రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, మే 2016, బుధవారం

పాత కళ -కళ!

        హోదా అనేది రాగ ద్వేషాలు పెంచుకోవడంకోసం వరించదు, మార్గనిర్దేశం చేసేందుకోసం సంక్రమిస్తుంది. కరుడుగట్టిన సాంప్రదాయవాది శంకరాభరణం శంకరశాస్త్రే గనుక  ఆధునిక పోకడలకి ఛీత్కార మంత్రమే పఠించి వుంటే, కె. విశ్వనాథ్ కి తన దర్శకత్వ ప్రతిభతో ఇంత చమత్కారం చేసే అవకాశమే దక్కేది కాదు. ఎంతో ఉదారంగా శంకర శాస్త్రి ఊఁ..సరే, కానీయ్!అని భుజంతడితే గానీ విశ్వనాథ్ తనపని తను చేసుకుపోయే వీలు చిక్కలేదు. తీరా చూస్తే- అదొక మాటలకందని అద్భుత సృష్టి అయి, పండిత-పామర- పురాతన-ఆధునిక అగాధా లన్నిటినీ పూడ్చేస్తూ, సినిమా సక్సెస్ సూత్రాల్నికూడా  తిరగ రాసేస్తూ, ఒక మహోజ్వల వినోద సాధనమై కూర్చుంది మాహా దర్జాగా!

        ఆధునికత్వంతో సాంప్రదాయం అభ్యుదయంగా సాగితే దాని  ఔన్నత్యమే  వేరు. ఏ కాలంలోనైనా మాతృస్థానం లో  వుండే సాంప్రదాయ వాదం ఆధునిక పోకడల్ని నిరసిస్తే, దూరం పాటిస్తే, అప్పుడు దారీతెన్నూ తెలీని ఆధునిక పోకడలు మరింత కాలుష్యాన్నే సృష్టిస్తాయి! ఇందుకే  విన్ స్టన్ చర్చిల్ మహాశయుడు కూడా అన్నాడు- సాంప్రదాయం ములుగర్రతో పొడుస్తూ ఉండకపోతే, గొర్రెల మందలాంటి ఆధునికత్వం చెల్లా చెదు రైపోతుందని!

        శంకరాభరణం  ఫక్తు దర్శకుడి సినిమా. ఖాయంగా డబ్బులు రావని తెలిసికూడా సోమయాజులూ మంజూ భార్గవి ల్లాంటి ఏ బాక్సాఫీసు అప్పీలూ లేని నటులతో ఆడిన మహా జూదం. చోద్యంగా మారే ప్రమాదాన్ని కాచుకున్న మహా దృశ్య కావ్యం. మాట-పాట-ఆట-తీతా అన్నిటా సంభ్రమానికి గురిచేసే ఒక మహాద్భుత వైవిధ్య ప్రదర్శన.

       
పాశ్చాత్య సంగీత వ్యామోహంలో దేశీయ వారసత్వ సంపదైన శాస్త్రీయ సంగీతాన్ని అలక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేని సంగీత విద్వాంసుడు శంకర శాస్త్రి కథ ఇది. శంకర భరణం రాగంలో నిష్ణాతుడు. ప్రయోగాల పేరుతో అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయడాన్ని అస్సలు సహించడు. సంగీతానికి అతడి దృష్టిలో కులమతాల్లేవు, భాషా భేదాలూ స్వపర అంతరాలూ లేవు. 

      ఒకరకమైన సంగీతం గొప్పదనీ, మరొకటి అథమమనీ చెప్పడానికి మనమెవరమ న్న వివేచనకూడా అతడికుంది. సంగీతంలో ఆధునిక పోకడలపట్ల ధర్మాగ్రహమే తప్ప తానేదో గొప్పవాణ్ణి అన్న అహంకారం  కాదది. సంప్రదాయానికేదో అపచారం జరిగిపోతోందనీ ద్వేషభావంతో కళ్ళూ చెవులూ మూసుకుని, తనలోకి తానూ ముడుచుకుపోయే సంకుచిత్వమూ, పలాయన వాదమూ లేవు. అలాటి అర్భకుల్ని దిశానిర్దేశం చేసి  సన్మార్గంలో పెట్టాలన్నతపనే వుంది.  పాప్ మ్యూజిక్ కుర్ర గ్యాంగ్ అయినా, ప్రయోగాల పిచ్చి మాస్టా రైనా, శంకరశాస్త్రి దృష్టిలో  అర్భకులే. వాళ్ల కంటే దివ్యంగా పాప్ కూతలు తనూ  కూయగలడు. అసలంటూ శాస్త్రీయ సంగీతపు పునాదులుంటే కదా, ఏ సంగీతమైనా  అర్ధవంతంగా పాడగల్గేది - అనేసి క్లాసూ  పీకుతాడు!

