ప్రసూన్ జోషి
|
ప్రసూన్ జోషి- స్క్రిప్టు రచయితగా మారిన జాతీయ
అవార్డు పొందిన గీత రచయిత! క్రియేటివిటీ
తనలోంచి ధారాళంగా ప్రవహిస్తుందని చెప్పుకునే యాడ్స్ క్రియేటర్ కూడా! కలం పట్టుకుని
వీలైనన్ని రచనా ప్రక్రియల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవా లనుకుంటున్న జోషీ, సూపర్
హిట్ ‘భాగ్ మిల్కా భాగ్’ కి స్క్రిప్టు రాసి తనలోని ఆ మరో
క్రియేటివ్ పార్శ్వాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాకి రాసినప్పటి అనుభవం గురించి, దర్శకుడు
రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రాతో తనకు గల అనుబంధం గురించీ ఆయనిలా చెప్పుకొచ్చారు..
* గీత రచయిత నుంచి కథా రచయితగా మారడంలో
మీకెలాటి అనుభావా లెదురయ్యాయి?
ఛాలెంజింగ్ అనుభవాలు. అంతే ఫన్ కూడా. నేర్చు కోవడానికి మంచి అనుభవం కూడా. ‘భాగ్ మిల్కా భాగ్’ స్క్రిప్టు రాయడానికి నేనెందుకు అంగీకరించానంటే, అందులో నాకు ఛాలెంజి ఎక్కువ కన్పించింది. నేనే పని చేపట్టినా అందులో నేర్చుకోవడానికి ఏదో ఉంటుందన్న దృష్టితోనే చేపడతాను. ‘భాగ్ మిల్కా భాగ్’ స్క్రిప్టు మీద పూర్తి మూడేళ్ళూ వర్క్ చేశాను. అది నిరంతర ప్రక్రియ. స్క్రిప్టు రచన నిరంతరంగా సాగే ప్రక్రియ. కొన్ని సార్లు ఇతర పనుల వల్ల బ్రేక్స్ తీసుకున్నా, ఆ తర్వాత ఆ స్క్రిప్టు మీద ఏకబిగిన వారం పాటు కూర్చునే వాణ్ణి. స్క్రిప్టు ని చాలా చాలా పాలిష్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఛాలెంజింగ్ అనుభవాలు. అంతే ఫన్ కూడా. నేర్చు కోవడానికి మంచి అనుభవం కూడా. ‘భాగ్ మిల్కా భాగ్’ స్క్రిప్టు రాయడానికి నేనెందుకు అంగీకరించానంటే, అందులో నాకు ఛాలెంజి ఎక్కువ కన్పించింది. నేనే పని చేపట్టినా అందులో నేర్చుకోవడానికి ఏదో ఉంటుందన్న దృష్టితోనే చేపడతాను. ‘భాగ్ మిల్కా భాగ్’ స్క్రిప్టు మీద పూర్తి మూడేళ్ళూ వర్క్ చేశాను. అది నిరంతర ప్రక్రియ. స్క్రిప్టు రచన నిరంతరంగా సాగే ప్రక్రియ. కొన్ని సార్లు ఇతర పనుల వల్ల బ్రేక్స్ తీసుకున్నా, ఆ తర్వాత ఆ స్క్రిప్టు మీద ఏకబిగిన వారం పాటు కూర్చునే వాణ్ణి. స్క్రిప్టు ని చాలా చాలా పాలిష్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
* దర్శకుడు
రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తో పనిచేయడం ఎలా అన్పించింది?
గతంలో
ఆయన సినిమాలకి పాటలు రాశాను. దర్శకుడిగా ఆయనంటే గౌరవముంది. మేమిద్దరం ఒకే రంగం నుంచి వచ్చాం-
అడ్వర్టైజింగ్ రంగం. కాబట్టి ఆయనతో పనిచేయడం నాకెప్పుడూ సులభంగానే వుంటుంది. పైగా ఎక్సైటింగ్
గా కూడా. మొదటి సారి ఆయనతో ‘రంగ్ దే బసంతీ’ కోసం పనిచేశాను. ఆ సినిమాకి పాటలతో బాటు
డైలాగులు రాశాను. రెండోసారి ‘ఢిల్లీ -6’ కి పనిచేశాను. ఈ సినిమాలో కూడా పాటలు, మాటలు రాశాను.
