రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, జనవరి 2017, ఆదివారం



   ప్రపంచంలో ఏపరిణామాలుసంభవించినా, నోట్లురద్దు చేసుకున్నా, మోడీ సరిగ్గా ప్రకటన చేయకపోయినా, అసలు తిండే దొరక్క పోయినా, ప్రపంచమే కొట్టుకు పోయినా, సినిమాల కుండే గ్లామర్ చెక్కు చెదరదు. కేవలం వాటికుండే గ్లామర్ తోనే అవి సర్వకాల సర్వా  వస్థల్లోనూ  నిక్షేపంగా వుంటాయి. అశేష ప్రజాకర్షణని  పొందుతూంటాయి.  అలాటిది  కలెక్షన్లు సాధించడంలో అవి వెనకబడుతున్నాయంటే, వాటి గ్లామర్ తగ్గి కాదు, ప్రజాకర్షణ సన్నగిల్లీ కాదు- సినిమాలు తీయడం వ్యాపారాత్మక కళే అయితే అందులో కళ శాతం కునారిల్లడం వల్ల.  కేవలం కళే  గ్లామర్ ని కాపాడుతుంది, జనాకర్షణకి నోచుకుంటుంది. తనలో కళే లేకపోతే ఏ నటుడూ సూపర్ స్టార్ గా గ్లామర్ పొందలేడు, ప్రజాకర్షణ నోచుకోలేడు. ఇతర వ్యాపారాల్లో ఒక వస్తువు అమ్మాలంటే డిస్కౌంటో, వేరే ఆఫర్లో ఇచ్చి వినియోగదార్లని ఆకర్షించుకునే ఒరవడి నడుస్తోంది. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లే ఆ వస్తువుకి గ్లామర్ నీ ఆకర్షణనీ పెంచి, విరివిగా అమ్ముడుపోయేలా చేస్తూంటాయి. సినిమాలకి ఇలాటి డిస్కౌంట్లు అఫర్లూ ఇచ్చినంత మాత్రాన వాటి కలెక్షన్లు పెరగవు. కళే సినిమాలకి  గ్లామర్. కళే డిస్కౌంటూ, ఆఫరూ ఏదైనా. అలాంటిది 2016 లో కూడా టాలీవుడ్ పరిస్థితి  9.27 శాతం విజయాల దగ్గరే ఆగిపోయిందంటే, చేస్తున్న వ్యాపారంలో వేయాల్సిన కళని కూడా వేయకుండా  సరఫరా చేయడం వల్లే.   వ్యాపారం కోసం 167 సినిమాలూ తీశారు. డబ్బింగులు ఇంకో 54+10 వున్నాయి. మొత్తం కలిపి 231 సినిమాలు. 167 తెలుగు సినిమాల్లో ‘ఏ’ స్టార్ సినిమాలు 10, ‘బి’ స్టార్ సినిమాలు  42, చిన్న చిన్న సినిమాలు  115 వున్నాయి. ఈ మొత్తంలో విజయాలు సాధించినవి 18. తీసిన 167 సినిమాల్లో 18 విజయాలంటే 9.27 శాతం సక్సెస్ రేటు. తీసిన 167 లో 149 ఫ్లాపయి 9.27 శాతం సక్సెస్ రేటుతో మిగలడం కొత్తేమీ కాదు. ప్రతీసంవత్సరం చూస్తున్నదే. అచంచల సినిమా గ్లామర్ కి తగినంత కళ అనే కళ్ళాపిని జల్లకపోవడం వల్లే అప్రతిహతంగా ఇదే పరిస్థితి దాపురిస్తోంది. 

