రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

26, జులై 2022, మంగళవారం

1184 : రివ్యూ!

 

 రచన- దర్శకత్వం : రజత్ కపూర్

తారాగణం : రజత్ కపూర్ (ద్విపాత్రాభినయం), మల్లికా షెరావత్, రణవీర్ షోరే, మనూ రిషీ చద్దా, చంద్రచూడ్ రాయ్, కుబ్రా సెయిట్, , అభిషేక్ శర్మ తదితరులు
సంగీతం : సాగర్ దేశాయ్, ఛాయాగ్రహణం : రఫీ మహమూద్
బ్యానర్స్ : ఎన్ ఫ్లిక్స్ ప్రై.లి; ప్రియాంశీ ఫిలిమ్స్, మిథ్య టాకీస్
నిర్మాత : రజత్  కపూర్
విడుదల : జులై 22, 2022
నిడివి :  95 ని.
***
        ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత రజత్ కపూర్ కి కూడా సినిమా తీయాలంటే క్రౌడ్ ఫండింగ్ తప్పలేదు. వందలాది మంది విరాళాలిచ్చి ఈ సినిమా నిర్మాణానికి తోడ్పడ్డారు. క్రౌడ్ ఫండింగ్ తో తీసే సినిమాలు తక్కువే. ఇండిపెండెంట్ సినిమాల పేరుతో తీసే ఇవి దాదాపు అడ్రసులేకుండా పోయినవే. ప్రస్తుత సినిమాలో ఒక డైలాగు వుంటుంది- ఇండిపెండెంట్ సినిమాల పేరుతో చెత్త సినిమాలు చూడడానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారని. రజత్ కపూర్ అలాటి ఇంకో చెత్త కాకుండా, క్రౌడ్ ఫండింగ్ తో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ RK / RKAY ని ఒక కళాఖండంలా తీసి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలందుకున్నాడు. అమెరికాలో ఇది గత సంవత్సరమే విడుదలైంది. దీనితో కలిపి 12 సమాంతర సినిమాల దర్శకుడైన రజత్, ఇప్పుడు అపూర్వంగా చేసిన ప్రయోగమేమిటి? 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మెటా కామెడీ ఈ వారాంతం మూడు రోజులూ 5.75 కోట్లు వసూలు చేసింది. ఇందులో నిన్నఆదివారం 3 కోట్లు వసూలు చేసింది. సామాన్య ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయగల విషయం ఏమిటిందులో కొత్తగా వుంది? వివరాల్లోకి వెళ్దాం...

కథ

    ఆర్కే (రజత్ కపూర్) సినిమా దర్శకుడు. భార్యా ఇద్దరు పిల్లలు. 1960 లనాటి సినిమాలకి నీరాజనంగా సినిమా తీయాలనుకుంటాడు. తానే హీరో పాత్ర. హీరోయిన్ పాత్రకి బిజీ నటి నేహా (మల్లికా షెరావత్) ని ఒప్పిస్తాడు. నిర్మాతగా బిల్డర్ గోయెల్ సాబ్ (మనూ రిషీ చద్ధా) కి బడ్జెట్ ఇస్తాడు. షూటింగ్ ప్రారంభమవుతుంది. 1960 లనాటి ఈ కథలో గులాబో పాత్రని ఎంతో ఇష్టపడ్డ నేహా ఆనాటి హీరోయిన్ లా ముద్దులొలుకుతూ నటిస్తుంది. ఆమె ప్రేమికుడు మహెబూబ్ గా దర్శకుడు ఆర్కే క్లాస్ గా నటిస్తాడు. మహెబూబ్ - గులాబో మహోజ్వల ప్రేమ కథలో దృశ్య కావ్యంలా కీలక సన్నివేశం -నా గుండె ఎందుకు అదురుతోంది?’ అంటుంది. నీ ఎదుట నేనున్నందుకు అంటాడు. ఈ క్లాసిక్ సన్నివేశం నటించడానికి చాలా టేకులు తీసుకుంటుంది. యూనిట్ కి పిచ్చెత్తుతుంది. తర్వాత ఇద్దరూ బాస చేసుకునే ఇంకో భావోద్వేగ సన్నివేశం - రాత్రి పదిన్నరకి బాంద్రా స్టేషన్లో కలుసుకుని కలకత్తా వెళ్ళిపోవాలని.

        ఇలా షూటింగ్ సాగుతూ సాగుతూ క్లయిమాక్స్ ముందు సీను వస్తుంది. చెట్ల మధ్య మహెబూబ్ కీ, విలన్ కె ఎన్ సింగ్ (రణవీర్ షోరే) కీ యాక్షన్ సీను. ఈ సీనులో కె ఎన్ సింగ్ కి చెందిన ఐదు లక్షలతో మహెబూబ్ పారిపోతాడు. ఇక ముగింపు సీన్లే మిగిలుంటాయి. ముగింపులో కె ఎన్ సింగ్, మహెబూబ్ ని కాల్చి చంపి ఐదు లక్షలు సొంతం చేసుకునే సీను. ఇలా ముగింపు దృశ్యాలు మిగిలి వుండగా, అంతవరకూ వచ్చిన డిజిటల్ ఫైల్స్ ని ఎడిటర్ ఎడిటింగ్ చేస్తూ కంగారు పడతాడు. సినిమాలో ఎక్కడా మహెబూబ్ కన్పించడు. తీసిన సినిమాలోంచి మహెబూబ్ క్యారక్టర్ పారిపోయాడని ఆర్కేకి కాల్ చేసి చెప్తాడు.

        ఆర్కేకి పిచ్చెత్తుతుంది. తీసిన సినిమాలోంచి క్యారక్టర్ పారిపోవడమేమిటి? షూట్ చేసిన సీన్లలో ఎక్కడా లేకుండా ఎలా పోతాడు? ఇప్పుడేం చేయాలి? ముంబాయిలో వెతకడం మొదలెడతారు. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తారు... ఇంతకీ ఏమయ్యాడు మహెబూబ్? ఎందుకు సినిమా సీన్లలోంచి పారిపోయాడు? ఇప్పుడెలా పట్టుకోవాలి? పట్టుకుని సినిమా పూర్తి చేసి అక్టోబర్ 15 కల్లా ఎలా విడుదల చేయాలి?...

ఎలా వుంది కథ

    ఐడియా చూస్తేనే నవ్వొచ్చే విషయం. మెటా మూవీ జానర్ కథ. దేశీయ తెరమీద తొలి ప్రయత్నం. మెటా అంటే వున్న స్థితిని దాటడం. కథలోని పాత్ర, ఆ కథని దాటి నిజ ప్రపంచంలో విహరించడం. కొంచెం తేడాతో ఫోర్త్ వాల్ టెక్నిక్ అని కూడా వుంటుంది. హిందీలో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ (2019), ఘూమ్ కేతు (2020) సినిమాల్లో ఇది చూశాం. అంటే సినిమాలోని పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథ గురించి, పాత్రల గురించీ కామెంట్లు చేయడం. ఇది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో ప్రధానమంత్రి సలహాదారు అక్షయ్ ఖాన్నాతో బాగా వర్కౌటయ్యింది. కానీ ఘూమ్ కేతు లో రచయిత పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖీతో విఫలమయింది.

        ప్రస్తుత సినిమాలో సినిమాలోని పాత్రలు సినిమాలోంచి తప్పించుకుని నిజ ప్రపంచంలో పడ్డం మెటా మూవీ జానర్ కిందికొస్తుంది. ఈ ప్రయోగం 1985 లోనే హాలీవుడ్ లో వుడీ అలెన్ చేశాడు. ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో అని అప్పట్లో తీసిన మెటా మూవీలో ప్రేమ కథ. మియా ఫారో నటించిన ఈ 82 నిమిషాల ముక్కోణ ప్రేమ కథ పదిహేను లక్షల డాలర్ల బడ్జెట్, కోటిన్నర డాలర్ల బాక్సాఫీసు.

        ఇందులో ఇంట్లో భర్తతో సమస్యలొచ్చి మనశ్శాంతి కోసం సినిమాల కలవాటు పడుతుంది మియా. ఒక సినిమా నచ్చి పదే పదే చూస్తుంది. తనని చూడడానికి ఇన్నిసార్లు  సినిమాకొస్తున్న మియా మీద ప్రేమ పుట్టి వెండితెర లోంచి ఆమె దగ్గరి కొచ్చేస్తాడు హీరో జెఫ్ డేనియెల్స్. ఇక ఇద్దరూ షికార్లు తిరగడం మొదలెడతారు. వీళ్ళ ప్రేమాయణం మధ్యకి మియా భర్త రావడంతో సంక్షోభం మొదలవుతుంది.

        2021 లో అక్షయ్ కుమార్ -సారా అలీఖాన్ -ధనుష్ నటించిన అట్రంగీరే లో సారా ఓ కథలోని మెజీషియన్ పాత్ర (అక్షయ్ కుమార్) నిజంగానే వున్నాడనుకుని ప్రేమిస్తుంది.  ఓ రోజు గుర్రం మీద వచ్చేస్తుంది మెజీషియన్ పాత్ర. ఇది మెటా మూవీ కాదు, సారా కల్పించుకున్న ఫాంటసీ.

        వుడీ అలెన్ తీసిన సినిమా మెటా జానర్లో రోమాంటిక్ కామెడీ. రజత్ సినిమా అబ్సర్డ్ (అసంబద్ధ) కామెడీ. నాన్సెన్స్ హ్యూమర్ అని కూడా అనొచ్చు. మైండ్ లెస్ కామెడీకంటే ఒక మెట్టు పైనుండే క్రియేటివిటీ. ఈ సృజనాత్మకతని రజత్ అనితరసాధ్యంగా సాధించాడు. తెలుగులో బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలంటే అనునిత్యం కొత్త జానర్లతో కథల కోసం రీసెర్చి చేయాల్సిందే- అప్డేట్ అవ్వాల్సిందే. రీసెర్చి లేకుండా రాయడానికి/తీయడానికి గడ్డిపోచ కూడా దొరకదు, మెదడులో వుండే చెత్త తప్ప.

    రజత్ కపూర్ మెటా మూవీ, దర్శకుడికీ- దర్శకుడు సృష్టించిన పాత్రకీ మధ్య సంఘర్షణ. దర్శకుడు తీస్తున్న సినిమా ముగింపులో చావడం ఇష్టం లేని హీరో క్యారక్టర్ మహెబూబ్, తీసిన సినిమాలోంచి పారిపోయి వచ్చి దర్శకుడితో తగువు పెట్టుకుంటాడు. తిరిగి ఇతడ్ని తీసిన సినిమాలోకి ఎలా పంపించాలన్నది దర్శకుడి సమస్య. తీసిన సినిమాలోంచి ఐదు లక్షలతో పారిపోయిన మహెబూబ్ క్యారక్టర్ ని పట్టుకోవడానికి, విలన్ క్యారక్టర్ కె ఎన్ సింగ్ కూడా తీసిన సినిమాలోంచి బయటపడి నిజ ప్రపంచంలో అలజడి సృష్టిస్తాడు. ఇలా తీసిన సినిమాలోంచి హీరో, విలన్ ఇద్దరూ పారిపోయేసరికి ఏం చేయాలో దిక్కు తోచదు ఎడిటర్ కి. తీసిన సినిమాలోంచి విలన్ కూడా పారిపోయాడని ఇంకో పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఇలాటి సినిమాలెందుకు తీస్తారయ్యా, ప్రేమ సినిమాలు తీసుకోక? - అంటాడు పోలీసు అధికారి. ఇక విలన్ పాత్రనీ పట్టుకోవడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. పిచ్చ నవ్వు పుట్టడానికి ఇంతకంటే పిచ్చి కామెడీ లేదు.

        పూర్తి స్థాయి కొత్త తరహా హాస్య కథ ఇది. నవ్వి నవ్వి బయటికొస్తాం. ఈ కథ ఐడియా, దీని పాలనా అనిర్వచనీయమన్న మాట. కల్పన- వాస్తవం రెండిటి కలబోత.దృశ్యకావ్యంలా తీస్తున్నామని దీన్ని ఫిలాసఫికల్ గా మార్చలేదు. దర్శకుడికీ పాత్రకీ మధ్య నడిచే దృశ్యాల్లో ఒకటి రెండు సందర్భాల్లో సృష్టికర్తకీ, ప్రాణికీ మధ్య వుండే సంబంధంతో సంఘర్షణని పైపైన టచ్ చేసి వదిలేస్తాడు- ఈ గంభీర విషయాలనే థీమ్ గా చేయలేదు - నీకు రాసిపెట్టివున్న దానికంటే ఎక్కువ, దాని కాలానికంటే ముందు, నీ కేదీ దక్కదు (దర్శకుడు), నా నొసటి రాత నేను మార్చి పారేస్తా (పాత్ర), సృష్టికి ముందూ తర్వాతా ప్రేమ తప్ప మరేదీ లేదు  (దర్శకుడు)- లాంటి గంభీర చర్చని నామమాత్రం చేశాడు. ప్రొఫెషనల్ సమస్యనే ప్రధానంగా చేసి బాక్సాఫీసు ఫ్రెండ్లీ కథనం నడిపాడు.

