రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Sunday, May 15, 2016

స్క్రీన్ ప్లే సంగతులు -2

 కథాకథనాల గురించి సరదాగా చెప్పుకుందాం. తమిళంలో ప్రేక్షకులు సూపర్ హిట్టని తీర్పు ఇచ్చేశాక వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం బావుండదు. ఇంతకి ముందొకసారి చెప్పుకున్నట్టు- దర్శకులు, రచయితలు, హీరోలు, నిర్మాతలూ తమ కంటే ఎక్కువ ఆలోచనా పరులని నమ్మి, వాళ్ళు ఏది ఎలా చూపిస్తే, అది అలా నిజమనేసి చూసేస్తారు  ప్రేక్షకులు. కాబట్టి ఆ దర్శకుల, రచయితల, హీరోల, నిర్మాతల మనోభావాల్ని కూడా దెబ్బతీయకుండా, ఇంతమంచి హిట్ ఇచ్చినందుకు  అభినందిస్తూ-  డీఫాల్టుగా మనకీ ఎంతో కొంత భావస్వేచ్చ వుండింది గనుక, ఓ సరదా రౌండేసి వచ్చేద్దాం!

Who cares? Movie watching
is a phata - phat affair, yar!

        బిగినింగ్ : ప్రారంభ దృశ్యాలు రొటీన్ ని బ్రేక్ చేస్తాయి. ఈ దృశ్యాల్లో చిన్నప్పుడు పళనిని చూపిస్తూంటే అతనే హీరో అనుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఓపెనింగ్ లో చిన్నప్పటి కథలు హీరోహీరోయిన్లవే అయివుంటూ  వస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఇక్కడ విలన్ చిన్నప్పటి కథతో సినిమా ప్రారంభించారు. నెగెటివ్ గా చూపించిన ఈ పళనియే  పెద్దయ్యాక హీరో పాత్ర మిత్రన్ అనుకుంటాం (తెలుగు రీమేక్ కి ఈ మిస్టేకెన్ ఐడెంటిటీ ఎలిమెంటు ఏమాత్రం పనిచెయ్యదు, ఎందుకంటే అప్పటికే తమిళ ఒరిజినల్ కథ తెలిసిపోయి వుంటుంది). అయితే ఈ ఎలిమెంటుని ఒరిజినల్ దర్శకుడు ఎంతవరకూ సద్వినియోగం చేసుకుని  ప్రేక్షకుల్ని వెర్రెత్తించాడో  మిడిల్ విభాగంలో చూద్దాం.

        ఇదలా వుంచితే, పదిహేనేళ్ళ పళని గురించి... ఇతను టెన్త్ ఫస్ట్ ర్యాంకులో పాసైన తెలివైన విద్యార్ధి. అంత చదువుపట్ల శ్రద్ధ వున్న  విద్యార్థికి క్రిమినల్ ఆలోచనలు చాలానే   వున్నాయిఆ పదిహేనేళ్ళ వయసులోనే హత్య మీదేసుకుని, బాల నేరస్థుల చట్టాల గురించి కూడా మాట్లాడేసి, తండ్రి కోసం ఎమ్మెల్యే టికెట్ కి ఓ పెద్ద నాయకుడికే కండిషన్ పెట్టేసి, ఇంకా ప్రాణంతో వున్న వాణ్ణి  కూడా పూర్తిగా చంపేస్తేనే తన మీద కేసు నిలబడుతుందని తెలిసి...ఇలా ఇలా ఇదంతా  చాలా అతిగా వున్నట్టు లేదూ?
 
        పదిహేనేళ్ళ తర్వాత ఐపీఎస్ ట్రైనీగా మిత్రన్  తెరపైకి వస్తాడు. ఇతను రాత్రి పూట ఏదో కాలేజీ హాస్టల్లోంచి కన్నుగప్పి వెళ్ళినంత సింపుల్ గా, తోటి ట్రైనీస్ తో పోలీస్ అకాడెమీ క్యాంపస్ కెమెరాలని ఏమార్చి, గోడదూకి నగరంలోకి వెళ్లి క్రిమినల్స్ ని పట్టిస్తూంటాడు. పోలీస్ అకాడెమీ రూల్స్ కే ఇది విరుద్ధం. డీ బార్ అయిపోయే నేరం. ఎలాగూ రేపు పోలీస్ అధికారిగా పోస్టింగ్ అయ్యేవాడికి ఇప్పట్నించే ఈ తొందరెందుకో పాత్ర అర్ధంగాదు.
నైట్ క్లబ్ లో అశోక్ పాండియన్ అనే మెడికల్ మాఫియా సమావేశం ఎలా ఉంటుందంటే, క్లబ్ మధ్యలో తన వాళ్ళ మధ్య నిలబడి బాహాటంగా లెక్చర్ ఇస్తూంటాడు తాము చేయాల్సిన కుట్ర గురించి. ఎదురుగానే అంత స్పష్టంగా మిత్రన్ నిలబడి వింటున్నా పట్టించుకోడు!

