‘అరుంధతి’...ఇంకా
ప్రేక్షకుల జ్ఞాపకాల్నుంచీ చెరిగిపోని -2009 బ్లాక్ బస్టర్ !
ఓ
సినిమా చూసిన ప్రేక్షకులు డాన్సులు బావున్నాయనో, ఫైట్స్ బావున్నాయనో అన్నారంటే ఆ
సినిమా ప్రమాదం లో పడినట్టే. అంటే కథ ఆకట్టుకోనట్టే. అలాగే గ్రాఫిక్స్ బావున్నాయని
అన్నారంటే కూడా ఇదే అర్ధం వస్తుంది. ఇందుకే ‘అంజి’ ఫ్లాప్ అయ్యిందంటారు రాహుల్ నంబియార్. ఇలాటి
పొరపాటు ‘అరుంధతి’ విషయంలో జరగనివ్వలేదనీ, ఇదే తను నేర్చుకున్న క్రియేటివ్ లెసన్
అనీ అన్నారాయన.
రాహుల్
నంబియార్.. ‘అరుంధతి’ సంచలన విజయంతో తళుక్కున మెరిసిన పేరు. మూడు పదుల ఈ ఏస్
గ్రాఫిక్స్ ఎక్స్ పర్ట్ కేరళలో పుట్టి రాజస్థాన్ లో పెరిగారు. అక్కడ్నించీ గుజరాత్ లో ‘బరోడా స్కూల్ ఆఫ్ ఫైనార్ట్స్’ లో చిత్ర లేఖనం పట్టా పుచ్చుకున్నారు. తర్వాత ముంబాయి లో యానిమేషన్
కోర్సు పూర్తి చేసి, 2000 లో హైదరాబాద్
చేరుకున్నారు. ఇక్కడ ‘ఫ్లై ఫైర్’ అనే క్రియేటివ్ స్టూడియో ప్రారంభించి, ‘అంజి’ కి
గ్రాఫిక్స్ సమకూర్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టారు.
‘వినియోగ దార్ల స్వప్నాన్ని సాకారం చేయడమే నా వృత్తి’ అన్నారాయన. ‘అరుంధతి’
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ తోనే
స్పెషల్ ఎఫెక్ట్సుకి జాతీయ అవార్డు సాధించుకుని అందరి దృష్టిలో పడ్డారు నంబియార్. తర్వాత
వరుసగా ‘ఠాగూర్’, ‘ఛత్రపతి’, ‘సాంబ’, ‘స్టయిల్’, ‘గోదావరి’ మొదలైన 20 సినిమాలకి
గ్రాఫిక్స్ సమకూరుస్తూ బిజీ అయిపోయారు. అయితే ‘అరుంధతి’ కి పనిచేయడం తన జీవితంలో మైలురాయి
వంటిదన్నారు.
‘కథలో కలగలిసిపోయిన గ్రాఫిక్స్ సృష్టికి
అత్యుత్తమ ఉదాహరణ అరుంధతి!’ అన్నారు. ఇలా
కథలో మిళితమై పోయిన గ్రాఫిక్స్ వున్న హిట్స్ ‘టర్మినేటర్-2’, ‘మాట్రిక్స్’, ‘ధూమ్ -2’, ‘క్రిష్’ మొదలైనవి అని వివరించారు. ‘అరుంధతి’ కోసం తను ‘శబ్దాలయా కాంప్లెక్స్’ లోనే కొత్తగా ‘టికిల్
బాగ్ క్రియేటివ్ స్టూడియో’ ( ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న ప్లేస్) ని నెలకొల్పానన్నారు.
ఇక్కడ్నించే చెన్నైలో ఒకటి, ముంబాయిలో మూడు, హైదరాబాద్ లో మరో రెండూ స్టూడియోలని
‘అరుంధతి’ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ కోసం నియంత్రించానన్నారు. మొత్తం మూడు వేల మంది యానిమేటర్లు పాల్గొన్న ఈ మహా యజ్ఞం రెండున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. ప్రీ ప్రొడక్షన్ కి ఏడాది, పోస్ట్ ప్రొడక్షన్ కి మరో ఏడాదిన్నర కాలమూ పట్టాయన్నారు. దీని బడ్జెట్ రెండున్నర కోట్ల రూపాయలు.
‘అరుంధతి’ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ కోసం నియంత్రించానన్నారు. మొత్తం మూడు వేల మంది యానిమేటర్లు పాల్గొన్న ఈ మహా యజ్ఞం రెండున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. ప్రీ ప్రొడక్షన్ కి ఏడాది, పోస్ట్ ప్రొడక్షన్ కి మరో ఏడాదిన్నర కాలమూ పట్టాయన్నారు. దీని బడ్జెట్ రెండున్నర కోట్ల రూపాయలు.
‘నా ఉద్దేశంలో సినిమా స్క్రిప్టు
రాస్తున్నప్పుడే అందులో విజువల్ ఎఫెక్ట్స్ నీ కలుపుకు పో వాలి. అంతే కాదు,
షూటింగులో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కచ్చితంగా పాల్గొనాలి’ - అంటూ ‘అరుంధతి’ షూటింగ్ లో తను పాల్గొన్న ఫోటోలు చూపించారు.
‘అరుంధతి’ లోని గ్రాఫిక్స్ సహిత సన్నివేశాలన్నిటికీ
నంబియారే దర్శకత్వం వహించారు. వీటి నిడివి గంట వరకూ వుంటుంది. ఈ దృశ్యాల చిత్రీకరణకి
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి నంబియార్ కోరికపై ఆస్ట్రేలియా నుంచీ ఖరీదైన మోషన్
క్యాప్చర్ కెమెరా తెప్పించారు. దీని నిర్వహణకి ‘లార్డ్స్ ఆఫ్ డి రింగ్స్’ కి
పనిచేసిన నిపుణుల్ని రప్పించారు. ఈ కెమెరా విశిష్టత ఏమిటంటే, ఈ కెమెరాకుండే క్రేన్
ఎన్నిసార్లైనా నిర్దేశిత మూవ్ మెంట్ ని పొల్లు పోకుండా రిపీట్ చేస్తూ పోతుంది.
ఇదంతా సరే, ఇంతకీ ‘అరుంధతి’ లో తనకి బాగా నచ్చిన
దృశ్యా లేమిటి?
వాటిని ఇలా చెప్పుకొచ్చారు :
1. ముగింపులో రాజభవనం కూల్చివేత ( దీని సృష్టికి హైదరాబాద్ లోని గ్రాఫిక్స్ సంస్థలన్నీ అశక్తతని తెలియజేశాయట!)
1. ముగింపులో రాజభవనం కూల్చివేత ( దీని సృష్టికి హైదరాబాద్ లోని గ్రాఫిక్స్ సంస్థలన్నీ అశక్తతని తెలియజేశాయట!)
2. క్లైమాక్స్ ఎపిసోడ్.
3. సమాధిలోంచి విలన్ సోనూ సూద్ లేవడం.
4. కోట మార్ఫింగ్ షాట్స్.
5. డ్రమ్ డాన్స్ దృశ్యాలు
అయితే
వీటిలో మరీ గర్వ పడే సృష్టి- సమాధి లోంచి సోనూ సూద్ లేచే సీనే అన్నారు.
‘బెసికల్లీ వుయ్ ఆర్ ఇన్ స్టోరీ టెల్లింగ్
మీడియా. విజువల్ ఎఫెక్ట్స్ ఈజ్ సెకండరీ..’ అంటూ సినిమాల్లో కథకి కట్టాల్సిన పట్టుచీరా, పెట్టాల్సిన బంగారు కిరీటమూ
గురించి చెప్పుకొచ్చారు. ఈయన్ని చూస్తోంటే, మన హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే ఎంత
బావుండునన్పిస్తుంది.
కథని గ్రాఫిక్స్ డామినేట్ చేయకూడదన్న
పట్టుదల వుంది తనకి. ‘అంజి’ లా కాక, ‘అరుంధతి’ లో ప్రేక్షకులు కథ గురించీ, అనూష్కా నటన గురించీ
మాత్రమే మాట్లాడుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి కూడా మరో నంది దక్కింది తనకి.
‘ఓకే, మరయితే- నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి?’
అన్న ప్రశ్నకి ఇలా చెప్పుకొచ్చారు : శ్యాం ప్రసాద్ రెడ్డి
నిర్మాణంలోనే ఓ ఫాంటసీ థ్రిల్లర్. పూర్తి స్థాయి దర్శకుడు తనే - అంటూ, ఈ కూర్చున్న
అద్దాల ఛాంబర్ లోంచి అవతల స్టూడియోవర్క్ బెంచి మీద కన్పిస్తున్న ఒక మినియేచర్ ని
చూపించారు. దాని దగ్గరికి వెళ్లి చూస్తే, అదొక పురాతన దేవాలయ ముఖ ద్వార మినియేచర్.
తను దర్శకత్వం వహించబోయే ఫాంటసీ థ్రిల్లర్ లో ఇది కీలక పాత్ర పోషిస్తుందట. కేవలం
రెండు అడుగుల ఎత్తున్న ఈ మినియేచర్ రేపు
వెండితెర మీది కొచ్చేసరికి, రెండు వందల అడుగుల ఎత్తు కన్పిస్తుందట!
ఇదీ ఆయన మ్యాజిక్. ఈ మినియేచర్ కి లాగే,
పొట్టి మనిషైన రాహుల్ నంబియార్ కూడా- వెండితెర మీద తన విశ్వామిత్ర సృష్టులతో ఎవరెస్టు శిఖరమంత ఎత్తు కన్పిస్తారు తప్పక!
―సికిందర్
[‘ఆంధ్రజ్యోతి’- ఆగస్టు 2010 ]
[‘ఆంధ్రజ్యోతి’- ఆగస్టు 2010 ]