ఒక ఒరలో రెండు కత్తులుఇమడవన్నట్టు - ఒక సినిమాలో
రెండు కథలుఇముడు
తాయా? ఇమడవు కాబట్టి నడుస్తున్న ఒక కథని తీసేసి ఇంకో కథని పెట్టేయవచ్చా?అప్పుడది కత్తి లాంటి కథగా మారి మెరిసే కత్తిలాంటి
సినిమా అన్పించుకుంటుందా? ఒరలో వున్న ఒక కత్తి అయితే కత్తిలానే వుంటుంది. ఎందుకంటే కలిసివున్నా విడిగా వున్నాఅది పూర్తి
కత్తే కాబట్టి. సినిమాలో ఒక కథని పంపించేసిన ఇంకో కథ పూర్తి కథ అవమంటే అవుతుందా? మనం
ప్రయత్నించిన బ్యాంకు లోను శాంక్షన్ అవుతూండగా మనం వెళ్లి- ఇప్పుడు లోను వద్దండీ, కాస్త జాబ్ వుంటే ఇవ్వండీ
-అంటే ఎలావుంటుంది? కథ జాబ్ గురించి అయినప్పుడు మొదట్నించీ జాబ్ గురించే నడవాలి.
కానీ లోను గురించి నడుస్తున్న కథని వదిలేసి మధ్యలో జాబ్ గురించిన కథని ఎలా అందుకుంటారు? ఈ
పైకి కన్పించని తికమకతోనే ‘రుస్తుం’ ముస్తాబైంది.
దర్శకుడు టినూ సురేష్ దేశాయ్ క్రితం ‘1920 లండన్’
తీశాడు. రచయిత విపుల్ కె. రావల్ 2005 లో ‘ఇక్బాల్ ‘అనే హిట్ సినిమాకి మొదటి స్క్రిప్టు
ఇచ్చి, తర్వాత మరో అంతగా పేరు లేని మూడు మల్టీ ప్లెక్స్ సినిమాలకి రాశాడు. ఇతను
1988 లో నావికాదళంలో చేరి కొన్నాళ్ళు ఉద్యోగం
చేశాడు. అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకకి పంపిన శాంతి సేనలో తనుకూడా దళ సభ్యుడిగా వెళ్ళాడు. తర్వాత సినిమాల
మీద ఆసక్తితో నేవీలో ఉద్యోగం మానేశాడు. ‘రుస్తుం’
కూడా నేవీ ఆఫీసర్ కథే. అయితే నేవీ
నేపధ్యంలోంచి వచ్చిన రైటర్ విపుల్ ఇందులో
నేవీకి సంబంధించిన అంశాలతో చాలా గడబిడ చేశాడు. అక్షయ్ కుమార్ యూనిఫాంలో
దొర్లిన అనేక తప్పుల్ని కూడా
పట్టించుకోలేదు. ఈ కింది ఫోటో చూస్తే తేటతెల్లమవుతుంది.
(Courtesy : Sandeep Unnithan, Executive Editor, India Today ) |
1959
నాటి నేవీ కమాండర్ యూనిఫాంకి సాంతం ఆ తదనంతర కాలపు మెడల్స్, ఆహార్యమూ వున్నాయంటే ఏం
రీసెర్చి చేసినట్టని మనకి సందేహం
వస్తుంది. ఈ పాత్ర వాడిన ఆయుధం కూడా
బెరెట్టా ఎం 9 రకం పిస్టల్ అనీ, కానీ నేవీలో ఆ కాలంలో స్మిత్ అండ్ వెస్సన్, వెబ్లే
అండ్ స్కాట్ రకం రివాల్వర్సే వాడేవారనీ
‘ఇండియా టుడే’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కథనం. ఈ ఫోటో రకరకాల సెటైర్లతో సోషల్
మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా యూనిఫాంకీ ఆయుధాలకీ కూడా లాజిక్ అవసరం లేదా? లోకం నవ్వుకున్నా ఫరవా లేదా? ప్రేక్షకులకి కథని, పాత్రనీ
అడ్డగోలుగా చూపించేసి హిట్ చేసుకోవడం కూడా ఓ రచనా - దర్శకత్వం అన్పించుకోవేమో?
ప్రేక్షకుల్ని అజ్ఞానంలో వుంచడమో లేదా అపోహలు కల్గించి వదలడమో చేస్తే- కళా, సామాజిక
బాధ్యతా అనే పెద్ద మాటల్ని పక్కన
పెడదాం - అసలు వ్యాపారపరంగానే ఇది సరైంది
కాదేమో? ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన అసలీ నోట్లు ఇస్తున్నప్పుడు, వ్యాపారం
కూడా అసలీ సరుకుతోనే పక్కగా చేయాలేమో? పాత్రనీ
కథనీ
ఇష్టమొచ్చినట్టు గంగిరెద్దులా ముస్తాబు చేసి జనం మీదికి తోలేస్తే సరిపోయిందా?
సినిమా సూపర్ హిట్టయ్యింది కదా- ఇంకా లోపాల గొడవ ఎవరిక్కావాలి అనొచ్చు. హిట్టు హిట్టే, గుట్టు గుట్టే. మరొకరు దీన్ని అనుసరించి ఇలాగే లోపలమయంగా అడ్డగోలుగా తీసేస్తే హిట్టవుతుందనుకోవచ్చు. చేతులు కాల్చుకోవచ్చు. ఎంత హిట్టయినా లోపాలు మాఫీ అయిపోవు. ఈ సినిమాలో లోపాల తీవ్రత మరీ హద్దు మీరినందుకే ఇంత పోస్ట్ మార్టం చేయాల్సి వస్తోంది...
అజ్ఞానం, అపోహలు ఈ రెండిటి వ్యాప్తికే అన్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా సాగింది. ముందుగా ఈ స్క్రీన్ ప్లే ఎలా సాగిందో చూద్దాం :
బిగినింగ్ : యుద్ధ నౌక మీద రుస్తుం కమాండర్ గా పరిచయమవుతాడు. ఒక ఆపరేషన్ మధ్యలో
ఉండగానే రద్దయి నౌక తిరుగు ప్రయాణం కడుతుంది. ఇక సెలవులు ఎంజాయ్ చేయవచ్చని
సిబ్బంది అంతా ఆనందిస్తారు. ఆ హాలిడే మూడ్
తో రుస్తుం కూడా బొంబాయి లోని తన ఇంటికి బయల్దేరతాడు. భార్య సింథియా జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అతను తిరిగి వస్తూంటే, మాంటేజెస్ తో
టైటిల్ సాంగ్ మొదలవుతుంది. ఈ మాంటేజెస్ లో సింధియాతో అతడి పరిచయం, ప్రేమా, పెళ్ళీ, కాపురమూ వగైరా మనకి తెలుస్తాయి.
