రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 23, 2014

రివ్యూ..



నేటివిటీ ప్రాబ్లం!
నాని, వాణీ కపూర్, సిమ్రాన్, బడవ గోపి, ఎంజె శ్రీరాం తదితరులు
సంగీతం : ధరణ్ కుమార్,  ఛాయాగ్రహణం : లోకనాథన్ శ్రీనివాసన్,  కూర్పు: బి శ్రీకుమార్
కథ : మనీష్ శర్మ,  స్క్రీన్ ప్లే : హబీబ్ ఫైసల్,  మాటలు : శశాంక్  వెన్నెల కంటి
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,   నిర్మాత :  ఆదిత్యా చోప్రా
దర్శకత్వం: గోకుల్ కృష్ణ
విడుదల : ఫిబ్రవరి 21, 2014    సెన్సార్: ‘u’
***


ఒక భాషలో విజయం సాధించిన సినిమాని ఏకకాలంలో మరో రెండు భాషల్లో రీమేక్ చేసినప్పుడు వాటిలో ఒకటి కచ్చితంగా డబ్బింగ్ లాగే ఉండాలా? పోనీ వరిజినల్ ని ఆల్రెడీ కాపీకొట్టి తీసేసివుంటే మళ్ళీ రీమేకు కూడా చేసుకోవచ్చా? ఒకసారి కాపీ అట్టర్ ఫ్లాపయ్యాక  కూడా ఒరిజినల్ సూపర్ హిట్టవ్వచ్చా?....ఇవీ  ‘ఆహా కల్యాణం’ అనే వ్యవహారం చూస్తూంటే వేధించే ప్రశ్నలు.

2011 లో హిందీలో ‘బ్యాండ్ బాజా బరాత్’ అనే రోమాంటిక్ కామెడీ హిట్టవడంతో చాలాకాలానికి తెలుగు తమిళ భాషల్లో దాన్ని రిమేక్ చేస్తూ  దక్షిణాదిన అడుగెట్టాలనుకుంది సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ. ఇంతలో తెలుగులో నందినీ రెడ్డి  ఈ కథనే  ‘జబర్దస్త్’ అంటూ తీసేయ్యడంతో అదో వివాదమై కూర్చుంది. అయినా యశ్ రాజ్ ఫిలిమ్స్ వెనుదీయక తెలుగు-తమిళ రీమేకులతో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే నందినీ రెడ్డితో పోటీకి దిగిందా అన్నట్టు తనుకూడా ఈ రెండేసి రీమేకులని పతాక స్థాయిలో అట్టర్ ఫ్లాప్ చెయ్యడం కోసమే కంకణం కట్టుకున్నట్టుంది ఈ సినిమా చూస్తూంటే. కాపీరైట్ సంగతి ఎలావున్నా ఫ్లాప్ చెయ్యడంలో  మాత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ దే పైచేయి అయ్యిందనాలి!

దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చుకుంటు న్నప్పుడు ముందు  ప్రాంతీయత గురించి, స్థానిక ప్రేక్షకాభిరుచుల గురించీ కాస్తయినా పట్టింపు లేకపోతే ఆ ఎంట్రీ ని కూడా ఎవరూ పట్టించుకోరు. ‘ఆహా కల్యాణం’ అనే డిజైనర్ ప్రేమకథ ఒరిజినల్లో వున్న న్యూఢిల్లీ నేటివిటీతో తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేసినట్టు తయారయ్యింది. దశాబ్దం క్రితం ‘మై ప్రేమ్ కీ దీవానీ హూఁ ‘ అనే డిజైనర్ ప్రేమకథ తీసిన సూరజ్ బర్జాత్యా విఫలమైన చోట ఆదిత్యా చోప్రా  ‘బ్యాండ్  బాజా బరాత్’ తో ఎక్కడ సఫలమయ్యాడంటే- బర్జాత్యా నాటికింకా డిజైనర్ ప్రేమకథలకి మల్టీప్లెక్స్ సినిమాల ఊపందుకోలేదు. చోప్రా నాటికి  మల్టీప్లెక్స్ సినిమాల జోరు తారాస్థాయిలో వుంది... నగర ప్రేక్షకులు క్యూలు కట్టే  పాప్ కార్న్ మల్టీప్లెక్స్ సినిమాలు ఉత్తరాదిలోనే ఊళ్ళల్లో సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో జనాలకి ఎక్కడంలేదు- అలాంటిది తెలుగులో రక్తికట్టించే అవకాశం ఉంటుందా?