     నువ్వు నిజం కాదు, నేను రాశాను కాబట్టే పాత్రగా నువ్వున్నావ్ అంటాడు దర్శకుడు. అక్కడే నువ్వు తప్పులో కాలేశావ్ ఆర్కే సాబ్. నీకు నీ రాత మీద నమ్మకం లేదు గాబట్టే పాత్ర చనిపోవాలనుకుంటున్నావ్ అంటుంది మహెబూబ్ పాత్ర, నేను నిజం కాదని నన్నెందుకు మాటిమాటికీ కించపరుస్తావ్? నీకు నువ్వు మాత్రం నిజం అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?’ అని రెట్టిస్తుంది పాత్ర. ఆర్కే కంట్రోల్లో వుండడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మహెబూబ్ పాత్ర. కథ మీద అదుపు ఎవరికుండాలి- పాత్రకా? రచయితకా? కథ పాత్రదా? రచయితదా?

        తెలుగు సినిమాలకి చాలా అవసరమైన పాయింటు ఇది. గత ఇరవై ఏళ్ళుగా పాత్ర కథని పాత్ర నడుపుకో నివ్వకుండా, జోక్యం చేసుకుని, పాసివ్ పాత్రగా మార్చేస్తూ తాము కథ నడిపి - 90% అట్టర్ ఫ్లాపులు తీస్తున్న కొత్త తరం మేకర్లు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయమిది. ఇరవయ్యేళ్ళకి పూర్వం సీనియర్ రచయితలతో, దర్శకులతో ఇలా వుండేది కాదు.     

        పాత్రకుండే చైతన్యం రచయితకుండదు. పాత్ర దాని కథ అది నడుపుకుంటే చాలా ఆశ్చర్యపరుస్తూ సాగుతుంది. రచయిత కూడా వూహించని ఆశ్చర్యాలు సృష్టిస్తుంది. దీని ప్రాముఖ్యం గురించి సిడ్ ఫీల్డ్ అనేకసార్లు, 19వ శతాబ్దపు సుప్రసిద్ధ రచయిత హెన్రీ జేమ్స్ ని ఉటంకిస్తాడు- What is character but the determination of incident? What is incident but the illustration of character?అని. ఈ మధ్యే ఒక కథ చేస్తూంటే, అనూహ్యంగా పాత్ర వచ్చేసి థ్రిల్లింగ్ ముగింపు ఇచ్చేసరికి బిత్తరపోవాల్సి వచ్చింది.

    విచిత్రమేమిటంటే కథా చర్చల్లో నేను కరెక్ట్ అంటే, కాదు నేను కరెక్ట్ అని సిగపట్లకి దిగుతారు. వీళ్ళని చూసి క్యారక్టర్ నవ్వుకుంటుంది. అసలు నేనేమనుకుంటున్నానో ఇంపార్టెంట్రా బాబూ అంటూ - వినేవారు లేకా విసుక్కుంది నాకేకా - అని పాడుకుంటూ వూళ్ళు పట్టుకుని పోతుంది పాత్ర. ఇక ఇగోలు శాటిస్ఫై చేసుకుని, ఇంకో అట్టర్ ఫ్లాప్ తీయడానికి శ్రీకారం చుడతారు.

        రచయితకి ఇగో కాదు, మెచ్యూర్డ్ ఇగో వుండాలి. పాత్రకి వుంటుంది ఇగో. అనుభవాల క్రమంలో దాని ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మారే స్థాయికి అది ఎదుగుతుంది. ఇదీ కథంటే. కథల్ని విశ్లేషిస్తే యుగాలుగా ఇదే. ఎవరి ఇగో కూడా చావదు. మనుషులు చేయగల్గింది తమ ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని ఎదగడమని కథలు చెప్తాయి. ఈ మూల సూత్రం తోనే కథలుంటాయి. కథంటే సైకో థెరఫీ. కథంటే ఆర్గ్యుమెంట్. అంటే స్టోరీ సిట్టింగ్స్ లో కుమ్ములాట కాదు, కథలోని పాత్రల మధ్య సంఘర్షణ. కథలోని పాత్ర వచ్చి దర్శకుడితో సంఘర్షించే కథనంతో ఈ మెటా పోయెటిక్ ఫన్ ఒక పాఠ్యాంశం.

నటనలు- సాంకేతికాలు 
    చంపడాని కిష్టపడ్డ దర్శకుడిగా, చావడాని కిష్టపడని పాత్రగా రజత్ కపూర్ డీసెంట్ గా ద్విపాత్రాభినయం చేశాడు. ఇద్దరి మధ్య వాళ్ళకి సీరియెస్ సీన్లే, కానీ ప్రేక్షకులకి హాస్యం. పాత్ర దర్శకుడి ఇంట్లోనే బస చేసి, మంచి వంట వాడుగా వండి పెడుతూంటే, వీడికి వంట వచ్చని నేను రాయలేదే - అని దర్శకుడి అంతర్మధనం. భార్య కూడా పాత్ర పక్షమే వహించేసరికి, కత్తితో పాత్ర పీక కోసి చంపెయ్యడానిక్కూడా సిద్ధపడతాడు దర్శకుడు. ఈ ద్విపాత్రాభినయానికి ఏ పాత్ర హావభావాలు ఆ పాత్రకి అతికినట్టుగా అన్వయించి నటించడం రెండు పాత్రల్నీ ఇంట్రెస్టింగ్ గా మార్చింది.

        1960 ల నాటి సినిమా పాత్ర గులాబోగా మల్లికా షెరావత్ రాకుమారి గ్రేస్ తో మెస్మరైజ్ చేస్తుంది చాలా కాలం తర్వాత తెరపైకొచ్చి. ఈమె వున్న దృశ్యాల్ని పోయెటిక్ గా తీర్చిదిద్దాడు రజత్. మహెబూబ్ కోసం కలవరిస్తూ తీసిన సినిమాలోనే వుండిపోయే క్యారక్టర్. ఈమెకి నచ్చజెప్పి కథకి తాననుకున్న ముగింపే ఇవ్వడానికి విఫలయత్నాలు చేస్తాడు దర్శకుడు.  

        విలన్ పాత్రలో రణవీర్ షోరే, అతడి ముగ్గురు అనుచరులూ (సనమ్ కుమార్, ఆదర్ మాలిక్, పీయూష్ రాయ్) ఒక పిచ్చి మేళం. చప్పుడెక్కువ, చేసేది తక్కువ. మహెబూబ్ కోసం తీసిన సినిమాలోంచి పారిపోయిన విలన్ పాత్రగా షోరే, ముంబాయిలో తిరుగుతూ-తన దగ్గరున్న ఫోన్ నెంబరుతో కాల్స్ చేస్తూంటాడు. ఆ నెంబర్ కలవదు. ఈ మహెబూబ్ నంబర్ సినిమాలో సినిమా కోసం రాసిన కల్పిత  నెంబరురా అంటే వినకుండా, పిస్తోలు తీసి పేల్చే సీనులో షోరే నటన టాప్. అలాగే పోలీసులు పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొచ్చినప్పుడు కూడా.

    నిర్మాత గోయెల్ సాబ్ గా మనూ రిషీ చద్దా నుంచి కూడా హాస్యం పొందొచ్చు. హీరోని చంపవద్దని ముందే చెప్తాడు, దర్శకుడు ఆర్కే వినకుండా చంపే కథే తీయడంతో హీరో పారిపోయాడు. బిల్డర్ గా నిర్మాతది ఆర్ధిక సంకటం, దర్శకుడిగా ఆర్కేది కళా లంపటం. చద్దా వున్న సీన్లు కూడా నవ్విస్తాయి.

        మిగిలిన నటీనటులు కూడా సహాయపాత్రల్లో సహజత్వాన్ని చాటారు. సాంకేతికంగా ఇదొక స్థాయిలో అద్భుతమే. సెట్స్, లొకేషన్స్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, వర్తమానంతో బాటు, 1960 ల నాటి పీరియెడ్ లుక్, లైటింగ్ వగైరాలతో విజువల్స్ కి నిజమంటే నిజంగా స్క్రిప్టు న్యాయం చేసింది. తెలుగులో చూస్తూంటాం- ప్రొడక్షన్ విలువలు ఆకాశంలో, స్క్రిప్టు పాతాళంలో!

చివరికేమిటి

    మెటా మూవీ సమాంతర సినిమాయేగా అని తన కోరికల గుర్రాలతో స్క్రిప్టు చేయలేదు రజత్ కపూర్. చక్కగా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో సార్వజనీన - మెయిన్ స్ట్రీమ్ స్క్రీన్ ప్లేనే చేశాడు. అంతర్జాతీయ మీడియా పొగడ్తలతోనే రివ్యూలిచ్చింది- ఒక్క రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ తప్ప. రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ రివ్యూలో- ఈ సినిమా వుడీ అలెన్ సినిమా సారాన్ని పట్టుకోలేక పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే పైన చెప్పుకున్న ఫిలాసఫీని.    వుడీ అలెన్ మెటా మూవీ ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో ముక్కోణ ప్రేమ కథ. భర్తతో బాధాతప్త సంసారం నుంచి ఉపశమనం కోసం సినిమాలకలవాటు పడ్డ మియా ఫారో కోసం,  ప్రదర్శిస్తున్న సినిమాలోంచి హీరో వచ్చేయడం ఆమె మానసిక స్థితి, స్వైరకల్పన. అతడితో ప్రేమాయణం సాగిస్తున్నట్టూ వూహించుకుని ఊరట పొందడం. ఒక రకంగా ఇది అనైతికమే. దీనికి అనుభవిస్తుంది చివరికి.

        ఆమెని ప్రేమిస్తూ హీరో పాత్ర సినిమాలోంచి వెళ్ళి పోయేసరికి, ఆ పాత్ర పోషించిన  నిజ జీవీతంలో హీరోయే రంగంలోకి దిగుతాడు. నేను పోషించిన పాత్రే కావాలా, నిజ వ్యక్తిని నేను కావాలా - అని అడుగుతాడు. నువ్వే కావాలని భర్తకి విడాకులిచ్చేస్తుంది. చేసేదిలేక సినిమా పాత్ర సినిమాలో కెళ్ళి పోతుంది. హీరో కూడా ఆమెకి హేండిచ్చి వెళ్ళిపోతాడు. అతడిక్కావాల్సింది నిర్మాత సినిమాని కాపాడ్డమే తప్ప, ఈమెతో సంసారం చేస్తూ కూర్చోవడం కాదు. రెంటికీ చెడ్డ రేవడి అవుతుందీమె. సమస్య వస్తే ఎదుర్కోవాలే గానీ, పలాయన వాదం ప్రమాదకరమనే నీతీ, ఫిలాసఫీ ఇందులో వున్నాయి.

        రజత్ మూవీలో ఈ సెటప్ లేదు. ఎవరూ వూహించుకోలేదు. తీసిన సినిమాలోంచి పాత్రలే వాటి అవసరాలకోసం పారిపోయాయి. రెండూ దర్శకుడ్ని పట్టుకుని వేధించాయి. ఇది వేరు. ఇందులో ఫిలాసఫీ చెప్తే  సముద్రకని దర్శకత్వంలో వినోదాయ చిత్తం (2021) లా అయ్యేది. విదేశాల్లో ఏమో గానీ, ఇప్పుడు ఇండియాలో సినిమా అంటే ఒక సంఘటన, దాని చుట్టూ పరిణామాలతో పరుగులెట్టే కథ. ఆ సంఘటన ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ గురించి. సంఘటనల్లోనే తీసుకోవాలంటే నీతీ రీతీ అన్నీ వాటికవే వుంటాయి. ప్రత్యేకంగా మెసేజిలివ్వడం కోసం సినిమాలు తీయనవసరం లేదు.

        స్ట్రక్చర్ చూస్తే తీసిన సినిమాలోంచి హీరో పాత్ర పారిపోవడంతో  ప్లాట్ పాయింట్ వన్ సరీగ్గానే 30వ నిమిషంలో వస్తుంది. 70 వ నిమిషంలో తీసిన సినిమాలోంచి విలన్ పాత్ర పారిపోవడంతో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ రెండిటి మధ్య మిడిల్లో వుండే కథ 40 నిమిషాలు సాగుతుంది. ప్లాట్ పాయింట్ టూ తర్వాత ముగింపు 25 నిమిషాలుంటుంది. ముగింపు ఎలా జరిగిందీ, రైటర్ కీ క్యారక్టర్ కీ మధ్య గొడవ ఎలా పరిష్కారమయిందీ సస్పెన్స్ కోసం వుంచేద్దాం.

