రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ:












రచన-  దర్శకత్వం: విరించి వర్మ

తారాగణం: నాని, అనూ ఇమ్మాన్యుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, సత్య, పోసాని కృష్ణమురళి, రాజ్‌ తరుణ్‌ తదితరులు
సంగీతం: గోపి సుందర్‌ ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
బ్యానర్‌: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కెవా మూవీస్‌
నిర్మాతలు: పి. కిరణ్, గీత గోళ్ల
విడుదల : సెప్టెంబరు 23, 2016
***

        4-జి హీరోగా ‘నేచురల్ స్టార్’ అన్పించుకుంటున్న నాని  అన్నేచురల్ గా ఏ పనీ చెయ్యడనే నమ్మకం వుంటుంది- బయ్యర్లకీ, ప్రేక్షకులకీ. ఆ నమ్మకంతో వచ్చిన సినిమాని  కళ్ళకద్దుకుని కొంటారు, చూస్తారు. ఒక ‘భలే భలే మగాడివోయ్’ కామెడీ నటించాం కదా, ఇంకో ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ అనే యాక్షన్ అందించాం కదా, మరింకో ‘జంటిల్ మన్’ అనే థ్రిల్లర్  కూడా ఇచ్చాం కదా- ఈసారి ఓ పరమ  లైటర్ వీన్ లవ్ స్టోరీ ఇచ్చి చూద్దాం ఏమంటారో- అని ‘మజ్నూ’ గా మారిపోయి వచ్చేశాడు నాని ఇద్దరు లైలాల్ని వెంటేసుకుని. ఇద్దరు లైలాల మజ్నూ అంటేనే ముక్కోణ ప్రేమ కథకి ఇదేదో ఆధునిక నమూనా  యేమోనని  కొత్త ఆశ చిగురిస్తుంది మనలాంటి ఆశాజీవులకి. మనం జీవిస్తేనే బయ్యర్లకి కాస్త వూపిరి అందుతుంది- మనం జీవించామో లేదో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం....

కథ 
      భీమవరం కుర్రాడు ఆదిత్య (నాని) కి హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో  జాబ్ వస్తుంది. దీంతో  ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని వస్తూంటే  కిరణ్మయి (అనూ ఇమ్మాన్యుయేల్‌) అనే అమ్మాయి బైక్ తో యాక్సిడెంట్ చేస్తుంది. ఆమెని చూడగానే ప్రేమలో పడి జాబ్ లో జాయినవడం మానేస్తాడు. ఆమెని ఫాలో అవుతూ ఆమె చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయి ప్రేమించడం మొదలెడతాడు. కొంత బెట్టు చేసి ఆమె కూడా ప్రేమిస్తుంది. అప్పుడామెకి తన కోసం జాబ్ మానుకున్నాడని తెలిసి వెళ్లి జాబ్ లో చేరమంటుంది. చేరనంటాడు. అతడితో మాటలు మానేస్తుంది. అతడికీ వొళ్ళు మండి గుడ్ బై కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. 

        హైదరాబాద్ లో దర్శకుడు రాజమౌళికి అసిస్టెంట్ గా చేరతాడు. ఒకరోజు ఆదిత్య తన ఫ్రెండ్ (సత్య) గర్ల్ ఫ్రెండ్ ని చూసి మనసు పారేసుకుంటే,  ఆ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ ని ఆదిత్యకి త్యాగం చేస్తాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ సుమ (ప్రియాశ్రీ) ఆదిత్యతో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడ్డాక భీమవరం నుంచి కిరణ్మయి వస్తుంది. చూస్తే ఆమే సుమా కజిన్స్. ఆమె రావడంతో ఇరుకున పడతాడు ఆదిత్య. దీంతో ఇకపైన ఏం జరిగిందనేది మిగతా కథ.  

ఎలా వుంది కథ 
      లక్ష సార్లు చూసేసిన కథలా లేదూ? రోజులు మారినా ప్రేమ కథల తీరు మారుతోందన్పిస్తోందా, లేదు కదూ? ఓ  క్రేజ్ వున్న హీరో దొరికితే చాలు, కాలం చెల్లిన అవే ప్రేమకథలని ఈజీగా పెట్టి లాగించెయ్య వచ్చన్న ధోరణికి ఇది నిలువుటద్దంలా కన్పిస్తుంది. ప్రేక్షకులకి  కథని అమ్మడంగా గాక, హీరో క్రేజ్ ని సొమ్ము చేసుకోడంగా సాగుతోంది. అబ్బాయి ఒకమ్మాయిని ప్రేమించాడు, విడిపోయాడు, మరో అమ్మాయిని ప్రేమించాడు, మళ్ళీ మొదటి అమ్మాయి వస్తే రెండో అమ్మాయిని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు- అయినా మొదటి అమ్మాయి మనసు మార్చుకోకుండా వేరే పెళ్లి చేసుకుంటూంటే, మూటా ముల్లె సర్దుకుని రైల్వే స్టేషన్ కెళ్ళి పోయాడు, రెండో అమ్మాయి పెళ్లి పీటలమీద మొదటి అమ్మాయి మనసు మార్చితే, పెళ్లి బట్టల్లోనే  మొదటి అమ్మాయి పెళ్ళికి ఎగనామం పెట్టి- కన్నవాళ్ళ పరువు నిలువునా తీసి-   తన 'అద్భుత- మిడిల్ మటాష్  ప్రేమ' కోసం రైల్వే స్టేషన్ కి పరుగెత్తింది... అంటూ రైల్వే స్టేషన్ లో ముగిసే ఈ ముక్కోణపు ప్రేమ కథ ఇంకానా! ఇంకా ఇంకానా!! ముందుగా దర్శకులు అర్ధంజేసుకోవాల్సిం దేమిటంటే,  ఇంకా ఏవో ఊకదంపుడు లైటర్ వీన్ ప్రేమకథలంటూ ప్రేక్షకుల ప్రాణం తీయకుండా, అంతగా ఫక్తు అద్భుత ప్రేమలే తీయాలని ఉబాలాటంగా వుంటే, అన్ని కోణాల్లో బలమైన కథలతో, సంగీత సాహిత్యాలతో, తిరుగులేని కమర్షియాలిటీతో,   ‘గీతాంజలి’ లా తీసి ప్రేక్షకుల్ని కదిలించగల్గే ఛాలెంజిని స్వీకరించాలి.

ఎవరెలా చేశారు
        హీరో నాని ఈ సబ్జెక్టుని ఎంచుకునే ముందు తెలుగు సినిమా ప్రేమ కథల మూస ధోరణిని తెలుసుకున్నట్టు లేదు. ఎందరో  చిన్నా పెద్దా,  కొత్తా పాతా హీరోలు ఎప్పుడో చేసేసిన సబ్జెక్టుని ఇప్పుడింత  పనిగట్టుకుని తను నటించాడంటేనే ఆ స్పృహ మీద అనుమానమేస్తోంది. ‘భలేభలే మగాడివోయ్’ లాంటి వినూత్న రోమాంటిక్ కామెడీ ప్రేమ కథ కాదు- ప్రేమకథ కాకుండా, ప్రేమ కోసం మతిమరుపు  అనే తన లోపాన్ని జయించే క్యారక్టరైజేషన్ గాబట్టే అట్టర్ ఫ్లాప్ రొటీన్ మూస ప్రేమల బారి నుంచి బయటడి,  అది అంత హిట్టవగల్గింది. మతిమరుపే  కథనంగా నడిచి ఎంటర్ టెయిన్ చేసింది. గత రివ్యూలలో కొన్ని సార్లు చెప్పుకున్నట్టు- ఒఠ్ఠి ప్రేమ కథలకి ఎప్పుడో కాలం చెల్లి, ప్రేమని నేపధ్యంగా పెట్టుకుని- ఇంకేదో పాయింటుతో  కథనం చేసిన సినిమాలే హిట్టవుతూ వస్తున్నాయి- ‘భలేభలే మగాడివోయ్’ సహా. ఈ రహస్యం తెలుసుకోకుండా, ఒక 4-జి హీరోగా నాని ఇంకా 2- లేబర్ ప్రేమలే నటిస్తానంటే మనమేమంటాం!!

        ఈ సినిమాలో నాని నేచురల్ స్టార్ అనే తన బిరుదుకి తగ్గకుండా నటించాడు. ఇందులో అనుమానం లేదు- నటించిన పాత్రతోనే పేచీ. ఇంకోసారి ఇలాటి టీనేజీ అపరిపక్వ ప్రేమ పాత్రలు నటించకుండా వుంటే మేలు. హిందీలో అనురాగ్ కశ్యప్ ‘దేవదాసు’ ని  ‘దేవ్ –డి’ గా మార్చి పాత కథని ఆధునికంగా ఎలా చెప్పి హిట్ చేశాడో మనకి తెలుసు. అలాగే మధ్య యుగాల ‘మజ్ను’ తో మరుపురాని 4-జీ లవ్ పాత్ర చేయవచ్చు. ఇకముందు నాని ఈ కోవలో ఆలోచించాల్సి వుంది. 

        హీరోయిన్లిద్దరూ రొటీన్ పాత్రల్లోనే కన్పిస్తారు. ఒక హీరోయిన్ ఆధునిక పాత్రలో వుంటే, రెండో హీరౌయిన్ సాంప్రదాయ పాత్రలో వుండే ఫార్ములా కొలమానాలతో మార్పు లేకుండా కన్పిస్తారు. ఇద్దరూ కజిన్స్ అయినప్పుడు ఒకలా ఎందుకుండ కూడదు? బిగ్ బడ్జెట్ ఫార్ములా సినిమాల్లో పాత్రలే నేచురల్ స్టార్ లవ్ స్టోరీలోనూ వుండాలా?

        ఇక సహాయ పాత్రాల్లో సప్తగిరి, పోసాని, సత్య, వెన్నెల కిషోర్ లు కపిస్తారు. చివర్లో అతిధి పాత్రలో 4- జి హీరో రాజ్ తరుణ్ వచ్చి అర్ధాంతరంగా మాయమైపోతాడు. 

        టెక్నికల్ గా సినిమాకి కెమెరా వర్క్ బావుంది.  విస్తరించిన భీమవరం లొకేషన్స్ ని మొదటిసారిగా చూపించిన సినిమా ఇదే. ఇంకా పాత భీమవరాన్ని కూడా చూపించి వుండాల్సింది. అలాగే పాటలూ చూస్తున్నంత సేపూ బావున్నాయి. 

చివరికేమిటి 
       సెంటి మెంట్లతో ‘ఉయ్యాల జంపాల’ అనే హిట్ తీసిన దర్శకుడు విరించి వర్మ ఈ రెండో సినిమాకి కష్టపడిందేమీ లేదని తనకీ తెలిసే వుంటుంది. ఎప్పుడో ఎందరెందరో తీసేసిన అదే పాత విషయాన్నీ, రొటీన్ సీన్స్ నీ, డబల్ రొటీన్ ఇంటర్వెల్ సీన్ నీ, పరమ రొటీన్ రైల్వే స్టేషన్ క్లయిమాక్స్ నీ పెట్టుకుని ముందు  రాసేసి- తీసేసి ఓ పని అయిందన్పించాడు తప్పితే- ఒక అప్ కమింగ్ ప్రామిజింగ్ డైరెక్టర్ గా తనదంటూ సొంతంగా క్రియేట్ చేసిందేమీ లేదంటే  లేనే లేదు. వచ్చిన కొత్త దర్శకుడు కూడా ఇడ్లీ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఇలాగే కదా వుంటుందనే ధోరణిలో సినిమాలూ తీస్తూపోవడమే విచారకరమైన విషయం. ఇలాటి రీసైక్లింగ్ కాపీ సినిమాలు తీసేవాళ్ళు ఎందరో  వున్నారింకా- ప్రత్యేకంగా విరించి వర్మ కూడా వచ్చి అదే పని చేస్తే కొత్తగా రావడమెందుకు? రచన - అని తన పేరేసుకోకుండా ‘వివిధ మిడిల్ మటాష్ యూత్ సినిమాలు’ అని వేయడం కరెక్టు. మనక్కావాల్సింది సినిమాల్లోంచి సినిమాని పుట్టించే కొత్త దర్శకుడు కాదు, నడుస్తున్న యువప్రపంచం లోంచి నవయుగపు సినిమాలు తీసే మార్గదర్శి. 

        ఇలాటి ట్రయాంగిల్ లవ్ తో సెకండాఫ్ ఏమవుతుందో ఇలాటి  సినిమాలు మాత్రమే ఎన్నోచూసి స్ఫూర్తి పొందినట్టున్న  దర్శకుడు విరించి వర్మకి స్క్రీన్ ప్లే పరంగా  తెలిసిందో  లేదో గానీ- ఒక్కటే జరుగుతుంది ఈ సినిమాలో లాగే - సెకండాఫ్ నడపడానికి విషయం లేకపోవడం! విషయమంతా ఇంటర్వెల్ కి ముందే అయిపోయింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని కామెడీ చేస్తూ ఎవరైనా ఫస్టాఫ్ ఆహా ఓహో అన్పించవచ్చు- దీనికి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ వుండదు. ఆ ప్రేమల్లో సమస్యేమిటో  చెప్పాక- ఆ సమస్యతో సెకండాఫ్ కొచ్చేసరికి తెలుస్తుంది అసలు సత్తా. ఎప్పుడైతే ఉన్నత విద్య చదివిన- చదువుతున్న హీరో హీరోయిన్లు ఇలా ఉత్తుత్తి మాటలకే చిన్నపిల్లల్లా విడిపోయే లైటర్ వీన్ బోరు కథల్లో- విడిపోయాక  కలవడం కూడా అంతే చిన్న పిల్లలాటలా ఉండక ఏమవుతుంది. గత కొన్ని రివ్యూలలో చెప్పుకున్నట్టుగా- లైటర్ వీన్ కథల్లో వుండే సంఘర్షణకి కారణమయ్యే చిన్న- బలహీన పాయింటుతో ఆ తర్వాత కథనం సంక్లిష్టంగా వుండి తీరాలి. అలా సెకండాఫ్ విషయం సంక్లిష్టం కాకుండాపోవడంతో అరిగిపోయిన ఫస్టాఫ్ విషయాన్నే లాగాల్సి వచ్చింది బరువుగా. ఇంటర్వెల్లో విడిపోయారు సరే- అక్కడ్నించీ ఈ ట్రయాంగిల్ ని కొత్తగా ఎలా మార్చ వచ్చు? సెకండ్ హీరోయిన్ విడిపోయిన ఫస్ట్ హీరోయిన్ కి కజిన్ అవుతుందని  హీరో తెలుసుకుని యాక్టివ్ గా తనదైన గేమ్ ప్లే చెయ్యలేతప్ప- దర్శకుడు చేస్తున్న అదే రొటీన్ ప్లేకి, లేదా హీరోయిన్లు చేస్తున్న అదే రొటీన్ సెంటిమెంటల్  ప్లేకి- ఓ కీలుబోమ్మలా మారిపోయి అటూ ఇటూ అయి చివరికి, ‘గోవాలో ఫారిన్ సన్యాసుల్లో కలవడా’ నికి రైలెక్కడం కాదుగా హీరో చేయాల్సిన పని? గ్రాండ్ గా కథ హీరో ప్రారంభిస్తే, అతడికి చేతగాక హీరోయిన్లు ముగించడమా! ఇదేనా నాని హీరోయిజం. 

        ఈ సినిమాని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. కారణాలు రెండు : ఒకటి - నేచురల్ స్టార్ నాని ఛార్మ్,  రెండు - ప్రేక్షకులమైన మనం రోజూ తినే ఇడ్లీల్లాగే ఇలాటి సినిమాలూ రోజూ చూసేసి జీవించగలం! బయ్యర్లేం భయపడాల్సింది లేదు- కాకపోతే కొంచెం రేటెక్కువ పెట్టారు.

-సికిందర్ 
http://www.cinemabazaar.in