రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, మే 2016, సోమవారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 13


న్ని సినిమా కథలూ ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే పుడతాయి. దీని కంటే ముందు జరిగేదంతా ప్రిపరేషన్- సెటప్. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సోల్  - హీరో - గోల్ : ఈ త్రిముఖాలని మిళితం చేసుకుని కథ పుడుతుంది. కథ పుట్టాక ఈ త్రిముఖా లేర్పడవు. కథ పుడుతూనే ఈ త్రిముఖాలతో పుడుతుంది. ప్లాట్ పాయింట్ వన్ కథ పుట్టడం బిగ్ బ్యాంగ్ లాంటిది. ఇంటర్వెల్ బ్యాంగ్ వుంటే ఉండొచ్చు, కానీ దానికంటే ముందు బిగ్ బ్యాంగ్ వుంటుంది ప్లాట్ పాయింట్ వన్ దగ్గర. ఈ బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటనం) లోంచే కథ త్రిముఖాలతో పరివ్యాప్త మవుతుంది. విశ్వంలో మహా విస్ఫోటనం జరక్క ముందు కాలం లేదు, స్పేస్ లేదు, భౌతిక- రసాయన సూత్రాలూ లేవు, ప్రాణి పుట్టడానికి అవసరమైన సోల్ కూడా లేదు. వీటన్నిటినీ  మహా విస్ఫోటనంలోంచే మోసుకుంటూ విశ్వం ఏర్పడింది. ప్రకృతి సూత్రాలనేవి ఆల్రెడీ మహావిస్ఫోటనానికి ముందే ఆ బిందువులో సాఫ్ట్ వేర్ గా ఏర్పడి వున్నాయి. అలాగే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నుంచి కూడా త్రిముఖాలని అన్ని సూత్రాలతో  మోసుకుంటూ కథ పుడుతుంది. స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలో వాటిని వెదజల్లుతుంది.

          ప్పుడదొక కథా ప్రపంచం. అంటే ప్రేక్షకుల మానసిక ప్రపంచం. వాళ్ళ మానసిక ప్రపంచపు మెకానిజంనే తిరిగి వాళ్లకి వెండితెర  తెర మీద చూపించడం. ఏమిటా మానసిక ప్రపంచపు మెకానిజం? 1.వెలుపలి మనసు- 2. అంతరాత్మ - మధ్యలో ఇగో. అంటే బిగినింగ్- మిడిల్- మధ్యలో హీరో. ఇక్కడ కీలకం హీరో. అంటే ఇగో. మనిషికుండే ఇగోకి హీరోపాత్ర ఎంత సరిపోలినట్టుగా చిత్రిస్తామో, అంత ప్రేక్షకులకి ఆ హీరో పాత్ర దగ్గరవుతుందని జేమ్స్ బానెట్ అంటారు. అదే హీరో పాత్ర ఇంకేదో పాత్రకి రోల్ మోడల్ గా వుంటే ఇంకా బలంగా నాటుకుంటుందని కూడా అంటారు.

          ఇక్కడే జోసెఫ్ క్యాంప్ బెల్ ఎంటరవుతారు. ప్రపంచ పురాణాల మైథాలజిస్టు అయిన ఈయన,  కథల్లో హీరో ప్రయాణం ఎలాగెలా కొనసాగుతుందో వివరించారు. క్లయిమాక్స్ వరకూ ఈ దశలు పన్నెండు వుంటాయి. మన ప్రస్తుత టాపిక్ ఈ ప్రయాణం గురించి కాక, వెలుపలి మనసుకీ అంతరాత్మకీ ( బిగినింగ్, మిడిల్లకి) కలిపి లాక్ వేయడమే కనుక,  ఇందుకు సంబంధించి క్యాంప్ బెల్ దగ్గర నుంచి మూడో మజిలీ, నాలుగో మజిలీ మాత్రమే తీసుకుని వీటిని ఎలా అన్వయించాలో చూద్దాం. 

         బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి సమస్య ఎదురయ్యాక, అతను ఓ పట్టాన దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కాడు. ఈ మజిలీని refusal of the call  అన్నారు క్యాంప్ బెల్. కురుక్షేత్రంలో అర్జునుడు ఓ పట్టాన యుద్ధం చేయడానికి సిద్ధపడలేదు. కృష్ణుడు ఒప్పించాల్సి వచ్చింది. ఈ ఒప్పించే పాత్రకి సంబంధించిన మజిలీని meeting with the mentor  అన్నారు క్యాంప్ బెల్. ఈ mentor  చేసే ఉపదేశంతో ఇక సమస్యని ఎదుర్కోవడానికి కార్యరంగంలోకి- మిడిల్లోకి- దూకుతుంది హీరో పాత్ర.    ఇక్కడ ఈ మజిలీ ఒక mentor  ఎవరో చేసే ఉపదేశంతోనే వుండాలని లేదు. (ఈ mentor గా కమెడియన్ కూడా ఉంటాడు కథని బట్టి) కళ్ళు తెరిపించే ఏదైనా సంఘటన కావొచ్చు, అనుభవం కావొచ్చు, అంతరాత్మ ప్రబోధం కావొచ్చు... సమస్య జోలికి వెళ్ళ వద్దనుకున్న హీరో ఇంటిని ప్రత్యర్ధులు తగలబెట్టే సంఘటన జరగ వచ్చు. అప్పుడు సమస్యలోకి దూకక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది హీరోకి. ఇదీ meeting with the mentor  మజిలీ. 

          జేమ్స్ బానెట్ కూడా ఇందుకే అన్నారు- హీరో పాత్ర ఇంకేదో పాత్రకి రోల్ మోడల్ గా వుంటే ఇంకా బలంగా నాటుకుంటుందని. హీరోలో అర్జునుడు కన్పిస్తూంటే అంతకంటే ఇంకేం కావాలి. ఇలాటి పాత్రల్ని మిథికల్ క్యారక్టర్స్ అంటారు. ఇవే ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి ప్రేక్షకుల ఆత్మిక (సోల్) దాహాన్ని తీరుస్తాయి. రాముడు, కృష్ణుడు, సీత, రాధ, రావణుడుల వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ప్రతిఫలించే సినిమాలెన్నో ఇందుకే వస్తూంటాయి.  హాలీవుడ్ లో  ఒకప్పుడు కౌబాయ్ పాత్రలు ఆత్మిక దాహాన్ని తీర్చేవి. తర్వాత సూపర్ మాన్, స్పైడర్ మాన్ లాంటి పాత్రలు తీర్చసాగాయి..

          ఇంతకీ స్క్రీన్ ప్లే లో refusal of the call  మజిలీ ఎందుకేర్పడుతుంది? ఎందుకేర్పడాలి? ఇక్కడ హీరోని ఇగోగా చూస్తే సమాధానం దొరుకుతుంది. ఇగో వెలుపలి మనసుని ఏలుకుంటూ మజా చేస్తుంది. స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం (వెలుపలి మనసు) లో హీరోల పాత్రలు ఇందుకే ఆ వారాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూంటాయి. వెలుపలి మనసులో ఎంజాయ్ చేసే ఇగోకి నీతులు చెప్పే అంతరాత్మ అంటే వొళ్ళు మంట. దాని వైపే చూడదు. ఇందుకే బిగినింగ్ విభాగంలో ఇంట్లో తిట్లు తింటున్నా  ఆవారా హీరోకి బాధ్యతలు పట్టవు.  బాధ్యతల జోలికి వెళ్తే ఈ మజా పోతుందన్న బాధ. ఇగో కూడా వెలుపలి మనసుతో  మజా వదులుకోలేకే అంతరాత్మకి దూరంగా వుంటుంది- తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ అన్నట్టు. ఇగో కి తాను పరిష్కరించాల్సిన సొంత సమస్య లున్నాయని తెలుసు. కానీ వాటి జోలి కెళ్లదు, వాయిదా వేస్తూంటుంది. లేదా సరైన సమయంలో సరైన నిర్ణయమంటూ రాజకీయ కాలక్షేపం చేస్తూంటుంది. 