కనీసం నందినీ రెడ్డి ఆ కథని మాస్ సినిమాగా తీయడంలో విఫలమైనా, తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టుగా కథని మార్చుకుంటూ పెళ్ళికాని హీరో హీరోయిన్ల మధ్య శారీరక సంబంధమనే ప్రధాన మలుపుని తొలగించుకోగాలిగారు. టైటిల్ సహా కుటుంబ ప్రేక్షకులకి  నప్పుతుందనుకుని తీసినట్టున్న ఈ  రీమేకులో ఈ పాయింటే  సెంటిమెంట్లకి వ్యతిరేకంగా వుంది.

‘ఆహా కళ్యాణం’ లో ఈ ‘రంకు’ వ్యవహారమెలావుందో ఓసారి చూద్దాం...

శృతి కలిపింది  తనే ...
శక్తి (నాని) అనే స్టూడెంట్ వూళ్ళో తండ్రిని మభ్య పెడుతూ రాని చదువు పేరుతో కాలక్షేపం చేస్తూంటాడు. హాస్టల్లో తిండి సహించక ఫ్రెండ్స్ నేసుకుని పెళ్ళిళ్ళలో దొంగ తిళ్ళకి హాజరైపోతూంటాడు. అలాటి ఒక పెళ్లి లో పట్టేసుకుంటుంది శృతి( వాణీ కపూర్) అనే మరో స్టూడెంట్. ఈమెకి చదువైన తర్వాత వెడ్డింగ్ ప్లానర్ గా వ్యాపారం ప్రారంభించాలని వుంటుంది. ఇందుకోసం తనకి చూస్తున్న సంబంధాల్ని కూడా వాయిదా వేస్తుంది. శక్తికి ఈమె చేయాలనుకుంటున్న బిజినెస్ నచ్చి తనని పార్టనర్ గా  కలుపుకోమంటాడు. ప్రేమ పేరుతో వెంటపడుతున్న ఇతన్ని తిరస్కరిస్తుంది. ఫైనాన్స్ లో రోమాన్స్ ని కలపనంటుంది. అతను రోమాన్స్ కి దూరంగా ఉంటానని ప్రామీస్ చేస్తాడు.
ఒకసారి శృతి చంద్రలేఖ(సిమ్రాన్) అనే పాపులర్ వెడ్డింగ్ ప్లానర్ దగ్గరి కెళ్తుంది. అనుకోకుండా శక్తితో బాటు అక్కడ పనిలో చేరిపోతుంది. ఓ పెళ్లి ఏర్పాట్ల సందర్భంగా చంద్రలేఖ ఎక్కువ మిగుల్చుకోవాలని కక్కుర్తిపడి దొరికిపోతుంది. ఆ  తప్పు శృతి మీదికి తోసేయ్యడానికి ప్రయత్నించడంతో, ఆమెకి గుడ్ బై కొట్టి తామే సొంత బిజినెస్ పెట్టుకుని చూపిస్తామని చాలెంజ్ చేస్తాడు శక్తి. అలా  ఇద్దరూ ‘గట్టి మేళం’ అనే వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ పెడతారు.