   ఇక్కడే  స్టోరీ పాయింటు ఎస్టాబ్లిష్ అవుతుంది : జనెరిక్ మందుల కోసం విదేశీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోందని, దీన్ని ఆపేందుకు అశోక్ పాండియన్ అండ్ గ్రూపు కుట్ర చేస్తున్నారనీ. కానీ ఈ విషయంగా మిత్రన్ ఏమీ చెయ్యడు. రాత్రి పూట అంత సాహసించి నేరస్థులని పట్టుకునే ఇతను ఈ విషయంలో మాత్రం ఏమీ చెయ్యడు. కానీ మర్నాడు పోలీస్ మీట్ లో కోలీగ్ తో- పదేళ్ళ క్రితం అమెరికన్ని కలిసినప్పుడుప్రైవేట్ ఆస్పత్రుల్లో అంతంత ఖరీదైన సౌకర్యాల గురించి అతను ప్రశ్నించడం గురించి చెప్పిచాలా  ఫీలవుతాడు. దీనికీ నైట్ క్లబ్ లో తాను  తెలుసుకున్న దానికీ సంబంధమేమిటో అర్ధం గాదు. జనెరిక్ మందుల గురించి ఈ మెడికల్ థ్రిల్లర్ అయినప్పుడు, దాంతో సంబంధం లేని ఆస్పత్రుల అక్రమాలతో కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తాడో దర్శకుడు అర్ధం గాదు.

        ఇక్కడే మిత్రన్ మరో కోలీగ్, మిత్రన్ తనకి స్ఫూర్తి  అని-  16, 17 ఏళ్లకే నేరాలు  చేస్తున్న వాళ్ళ గురించి
మిత్రన్ చేసిన విశ్లేషణ  గొప్పగా చెప్తాడు. పోలీస్ అకాడెమీలో తమని తీర్చి దిద్దిన అనుభవజ్ఞులైన  ఆఫీసర్లే  స్ఫూర్తి అనకుండా, ట్రైనింగ్ పొందడానికి వచ్చిన ఎవరో తనలాటి కొలీగ్ స్ఫూర్తి అనడం ఇమ్మెచ్యురిటీ. నవ్వుకుంటారు అధికారులు. హీరో పాత్రని ఎలివేట్ చేయడమంటే ఇలా కాదు!

        దీని తర్వాత ఈ బిగినింగ్ విభాగంలో  రోమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. ఫస్టాఫ్ ని నింపడం కోసం తాజాగా ఇప్పుడే  హీరోయిన్ వెంట హీరో పడే  బారెడు రొటీన్ లవ్ ట్రాక్ ని  ప్రారంభించకుండా, హాఫ్ వేలో- ఆల్రెడీ గతంలో లవ్ ట్రాక్ వుందన్న అర్ధం లో హీరోయిన్ మహిమతో సీన్ ఓపెన్ చేశారు. ఇది మంచిదే తలనొప్పి లేకుండా. ఈ సీన్ ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. ఇక్కడే ప్రేమ మొదలవుతుంది ట్రైన్లో. కానీ మిత్రన్ ఏదో అద్భుత  కొటేషన్ చెప్పేసి తనని ఆలోచింప జేశాడని మహిమ ఠకీ మని ప్రేమలో పడిపోవడం సగటు మూస ఫార్ములా హీరోయిన్ పాత్రలా అయింది. 

        ఒక ఐపీఎస్ చదువుతున్న అమ్మాయి ఎవరో ముక్కూ మొహం తెలీని వాడి మాటలకి ప్రేమలో పడిపోవడం
...ఈ సినిమా మూసఫార్ములా కాదు, పోలీస్ ప్రోసీజురల్-  సీరియస్ ఇన్వెస్టిగేటివ్ జానర్ కథ అనే ధోరణిలో తనని తాను మేధావిగా భావించుకుని నడిపిస్తున్నాడు దర్శకుడు. పోలీస్ అకాడెమీ సాక్షిగా ట్రైనింగ్ పొందుతున్న ట్రూ ప్రొఫెషనల్స్ గురించిన కథ చెప్తున్నాడు. పానకంలో పుడకలా హీరోయిన్ పాత్ర తయారయ్యింది. ఇక మిత్రన్ రిజెక్ట్ చేసేసరికి హర్ట్ అయి ట్రైనింగే మానేసుకుని ఆమె వెళ్ళిపోవడం బ్యాడ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తుంది.

        దీనితర్వాత మెయిన్ స్టోరీ ముందుకు సాగుతూ  చైన్ స్నాచింగ్ ఘటన వస్తుంది. పడిపోయిన భార్య గొలుసు లాక్కున్నాక, దూరంగా పడిపోయిన భర్తని అంత దారుణంగా ఎందుకు చంపుతున్నారో మనకర్ధంగాని విధంగా చిత్రీకరించాడు దర్శకుడు. దీనర్ధం తర్వాత మిత్రన్ వెల్లడిస్తాడు- పెద్ద నేరాల్ని కప్పి పుచ్చేందుకు ఇలాటి చిన్న నేరాలని!

        ఇక మిత్రన్ ని అపుడప్పుడు రాత్రి పూట ఎక్కడికి వెళ్లి వస్తున్నావని నిలదీస్తూంటారు కొలీగ్స్ . మనకి చూపిస్తున్న దాని ప్రకారమైతే  అందరూ కలిసే వెళ్తున్నారు. వాళ్ళ నుంచి విడిపోయి మిత్రన్ ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తే వాళ్ళలా అడగడాన్ని అర్ధం జేసుకోవచ్చు. అలాకాక, మనకు చూపించేదొకటి, వాళ్ళు అడిగేదొకటిగా తయారైతే మనకేం  అర్ధమవుతుంది  ఈ గొడవేంటో. అంటే సస్పెన్స్ తో  నిండుకుండలా ఉండాల్సింది,  మనకి విజువల్ గా చూపించక పోవడంవల్ల- వీళ్ళ  ప్రశ్నలతో వెర్బల్ గా  డొల్లగా మారిందన్న మాట. ఇక్కడి కొచ్చేసి 40  నిమిషాలూ  గడిచిపోతాయి.


     మనం ప్లాట్ పాయింట్ వన్ కోసం ఎదురు చూస్తున్నాం.  40 వ నిమిషంలో మిత్రన్ తన రహస్య గదికి తీసికెళ్ళి చూపిస్తాడు. క్యాంపస్ లో ఉండాల్సిన వాడు ఈ రహస్య గది పెట్టుకుని, రహస్య కార్యకలాపాలు  ఎలా సాగిస్తున్నాడో మనకి తెలీదు. ఆ గదిలో తన రిసెర్చి తాలూకు ఎగ్జిబిషన్ అంతా చూపిస్తూ సుదీర్ఘ లెక్చర్ మొదలెడతాడు. ఇది పూర్తిగా 9 నిమిషాలూ సాగుతుంది! దర్శకుడు కొత్తగా వచ్చిన క్రైం రిపోర్టర్లా తెగ రిపోర్టింగ్ చేస్తాడు..

        మన బ్రెయిన్ లోకి మనం అలసిపోయేలా ఈ అవసరం లేని  రీసర్చి మ్యాటర్ అంతా ఫీడ్ చేస్తూంటాడు. ఒక్కోసారి ఇతను చెప్పేది ఫాలో అవడం కూడా కష్ట మైపోతుంది. ఒక్కోసారి వేదాంతిలా ఫిలాసఫీ చెప్తాడు. ఇంతా చేసి స్టోరీ పాయింటు తో దీనికేం సంబంధం వుండదు.
నీ క్యారక్టర్ తెలియాలంటే నీ మిత్రు లెవరో చెప్తే చాలు, అదే నీ కెపాసిటీ తెలియాలంటే  నీ శత్రువెవరో చెప్తే చాలు- అని చెప్పే తన కొటేషన్ ప్రకారం, తన శత్రు వెవడో చెప్పే పరిస్థితిలో కూడా వుండడు!

