రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, మే 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు -1






   ఒక దుష్ట సైంటిస్టు పాత్రతో మెడికల్ థ్రిల్లర్ మంచి ప్రయత్నమే. రీమేకులు తీస్తూ వచ్చిన తమిళ దర్శకుడు మోహన్ రాజా, సోదరుడు హీరో జయం రవీలు కలిసి  తని ఒరువన్అనే తమిళ స్ట్రెయిట్ సినిమా రూపొందించారు. దీన్నే తెలుగులో రాం చరణ్ తో దర్శకుడు సురేంద్ర రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఇంతవరకూ తమిళ సినిమాల్ని ఈ బ్లాగులో రివ్యూ చేయలేదు. కొంత మంది కోరిక మీద దీన్ని రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు చూస్తే-  డైనమిక్స్ ప్రధానంగా  పరుగులెత్తాల్సిన  ఈ మెడికల్ థ్రిల్లర్ జానర్ లో,   డాక్యుమెంటరీ ఉపన్యాసాలు  జొరబడి  యాక్షన్ కి తక్కువా లెసన్స్ కి ఎక్కువా అన్నట్టు వుంది. తమిళంలో జయం రవి పెద్ద హీరో  కాకపోవడంతో  ఇది చెల్లి పోయిందేమో గానీరాం చరణ్ లాంటి స్టార్ డమ్ వున్న హీరోతో ఇలాగే తీసి  స్టార్ డమ్ కి ఎలా న్యాయం చేకూరుస్తారో వేచి చూడాల్సిందేస్టార్ డమ్ కి తగిన సబ్జెక్టులా లేదన్పించే హిందీ రిమేక్ కి ముందు ఒప్పుకున్న సల్మాన్ ఖాన్, తర్వాత తిరస్కరించినట్టు ఇటీవల వార్తలొస్తున్నాయి.
Meet  Mr. ‘Forrest  Gump’ Mithran, 
too talkative, less active !

        ‘ని ఒరువన్లో మాస్ ఎలిమెంట్స్ కన్నా సీరియస్ కంటెంటే డామినేట్ చేస్తుందిఉన్న హీరో పోలీస్ అధికారి పాత్ర కూడా హైఫై పాత్రఈ స్క్రీన్ ప్లేకి సెకండాఫ్ లో  హీరో శరీరంలో బగ్ అమర్చి విలన్ ఆడుకునే  గేమ్ వల్ల మాత్రమే కొంత కమర్షియల్ గా బలం వచ్చింది. ఈ ట్రాక్ లేకపోతే ఏమీ లేదు. ఇది కూడా కొరియన్ మూవీ  ఐ సా ది  డెవిల్ లో వుందని విమర్శలు వస్తే తిప్పికొట్టాడు దర్శకుడు. కాకపోతే కొరియన్ మూవీలో విలన్ కే  హీరో ఆ బగ్ ని అమరుస్తాడు.

        సమాజాన్ని పీడించే ఘరానా వ్యక్తి ఒక్కడ్ని నాశనం చేసినా వాడికింద వంద మంది  క్రిమినల్స్ నశిస్తారన్న పాయింటుతో తెరకెక్కిన ఈ కథలో నయనతార హీరోయిన్ గా నటించింది, అరవింద్ గోస్వామి విలన్ గా నటించాడు.