         సంక్రాంతితో ప్రారంభించుకుని రావడానికి నాగార్జున ( +సోగ్గాడే చిన్నినాయనా, -ఊపిరి), బాలకృష్ణ ( - డిక్టేటర్), వెంకటేష్ ( -బాబు బంగారం), పవన్ కల్యాణ్  (-సర్దార్ గబ్బర్ సింగ్), మహేష్ బాబు (- బ్రహ్మోత్సవం), ఎన్టీఆర్ ( +నాన్నకు ప్రేమతో, +జనతా గ్యారేజ్), అల్లు అర్జున్ ( +సరైనోడు), రాం చరణ్ (+ధృవ) 10  బిగ్ కమర్షియల్స్ తో అట్టహాసంగా వచ్చారు.  ఈ ‘ఏ’ స్టార్ కేటగిరీలో వున్న రవితేజ మాత్రం డుమ్మా కొట్టారు. వచ్చినవాళ్ళు ఈ 10 సినిమాల ప్లస్- మైనస్ ల ఆటలో ఐదు మాత్రమే ప్లస్ లిచ్చి మిగిలిన అయిదూ మైనస్ చేసుకున్నారు. నాగార్జునకి సోగ్గాడే చిన్నినాయనా కళ్ళాపి జల్లుకుని రియల్ హిట్టయితే, ఊపిరి ఇరవై కోట్లు లాస్ అని ఇప్పటికీ నిర్మాత పివిపి చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ డిక్టేటర్, వెంకటేష్ బాబుబంగారం కళ్ళాపి మానేసి పాతనే కళాసి పనితో మెరిపించి అమ్మాలని చూశారు. ఇక ఈ యేడు ఫ్లాపులివ్వడంలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవంల సంచలనాత్మక అట్టర్ ఫ్లాపుల దెబ్బతో హిట్టయిన సినిమాల్ని కూడా మర్చిపోయారు ప్రేక్షకులు. ఏ స్టార్ సినిమాలు హిట్టాయ్యాయీ అని తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ సరైనోడు, రాం చరణ్ ధృవ హిట్లు అని చెప్పుకుంటున్నా- అది మార్నింగ్ ఆట మాట మాత్రం  కాదు. అల్లు అరవింద్ నెట్ వర్క్ లో అవి ఆడగా ఆడగా గట్టెక్కిన సినిమాలు. ఇక మిగిలిన ‘ఏ’ స్టార్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కూడా ఆడగా ఆడగా గట్టెక్కిన హిట్టే, జనతా గ్యారేజ్ మాత్రం రియల్ హిట్. ఈ సంవత్సరం వచ్చిన ‘ఏ’ స్టార్లు ఎనిమిది మంది  పది సినిమాలిచ్చినా, యాభై శాతం మాత్రమే విజయాలతో  వున్నారు. ఎంతో టైం తీసుకుని, ఏంతో  ప్లానింగ్ తో తీసినా జరిగిన లోపమేమిటో- రాజకీయ పార్టీలు ఎన్నికల విశ్లేషణ చేసుకున్నట్టు-  పరిశీలించుకుని సరిదిద్దుకునే సాంప్రదాయానికి స్టార్లు దూరం. కళ్ళాపి వర్సెస్ కళాసి ఫైటింగ్ కంటిన్యూ అవుతూ వుంటుంది. కళాసీ పనే వెలవెల బోతూంటుంది.
                                       
