రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, డిసెంబర్ 2016, సోమవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : సూరజ్

తారాగణం : విశాల్, తమన్నా, జగపతి బాబు, జయప్రకాష్, సూరి, వడివేలు, తరుణ్ అరోరా, తదితరులు
మాటలు : రాజేష్ ఏ. మూర్తి, పాటలు : చల్లా భాగ్యలక్ష్మి,  సంగీతం ; హిప్ హాప్ తమిళ,  నిర్మాత : జి. హరి
విడుదల : 23.12.16

        ***
         తమిళ మాస్ స్టార్ విశాల్ తో వచ్చిన సమస్య ఏమిటంటే అతను బీ- గ్రేడ్ కి సరిపోయే యాక్షన్ సినిమాలు చేస్తాడు. దీన్ని గుర్తించకుండా హిట్స్ రావడం లేదే అని బాధపడతాడు. ఎంత టాప్ హీరోయిన్స్ ని పెట్టుకుని ఏం లాభం సరయిన దర్శకుడు లేకపోతే. పాపం సినిమాకో టాప్ హీరోయిన్ అతడి ఎదుగుదల కోసం త్యాగాలు చేస్తున్నారు. ఇప్పుడు తమన్నా వంతు కూడా వచ్చింది. అయినా తెలుగులో కూడా విశాల్ సినిమా అంటే జనాలకి ఆసక్తి పోతోంది. ఒక్కడొచ్చినా, ఇంకెందరు హీరోయిన్లని వెంట బెట్టుకొచ్చినా, ఇప్పుడొచ్చిన సినిమాతో చెడగొట్టుకుంటూ వచ్చాడు. ఈ బాపతు సినిమా కథనాలు పూరీ జగన్నాథ్, శ్రీను  వైట్లలు ఎప్పుడో  చేసేశారు మళ్ళీ వాటి జోలికి వాళ్ళే పోలేనంతగా. విశాల్ కి తమిళంలో కొత్తగా అన్పించవచ్చు- కానీ తమిళ మసాలా దర్శకుడు సూరజ్ తెలుగు ఓల్డ్ ఫార్ములానే బీ- గ్రేడ్ గా తమిళంలో ‘కత్తి సందై’ (కత్తి పోరాటం) గా తీసి బాక్సాఫీసు పోరాటానికి దింపాడు. ఈ పోరాటం విశాల్ కి పర్మనెంట్ పద్మవ్యూహమే!
          ఇంతకీ ఒక్కడొచ్చాడు ఎందుకొచ్చాడు?  క్రిస్మస్ కి ఏ  స్క్రిప్ట్ మస్ మోసుకొచ్చాడు? ఒకసారి చూద్దాం.... 