—సికిందర్

16, జనవరి 2019, బుధవారం

725 : రివ్యూ


దర్శకత్వం : విజయ్ రాత్నాకర్ గుట్టే
తారాగణం : అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా, సుజాన్ బెర్నెర్ట్, ఆహ్నా కుమ్రా, అర్జున్ మాథుర్ తదితరులు
రచన : విజయ్ రాత్నాకర్ గుట్టే, మాయాంక్ తివారీ, కార్ల్ డన్, ఆదిత్యా సిన్హా, సంగీతం : సుదీప్ రాయ్, సాధూ తివారీ, ఛాయాగ్రహణం : సచిన్ కృష్ణ్
బ్యానర్ : రుద్రా ప్రొడక్షన్స్, బొహ్రా బ్రదర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సునీల్ బొహ్రా, ధవల్ గడా
విడుదల : జనవరి 11, 2019

***
          దేళ్ళపాటు దేశాన్ని ఏకధాటిగా పాలించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పాలనా తీరు మీద తీసిన బయోపిక్ వివాదాస్పదమవక ముందే దీనికాధారమని  చెప్పుకున్న పుస్తకం వివాదాస్పదమైంది (ఆధారమని చెప్పుకోవడం పూర్తి నిజం కాదు). అది నైతికతకి సంబంధించి. ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర నాలుగేళ్ళు  మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, మన్మోహన్ సింగ్ పనితీరునే, బలహీనతలనే బయటపెడుతూ పుస్తకం రాయడం విశ్వాసఘాతంగా విమర్శలొచ్చాయి. ఈ విషయంలో మాత్రం సంజయ బారులోని మీడియా సలహాదారు పక్కకెళ్ళి, పూర్వాశ్రమంలోని  ప్రొఫెషనల్ జర్నలిస్టు బయటికొచ్చాడు. తీరా చూస్తే పుస్తకంలో జనాలకి తెలియని కొత్త విషయాలు లేవు, సినిమాలోనూ లేవు. అంతా సద్దుమణిగింది. కాకపోతే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆజమాయిషీలో మన్మోహన్ ఎలా ఫీలయ్యేవారో మనం ప్రత్యక్షంగా చూడలేదు. అమూర్తంగా వుండిపోయిన ఆ భావోద్వేగాల్ని ఈ సినిమా దృశ్యరూపంలో పెట్టి ఆ లోటు తీర్చిందంతే. అయ్యోపాపం అన్పించేలా, గుండెలు కలుక్కుమనేలా మాజీ ప్రధాని పరిస్థితిని కళ్ళకి కట్టిన అనుపమ్ ఖేర్ కూడా, ఈ చారిత్రక అవసరాన్ని తీర్చారు. 

          
విచిత్రమేమిటంటే, కొందరు ప్రధానుల్ని చూస్తే కోపం వస్తుంది. మన్మోహన్ ఒక్కరినే చూస్తే అయ్యో పాపం అన్పిస్తుంది. అయ్యో పాపం అనుకుంటూనే పదేళ్ళు గడిపాం.  ఇందులో నాల్గేళ్ళ కాలాన్ని  సంజయ బారు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ గా తన జ్ఞాపకాలు రాస్తే, ఇదే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కింది. ఓ కొత్త దర్శకుడి చేతిలో ఇదెలా తెరకెక్కిందో చూసే ముందు, ఓసారి ఈ కొత్త దర్శకుడు విజయ రత్నాకర్ గుట్టే ఘనమైన బయోపిక్ కూడా చూద్దాం. ఇతను గత ఆగస్టులో నకిలీ పత్రాలతో పాల్పడిన రూ 34 కోట్ల జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ స్కాము కేసులో అరెస్టయ్యాడు. మహారాష్ట్ర నేత అయిన ఇతడి తండ్రి, వేలాది రైతుల పేర నకిలీ పత్రాలు సృష్టించి -  బ్యాంకులనుంచి రూ 5400 కోట్ల రుణాలు కాజేసిన కేసులో నిందితుడు. బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఇతడి తల్లి మొన్నే  జనవరి 13 న ఇతడి తండ్రి మీదా, మరో ఆరుగురు కుటుంబ సభ్యుల మీదా ఆస్తికోసం హింసిస్తున్నారని కేసు పెట్టింది. థ్రిల్లింగ్ బయోపిక్. ఇలాటి తన స్మెలింగ్ చేతులు మహానుభావుడి మీద వేశాడు.

కథ 
      2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ఘనవిజయం సాధించిన దృశ్యాలతో మొదలవుతుంది. అయితే ప్రధానిగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయత కారణంగా గద్దెనెక్క లేని పరిస్థితి. బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, ఉమాభారతిలు, శివసేన బాల్ థాక్రే తదితరులు సోనియాని తస్మాత్  జాగ్రత్తంటూ ప్రసంగాలు చేస్తారు. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం సోనియమ్మే రావాలని ఆందోళనలు చేస్తారు. సోనియా దీర్ఘంగా ఆలోచించి ఆర్ధికవేత్త, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రీ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుని ప్రతిపాదించడంతో కాంగ్రెస్ బడా నేతల్లో కలవరం పుడుతుంది. అక్కడేవున్న ప్రణబ్ ముఖర్జీ ముఖం వివర్ణమవుతుంది – ఒకప్పుడు తన జ్యూనియర్ అదృష్ట జాతకుడయ్యాడని. మొత్తానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. ప్రధానిగా మన్మోహన్ కార్యాలయంలోకి తన స్టయిల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు, చిన్నప్పటి ముచ్చట గుర్తుకొస్తుంది. తండ్రి తనని స్కూల్లో చేర్పిస్తూ పేరు చెప్పినప్పుడు- ఏం పేరూ అంటాడు మాస్టారు. ఏదోవొకటి రాసుకోండి, వీడేమైనా ప్రధాన మంత్రి అవుతాడా –అని తండ్రి అంటాడు. ఇలా ఆల్రెడీ ప్రధాని సీటు రిజర్వ్ అయిపోయిన ముచ్చట ప్రణబ్ ముఖర్జీకి తెలీక ఆ వివర్ణ ముఖారవిందమేమో.

          ఈ క్రమంలో ప్రభుత్వం మీద తన పట్టు వుండాలని సోనియా గాంధీ, జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేయడం మన్మోహన్ సింగ్ ని చికాకు పెడుతుంది. మేనిఫెస్టో హామీల అమలుకి జాతీయ సలహా మండలి అంటే రెండో అధికార కేంద్రమే. దీనికి తను తలొగ్గి పనిచేయాలి. పైగా సోనియా దూతగా  పులోక్ చటర్జీ (బాబీ పర్వేజ్) అనే బ్యూరోక్రాట్ నియమితుడై, యూపీఏ ప్రభుత్వపు కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు తీరుని పర్యవేక్షించడానికి రావడం చిర్రెత్తిస్తుంది. ఇంకా సోనియా రాజకీయ కార్యదర్శి రూపంలో అహ్మద్ పటేల్ (విపిన్ శర్మ) ప్రధాన మంత్రి కార్యాలయంలో హల్చల్ చేయడం మన్మోహన్ ని ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా పార్టీ వ్యక్తులు రెండో అధికార  కేంద్రంగా ప్రధానమంత్రి కార్యాలయంలో పెత్తనం చేస్తూంటే, చాటుగా తన మీద జోకులేస్తూంటే, మన్మోహన్ కిక ప్రధానిగా తన స్థానం అర్ధమైపోతుంది.

          ఈ దశలో బిజినెస్ స్టాండర్డ్ పత్రికా సంపాదకుడైన సంజయ బారు (అక్షయ్ ఖన్నా) ని పిలిపించుకుని మీడియా సలహాదారుగా నియమించుకుంటారు సింగ్. వీళ్ళది 30 ఏళ్ల గురు శిష్య సంబంధం. డాక్టర్ సాబ్ ని తిరగేసి మడతేసి చదివేయగలడు బారు. పాలనానుభవం లేని మన్మోహన్ కి చిట్కాలు నేర్పుతూంటాడు. మహాభారతంలో రెండు కుటుంబాలున్నాయని మన్మోహన్ అంటే, కాదు దేశంలో ఒకే కుటుంబం వుందని తను అంటాడు. ఇతడి మీద పీతూరీలు సోనియాకి యమ స్పీడుగా అందుతూంటాయి. ఐతే  అహ్మద్ పటేల్ ని కూడా యమ స్పీడుగా నియంత్రించగల మంత్రాంగం తెలిసిన వాడు బారు. 

          రెండో అధికార కేంద్రం నుంచి మన్మోహన్ ఇబ్బందులెదుర్కొంటూనే ఆర్థిక విధానాల రూపకల్పనల్లో పైచేయి సాధిస్తారు. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తన మానసిక పుత్రికైతే, ఈ క్రెడిట్ కూడా తనకి దక్కనివ్వదు రెండో అధికార కేంద్రం. ఇక కీలక అణు ఒప్పందం ఘట్టం ఎదురయ్యేసరికి తన తడాఖా చూపిస్తారు ప్రధాని. యూపీఏకి మద్దతిస్తున్న వామపక్షాలు అమెరికాతో ఈ అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వున్నాయి. మన్మోహన్ గనుక వెనుకడుగేయక పోతే మద్దతు ఉపసంహరించుకుంటారు. సోనియా వెనుకడుగేయమనే వొత్తిడి చేస్తూంటే, మన్మోహన్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఈ దెబ్బకి వామపక్షాలు పోయినా, సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ దేవుడు పంపిన దూతలా దిగుతారు. ఇలా మొదటి పాలనా కాలం (2004 – 09) మన్మోహన విజయంతో ముగుస్తుంది.

          రెండో పాలానా కాలానికి (2009-14) సంజయ బారు వుండరు. బారు మీద  మీడియాలో ఉద్దేశపూర్వక వ్యతిరేక కథనాలు ప్లాంట్ చేస్తూంటే, ఒకసారి వెళ్లి మేడమ్ ని కలవమని మన్మోహన్ చెప్తారు. నేను చెంచాగిరీ చేసే పార్టీ లీడర్ని కాను, మొండి పట్టుదలకి పోయే జర్నలిస్టునని రాజీనామా చేసి వెళ్ళిపోతారు బారు. 

          రెండో పాలనాకాలం మన్మోహన్ కి తెలియకుండా అవినీతితో పాపపంకిలమై పోతుంది.  ఇప్పుడు రాజీనామా చేయాలనుకోరు. చేస్తే దాని పరిణామాలు పార్టీ మీదా, పార్టీతో తన మీదా ఎలా వుంటాయో తెలుసు. ఈ అడకత్తెరలో పోకచెక్క నరకం అనుభవిస్తూనే రాజీ పడిపోతారు. దేశానికి నేనేమని చెప్పాలని అంటే, మీరు చెప్పక్కర్లేదు, పార్టీ చెప్తుందని సోనియా అనడం. కపిల్ సిబల్ ని దింపి 2జి, కోల్ గేట్ వగైరా స్కాముల్ని తిమ్మిని బొమ్మిని చేయడం.

          ఇక తను మూడోసారి ప్రధానిగా వుండనని ఎన్నికల ప్రచారం నుంచి      తప్పుకుంటారు మన్మోహన్. బిజెపి రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుంది. రెండో పాలనా కాలానికి తను అపజయ బాధ మిగుల్చుకుని మౌనంగా నిష్క్రమిస్తారు మన్మోహన్.

అక్షయ్ ఖన్నాతో దర్శకుడు
 ఎలావుంది కథ         కథలా లేదు, ఇదే సమస్య. చాలా విషయాలున్నాయి. విషయాలన్నీ కథగా లేవు. ఇది కథలా కాకుండా, డాక్యుమెంటరీలా, న్యూస్ బులెటిన్ లా సాగుతూనే వుంటుంది. ఎంతకీ కథ మొదలవదు. ‘బాహుబలి’ గానీ, ‘ఎన్టీఆర్ బయోపిక్’ గానీ మొదటి భాగాలు ఉపోద్ఘాతాలు మాత్రమే. కథలు కావు. కథలు రెండో భాగంలో మొదలవుతాయి. ‘బాహుబలి’ మొదటి భాగం కథలేని ఉపోద్ఘాతమైనా తట్టుకుందంటే దాని వ్యవహారం వేరు, మేకింగ్ వేరు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ని రెండు భాగాలుగా కాకుండా, ఒకే మూవీగా కథే చెప్పేసి వుంటే ఫలితాలు వేరేగా వుండేవి. కథకీ ఉపోద్ఘాతానికీ, కథకీ గాథకీ తేడాల పట్ల అప్రమత్తంగా లేకపోతే ఇలాగే వుంటుంది. అయితే మన్మోహన్ బయోపిక్ రెండు భాగాలుగా తీయాలనుకున్నది కాదు. అలాంటప్పుడు తీసిన ఒక్కదాన్నీ కథగా తీయక, దర్శకుడితో బాటు మరో ముగ్గురు రచయితలూ ఉపోద్ఘాతంలా రాస్తూ తీస్తూ కూర్చోవడంతో, ఇదొక సినిమానే కాకుండా పోయింది. న్యూస్ బులెటిన్ లా తయారయ్యింది. 