          ఇగోకి ఈ దశ refusal of the call  మజిలీ. ఇది ప్లాట్ పాయింట్ వన్ లోపే వుంటుంది. దీని పర్యవసానంగా meeting with the mentor  మజిలీ ఏర్పడితేనే ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సినిమాల్లో ఈ రెండు మజిలీలూ మిస్సవుతున్నాయి. దీంతో చాల సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ లో పస లేకపోగా, మిడిల్ కూడా బలహీనంగా తయారవుతోంది.

     ‘షోలే’ లో గబ్బర్ సింగ్ ని పట్టుకోవడానికి తోడు దొంగలైన అమితాబ్, ధర్మేంద్ర లని సంజీవ్ కుమార్ ఇంటికి పట్టుకొస్తే, వాళ్లకి ఈ పోరాటంలో ఏమాత్రం ఆసక్తి లేక డబ్బు కొట్టేసి పారిపోవాలనుకుంటారు. ఇది refusal of the call  మజిలీ. అప్పుడు జయబాధురి కళ్ళబడి సిగ్గు తెచ్చుకున్నప్పుడు,  meeting with the mentor  మజిలీ. అప్పుడా తర్వాత గబ్బర్  తన ముఠా తో వచ్చి వూరి పడి  మీద దాడి చేసినప్పుడు, అతణ్ణి ఎదుర్కోవడా నికి సిద్ధపడ్డం ప్లాట్ పాయింట్ వన్ కి అంకురార్పణ.         

        కానీ ‘శివ’ లో ఎలా వుంటుందంటే, జేడీ చేష్టల్ని చూస్తూ ఓపిక పట్టి వుండే  నాగార్జున, అమలని జేడీ డాష్ ఇస్తే రియాక్టయి కొడతాడు. దీంతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది. ఇక్కడ మొదట్నించీ నాగార్జున ఫ్రెండ్స్,  జేడీ సంగతి చూడాల్సిందేనని చెప్పేదీ వుండదు, నాకెందుకని నాగార్జున పట్టించుకోకుండా refusal of the call  మజిలీ ఏర్పడేదీ వుండదు. లేదూ  పట్టించుకోవాల్సిందేనని ఏదో విధంగా meeting with the mentor  మజిలీ ఏర్పడేదీ వుండదు.

          ఈ రెండు పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించాలి. ‘షోలే’  బిగినింగ్ లో ఇగో లక్షణాలు ప్లే అవుతూంటే,  ‘శివ’ లో హీరో మాత్రమే ప్లే అవుతున్నాడు, ఇగోతో పని లేకుండా. అంటే ఇది తప్పని కాదు, సిడ్ ఫీల్డ్ ప్రకారం ఒప్పే. కానీ సిడ్ ఫీల్డ్  విధానంకూడా అమలుకాని దయనీయ స్థితి తెలుగు సినిమాల్లో వుంటున్నందుకే జోసెఫ్ క్యాం బెల్ నీ, జేమ్స్ బానెట్ నీ ఆశ్రయించాం. వీళ్ళ స్థాయిలో కథ చేసుకుంటే, దాన్ని ఇతరులు కోతలు పెట్టి ఎంత తగ్గించినా  అది  ‘శివ’ లాంటి సిడ్ ఫీల్డ్  కి స్థాయికి  తగ్గదన్న నమ్మకంతో. ఇలాకాక సిడ్ ఫీల్డ్ స్థాయిలోనే కథ చేసుకుంటే, కోతలు పడ్డప్పుడు అది కూడా అన్యాయమై పోవచ్చు. కష్టపడి తోడేసుకుని పెరుగు తయారు చేసుకుంటే, దాంట్లో నీళ్ళు కలిపి మజ్జిగ తయారు చేసుకునే దాకా పోవచ్చు- ఇంకా నీళ్ళు కలిపి మజ్జిగని కూడా నాశనం చేసుకోక పోవచ్చు. 