కథ 
      డిసిపి చంద్రబోస్ (జగపతి బాబు) ఒక భారీగా నోట్లు తరలిస్తున్న ట్రక్కుని ఛేజ్ చేసి పట్టుకుంటాడు. ఆ క్రిమినల్ (తరుణ్ అరోరా) ఆఫర్ చేసే మొత్తాన్ని కాదని జైల్లో వేస్తాడు. ఆ ట్రక్కులో మూడొందల కొట్లుంటే యాభై కోట్లే వున్నాయని ప్రకటిస్తాడు. ఊర్నుంచి అర్జున్ (విశాల్) వస్తాడు.  సైకాలజీ చదువుతున్న దివ్య (తమన్నా) ని పూర్వజన్మ కట్టు కథలు చెప్తూ ప్రేమలోకి దింపడానికి ప్రయత్నిస్తూంటాడు. ఈమె కాలేజీలో అబ్నార్మల్ సైకాలజీ చెప్తున్న ప్రొఫెసర్,  అర్జున్ చెప్పే పూర్వజన్మ వృత్తాంతాల మీద స్టడీ చేయమంటాడు. అర్జున్ తనూ ఆమే గత జన్మలో ప్రేమికులమంటూ ఆ గుర్తులు ఇప్పుడు చూపించడం మొదలెడతాడు. ఆమె నమ్మేసి నిజంగానే ఇప్పుడు ప్రేమిస్తుంది. ఇంతకీ ఈమె డిసిపి  బోస్ చెల్లెలు. బోస్ అర్జున్ కి కొన్ని పరీక్షలు పెట్టి ఎంగేజ్ మెంట్ కి అంగీకరిస్తాడు. అంతలో  బోస్ ఇంటి మీద అర్జున్ రెయిడింగ్ చేస్తాడు. దాచిన రెండొందల యాభై కోట్లూ పట్టుకుని తను సిబిఐ నని చెప్తాడు. జైల్లోంచి క్రిమినల్ విడుదలై వచ్చి బోస్ నొక్కిన రెండొందల యాభై  కోట్లూ డిమాండ్ చేస్తాడు. సిబిఐ పట్టుకున్నాడని బోస్ సీసీ టీవీ చూపిస్తాడు. వీడు సిబిఐ కాదు, క్రిమినల్ అని ఈ క్రిమినల్ అనేసరికి షాక్ తింటాడు బోస్...


        ఇప్పుడు ఈ అర్జున్ అసలెవరు? ఎందుకొచ్చాడు? ఎందుకా డబ్బు కొట్టేశాడు? ఆ డబ్బుతో ఏం చేస్తాడు? - అనే సందేహాల కోసం మిగతా సినిమా చూడాలి ఓపిక వుంటే.


ఎలావుంది కథ 

        థల్ని వేలెత్తి చూపడానికి వీల్లేదు, వేలెత్తి చూపాల్సింది వాటిని చెడగొట్టే  కథనాలనే. ఈ కాన్సెప్ట్ పాతదే అయినా, ఎప్పుడూ పనికొచ్చేదే. ఇప్పుడు నోట్ల రద్దు నేపధ్యంలో ప్రధాని ఏదైతే చెప్తున్నాడో- దాన్నే చూపిస్తుందీ కథ. ఈ కథకి మంచి  మార్కెటబిలిటీ వుంది ట్రెండ్ లో వుంటూ.  నోట్ల రద్దుకంటే పూర్వం నుంచే ఈ అయిడియా తో సినిమా తీస్తూ వుండివుంటారు. కాబట్టి ఇందులో పట్టుకున్న వెయ్యీ ఐదొందల నోట్ల కథ- ఇప్పుడు నోట్ల రద్దు పరిధిలోకి రాకున్నా, ఆ డబ్బు ఎవరి దగ్గర్నుంచి ఎందుకు హీరో కాజేశాడన్నది,  ప్రధాని ప్రవచిస్తున్న అవినీతి కట్టడి చర్యలకి కనెక్ట్ అవుతుంది. తమిళ కథ కాబట్టి  తమిళనాడు రాజకీయాలకి సంబంధించే  వుండొచ్చు- ‘టీవీలూ గ్రైండర్లూ ఉచితంగా ఇస్తూ విద్యని కొనుక్కోమంటున్నారు’ అన్న హీరో ఆక్రోశం ప్రభుత్వాల ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. గ్రామాల్లో పథకాలు కాగితాలమీద అమలు చేస్తూ, నిధులు జేబుల్లో వేసుకునే ప్రజాప్రతినిధుల మీద ఈ కథ. పథకాల పేరుతో మీరు దోచుకుని నల్ల డబ్బుగా దాచుకుంటున్నది మా డబ్బే,  అది మాకే  చెందాలన్న హీరో డిమాండే  ఈ కాన్సెప్ట్. ఆ డబ్బుతో అన్ని సౌకర్యాలతో తన  స్వగ్రామాన్నే కొత్తగా నిర్మించుకుంటాడు హీరో. ఈ ప్రయోజనాత్మక కాన్సెప్ట్ ని పనికిరాని కథనంతో చెడగొట్టుకున్నారు.