కథ
         బిగినింగ్ : సెంగల్వ  రాయన్ (తంబి రామయ్య) అనే పార్టీ కార్యకర్త, వీరాభిమాని పార్టీ జండా కడుతూ నొప్పులు పడుతున్న భార్యని కూడా పట్టించుకోడు. అప్పుడే అక్కడికొచ్చిన పార్టీ నాయకుడు పూల్మణి  (నాజర్) చివాట్లు పెట్టి ఆమెని తన కార్లో ఆస్పత్రికి పంపిస్తూంటే మధ్యలోనే కాన్పు అవుతుంది. పుట్టిన కొడుక్కి పళని అని పేరు పెడతారు. కాలం పదిహేనేళ్ళు తిరిగిపోతుంది. పళని టెన్త్ లో ఫస్ట్  ర్యాంకులో పాసై, తండ్రి సెంగల్వ రాయన్ తో కలిసి, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడుగా ఎదిగిన  పూల్మణి ఆశీస్సుల కోసం వెళ్తాడుపూల్మణి  పార్టీ అసమ్మతి  నాయకుడితో గొడవపడుతూంటాడు. అసమ్మతి నాయకుడు కుల ప్రస్తావన తేవడంతో కోపం పట్టలేక పూల్మణి కొడితే  చచ్చిపోతాడు అసమ్మతి నాయకుడు
.
ఏం చెయ్యాలో అర్ధం గాక, ఈ నేరం సెంగల్వ  రాయన్ మీదేసుకో మంటాడు. 15 ఏళ్ల కుర్రాడు పళని అలా కాదని, ఈ నేరం తన మీదేసుకుంటే,   బాల నేరస్థుడిగా కేసు ఈజీగా వుంటుందని, అయితే బదులుగా తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనీ కండిషన్ పెడతాడు. విధిలేక ఒప్పుకుంటాడు పూల్మణి. పళని  జైలుకి పోతాడు.

కాలం ఇంకో పదిహేనేళ్ళు  తిరిగిపోతుంది. ఐపీఎస్ ట్రైనీ మిత్రన్ (జయం రవి) తన తోటి ట్రైనీ లతో కలిసి రాత్రి పూట క్యాంపస్ నుంచి జారుకుని బయట క్రిమినల్స్ ని పట్టిస్తూంటాడు. కిడ్నాప్ అయిన ఒక కుటుంబాన్నికూడా  ఇలాగే రక్షించి క్రిమినల్స్ ని పట్టిస్తాడుఈ నేపధ్యంలో ఇంకో సమాచారం అంది  నైట్ క్లబ్ కి వెళ్తాడు. అక్కడ అశోక్ పాండియన్ (నాగినీడు) అనే అనుమానాస్పద వ్యక్తిని రహస్యంగా గమనిస్తాడు. అశోక్ పాండియన్ అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న కొంత మందికి విషయం వెల్లడిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం ఓ విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో రాష్ట్రం లోకి జనెరిక్ మందుల్ని ప్రవేశపెట్టేందుకు ఆర్డర్ తీసిందని, ఇది గనుక అమలైతే వేలరూపాయల మందులు పది రూపాయలకే పేదలకి దొరుకుతాయనీ, దీన్నాపాలనీ, అయితే చాలా డబ్బు అవసరపడుతుందనీ, మెడికల్ కాలేజీల ద్వారా, కిడ్నీల వ్యాపారం ద్వారా మీరంతా సంపాదించిన డబ్బు అందించి తోడ్పడితే, ఈ మందులు మార్కెట్ లోకి రాకుండా చూస్తామనీ అంటాడు.
 
పోలీస్ మీట్ లో మిత్రన్ తన  కొలీగ్ కి చెప్తాడు- పదేళ్ళ క్రితం ఒక అమెరికన్ని కలసినప్పుడు, మేం అనారోగ్యం పాలైతే పేరున్న ప్రైవేట్ ఆస్పత్రులకి వెళ్తామని చెప్పినప్పుడు, అతను షాకై ప్రభుత్వాసుపత్రుల్లో వుండే అంతంత ఖరీదైన సౌకర్యాలు ప్రైవేట్ ఆస్పత్రుల కెలా వస్తాయని ప్రశ్నించాడని, అది తనకి చెంప పెట్టులాంటి సమాధానమనీ, చాలా ఆలోచింప జేసిందనీ అంటాడు.

        అదే పోలీస్ మీట్ లో  మిత్రన్ ఇంకో కొలీగ్ బాహాటంగానే తనకి స్ఫూర్తి  మిత్రన్ అనే  చెప్తాడు. క్రిమినల్స్ నేరాలు చేయడానికి ఎక్కువ కాలం ఆగడం లేదనీ -16, 17 ఏళ్లకే నేరాలు చేసేస్తున్నారనీ, వీటిని ఆపడానికి మనమే ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ కాలం గడిపేస్తున్నామనీ అంటూ మిత్రన్ చేసిన ఈ  విశ్లేషణ తనకి నచ్చిందనీ అంటాడు. మిత్రన్ కి అధికారుల ప్రశంస లందుతాయి.

