రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, November 3, 2015

పంకజ్ స్పీక్స్!







      బాలీవుడ్ నటుడు, దర్శకుడు, షాహిద్ కపూర్ తండ్రి,  పంకజ్ కపూర్ గురించి తెలియని వారుండరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకంటే ఆయన సమాంతర సినిమాలకి పెట్టింది పేరు. ‘గాంధీ’, ‘జానేభీ దో యారో’, ‘మండీ’, ‘ఫైండింగ్ ఫ్యానీ’  లాంటి 30 కి పైగా సమాంతర సినిమాల్లో నటించి, విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. రెండు సార్లు జాతీయ అవార్డులు పొందారు. ఏక కాలంలో ఇటు సినిమాలతో బాటు అటు నాటక రంగంలోనూ, టీవీ రంగంలోనూ అసమాన ప్రతిభని చాటుకుంటున్నారు. 2011 లో షాహిద్ కపూర్- సోనమ్ కపూర్ లు హీరో హీరోయిన్లుగా ‘మౌసమ్’ అనే ప్రేమకథకి రచన- దర్శకత్వం వహించారు. బాబ్రీమసీదు కూల్చివేత దగ్గర్నుంచీ, గోథ్రా అల్లర్ల వరకూ సాగే కథాకాలంతో ఆ సున్నిత ప్రేమకథ లాజిక్ లోపించి ఆయన పేరుని మసకబార్చింది. మంచి సాహితీ ప్రియుడు కూడా అయిన పంకజ్ కపూర్ తో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధి షర్జీత్ అహ్మద్ హైదరాబాద్ లో చేసిన  తాజా ఇంటర్వ్యూ ని ఇక్కడ అందిస్తున్నాం..

మీరెలాటి కథలు చదవడానికి ఇష్ట పడతారు?
       
రీడింగ్ ని నేను చాలా ప్రేమిస్తాను. అన్నీ చదువుతాను- నాటకాలు, నవలలు, కథానికలు, స్క్రిప్టులు, కవిత్వం...ప్రతీదీ చదువుతాను. అప్పుడప్పుడు ఓ ఏడాది పాటూ అసలేమీ చదవని సందర్భాలు కూడా వుంటాయి. తిరిగి చదవడం మొదలెట్టానంటే ఇక ఆర్నెల్ల పాటూ సమయమంతా చదవడంతోనే గడిచిపోతుంది. నాకైతే ఇంగ్లీషు, హిందీ, పంజాబీ కవిత్వాల్లో  చాలా బ్యూటీ కన్పిస్తుంది. ఇక నా మీద ప్రభావం చూపించిన రచయిత లెవరని మీరడిగారంటే, ఆ లిస్టు పెద్దదే. సాదత్ హసన్ మంటో, ప్రేమ్ చంద్, స్టీఫాన్ జ్విగ్, సోమర్సెట్ మామ్, విలియం షేక్స్ పియర్, నికోలాయ్ ఓస్ట్రోవ్స్కీ, డాస్టోవ్స్కీ, చెఖోవ్...ఇలా ఎందరో. మనం స్నేహం చేస్తూ పెరిగే మిత్రులు, పేరెంట్స్, టీచర్స్, నాటకరంగ, సినిమారంగ నిర్మాతలూ దర్శకులూ వీళ్ళందరితో కూడా నేను ప్రభావితుణ్ణయ్యాను. గత నలభై ఏళ్లుగా ఈ వ్యక్తులతో సాన్నిహిత్యం, చదివిన సాహిత్యం,  ఈ రెండిటి ప్రభావాల సమాహారమే ఇప్పుడు మీ ముందున్న నేను. 

ఇవ్వాళ రచన చేయాలనుకుంటున్న యువతరం సినిమాలకి రాసేందుకే ఎక్కువ ఇష్ట పడుతున్నారు. ఓ గొప్ప నవల రాసే ఆలోచనే చేయడం లేదు. ఈ ట్రెండ్ ని సాహితీవేత్తలు  నిరసిస్తున్నారు, మీరే మంటారు?
       
యువతరం చాలా టాలెంట్ తో వుందని అనుకుంటున్నాను. వాళ్ళు రాసేందుకు మనం ప్రోత్సహించాలి.  కొన్నితరాలుగా, ఓ మూడు నాల్గు దశాబ్దాల క్రితం వరకూ కూడా,  ఎక్కువ మంది మన రచయితలు వేరే వృత్తులు చేసుకునే వారు. ఎందుకు? కథలు రాసుకుంటూ బతకలేమని వాళ్లకి తెలుసు. రచనా రంగంలో అప్పట్లో డబ్బు లేదు. నేటి తరం చాలా అదృష్ట వంతులు. రాస్తూ కూడా జీవించడానికి వాళ్లకి రచనా రంగం అనేక ఆదాయ మార్గాలతో కూడిన ద్వారాలు తెర్చి పెట్టింది. సినిమాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, టీవీ కావచ్చు, పత్రికలూ కావచ్చు- సినిమాలకి రాస్తే ఇంకాస్తా  బాగా స్థిర పడవచ్చని వాళ్ళనుకుంటే తప్పేమిటి? సాదత్ హసన్ మంటో కూడా సినిమాలకి రాశారు. ఇస్మత్ చుగ్తాయి కూడా రాశారు. తర్వాత సాదత్ హసన్ మంటో  సినిమాల్లో కంటే పుస్తకాలు రాస్తే ఎక్కువ డబ్బొస్తోందని పుస్తకాలు రాయడం వైపు మొగ్గారు. అదిప్పుడు మారింది. ఇప్పటి తరం సినిమాలకి రాసి ఎక్కువ గడించ వచ్చనుకుంటే వాళ్ళని రాయనియ్యాలి. వాళ్ళు రాస్తున్నంత వరకూ, అదీ నిష్ఠగా రాస్తున్నప్పుడు ప్రోత్సహించాలి. రాసి బతకడానికి ఏ మీడియాని ఎంపిక చేసుకోవాలో వాళ్ళ సొంత విషయం. సినిమా రచయిత అన్పించుకున్నంత మాత్రాన గౌరవమేమీ తగ్గిపోదు. పుస్తకాలు రాసినంత క్రియేటివిటీయే  సినిమాలకి రాయడానికీ అవసరం. ఇక సినిమాలకి రాయడం తక్కువ స్థాయి వ్యాపకమని  సాహితీ వేత్తలెవరైనా అంటే అననీయండి. ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటే  వాళ్ళు కూడా అటే  జంప్ చేస్తారని కచ్చితంగా చెప్పగలను. 

సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్ గురించి మీరే మంటారు?
       
నా మాటలు వాళ్లకి రుచించక పోవచ్చు. అయినా చెప్తాను. నా వయసుకీ, అనుభవానికీ ఇలా అనే అర్హత నాకుంది. ఎవరీ క్రిటిక్స్ అనే వాళ్ళూ? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమిటి? సినిమాల్ని జడ్జ్ చేసే హక్కు వాళ్ళ కెవరిచ్చారు? వాళ్ళని ఎవరైనా ఎలా నమ్మాలి? సినిమా మేకింగ్ లో ఏమేం జరుగుతాయో, ఏమేం చేస్తే ఒక సినిమా తయారవుతుందో వాళ్ళకేమైనా ఐడియా ఉంటుందా? పాత్రని పట్టుకుని నటుడు ఎలాటి ఆపసోపాలు పడతాడో వాళ్లకి తెలుసా? సినిమాలకి రివ్యూలు రాయడానికి పూనుకునే ముందు, ప్రతీ క్రిటిక్ మూవీ మేకింగ్ నీ, యాక్టింగ్ నీ విధిగా నేర్చుకోవాలి. కనీసం పదేళ్ళు ఫిలిం మేకర్లతో, ఆర్టిస్టులతో అసోషియేట్ అవ్వాలి. ఇలా ఎందుకంటున్నానంటే, క్రిటిక్స్ కో వాయిస్ వుంటుంది. అది ప్రేక్షకుల్లోకి  వెళ్తుంది. అయితే ఈ వాయిస్ ఎక్కువగా అజ్ఞానంతో కూడుకుని ఉంటోంది. సినిమా నిర్మాణం ఎలా జరుగుతుందో నాలెడ్జ్ ఏమీ లేకుండా, వాళ్ళు జడ్జ్ చేసేస్తారు, ప్రేక్షకులు ప్రభావిత మవుతారు! ఈ ధోరణి సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే వాళ్ళందరికీ అవమానమే, అన్యాయమే. 

అంటే శిక్షణ పొందిన ఫిలిం మేకర్లకే రివ్యూలు రాసే హక్కుందంటారా?
        విమర్శకి నేను ఓపెన్ గా వుంటాను. కానీ క్రిటిక్ చేయాల్సిన పనేమిటంటే, నిర్మాణాత్మక విమర్శ చేయడం. ఏవో సొంత అభిప్రాయాలూ జడ్జ్ మెంట్ లతో ఫలానా సినిమా ప్రేక్షలుకు చూడాలో వద్దో చెప్పేయడం అన్యాయం. నిర్మాణాత్మక విమర్శ ఎప్పుడు చేయగల్గుతారు? ఆలోచించండి, దానికంటూ  కూడా సినిమా పరిజ్ఞానం ఉండాలిగా? పైగా కమర్షియల్ సినిమాల్ని ఒక రకంగా, ఆర్ట్ సినిమాల్ని ఇంకో రకంగా నిర్ణయించుకుని  రివ్యూలు రాసేస్తున్నారు. ఒక కమర్షియల్ సినిమాలో కథే లేకపోయినా దానికి నాల్గు స్టార్స్ ఇవ్వడానికి వాళ్ళే మాత్రం సంకోచించడం లేదు. అదే ఆర్ట్ సినిమాకి ఆ రేటింగ్ ఇవ్వాలంటే అదింకా బాగా తీయాలని అంటారు. ఇదెక్కడి న్యాయం?
       
ఇక దురదృష్టవశాత్తూ, ఒక పెద్ద పత్రికో, టీవీ ఛానెలో వీళ్ళని నియమించుకుంటే దేవుళ్ళుగా  ఫీలయిపోతారు. ఆ మీడియా సంస్థ స్థాయి తమకూ వచ్చేసిందను కుంటారు. ఇక అన్నీ తమకే తెలిసినట్టు గంట కూర్చుని రాసేస్తారు. వాళ్ళనీ  వాళ్ళ రివ్యూలనీ అసలెవ్వరూ ఇష్ట పడ్డం లేదన్న వాస్తవాన్ని కూడా అంగీకరించరు. లోపాలు ప్రతీ మనిషి లోనూ వుంటాయి. ఇంకో అవకాశం ఇచ్చి చూడాలి. పొరపాట్లేమైనా వుంటే ఎత్తి చూపొచ్చు, అలాగే సినిమాలో బావున్న దేమిటో కూడా ప్రేక్షకులకి చెప్పాలి.

***