ఎవరెలా చేశారు        మళ్ళీ విశాల్ బీ గ్రేడ్ కథనపు బాధితుడయ్యాడు. ఏది ప్రాణమో దాని కథనాన్నే పట్టుకోకుండా, గడ్డిపోచ కథనాల్ని పట్టుకుంటే,  స్టార్ పట్టుకున్నాడని చెప్పి గడ్డి పోచ కథనం కల్ప వృక్షమైపోదుగా? గలగలా కాసుల కుంభ వృష్టి కురిపించదుగా? కథ వదిలేసి ఫస్టాఫ్ పూరీ ఫార్మాట్లోకి , సెకండాఫ్ వైట్ల ఫార్మాట్ లోకీ  వెళ్ళిపోయానని  తెలుసుకోలేదు. దీంతో సెకండాఫ్ అయితే వైట్ల బ్రాండ్ బ్రహ్మనందం లాగా వడివేలు వచ్చేసి,  బ్రహ్మనందం డబ్బింగేసుకుని,  30-40 నిమిషాలూ  విశాల్ ని కన్పించకుండా చేశాడు. బ్రహ్మనందమైనా ఇలాటి దానికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు- ఒరేయ్ ఎడాపెడా సెకండాఫుల్లో  ఇలా నేను  చేసీ చేసే మూల కూర్చున్నానురా, ఇంకెందుకురా నన్ను పనిష్ చేస్తారు - అని అరిచి గోల పెట్టినట్టు లేదు. విశాల్ ఏం చేస్తున్నట్టు?  జ్ఞాపక శక్తి నశించిందని ఫార్మాట్ ప్రకారం విలన్ ఇంట్లో పడుకున్నాడు కథనపు బాధితుడిగా. ఫైట్లూ డాన్సులు మాత్రం బాగానే  చేశాడు. చిట్ట చివర బయటపడే డబ్బు రహస్యం దగ్గర- తన గ్రామం కథ ఫ్లాష్ బ్యాక్ వేసుకుని గానీ మళ్ళీ కథలోకి రాలేదు. ఇంటర్వెల్ దగ్గర, చివర్లో ఈ ఫ్లాష్ బ్యాక్ దగ్గర- ఈ రెండు చోట్ల మాత్రమే పాత్ర పరంగా తనకి బలం దొరికింది.

        పూరీ సినిమాల్లో అయితే హీరోయిన్ పోలీసు అధికారి కూతురవుతుంది,  కాకపోతే మాఫియా కూతురైనట్టు- ఇక్కడ తమన్నా పోలీసు అధికారి కూతురు. పూరీ సినిమా హీరోయిన్ లాగే ఫస్టాఫ్ లో హీరోకి అవసరమైన లవ్ స్టోరీకి సరిపడా రోమాన్సు ని సరఫరా చేసి, ఇక సెకండాఫ్ లో డ్యూటీ వుండదు గనుక- అప్పుడప్పుడూ ఓ  డాన్స్ చేసి మాత్రమే వెళ్లి పోతూంటుంది. 

        ఫస్టాఫ్ లో జగపతిబాబు డిసిపి పాత్ర, నటనా  నోట్ల రహస్యం అనే సస్పెన్సుతో   తనవెంట మనల్ని లాక్కు పోతున్నది కాస్తా-  సెకండాఫ్ లో హీరో మెమరీ లాస్ నటనకీ, కమెడియన్ చేసే రచ్చకీ పూర్తిగా కుదేలైపోయింది. ఇక డాక్టర్ బూత్రి అనే సైకియాట్రిస్టు పాత్రలో కమెడియన్ వడివేలు అవుట్ డేటెడ్ – అసందర్భ, నాటు, లౌడ్ కామెడీ దాదాపు సెకండాఫ్ ని విడవకుండా ఆక్రమించి సినిమాని చెల్లాచెదురు చేసింది. 


