రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జనవరి 2017, ఆదివారం

బుక్ రివ్యూ!






     దివరకు అద్భుత సినీరంగం’, ‘సినిమా స్క్రిప్టు రచనా కళఅనే రెండు పుస్తకాలు రాసిన నాగేంద్రకుమార్ వేపూరి తాజాగా మరో రెండు పుస్తకాలు అందిస్తున్నారు. సినిమా నిర్మాణం-అవగాహనా గ్రంథం’, ‘సినిమా దర్శకత్వం-ప్రాథమిక సూత్రాలుఅనే ఈ రెండు పుస్తకాలు నిర్మాతలు, దర్శకులు కాగోరే వారికి మంచి రిఫరెన్సులుగా ఉపయోగపడతాయి. తను స్వయంగా ఓ చిన్నారి కోరికఅనే బాలల సినిమా నిర్మించి దర్శకత్వం వహించి, 2007 నంది అవార్డు అందుకున్న అనుభవంతో, ఇంకా అనేక సినిమా గ్రంథాలూ చదివి సంపాదించుకున్న విజ్ఞానంతో ఈ రచనల్ని చేశారు.

          కొత్తగా వచ్చే నిర్మాతలకి కౌన్సిలింగ్ అవసరమే. ఈ పని నిర్మాతల మండలి చేస్తూనే ఉంది. కానీ ఈ రంగంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న సీనియర్ నిర్మాతలే దెబ్బతినిపోతున్నారు. ఇక కొత్త నిర్మాతలెంత! ఈ రంగంలో ఎవరి సలహా సూచనలు ఎవరూ పాటించరు. ఎవరి యాక్షన్‌ప్లాన్ వారిదే. చిన్నసినిమాలు నిర్మించే కొత్త నిర్మాతల చేతిలో పగ్గాలుండొచ్చు. రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్నట్టు, షూటింగ్ షెడ్యూల్స్ కూడా దగ్గరుండి తయారుచేయించుకోవచ్చు. కానీ అగ్ర హీరోలతో నిర్మించడానికి వచ్చే కొత్త నిర్మాతలకి ఈ అదుపూ, ఆధిపత్యమూ ఉంటున్నాయా అన్నదే  ప్రశ్న. ఇంకా రచయిత ఈ రంగంలో అనేక కష్టనష్టాలుంటాయని చెప్పారు గానీ రాజకీయాల్ని ప్రస్తావించలేదు.

          అలాగే గత పదేళ్లుగా తెలుగు సినిమాల ట్రెండ్స్ ని గమనించనట్టు ఇంకా కళాఖండాలు, ఆత్మసంతృప్తి, సత్ సమాజ స్థాపన, ప్రేక్షకుల్ని చైతన్యవంతుల్ని చేయడం లాంటి లక్ష్యాలు కొత్త నిర్మాతలకి ఉండవచ్చన్నారు. ట్రెండ్స్ ని గమనించి ఉన్నట్టయితే ఇవి కాలం చెల్లిన లక్ష్యాలని తెలిసిపోతుంది. కొత్త నిర్మాతలు ఎలా ఉండాలి, ఎలాంటి సినిమాలు తీయాలీ వంటి ఆచరణ యోగ్యం కాని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సుని వదిలేస్తే, ఈ పుస్తకం మిగతా అంశాల్లో బాగా స్కోర్ చేస్తుంది. సినిమా నిర్మాణం-వ్యావహారిక విభాగాలు, సినిమా నిర్మాణం-కార్యనిర్వాహక విభాగాలు, 24 క్రాఫ్ట్స్, సినిమా నిర్మాణం-వివిధ దశలు, బడ్జెటింగ్, వివిధ రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్ పత్రాలు, ఇన్సూరెన్స్, సెన్సారింగ్, వివిధ రైట్స్, ప్రభుత్వ చట్టాలు, నిర్మాతల వెల్ఫేర్ ట్రస్ట్...ఇలా బ్యానర్ రిజిస్ట్రేషన్ దగ్గరనుంచి సినిమా ప్రదర్శన వరకూ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనేది చక్కగా వివరించారు. ఈ విజ్ఞానం కొత్త నిర్మాతలకి చాలా అవసరం. రచయిత పేర్కొన్నట్టు ఈ పుస్తకం రూపకల్పనకి ఓ పిహెచ్‌డికి అవసరమైనంత పరిశోధనంతా చేశారన్నది నిజం. తెలుగులో ఇలాంటిది ఇదే మొదటి పుస్తకం, కొత్తనిర్మాతలకి విజ్ఞాన సర్వస్వం.