        ఇది బయోపిక్ అనుకుంటే దీని ఉద్దేశం మన్మోహన్ కి క్లీన్ చిట్ నిస్తూ సోనియాని వేరేగా చూపించడమని తెలిసిపోతూనే వుంటుంది. రెండు పాలనా కాలాల్లోనూ సోనియా పోషించిన తెరవెనుక పాత్ర దేశానికి తెలిసిన విషయమే. ఇప్పుడీ ఎన్నికల సమయంలో ఈ బయోపిక్ తో ఏవైనా రాజకీయ ఉద్దేశాలుంటే, ఈ కాలం చెల్లిన పాత విషయాలతో అవి నెరవేరవు. ఇక మొన్నటి  దాకా రాహుల్ గాంధీని అన్ ఫిట్ అంటూ వచ్చారు. అంతకంటే అన్ ఫిట్ గా రాజకీయంగా మన్మోహన్ వున్నట్టు చిత్రించారు. దీనికి సోనియా బాధ్యత లేదు. స్వాభావికంగా ఆయనంతే. ఆయన సమర్ధుడైన బ్యూరోక్రాట్ మాత్రమే. కానీ ఆ సమర్ధతనైనా ప్రదర్శించుకోలేని అశక్తత  సోనియా వల్లే ఎదురైంది. ఇవన్నీ ఎవరు కేర్ చేస్తారు ఈ డాక్యుమెంటరీ లేదా న్యూస్ బులెటిన్ 
చూస్తూ.

        కేర్ చేసే ప్రక్రియ వేరే వుంది. అదేమిటో చివర చూద్దాం. అయితే ఈ బయోపిక్ వల్ల నెరవేరే ప్రయోజనం ఏమైనా వుంటే ఇదొక్కటే – హైకమాండ్ వల్ల మన్మోహన్ పడ్డ అవమానాలకి ఆయన మనోభావాలు అప్పుడెలా వుండేవో, ఎలా లోలోపల అణుచుకుంటూ వ్యధననుభవించి వుంటారో మనం ప్రత్యక్షంగా చూసి వుండే అవకాశం లేదు. చూడాలన్పించే ప్రేక్షకులకి ఈ బయోపిక్ తో  ఆ కోరిక నెరవేర వచ్చు. ఆయా సమయాల్లో మన్మోహన్ ఈ బయోపిక్ లో చూపించిన విధంగానే బాధపడ్డారని నిర్ధారణగా చెప్పలేం. కానీ సన్నివేశాల పరంగా వీలైనంత లాజికల్ గా కల్పన చేసి  ప్రేక్షకుల ముందుంచారు. అనేక చోట్ల కళ్ళు చెమర్చేలా ఆయనలోని మనకి తెలియని వ్యక్తిగత కోణాన్ని ఆవిష్కరించారు. బయోపిక్ లో ఇతర విషయాలన్నీ తెలిసిన పాత వాటికే రీప్లే, ఇదొక్కటే కొత్తగా తెలిసే విషయం. వ్యక్తిగా మన్మోహన్ అంతరంగ చిత్రణ. దీనికే మనం ప్రభావితం అవుతాం.

ఎవరెలా చేశారు 
     మాజీ ప్రధాని భౌతిక అనుకరణే గాక, మానసిక లోకాన్నీ అనుపమ్ ఖేర్ నిరుపమానంగా కళ్ళకి కట్టారు. మన్మోహన్ మాటలకి తగ్గట్టుగా ముఖంలో భావాలుండవు. ఎప్పుడూ ఒకేలా వుంటుంది ఆయన వదనం. ఇందువల్ల అనుపమ్ ఖేర్ కి ఎక్స్ ప్రెషన్స్ తో బాధ తప్పినా, సమయోచితంగా పలికే మాటలతోనే భావోద్వేగాల్ని అందించాల్సిన భారం మీద పడింది. ఈ కష్టాన్ని కష్టపడి మోశారు. భౌతిక అనుకరణలో మన్మోహనే అన్పించారు. మన్మోహన్ మార్కు నడక మాత్రం సూపర్ ఇమిటేషన్. ఒక విషయంలో మాత్రం మన్మోహన్ చాలా నిష్కర్షగా వుంటారని చూపించారు. తనని కలవడానికి ఏ పని మీద ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా నసగకుండా, ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చేసి చేతులు జోడిస్తారు. ఆ వ్యక్తి ఇక గబుక్కున లేచెళ్ళిపోవడమే. మన్మోహన్ ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చేశాక మళ్ళీ మారు మాట్లాడానికి వుండదు.  ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కి కూడా ఇదే పరిస్థితి.  ఇలా వచ్చి కూర్చుని సమస్య చెప్పుకున్నారో లేదో, మన్మోహన్ నుంచి ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చివేత ప్లస్ నమస్కారం ఎదురయ్యేసరికి - అలా లేచెళ్ళిపోతారు అయోమయంగా. మన్మోహన్ అలా దండం పెట్టడం వెనుక – పైన హైకమాండ్ వుంది, నన్నొదిలెయ్యండ్రా బాబూ అన్న అర్ధముందేమో స్పష్టత లేదు. ఈ సన్నివేశాల్లో అనుపమ్ ఖేర్ బెస్ట్ అనిపించారు.

          అణు ఒప్పందం అంశంలో రాజీనామాకి సిద్ధపడినప్పుడు సోనియాతో సన్నివేశంలో బ్యాలెన్సుడుగా కన్పించే తనే, రెండోసారి ఎన్నికలప్పుడు తను ప్రచార సారధ్యం వహిస్తానంటూ మొండితనం ప్రదర్శించే ఘట్టంలో ఖేర్ మెరుస్తారు. మన్మోహన్ ఎంత చిన్న పిల్లవాడంటే – మీరిలా రాజ్యసభ సభ్యుడిగా పరోక్షంగా వుండి పోవడం కాదు, ముందుకొచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పార్టీని గెలిపించాలి, పార్టీలో మీకు ప్రత్యాన్మాయం లేదు – అని సంజయ బారు నూరిపోస్తే గానీ మన్మోహన్ కి ఇగో తన్నుకు రాదు. ఈ ఇగో ప్రదర్శనే సోనియాతో మొండితనం. కానీ ఎన్నికలు గెలిచి రెండోసారి ప్రధాని అయ్యాక, గెలుపు క్రెడిట్ ఆయనది కాదని పార్టీ అన్నప్పుడు- మన్మోహన్ మౌన ఆక్రందనని నటించిన ఖేర్ అద్భుతం. ఒక్క అణు ఒప్పందం విషయంలో హీరో తప్ప, మిగతా అన్ని విషయాల్లో మన్మోహన్ ని జీరో చేసే స్వపక్ష రాజకీయంతో మన్మోహన్ పూర్తిగా పాసివ్ పాత్రే. ఇలాటి సజీవ వెరైటీ పాసివ్ పాత్ర ఇంకే కాల్పనిక కథల్లోనూ కన్పించదు. ఈ వెరైటీ పాసివ్ పాత్రని అనుపమ్ ఖేర్ అర్ధవంతంగా పోషించారు.  

        ఆనుపమ్ ఖేర్ వెరైటీ పాసివ్ పాత్రయితే, సంజయబారుగా నటించిన అక్షయ్ ఖన్నా పక్కా చలాకీ యాక్టివ్ పాత్ర. సున్నిత హాస్యంతో సన్నివేశాల్లో హుషారు నింపేది తనే. అనుపమ్ ఖేర్ ని కంటికి రెప్పలా కాపాడే, పాపాయిలా ట్రీట్ చేస్తూ గుడ్ డాడీతనాన్ని ప్రదర్శించే,  శిష్యపరమాణువుగా ఖన్నా ఎక్సెలెంట్. మన్మోహన్ – సంజయ బారుల కెమిస్ట్రీ ఇలా వుండేదా అనేలా పాత్రచిత్రణ సాగింది. మన్మోహన్ ని ఆటలు పట్టిస్తూ గట్టిగా నవ్వే వ్యక్తి బారు ఒక్కడే అన్నట్టు వుంటుంది. అణు ఒప్పందం సందర్భంగా మన్మోహన్ (ఖేర్), బారు (ఖన్నా) ని పిల్చి- నువ్వెళ్ళి అమెరికా రాయబారితో ఏం మంతనా లాడేవ్? కే సెరాసెరా అంటూ ఏదో  కోడ్ లాంగ్వేజీ వాడేవట, ఏంటది? – అని బుంగమూతి పెట్టినప్పుడు-  బారు (ఖన్నా) పడీ పడీ నవ్వి- కే సెరా సెరా అంటే జరిగేది జరుగుతుందని అర్ధమండీ, అది హిచ్ కాక్ సినిమాలో పాట – అనగానే, మన్మోహన్ సతీమణి ఆ పాటందుకుని పాడేస్తే – మన్మోహన్ అమాయకత్వం బయటపడడం.  ఇలాటి కొంటెతనంతో వుంటుంది ఖన్నా పాత్ర, నటనా. ఇంకా ఈ పాత్రలో నటనా పరంగా ఫోర్త్ వాల్ ని ఛేదించి – ప్రేక్షకులవైపు తిరిగి కామెంట్లు విసిరే, ప్రేక్షకులకి వివరించే వ్యాఖ్యాతగా కూడా వుంటాడు. అయితే ముగింపుగా చివరి షాట్ లో మన్మోహన్ భవనంలోకి వెళ్తూంటారు. వెనుకనుంచి అక్షయ్ ఖన్నా ‘డాక్టర్ సాబ్’  అని పిలుస్తాడు. ఆయనకి వినపడక వెళ్ళిపోతూంటారు. మళ్ళీ పిలుస్తాడు. వినపడదు. ఇక ‘డాక్టర్ సాబ్!’ అని గట్టిగా అరుస్తాడు. ఇది బాగాలేదు. పెద్దాయన్ని అరుపులు అరిచి పిలవడం బాగా లేదు. బాధతో నిష్క్రమిస్తున్న పెద్దమనిషిని గద్దించడం అస్సలు బాగాలేదు. వినపడకపోతే దగ్గరికెళ్ళి మాట్లాడ వచ్చు. ఈ ముగింపు షాట్ చాలా బ్యాడ్ టేస్టు. 

           అయితే మన్మోహన్ ఈ బాధామయ నిష్క్రమణని చూపించిన విధానం కూడా ఆయన మనోవిశ్లేషణా యుక్తంగా లేక డొల్లగా వుంది. సినిమా పాత్ర ముగింపులో ఏదో నేర్చుకున్న సెన్స్ తోనే  వుంటుంది. ఇక్కడలా లేదు. సంజయ బారు ప్రకారం, మన్మోహన్ సింగ్ తన కింద జరుగుతున్న అవినీతిని చూసీ చూడనట్టు వుండడానికి హైకమాండ్ కారణం కాదు. ఆయన వ్యక్తిగత కారణమే వుంది. బ్యూరోక్రాట్ గా వున్నప్పుడు తను అవినీతి అంటని ఉన్నతాధికారిగా తనని తానూ కాపాడుకునే ఒక సిద్ధాంత నిష్ఠకి కట్టుబడే వారు. అదే సమయంలో ఆ సిద్ధాంతపు నిష్ఠని ఇతరుల మీద రుద్దకూడదని అనుకునే వారు. బ్యూరోక్రాట్ గా పనికొచ్చిన ఆ సిద్ధాంత నిష్ఠ, ప్రధాన మంత్రిగా పనికి రాదని తెలుసుకోలేక పోయారు. ఇప్పుడు కూడా బ్యూరోక్రాట్ గానే భావించుకోవడం వల్ల,  తన సిద్ధాంతపు నిష్ఠని ఇతరుమీదా అమలుచేయాలన్న ఆలోచన రాలేదు. వచ్చి వుంటే స్కాములు జరిగుండేవి కావేమో. జరిగిపోయాక రాజీనామా కూడా చేయలేని పరిణామాల్లో చిక్కుకున్నారు. తను మొదటిసారి మాత్రమే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. రెండోసారి కాదు. రెండోసారి యూపీఏని తనే అధికారంలోకి తెచ్చారు. తనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలాటిది తన ఈ కష్టార్జితం కేవలం తన సైకాలజీ వల్ల వృధా పోయిందన్నఎరుకతో, ఎవేర్నెస్ తో, ఒక పశ్చాత్తాపంతో  ముగించి వుంటే, మన్మోహన్ ఎంతో ఉన్నతంగా కన్పించేవారు. హైకమాండ్ నే దోషిగా నిలబెట్టాలన్న రాజకీయ ఉద్దేశాలుంటే ఇప్పుడున్న ముగింపు ఇంతే. 

          ఇంకొక్క ఆర్టిస్టు మాత్రమే ఈ బయోపిక్ లో ఆకట్టుకుంటారు. ఆమె మన్మోహన్ సతీమణి గురు శరణ్ కౌర్ గా నటించిన దివ్యా సేథ్ షా. సోనియాగాంధీగా నటించిన జర్మన్ నటి సుజాన్ బెర్నెర్ట్ పర్లేదు. సోనియా గాంధీ హిందీ మాడ్యులేషన్ కి డబ్బింగ్ ఆర్టిస్టు ఇంకా బెటర్. రాహుల్ గాంధీగా అర్జున్ మాథుర్ కుదర్లేదు. సీన్లు మూడే వుంటాయి. ప్రియాంకా గాంధీగా ఆహ్నా కుమ్రా ఓ మోస్తరు. ఇంకా పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం, గులాం నబీ ఆజాద్, శివరాజ్ పాటిల్, కపిల్ సిబల్, అహ్మద్ పటేల్, అర్జున్ సింగ్, నట్వర్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పేయీ, ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, నవీన్ పట్నాయక్, సీతారాం ఏచూరీ, ప్రకాష్ కారత్, నాటి అమెరికా  అధ్యక్షుడు జార్జి బుష్, నాటి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ మొదలైన నాయకులుగా;  జేఎన్ దీక్షిత్, ఎంకే నారాయణన్, బ్రజేష్ మిశ్రా మొదలైన బ్యూరోక్రాట్లుగా; ఎన్. రామ్, వీర్ సింఘ్వీ, అర్నాబ్ గోస్వామి మొదలైన పాత్రికేయులుగా  కొత్త కొత్త  నటులు కనిపిస్తారు. వీళ్ళతో వుండేవి ఒక సీను, లేదా ఒక షాట్ మాత్రమే. కానీ దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకి వేసిన జ్యూనియర్ నటుడు ఘోరమైన విగ్గు పెట్టుకుని, కింది దాకా లేని ప్యాంటు వేసుకుని జోకర్ లా వున్నాడు.   

          బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ నీటుగా వున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం సహా ఇతర లొకేషన్స్ అన్నీ రిచ్ గా వున్నాయి. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలుని ఓ మాదిరి సెట్ వేసి మేనేజి చేశారు. ఈ బయోపిక్ ని గంటా 50 నిమిషాల్లో ముగించారు. 

          ఏ మాటకామాటే చెప్పుకుంటే, కొత్త దర్శకుడికి ఎంత థ్రిల్లింగ్ బయోపిక్ వున్నా అవినీతికి సినిమా రంగంలో వెలివేత లేదు. మీటూకి తక్షణ బహిష్కారమే. ఇప్పుడు కొత్తగా మీటూ దెబ్బకి రాజ్ కుమార్ హిరానీ చేతిలో వున్న ప్రాజెక్టు కోల్పోయి కూర్చున్నాడు. మన్మోహన్ బయోపిక్ దర్శకుడికి  తన అవినీతితో ఇది ఎదురు కాలేదు. తను అవినీతిలో ఎంత రాణించినా, దర్శకత్వంతో నటింపజేసుకోవడం, సీన్లు తీయడం మాత్రం క్లాసుగానే  కానిచ్చాడు. ఒక్క సబ్జెక్టు తయారు చేసుకునే విషయంలోనే విఫలమయ్యాడు. అయితే, అవినీతి కుటుంబం నుంచి వచ్చిన వాడే, ఇంకో రాజకీయ కుటుంబం అవినీతికి పాల్పడిందని సినిమా తీయడమే కొసమెరుపు.

చివరికేమిటి 
       బయోపిక్ ని సినిమాలా తీయకుండా ఓ డాక్యుమెంటరీలా, న్యూస్ బులెటిన్ లా తీశాడు. ఇప్పుడు దేశంలో బయోపిక్ ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంతే జోరుగా చాలా మంది నష్టపోతారు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన బయోపిక్ అనే దృశ్యమాధ్యమంతో పరిచయం, అనుభవం లేనట్టుంది. బయోపిక్ స్క్రీన్ ప్లే కూడా మామూలు సినిమా స్క్రీన్ ప్లేలానే వుంటుందని తెలీనట్టుంది. తీస్తున్న బయోపిక్స్ లో కథకీ ఉపోద్ఘాతానికీ, కథకీ డాక్యుమెంటరీకి, కథకీ న్యూస్ బులెటిన్ కీ తేడాలు తెలీక ఏదో తీసేస్తున్నారు. ఈ సీజన్లో రాజ్ కుమార్ హిరానీ ఒక్కడే సంజయ్ దత్ జీవితం మీద ‘సంజు’ అనే బలమైన బయోపిక్ ని సినిమాలాగా తీసి 600 కోట్లు ఆర్జించాడు. సినిమాని సినిమాలాగా చూడాలని దబాయిస్తూంటారు. ముందు సినిమాని సినిమాలాగా తీయాలని మాత్రం బుర్రకెక్కదు. 

          సినిమా కోసం బయోపిక్ నైనా సినిమా కథగానే తీయకపోవడం ఇక్కడ జరుగుతున్న పొరపాటు. బయోపిక్ తో సినిమా అనే ప్రక్రియ ఒక్కటే సక్సెస్ అవుతుంది. డాక్యుమెంటరీలూ, న్యూస్ బులెటిన్ల ప్రసారాలూ కాదు. సినిమా అంటే కథ, కథ, కథే
 తప్ప, మరోటి కాదు! కథే కూర్చోబెడుతుంది, కథనే కేర్ చేస్తారు ప్రేక్షకులు. 

          మన్మోహన్ బయోపిక్ కి తీసుకున్న సంజయ బారు పుస్తకంలో ‘సినిమా’ లో చూపించిన మన్మోహన్ బయోపిక్ అంతా లేదు. సంజయ బారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దగ్గర పనిచేసిన కాలానికే (2004 – 2008) పుస్తకం పరిమితమైంది. మన్మోహన్ రెండో పదవీకాలంలో జరిగిన అవినీతి గురించి పుస్తకం చివరి మాటగా కొంత  ప్రస్తావించి వదిలేశారు, అంతే. 


        మన్మోహన్ అణు ఒప్పందంతో సాధించిన పై చేయితో ఇంటర్వెల్ వేసి ఫస్టాఫ్ ముగించారు. ఇంతవరకే పుస్తకం. దీని తర్వాత సెకండాఫ్ పుస్తకం కాని దర్శకుడి మస్తకం. సెకండాఫ్ లో చూపించిన వాటితో పుస్తకానికి సంబంధం లేదు. అయినా పుస్తకం ఆధారంగానే మొత్తం బయోపిక్ తీసినట్టు ప్రచారం చేసుకున్నారు. పైగా సంజయ బారు పాత్రని సెకండాఫ్ లో పొడిగిస్తూ కల్పన చేశారు. 

          సెకండాఫ్ లో మన్మోహన్ మళ్ళీ ప్రధాని అయ్యాక చూపించినవి దర్శకుడు అక్కడా ఇక్కడా సేకరించిన మీడియాలో వచ్చిన విడివిడి వార్తలే. ముగింపుగా వచ్చే అవినీతి స్కాము దృశ్యాలు కూడా వార్తా సేకరణనలే. ఫస్టాఫ్ కి ముగింపుగా  అణు ఒప్పందంతో విజయం, సెకండాఫ్ ముగింపుగా అనినీతి తో పరాజయంగా పెట్టుకుని, ఇదే గొప్ప స్క్రీన్ ప్లే డిజైన్ అనీ, దీంతో మన్మోహన్ బయోపిక్ కి సమగ్రత వచ్చేసిందనీ అభిప్రాయపడ్డాడు యాక్సిడెంటల్ దర్శకుడు. రాజకీయ ఉద్దేశాలతో తీసే సినిమాలేవీ సక్కదనంతో వుండవు. చెత్తంతా పేరుకుంటుంది. రాజకీయ ఉద్దేశాలకి వున్న మీడియా వెరైటీలు చాలవన్నట్టు సినిమాల మీద పడడం. 

          సంజయ బారు పుస్తకం ఒక పాయింటుతో సాగే రాజకీయ డ్రామా కాదు. ప్రధాని రోజువారీ కార్యకలాపాల్లో చోటు చేసుకున్న వివిధ ఘట్టాల వృత్తాంతం, వాటి వెనుక తనకి తెలిసిన నిజానిజాలు. బయోపిక్ తీస్తూ పుస్తకంలోని ఈ తోచిన ఘట్టాలు పేర్చుకుంటూ పోయారు. ఒకదానితో వొకటి సంబంధం లేని చిరు చిరు ఘట్టాలు. కారబ్బూందీ పొట్లాలు. ఓడిశా సీఎం ఆర్ధిక సాయం అడగడానికి వచ్చి వెళ్ళడం, పాక్ ప్రధానితో మన్మోహన్ రెండు ముక్కలు కాశ్మీర్ గురించి మాట్లాడడం, చంద్రఖర్రావ్ (కేసీఆర్) తెలంగాణా గురించి మీతో ఏమన్నారని ఒక నాయకుడు మన్మోహన్ ని అడగడం...ఇలా మన్మోహన్ తో పుస్తకంలో నచ్చిన బిట్లు ఏరుకుని వేసుకుంటూ పోయాడు. వీటి పూర్వాపరాలేమిటో తెలియజేయకుండా. వీటికి కథతో సంబంధమేమిటో అర్ధంగాకుండా. నట్వర్ సింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ సూట్ లోకి వెళ్ళబోతూ ఆగిపోతారు. షాట్ కట్ అయిపోతుంది. ఎందుకు ఆగిపోయారో చెప్పడు.  మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మన్మోహన్ ఆర్డినెన్స్ పత్రాలు చించెయ్యగానే కట్, అర్నాబ్ గోస్వామీ రాహుల్ ని ఇంటర్వూ చేసిన ఘట్టంలో అర్నాబ్ ఒక ప్రశ్నేదో అడగ్గానే కట్...బిట్టు బిట్టుకీ కట్ కట్టులు. ఏదో కాస్త పొడుగ్గా జరగాలి కాబట్టి ఇంటర్వెల్ ముందు అణు ఒప్పందం గురించిన కాస్త డ్రామా, ముగింపులో అవినీతి గురించిన ఇంకాస్తా డ్రామా. 

      ఈ నానాజాతి సమితి బిట్లలో మళ్ళీ ఎక్కడా రాని వ్యక్తుల్ని  ఘనంగా పరిచయం చేయడం – బ్యూరోక్రాట్లు పులోక్ ఛటర్జీ, ఎంకే నారాయణన్, జేఎన్ దీక్షిత్... జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ పరిచయం కాగానే, ప్రేక్షకుల వైపు తిరిగి – మీ మీద ఫైలుంది అంటారు. వామ్మో ఈయనేదో చేస్తాడనుకుంటాం. మనిషి మళ్ళీ కన్పించకుండా మాయం. ఇలా పే ఆఫ్ కాని బిల్డప్పులే. ఇలా వివిధ వార్తల నానాజాతి సమితిలా వుంటుంది స్క్రీన్ ప్లే అనే పదార్ధం. 

          బయోపిక్ స్క్రీన్ ప్లేకి  ఎప్పుడో ‘గాంధీ’ తీసిన రిచర్డ్ అటెన్ బరో ఒక మార్గం వేశాడు. ఇటీవల 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘లింకన్’ వుంది. ఇంకా చాలామంది తీసిన చాలా బయోపిక్ లు వున్నాయి. బయోపిక్ అంటే మామూలు సినిమా కథలాగే ఆ వ్యక్తి పాత్ర,  అది ఎదుర్కొనే సమస్య, కనుగొనే పరిష్కారం, చివర విజయమో అపజయమో, ఇంతే.

          బయోపిక్ అంటే పుట్టిందగ్గర్నుంచీ చచ్చిందాకా ఆ వ్యక్తి జీవితాన్ని పూసగుచ్చినట్టు చూపించడం కాదు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఒకే ఒక్క మలుపు, లేదా ఒక లక్ష్యం కోసం ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్య మాత్రమే సినిమాకి బయోపిక్ అవుతుంది. మహాత్మా గాంధీ లక్ష్యం స్వాతంత్ర్య సముపార్జన. దీనికి ప్రేరణ 1) దక్షిణాఫ్రికా రైల్లో జరిగిన అవమానం, అప్పుడు 2) సహాయ నిరాకరణోద్యమం, 3) క్విట్ ఇండియా - స్వాతంత్ర్య సిద్ధి, 4) మతకల్లోలాలు – మరణం. ఇంతే, శాఖోపశాఖలుగా విస్తరించిన మహాత్ముడి జీవితంలో ఈ నాల్గే ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ గా తీసుకుని, అజరామరమైన చలనచిత్రరాజాన్ని ప్రపంచానికందించాడు అటెన్ బరో. అంతేగానీ మహాత్ముడు ఎలా సత్యనిష్టుడో చిన్నప్పటి సీన్లేద్దాం, కుటుంబం సీన్లేద్దాం, ఆ బిట్లు వేద్దాం, ఈ బిట్లు తెచ్చి వేద్దామని కలగాపులగం చేయలేదు. మహాత్ముడి వ్యక్తిగత జీవితమే చూపించాలంటే,  ఆ పాయింటుతో అది వేరే బయోపిక్ అవుతుంది. ‘గాంధీ మై ఫాదర్’ అనీ గాంధీ మీద కోపం వచ్చేలా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తీయనే తీశాడు. 

      ఇలాగే స్పీల్ బెర్గ్ ‘లింకన్’ తీసినప్పుడు సినిమా కథగానే తీశాడు. వెండితెర వున్నది కథల కోసం తప్ప, గాథలతో, ఉపోద్ఘాతాలతో, డాక్యుమెంటరీలతో, న్యూస్ బులెటిన్ లతో, బుర్రలేని కాకమ్మ కబుర్లతో గలీజు చేయడానికి కాదు. వెయ్యి మంది చూస్తూ కూర్చునే హాల్లో వేళాకోళం వేషాలు కాదు. టికెట్లతో తిక్క వేషాలు కాదు. ‘లింకన్’ తీసినప్పుడు స్పీల్ బెర్గ్ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం – అగ్నిపరీక్ష లాంటిది – 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దీనికోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే (మన యాక్సిడెంటల్ దర్శకుడిలాగే )వాటిని పక్కన పడేశాడు. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. కసరత్తు చేస్తే కుదరదన్పించింది. రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలతో బయోపిక్ తీసి పెద్ద విజయం సాధించాడు ( బడ్జెట్ 65 మిలియన్ డాలర్లు,  బిజినెస్ 275 మిలియన్ డాలర్లు).

          1970 లలో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ని ముంచిన వాటర్ గేట్ కుంభకోణాన్ని కూపీలాగి పుస్తకం రాశారు ఇద్దరు జర్నలిస్టులు. ‘ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్’ అన్న పుస్తకం టైటిల్ తోనే గొప్ప సినిమా తీశారు. పుస్తకాన్ని స్క్రీన్ ప్లేగా మార్చే బాధ్యత హాలీవుడ్ లో ఆచార్యుడు లాంటి రైటర్ విలియం గోల్డ్ మాన్ తీసుకున్నాడు. అప్పటికే ఒక ఆస్కార్ అవార్డు తన ఖాతాలో వుంది. పుస్తకంలోని రెండో భాగాన్నితీసి అవతల పడేసి మొదటి భాగంతోనే స్క్రీన్ ప్లే రాశాడు. పుస్తకం రాసిన జర్నలిస్టులిద్దరు గోలగోల చేశారు. ఒక జర్నలిస్టు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇంకో స్క్రీన్ ప్లే కూడా రాశాడు. స్క్రీన్ రైటింగ్ అంటే జర్నలిజం కాదన్నాడు గోల్డ్ మాన్. స్క్రీన్ మీద జర్నలిజాన్ని చూడరన్నాడు. బిగ్ స్టార్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్, దర్శకుడు అలన్ పకూలా కంగారు పడి స్క్రీన్ ప్లే తీసుకుని నెలరోజులు అజ్ఞాతంలో కెళ్ళి పోయారు. దాంతో కుస్తీ పట్టారు. ఇలా కాదు, అలా వుండాలి...అలా కాదు, ఇలా చేద్దాం...రెండో భాగాన్ని ఇలా కలుపుదాం, కాదు అలా కలుపుదామని జుట్లు పీక్కుని పీక్కునీ ఏమీ చేయలేక పెద్దాయనే కరెక్ట్ అని, పెద్దాయన రాసిన శిలాశాసనాన్నే సినిమా తీశారు. ఎక్కడికో వెళ్ళిపోయి చరిత్ర కెక్కింది. ఎన్నో ఆస్కార్ అవార్డు లొచ్చి పడ్డాయి. ఆ స్టార్ కీ, దర్శకుడికీ కాక, పెద్దాయనకే ఇంకోటి పడింది. ఆల్ ది గోల్డ్ మాన్స్ మెన్. 

          మన్మోహన్ బయోపిక్  సగం బారు పుస్తకం, సగం దర్శకుడి మస్తకంగా వుందని చెప్పుకున్నాం. ఆయన పుస్తకంలోని అణు ఒప్పందాన్ని (మొదటి పాలనా కాలం) ఫ్లాష్ బ్యాకుగా పెట్టుకుని, తన మస్తకంలోని అవినీతి స్కాముల్ని (రెండో పాలనా కాలం) కథగా చేసుకుంటే సరిపోయేది. రెండో పాలనా కాలంతో కథ ప్రారంభించి, మధ్యలో మొదటి పాలనా కాలపు ఫ్లాష్ బ్యాక్ పూర్తి చేసి- రెండో పాలనా కాలంతో కథ ముగించేస్తే ఏ గొడవా లేకుండా పోయేది. 


        అంటే అవినీతికి సంబంధించిన పరిణామాలతో మన్మోహన్ ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు- అణు ఒప్పందంతో తన విజయానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకోవడం - ఆ జ్ఞాపకాల్లోంచి బయట పడ్డాక -  అవినీతి కథతో  అలాటి విజయాన్ని చవిచూడలేక ఓడిపోవడమనే ముగింపు అన్నమాట.

          మొదటి పాలనాకాలంతో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో  మొదట రెండో అధికార కేంద్రంతో సంఘర్షణ చూపించి, తర్వాత  అణుఒప్పందం చుట్టూ డ్రామా నడిపితే సరిపోతుంది. మిగతా నానాజాతి సమితి న్యూస్ రీల్ బిట్లన్నీ తీసి విలియం గోల్డ్ మాన్ లా అవతల పారేసినా అడిగే వాళ్ళుండరు. బారు పుస్తంలో రెండో అధికార కేంద్రంతో, అణుఒప్పందంతో వున్న మెటీరియల్ తప్ప మిగాతా ఏవీ బయోపిక్ కి పనికిరావు. పుస్తకంలో రెండో అధికార కేంద్రానికి సంబంధించి చాలా సమాచారముంది.  కేబినేట్ లో మంత్రులు తామే ప్రధాని అన్నట్టు వ్యవహరించడం, ఏకే ఆంటోనీ విదేశీ వ్యవహారాల నుంచీ రక్షణ వ్యవహారాల దాకా దేనితోనూ మన్మోహన్ తో ఏకీభవించక పోవడం, తన జ్యూనియర్ ప్రమోటయ్యాడని ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ ని లక్ష్య పెట్టకపోవడం, విదేశాంగ మంత్రిగా వాషింగ్టన్ వెళ్లి జార్జి బుష్ నీ, కండెలెజ్జా రైస్ నీ కలిసివచ్చాక ఆ సమావేశాన్ని మన్మోహన్ కి రిపోర్టు చేయకుండా మూడు రోజులు తప్పించుకోవడం...ఇలా చాలా వున్నాయి.    
  
          మన్మోహన్ మొదటి పాలనా కాలంలో అణు ఒప్పందం విజయం ప్రధానమైనదే. ఆ కాలంలో ఇంకా విజయాలున్నాయి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో బాటు, ఆర్టీఐ చట్టం, ఆధార్ కార్డు చట్టం, గ్రామీణ హెల్త్ మిషన్ ప్రాజెక్టు మొదలైనవి. వీటిని కూడా భాగం చేయాలి. 

          అప్పుడు మన్మోహన్ బయోపిక్- అవినీతి సమస్య, దాంతో సంఘర్షణ, పరాజయం అనే ప్రధాన కథగా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో వుంటూ – ఇందులో ఫ్లాష్ బ్యాకుగా అణు ఒప్పందపు విజయం వుండి - ఇబ్బంది పెట్టకుండా అర్ధవంతంగా సాగిపోయేది.

సికిందర్
https://telugurajyam.com/



20, జనవరి 2019, ఆదివారం

726 :స్క్రీన్ ప్లే సంగతులు


          ‘మహానటి’ విజయం సాధించడానికీ, మంచి రేటింగ్స్ ఇచ్చినా ‘ఎన్టీఆర్’ బయోపిక్ సక్సెస్ కాకపోవడానికీ కారణాలేమిటని ఒక దర్శకుడి సందేహం. ‘ఎన్టీఆర్’ బయోపిక్ నే ఎలా చేసివుంటే బావుండేదో చెప్పమన్నారు. బాలకృష్ణకి, క్రిష్ కి చెప్పేంత  మనదగ్గరే ముంది, వాళ్లకన్నీ తెలుసు. అయినా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రివ్యూలో బయోపిక్ అంటే ఏమిటో కొంత అప్పటికే చెప్పుకున్నాం. అలాగే ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి రెండు ముక్కలు చెప్పుకున్నాం. బయోపిక్ అంటే మరేమిటో కాదు, అది కూడా ఓ పక్కా సినిమా కథే! సినిమా కథే!! సినిమా కథే!!! తేదీల వారీ ఆ వ్యక్తి  డైరీ కాదు!!!!  

         
సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  -  ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  - ఆ  పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా – చివర ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ లోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్ర, ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య, పరిష్కారం”  – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్  వ్యవహారమవుతుంది. పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే – రచయిత  కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ అని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు-  అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటు, వాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు. 

          కనుక సినిమా కథంటే పైన చెప్పుకున్న బ్రాకెట్లో పొల్లుపోకుండా వుండేదే. ఇలా లేనివి ఏవీ సినిమా కథలు కావు, సినిమాలన్పించుకోవు. కథతో వుంటేనే సినిమా. కాకుండా కథ వుండని గాథ సినిమా అవదు, కథ వుండని ఉపోద్ఘాతం సినిమా అవదు, కథ వుండని ఫ్లాష్ బ్యాక్ సినిమా అవదు, కథ వుండని డాక్యుమెంటరీ సినిమా అవదు, కథ వుండని ఎపిసోడ్లు సినిమా అవదు, కథ వుండని ఆంథాలజీ (కథల సంపుటి) సినిమా అవదు, కథ వుండని ఆర్ట్ సినిమా సినిమా అవదు, కథ వుండని వరల్డ్ మూవీ సినిమా అవదు, కథ వుండని ఇండీ ఫిలిం సినిమా అవదు, కథ వుండని క్రౌడ్ ఫండింగ్ కళాత్మకం సినిమా అవదు, కథ వుండని న్యూస్ బులెటిన్ సినిమా అవదు, కథ వుండని డైరీ సినిమా అవదు, కథ వుండని బయోపిక్  సినిమా అవదు. కెమెరాతో తీసిందల్లా సినిమా అవదు. 

          సినిమా కథంటే డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు వచ్చేది. గాథకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు. ఉపోద్ఘాతానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఫ్లాష్ బ్యాక్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డాక్యుమెంటరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఎపిసోడ్లకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆంథాలజీ (కథల సంపుటి) కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆర్టు సినిమాకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, వరల్డ్ మూవీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఇండీ ఫిలిం కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, క్రౌడ్ ఫండింగ్ కళాత్మకానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, న్యూస్ బులెటిన్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డైరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డబ్బులు పెట్టి తీయకపోయినా వీటికి డబ్బులు రానేరావు! 

        ఇక రెండు భాగాల బయోపిక్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు వస్తాయో రావో ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం కూడా విడుదలయ్యాక తెలుస్తుంది. ఎందుకంటే ఇలా  బయోపిక్ ని రెండు భాగాలుగా తీసింది ఎక్కడా లేదు. 

          ఒక పని చేయొచ్చు :  సినిమా కథంటే ఏమిటో ఒకటోతరగతి ప్రాథమిక అవగాహన పక్కాగా వుండి - మనం సినిమా కథ తీయట్లేదు, కాబట్టి సినిమా తీయట్లేదు, కనుక డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు, మన టేస్టు ప్రకారం మనం తీసుకుందామనుకుని-  పైన చెప్పిన ఉపోద్ఘాతాల దగ్గర్నుంచీ, కథ లేని బయోపిక్ ల వరకూ ఎన్నైనా తీసుకోవచ్చు. చేస్తున్న పనేదో ఒక అవగాహనతో, మార్కింగ్ చేసుకుని చేస్తే ఏ బాధా వుండదు. తీస్తున్నది సినిమా కాదనీ, డబ్బులు రావనీ తెలిసే చేస్తారు కాబట్టి. అంతే గానీ సినిమా కథంటే ఏమిటో కామన్ సెన్సు లేకుండా ఏది పడితే అది తీసేసి, అదే సినిమా అనుకుంటేనే, బాధపడుతూ కూర్చోవాల్సి వస్తుంది. తప్పు ఎక్కడ  చేశామో కూడా అర్ధం జేసుకోలేక బాధపడ్డం. ప్రదర్శించేది సినిమా అయితేనే ధియేటర్లు నడుస్తాయి. పక్కన పాన్ షాపు వాడు బతుకుతాడు. 

          సినిమా అంటే – ఆబాల గోపాలమని పాత తరం జర్నలిస్టులు ప్రేమతో రాసేవాళ్ళు కదా – అలా ఆశేష ప్రజానీకాన్ని అలరించే అతి పెద్ద సామూహిక మాస్ మీడియా, వినోద సాధనం. దీనికి కథే పునాది. తొలినాటి సినిమాలన్నీ కథలతో కూడిన వినోద సాధనాలే. సినిమా ఇలాగే సహజ పుట్టుక పుట్టింది. వెండితెర వినోదం కోసమే ప్రాణం పోసుకుంది. పూర్వీకులు కష్టపడి ఇలా డెవలప్ చేసిన సినిమా అనే పదాన్నీ, మాధ్యమాన్నీ, వినోద సాధనాన్నీ, వెండితెరనీ, మధ్యలో ఎక్కడ్నించో  కొందరు సినిమాయేతరులు  కాలుమోపి – పూర్వీకులు వినోదం కోసం కనిపెట్టిన సినిమా అనే కళని హైజాక్ చేసి, పైన చెప్పుకున్న అన్నిరకాల విన్యాసాలతో అష్టవంకర్లూ తిప్పుతూ వెండితెరతో ఆడుకుంటున్నారు. ఈ వర్గం వ్యాపారం కోసం వుండదు. ఈ వర్గానికి చెందిన వ్యాపారేతరులకి హాలీవుడ్ లో స్థానం లేదు కాబట్టి బతికిపోతోంది. ప్రేక్షక బాహుళ్యానికి సినిమా అనే వినోద సాధనం దక్కుతోంది.  లేకపోతే  హాలీవుడ్ నుంచి కూడా ఆర్ట్ మూవీస్, వరల్డ్ మూవీస్ లాంటివి దిగి కొంపలు ముంచేవి. హాలీవుడ్ నిర్మాతల్ని కథలని చెప్పి కథలుకాని వాటితో ఏమార్చడం కుదరదు. ‘వాటీజ్ కాన్ ఫ్లిక్ట్’ అని ముందే అడుగుతాడు ఏ నిర్మాతైనా. వాళ్ళ కుండేంత స్ట్రక్చర్ స్పృహ ప్రపంచంలో ఇంకే నిర్మాతలకీ వుండదు. అందుకే కథల్ని సినిమాలుగా మల్చి  ప్రపంచాన్ని ఏలుకోగల్గుతోంది హాలీవుడ్. 

          కథంటే స్ట్రక్చర్. నిబిడీకృతమై వున్న స్ట్రక్చరే కథ. కథంటేనే స్ట్రక్చర్, స్ట్రక్చర్ అంటేనే కథ. పైన చెప్పుకున్న దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఎందుకు స్ట్రక్చరనే కథలే కావాలంటే, మాటలు నేర్చినప్పట్నుంచీ  మానవుల మెదడు కథల్ని రిసీవ్ చేసుకోవడానికి అలా వైరింగ్ అయివుంది కాబట్టి. సినిమాల్ని ఎన్ని అష్టవంకర్లు తిప్పినా ఈ మెదడులోని వైరింగ్ ని - సాఫ్ట్ వేర్ ని - మార్చి ప్రేక్షకుల్ని మెప్పించలేరు. ప్రకృతి ప్రకృతే, వికృతి అవదు. ఇది కూడా ఒకటో తరగతి పాఠమే! దీన్ని అర్ధం జేసుకుంటే వెండితెరకి  సినిమా కథలు తప్ప మరోటి రాయడానికి మనస్కరించదు. సినిమాల్ని ఆడించే ప్రేక్షకులు వెండితెర కేసి కథ కోసమే చూస్తారు.
***
బయోపిక్ కి ఇన్నోవేషన్ 
         మహానటి’ విజయం సాధించడానికి అది కథవడమే కారణం. అదీగాక ఆవిడ రాజకీయ వ్యక్తి కాదు. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని గాక అన్ని పార్టీల వాళ్ళూ నోర్మూసుకుని బుద్ధిగా చూశారు. హీరోల అభిమాన సంఘాలు కూడా ట్రోలింగ్ చేయలేని నిరుద్యోగులై సినిమా కెళ్ళారు. ‘మనం’ తర్వాత అంత హిట్టయిన సాత్విక, సాంఘిక మూవీ ‘మహానటి’. ఇది కథయినందుకే సుమా. ఈ బయోపిక్ ని తెలివిగా కథగానే చేశాడు దర్శకుడు. దీనికి ప్రసిద్ధి చెందిన ‘సిటిజన్ కేన్’ (1941) మిస్టరీ డ్రామా కథనాన్ని వాడుకున్నాడని తెలిసిందే. ఎలా వాడుకున్నాడన్నది తెలుసుకోవాలి. ఇద్దరు జర్నలిస్టులు పొరలుపొరలుగా సావిత్రి జీవితాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం. ‘సిటిజన్ కేన్’ లో రిపోర్టర్ ఇన్వెస్టిగేట్ చేసినట్టు. ‘సిటిజన్ కేన్’ లో మిస్టర్ కేన్ మరణిస్తూ ‘రోజ్ బడ్’ అని పలుకుతాడు. ఈ ‘రోజ్ బడ్’ ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే మిస్టర్ కేన్ జీవితం గురించి తెలుసుకుంటాడు. ‘మహానటి’ లో సావిత్రి కోమాలో కెళ్ళే ముందు రాసిన ఉత్తరంలో ‘శంకరయ్య’ దగ్గరికి తనని తీసికెళ్లమని కోరుతుంది. రోజ్ బడ్ మిస్టరీ చివర్లో వీడినట్టే, శంకరయ్య మిస్టరీ ముగింపులో తేలుతుంది. రోజ్ బడ్, శంకరయ్య అనే ప్లాట్ డివైసులు కథని నడిపేందుకు పనికొచ్చాయి. మరి వీటిలో ఏది కథ? వ్యక్తులదా, జర్నలిస్టులదా? జర్నలిస్టులదే. ప్లాట్ డివైసు లేమిటో తెలుసుకునే సమస్య జర్నలిస్టులకే వుంది – సావిత్రికి గానీ, మిస్టర్ కేన్ కి గానీ లేదు. వాళ్ళిద్దరూ పజిల్ విసిరి కూర్చుకున్నారు. ఆ పజిల్ ని విప్పడానికే  జర్నలిస్టుల సంఘర్షణ. 

          సావిత్రి జీవితంలో గానీ, మిస్టర్ కేన్ జీవితంలో గానీ, ఒక పాత్ర (సావిత్రి లేదా మిస్టర్ కేన్) -  ఆ పాత్రకి ఎదురైన సమస్య – ఆ పాత్ర కనుక్కున్న పరిష్కారం – అనే కథా చట్రం లేదు. అందుకని ఈ కథా చట్రాన్ని వేరే పాత్రలతో కల్పించారు – జర్నలిస్టుల పాత్రలతో. కాబట్టి ఇవి జర్నలిస్టుల కథలయ్యాయి. ఈ జర్నలిస్టులు తవ్వుతున్న జీవితాలు ఫ్లాష్ బ్యాకులు. ఫ్లాష్ బ్యాకులెప్పుడూ కూడా కథలు కావని తెలిసిందే. అవి నడుస్తున్న కథకి కావలసిన సమాచారాన్నందించే వనరులు మాత్రమే. కాబట్టి వీటికి కథా లక్షణాలుండనవసరం లేదు, వుండవు కూడా. పాత్ర - పాత్రకి ఎదురైన సమస్య – ఆ పాత్ర కనుక్కున్న పరిష్కారం – అనే కథా చట్రం వుండక, డైరీ మాత్రంగా వున్నా సరిపోతుంది ఫ్లాష్ బ్యాక్కి.          

          కాబట్టి జర్నలిస్టుల కథ అనే ఒడ్డున, జర్నలిస్టులతో బాటే కూర్చుని, జర్నలిస్టులు చెరువులో పడుతున్న ఫ్లాష్ బ్యాకులనే చేపల్ని, చేతిలో వున్న పాప్ కార్న్ ని పక్కన పడేసి  చూశారు ప్రేక్షకులు. చేపలు కనువిందు చేస్తాయి. అవి అక్వేరియంలో వుంటే దేన్నీ దాయలేవు. ఉన్నదున్నట్టు అన్ని కోణాల్లో కనబడిపోతాయి. ‘గోల్డ్ ఫిష్ హేవ్ నో హైడింగ్ ప్లేస్’ అని జేమ్స్ హేడ్లీ ఛేజ్  రాసిన ఫేమస్ నవల్లో లాగా. కాకపోతే ఈ నవల్లో జర్నలిస్టే అక్వేరియంలో గోల్డ్ ఫిష్ లా వుంటూ - అవినీతి పరుల మీద రాస్తూంటాడు పాపం. ఈ బయోపిక్స్ లో జర్నలిస్టులు తాము ఒడ్డున వుండి -  సావిత్రి, మిస్టర్ కేన్ లనే గోల్డ్ ఫిష్షుల్ని చూపిస్తున్నారు. 

          ఒక సినిమాలో రెండు కథలు ఇమడవు. కథ ఎప్పుడూ లైవ్  పాత్రలతో ఆపరేటివ్ గా చూపించేదే అవుతుంది. డ్రీమ్ పాత్రలతో చూపిస్తే ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కథవదు గనుక, డ్రీమ్ టైమ్ అవుతుంది గనుక, దాన్ని డ్రీమ్ పాత్రలతో వాటి జీవితంగా చూపించాల్సి వుంటుంది. జర్నలిస్టుల పాత్రలు ఇప్పుడు రియల్ టైమ్ లో ఒక లక్ష్యం కోసం కథతో ఆపరేటివ్ గా వుంటున్న లైవ్ పాత్రలు. వీళ్ళతో మనం చూసేది లైవ్ టేకింగ్. కాబట్టి వీళ్ళదే కథయింది. సావిత్రీ,  మిస్టర్ కేన్ లు డ్రీమ్ పాత్రలు కాబట్టి, వాళ్ళవి డైరీ మాత్రపు ఫ్లాష్ బ్యాక్ జీవిత చిత్రణ లయ్యాయి. జర్నలిస్టుల పాత్రలు లేకపోతే, సావిత్రి జీవితాన్ని గానీ, మిస్టర్ కేన్ జీవితాన్ని గానీ కథలుగా చేయడం అస్సలు కుదరదు. కథలుగా చేయాలంటే వాళ్ళకి లక్ష్యం (గోల్) వుండాల్సిందే. సావిత్రి జీవితంలో గానీ, మిస్టర్ కేన్ జీవితంలో గానీ గోల్స్ ని పట్టుకోలేం. మహాత్మా గాంధీ జీవితంలో పట్టుకోవచ్చు. అందుకని కథగా చేయగల్గి ఆ బయోపిక్ హిట్టయింది. మన్మోహన్ సింగ్ జీవితంలో గోల్ వున్నా దాన్ని పట్టుకుని కథగా చేయలేదు, అది డాక్యుమెంటరీలా మిగిలింది. 

          నీతి : బయోపిక్స్ లో వ్యక్తుల జీవితాల్లో లక్ష్యంతో కూడిన కథల్లేక పోతే, వాటిని ఫ్లాష్ బ్యాకు డాక్యుమెంటేషన్ చేసి, వేరే ఇప్పటి లైవ్ పాత్రలతో, ఈ పాత్రల లక్ష్యంతో కూడిన కథ సృష్టించి – ఫాష్ బ్యాకుల్ని తవ్వే కార్యక్రమమే పెట్టుకోవాలి.  కథల్లేని బయోపిక్స్ కి ఈ ఫార్మాట్ తప్ప ఇంకో మార్గమే లేదు. ఇలాటి బయోపిక్స్ కి వచ్చే ప్రేక్షకుల కోసం, ఫ్లాష్ బ్యాక్స్ ని తవ్వే లైవ్ పాత్రలతో కథని సృష్టించి, ఈ రూపంలోనైనా కాంపెన్సేట్ చేయడం ధర్మం. ఈ కాంపెన్సేషన్ లేకుండా తీసివుంటే ‘మహానటి’ ని గానీ, దీని స్ఫూర్తి అయిన ‘సిటిజన్ కేన్’ ని గానీ వూహించలేం. ప్రేక్షకులకి సినిమా అనగానే బ్రెయిన్ కథకోసం రెడీ అయిపోతుంది. ఏదో ఒక రూపంలో కథ కన్పిస్తే - ఓకే బ్రదర్, అవర్ బ్రెయిన్ ఈజ్ యువర్ బ్రెయిన్ అంటుంది. ఇక్కడ జర్నలిస్టుల కథలతో ప్రేక్షకుల బ్రెయిన్ - ఓకే బ్రదర్, అవర్ బ్రెయిన్ ఈజ్ ట్రూలీ యువర్ బ్రెయిన్ – సూపర్ హిట్ గ్రాంటెడ్! – అంది. ఇద్దరి బ్రెయిన్స్ లో వైరింగ్స్ కలిశాయి. దర్శకులు వేరే మంకీ బిజినెస్ తో వైరింగ్ మార్చుకుని, ప్రేక్షకుల వైరింగ్ ని షార్ట్ సర్క్యూట్ చేసి బ్లాస్ట్ చేయలేదు. సినిమా కథంటే పరస్పరం వైరింగ్స్ కలవడమే. కానీ సినిమాలు  తీసేవాళ్ళకి ఎవరికో తప్ప, తమలో ప్రకృతి ఇచ్చిన వైరింగ్ వుందన్నవిషయమే తెలీదు! సినిమా బిజినెస్ క్రియేటివిటీతో ముడిపడి వుంది గనుక ఇది చాలా పెద్ద మిస్టరీ. ఈ బిజినెస్ లో తెలియని విషయాలు చాలా వుంటాయి. 