విజయవంతంగా ఈ బిజినెస్ చేస్తూ ఆఫీసులోనే తిని పడుకుంటూ ఫక్తు బిజినెస్  పార్టనర్స్ గా వుంటారు. ఒకే పక్క మీద పడుకుంటున్నా హద్దు మీరకుండా ఉంటాడు శక్తి. అలాంటిది  ఇంకో చాలాపెద్ద కాంట్రాక్టు చేపట్టి సక్సెస్ చేసినప్పుడు దాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ తప్ప తాగేస్తారు. అప్పుడు శృతియే చొరవతీసుకుంటుంది శృతి కలపడంతో  అన్నీ జరిగిపోతాయి!
దీంతో మాటతప్పి ఫైనాన్స్ లో రోమాన్స్ ని మిక్స్ చేసినందుకు ఫీలైపోయి- ఈ  ‘సెషన్’ జరిగి వుండాల్సింది కాదంటాడు శక్తి. జరిగిందాన్ని ‘సెషన్’ అంటూ తేలిగా మాట్లాడ్డంతో మండిపోయి మాటలు మానేస్తుంది శృతి. అలా ఎడం పెరుగుతూ బిజినెస్ లో పొరపాట్లకి అతణ్ణి నిందిస్తూండే సరికి, ఇక ఇద్దరూ విడిపోయే పరిస్థతి వస్తుంది. శక్తి వేరే అలాటి బిజినెస్సే పెట్టుకుని పోటీకి దిగుతాడు...

ఇదీ విషయం. ఈ పోటీలో కష్టాలు, ఒక్కరే నిర్వహించలేని వ్యవహారాలూ ఎదురై ఒకరిలోటు మరొకరు తెలుసుకుని ఎలా ఒక్కటయ్యారనేది ఇక్కడ్నుంచీ చూడొచ్చు.

కథ సంగతలా ఉంచితే, ముందుగా వచ్చిన ఇబ్బందేమిటంటే  నానీ- వాణీ కపూర్ ల జోడీ ఛోటే మియా- బడే  మియా లాగా వుండడం! ఎత్తుల్లో కొట్టొచ్చే తేడాతో ఏకోశానా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్పించుకోకపోవడం...మరీ పంజాబీ తనం ఎక్కువున్న వాణీ కపూర్ వల్లకూడా తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ లేకపోవడం...అసలు మేకింగే హిందీ సినిమాలావుండడం...కొత్తవాడైన తమిళ దర్శకుడు గోకుల్ కృష్ణ మక్కీకి మక్కీ ఒరిజినల్ నే తమిళంలోకి దింపి లిప్ సింక్ ద్వారా తెలుగు రిమేక్ అనికూడా అన్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. క్లోజప్స్ లో ఆ లిప్ సింక్ బండారం బయటపడింది...ఇంకా ఒక్క నానీ తప్ప మరెవరూ తెలుగు నటులు లేకపోవడం కూడా ఇది డబ్బింగే అన్పించడానికి దారితీసింది.


ఖర్చు బాగానే పెట్టారు, విజువల్స్ బ్రహ్మాండంగానే వున్నాయి- సంగీతం ఓ మోస్తరే- అయితే మొదలెట్టింది లగాయతూ చివరి ఘట్టం దాకా బ్యాక్ డ్రాప్ లో మార్పులేని వరస పెళ్ళిళ్ళ ప్రోగ్రాములే చూపించడంతో అదో మొనాటనీకి దారితీయడ మేగాక,  కథ తక్కువ హడావిడి ఎక్కువలా తయారయ్యింది.  సినిమా చూసి బయటికి వస్తూంటే  కథ కంటే పెళ్ళిళ్ళ సందడే చెవుల్లో గింగురు మంటూంటుంది...వేటిలో ఒక్క పెళ్లి కూడా  తెలుగు పెళ్లి వుండదు!