          పోతే, టైటిల్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి పునర్ముద్రణలో సవరించుకుంటే బావుంటుంది. ఇప్పుడు నిబంధనలు మారాయి. అలాగే షూటింగ్‌కి సంబంధించి డైలీ షీట్స్ తప్పనిసరిగా అందచేయాలని ఛాంబర్ నియమం పెట్టింది. దీన్ని కూడా పునర్ముద్రణలో చేర్చడం అవసరం కావచ్చు.

          ఇక రెండో పుస్తకం సినిమా దర్శకత్వం గురించి. సినిమా దర్శకత్వం ప్రత్యక్షానుభవంతో కాక పుస్తకాలతో వస్తుందనుకోలేం. ఒక మేకప్‌మాన్ కావాలంటే టచప్ బాయ్‌గా, అసిస్టెంట్‌గా అయిదారేళ్లు అనుభవం సంపాదించాలి. స్టంట్ మాస్టర్ కావాలన్నా ఇంతే. ఫైటర్‌గా, అసిస్టెంట్‌గా 12 ఏళ్లు పనిచేయాలి. కానీ దర్శకులకి ఈ నిబంధనలు లేవు. ఇందుకే మిడిమిడి జ్ఞానంతో ఎందరో డైరెక్ట్ గా దర్శకుడైపోవాలని విఫలయత్నాలు చేస్తుంటారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ లో శిక్షణ పొంది వచ్చినా ముందుగా నిర్మాత వేసే ప్రశ్న-ఎవరి దగ్గర పనిచేశావ్? అని. వినాయక్, రాజమౌళి, పూరీ  జగన్నాధ్, సురేందర్‌రెడ్డి, గుణశేఖర్, హరీష్ శంకర్ లాంటి దర్శకులెందరో ఒకప్పుడు దర్శకత్వ శాఖలో కిందిస్థాయినుంచి నలిగి పైకి వచ్చిన వాళ్లే. రచయిత తన ఈ పుస్తకం చదవడంతోపాటు, విధిగా దర్శకత్వ శాఖలో ముందు పని నేర్చుకోవాలని సూచించి  ఉంటే బాగుండేది. చివర్లో దీన్ని గురించి అప్రధానంగా రెండువాక్యాలు రాసి వదిలేశారు కానీ, దాన్నే  ప్రధానం చేసి ఓ చాప్టరే రాయాల్సింది.

          ఇందులో స్క్రిప్టు-స్టోరీ బోర్డు రచన, వివిధ సాంకేతిక శాఖల పనివిధానం, చార్టులు తయారీ చేసుకోవడం, షూటింగ్ విధానం, సాంకేతిక పదజాలం, కెమెరాలు, కెమెరా షాట్స్, ఎడిటింగ్, అభినయ, నృత్య, సంగీత, శబ్ద కళలు మొదలైన అన్ని విభాగాల పరిచయం చేశారు. అయితే ఎడిటింగ్ గురించి మరింత విస్తరించి రాయాల్సింది.

          పోతే కథలో సస్పెన్స్ గురించి చెబుతూ అది పాత్రపరంగా సస్పెన్స్, ప్రేక్షకుల పరంగా సస్పెన్స్ అని రెండు రకాలుగా ఉంటుందన్నారు. అంటే మొదటిది సీన్-టు-సీన్ సస్పెన్స్, రెండోది ఎండ్‌సస్పెన్స్ అవుతాయి. సినిమాలకి మొదటిదే పనికొచ్చేది కానీ, రెండోది కాదు. సినిమాలకి వర్కవుట్ కాని ఈ ఎండ్ సస్పెన్స్‌వల్లే ఈ మధ్యే ఆ ఒక్కడునుంచీ వైకుంఠపాళివరకూ అట్టర్ ఫ్లాపయ్యాయి. రచయిత నాగేంద్రకుమార్ దీన్ని రికమెండ్ చేయకుండా ఉండాల్సింది.

-సికిందర్
(జూన్  30, 2011 ‘ఆంధ్రభూమి’)
* సినిమా దర్శకత్వం
(
ప్రాథమిక సూత్రాలు)
పేజీలు: 164, రూ.150/-
*
సినిమా నిర్మాణం
(
అవగాహనా గ్రంథం)
పేజీలు: 224, వెల: రూ.250/-
రచయిత: నాగేంద్రకుమార్ వేపూరి
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలు