రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, డిసెంబర్ 2016, ఆదివారం

రివ్యూ!




దర్శకత్వం : అరుణ్ పవార్
తారాగణం : సప్తగిరి, రోషినీ ప్రకాష్, అలీ, షకలక శంకర్, పోసాని, సాయాజీ షిండే, అజయ్ ఘోష్ తదితరులు
అడిషనల్ స్టోరీ- స్క్రీన్ ప్లే  : ఏ. సప్తగిరి, సంగీతం : బల్గానిన్, ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్  

బ్యానర్ : సత్యా  సెల్యూలయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్,

నిర్మాత : డాక్టర్ కె. రవికిరణ్ 

విడుదల : 23 డిసెంబర్, 2016
తె
లుగు కమెడియన్లు మామూలు హీరోలుగా కాదు, యాక్షన్ హీరోలవుతున్న ట్రెండ్ లో సప్తగిరి తన బండిని కూడా పట్టా లెక్కించుకుంటే, బులెట్ ట్రైన్ లా కళా జీవితం దూసుకుపోతుందనుకున్నాడు. చార్లీ చాప్లిన్ గొప్ప యాక్షన్ హీరోగా నటించబోయి, అదెంత వరస్ట్ గా వుంటుందో వార్నింగ్ ఇచ్చి వుంటే, జడుసుకుని  మరే తెలుగు కమెడియనూ అటువైపు చూసేవాడు కాదేమో- ఆయన మీద గౌరవం కొద్దీ. ఆల్రెడీ తెలుగులో ఒక కమెడియన్ యాక్షన్ హీరో అన్పించుకోవాలని నానా పాట్లు పడుతున్నాడు- ఇప్పుడు మరింకో కృష్ణుడుగా సప్తగిరి యాక్షన్ హీరోగానే కాకుండా,  సకల కళా వల్లభన్ అన్పించుకోవాలని కూడా పౌరాణికాల దగ్గర్నుంచీ ఫ్యామిలీల వరకూ తెగ సీన్స్ నటించేసి, సప్తగిరి షో కేస్ అన్పించుకున్నాడు. షో కేస్ లో శాంపిల్సే కదా వుంటాయి, సరుకు వుండదు. కనుక వివిధ నిర్మాతలూ దర్శకులూ ఇక ఈ శాంపిల్స్ చూసి, సప్తగిరి ఫైట్ చేసిన ఈ యాక్షన్ శాంపిల్ బావుంది, మేం ఆయన్ని పెట్టుకుని యాక్షన్ సినిమా తీసుకుంటాం; సప్తగిరి ఏడ్చిన ఈ మదర్ సెంటిమెంట్ శాంపిల్ బావుంది, మేం ఆయన్ని పెట్టి మదర్ సెంటిమెంటల్ లాగించుకుంటాం; సప్తగిరి విజృంభించిన ఆ పౌరాణిక శాంపిల్ బావుంది, మేం అతన్తో ఏకంగా మహాభారతానికే  తెరతీస్తాం;  సప్తగిరి గిరికీలు కొట్టిన ఆ జేమ్స్ బాండ్ - సూపర్ మేన్ డ్యూయెల్ శాంపిల్స్ చాలా చాలా బావున్నాయి, మేం ఆయన్తో సూపర్ డూపర్  బాండ్  టూ- ఇన్ - వన్ స్పై ఫాంటసీ మిక్సీ మసాలా తీసిపారేస్తా మనేసి - సెలక్టు చేసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్  బాగా ఉపయోగ పడుతుంది. మరి ప్రేక్షకుల సంగతి? ఈ ఒక్కో శాంపిల్స్ తో త్వరలో వచ్చే ఒక్కో బ్లాక్ బస్టర్  తర్వాత వరసగా చూసుకోవచ్చు, సప్తగిరి ఎక్కడికీ పోడు. కాకపోతే ఆ నిర్మాతలు, దర్శకులూ  సప్తగిరి స్క్రిప్టు రాస్తానంటే కూడా ఆ ప్యాకేజీని పకోడీ పొట్లంలా ఒప్పుకోవాలి. ఆయన ఉన్న హిట్టయిన తమిళ స్క్రిప్టుకి, అట్టర్ ఫ్లాప్ అడిషనల్ స్టోరీ వేసి, సూపర్ ఫ్లాప్ స్క్రీన్ ప్లే ఎలా రాస్తాడో కూడా ఈ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అంతా ఒక ఆదర్శప్రాయమైన శాంపిలే! ఈ స్క్రిప్టు అత్యంత అద్భుతం, అనిర్వనీయం, చార్లీ చాప్లిన్ కీ చుక్కలు చూపించే చమత్కృతి!






    ఇదన్నమాట కథ!
   పోలీసు వాళ్ళ కథ. పోలీసు (శివప్రసాద్) కొడుకు సప్తగిరి( సప్తగిరే!) సినిమా వేషాల పిచ్చితో ఏ పనీ చేయకుండా తిరుగుతూంటాడు. ఒక పోలీసు అధికారి (పోసాని) ని కలుపుకుని ఒక క్రిమినల్ గ్యాంగ్ పని చేస్తూంటుంది. ఇది సప్తగిరి తండ్రికి తెలిసిపోయిందని ప్లానేసి, అతణ్ణి ఒక ఫేక్ ఎన్ కౌంటర్లో చంపేస్తారు. ఉన్నతాధికారి (సాయాజీ షిండే) వచ్చి నష్టపరిహారంగా సప్తగిరికి కానిస్టేబుల్ పోస్టు ఇస్తాడు. కానిస్టేబుల్ జీవితం ఎలా వుంటుందో తోటి  కానిస్టేబుల్ (షకలక శంకర్) తో కలిసి చవిచూస్తాడు సప్తగిరి.  ఇంతలో తండ్రి దాచిపెట్టిన ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు తండ్రిది హత్య అని తెలుసుకున్న సప్తగిరి, తండ్రిని ఎలా ట్రాప్ చేసి చంపారో,  అలాగే వాళ్ళందర్నీ ట్రాప్ చేస్తాడు...



ఎలావుంది కథ
     2014లో తమిళంలో హిట్టయిన ‘తిరుడాన్ పోలీస్’ (దొంగ పోలీసులు) అనే ఒరిజినల్ కథ. ఇందులో ‘ఆడుకాలం’, ‘విశారణై’  లాంటి సమాంతర సినిమాల్లో నటించిన దినేష్ హీరో. ఇతను కమెడియన్ కాదు. ఈ సినిమాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్ శాఖలో పనిచేసిన కార్తీక్ రాజు కిది దర్శకుడుగా మొదటి సినిమా. తన పోలీసు తండ్రిని చంపిన పోలీసుల్ని పోలీసుద్యోగంలో చేరి పట్టుకున్న హీరో ఫన్నీ కథ ఇది. జాతీయ మీడియా కూడా ఈ సినిమాని ప్రశంసించింది. దీన్ని తెలుగులో సప్తగిరిని  హీరోగా చేసి తీశారు. ఒరిజినల్ మూవీ రియలిస్టిక్ అప్రోచ్ తో వుంటుంది. ఒరిజినల్ పోలీస్ క్వార్టర్స్ ని  లొకేషన్స్ గా  తీసుకుని, అక్కడే షూట్ చేశారు. పోలీస్ స్టేషన్లు, పోలీసు వాహనాలు, పోలీసులూ- ఆ మొత్తం వాతావరణమూ- 
అచ్చం నిజజీవితంలో చూస్తున్నంత వాస్తవికతతో వుంటాయి.



     ఎక్కడా ఇది సినిమా అన్నట్టు తీసి చూపిస్తున్నట్టు వుండదు. ‘పెళ్లి చూపులు’ లోని రియలిస్టిక్ అప్రోచే ఈ తమిళ హిట్ కి ప్రాణ మయ్యింది. కృత్రిమ మూస ఫార్ములా సినిమాలూ, వాటిలో  జీవితంతో సంబంధంలేని కృత్రిమ పాత్రలూ, వాటి సినిమాటిక్ డైలాగులూ, వేషాలూ కామెడీలూ చూసి చూసి విసుగెత్తిన ప్రేక్షకులూ, సమీక్షకులూ ఇది ప్రదర్శించిన నేచురాలిటీతో బాగా కనెక్ట్ అయిపోయారు. ఇందులో కామెడీ అంతా సున్నితమైనదే. కెమెరావర్క్ డెప్త్ తో కూడుకున్నది. విజువల్స్ అన్నీ కూడా అత్యంత కంఫర్టబుల్ గా, కంటి కింపుగా వుంటాయి. 

      ఈ కథని అడిషనల్ కథ పేరుతో టైగర్- సారీ-  రైటర్ గా సప్తగిరి ఇమేజి బిల్డప్ కోసం ఏవేవో సీన్లు వేసుకుని కిచిడీ చేశాడు. ఒరిజినల్లో లేని అన్ని రకాల పురాణ, ఫాంటసీ, సాంఘీక పాత్రల ప్రదర్శన చేసి సబ్జెక్టుని నేలకు దించాడు. ఒరిజినల్లో కేవలం ఖాళీగా వుండే హీరో పాత్రని, తను వేషాలేసి టాలెంట్ చూపించుకోవడానికి సినిమా పిచ్చిగల పాత్రగా మార్చేశాడు. కేవలం ఈ ఒరిజినల్ హిట్టయిన  కథని తన స్వార్ధంకోసం నిర్మాత మీద స్వారీ చేస్తూ, ఇంటర్వెల్ కల్లా ప్రేక్షకులు పారిపోయేలా చేశాడు!

ఎవరేం చేస్తారు?

       ఎవరేమీ చేయడానికీ ఇక్కడేమీ లేదు. ఈ సినిమానే గుంటూరు జిల్లా తిరునాళ్ళలో ఆడే సినిమా పేరడీ నాటకంలా చీప్ గా తయారయ్యాక, కథ విడిచి సప్తగిరి ప్రయోగాలన్నీ చేసుకునే ప్లాట్ ఫాంగా ఉపయోగించుకున్నాక, ఇంకెవరూ చేయడానికేమీ లేదు. ఒరిజినల్లో హీరోతో బాటు క్యారక్టర్ ఆర్టిస్టులు, పోలీసు పాత్రల్లో నటించిన వాళ్ళూ, ఆ పాత్రలకి సరిపోయే కొత్త ముఖాలు కావడంతో, ఆ సబ్జెక్టు దాని సహజత్వం కొద్దీ డిమాండ్ చేస్తున్న ఒద్దికైన, నిష్కల్మష, సిన్సియర్ కథా ప్రపంచంలో వాళ్ళంతా పాలూ నీళ్ళల్లా కలిసిపోయారు. తెలుగులో పోసాని, సాయాజీ షిండే, ఇంకో పెద్ద విలన్, హేమ లాంటి ఏకోన్ముఖ మూస ఫార్ములా నటుల్ని తీసుకోవడంతో -మార్పు లేని వాళ్ళ నటనలతో, అరుపులతో  ఫ్లేవర్ అంతా చెదిరిపోయింది. ఈ నటులకి ఒరిజినల్ చూపించి- మీరిలాగే, ఈ చిన్ని కథా ప్రపంచంలో ఒదిగిపోతూ- 


     - ఇలాగే సున్నితంగా సహజంగా నటించాలని చెప్పి వుంటే, అద్భుతాలు చేసి చూపించే వాళ్ళు. ఒక కొత్త పోసానీనీ, కొత్త షిండేనీ, కొత్త హేమనీ, కొత్త విలన్నీ చూసివుండే వాళ్ళం. వీళ్ళంతా  ఈ సినిమాలో నటించి సినిమాకి అన్యాయం చేయలేదు- ఒరిజినల్  సినిమా చూపించి సూచన లివ్వకుండా  వీళ్ళకే అన్యాయం చేశారు నిర్మాతా దర్శకుడూ సప్తగిరీ.

    సప్తగిరి కూడా ఒరిజనల్లో హీరో దినేష్ రేంజిలోనే తన పాత్రని వుంచుకుని, పైత్యాలన్నీ విసర్జించుకుని, ఒరిజినల్ కే  కట్టుబడి వుంటే అప్పుడతను సక్సెస్ ఫుల్ హీరో అన్పించుకునే వాడు. చిన్న చిన్న కామెడీ వేషాలేసిన రాజేంద్రప్రసాద్ ఇలాగే తిరుగు లేని హీరోగా చెలామణీ అయ్యాడు. ఇప్పుడు పెద్ద స్టార్లని చూసి పులిచారలు ప్రదర్శిం చుకోవాలని చూస్తున్న కొందరు కమెడియన్లలాగా, అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఓ చిరంజీవో బాలకృష్ణో  అవ్వాలనుకుని ఓవరాక్షన్ చేయలేదు.

       దర్శకుడు అరుణ్ పవార్ ఒరిజనల్లోని మేకింగ్ క్వాలిటీని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆసక్తి పుట్టించని రొటీన్ రొడ్డకొట్టుడు టేకింగ్ తో కానిచ్చేశాడు. సంగీతం, కెమెరా కూడా తన కంట్రోల్లో వున్నట్టు లేదు, ఇవి కూడా సప్తగిరి హస్తగత మైనట్టున్నాయి. 



చివరికేముంటుంది?           తలనొప్పి! ఇంటర్వెల్ కే కొందరు ప్రేక్షకులు పరారయ్యారు. సూపర్ పోలీసుగా సప్తగిరే  వాళ్ళని వెతికి పట్టుకువచ్చి మిగతా సినిమా చూపించుకోవాలి. అడిషనల్ స్టోరీ? స్క్రీన్ ప్లే? అంటే ఏమిటి? వాట్ డిడ్ హీ మీన్? నటనలో అన్ని టాలెంట్లు ప్రదర్శించింది గాక, ఇవి కూడానా? కనిపించని రెండు టాలెంట్లు ఇవే - అని సూపర్ పోలీసు డైలాగ్ కోసమా? ఓపెనింగ్ లోనే  ఎవత్తో ఒకత్తి ఒకాయన దగ్గర కొచ్చి కూతుర్ని ట్రాప్ చేసే సుత్తి సీనూ డైలాగులూ ఏమిటవి? ఆ వెంటనే భీకరంగా పీకలు తెగిపోతూ చెయిన్ స్నాచింగ్ దృశ్యాలేమిటి? ఇలా ఒరిజినల్ తీసిన దర్శకుడు ప్రారంభించ లేకనా? విజువల్ ఎఫెక్ట్స్ లో పని చేస్తూ ఒరిజినల్ దర్శకుడు కొన్నేళ్ళ పాటు రాసుకుంటూ కూర్చున్నాడు ఈ సబ్జెక్టు-జానర్ మర్యాద అనే పదార్ధాన్ని కాపాడుకుంటూ. అతడి అవగాహన పనికి రాలేదనా? తర్వాత ఉరుములేని పిడుగులా, భారీ సెట్టింగులతో రామాయణ సన్నివేశమేమిటి? అందులో దశరధుడు, రాముడు, సీతా తదితరుల ముందు తను కాషాయ వస్త్రాల్లో ఇంతలావు గొడ్డలుచ్చుకుని, పావుగంట పాటు అంతేసి పరశురామ వీర పరాక్రమ డైలాగుల మోతేమిటి? పద్యాలు కూడా పాడేస్తే అడిషనల్ టాలెంట్ అబ్బేదిగా? మళ్ళీ ఇంకో చోట తల్లిదండ్రుల ముందు (పాపం శివప్రసాద్- తులసి!) ఇంకో పావుగంట దుర్యోధన డైలాగులు దున్నుకోవడమేడమిటి? శివప్రసాద్, తులసిలకే గనుక స్వేచ్ఛ వుండి వుంటే పిచ్చాసుపత్రికి పంపించేవాళ్లు - కొడుకు ఏమైపోతున్నాడో అర్ధంగాక! నిజం, ఈ సీను అర్ధం సప్తగిరి పాత్రని -ఎవడ్రా ఈ లూజ్?- అనుకునేలానే తయారయ్యింది.

      ఒరిజినల్లో శుభ్రంగా క్వార్టర్స్ లో వుంటున్న పోలీసు కొడుకైన హీరో, పై అధికారి కొడుకూ  తేడా వచ్చి కొట్టుకుంటూ, తరుముకుంటూ పోలీస్ స్టేషన్ లో పడి, అక్కడా తన్నుకుని ఇంట్లో కొచ్చి పడే ఓపెనింగ్ సీన్ - కామిక్ జానర్ ని ఫిక్స్ చేసుకుంటూ హుషారెక్కిస్తూ తమాషాగా వుంటుంది. గబగబా ఇరవై నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది- తండ్రిని ఫాల్స్ ఎన్ కౌంటర్ లో చంపడంతో. సప్తగిరి దీన్ని గంటకి పైగా ఇంటర్వెల్ కి సాగ లాగాడు. దీంతో అంతవరకూ కథలేక, కథతో సంబంధంలేని ఏవేవో కామెడీలూ వేషాలూ వేసుకుంటూ కూర్చున్నాడు. ఒరిజినల్లో వున్న సీన్ల  అందాన్ని, అర్ధాన్నీ కూడా  మార్చేస్తూ ఇష్టారాజ్యంగా రాసేశాడు. 

      
ఒరిజినల్లో తండ్రి భౌతికకాయం బయట షామియానా కింద వుంటే  అక్కడే తల్లీ, కాలనీలోని వాళ్ళూ  దుఃఖంతో కూర్చుని వుంటారు. హీరో ఇంట్లో సోఫాలో ముడుచుకుని  పడుకుని వుంటాడు. వెంటనే ఈ సీను ఆలోచింప జేస్తుంది.  ఈసీను అర్ధమేమిటో పట్టించుకోకుండా, ఎమోషన్స్ ప్రదర్శనకి ఇదే ఛాన్సు అన్నట్టు, సప్తగిరి తల్లి పక్కనే కూర్చుని బోల్డు ఎమోషన్స్ కురిపించుకోవడంతో- సీనులో క్యారక్టర్ తాలూకు కొత్త విషయం బయటపడక ఫ్లాట్ గా తేలిపోయింది. క్యారక్టర్ని అర్ధం జేసుకుంటే కదా క్యారక్టర్ నడిపించే కథ బాగా అర్ధమయ్యేది.  

  
     ఇంకో సీన్లో ఒరిజినల్లో పోలీస్ కానిస్టేబుల్ అయిన హీరో, పైఅధికారి కూరగాయల బుట్టని ఇంటికి మోయాల్సి వస్తుంది. అప్పుడే హీరోయిన్ వస్తూంటే ఆమె ముందు  తెగ అవమానం ఫీలైపోతాడు. ఇది డైరెక్టు సీను. దీన్ని కూడా సప్తగిరి అభాసు చేశాడు. హీరోయిన్ వస్తూంటే కారు పక్కన నక్కుతాడు. ఆ కారు వెళ్ళిపోతే హీరోయిన్ కి దొరికి పోతాడు... బహుశా సప్తగిరి ఇంకా సినిమాల్లోకి రాకముందు సినిమాల్లో వచ్చేసి- అరిగిపోయిన సీన్ ఇది. ఎవరికీ ఈ సీనుతో నవ్వురాలేదు. తనే నవ్వుల పాలయ్యాడు అందరికీ తెలిసిన పాత కాపీ సీనుతో.

    హీరోయిన్ ఫ్యామిలీ కొత్తగా సామానుతో క్వార్టర్లోకి దిగుతూంటే,  ఫస్ట్ టైం అక్కడ హీరో ఆమెని చూసి,  అప్పుడే వచ్చిన పై అధికారి కొడుకుని అక్కడ ఇరికించేసి, తను జంటిల్ మేన్ లా ఆమెకి ఫోజిస్తాడు. ఇది ఉండీ లేని డైలాగులతో చాలా గమ్మత్తుగా వుంటుంది. ఈ ఒరిజినల్ సీనుని చెత్త చేశాడు సప్తగిరి. లారీలోంచి ఆమె దిగుతూంటే,  రాఘవేంద్రరావు రేంజిలో ఇమాజినేషన్ సీను వేసుకుని...అబ్బో....తనలో చాలా రోమాంటిక్కు టమారాలే వున్నాయి!



      సెకండాఫ్ లో కథ ఎటు పోయిందో, తండ్రి ని చంపిన వాళ్ళ మీద పగా  ఎటుపోయిందో ( పోతే పోయాడు ఫాదర్- వేషాలేసుకోవడానికి అడిషనల్ గా పోలీస్ డ్రెస్ కూడా వొకటి దొరికిందిగా) -అవన్నీ వదిలేసి- కనీసం ఇంకోవైపు లవ్ ట్రాక్ కంటిన్యూటీ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్నీ వదిలేసి - షకలక శంకర్ తో మంకీ మాస్కుల దగ్గర్నుంచీ, సూపర్ మేన్ కాస్ట్యూమ్స్ తో - వైర్ వర్క్ యాక్షన్ కోరియోగ్రఫీ మాట్లాడుకుని- ప్రభాస్ లా దున్నేస్తూ- ‘బాహుబలి’ లో వెళ్లి పడదామని విశ్వప్రయత్నం చేశాడు (తన పౌరాణిక టాలెంట్ ప్రదర్శనకి ఇప్పుడు పౌరాణికాలు ఎవరూ తీయరు కాబట్టి- తీస్తున్న ‘బాహుబలి’ నో, ‘శాతకర్ణి’ నో ప్రయత్నించుకోవాలి). ఇక ఫారిన్లో అర్ధనగ్న భామలతో అల్లు అర్జున్ లా ఇరగదీసిన డాన్సులైతే చెప్పనే అక్కర్లేదు! ఎలాటి ఒరిజినల్ ని ఏం చేసుకున్నాడు యాక్షన్ హీరోగా మారి  సప్తగిరి! .

    సప్తగిరి ఎక్స్ ప్రెస్ దూసుకెళ్ళ డానికి కనీసం రెండు పట్టాలైనా అవసరం. అవి ఏవీ? పట్టాలనే కథే లేకపోయాక, పాత్రే లేకపోయాక – బుల్లెట్ ట్రైన్ అయినా గాల్లో దూసుకెళ్ళే టెక్నాలజీతో వుందా?


-సికిందర్
http://www.cinemabazaar.in