           ***
       
‘బి’ స్టార్లు తమ గ్లామర్ తో ఏకంగా 42 సినిమాల్ని మోసుకొచ్చారు. ఎన్ని వందలు మోసుకొచ్చినా తట్టుకునే  జేబు సత్తా ప్రేక్షకుల కుంది. మోసుకొచ్చిందేమిటన్నదే బాక్సాఫీసు ప్రశ్న. కళ్యాణ్ రాం (-ఇజం), నాగచైతన్య (+ప్రేమమ్, -సాహసం శ్వాసగా...) రామ్  (+నేనూ శైలజ, -హైపర్), నితిన్ (+అ ఆ), నాని (+కృష్ణ గాడి  ప్రేమగాథ, +జంటిల్ మన్, -మజ్నూ), నిఖిల్ (+ఎక్కడికి పోతావు చిన్నవాడా), సాయ ధరమ్ తేజ్ (+సుప్రీం, -తిక్క), మంచు విష్ణు (-ఆడోరకం-ఈడోరకం), మంచు మనోజ్ (-శౌర్య, -ఎటాక్), శర్వానంద్ (+ ఎక్స్ ప్రెస్ రాజా) , సందీప్ కిషన్ (-రన్, -ఒక్క అమ్మాయి తప్ప) , రాజ్ తరుణ్ (-సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, -ఆడో రకం-ఈడో రకం), ఆది (-గరం, - చుట్టాలబ్బాయి), నాగ శౌర్య (-కళ్యాణ వైభోగమే, - ఒక మనసు, - అబ్బాయితో అమ్మాయి, + జ్యో అచ్యుతానంద), అల్లు శిరీష్ (+ శ్రీరస్తు శుభమస్తు) ... ఇకపోతే,  సూపర్ స్పీడ్ రికార్డ్ స్టార్ నారా రోహిత్ వదిలిన ఆరు యాక్షన్ తూణీరాలు (-తుంటరి, -సావిత్రి, - రాజా చెయ్యి వేస్తే, -శంకర, - +జ్యో అచ్యుతానంద, +అప్పట్లో ఒకడుండే వాడు), సుమంత్ అశ్విన్ (- రైట్  రైట్), అక్కినేని ఫ్యామిలీ సుమంత్ (-నరుడా డోనరుడా), సుశాంత్ (-ఆటాడిస్తా రా) , బెల్లంకొండ శ్రీనివాస్ (-స్పీడున్నోడు), కామెడీ డిపార్ట్ మెంట్ లో- అల్లరి నరేష్ (-సెల్ఫీ రాజా, -ఇంట్లో దెయ్యం నాకేం భయం), సునీల్ (-కృష్ణాష్టమి, -జక్కన్న, -ఈడు గోల్ ఎహే), శ్రీనివాస రెడ్డి (-జయమ్ము నిశ్చయమ్మురా), సప్తగిరి (-సప్తగిరి ఎక్స్ ప్రెస్) ... ఈ 42 లో 11 మాత్రమే  హిట్టయ్యాయి.

        20 మంది ‘బి’ స్టార్లలో- రామ్, నితిన్, నాగచైతన్య, నాని, శర్వానంద్, నిఖిల్,  నారా రోహిత్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్- 9 మంది మాత్రమే ఈ సంవత్సరం సక్సెస్ లిచ్చారు. కల్యాణ్ రామ్, మంచు విష్ణు, మంచు మనోజ్, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, ఆది, నాగశౌర్య, సుమంత్ అశ్విన్, సుమంత్, సుశాంత్, బెల్లంకొండ శ్రీనివాస్ 11 మందీ ప్లాపులిచ్చారు. సక్సెస్ లిచ్చిన వాళ్ళల్లో నాని రెండు హిట్లతో వుంటే; రామ్, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ లు ఒక్కో ఫ్లాప్ కూడా ఇచ్చారు. నారారోహిత్ అయితే ఒక సక్సెస్ ఇచ్చి 5 ఫ్లాపులతో రికార్డు సాధించాడు. 

        పూర్తిగా ఫ్లాపయిన ‘బి’ స్టార్స్ లో కల్యాణ్ రామ్ ది భారీ ఆర్ధిక నష్టం పూరీ దర్శకత్వంలో ‘ఇజం’ తో. ఆ తర్వాత దూసుకొస్తున్న రాజ్ తరుణ్ కి రెండూ బ్రేకులే పడ్డాయి. సందీప్ కిషన్ డిటో. మంచు బ్రదర్స్ లో మనోజ్ రెండు సార్లు, విష్ణు ఒకసారీ బోల్తా పడ్డారు. ఆదికి రెండుకి రెండూ సున్నాగా మిగిలాయి. నాగశౌర్య మూడుకి మూడూ ఫ్లాపులిచాడు ( నాగశౌర్య- నారా రోహిత్ లు కలిసి జాయింటుగా ‘జ్యో అచ్యుతానంద’ తో సక్సెస్ అయ్యారు). సుమంత్ అశ్విన్, సుమంత్, సుశాంత్, బెల్లంకొండ శ్రీనివాస్ లు ఈ సంవత్సరం కూడా ఎంత ప్రయత్నించినా ఫలితమంటూ  లేకుండా పోయింది, వుండదు కూడా.  

        కామెడీ డిపార్ట్ మెంట్ లో అందరూ అపహాస్యం పాలయ్యారు. ఫ్లాపులతో తమ తమ  రొటీన్స్ ని కొనసాగించుకుంటూ అల్లరి నరేష్ రెండు, సునీల్ మూడూ ఫ్లాపులిచ్చి బిజీ అయ్యారు. కొత్త ఎంట్రీలుగా శ్రీనివాస రెడ్డి, సప్తగిరిలు వచ్చి తలో చెయ్యీ  వేశారు. కమెడియన్ల 7 కామెడీలూ కామెడీలై పోయాయి. వీళ్ళంతా ఒక చోట సమావేశమై అర్ధవంతమైన చర్చలు జరుపుకోకుంటే తెలుగు కామెడీలే రద్దయిన నోట్లై పోతాయి. 

        ఈ సంవత్సరం కొత్త హీరోయిన్ గా మెగా ఫ్యామిలీ నుంచి ‘ఒకమనసుతో’ నిహారిక వచ్చి ఆకట్టుకోలేక పోయింది. శ్రీవిష్ణు (అప్పట్లో ఒకడుండేవాడు), విజయ్ దేవరకొండ (పెళ్లిచూపులు), సందీప్ కుమార్ (వంగావీటి ) ఈ ముగ్గురే ఈ సంవత్సరం అనామక స్థాయినుంచి ‘బి’ స్టార్లుగా నియామక స్థాయికి చేరారు. కొత్తగా వచ్చిన శ్రీకాంత్ తనయుడు  రోషన్ ని నందినీ కాన్వెంట్ అనే వీణ సినిమా దెబ్బతీసింది.
                                                     
***
       
క విడుదలైన మొత్తం చిన్న చిన్న సినిమాలు 115 లో క్షణం, పెళ్లి చూపులు రెండే హిట్టయ్యాయి. చిన్న సినిమాలు ఏమాత్రం కళనీ, ట్రెండ్ నీ, జానర్ మర్యాదనీ  పట్టించుకోవడం లేదనీ మనకెప్పుడో తెలుసు. అయినా ఇలాగే తీస్తుంటారు. వీటిలో 60, 70 సినిమాల పేర్లు కూడా విని వుండరు ప్రేక్షకులు, ఎప్పుడు ఎక్కడ విడుదలయ్యాయో కూడా తెలీదు. ఈ కొత్త కొత్త దర్శకులు,నిర్మాతలు సరదా తెర్చుకోవడానికే తప్ప సినిమాలు తీయడానికి కాదు. సినిమాలు తీస్తే 115లో 113 ఎందుకు గల్లంతవుతాయి. అవి సినిమాలు కాదు, సరదాలు. ఇక ఈ కొత్త సంవత్సరం కూడా ఈ సరదాలు ఇంకా  తీర్చుకుని ఇంకో 150 తీసి అవతల పడేసే బోర విరుచుకు తిరిగే అవకాశం మోడీ ఇవ్వడం లేదు. బ్లాక్ మనీ సరదాలు అయిపోయాయ్, వైట్ మనీతో దురద తీర్చుకోవాలి. అది కూడా పన్నులు కట్టి తీ ర్చుకోవాలి. దురద లెక్కలు కూడా చూపించాలి. ఫేస్ బుక్ లో ఎవరే హంగామాలు చేసుకుని,  ఫారిన్ టూర్లేసుకుని పోస్టులు చేస్తున్నారో కనిపెట్టే సాఫ్ట్ వేర్ ని సిద్ధం చేసింది ఆదాయపన్ను శాఖ.
                                                      
***
 
       ఫ్లాపైన చిన్న సినిమాలు అన్నీ ఈ బాపతే అని కాదు. వీటిలో కమిట్ మెంట్ తో ఇద్దరు ప్రముఖులు తీసిన మనమంతా(చంద్ర శేఖర్ యేలేటి), మన వూరి రామాయణం (ప్రకాష్ రాజ్) వున్నాయి. ఇంకో కొత్త దర్శకుడు అనుదీప్ తీసిన పిట్ట గోడ వుంది.  అలాగే ప్రవీణ్ సత్తారు తీసిన గుంటూరు టాకీస్,  ఆర్పీ పట్నాయక్ తీసిన మనలో ఒక్కడు వున్నాయి. రొటీన్ కి భిన్నంగా తీసిన ఇవెందుకు ప్రేక్షకులకి నచ్చలేదో, ఇలాటిదే ‘అప్పట్లో ఒకడుండే వాడు’ ఎందుకునచ్చుతోందో పరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది.
                                                     
***
       
బ్బింగులు ఐదు హిట్టయ్యాయి- బిచ్చగాడు, మన్యం పులి, దంగల్, బాజీరావ్ మస్తానీ, ధోనీ.  మొత్తం డబ్బింగులు తమిళ, మలయాళ, కన్నడ 54 విడుదలైతే 49 ఫ్లాపయ్యాయి. వీటిలో రజనీకాంత్ కబాలీ కూడా వుంది. సూర్య నటించిన 24, విజయ్ నటించిన పోలీస్ పూర్తిగా ఫ్లాప్స్ అనలేం గానీ హిట్స్ కావు. అలాగే ధనుష్ నటించిన రెండూ- మాస్, రైల్, విశాల్ నటించిన రెండూ-రాయుడు, ఒక్కడొచ్చాడు; విక్రం నటించిన ఇంకొక్కడు- ఫ్లాపయ్యాయి. ‘బిచ్చగాడు’ ఆంథోనీ కూడా బేతాళుడు తో ఫెయిలయ్యాడు. బిచ్చగాడుతో తో బాటు మోహన్ లాల్ నటించిన మన్యం పులి రెండే తెలుగు ప్రేక్షకులకి నచ్చాయి. వీటితో బాటు హిందీ డబ్బింగులు- దంగల్, బాజీరావ్ మస్తానీ, ధోనీ లు విడుదలై ఫర్వాలేదన్పించే బిజినెస్ చేసుకున్నాయి. ఇక ఈ 54 కాక ఇంకో  10 హాలీవుడ్  డబ్బింగ్స్ విడుదలయ్యాయి.
                                               
***
      
మొత్తం తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి 231 సినిమాలు విడుదలయ్యాయి. అంటే వారానికి 4.44 సినిమాలు, రోజుకి 0.63 సినిమా విడుదలయ్యాయి. 231 లో ప్రేక్షకులు 21 మాత్రమే హిట్ చేశారు. అంటే పూర్తిగా మనసిచ్చి ప్రేక్షకులు నెలకి 1.75 సినిమా, వారానికి 0.43 సినిమా, రోజుకి 0.062 సినిమా చొప్పున మాత్రమే హిట్ సినిమాలు చూశారు. ప్రతిరోజూ 0.63 కొత్త సినిమా భారం ప్రేక్షకుల మీద మోపుతోంటే వాళ్ళు, సెలెక్టు చేసుకుని 0.062 మాత్రమే చూస్తున్నారు. భూమికీ ఆకాశానికీ మధ్య వున్నంత తేడా. 1500 కోట్ల విలువైన టాలీవుడ్ లో ఎంత వృధా శ్రమ జరుగుతోందో దీని బట్టి తెలుస్తోంది.
                2016 లో దర్శకుల పనితీరు గురించివచ్చే వారం తెలుసుకుందాం.

-సికిందర్
http://www.cinemabazaar.in