       
వృత్తి గతంగా ఇంతటి అభ్యుదయమున్న శంకర శాస్త్రికి వ్యక్తిగత జీవితంలోనూ విశాల దృక్పథమే వుంటుంది. లోకులు ఛీ థూ అని తనకి దూరమైనా, తానొక నిష్టాగరిష్టుడైన సద్బ్రాహ్మణుడన్న  భేషజాలేవీ పెట్టుకోకుండా, నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. ఆమె నాట్యాభిలాషని ప్రోత్సహిస్తాడు. సంగీతంలో మాత్రమే తను అభ్యుదయవాది కాదు, జీవన సంగీతంలోనూ అభ్యుదయ వాదే. అందుకే అంటాడు- ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదుఅని.

      గ్రేట్ పర్సనాలిటీ! అయితే ఇంతటి  సెక్యులర్ శాస్త్రి శాస్త్రీయ సంగీతానికి గనుక హాని జరుగుతోందని తెలిస్తే, కన్నకూతురి పెళ్లి సంబంధమైనా  చెడగొట్టుకోవడానికీ వెనుకాడడు! కూతురి గళాన ఆందోళనగా హిందోళ రాగం హింసపడి, మరోవైపు కాబోయే అల్లుడి స్వరపేటికలో విషభ వృషభాలు మెలికపడి జరగరాని విధ్వంసం జరిగిపోతే - శంకర శాస్త్రి కంఠంలోంచి ఒక్క ప్రళయ గర్జనతో పెళ్ళిసంబంధం పటాపంచాలే. 

        కళాకారులిలాగే వుంటారు. ఒకప్పుడు ఇండోర్ ఘరానాకి చెందిన  ఉస్తాద్ షామీర్ ఖాన్ పుత్ర రత్నంతో ఇలాగే జరిగింది. ఓ సంగీత సమ్మేళనంలో పుత్రుడు అమీర్ ఖాన్ అమోఘమైన ఆలాపనలతో వహ్వా లందుకుని, ఇంటికి  తిరిగొస్తే బెత్తం పుచ్చుకుని చావబాదేశాడు షామీర్ ఖాన్. దాంతో కొన్నాళ్ళు ఎక్కడికో పారిపోయాడు ఉస్తాద్ అమీర్ ఖాన్. మొత్తం 22 శృతుల్నీ 22 ఏళ్ల పాటూ  అభ్యాసం చేసి పట్టు సాధించాకే  ఆలాపనలో “ఆ..!’ అని నోరు తెరవాలని కఠిన నిబంధన వుంటే,  దాన్ని అతిక్రమించినందుకే ఆనాడు  ఆ బడితె పూజ.

        ఇలాటి శంకరశాస్త్రికి మంజూ భార్గవి తోడవుతుంది. శాస్త్రిది శాస్త్రీయ సంగీతాన్ని సజీవంగా ఉంచాలనే  పాసివ్ ఆశయం. మంజూ భార్గవిది  తన కొడుకుని ఆ  శాస్త్రి దగ్గరే శిక్షణ  నిప్పించాలన్న యాక్టివ్ లక్ష్యం. ప్రశాంత తటాకం అతనైతే, తీరానికి చేరాలనుకునే నావ ఆమె. ఈ విధంగా ఇది  సంగీత నాట్యాల సంగమం, చివరికి మరణంలోనూ ఇదే  సంగమం. 

        ఈ పాత్రల్ని విశ్వనాథ్ చిత్రించిన తీరు, తెర మీద చూపించిన విధం- ఒక నూతన ప్రయోగం. ఈ ఇద్దరి మధ్యా మాటలే లేకుండా సినిమా అంతటినీ లాక్కు రావడం, దాన్ని ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకమూ వుండడం  మామూలు ఆత్మవిశ్వాసం కాదు. పైగా  సాత్విక నటనకే స్థానమిచ్చారు. ఆఖరికి తనని చెరచిన జమీందారుని చంపి వచ్చి, ఆ రక్తాన్ని ఆమె తన గురువు పాదాలకి పూస్తున్నప్పుడూ సాత్వికమే.