         
హిప్ హాప్ తమిళ మళ్ళీ తన సంగీతాన్నినేర్చుకోవడానికి ఈ సినిమాని వాడుకున్నాడు. అతను నిజంగా హిప్ హిప్ హుర్రే అవడానికి హిమాలయాలకి మించి ఎత్తు ఇంకా వుంది. తెలుగునాట 1980 లలో ప్రారంభమైన అయ్యప్ప దీక్షల ట్రెండ్ లో బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ ల అయ్యప్ప పాటలెంతో బావుండేవి. అవి మళ్ళీ వినాలన్పిస్తుంది హిప్ హాప్ రొప్పుల్ని చూస్తే. ‘మాలధారణం నియమాల తోరణం’ వింటే గానీ ప్రక్షాళన జరగదు.

      రిచర్డ్ ఎం. నాథన్ కెమెరా వర్క్ యాక్షన్ సీన్స్ లో బెటర్ గా వుంది. యాక్షన్ కోరియోగ్రఫీ కూడా బెటర్ గా వుంది. 

చివరికేమిటి 

      ఇది ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ కి కవల కథనం విషయంలో. ఒక సినిమాని దాదాపు ఫస్టాఫంతా కథలోకి తీసికెళ్లక పోయినా, కనీసం ఇంటర్వెల్లో అయినా మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇస్తే,  అంతవరకూ భరించిన వున్న విషయలేమిని క్షమించగలం. కానీ ప్రేక్షకుల్లోంచి అంత కేకలు పుట్టించిన ట్విస్ట్ ని కూడా పక్కన పెట్టి, మళ్ళీ సెకండాఫ్ లో కూడా  ఏటో వెళ్ళిపోయి విషయలేమిని ప్రదర్శించుకుంటే  క్షమించేది వుండదు. రెండోసారి క్షమాపణ వుండదు. అట్టర్ ఫ్లాప్ అని రాసి పెట్టుకోవడమే. ఫస్టాఫ్ లవ్ ట్రాకుతోనే గడిపేశారు. పూర్వజన్మ ప్రేమ అంటూ చాలా పేలవమైన, బోరు కొట్టే  లవ్ ట్రాక్. పైగా దీన్ని డిసిపి చెల్లెలైన హీరోయిన్ నమ్మేయడం. విశాల్- తమన్నా లాంటి మాస్ ఫాలోయింగ్ వున్న స్టార్స్ తో బీ- గ్రేడ్ ప్రేమ వ్యవహారం! విశాల్ రౌడీ ఫ్రెండ్స్  తో ఈ ప్రేమ ట్రాకులో నాటు కామెడీ. ఇంటర్వెల్ దగ్గరికి రాగానే విశాల్ పూరీ మార్కు ‘ఇజం’ ట్విస్టు ఇస్తాడు. జగపతిబాబు ముందు విశాల్- ఈ ప్రేమ ట్రాకు నువ్వు దాచుకున్న డబ్బు దగ్గరికి చేరడానికే నంటూ, సిబిఐ ఆఫీసర్ గా  ట్విస్టు ఇస్తాడు. ఈ అనూహ్య ట్విస్టుకి  పెద్ద పెట్టున ఈలలూ చప్పట్లూ హాల్లోంచి. చాలా హేపీగా ఫీలవుతాం. విశాల్ ఆ డబ్బు పట్టుకెళ్ళి పోయాక, వెంటనే జైల్లోంచి క్రిమినల్ వచ్చి,  విశాల్ సిబిఐ కాదూ  క్రిమినల్ అంటూ ఇంటర్వెల్లో ఇంకో ట్విస్టు - ఈ డబుల్ ధమకాతో  విశాల్ ఇమేజి, పాత్ర మీద నమ్మకం అమాంతం  పెరిగిపోయి మళ్ళీ ఈలలూ చప్పట్లూ హాల్లోంచి! ఇంకా చాలా  హేపీగా ఫీలవుతూ, ఇంటర్వెల్ బ్రేక్ లో దీని గురించే ఆలోచిస్తూంటాం. ఇలా ఇంటర్వెల్ బ్రేక్ లో ఆలోచనలకి పని చెప్పిన  సినిమాని చాలా కాలమైంది చూసి. 