స్క్రీన్ ప్లే సంగతులు
మల్టీ ప్లెక్స్ సినిమాలకి ఓ స్క్రీన్ ప్లే అంటూ వుండదు. ఈ సినిమాలు తీసే కొత్త దర్శకులు కొత్త ధోరణి అనుకుని ఇష్టానుసారం కథలల్లుకుంటారు. లైటర్ వీన్ కథలు, బలహీనమైన పాయింట్లు, వెన్నెముక లేని ప్లాట్ లైన్లూ వీరి ప్రత్యేకత. ఇదే ఒరిజినల్ కథలో కన్పిస్తుంది. అదే యధాతధంగా రీమేకుల్లో దిగుమతయ్యింది. కొన్ని సినిమాల నుద్దేశించి కాలక్షేప బఠాణీ లంటూంటాం...వాటిల్లో కూడా కథ ఎంతైనా కొంత బలంగానే వుంటుంది. కానీ మల్టీప్లెక్స్ సినిమాలు అంతకన్నా బలం లేని కథలతో పాప్ కార్న్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఒరిజినల్ హిందీ కథ రాసుకున్న దర్శకుడు మనీష్ శర్మ, ‘స్క్రీన్ ప్లే’ సమకూర్చిన హబీబ్ ఫైసల్ –ఇద్దరూ ఇంటర్వెల్లో శృంగార దృశ్యం మీద  మమకారం బాగా  పెంచుకుని అదే  ఈ కథకి ప్రాణం అనుకున్నారు. దాని ఆధారంగానే మిగతా కథ  నడిపి ముగించినట్టు అన్పిస్తారు. కానీ కథని ఇరవైనిమిషాల్లో మొదటి అంకం ముగించేసి- శృతి కి వెడ్డింగ్ ప్లానర్  లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తూ రెండో అంకం ప్రారంభించారు. అంటే ఇక్కడే అసలు కథ ప్రారంభమైందన్న మాట. ఐతే  దీన్ని కేవలం వెర్బల్ గా (మాటల రూపంలో) చెప్పించారేతప్ప- విజువల్ గా ఒక బలమైన సంఘటనతో ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాంటప్పుడు ముగింపు కూడా విషయంలేక- లేదా ఏదో విషయాన్ని బలవంతంగా జొప్పించి నట్టుగా బలహీనంగా వస్తుందనేది గుర్తించ లేకపోయారు. వారి దృష్టిలో ఇంటర్వెల్ మలుపే కీలకం. ఇదే ముగింపుకి ‘ఇష్యూ’  అవుతుం దనుకున్నారు. కానీ అది కేవలం వాళ్ళ ఊహే!


ఏ స్క్రీన్ ప్లే కైనా మొదటి అంకం ముగింపులో లక్ష్యాన్ని, లేదా సమస్యని బలంగా ఏర్పాటు చేయకపోతే మూడో అంకం (క్లైమాక్స్) ముగింపు కూడా బలహీనంగా వస్తుందనేది చాలా ప్రాథమిక సూత్రం. పోనీ శృతి లక్ష్యాన్ని వెర్బల్ గా బలహీనంగానే ఎష్టాబ్లిష్ చేశారే  అనుకుందాం- అంటే  ఈ పాయింటుతో ఇక్కడే కథ మొదలయింది. అప్పుడు ఈ పాయింటు మీద క్లైమాక్స్ కి పోతే అప్పుడది స్టోరీ క్లైమాక్స్ అవుతుంది. కానీ ఇంటర్వెల్ సీనుతో కథ ప్రారంభమయ్యిం దనుకోవడంవల్ల దానిమీదే ముగింపుకి పోయారు. ఇంటర్వెల్ సీను కథలో ఒక మలుపే తప్ప అదే కథ కాదు. దాంతో ముగింపుకి పోతే అది ప్లాట్ క్లైమాక్స్ కి పోతుంది. కావాల్సింది స్టోరీ క్లైమాక్స్...

బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ లో కమలహాసన్- సరితలు  ఏడాది తర్వాతే కలుసుకోవడమనే ‘స్టోరీ’ ని ఏర్పాటుచేసి- తీరా  చూస్తే కలపకుండానే ఓ ట్రాజడీతో క్లైమాక్స్ కి చేర్చిముగిస్తారు.  ఇక్కడ ప్రేక్షకుల్ని ‘స్టోరీ క్లైమాక్స్’ కోసం ఉత్కంఠతో ఎదురుచూసేలా చేసి,  వాళ్ళ ఊహలు తలకిందులు చేస్తూ స్టోరీ క్లైమాక్స్ క్యాన్సిల్ అయ్యేలా ప్లాట్  క్లైమాక్స్ ఎత్తుకున్నారు. ఈ ప్లాట్ క్లైమాక్స్ ఎక్కడ్నుంచి వచ్చింది? మాధవిని కమల్ వదిలేశాడన్న అక్కసుతో ఆమె అన్న యాక్టివేట్ అయ్యే పరిణామంతో  అనివార్యంగా వచ్చింది! దీన్ని తప్పించి స్టోరీ క్లైమాక్స్ కి వెళ్ళలేరు- ఏడాది ఎడబాటు షరతుని విజయవంతంగా నిభాయించుకుని కమల్- సరితలు ఒకటయ్యే ప్రశ్నే తలెత్తనంత బలమైన పరిణా మమది-కాబట్టే ప్లాట్ క్లైమాక్స్! అంత  కరెక్టు జడ్జిమెంట్  కాబట్టే అంతటి హిట్! హిందీ రీమేక్  ‘ఏక్ దూజేకేలియే’ లో క్లైమాక్స్ మార్చాలంటూ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లొంగలేదు బాలచందర్.


ప్రస్తుత సినిమాలో సరిగ్గా ‘మరోచరిత్ర’కి వ్యతిరేకంగా జరిగుండాల్సింది- అంటే –స్టోరీ క్లైమాక్స్ చోటుచేసుకుని వుండాల్సింది. ఎందుకంటే ప్రేమకి సంబంధించిన వాళ్ళిద్దరి  ప్లాట్ క్లైమాక్స్ ఏం చేసినా పేలవంగానే, అర్ధంపర్ధం లేకుండా వుంటుంది. అందుకే క్లైమాక్స్ లో  ఆమె అకస్మాత్తుగా తనకి ఎంగేజ్ మెంట్ అయినట్టు చెప్పేస్తుంది. దుబాయిలో  వున్న పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నట్టు పదే  పదే  ఫోన్ ని ఉపయోగిస్తుంది. ఇదంతా అసందర్భంగా మనకి అన్పిస్తుంది. అతన్ని పక్కనపెట్టి- కథలో వున్న ఇతర పాత్రలకైనా తెలియకుండా ఆమె ఎంగేజ్  మెంట్ ఎలా చేసుకుంటుంది? ఆ పెళ్లి కొడుకెవరో చూపెట్టకుండా ఆమె ఫోన్లోనే మాట్లాడుతున్నట్టు చూపిస్తూంటే ఆమే దొంగ నాటక  మడుతున్నట్టు లేదా? ఆ పెళ్ళికొడుకు  తెరమీదికి రాకుండానే అతను ఫూలిష్ గా ఆమె నాటకానికి పడిపోయినట్టు లేదా?

ఎత్తుకున్న వ్యాపారభాగాస్వామ్యం మీదే స్టోరీ క్లైమాక్స్ కి  వెళ్లి వుంటే ఇలా ప్రేక్షకుల్ని ఏమార్చే వ్యవహారం తప్పేది. ఇందుకు మొదటి అంకం ముగింపులో ఆమె కి ర్పాటు చేసిన లక్ష్యం బలంగా వుండాలని చెప్పుకున్నాం. వెర్బల్ గానే ఏర్పాటుచేసిన పాయింటులో వాళ్ళిద్దరి ఒప్పందానికి సంబంధించి వివరాలు అసంపూర్ణం గానే వున్నాయి. ఫైనాన్స్ లో రోమాన్స్ ని మిక్స్ చెయ్యనని తను మాటిచ్చాడు సరే, ఒకవేళ మాట తప్పితే ఏంచెయ్యాలి? ఈ క్లాజు ఒప్పందంలో లేకపోవడం కూడా చైల్డిష్ గా వుంది. దీనిక్కూడా సమాధానం చెప్పివుంటే గేమ్ కి బలం చేకూరేది..ఎలాగూ ఒప్పంద ఉల్లంఘన జరిగింది కాబట్టి- దానికెవరు బాధ్యులనే ప్రశ్న తలెత్తేది. ఈ ప్రశ్నే విభేదాలకి దారితీసివుంటే- ఈ ప్రశ్నే తర్వాతి కథనానికి మూలాధారంగా వుండి –అర్ధవంతమైన స్టోరీ క్లైమాక్స్ కి వెళ్ళేది- అందులోంచే వాళ్ళిద్దరి ప్రేమ సమస్య కూడా పరిష్కారమై పోయేది!

ఇంత చెప్పుకున్నాక ఈ కథకి ప్రధాన పాత్ర  ఎవరు?- అనే ప్రశ్న కూడా మనకి తలెత్తితే సమాధానం మాత్రం దొరకదు. ఎందుకంటే మల్టీప్లెక్స్ సినిమా కథలింతే!

- సికిందర్