           డిటెక్టివ్ సాహిత్యంలో సర్ ఆర్ధర్ కానన్ డాయల్  డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ కూడా మొదటే ఏ కేసూ తీసుకోడు. కొమ్మూరి సాంబశివరావు నవలల్లో డిటెక్టివ్ యుగంధర్ కూడా కేసు మొదట తీసుకోవడానికి అయిష్టంగా ఉంటాడు. ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ కూడా ఇంతే. ప్రేమ కథలో  దేవదాసు కూడా ఇంతే-  తనని చేపట్టమని అర్ధరాత్రి వచ్చే పార్వతిని  డొంకతిరుగుడు కారణాలు చెప్పి తిరస్కరిస్తాడు.  స్టార్ వార్స్, మ్యాట్రిక్స్, రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్, లార్డ్ ఆఫ్ ది  రింగ్స్, స్పైడర్ మాన్, హేరీ పాటర్ సిరీస్, సైలెన్స్ ఆఫ్ ది  లాంబ్స్, ఎంటర్ ది  డ్రాగన్, జాస్, ప్రిన్సెస్ బ్రైడ్, కాసా బ్లాంకా, ఆల్మోస్ట్ ఫేమస్, అవతార్, షేక్స్ పియర్ ఇన్ లవ్, థెల్మా అండ్ లూయీస్, స్కార్లెట్ లెటర్...ఇలా ఎన్నో సినిమాల్లో  తప్పనిసరిగా
refusal of the call  మజిలీ భాగంగా వుంటుంది.



          ‘శివ’ లో లాగే , మొన్న వచ్చిన థ్రిల్లర్ ‘క్షణం’ లోకూడా హీరోకి refusal of the call  మజిలీ వుండదు. హీరోయిన్ పిలిచి తన కూతురు కన్పించడం లేదనగానే వెతకడం ప్రారంభిస్తాడు. ‘24’  లో విలన్ సూర్య వాచీ కోసం ప్రకటన వేసినప్పుడు హీరో సూర్య స్పందించడానికి జంకుతాడు. (ఇది refusal of the call  మజిలీ). పక్క కమెడియన్ పాత్ర ప్రోత్సహించడంతో ముందు కెళ్ళడానికి సాహసిస్తాడు  (ఇది meeting with the mentor  మజిలీ).

         
సర్వసాధారణంగా ‘శివ’ లో లాగా ఈ రెండు మజిలీలు లేకుండా తెలుగు సినిమాలు వస్తూంటాయి. కురుక్షేత్రంలో అర్జునుడు మాత్రం ఈ రెండు మజిలీలు లేకుండా ముందు కెళ్లడు . ఎందుకంటే మనిషి ఇగోనే అలా వుంటుంది.  జేమ్స్ బాండ్ లాంటి సాహసోపేత పాత్ర అలా ముందూ వెనుకా చూడకుండా దూకేస్తాడనీ, ఆ పాత్రలు ఇగో భయసందేహాల్ని అధిగమించి వుంటాయనీ అంటారు. కానీ  ఇంకా బిగినింగ్ విభాగంలోనే  ‘శివ’ లాంటి పాత్ర జేమ్స్ బాండ్ లక్షణాలతో ఎలావుంటుంది? ‘క్షణం’ లో మాత్రం?

          కాబట్టి ఈ సైకలాజికల్ లాక్ ని కూడా ప్రధానంగా  తీసుకుని ప్లాట్ పాయింట్ వన్ ని పూర్తి  చేయాల్సివుంటుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ఈ లాక్ వేయాలన్న మాట. అప్పుడు బిగినింగ్ కీ మిడిల్ కీ (వెలుపలి మనసుకీ అంతరాత్మకీ) కలిపి లాక్ వేసినట్టు వుంటుంది. ఇలా లాక్ వేయడం పాత్రని ఇగో లక్షణాలతో చూస్తేనే సాధ్యమవుతుంది...



-సికిందర్