       అంతే, ఇక సెకండాఫ్ మొదలైతే మళ్ళీ ఫస్టాఫ్ లాంటి తంతే. ప్రసాదం పెడుతున్నట్టు గంట కొట్టి పూజారి మాయమైనట్టు ప్లాట్ పాయింట్ వన్ తో కథ మాయం!  పూజారీ ప్రసాదం మాయమై, నిరాశగా చూస్తూంటే మళ్ళీ  ఠంగ్ ఠంగ్ మని గంట ! ఈసారి యాక్షన్ సీన్లో గాయపడ్డ విశాల్ కి జ్ఞాపకశక్తి పోయిందంటూ మరో ట్విస్టు! థ్రిల్లయి అలా చూస్తూంటే,  మళ్ళీ ప్రసాద మెత్తుకుని పూజారీ పరార్! దెయ్యంలా డాక్టర్ బూత్రీ ఎంట్రీ. ఇక ఈ దెయ్యం వదలదుగాక వదలదు...ప్లాట్ పాయింట్ వన్ ని హాంఫట్ చేసిన ఇలాటి సినిమాగా  మళ్ళీ,  దీని కవల అయిన  ‘సప్తగిరి గారి 
ప్యాసింజర్’ నే చూస్తాం.  

     75 ఏళ్లుగా అంతర్జాతీయ రీడర్ షిప్ ని  కలిగి వున్న జేమ్స్ హేడ్లీ ఛేజ్ నవలలు - దాదాపు 80- ఇప్పుడూ లభిస్తాయి. ఒకప్పుడు హిందీ సినిమాల్ని కూడా ఇవి ఇన్ స్పైర్ చేశాయి. ఇప్పుడు విశాల్ సినిమాలో ఇంటర్వెల్లో డబల్ ట్విస్టు తో ఏర్పడ్డ సిట్యుయేషన్స్ రెండూ - ఛేజ్ నవలల్లో వాతావరణాన్నే  తలపిస్తాయి. చాలా సీరియస్. కాకపోతే ఛేజ్  హీరో ప్లాన్ ని సస్పెన్స్ లో వుంచి ఇక్కడి దాకా నడపడు. హీరో ఏ ప్లానుతో చేస్తున్నాడో ముందే చెప్పేస్తాడు.   సినిమాలో విశాల్ ప్రేమ ట్రాకు ఉద్దేశం ముందు చెప్పకుండా నడిపినందు వల్లే అంత బోరు కొట్టింది. ఎండ్ సస్పెన్స్ పనికి రాదనేది ఇందుకే. ఆఫ్ కోర్స్, ఈ బోరు కొట్టించిన ప్రేమ ట్రాకుకి చివర్లో సిబిఐ ఆఫీసర్ గా హీరోకి ట్విస్ట్ ఇచ్చి, అంతసేపు కొట్టించిన బోరుకి కాంపెన్సేట్ చేశారు బాగానే వుంది, కానీ ఇక్కడ ఒక విషయం బాగా గుర్తు  పెట్టుకోవాలి. ఒక అంశం చుట్టూ సస్పెన్స్ ఏర్పడి వుంటే దానికి రెండు పార్శ్వాలుంటాయి. ఒక పార్శ్వంలో ఎందుకు? అన్న ప్రశ్న, ఇంకో పార్శ్వంలో ఎవరు? అన్న ప్రశ్న. ఈ రెండు ప్రశ్నల్నీ దాచి పెట్టి దోబూచు లాడితే, ఈ ప్రేమ ట్రాకులాగే బోరు కొడుతుంది. అది క్లోజుడు సస్పెన్స్, లేదా ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఏదో ఒక ప్రశ్నని ఓపెన్ చేసి నడపాలి. ఒకటి- విశాల్ ఎవరు? అన్న ప్రశ్న కి జవాబు దాచి పెట్టి- ఎందుకు? అన్న రెండో ప్రశ్నకి  ప్రేమ ట్రాకు దేనికో చెప్పేయడం. ఈ ట్రాకు ముగిసి విశాల్ గోల్ ని రీచ్ అయ్యాక, అప్పుడు  అసలతను ఎవరో (సిబిఐ) చెప్పడం. సినిమాలో విశాల్ గోల్ ని రీచ్ అయ్యాకే అతనెవరో (సిబిఐ) చెప్పారు బాగానే వుంగానీ,  అదే సమయంలో ప్రేమ ట్రాకు దేనికనే  ప్రశ్నకి  జవాబు కూడా దాచి పెట్టారు- రెండూ దాచి పెట్టారు. దీనివల్ల ఈ ప్రేమ ట్రా కూ, విశాల్ క్యారక్టరూ ఏదీ అర్ధం గాక బోరు కొట్టాయి. అంత బోరు కొట్టించిన  ప్రేమ ట్రాకుకి చివర్లో ట్విస్టు ఇస్తూ కాంపెన్సేట్ చేసే అవసరమెందుకు? బోరు కొట్టించి ఆపై కాంపెన్సేట్ చేసే అవసరమే లేని టెక్నిక్ వుండగా? దీన్ని బాగా అర్ధం జేసుకుని గుర్తు పెట్టుకోవాలి. 


       ఛేజ్ హీరో ఎందుకు చేస్తున్నాడో ముందే చెప్పేస్తాడు, అతనెవరో పాయింటు కొచ్చినప్పుడు రివీల్ చేస్తాడు. క్యారక్టర్ ని సస్పెన్స్ లో వుంచవచ్చుగానీ, కథనాన్ని వుం చకూడదు. కథనం ఎప్పుడూ సీన్ టు సీన్ సస్పెన్స్ తోనే  వుండాలి, ఎండ్ సస్పెన్స్ తో కాదు. స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ మీద కథ ప్లే అయ్యేదే తప్ప, మూసి పెట్టేది కాదు. 

        విశాల్ సిబిఐ అన్న మొదటి ట్విస్టూ,  దాని ఫాలో అప్ గా- బంగాళా అంతా కొల్లగొడుతూ విపరీతమైన డబ్బు కట్టలు తీసే థ్రిల్లింగ్ బిల్డప్పూ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా మ్యాటర్ ని ప్రోది చేశాయి. ఇక్కడే కథ సాంద్రత పెరిగింది- ప్లాట్ పాయింట్ వన్ కాబట్టి.

        దీని తర్వాత వెంటనే మిడిల్ ని ప్రారంభిస్తూ జగపతి దగ్గరికి క్రిమినల్ వచ్చి,  హీరో సిబిఐ కాదూ క్రిమినల్ అన్నపుడు ఈ ఇంటర్వెల్ ట్విస్టుతో కథని ఇంకెవ్వరూ ఆపలేనంతగా సెకండాఫ్ కి టేకాఫ్ తీసుకుంది. మరి ఇంత టేకాఫ్ తీసుకున్న కథ సెకండాఫ్ అనే బెర్ముడా ట్రయాంగిల్లో ఎందుకు అంతర్ధానమయ్యింది? బేస్ మర్చిపోవడం వల్ల- గ్రౌండ్ కంట్రోల్ ని బేఖాతరు చేయడం వల్ల. ఆ బేస్ మొదటి ట్విస్ట్ అయితే, గ్రౌండ్ కంట్రోల్ రెండో ట్విస్టు. ఈ రెండో ట్విస్టు సిట్యుయేషనే  ఇప్పుడు జేమ్స్ హేడ్లీ ఛేజ్ ని ఇక్కడికి రప్పిస్తోంది. ఛేజ్ ని - ‘ది కింగ్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్ రైటర్స్’ అంటారు.

        ఛేజ్ క్రిమినల్ సైలెంట్ గా వస్తాడు. వస్తున్నట్టుగా కూడా చూడం. కాలింగ్ బెల్ మో గుతూంటే లోపలున్న వ్యక్తి వెళ్లి  డోర్ తీస్తాడు. షాక్ అవుతాడు ఎదురుగా వున్న క్రిమినల్ ని చూసి. క్రిమినల్ మహేష్ మంజ్రేకర్ లా నింపాదిగా సైలెంట్ గా ఓ స్మైలిస్తాడు. డోర్ తీసిన వ్యక్తికి  చెమట్లు పట్టేస్తూంటాయి. నాలిక పిడచగట్టుకు పోతుంది. చేతులు గజగజ వణుకుతూంటాయి... క్రిమినల్ రిక్వెస్ట్ చేసుకుని లోపలి కొచ్చి కూర్చుంటాడు. సిగరెట్ వెల్గిస్తూ మంచినీళ్ళు ఇమ్మంటాడు. మంత్రించినట్టూ వెళ్లి ఆ వ్యక్తి  మంచినీళ్ళు తెచ్చి అందిస్తాడు. నీ కూతురూ భార్యా క్షేమంగా వున్నారా? -అని అడుగుతాడు క్రిమినల్ గటగటా నీళ్ళు తాగేసి. ఆ వ్యక్తి చెప్పలేని భయంతో చూసి కూలబడతాడు. క్రేజీగా ఫారిన్ టూర్ పంపించావేంటి నా కరెన్సీతో ?- అంటాడు క్రిమినల్ సిగరెట్ పొగ గుప్పున ఆ వ్యక్తి మొహం మీదికి వూదుతూ.  వూపిరాడక ఆ వ్యక్తి ఎలాగో గొంతు పెగల్చుకుని- నీ డబ్బూ....నీ డబ్బూ...అని నసుగుతాడు కంగారుగా.
 
        క్రిమినల్ కి విసుగుపుట్టి, కాలుతున్న సిగరెట్ పీకని అలాగే  గ్లాసు అంచుకి రుద్ది ఆర్పేసి- ఎక్కడ దాచావ్?- అని గాజుకళ్ళతో తీక్షణంగా చూస్తూ- విషం చిమ్ముతున్నట్టున్న పెదాల  మధ్య నుంచి కటువుగా అంటూ, సిగరెట్ పీకని కిందకి జారవిడుస్తాడు....

        ఇలా వుంటుంది సన్నివేశం- డిటైల్డ్ గా, డిస్టర్ బెన్సింగ్ గా...క్రిమినల్ వైపు నుంచి కూల్ గా వుంటే, బాధితుడి వైపునుంచి హాట్ హాట్ గా ద్వంద్వాలు ప్లే అవుతూంటాయి. రాం గోపాల్ వర్మ సినిమాల్లో క్రైం సీన్లు అంత క్వాలిటీగా ఎందుకుంటాయంటే, ఆయన బాగా నవలలు చదవడం వల్లే. సినిమాలే  చూస్తే ఇంత సజీవ సృజన సాధ్యం కాదు. ఎందుకంటే సినిమాల్ని ఆబ్జెక్టివ్ గా చూస్తాం, నవలల్ని సబ్జెక్టివ్ గా చదువుకుంటాం. ఇలాటి సీన్ని  సబ్ కాన్షస్ లో ముద్రించుకునేట్టు పేసింగ్ ఇవ్వాలి. ఇవ్వాలంటే టైం తీసుకోవాలి. సీను పాత్రలనుంచి అంతర్గతంగా సబ్జెక్టివ్ గా వూడిపడాలి. బహిర్గతంగా గా పాత్రల  మీద ఆబ్జెక్టివ్ గా రుద్దడం కాదు. రెండో ట్విస్టులో జగపతిబాబు దగ్గరికి క్రిమినల్ తన 250  కోట్ల డబ్బు కోసం వచ్చినప్పుడు,  పైన చెప్పుకున్న డ్రామా ప్లే అయినప్పుడు అది సబ్ కాన్షస్ లో బాగా ఇంకుతుంది. బ్లో హాట్- బ్లో కూల్ అన్నట్టు నెమ్మది నెమ్మదిగా సీను టార్చర్ పెడుతూ, క్లయిమాక్స్ అందుకున్నప్పుడు - విశాల్ సిబిఐ కాదూ క్రిమినల్ అన్న  మాటతో బ్లాస్ట్ అవ్వాలి.