 తనకి సరైన శత్రువు ఎవరో వెతికి చెప్తానంటాడు! హౌ సిల్లీ! కథలో ఈ దశలో ఇంకా ఇలాటి మాట! మరి ఈ రీసెర్చి  అంతా ఎవరిని టార్గెట్ చేసి చేస్తున్నట్టు? ఇది కూడా మనకి తెలీదు. జరిగే చిన్న చిన్ననేరాల వెనుక పెద్ద నేరాల్ని  కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటాడు. ఈ ఆ నేరాలన్నీ స్టోరీ పాయింటుతో సంబంధమున్నవా అంటే అది కూడా కాదు. జనెరిక్ మందుల్ని  ఆపే కుట్ర కోసం కాదు. ఏవో రియల్ ఎస్టేట్ గొడవలు. వాటితో స్టోరీ పాయింటు కేం సంబంధం? జరుగుతున్న చిన్న చిన్న నేరాలన్నీ జనెరిక్ మందుల్ని ఆపే మహా కుట్రకి ముసుగులని, ఆ మెడికల్ మాఫియా ఆగడాలు చూపించుకు రావాలి నిజానికి. ఈ కథలో రియల్ ఎస్టేట్, మైన్స్ మాఫియాల గొడవలకి స్థానమే లేదు.

        అలాగే
18 మంది పసి పిల్లలు హాస్పిటల్లో  ఇంక్యుబేటర్లు  షార్ట్ సర్క్యూట్ అయి చనిపోలేదనీ, ఆ పిల్లలు పుట్టుకతోనే  డయాబెటిస్ తో పుట్టడంతో, డయాబెటిస్ మందు తయారీకి వాళ్ళ మీద ప్రయోగాలు జరిపినందుకే చనిపోయారనీ వెల్లడిస్తాడు. కానీ ఈ సంఘటన కథలో మనకి చూపించ లేదు. ఎప్పుడో జరిగిందని దాని గురించి డెమో ఇస్తూ అదర గొట్టేస్తాడు. ఇది కూడా స్టోరీ పాయింటు అయిన జెనెరిక్ మందులకి సంబంధించి కాదు. ఏదో  డయాబెటిస్ మందు కనిపెట్టడం గురించి! ఇది మరో ఏకాగ్రతా - పోనీ ఏక సూత్రతా భంగం. మళ్ళీ  కన్ఫ్యూజన్ గా మెడికల్, రియల్ ఎస్టేట్,  మైన్స్ మాఫియాల ప్రదర్శన ఇస్తూ వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తాడు. 

        తన పవర్ చూపించాలంటే తను పోలీసు నవ్వాలని అనుకున్నానని అంటూ, దేశాన్ని శాసిస్తున్న బడా బిజినెస్ వ్యక్తులు
15 మందిలో సమఉజ్జీని చూసుకుని  చంపుతాననీ ఊహాజనిత వ్యాఖ్య చేస్తాడు. వాడొక్కడు చస్తే వాడి కింద వంద మంది క్రిమినల్స్ కూడా నశించినట్టే నంటాడు. ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా తన శత్రువెవడో- ఈ కథకి విలన్ ఎవడో చెప్పి తన గోల్ ని ప్రకటించుకోలేని స్థితిలో వుంటాడు! కథేమిటో ఇక్కడ కూడా అంతు పట్టని లెక్చర్ లిస్తాడు. 

        స్టోరీ పాయింటుతో సంబంధం లేని ఈ  తొమ్మిది నిమిషాల సీనులో  సాగేది అంతా నసే. నసతప్ప మరేం కాదు. సూటిగా స్పష్టంగా ఇదిగో ఈ ఫలానా ఈ  అభిమాన్యు  అనే సైంటిస్టు దుర్మార్గుడుగా మారి, జనెరిక్ మందులు రాకుండా  పేదలకి అన్యాయం చేస్తున్నాడు, వీడి మీద చేసిన రీసెర్చే ఇదంతా-  అని అభిమన్యు గురించి మాత్రమే క్షణాల్లో కళ్ళు తిరిగే విజువల్స్ ముగించి- రేపు ప్రభుత్వంతో విదేశీ కంపెనీ ఒప్పందం జరక్కుండా ఎంతకైనా తెగించేలా వున్నాడు- ఇప్పుడు నేనేం చెయ్యాలో  మీరే చెప్పండి- అని కొలీగ్స్ తో సూటిగా స్పష్టంగా,  టు ది పాయింట్ గా విషయం చెప్తే- ఒనగూడే లాభాలు-