అతను
ఇంటి కొచ్చేసరికి సింథియా ఉండదు. మొన్ననగా
ఎక్కడికో వెళ్లి ఇంకా రాలేదని పని మనిషి చెబుతుంది. అతడికి అర్ధం గాక ఆమె పర్సనల్
వస్తువులు చెక్ చేస్తాడు. చాలా ఉత్తరాలూ గిఫ్టు లూ కన్పిస్తాయి. ఉత్తరాలు విక్రం
మఖీజా అనే అతను రాసినవి. అతనొక యువ పారిశ్రామిక వేత్త అని రుస్తుం
కి తెలుసు. కొంత పరిచయం కూడా వుంది. అతను
సింథియాకి రాసిన ఉత్తరాలన్నీ ప్రేమలేఖలే. వాటిలో తాజా లేఖ చాలా విరహంతో
రాసినట్టు వుంటుంది. మనం గడిపిన మధురమైన రాత్రుల్ని ఎలా మర్చిపోతావ్, నన్ను
ఒంటరిగా ఎలా గడపమంటావ్, వచ్చేయ్- అని.
రుస్తుం షాకవుతాడు. వెంటనే విక్రం బంగళా కెళ్ళి దూరం నుంచి చూస్తాడు.
బాల్కనీలో సింథియా నిలబడి వుంటుంది. వెనకనుంచి వచ్చి విక్రం ఆమెని తీసుకు పోతాడు.
మర్నాడు ఆమె ఇంటికొచ్చేసరికి ఆ ఉత్తరాలు చదవడం మొదలెడతాడు రుస్తుం. ఆమె బిగుసుకు పోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని ఏడుస్తుంది. విక్రం నావల్ బేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ లాకర్ లోంచి తన రివాల్వర్ తీసుకుంటాడు. విక్రం ఆఫీసు కెళ్తే అతనక్కడ వుండదు, ఇంటి కెళ్ళి అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకుని వస్తున్న విక్రం ఛాతీ పైకి మూడు సార్లు కాల్పులు జరిపి చంపేస్తాడు. పోలీస్ స్టేషన్ కెళ్ళి లొంగిపోతాడు.
మిడిల్ : నేవీ అధికారులు వచ్చి విక్రం కస్టడీని అడుగుతారు. కానీ విక్రం పోలీస్ కస్టడీలోనే ఉంటానని అంటాడు. కోర్టు కూడా అనుమతించడంతో జ్యూడీషియల్ రిమాండ్ కింద జైలు కెళ్తాడు. విచారణా ధికారియైన సీనియర్ ఇన్స్ పెక్టర్ కేసు దర్యాప్తు పూర్తి చేసి ప్రాసిక్యూషన్ కి సిద్ధమవుతాడు. విక్రం లాయర్ ని పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోడు. కేసు తనే వాదించుకుంటా నంటాడు. అలాటి పక్షంలో ఒకవేళ రుస్తుం కేసు ఓడిపోతే అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని జడ్జి హెచ్చరిస్తాడు. ఇందుకూ సిద్ధపడతాడు రుస్తుం. సాక్షుల విచారణ ప్రారంభమవుతుంది. ఎనిమంది మంది జ్యూరీ సభ్యులు వచ్చి కూర్చుంటారు. కోర్టు హాలు క్రిక్కిరిసి పోతుంది. గ్యాలరీలో సింథియా, విక్రం చెల్లెలు ప్రీతీ, ఈ కేసు మీద సంచలన వార్తలు ప్రచురిస్తున్న పత్రికా యజమానీ ఇంకా చాలామంది వుంటారు. సాక్షులు ఒక్కొకర్నే పిల్చి ప్రాసిక్యూటర్ ప్రశ్నిస్తూంటాడు. విక్రం ఇంట్లో పనివాడు, ఆఫీసులో రిసెప్షనిస్టు, విక్రం చెల్లెలు ప్రీతీ, విచారణాధికారీ సహా ప్రాసిక్యూషన్ తరపు మరెందరో సాక్షులు పూర్తి అబద్ధాలు చెబుతారు రుస్తుం కి ఎఫెక్ట్ అయ్యేలా. రుస్తుం వాళ్ళందర్నీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ చిత్తు చేస్తాడు.
ఇలా
కేసు నడుస్తున్న క్రమంలో రుస్తుం ఇంటి మీద దాడి జరుగుతుంది. దుండగులు దేనికోసమో
వెతికి వెళ్ళిపోతారు. ఈ విషయం చెప్పడానికి సింథియా జైలుకొస్తుంది. ఇప్పటి వరకూ
ఇద్దరి మధ్యా మాటల్లేవు. ఆమెని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్ధం కాదు రుస్తుంకి. ఓపిక
పడితే అసలు విక్రంతో ఎలా జరిగిందో చెప్తానంటుంది...
ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది : రుస్తుం కొన్ని నెలలపాటు డ్యూటీలో వున్న అవకాశం చూసుకుని, విక్రం ఎలా వెంటబడి తనని ట్రాప్ చేశాడో, అందుకు అతడి చెల్లెలు ప్రీతి కూడా ఎలా పథకం ప్రకారం సహకరించిందో అంతా చెప్పుకొస్తుంది. ఒక రాత్రి వర్షంలో దెబ్బ తగిలి నిస్సహాయ స్థితిలో వున్న తనని లోబర్చుకున్నాడనీ, అక్కడ్నించీ ఇక వద్దన్నా వదల్లే దనీ, ఉత్తరాలు కూడా రాస్తూ బలవంత పెట్టాడనీ...ఇలా చెప్పుకొస్తుంది.
రుస్తుం కొంచెం కరుగుతాడు. అప్పుడు ఇంటి మీద దాడిజరిగిన విషయం చెప్తుంది. ఆ దాడి ఎందుకు జరిగిందో రుస్తుం ఆమెకి చెప్పి, ఆ నేవీ అధికారులకి డిమాండ్ పెట్టమని చెప్పి ఒక కవరిస్తాడు. అందులో రుస్తుం స్విస్ బ్యాంక్ అక్కౌంట్ వివరాలుంటాయి.
ఆమెని కలిసిన నేవీ అధికారులు, రుస్తుం దగ్గరున్న పత్రాలు అందిస్తే పది లక్షలే ఇస్తామంటారు. రుస్తుం ఐదు కోట్లు అడిగాడని ఆమె ఆ కవరందిస్తుంది. మండిపడ్డ అధికారి, చివరికి ఐదుకోట్లూ స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ లో వేసేందుకు ఒప్పుకుంటాడు.
ఇటు కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతుంది. రుస్తుం ఇంట్లో పనిమనిషి కూడా వచ్చి, ఏ భర్తయినా ఏం చేస్తాడని జడ్జిని ఎదురు ప్రశిస్తుంది. మీ ఆవిడే ఇంకొకడితో పోతే మీరేం చేస్తారని దబాయిస్తుంది. బుర్ర తిరిగిన జడ్జి కోర్టు ధిక్కారం కింద ఆమెని లోపలేయిస్తాడు. పత్రికా యజమాని కూడా కేసు మీద ఇష్ట మొచ్చిన కథనాలు ప్రచురిస్తూ రోజూ వచ్చి జడ్జి ముందు ఫోజులు కొడుతూంటే, రోజూ జైల్లో వేయిస్తూంటాడు జడ్జి.
రుస్తుం ఈ హత్యని పథకం ప్రకారం చేశాడని ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. కాదు, ఆత్మరక్షణ కోసమే చేశానంటాడు రుస్తుం. తను ఉద్దేశపూర్వకంగా రివాల్వర్ తీసి కెళ్ళింది విక్రం నుంచి ఆత్మ రక్షణ కోసమే నంటాడు. హత్య చెయ్యాలని పథకం ప్రకారం వెళ్లి వుంటే, నావల్ బేస్ లో తన రివాల్వర్ తీసుకుని రిజిస్టర్ లో ఎంటర్ చేసే వాణ్ణి కాదంటాడు. రిజిస్టర్ లో ఎంటర్ చేయకుండా సొంత లాకర్ లోంచి రివాల్వర్ని తీసికెళ్ళి, తిరిగి తెచ్చి పెట్టేసే వెసులుబాటు నేవీ కల్పించిందని వివరిస్తాడు. కాబట్టి తను హత్య చేయడానికే రివాల్వర్ తీసికెళ్ళ లేదని ప్రూవ్ అయ్యేందుకే, కావాలని రిజిస్టర్ లో ఎంటర్ చేశానంటాడు రుస్తుం.
ఇక ఆత్మరక్షణ ఆలోచన ఎందుకొచ్చిందంటే, విక్రం క్షణికావేశాన్ని కళ్ళారా చూశానని, ఒకరోజు క్లబ్ లో జరిగిన సంఘటనని వివరిస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో- క్లబ్ లో బేరర్ తెచ్చిన పదార్ధం పొరపాటున మీద పడితే రెచ్చిపోయిన విక్రం పిస్టల్ తీసి కాల్చేయబోతాడు, రుస్తుం అడ్డుకుని ఆపుతాడు.
కాబట్టి
విక్రం స్వభావం తెలుసు గనుక, అలా ముందు
జాగ్రత్తగా ఆత్మరక్షణ కోసమే రివాల్వర్ పెట్టుకుని వెళ్తే, అప్పుడే స్నానం చేసి
టవల్ చుట్టుకుని వచ్చిన విక్రం తనని చూసి రెచ్చిపోయి పిస్టల్ తీసి ఫైర్
చేయబోయాడనీ, తను అడ్డుకుని పెనుగు లాడాననీ, మాట్లాడుకుందామని ఎంత చెప్పినా
విన్పించుకోకుండా ఆ ఘర్షణలో తన పిస్టల్ అందుకుని ఫైర్ చేశాడనీ, అప్పుడు తనూ ఫైర్ చెయ్యక తప్పలేదనీ
ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు
రుస్తుం.
మరైతే ఆత్మరక్షణ కోసం మూడు సార్లు ఎందుకు కాల్చారని అడుగుతాడు ప్రాసిక్యూటర్. రుస్తుం నేవీ మాన్యువల్ చూపించి, తమకి ఇలాగే శిక్షణ ఇచ్చారని అంటాడు.
మరైతే ఆత్మరక్షణ కోసం మూడు సార్లు ఎందుకు కాల్చారని అడుగుతాడు ప్రాసిక్యూటర్. రుస్తుం నేవీ మాన్యువల్ చూపించి, తమకి ఇలాగే శిక్షణ ఇచ్చారని అంటాడు.
మీ ఇద్దరి మధ్య అంత ఘర్షణ జరిగితే మీ యూనిఫాం ఎందుకు చెక్కు చెదర లేదని, విక్రం చుట్టుకున్న టవల్ కూడా ఎందుకు వూడిపోలేదనీ ప్రశ్న లేవదీస్తాడు ప్రాసిక్యూటర్. మేం మట్టిలో పడి కొట్టుకోలేదని జోకేసి అతడి నోర్మూయిస్తాడు రుస్తుం. నావల్ బేస్ నుంచి విక్రం ఇంటికి పది నిమిషాల్లో చేరుకో వచ్చు, మీరు గంట తర్వాత చేరుకున్నారు, అంతసేపూ ఎక్కడున్నారని ప్రాసిక్యూటర్ మరో ప్రశ్న వేస్తే రుస్తుం నోటికి తాళం పడిపోతుంది.
ఆ గంట కాలాన్ని లెక్క తీయడానికి ఇన్స్ పెక్టర్ నడుం కడతాడు. ఆ సమయంలో రుస్తుం ఢిల్లీలో డిఫెన్స్ సెక్రెటరీతో ట్రంక్ కాల్ మాట్లాడాడనీ, స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ కూడా ఓపెన్ చేశాడనీ తెలుసుకుంటాడు. ఢిల్లీ వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీని కలుసుకుంటాడు. డిఫెన్స్ సెక్రెటరీ తమ కొచ్చే ట్రంక్ కాల్స్ అన్నిటినీ రికార్డ్ చేస్తామనీ, ఆ రోజు రుస్తుం తనతో ఏం మాట్లాడాడో వినిపిస్తాననీ చెప్పి టేపు ఆన్ చేస్తాడు. ఆ టేపు తెచ్చి కోర్టుకు సమర్పిస్తాడు ఇన్స్ పెక్టర్. దాన్ని ప్లే చేస్తే, ఆ టేపులో రుస్తుం గొంతుతో- ‘నేను విక్రం దగ్గరికి వెళ్తున్నాను, వాణ్ణి వదలను!’ అన్న మాటలుంటాయి.
దీంతో రుస్తుం ఆత్మరక్షణా వాదం వీగిపోతుంది. ఇక జ్యూరీ ఓటింగ్ కి సిద్ధమవుతుం ది.
ఎండ్
: జైల్లో రుస్తుం ని
కలుసుకుంటాడు ఇన్స్ పెక్టర్. తనేం మాట్లాడాడో మొత్తం టేపు కోర్టుకి విన్పించలేదని, విన్పించి వుంటే ఈ హత్య ఎందుకు చేశాడో అర్ధమయ్యేదనీ అంటాడు రుస్తుం. ఫ్లాష్ బ్యాక్
చెప్తాడు- బ్రిటన్ లో అమ్మకానికొచ్చిన ఒక యుద్ధనౌకని కొనుగోలు చేయాలని
నిర్ణయించింది నావికా దళం. ఇన్స్ పెక్షన్ అధికారిగా రుస్తుం వెళ్లి పరిశీలిస్తే,
యుద్ధ నౌక అన్ ఫిట్ అని తేలింది. కాదు, పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలని నేవీ అధికారులు
ఒత్తిడి చేశారు. డబ్బాశ కూడా చూపెట్టారు. అప్పుడు దీని వెనుక వున్న అసలు శక్తి విక్రం కూడా బయట పడ్డాడు. ఈ సమస్య నలుగుతోంది. ఒత్తిడి పెరిగిపోయి రుస్తుం బ్లాక్
మెయిల్ చేయసాగాడు - వాళ్ళు చేస్తున్న
స్కామ్ తాలూకు పత్రాలు తన దగ్గరున్నాయని.
దీంతో సమస్య ముదిరింది. డిఫెన్స్ సెక్రెటరీకి చెప్పుకుంటే ఇతనూ సిండికేటులో
ఒక కేటు అని తేలింది. పత్రాలివ్వడానికి ఐదు కోట్లకి బేరం పెట్టాడు. దీని గురించే ఆ
రోజు డిఫెన్స్ సెక్రెటరీతో ట్రంక్ కాల్ మాట్లాడాడు. ఆవేశంలో విక్రంని వదలనని అనేశాడు...
ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న ఇన్స్ పెక్టర్- ఇది దేశం కోసం రుస్తుం చేసిన సాహసమని తెలుసుకుని అభినందిస్తాడు. విక్రంని దేశభక్తితో చంపాడన్న మాట. మరి ఆ రహస్య పత్రా లేమయ్యాయని అడిగితే, ఏ పత్రాలూ తన దగ్గర లేవనీ, అలా బుకాయించాననీ తేల్చేస్తాడు రుస్తుం.
జ్యూరీ వాదోప వాదాలాడుకుని ఓటింగ్ చేస్తారు. అది రుస్తుం నిర్దోషి అని ఏకగ్రీవ ఓటింగ్. జడ్జి ఆమోదిస్తాడు. హర్షధ్వానాల మధ్య రుస్తుం విడుదలై పోయి, భార్య సింథియాని క్షమించి అక్కున జేర్చుకుంటాడు.
పోస్ట్ మార్టం !
స్ట్రక్చర్ పరంగా రచన పకడ్బందీగా వుంది. స్క్రీన్
ప్లేకి ముఖ్యమైనవి రెండే : స్ట్రక్చర్, యాక్టివ్ క్యారక్టర్. చాలా త్వరగా రుస్తుం విక్రం ని చంపడంతో
బిగినింగ్ విభాగాన్ని ముగించేసి, ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ
రుస్తుం కి గోల్ ఏర్పడాలి. కానీ చంపి లొంగి పోయాక గోల్ ఏముంటుంది? బంతిని వ్యవస్థ
కోర్టులో పడేసినట్టు జైల్లో కూర్చున్నాడు, నిజ జీవితంలో నానావతి లాగే. నిజ జీవితం
లాగా సినిమా వుండదు కాబట్టి పాసివ్ గా వున్న హీరోని యాక్టివ్ చేయాలి. అందుకని
నిజజీవితంలో నానావతికి లేని ఉద్దేశాల్ని
ఆపాదించారు. అది రుస్తుం తన కేసుని తానే వాదించుకునేట్టు చేయడం. ఇది ఇంటర్వెల్ కొస్తుంది. ఇక్కడ జడ్జి గోల్
ఎలిమెంట్స్ లో భాగంగా పరిణామాల హెచ్చరిక కూడా చేశాడు- కేసు ఓడిపోతే అప్పీల్
చేసుకునే అవకాశం ఉండదని. అయినా రిస్కు తీసుకున్నాడు రుస్తుం.
ప్లాట్ పాయింట్ వన్ దగ్గరనుంచీ ఇదంతా మిడిల్ విభాగమే. మిడిల్ అంటే సమస్యతో సంఘర్షణ కాబట్టి- తన ముందున్న కేసుతో సంఘర్షిస్తూ పోయాడు. ఈ ప్రయాణంలో, అంటే కోర్టు వాదోప వాదాల్లో, ఎదురు దెబ్బలు తింటూ- ఎదురు దెబ్బ తీ స్తూ మిడిల్ కి స్క్రీన్ ప్లే సూత్రాల్ని తుచ తప్పకుండా పాటించాడు. సెకండాఫ్ లో ఈ మిడిల్ ముగుస్తూ ఏర్పడిన ప్లాట్ పాయింట్ టూ దగ్గర, డిఫెన్స్ సెక్రెటరీ లీక్ చేసిన టేపుతో కోలుకోలేని దెబ్బ తగిలి చతికిల బడిపోయాడు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర సరీగ్గా జరగాల్సిన సంఘటనే జరిగింది. హీరో పోరాటంలో అన్ని దారులూ మూసుకుపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డం ప్లాట్ పాయింట్ టూ లక్షణం. ఇలా జడ్జి చేసిన పరిణామాల హెచ్చరిక కూడా నిజమైంది.
ఇప్పుడేం చేస్తాడు రుస్తుం? సూత్రాల ప్రకారం కొత్త సవాలుతో ఎండ్ విభాగం ప్రారంభమయ్యింది. ఇక్కడ తెలివిగా తురుపు ముక్క ప్రయోగించాడు- ఇన్స్ పెక్టర్ కి డిఫెన్స్ స్కామ్ గురించి చెప్పేస్తూ. తర్వాత జ్యూరీ ఓటింగ్ కూడా అనుకూలంగా జరగడంతో గొప్ప దేశభక్తుడిగా కేసులోంచి విడుదలై పోయి విజయం సాధించాడు. శుభం.
ఇప్పుడు ఒక్కో విభాగంలో చూస్తే కథనం ఆసక్తికరంగా వుంది. దర్శకత్వం పకడ్బందీగా వుంది. పోలీస్ స్టేషన్ లో ఒక్కో సాక్షిని ఇన్స్ పెక్టర్ పిలిచి ప్రశ్నించే సన్నివేశ చిత్రీకరణ దర్శకుడు రచయితా కనబర్చిన వరల్డ్ మూవీస్ టెక్నిక్. జీన్ లక్ గొడార్డ్ లాంటి వాళ్ళు ఇలాటి ప్రయోగాలే చేస్తారు. సాధారణంగా వరల్డ్ మూవీ టెక్నిక్స్ కమర్షియల్ సినిమాలకి పనికిరావు. ఎబ్బెట్టుగా వుంటాయి. గతంలో ఎన్టీఆర్ నటించిన కమర్షియల్ ‘అశోక్’ లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఇలాటి అనుచిత ప్రయోగమే చేశారు.
సెకండాఫ్
80 శాతం కోర్టు సన్నివేశాలతోనే వుంది. ‘సుల్తాన్’ సెకండాఫ్ ఎలాగైతే స్టేడియంలో
ఫైట్స్ తో వుందో అలాగా. ఐతే ‘సుల్తాన్’ లాంటి కమర్షియల్ లో సెకండాఫ్ స్టేడియం
ఎపిసోడ్స్ అన్నీ ఎంటర్ టైన్ మెంట్ లేని, రిలీఫ్ లేని సీరియస్ దృశ్యాలే. కానీ సెమీ రియలిస్టిక్
అయిన ‘రుస్తుం’ లో మాత్రం సెకండాఫ్ ని
ఆక్రమించిన కోర్టు దృశ్యాలు హత్య చుట్టూ సీరియస్ నెస్ తో కూడుకుని లేవు. ‘లగాన్’
లో క్రికెట్ ఆడినంత కామెడీతో ఎంటర్ టైన్ చేస్తాయి. ఇది సందర్భానుసార కామెడీయే
తప్ప- ఫార్ములా సినిమాల్లో లాగా లేనిపోని కమెడియన్లని రప్పించే చేయించే గోల కామెడీ-
పేరడీ కాదు.
సెకండాఫ్ లో ఫన్నీ కోర్టు సీన్లకి సమాంతరంగా ఇంకో సబ్ ప్లాట్ ని రన్ చేశారు. అది నేవీ అధికారుల స్కామ్ గురించి. కోర్టు దృశ్యాల్లో వివిధ సాక్షులు చెప్పే కథనాలకి తగ్గట్టు కథ నడకకి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్స్ వచ్చి పోతూంటాయి. రుస్తుం విక్రం ని కాల్చి చంపే దృశ్యం మూడు సార్లు మూడు కోణాల్లో రిపీట్ అవుతుంది. బిగినింగ్ లో వెళ్లి కాల్చి చంపే దృశ్యం, మిడిల్ లో కోర్టుకి వెల్లడిస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో- విక్రం తో ఘర్షణలో ఆత్మరక్షణ కోసం కాల్చిచంపిన దృశ్యం, తిరిగి ఎండ్ లో ఇన్స్ పెక్టర్ కి స్కామ్ ని వివరిస్తున్నప్పుడు ఇంకో ఫ్లాష్ బ్యాక్ లో- తనే అక్కడి వస్తువులు చిందర వందర చేసి ఘర్షణా వాతావరణం సృష్టించి, ‘పథకం ప్రకారం’ విక్రంని కాల్చి చంపి- అతడి చేతిలో అతడి పిస్టల్ని పెట్టేసే దృశ్యం. ఇదే నిజ దృశ్యమనీ, నిజానికి ఇదే జరిగిందనీ ఇక్కడ ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్ చేయడం.
ప్రేక్షకులు ఎక్కడా బోరు ఫీలవకుండా, ప్రతీ క్షణం ఇన్వాల్వ్ చేసే, ఫ్రెష్ నెస్ తో కూడిన స్క్రీన్ ప్లే- దర్శకత్వాలివి. అరుదుగా ఇలాటి సశాస్త్రీయ స్ట్రక్చర్ తో, పరిపక్వత కనబర్చే దర్శకత్వాలతో సినిమాలు వస్తూంటాయి. దర్శకుడు టినూ సురేష్ దేశాయ్, కథ మాటలు స్క్రీన్ ప్లే అందించిన రచయిత విపుల్ కె. రావల్ ఈ మేరకు అభినందనీయులే.
రీ- పోస్ట్ మార్టం!
అయితే పైకి కన్పిస్తున్నంత సజావుగా ఏమీ వుండదు ఈ స్క్రిప్టుని
తరచి చూస్తే. కారణం, కాన్సెప్ట్ ని టాంపరింగ్ చేయడమే. కాన్సెప్ట్ ఒకటైతే కథనం మరొకటిగా చేసుకుపోవడమే. పైగా లాజికల్
గా, సైకలాజికల్ గా, లీగల్ గానూ చాలా లోపా లమయంగా
వుంటుంది. నేవీ యూనిఫాంలో ఎన్ని తప్పులున్నాయో వాటికి కొన్ని రెట్లు తప్పులు దొర్లాయి స్క్రిప్టులో- కాన్సెప్ట్ టాంపరింగ్ పుణ్యాన. ఫార్ములా కథయితే ఇవన్నీ
పట్టించుకోనవసరం లేదు. కానీ ఇది మర్డర్ ఇన్వెస్టిగేషన్ - కోర్టు ట్రయల్ ఆధారిత స్పెషలైజ్ చేసిన ప్రొఫెషనల్ క్రైం జానర్ కథ. ప్రతీ
చోటా ఇది హేతుబద్ధంగా వుండాల్సిందే. ఎందుకంటే
రచయితలూ, దర్శకులు తమ కంటే ఎక్కువ ఆలోచనాపరులని ప్రేక్షకులనుకుంటారు. ఏది ఎలా
చూపిస్తే అలా చూసి నిజమని నమ్మేస్తారు. అందుకే విమర్శకుల మీద విరుచుకు పడతారు. ఏళ్ల
తరబడీ రాసే విమర్శకుల బుర్రల్ని నమ్మరు, బుర్ర తక్కువ వాళ్ళనుకుంటారు. లేదా పక్షపాతపు
బుర్రలనుకుంటారు. సినిమాల బాగు కోసమే రాస్తారని నమ్మరు. అదే రాజకీయ జర్నలిజంలో
జర్నలిస్టులు రాసేది, విశ్లేషించేది వెంటనే నమ్మేస్తారు. ఎడాపెడా వాయింపులకి గురయ్యేది
సినిమా జర్నలిస్టే. సినిమా భక్తి అలాటిది,
సినిమాల్ని ఏమైనా అంటే వూరుకోరు. ఇదే ప్రేక్షకుల్ని గనుక సినిమాలు చూపించకుండా, స్క్రిప్టులు చదివిస్తే సవాలక్ష తప్పుల్నివాళ్ళే
పట్టుకుంటారు. లాజిక్ అంటే ఎలర్జీ
ఎగిరిపోయి వాళ్ళే లాజికల్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే చదివేటప్పుడు బుర్ర
పనిచేస్తుంది, సినిమాలు చూసేప్పుడు కళ్ళు మాత్రమే వెర్రిగా పనిచేస్తూంటాయి.
ఫార్ములా కథలకీ, ఇలాటి స్పెషలైజ్ చేసిన ప్రొఫెషనల్ కథలకీ తేడా ఏమిటంటే, ఫార్ములా కథల్లో హీరో ఎందర్నైనా చంపుకుంటూ పోతాడు, విలన్ ఇంకెందర్నో చంపుతూ బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈ శవాలని ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే ఇది శవాల గురించి కథ కాదు కాబట్టి. హీరో- విలన్ల పోరాటం గురించిన కథే కాబట్టి. అందుకని పోలీసులు మధ్యలో జొరబడి హత్య కేసులు దర్యాప్తు చేస్తూ కూర్చోరు. పోలీసులే ఈ కథల్లో కన్పించకపోవచ్చు. ఇక్కడ లాజిక్ కి ఆస్కారం లేదు.
కానీ
స్పెషలైజ్ చేసిన క్రైం జానర్ కథల్లో హత్యే ప్రధానం. దాని మీద దర్యాప్తే కీలకం, అదే
కథ! దాని చుట్టే వ్యధ! ఈ కథల్లో దర్యాప్తు చేసే పోలీసు పాత్రలూ లాయర్ పాత్రలూ వగైరా ప్రొఫెషనల్స్ అయివుంటాయి. ఇక్కడ సినిమా
రచయిత తన ఫార్ములా ఆలోచనల్ని మూసిపెట్టి,
ఒక ప్రొఫెషనల్ గా నాన్- ఫార్ములా ధోరణిలో ఆలోచించాల్సిందే. లాజిక్ కి పెద్ద
పీట వేయాల్సిందే. చేత కాకపోతే వదిలెయ్యాల్సిందే. మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో వచ్చే ఏ
నవల చూసినా కచ్చితత్వంతో, లాజికల్ గా, ఈ రంగంలో మనకి తెలీని ఎన్నో విషయాలు కూడా తెలియజేస్తూ
వైజ్ఞానికంగానూ వుంటాయి. తెలుగులో పాత్ డిటెక్టివ్ నవలలు సైతం అల్లాటప్పా రాతలతో
ఉండేవి కావు- నేర పరిశోధనని బుర్రకి పదును పెడుతూ లాజికల్ గా పకడ్బందీగా
నిర్వహించేవి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఈ జానర్ లో 1971 లో గుమ్మడి- కృష్ణలు
నటించిన ‘నేనూ మనిషినే’ గానీ, 1961 లో బీఆర్ చోప్రా తీసిన ‘ఖానూన్’ (చట్టం) గానీ
ఎంత లాజికల్ గా, నేర న్యాయవ్యవస్థ గురించి ఎంత విజ్ఞానదాయకంగా వుంటాయి! ఈ జానర్ లో
పోలీసు వ్యవస్థ పనితీరు గురించీ, న్యాయవ్యవస్థ పనితీరు గురించీ తోచినట్టూ రాసేస్తే
తప్పుడు సమాచారం వెళ్తుంది పాఠకుల్లోకి/ప్రేక్షకుల్లోకి చట్టాలతో సహా. ఈ జానర్
ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే జానర్. దీనికి సామాజిక స్పృహ, బాధ్యత, ప్రయోజనమూ చాలా
వుంటాయి.
విషయానికొస్తే, నానావతి నిజ కథతో ‘రుస్తుం’ తయారయ్యింది (ఈ కేసు చరిత్ర ఆగస్టు 17 ‘రుస్తుం’ రివ్యూలో ఇచ్చాం). నేవీ కమాండర్ తన భార్య ప్రియుణ్ణి చంపడం గురించిన కథ- లేదా కాన్సెప్ట్. భావోద్వేగాలతో జ్యూరీ ఓటింగ్ చేయడంతో నానావతి బయటపడ్డా, అంతలో హైకోర్టు, సుప్రీం కోర్టుల లాజికల్ తీర్పులతో యావజ్జీవ శిక్షకి గురయ్యాడు. మళ్ళీ కొన్ని సామాజిక పరిణామాల మూలంగా క్షమాభిక్షకి నోచుకుని శాశ్వత స్వేచ్ఛ పొందాడు. ఇంతే కాదు, సూక్ష్మ స్థాయిలో చూస్తే రచ్చబండ పంచాయితీల టైపులో తీర్పులు చెప్పే జ్యూరీ వ్యవస్థ రద్దుకి తనే కారకుడయ్యాడు నానావతి. నానావతి భార్య ప్రియుణ్ణి (ప్రేమ్ ఆహుజా) చంపి ఉండక పోతే, స్వతంత్ర భారత దేశంలో హస్యాస్పదమైన బ్రిటిష్ కాలపు జ్యూరీ వ్యవస్థ రద్దయ్యేది కాదేమో. ఇది చారిత్రాత్మక కేసుగా ప్రసిద్ధి చెందింది. ఇది నానావతి చారిత్రక పురుషుడైన విధం కూడా. మరి నానావతికి ‘రుస్తుం’ ఏం నివాళి అర్పించింది? ఈ మధ్యే అక్షయ్ కుమార్ నటించిన ‘ఏర్ లిఫ్ట్’ అనే నిజకథలో కువైట్ సంక్షోభంలో రిస్కు తీసుకుని భారతీయుల్ని తరలించిన మథున్నీ మాథ్యూస్ అనే కేరళ వ్యాపారవేత్తకి ఘనంగా నివాళులర్పించారు. కానీ నానావతి పాత్ర పోషిస్తూ అక్షయ్ కుమార్, నానావతికివ్వాల్సిన కీర్తిని నానావతికివ్వకుండా, వేరే రూటులో కథ మార్చేసి దేశభక్తుడిగా తను కీర్తిని (క్రెడిట్ ని) తీసుకున్నారు! ఇది చాలా అన్యాయం!
ఈ సినిమా నానావతి కథ అని ప్రచారం చెయ్యకుండా విడుదల చేసి వుంటే ఏ చిక్కూ వుండేది కాదు. ఏదో కథ తీశార్లే అనుకునేవాళ్ళం. బిజినెస్ కోసం అలా ప్రచారం చేసుకుని, విడుదల చేయడంవల్ల నానావతికి అన్ని విధాలా అన్యాయం చేయడమే అయింది.
ఈ
భార్య ద్రోహ కథ లేదా, స్త్రీ పురుష సంబంధాల గురించిన కథని - భర్త దేశభక్తి కథగా వీరలెవెల్లో
ముగించడమే విచిత్రమైనది. ‘సైజ్ జీరో’ లో హీరోయిన్ స్థూలకాయం కథని సెకండాఫ్ లో
క్లినిక్ అక్రమాల కథగా సంబంధంలేకుండా మార్చేసినట్టు- ‘రుస్తుం’ లో కూడా భార్య
ప్రియుణ్ణి చంపి కేసు నెదుర్కొంటున్న హీరోకి- నేవీ అధికారుల స్కామ్ తగిలించి దేశభక్తి కథగా, దేశభక్తుడి వీరత్వంగా మార్చేసి శిక్ష
నుంచి తప్పించారు. ఇందుకే కాన్సెప్ట్ ని
టాంపరింగ్ చేశారన్నాం. లండన్ యుద్ధ నౌక కొనుగోలులో నేవీ అధికారులు గోల్ మాల్
చేస్తున్నారని రుస్తుం కి ముందు నుంచే తెలుసు. ఇందులో యువ పారిశ్రామిక వేత్త
విక్రం వున్నాడని కూడా తెలుసు. ఈ విక్రం
తనకి పరిచయస్థుడే నని కూడా తెలుసు. ఇదంతా మనకి సెకండాఫ్ లో ఓపెన్ చేస్తూ పోయినా,
పూర్వ కథగా ముందు నుంచీ ఉన్నట్టే లెక్క. అంటే సింథియా ఎఫైర్ కంటే ముందు నుంచీ ఈ స్కామ్
గొడవ వున్నట్టే. ఆల్రెడీ స్కామ్ లో వున్న విక్రంతో
రుస్తుం భార్య సింథియా శారీరక సంబంధం పెట్టుకోవడం ఈ దరిమిలా జరిగిందే నన్నమాట!
ముందు స్కామ్ ప్రారంభమయ్యింది- దాని
పర్యవసానంగా తర్వాత శారీరక సంబంధం మొదలయ్యింది!
ఈ స్పష్టతతో స్క్రిప్టుని చూడాలి.
ఇప్పుడు ఈ నేపధ్యంలో చూసినా- స్క్రిప్టులో బిగినింగ్ లో భార్య సింథియా ఉత్తరాల్ని రుస్తుం చూసినప్పుడు అతనేమనుకోవాలి? ‘ఈ విక్రం నాకొడుకు ఇంత పని చేస్తున్నాడా? నన్ను స్కామ్ లో లొంగదీయడానికి నా భార్యని లొంగ దీసుకున్నాడా? ఇక నా భార్యతో ఉన్న ఫోటోలతో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడా? వీణ్ణి ఇప్పుడే తన్ని స్కామ్ బయట పెట్టేయాలి- అని వెళ్లిపోవాలి.
కానీ
ఏం చేశాడు? విక్రం బంగాళా దగ్గరి కెళ్ళి పోయి బాల్కనీలో నించున్న సింథియాని బాధాతప్త
హృదయంతో చూశాడు. విక్రం ఆమెని లోపలికి తీసికెళ్ళి పోతోంటే కుమిలిపోతూ వెనుదిరిగి
వెళ్ళిపోయాడు! అంటే, ఒకవేళ ఇంకా విక్రంకి
ఫోటోలు తీసే ఆలోచన ఉండకపోతే, ఆ అవకాశం కల్పిస్తున్నాడన్న మాటే!
నిజానికి నానావతి కేసులో ఈ సంఘటన లేదు. అతను ప్రేమ్ బంగళాకి వెళ్లనూ లేదు, వెళ్లి భార్య అక్కడ వుండగా చూడనూ లేదు. అలా చేసి వుంటే అప్పటికప్పుడే ప్రేమ్ ని చంపేసే వాడేమో! ఏ భర్తయినా భార్య వేరొకడితో వుంటే చూసి వెళ్లి పోతాడా! అందునా ఒక నేవీ అధికారి రక్షణ రహస్యాలు రాబట్టడానికే వాడు భార్యని ట్రాప్ చేసి వుంటాడని అనుకోడా!
ఆ రాత్రి నానావతి ఇంటికి వస్తే భార్య సిల్వియా ఇంట్లోనే వుంది, ఎక్కడికీ వెళ్ళ లేదు. ఆమె ముభావంగా వుండడం గమనించి అడిగితే, అప్పుడు చెప్పేసింది ప్రేమ్ తో తన వ్యవహారం గురించి తనే. భర్తకి స్పష్ట నిస్తూ, విడాకులు తీసుకుని ప్రేమ్ నే పెళ్లి చేసుకుంటానని కూడా అనేసింది. అందుకే నానావతి ప్రేమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు- ‘నువ్వు నా భార్యని పెళ్లి చేసుకుంటావా? నా ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటావా?’ అనడిగాడు. అప్పుడు ప్రేమ్ వెటకారంగా చెప్పిన సమాధానం- ‘నేనెందరో ఆడాళ్ళతో పడుకుంటాను...వాళ్ళందర్నీ పెళ్లి చేసుకోవాలా!’ అని.
దీంతో నానావతి ప్రేమ్ ని కాల్చి చంపేశాడు. అది భార్యని ఉంపుడు గత్తె అన్నందుకా, వాడు మిత్ర ద్రోహి అయినందుకా మనకి తెలీదు. కానీ పెళ్లి చేసుకుం టాడని అమాయకంగా నమ్మి మోసపోయిన భార్యని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక పిల్లలతో సహా ఆమెని తీసుకుని కెనడా వెళ్ళిపోయి జీవించాడు. ఆమెని వదిలెయ్యలేదు. బ్రిటిష్ కల్చర్ తో భర్త ఎడబాటుతో ఆమె ప్రేమ్ తో తిరిగినా, అదే ధైర్యంతో తను తిరుగుతున్నానని కూడా చెప్పేసిందా రాత్రి.
కానీ
‘రుస్తుం’ కథలో సింథియా నంగనాచిలా కన్పించేట్టు చిత్రించారు తెలిసో తెలీకో.
సిల్వియా కున్నట్టు, పార్సీ అయిన ఈమెకి ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ వున్నట్టు చెప్పారు.
కాబట్టి విక్రంతో అలా తిరిగి వుండ
వచ్చనుకున్నా, భర్త ఆ ఉత్తరాలు పట్టుకున్నప్పుడు బెదిరిపోయి తప్పయి పోయిందని
అంటుంది. ‘నువ్వు నెలల తరబడి సముద్రం మీద తిరుగుతూంటే నేనిక్కడ ఒంటరిగా ఎలా గడపగలననుకున్నావ్-
నాకు కోరిక లుండవా? పిల్లాజెల్లా అక్కర్లేదా?’ అనలేదు. రక్షించింది,
అతడి రక్షణ శాఖ ఉద్యోగ బాధ్యతల్ని
గౌరవిస్తూ.
కానీ భర్తకి దొరికిపోయాక తప్పయిందని అంది. దొరికిపోయి వుండక పోతే అలాగే తిరిగేదా కళ్లుగప్పి? నిజకథలో సిల్వియా తను పెట్టుకున్న సంబంధంతో స్పష్టమైన అవగాహనతో వుంది. సముద్రం మీద తిరిగే భర్తతో ఇక లాభం లేదని, ప్రేమ్ నే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని ఒక ధ్యేయం పెట్టుకుంది. బ్రిటిషర్ అయిన తనకి ఈ దేశపు భర్త నేవీ ఉద్యోగం పట్ల సానుభూతీ, సెంటిమెంట్లూ వుండి వుండకపోవచ్చు. కాబట్టే భర్త రాగానే మునుపటి భార్యలా ఆప్యాయపు పలకరింపులు లేకుండా, ఇంకాలస్యం చేయకుండా స్వచ్ఛందంగా తనే చెప్పేసింది. ఆలస్యం చేస్తే భోజనాల దగ్గర, పడక దగ్గర భార్యలా గడపాల్సి వస్తుందనేమో, తను ప్రేమ్ తో డిసైడ్ అయ్యాక ఇంకా భర్తతో నటించకూడదని అనుకుంది. ఇక్కడ ఈమెకీ నీతి వుంది. ఇప్పుడు ఇంట్లో తుఫాను రేగినా సరే, ఈ నీతికే కట్టుబడింది (కానీ ఆమె ప్రేమ్ పెళ్ళికి నిరాకరించిన అసలువిషయం దాచి, అతడి మీద పగ దీర్చుకోవడం కోసమే నానావతికి అలా చెప్పి రెచ్చగొట్టిందన్న వాదన కూడా వుంది- అయితే హతుడు ప్రేమ్ ఆహుజానే భార్య గురించి నీచంగా మాట్లాడి నానావతిని రెచ్చగొట్టాడనే వాదాన్నే కోర్టులు స్వీకరించాయి).
కానీ
సింథియాకి ఒక స్పష్టత కన్పించదు- భర్తతో, విక్రంతో వున్న తన సంబంధాలకి హేతుబద్ధమైన
ముగింపు నిచ్చే విషయంలో. భర్తకి దొరక్కపోతే, సిల్వియాలాగా ఒక నీతి లేకుండా భర్తని
మోసం చేస్తూ వుండేదా? విక్రం పంపుతూ వుండిన రంగురంగుల కాగితాల మీద అన్నేసి కామ
కవితా ఝరులూ, బహుమానాలూ ఇంట్లో భద్రపర్చుకోవడంలో అర్ధం? అవి ఒలంపిక్ ట్రోఫీలా?
భర్త యూనిఫాంకి అన్నేసి మెడల్స్ వుంటే తనకీ వుండాలనా? ఆ మెడల్సూ తప్పుడు మేళమే-
ఇంట్లో ఈ ట్రోఫీలూ తప్పుడు పనే. స్క్రీన్ ప్లేలో అద్భుత బ్యాలెన్సింగ్! ఏంటీ ఈ
తప్పుడు ట్రోఫీలని రుస్తుం అడిగితే, నీ
డ్రెస్సు కేమిటా తప్పుడు బిళ్ళలు?- అని డైలాగ్ విసిరితే, యాక్షన్ లో బ్యాలెన్సింగ్
ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది.
తప్పయిపోయిందని ఇప్పుడు చెప్పడం గాక, తప్పు చేస్తున్నట్టు అన్పిస్తే- తను విక్రంతో ఉండాలా, రుస్తుంతో వుండాలా రుస్తుం వచ్చే ముందే నిర్ణయించుకుని వుండాల్సింది. విక్రంతోనే అనుకుంటే, రుస్తుం రాగానే చెప్పేయాల్సింది. లేదూ రుస్తుంతోనే అనుకుంటే, చేసిన తప్పు (తప్పు అనే పదం మనం వాడడం లేదిక్కడ- అది తప్పో ఒప్పో భార్యాభర్తల మధ్య విషయం - తప్పు అని సింథియా అంటున్న మాటగానే తీసికోవాలి) వాలంటరీగా రుస్తుం కి చెప్పేయాల్సింది. రెండూ చెయ్యక, తీరా ఉత్తరాలు దొరికాక తప్పయి పోయిందనడమేమిటి?
ఉత్తరాలూ గిఫ్టులూ ఇంట్లోనే పెట్టుకుందంటే అది ధైర్యమా, అమాయకత్వమా? రుస్తుం అనుకోకుండా తిరిగొస్తాడని అనుకోలేదు కాబట్టి రొటీన్ గా విక్రంతో ఉండిపోయిం దనుకోవచ్చు. వస్తున్నాడని తెలిసి వుంటే విక్రం దగ్గరకి వెళ్లి వుండక పోవచ్చు- అయితే రుస్తుం వస్తున్నాడని తెలిస్తే ఆ ఉత్తరాలూ గిఫ్టులూ, అలాగే వుంచేదా లేక తీసేసేదా? వుం చుకుంటే విక్రంకే కమిటై రుస్తుం రాగానే అతడికి కటీఫ్ చెప్పబోతున్నట్టూ, తీసేస్తే విక్రంతో రంకు ఇంకా కొనసాగించాలనుకున్నట్టూ అర్ధం వస్తుంది. వీటిలో మొదటిది చేసే ఉద్దేశంతోనే వాటిని ఇంట్లో పెట్టుకుని వుంటే, రియల్ లైఫ్ క్యారక్టర్ సిల్వియాకి దీటుగా నీతిని ప్రకటించుకుని, శభాష్ అన్పించుకునేది.
ఒకవేళ తప్పు చేస్తున్నానని మొదటే అన్పిస్తే, ఆ ప్రేమ సరంజామాని ధ్వంసం చేసి, విక్రంని వదిలేసేది. రుస్తుం రాగానే చెప్పేసి- విడాకులిచ్చినా పడతానని అనేసేది. ఒకవేళ ఇలా చెప్పే ధైర్యం లేకపోతే, రుస్తుంకి ఆ సరంజామా కంటపడి, అతని వైపు నుంచే సిట్యుయేషన్ ఓపెన్ అయితే సులువుగా వుంటుందనుకుని వుంటే, కేవలం ఒక్క ఉత్తరం మాత్రమే అతడి కంటపడేలా వుంచుకుంటే చాలు. ఈ చర్య రెండు విషయాల్ని క్లియర్ చేస్తుంది- విక్రంతో తెగతెంపులు చేసుకుంది కాబట్టే మిగతా సరంజామాని ధ్వంసం చేసింది- ఇది రుస్తుం కి తెలియాలి కాబట్టే ఆ ఒక్క ఉత్తరాన్నీ అట్టిపెట్టుకుంది.
అసలింత
కాంప్లికేటేడ్ గా, ఇన్నియక్ష ప్రశ్నలతో లోపభూయిష్టంగా, అదీ ప్లాట్ పాయింట్- వన్ ని
ఏర్పాటుచేయబోయే, ఈ కీలక సన్నివేశం ఎలా తెరకె క్కినట్టు? ఎలాగంటే, పాత్ర ఏం
చేస్తుందో దానికి వదిలెయ్యకుండా, దర్శకుడూ రచయితా తమకేం కావాలో చూసుకోవడం వల్ల. రుస్తుం
ఇంటికి వస్తే భార్య ఇంట్లో లేదని పని మనిషిచేత చెప్పించి ప్రేక్షకులుకి గొప్ప
సస్పెన్స్ ఫీలయ్యేట్టు చెయ్యాలి. అనక అలమార పగలగొట్టించి యాక్షన్ సీన్ తో ఇంకాబాగా
ఎలివేటయ్యే సస్పెన్స్ ని ప్రేక్షకులు
అనుభవించేట్టు చెయ్యాలి... ఉత్తరాలు బైట
పడి బండారం షాకింగ్ గా అన్పించాలి...ఇలా అనుకుని పాత్రలకతీతంగా సన్నివేశ కల్పన
చేసినట్టుంది. పాత్ర(ల) స్థానంలో తాము ఆ ఇంట్లో
జొరబడిపోయి- దర్శకుడూ రచయితా కబడ్డీ ఆడుకోవడంతో - పాత్ర(లు) ఏమీ
చెప్పుకోలేని, చేయలేని ఏడుపుగొట్టు
పరిస్థితి ఏర్పడింది!
పాపం ఆతర్వాత రుస్తుం కూడా ఏం చేశాడూ- ఆమె ప్రియుడి ఇంటి కెళ్ళి వాళ్ళని దీనం గా చూసొచ్చాడు!
పాత్ర చిత్రణలు పాత్రల చేతిలోనే వుంటాయి- దర్శకుడు, రచయితా కేవలం చేయగల్గింది కాన్సెప్ట్ కి రూపకల్పన చేసుకోవడమే. పాత్రలకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాక ఆ ప్రపంచంలో ఎంజాయ్ చేయడానికి పాస్ పోర్టూ వీసాల్ని సదరు దర్శకుడు గారికి, రచయిత గారికీ స్క్రీన్ ప్లే సూత్రాలు అనుమతించవు. అలమటిస్తూ దూరం నుంచి చూడ్డమే.
(రేపు రెండవ భాగం)
-సికిందర్