        సిట్యుయేషన్ డిమాండ్ చేస్తున్న క్రియేటివిటీతో ఇంత గ్రాఫికల్ గా డైరెక్టర్ సీన్ని డెవలప్ చేసినప్పుడు, ఇక  ససేమిరా దీన్ని విడిచి ముందుకు వేరే కథనం పట్టుకుని కామెడీ అంటూ, వడివేలు అంటూ దారితప్పి పోడు. రివీల్ చేయడానికి ముందున్న ఇంకా మంచి కాన్సెప్ట్ కి విలువలేకుండా- అప్పటికి ప్రేక్షకుల సహనం నశించేలా చేసుకోడు.

        పై సీన్ని ఎంత హడావిడిగా తూతూ మంత్రంగా నడిపేసి ట్విస్టు ఇచ్చాడంటే, ఆ ట్విస్టు ప్రేక్షకులకి ఉపయోగ పడిందేమో గానీ, దాని అల్లాటప్పా పూర్వ రంగం మాత్రం సెకండాఫ్ లో కథకి దర్శకుడికి హాని చేసింది. పోనీ, ఆ వెంటనే మెమరీ లాస్ ట్విస్టు నైనా గౌరవించి దానిమీద గేమ్ ఆడేడా అంటే, దాంట్లోకి వడివేలు ని దూర్చి కంగాళీ చేశాడు. 

        ఇంటర్వెల్లో రెండు ట్విస్టులు, క్లయిమాక్స్ లో ఈ ట్విస్టులకి జస్టిఫికేషన్ పెట్టుకుని- మిగిలిన భాగమంతా సంబంధం లేని గోల కామెడీకీ – ‘గే’ కామెడీకీ తార్చేశాడు.

        1990 ల వరకూ సినిమాలు ఫస్టాఫ్ అంతా కామెడీతో ఎంటర్ టైన్  చేసి,  సెకండాఫ్ లో సీరియెస్ గా కథే చెప్పేవి. సెకండాఫ్ లో కామెడీ లేదని ప్రేక్షకులు గోల చేసే వాళ్ళు కాదు. ఫస్టాఫ్ లో బాగానే  నవ్వించాడు కదాని,  సెకండాఫ్ లో చేతులు కట్టుకుని సీరియస్ గా కథ చూసే వాళ్ళు. ఆ తర్వాత 2000 నుంచి ప్రారంభమైన యూత్ సినిమాలతోనే కథంటే గౌరవం తగ్గి- మొత్తం ఏదో ఎంటర్ టైన్ చేస్తే చాలనే ధోరణికి అలవాటు చేశారు ప్రేక్షకుల్ని. వెరీ బ్యాడ్ సిట్యుయేషన్. ఎటూ కాని  ‘గే’- స్క్రిప్టులు తయారవుతున్నాయి.

-సికిందర్ 
http://www.cinemabazaar.in