* ‘భాగ్ మిల్కా భాగ్’ ని ఎలా రాసేవారు?
ఇందాకే
చెప్పినట్టు స్క్రిప్ట్ రైటింగ్ నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఎప్పుడు పడితే బ్రేక్స్
తీసుకునే వాణ్ని కాదు. ఆ రాస్తున్నప్పుడు మధ్యమధ్యలో చర్చ లుండేవి. స్క్రిప్టు ని-
స్క్రీన్ ప్లే నీ రాసిన దాన్ని పాలిష్ చేస్తూండడం చాలా అవసరంగా భావించే వాణ్ని.
పాలిష్ చేస్తూంటే అందులోంచి ఏ అద్భుతం ఊడి
పడొచ్చో చెప్పలేం. దాంతో మరింత బెటర్ మెంట్ వచ్చే అవకాశం వుంది. ఇంతేగాక- చాలా
రీసెర్చి చేయాల్సి వచ్చింది సబ్జెక్టుని.
ఈ తరహా కథకి రీసెర్చి లేకుండా రాయలేం. మిల్కా సింగ్ నిజ జీవిత పాత్ర. ఆయన
జీవితాన్ని అర్ధం జేసుకోవడం చాలా అవసరం. ఆయనతో పాటు ఆయన సమకాలీన క్రీడాకారుల జీవిత
చరిత్రలని కూడా చదివాను. అలా నాకు చాలా మెటీరియల్ దొరికింది. ఆ కథలు కూడా చెప్పాల్సినంత
ముఖ్యమైనవే. కానీ ఈ సినిమాలో కాదు. ఇది
మిల్కా సింగ్ ఒక్కరి జీవిత కథ మాత్రమే.
* జీవిత
చరిత్రని సినిమాగా మల్చాలంటే కష్టమైన పనే..
కచ్చితంగా.
ఈ ప్రాజెక్టుని ఒప్పుకోవడమే ఇందులో ఛాలెంజి ఉందన్న ఉద్దేశంతో. మూడేళ్ళూ దీనిమీద వర్క్ చేశాను. ఈ కాలంలో చాలా సమయం మిల్కా సింగ్ తో గడిపాను. కథని ఎంత కాల్పనికం
చేసినా అది నిజ జీవిత పాత్రకి అతికేలా వుండాలి. కనుక మిల్కా సింగ్ ని చాలా దగ్గరగా
చూశాను- ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఇతరులతో
ఆయన సంబంధాల్నీ, ఎమోషనల్ గా మానసిక లోతుల్నీ
వీలైనంత పరిశీలించాను. ఈ రీసెర్చి మెటీరియల్ అంతా రాకేష్ ముందుంచి డిస్కస్ చేసే వాణ్ణి .
* ఈ
సినిమాకి రాస్తున్నప్పుడు మిల్కా సింగ్ నుంచి మీరు నేర్చుకున్న దేమిటి?
క్రమశిక్షణ-
అది నేర్చుకున్నాను. ఆయనొక క్రీడాకారుడు- ఆ
క్రీడాకారుడి క్రమశిక్షణ ఆయన నరనరానా వుంది. సినిమాల్లాంటి సృజనాత్మక రంగాల్లో ఉంటున్న
వాళ్లకి కూడా క్రమశిక్షణ చాలా అవసరమని గుర్తించాను.
ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలో ఓటమిని అంగీకరించని సంకల్ప బలం ఆయన్నుంచి నేర్చుకున్నాను.
* పాటలు
రాయడంలో- స్క్రిప్టు రాయడంలో ఎలాటి తేడా మీరు గమనించారు?
పాటల రచన వేరే వ్యవహారం. నేనీ
రోజు ఓ పాటా, రేపో పాటా రాసేయగలను. ఈ పని తక్కువ సమయం తీసుకోవడమే గాక, సినిమా స్క్రిప్టు రాయడం కంటే తేలికైన పని కూడా. పాట ఒక ఊపులో వచ్చేసి దానంతట అదే నిలబడిపోతుంది. స్క్రిప్టు
అలా కాదు. చాలా లాజికల్ కంటిన్యూటీలూ చూడాల్సి వుంటుంది. రోజుల తరబడి రీ రైటింగ్ చేస్తూనే
ఉండాల్సి వుంటుంది. డైలాగులు తగ్గిస్తూ షార్ప్ గా వచ్చేట్టూ పదేపదే సాన బట్టాల్సి
వుంటుంది.
* హిందీ పాటల సాహిత్యంలో దిగజారుతున్న విలువల గురించేమంటారు?
అలాటి పాటల్ని ఆదరిస్తున్న
శ్రోతల్ని కూడా అనాలి. ఏదో వినేసి, కాస్సేపు
ఒళ్ళు ఊపి ఆ పాటని మర్చిపోయే శ్రోతలుంటే అలా రాసే వాళ్ళూ వుంటారు. శ్రోతలకి కూడా
బాధ్యత వుండాలి. అలాటి పాటల్ని తిప్పి కొట్టాలి. అయితే ప్రతీ కాలంలో మంచి పాటలు, చెడ్డ పాటలూ అనేవి వుంటూనే వుంటాయి. సాహిర్ లుథియాన్వీ
పాటలు రాస్తున్న కాలంలో చెత్తపాటలు రాస్తున్న వాళ్ళు కూడా వున్నారు. చెత్త పాటల
వల్లే మంచి పాటల్ని గుర్తించ గల్గుతున్నా మేమో!
* మీరు
పాటల రచనా ప్రక్రియ మీద ఒక పుస్తకం రాశారు- ఆ ప్రక్రియ తెలుసుకోవడం శ్రోతలకి ముఖ్యమని
ఎందుకు భావించారు?
ఆ
పుస్తకం రాయడానికి కారణం పాటల క్వాలిటీ దిగాజారిపోతోందని వాపోయే వాళ్ళు
తెలుసుకోవాల్సినవి వున్నాయని చెప్పడానికే. అసలు పాటలెలా రూపొందుతాయో వాళ్ళు
తెలుసుకోవడం కోసం రాశాను.
* హాలీవుడ్
లో స్క్రిప్టు రచన అనేది అదొక కళారూపంగా రూపాంతరం చెందుతోందని ఆ సినిమాలు చూస్తే అర్ధమవుతోంది.
మన దేశంలో ఎలా వుంది?
స్క్రిప్ట్
రచన హాలీవుడ్ లో ఒక కళా రూపంగా రూపాంతరం చెందుతోందంటే అక్కడ స్క్రిప్టు రచయితల్ని గౌరవించడమే
కారణం. మన దగ్గర అలవాటు పడ్డ చెడ్డ సాంప్రదాయమే కొనసాగుతోంది. ఇక్కడ స్క్రిప్ట్ రైటర్లకి
గుర్తింపు లేదు, పేరు పొందే అవకాశాలు అసలే లేవు. డబ్బు కూడా రాదు. చరిత్ర చూస్తే మీకే
తెలుస్తుంది.. స్క్రిప్ట్ రచయితగానే ఏ ఒక్కరూ
కొనసాగా లేదు. వాళ్ళూ దర్శకులైపోయి రాసుకుంటున్నారు. రచయితగానే బతకాలంటే చాలా
కష్టం. పని చేసిన సినిమాకి చిట్ట చివర పేమెంట్ పొందేవాడు రచయితే. అదృష్టం బావుండి సినిమా
హిట్టయితే కూడా చిట్ట చివర క్రెడిట్ పొందేది రైటరే.
* మీరూ దర్శకులవుతారా?
చాలా మంది అడుగుతున్నారు
దర్శకత్వం వహించమని. కానీ రాయడం ఒక్కటే నాకు సాధ్యమయ్యే పని. ఒక యాడ్ కంపెనీ సీఈఓ గా
నాకు ఉద్యోగపరమైన బాధ్యతలు చాలా వున్నాయి- ఉద్యోగం వదులుకోలేను కూడా. యాడ్ రంగం నా
ప్రథమ భుక్తి మార్గం.
***