1. ఎక్కడ  మనకి తగలాలో సరీగ్గా ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మనం ఎదురు చూస్తున్న విలన్ ఠపీ మని తగిలి, యాక్షన్ సినిమా డైనమిక్స్ కి తనవంతు పూర్తి న్యాయం చేసేవాడు వొళ్ళు దాచుకోకుండా. 

        2. వాణ్ణి చూసి- వార్నీ వీడా! పళని అంటే మిత్రా అనుకున్నామే ఛండాలంగా - అని ఈ టర్నింగ్ కి  మనం ముక్కున  వేలేసుకుని బోలెడు ఆశ్చర్య పోయేవాళ్ళం.

3. హీరో -విలన్ ఎదురెదురు శక్తులతో ప్లాట్ పాయింట్ వన్ యాక్షన్ ఓరియెం టెడ్ గా బలంగా, సూటిగా, స్పష్టంగా  ఎస్టాబ్లిష్ అయ్యేది.

4. ప్లాట్ పాయింట్  వన్ బలహీనంగా వుంటే, క్లయిమాక్స్ కూడా బలహీనంగా ఉంటుందన్న బండ గుర్తు ప్రకారం, క్లయిమాక్స్ లో విలన్ తో బలమైన ముగింపు వచ్చేది.

5. స్టోరీ పాయింటు సూటిగా బాణంలా మనకి తగిలి ఉలిక్కి పడేవాళ్ళం.

6. ప్లాట్ పాయింట్ వన్ సంబంధం లేని విషయాల ఉపన్యాసాలతో వెర్బల్ గా నసగా ఉండక, క్లియర్ కట్ గా యాక్షన్ తో వుండేది. నాటకాల్లో తప్పదు కాబట్టి వెర్బల్ గా వుంటుంది. సినిమా నాటకం కాదు, బుర్ర కథ కూడా కాదు కాబట్టి యాక్షన్ తో వుండాలి.

7. జనెరిక్ మందుల ఒప్పందం ఎక్కడ ఎప్పుడు జరగబోతోంది, అప్పుడు ఎలాటి పరిణామాలు జరగబోతున్నాయన్న ఉత్కంఠ ఏర్పడేది.

8. ఇంత టెన్షన్ పుట్టిస్తున్న విలన్ అభిమాన్యుని ప్రత్యక్షంగా ఎప్పుడప్పుడు చూ స్తామా అని ఉత్సుకత బయల్దేరేది.

వెనకటి కథలో హీరోకి ఈ ఎమోషన్ పుట్టడానికి ఒక కారణం చూపించి, ఈ గోల్ కి సమకట్టడం వల్ల దేన్ని పణంగా పెడుతున్నాడో సూచించి, పరిణామాల హెచ్చరిక కూడా చేసి వుంటే- 41-42 వ నిమిషంలోనే ప్లాట్ పాయింట్ వన్ బ్రహ్మాండంగా విస్ఫోటించేది!

        ఇంతకీ ఈ సీన్ ముగింపు కూడా ఏమిటి? మైన్స్ మాఫియా మైన్స్ తనిఖీ జరక్కుండా మంత్రిని కలవ బోతున్నాడట- వాణ్ణి ఫాలో అయితే మిత్రన్ కి తనేం చేయాలో మార్గం  దొరకచ్చట! ఇదీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథేమిటో తెలీక తెలుసుకోవడం కోసం ఇంకా ప్రయత్నిస్తానంటున్న హీరోగారి ప్రొఫెషనలిజం...ఈ కథకి (ఏ కథకి?) మళ్ళీ ఈ మైన్స్ మాఫియా ఎవడు?

దీంతో  అయిపోలేదు- పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఉపన్యాస కాండ మిడిల్ విభాగం ప్రారంభం కాగానే మళ్ళీ పుంజుకుంటుంది - పుంజులా కొక్కోరోక్కో అని మనల్ని పిలుస్తూ!


(Next : మిడిల్లో రిడిల్)

-సికిందర్No comments: