్ మర్యాద కింద దాన్ని గౌరవిస్తూ ఇతర హంగులన్నీ వుంటాయి. ఏ జానర్ మర్యాదని అనుసరిస్తూ కథ చెప్తున్నారో, అదే జానర్ మర్యాదని ఆద్యంతం ప్రదర్శించడం జానర్ మర్యాదని గౌరవించడమవుతుంది. 2015 లో తెలుగులో జానర్ మర్యాదని చివరంటా కాపాడుకున్న సినిమాలే హిట్టయ్యాయని బాగా గమనించాలి. అంటే రసానుభూతి అనే ఎలిమెంట్ ని ప్రేక్షకులు ఫీలవడం మొదలెట్టారన్న మాట. ‘ముత్యాలముగ్గు’ కథలో విషాదమున్నా దాన్ని వినోదమనే షుగర్ కోటింగిచ్చి అద్భుత రసప్రధానంగా చూపించుకొచ్చారు. ఈ రసానుభూతి ఎక్కడా చెడకుండా చూశారు. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. దీని జానర్ మర్యాద ఏదైతే వుందో – వయసు మళ్ళిన ప్రేమల లెవెల్ - దాన్ని ముగింపు వరకూ కాపాడేరు.
గరుడవేగ ఫస్టాఫ్ కథని ఎంత ఏమార్చినా, చూపించుకొస్తున్నది సీరియస్ యాక్షన్/ అడ్వెంచర్ జానర్. సీరియస్ యాక్షన్ / అడ్వెంచర్ జానర్ కి అద్భుత రసమే వుంటుంది. అలాగే దీన్ని అద్భుత రస ప్రధానంగా బాగానే చిత్రీకరించారు. అలా సీరియస్ యాక్షన్ డిమాండ్ చేసే ప్రకారం – పాత్రల తీరుతెన్నులు, సంభాషణలు, పాల్పడే చర్యల మెకానిజం, నేపధ్య వాతావరణ సృష్టి వగైరాలతో మొత్తం స్టయిలిష్, మోడర్నిటీలతో కూడిన సెటప్ అంతా, ఏకసూత్రతంతా, సెకండాఫ్ మొదలయ్యేసరికి మాయమైపోయింది.
ముందు మోడర్నిటీ స్థానే పాత మూస ఎలా మొదలవుతుందంటే, చానెళ్ళ ప్రసారాలతో. సెకండాఫ్ ఒపెనవగానే థియేటర్ స్క్రీన్నిండా రొడ్డ కొట్టుడుగా చానెళ్ళ స్క్రీన్స్ వేసేసి, కథా ప్రపంచంలోని దృశ్య శబ్ద సౌందర్యాల్ని చెడగొట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టినట్టు, రంగంలోవున్న యాంకర్ల చేత నాటుగా వార్తల్ని చదివించే అనాలోచిత పధ్ధతి ఇక్కడా ఎదురవుతుంది. ఆ వార్తలు కథలోని పాత్రలుగాక, ప్రేక్షకులు విని తీరాలన్నట్టు (టార్చర్ అనుభవించాలన్నట్టు) దృశ్య శబ్ద కాలుష్యాలతో నిండి వుంటుంది. ప్రతీ సినిమాలో ఇదే భరించలేని చీప్ తంతు తప్ప, ఇది కళ కాదని కళ్ళు తెరిచేది వుండదు. కళ అదేదో పెద్ద మాట కాదు. బీ గ్రేడ్ చిత్రీకరణలే ఏ గ్రేడ్ లో వుండకూడదన్న కామన్ సెన్స్ మాట. ఒకసారి రాం గోపాల్ వర్మ ‘సర్కార్ త్రీ’ లో టీవీ న్యూస్ ని ఎలా చూపించారో, ఎంత అర్ధవంతంగా కథా ప్రపంచంలోని పాత్రలకి తెలిసేట్టు మాత్రమే చూపించి, ఆ దృశ్య శబ్ద మర్యాదలతో ఎంత అందంగా మనం కూడా ఆ పాత్రలతో బాటు లీనమై ఫీలయ్యేట్టు చేశారో తెలుసుకోవడం మంచిది.
ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్ మీడియా చాలా పెద్ద ఇండస్ట్రీ. సినిమాల్లో దీని ఉనికే లేకుండా పోయింది. మాటాడితే కుర్ర రిపోర్టరీమణులు మైకులుపట్టులుని పోలోమని వచ్చేసి నాన్సెనికల్ ప్రశ్నలేయడం, సినిమా చూస్తున్న ప్రేక్షకుల వైపు తిరిగి నీచంగా రిపోర్టు చేయడం ప్రతీ సినిమాలో వున్నట్టే ఇక్కడా నిండిపోయింది. ఎప్పుడైతే సెకండాఫ్ లో టెర్రరిజం కూడా పోయి, రాజకీయ కోణం ఓపెన్ చేశారో- ఇక చీదరగా రిపోర్టరీమణులు రక్కడం మొదలెడతారు. వీళ్ళ రక్కుడు రెండో ఎపిసోడ్ వరకూ వుంటుంది. ఈ యాంకర్లతో / రిపోర్టరీమణులతో కథ చెప్పించడమేమిటో అర్ధంగాదు. పాత్రల ద్వారా సహజంగా కథ తెలియజేయాలంటే కష్ట పడాలి - దీనికి షార్ట్ కట్ ఛానెళ్ళతో వాయింపులు. ఇలా బి గ్రేడ్ చిత్రీకరణలకి ఏ గ్రేడ్ జీతాలు తీసుకోవడం.
(మిగతా రేపు)
-సికిందర్