        మిత్రన్ తోబాటు కొలీగ్స్ కీ ఒక మెసేజి వస్తుంది- రాత్రి పూట మీరేం చేస్తున్నారో తెలిసిందనీ, వచ్చి కేఫ్ లో  కలుసుకోమనీ. తీరా అక్కడి కెళ్తే మహిమ (నయనతార) వుంటుంది. మళ్ళీ ఎందుకొచ్చావనీ మిత్రన్ అంటాడు ఇష్టం లేదని చెప్పేశాకవీళ్ళిద్దరి మధ్య గతంలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో  ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిమ- తాను పోలీసునని చెప్పి తాగుబోతుల్ని బెదరగొట్టి పంపేస్తుంది. ఇది చూసిన పిల్లలు ఇలాగే  బెదరగొట్టుకుంటూ తగాదా పడుతూంటే, మిత్రన్ వచ్చి ఆపుతాడు. పిల్లల ముందు మనం జాగ్రత్తగా ప్రవర్తించకపోతే వాళ్ళు  ఇలా  తయారవుతారని మహిమకి నీతి బోధ చేస్తాడు. దాంతో ఆమె ప్రేమలో పడిపోతుంది. తీరా  చూస్తే  తను  పోలీస్ ట్రైనింగ్ వెళ్తున్న ముస్సోరికే అతనూ వస్తాడు. దీంతో ఇంకా బలంగా ప్రేమిస్తుంది. తనకి ఇష్టం లేదంటాడు, ఈ ప్రేమా దోమా కన్నా తన మెదడుని దొలిచేస్తున్న విషయాలు వేరే వున్నాయనీ రిజెక్ట్ చేస్తాడు. ఆమె హర్టయి ట్రైనింగ్ కూడా మానుకుని వెళ్ళిపోతుంది.

        ఇప్పుడిలా ప్రత్యక్షమైంది. ఇంకో రాత్రి మిత్రన్ తన టీముతో  బయటవుండగా ఒక చైన్ స్నాచింగ్ ఘటన జరుగుతుంది. భార్య  బైక్ మీంచి పడిపోతుంది, రామర్ అనే భర్తని చంపేసి పారిపోతారు దుండగులు. వాళ్ళందర్నీ బాస్ పెరుమాళ్ స్వామితో సహా పట్టిస్తారు మిత్రన్  అండ్ టీమ్. ఒక చైన్ కోసం మనిషిని చంపేస్తారా అన్న అపనమ్మకంతో ఉంటాడు మిత్రన్.
 
        మర్నాడే అరెస్టయిన పెరుమాళ్ స్వామి హోం మంత్రితో కలిసి వుండడం చూసి షాక్ అవుతారు మిత్రన్ కొలీగ్స్. ఈ మొత్తం నేపధ్యంలో మిత్రన్ ని అప్పుడప్పడు నిలదీస్తూంటారు కొలీగ్స్- రాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్లి  వస్తున్నావని. మిత్రన్ చెప్పడు. తన జీవితంలో తెరవని అధ్యాయాలున్నాయని మాత్రం అంటాడు. ఇప్పుడు పెరుమాళ్ వ్యవహారంతో ఇక చెప్పక తప్పదుఒక గదికి తీసికెళ్ళి చూపిస్తాడు. ఎగ్జిబిషన్ లా వుంటుంది. గోడలకి ఫోటోలతో, వివిధ నేరాల పేపర్ కటింగ్స్ తో, డేటాతో, ఇంకేదో సమాచారంతో నిండి వుంటుంది

        నీ క్యారక్టర్ తెలియాలంటే నీ మిత్రు లెవరో చెప్తే చాలు, అదే నీ కెపాసిటీ తెలియాలంటే  నీ శత్రువెవరో చెప్తే చాలుఅని కొటేషన్ ఏదో చెప్పి- వివరిస్తాడు

        జరిగే చిన్న చిన్ననేరాల వెనుక పెద్ద నేరాల్ని  కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటాడు. తమ రిజర్వాయర్ ఆక్రమణకు అడ్డు పడుతున్న సామాజిక కార్యకర్త రామర్ ని చంపేందుకే పైకి కన్పించేలా చైన్ స్నాచింగ్ సంఘటనని సృష్టించారనీ, దీని వెనుక హోంమంత్రితో పాటు, రియల్ ఎస్టేట్ మాఫియా పెరుమాళ్ స్వామి ఉన్నారనీ, వీడొక్కడే కాదు, మొత్తం వీడి అరెస్టయిన 32 మంది గ్యాంగ్ కూడా విడుదలై పోయారనీ వివరిస్తాడు మిత్రన్.

        అంతకి ముందు జరిగిన కిడ్నాప్ కూడా ఇంకో పెద్ద నేరానికి ముసుగు అంటాడు. అలాగే 18  మంది పసి పిల్లలు హాస్పిటల్లో  ఇంక్యుబేటర్లు  షార్ట్ సర్క్యూట్ అయి చనిపోలేదనీ, ఆ పిల్లలు పుట్టుకతోనే  డయాబెటిస్ తో పుట్టడంతో, డయాబెటిస్ మందు తయారీకి వాళ్ళ మీద ప్రయోగాలు జరిపినందుకే చనిపోయారనీ వెల్లడిస్తాడు

        తన పవర్ చూపించాలంటే తను పోలీసు నవ్వాలని అనుకున్నట్టు చెప్తాడు. ప్రజల్ని  రాజకీయ నాయకులు శాసిస్తూంటే, రాజకీయ నాయకుల్ని బడా బిజినెస్ వ్యక్తులు శాసిస్తున్నారంటాడు. వీళ్ళే ప్రజల కోసం ప్రతీదీ నిర్ణయిస్తున్నారని అంటాడు. అలాటి బడా బిజినెస్ వ్యక్తులు 15 మంది ఉన్నారనీవాళ్ళలో తనకి సమ ఉజ్జీ ఎవడో వాణ్ణి చంపుతాననీ, వాడొక్కడు చస్తే వాడి కింద వంద మంది క్రిమినల్స్ కూడా నశించినట్టే నని చెప్పుకొస్తాడు.

        ఐతే మనకి పది రోజుల్లో పోస్టింగ్స్ వున్నాయి కదానని ఆనందం వ్యక్తం చేస్తాడు మిత్రన్ కొలీగ్. మిత్రన్ మరో డెమో వేసి, మైన్స్  మాఫియా చార్లెస్ చెల్లదురై విజువల్స్ చూపిస్తాడు. అలాగే రియల్ ఎస్టేట్ మాఫియా పెరుమాళ్ స్వామి, మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ విజువల్స్ కూడా చూపిస్తాడు. రేపు చెల్లదురై మైన్స్ తనిఖీకి  అధికారులు వెళ్తున్నారని, దీన్నాపడానికి మైన్స్ మంత్రిని కలవడానికి అతను వెళ్తున్నాడనీ మిత్రన్ చెప్తాడు. ఆ మైన్స్ మంత్రి సెంగల్వ రాయన్. వీళ్ళ మీటింగ్ తాలూకు డీటెయిల్స్ సంపాదించాక ఎలా ముందు కెళ్ళాలో ఆలోచిస్తానంటాడు.


       మిడిల్ : మర్నాడు చెల్లదురైని వెంబడిస్తే, అతను మంత్రి సెంగల్వ రాయన్ ని కలుస్తాడు. ఇద్దరూ వెళ్లి సిద్ధార్థ్ అభిమన్యు ని కలుస్తారు. మిత్రన్ మొత్తం రహస్యంగా గమనిస్తాడు. సిద్ధార్థ్ అభిమన్యూ ఎంట్రీ తో అతడి చిన్నప్పటి మాంటేజెస్ పడతాయి. చిన్నప్పుడు ఇతనే పళని అనే పదిహేనేళ్ళ కుర్రాడు. జైల్లోంచి విడుదలయ్యాక ఫారిన్ వెళ్లి చదువుకుని సైంటిస్టు అయ్యాడు. పద్మశ్రీ పురస్కారం పొందాడు. ఇప్పుడు తండ్రి, చెల్లదురై వచ్చేసరికి అనన్య అనే గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. డిసెంబర్ పదిన స్విస్ ఫార్మా ఓనర్ యాంజలీనా ఇక్కడికి వస్తోందనీ, ఆ రోజు తనకి చాలా ఇంపార్టెంట్ అనీ అంటాడు.

        ఈ సమాచారం తెలుసుకుని మిత్రన్ కొలీగ్స్ తో అభిమన్యుని కనిపెడతాడు. ఒక సీఎం ( ఇప్పుడు పూల్మణి సీఎం గా ఉంటాడు) పాల్గొంటున్న సభలో అభిమన్యు ప్రసంగిస్తూ, నిన్న మధురైలో జరిగిన కుల ఘర్షణలని ప్రస్తావించి- నిరసిస్తాడు. ఇది విని మిత్రన్ కొలీగ్స్ కి వివరిస్తాడు పేపర్ కటింగ్స్ తో. అభిమన్యు తన అనుచరుడి గొంతు మీద గాయం చేసి వాడి కులం పేరు రాసి మధురైలో ఘర్షణలు సృష్టించాడనీ, దీంతో యంత్రాంగం వీటి మీద దృష్టి పెట్టడంతో , నిన్న చెల్లదురై  మైన్స్ తనిఖీకి వెళ్ళలేక పోయారనీ వివరిస్తాడు. తనిఖీని ఆపడానికే ఆ ఘర్షణలని చెప్తాడు.

        ఇప్పుడు తను ఎంపిక చేసుకోవాల్సిన  శత్రువెవరో తెలిసిందనీ, అభిమన్యు జీవితంలో డిసెంబర్ పది ని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  అంటాడు మిత్రన్. ఇక ట్రైనింగ్ పూర్తయి పాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిధిగా అభిమన్యూయే వస్తాడు. మిత్రన్ కి మెడల్ అందిస్తాడు. మిత్రన్ కి ఒక బెరెట్టా పిస్టల్ వున్న బాక్సుని బహూకరిస్తాడు అభిమన్యు. మిత్రన్ ఏఎస్పీ గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన వెంటనే అశోక్ పాండియన్, చెల్లదురై, పెరుమాళ్  స్వామిల బ్యాంకు ఖతాల్ని స్తంభింప జేస్తాడు. వీళ్ళు తమ ఖాతాల్లోంచి  7.5 బిలియన్ డాలర్లు మలేషియాలో  బ్యాంకు బ్రాంచీ కి ట్రాన్స్ ఫర్ చేయబోతున్నారని అంటాడు. ఆ డబ్బుతో యాంజలీనా కంపెనీని కొనేసి, ఆమె జనెరిక్ మందుల ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోకుండా ఆపబోతున్నారని వివరణ ఇస్తాడు

        యాంజలీనా రాగానే ఆమెని మీటవుతాడు
. క్యాన్సర్ మందుల గురించి చర్చించుకుంటారు. మిత్రన్ పరిస్థితి చెప్తాడు. రేపు ప్రభుత్వంతో మీటింగ్ కి వెళ్తే ప్రమాదమని,  తనకి డబుల్ గా మహిమని ఉపయోగించి తనకి ప్రమాదం లేకుండా  చూస్తాననీ అంటాడు.

        కారులో వెళ్తున్న మహిమని యాంజలీనా అనుకుని ఎటాక్ చేస్తారు అభిమన్యు ఆదేశాలందుకున్న గ్యాంగ్. కొద్దిలో తప్పించుకుంటుంది మహిమ. మిత్రన్ వాళ్ళ మీద తిరిగి ఎటాక్ చేసి మహిమని కాపాడుకుంటాడు. ప్రభుత్వంతో యాంజలీనా మీటింగ్ సక్సెస్ అయి అభిమన్యు షాక్ తింటాడు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని తెలుసుకుని నీరుగారి పోతాడు. మిత్రన్  అనే ఒక కొత్తగా  వచ్చిన ఏఎస్పీ తనకి  శత్రువుగా మారాడని తెలుసుకుంటాడు. పెరుమాళ్ స్వామి తమ్ముడు విక్కీతో హోటల్ రూమ్ లో  యాంజలీనాని చంపించేస్తాడు. అక్కడే వున్న మిత్రన్ తీవ్రంగా గాయపడతాడు

        అభిమన్యు  మిత్రన్ గదికి వెళ్లి గోడలకి తన గురించి అంటించిన మ్యాటర్ అంతా గమనిస్తాడు.  హాస్పిటల్ కి వచ్చి ఒక ఎలక్ట్రానిక్ బగ్ (జిపిఎస్ + ఆడియో ట్రాన్స్ మిటర్) ఇచ్చి మిత్రన్ శరీరం లో అమర్చమని  చెప్పి వెళ్లిపోతాడు. ఆ బగ్  ద్వారా  మిత్రన్ మాటలు,  ప్లాన్స్ అన్నీ వినేస్తూంటాడు. కోలుకున్న మిత్రన్ కి అభిమన్యు గురించి ఇంకో రహస్యం తెలుస్తుంది. అభిమన్యు  కంపెనీలో పనిచేసిన ఒక ఫార్మసిస్టు డయాబెటిస్ కి మందు కనిపెడితే, దాన్ని కొట్టేసి ఆమెని చంపేసిన రహస్యం ఒక  ఎస్డీ కార్డులో బాయ్  ఫ్రెండ్ దగ్గర వుంటుంది. ఇది మిత్రన్ తెలుసుకున్నాడని తెలుసుకున్న అభిమన్యు ఆ ఎస్డీ కార్డు కోసం బాయ్ ఫ్రెండ్ నీ, మిత్ర కొలీగ్ నీ చంపించేస్తాడు. ఎస్డీ కార్డు మాత్రం దొరకదు. 

        ఈ సంఘటనలతో డిస్టర్బ్ అయిన మిత్రన్ తన గదికి వచ్చి చూస్తే, అభిమన్యు వచ్చి వెళ్ళాడని తెలుస్తుంది. గదిలో
2011 నాటి మిస్ ఇండియాకి  కి సంబంధించిన ఒక ఫోటోమీద ఒక అనన్య అనే మోడల్ కి పిన్ గుచ్చి వుండడం గమనిస్తాడు. వెంటనే ఆ పిన్ మీద వేలిముద్రలు సేకరిస్తుంది మహిమ. ఆ వేలిముద్రలు మిత్రకి అభిమన్యు బహూకరించిన పిస్టల్ బాక్సు మీద అభిమన్యు వేలిముద్రలతో సరిపోతాయి. ఈ విషయం అటు అభిమాన్యుకీ  తెలిసిపోయి, తన గర్ల్ ఫ్రెండ్ అనన్య జ్ఞాపకం వస్తుంది. ఆ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న ఆమె  మీద కన్నేసి- ఆమె కోసం ఆమె తండ్రిని చంపి, ఆ పోటీల్లో పాల్గొనలేక విధిలేక ఆమె తన చార్టెడ్ ఫ్లైట్ లో స్వస్థలానికి ప్రయాణించేలా చేస్తాడు. అప్పట్నించీ ఆమె అతడికి దగ్గరై సహజీవనం చేస్తోంది. 

        అభిమన్యు తన ఫ్లాట్ ని కూడా బగ్గింగ్ చేసి ఉంటాడని మిత్రన్ కి డౌట్ వచ్చి, డిటెక్టర్ తెప్పించి  చెక్ చేస్తూంటే అది అదేపనిగా ఎలర్ట్స్ ఇస్తూంటుంది.  కానీ ఎక్కడా బగ్స్ దొరకవు, బగ్ తన ఛాతీ లోపలే అమర్చి వుందని అతడికి తెలీదు. మహిమ వాదన పెట్టుకుంటుంది. అభిమన్యుని చంపి ఏం సాధిస్తావని. అతను నీకంటే పవర్ఫుల్ అనీ, అతడికి ఈ పగే కావాలో,  తన ప్రేమే కావాలో తేల్చుకొమ్మని చెప్పేస్తుంది. బగ్ ద్వారా ఇదంతా విన్న అభిమన్యు,  మహిమ కోసం జీవితాంతం మిత్రన్ ఏడ్వాలని ఆమెని చంపేసేందుకు ప్లానేస్తాడు. దీన్ని విఫలం చేస్తాడు మిత్రన్. అప్పుడు ఒక సందర్భంలో బగ్ తన ఛాతీ లోనే వుందని తెలుస్తుంది మిత్రన్ కి.