        ఒక దృశ్యంలో ఒక విషయముంటుంది. దాన్ని సంభాషణల ద్వారా వెల్లడించకుండా, కేవలం ఆ ఫీల్ ప్రేక్షకులు అనుభవించేలా చేస్తే అది సబ్ టెక్స్ట్. ఎన్నో సినిమాలకి  గ్రాండ్ ఫాదర్ లాంటి  ‘గాడ్ ఫాదర్’ లో  తండ్రీ కొడుకులైన మార్లన్ బ్రాండో, అల్ పాసినోల మధ్య ‘ఐ లవ్యూ’ అని చెప్పించకుండా పరస్పరం వాళ్ళు  ప్రేమని వెల్లడించుకునే సబ్ టెక్ట్స్ ఎలాగబ్బా అని, దర్శకుడు ఫ్రాన్సిస్  ఫోర్డ్ కపోలా రచయితలతో మల్లగుల్లాలు పడుతోంటే, తేలిందేమిటంటే- వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరికున్న ఫీలింగ్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు గనుక, వాళ్ళ  మధ్య మౌనమే వాళ్ళు పరస్పరం వెల్లడించుకునే ప్రేమ అనేసి!

        ఇలాటి సబ్ టెక్స్టే సోమయజులూ మంజూ భార్గవిల మధ్య ప్లే అవుతూంటుంది మాటలు లేని మౌనంతో. వాళ్ళవి డీ- గ్లామరైజ్డ్  ఫేసులు కాబట్టే ఈ సినిమాని అంతగా రక్తికట్టించ గలిగారు. సినిమా మొత్తం మీద  హైలైట్ అనదగ్గ దృశ్యాలు మూడుంటాయి- అవి, సోమయాజులు పాదాలకి మంజూ భార్గవి రక్తాన్ని పూసే దృశ్యం, ‘మెరిసే మెరుపులు  మురిసే పెదవుల..’ చరణంలో గాలివాన హోరులో సోమయాజులి తాండవ దృశ్యం, ముగింపులో తన సంగీత వారసుడిగా మంజూ భార్గవి కొడుకుని ప్రకటిస్తూ సోమయాజులు కూలిపోతే,  ఆయన కాళ్ళు పట్టుకుని మంజు భార్గవి తనూ ప్రాణాలొదిలే దృశ్యం!

       సినిమా పాత్రల్లో దిగ్గజంలా మెరిసే  శంకర శాస్త్రికి బ్రహ్మ రధం పట్టారు ప్రేక్షకులు. విశ్వ నాథ్ కి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. దేవదాసుకి  ఘంటసాల ఎలాగో, శంకర శాస్త్రికి  బాలసుబ్రహ్మణ్యం అలాగ. దేవదాసుకి సుబ్బరామన్ ఎలాగో, శంకరాభరణంకి కేవీ మహదేవన్ అలాగ. దేవదాసుకి  సముద్రాల ఎలాగో, శంకరాభరణంకి వేటూరి అలాగ. ఇక సంభాషణలు రాసిన జంధ్యాల, ఛాయాగ్రహణం సమకూర్చిన బాలూ మహేంద్రా, ఈ కళాఖండాన్ని మనసుపెట్టి నిర్మించిన ఏడిద నాగేశ్వరరావూ... ఇలా ఇందరేసి కళాకారులంతా ఒకచోట చేరి ఓ మహోజ్వల సంగీత రస చలన చిత్రాన్ని తెలుగు వాళ్ళ తరపున ప్రపంచానికి అందించారు.  
      
        అభ్యుదయ వాదులు సాంప్రదాయ వాదాన్ని తిరస్కరించవచ్చు. కానీ అభ్యుదయ వాదాన్ని కూడా కలుపుకుపోయేదే సాంప్రదాయ వాదమన్న గొప్ప అర్ధాన్ని ప్రకటిస్తూ  కె. విశ్వనాథ సృష్టించిన ఈ కళాఖండం నేటి తరం నుంచీ, ఇంకా ముందు తరాలనుంచీ కూడా వందనాలందుకుంటుంది తప్పక.


-సికిందర్
(ఆగస్టు 2009, ‘సాక్షి’)