       ఎండ్ : మిత్రన్ కి తన కొలీగ్ ని ఎటాక్ చేసిన చోట ఎస్డీ కార్డు కూడా  దొరుకుతుంది. అటు అనన్య కి అభిమన్యు ఆమె కోసం ఆమె తండ్రిని చంపిన దుర్మార్గం గురించి చెప్పేస్తుంది మహిమ.   ఒక సభలో మంత్రి సెంగల్వ రాయన్ ముఖ్యమంత్రి పూల్మణి సమక్షంలో ఓ నోట్ చదివేస్తాడు. అది తన కొడుకు అభిమన్యు రాసిచ్చిందనుకుని తెగ చదివేస్తూంటాడు. నిజానికి అది మిత్రన్ మార్చేసిన నోట్. అందులో జెనెరిక్ మందులు రాకుండా చేసిన కుట్ర వివరాలన్నీ వుంటాయి. దాన్నలాగే చదివేసి కలకలం సృష్టిస్తాడు. తండ్రి చేసిన ఈ వెధవపనికి అతణ్ణి చంపించేస్తాడు అభిమన్యు. ఆ నేరం ముఖ్యమంత్రి  పూల్మణి మీదేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. సెంగల్వ రాయన్ కి అధికారిక  లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు,  అభిమన్యు పుచ్చుకున్న చితాభస్మం అతడి తండ్రిది కాదనీ, అతను చంపిన తన కొలీగ్ దనీ మిత్రన్ చెప్తాడు. అభిమన్యు తండ్రి బతికే వున్నాడనీ వెల్లడిస్తాడు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎస్డీ కార్డు ఆధారంగా అభిమన్యు ని అరెస్ట్ చేస్తాడు. 

        కోర్టులో తన నేరాలేవీ ఒప్పుకోని అభిమన్యుకి ఇంకో రోజు గడువిస్తుంది కోర్టు.
మిత్రన్ అతణ్ణి కస్టడీలోకి తీసుకుంటాడు. ఫార్మాసిస్టుని చంపి  కొట్టేసిన మందు ఫార్ములా ఆమె పేర పేటెంట్ అయి ఉందనీ, అది జనెరిక్ మందుగానే ఉత్పత్తి అవుతుందనీ, కాబట్టి అభిమన్యు దాంతో ఏమీ చేయలేడనీ చెప్తాడు మిత్రన్. తిరిగి రేపు అభిమన్యు ని కోర్టుకి తీసుకుపోతున్నప్పుడు, ఎన్ కౌంటర్  చేస్తామని సిద్ధమవుతారు మిత్రన్ కోలీగ్స్. ఈ విషయం అభిమాన్యుకి చెప్పి, అతను బతకాలంటే  నేరాలన్నీ చెప్పేయాలంటాడు, అప్పుడు ఒక బులెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తానంటాడు. అది తొడుక్కుని తన కొలీగ్స్ షూట్ చేస్తే, చావు నటించాలంటాడు. 

        అభిమన్యుని మిత్రన్ కోర్టుకి తీసుకుపోతున్నప్పడు, అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించలేదని గమనిస్తాడు మిత్రన్. అదే క్షణంలో మిత్రన్ కొలీగ్ షూట్ చేస్తాడు. మిత్రన్ అభిమన్యుని పక్కకి తప్పిస్తాడు. అంతలో అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ అనన్య అతణ్ణి కాల్చేసి తన తండ్రి హత్యకి పగ దీర్చుకుంటుంది. చచ్చిపోతూ- తన నేరాలన్నీ ఎస్డీ కారులో రికార్డ్ చేసి బులెట్ ప్రూఫ్ జాకెట్ లో పెట్టానని చెప్తాడు అభిమన్యు. దీంతో కథ ముగుస్తుంది.


(Next : పోస్ట్ మార్టం)

-సికిందర్