          ఇదంతా ప్రేక్షకులకి తెలియాల్సిన అవసరం లేదు. ఈ టెక్నికాలిటీస్ డైరెక్టర్లకి తెలిసి వుండాలి. తెలియకపోతే బయోపిక్కులు బాక్సాఫీసు బరిలోంచి జంప్ అవుతాయి. ఎక్కడో వున్న బయోపిక్ చెడిన ఆత్మ డైరెక్టర్ ని వెంటాడి వెంటాడి...డైరెక్టర్ బయోపిక్ రాయిస్తుంది.     ఇంతా చేసి ‘మహానటి’ స్క్రీన్ ప్లే స్ఫూర్తి ‘సిటిజన్ కేన్’ కూడా బయోపిక్కేనా అంటే కాదు. బయోపిక్ తీయాలంటే ఇతర బయోపిక్సే చూసి ఫాలో అవాలనేం లేదు, ఫిక్షన్ కథల్లోంచి కూడా కథనాల్ని తీసుకోవచ్చు. అది ఇన్నోవేషన్ (ఉన్నదానికే నూతన కల్పన) అవుతుంది. బయోపిక్స్ కి నూతన కల్పన ‘మహానటి’.
***
బయోపిక్స్ కి వార్నింగ్
      ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటిభాగం మంచి రేటింగ్స్ ఇచ్చినా జనం చూడలేదంటే రేటింగ్స్ తప్పని కాదు. ఈ మొదటి భాగం ఆభిరుచిగల ప్రేక్షకులు చూడదగ్గ కంటెంట్ తో వుంది. దురదృష్టవశాత్తూ అభిరుచిగల ప్రేక్షకులు తక్కువ వుంటారు. సినిమాలని అదే పనిగా వూర మాస్ కమర్షియల్స్ గా తీస్తూ వస్తూ అభిరుచిగల ప్రేక్షకుల్ని తగ్గించుకున్నారు. దీని ఫలితం బయోపిక్ మొదటి భాగం అనుభవించింది. అభిరుచిగల ప్రేక్షకులు తక్కువున్నారు, సినిమా బడ్జెట్ ఎక్కువుంది. ఈతేడా కొట్టింది. సినిమాల్లో ఉత్తమ విలువలుంటే, కలెక్షన్ల దృష్టితో కాకుండా, మంచి రేటింగ్స్ ఇచ్చి ప్రోత్సహించాల్సిందే. ఇదే జరిగింది. కానీ దీనికి మించి రాజకీయాలు, ట్రోలింగ్ వెల్లువెత్తాయి. ఈ రచ్చ ఎక్కువైపోయింది. 

          నెట్ లో రేటింగ్స్ చూసే జనులెవరు? నెటిజన్లు. నెటిజన్లని మించిన సాధారణ ప్రేక్షక జన సమూహం మౌత్ టాక్ మీద ఆధారపడతారు. ఈ తరం సాధారణ జన సమూహాని కేం కావాలి? అవే మాస్ మసాలా, లవ్, కామెడీ, స్టెప్పుల డాన్సులు, ఫైట్లు. బయోపిక్ తో మౌత్ టాక్ ఇలా రాలేదు. దీంతో రూఢీ అయిందేమిటంటే అభిరుచిగల సినిమాలు తీస్తే జనాలు రారని. బయోపిక్ లో ఎన్టీఆర్ సినిమాల్లో చేస్తున్న రకరకాల ప్రయోగాల గురించి ఒక పాత్ర చేత చెప్పిస్తారు - ఆయనే ఒక ప్రయోగ శాల అని. బయోపిక్ విడుదలయ్యాక మార్కెట్ ని అర్ధం జేసుకునే ప్రయోగ శాలగా పనికొచ్సింది. ఇదే బయోపిక్ మొదటి భాగం ఓవర్సీస్ లో పెద్ద సక్సెస్ అయింది. అభిరుచుల్లో తేడా! ఇక్కడ అభిరుఛీఛీ ప్రేక్షకులు, అక్కడ అభిరుచిగల ప్రేక్షకులు అన్నట్టు తేలింది. 

           రేటింగ్స్ చూసే నెటిజనుల్లో తెల్లారే సినిమాలు  చూసే నెటిజనులెవరు? యూతే... ఎడ్యుకేటెడ్ యూతే  ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోల నుంచీ, మార్నింగ్, మ్యాటినీ షోలకీ నిండి పోతారు. ట్విట్టర్లో సీను సీనుకీ ఒకటే అప్డేట్స్ కొడుతూ, సినిమా జాతకాన్ని సినిమా పూర్తవకముందే తమ స్టాండర్డ్స్ తో కొలిచి, లీక్ చేస్తూ వైరల్ చేసేస్తారు. ఇది పైరసీ కన్నాతక్కువ చేష్ఠేం కాదు. సినిమా నడుస్తూండగానే సినిమాని ఇలా బయటికి లీక్ చేయడం ఇదో పైరసీ. కనీసం మ్యాట్నీ వరకైనా బతకనీయడం లేదు సినిమాల్ని. ఇక ఫ్యాన్స్ అయితే సరే! 

          ఇక యూఎస్ నుంచి రెండు మూడు వెబ్సైట్స్ రివ్యూలు తెల్లారేసరికి వచ్చేస్తాయి. అక్కడ ముందు రోజే సినిమాలు విడుదలవుతాయి కాబట్టి. వీటికి ముందే నెటిజనుల ట్విట్టర్ రివ్యూలు వచ్చేస్తాయి. వాళ్ళే రేటింగ్స్ ఇచ్చేస్తారు. మొత్తం ఈ నెటిజనుల రివ్యూలూ రేటింగ్స్ వ్యవహారం చాలా గందరగోళంగా తయారయ్యింది. వీళ్ళ దృష్టిలో అభిరుచిగల సినిమాలకి స్థానమెక్కడ. ఎన్టీఆర్ ని రాయకీయంగానో, కులంగానో పక్కన పెట్టి, వీటికి అతీతుడైన ఒక జగమెరిగిన కళాకారుడిగా గౌరవించలేని అసహనం ఎక్కువైపోయిది. ఇక చాలా విషయాలు దాచారని కంప్లెయింట్స్. తీసింది బాలకృష్ణ. ఆయన తండ్రి గారిని గొప్పగానే చూపించుకుంటారన్నది కామన్ సెన్స్. ఇది తెలిసికూడా చర్చలేమిటి  నాన్ సెన్స్ కాకపోతే. 

          ఇక మార్కెట్ యాస్పెక్ట్ కొస్తే, సినిమా నెటిజన్ యూత్ టేస్టేమిటి? అవే మాస్ మసాలా, లవ్, కామెడీ, స్టెప్పుల డాన్సులూ, ఫైట్లే! ఇలా ఆనందపరుస్తున్న తమకి తెలిసిన స్టార్లు ఎందరో వుండగా, మధ్యలో పాత వేషాలతో ఈ ఎన్టీఆర్ ఎవరు? తెలిసిన వాడు కాదే? ఈయన సినిమాలు చూస్తూ పెరగలేదే? ఆఫ్ కోర్స్, ఎన్టీఆర్ ఒక సీఎం అని తెలుసు. టీడీపీ వాళ్ళ పెద్దాయనగా ఆ ఇమేజి ఒక్కటే మాకు ప్రింటయింది, రోజూ విగ్రహాలూ ఫోటోలూ చూస్తూ వుండడం వల్ల. ఇంకే ఇమేజీలూ మాకు ప్రింటు కాలేదు. ఆ ప్రింటయిన సీఎం ఎన్టీఆర్ ఇమేజీతో బయోపిక్ చూపండయ్యా బాబూ, అలాటి పొలిటికల్ బయోపిక్ చూపండీ!  ఈ కాలంలో మాకూ తెల్సు రాజకీయాలు, ఈ పాతకాలం సినిమా వేషాలు మాకేం తెల్సు, బోర్! 

          ఇలా జనరేషన్ గ్యాప్, కనెక్టివిటీ సమస్యలు కూడా తోడయ్యాయి. దీనికొక్కటే మంత్రం. యూత్ అప్పీల్ తో కొట్టడం. ‘మహానటి’ లో పాతకాలపు సావిత్రి జీవితాన్ని, కొత్త కాలపు విజయ్ దేవరకొండ, సమంతాల కథతో చూపించి యూత్ అప్పీల్ కొట్టి జనరేషన్ గ్యాప్ ని పూడ్చారు. సినిమాలకి ఎప్పుడూ మార్కెట్ యాస్పెక్ట్ = యూత్ అప్పీలే. ఎన్టీఆర్ కి ఇది తెలుసు. కనుకే వయసు మీద పడినా అడవిరాముడు, యమగోల, వేటగాడు లాంటి కుర్ర పాత్రలేసి, కుర్ర పాటలు పాడారు. అంతేగానీ గడిచిపోయిన తన తరం వాళ్ళకోసం, ఇంకా వాళ్ళ అభిరుచులకి తగ్గ పాత్ర లేస్తూ కూర్చోలేదు. ఏ కళయినా ముసలితనంతో వుండదు, కుర్రతనంతోనే వుంటుంది ఏ కాలానికా కాలం. కళ జడం కాదు, చైతన్యం ప్రకృతిలాగే. 

          రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ ‘రోబో- 2’ తో  మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగిందో,  అదే ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగంతో జరిగింది. ‘రోబో -2’ లో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన  పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని-  ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవి, క్రోనీ కేపిటలిజంతో బాటు. 
           
          నీతి : ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదు, నిత్యజీవితంలో వాళ్ళు చూసే  రాజకీయాలతోనే ఆర్గానిక్ గా, ప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయి, సైన్స్ ఫిక్షన్ తో కాదు.  

          ఇలాగే ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటిభాగం ఇదే మార్కెట్ యాస్పెక్ట్ ని మిస్సయింది. ఇప్పటి తరానికి ఎంతో కొంత పరిచయమున్న ఎన్టీఆర్ సమీప రాజకీయ జీవిత చరిత్రని చూపాలే గానీ, సుదూర నటజీవిత చరిత్రని కాదు. ఇది పార్టీ కార్యకర్తలకి కూడా వర్కౌట్ కాదు. ఇప్పటి పార్టీ కార్యకర్తలకి తమ పెద్ద నాయకుడి రాజకీయ జీవితం చూసి, ఏవైనా తెలియనివి వుంటే తెలుసుకోవాలని వుంటుంది. మార్కెట్ లోకి పంపాలని సినిమాలు తీస్తూ మార్కెట్ కేం కావాలో పరిశీలన చేయకపోతే ఇంతే. పైగా మార్కెట్ యాస్పెక్ట్ తో తీస్తే హిట్టవుతాయని గ్యారంటీ ఇస్తారా అంటారు. ఏ గ్యారంటీతో తీస్తూ 90% ఫ్లాపులిస్తున్నారో చెప్పలేరు. ఎంత సేపూ క్రియేటివ్ యాస్పెక్టే. మార్కెట్ యాస్పెక్ట్ లేని క్రియేటివ్ యాస్పెక్ట్ దండగ. పశ్చిమ బెంగాల్లో పదేళ్ళ క్రితం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ)  అక్కడి సినిమా మార్కెట్ రీసెర్చి నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించింది. ఊరూరా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయి సేకరించిన వివరాలు కూడా వున్నాయి. సినిమాలు ఎవరు చూస్తున్నారు, ఎన్ని చూస్తున్నారు, ఎలాటివి చూస్తున్నారు, ఎలా వుండాలి  వగైరా. ఫిక్కీ పనిలేక ఇదంతా చేసిందా? ఇలాటి రీసెర్చి ఇక్కడ వూహించలేం. 

          ఇక ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగం క్రియేటివ్ యాస్పెక్ట్ చూసినా టెక్నికల్ గా ఒక తప్పు, ఒక ఒప్పు వున్నాయి. అయితే వర్కౌటయ్యే ఒప్పుకాదు. ముందుగా బయోపిక్ రెండు భాగాలుగా తీయనే కూడదు. తీసిన చరిత్ర చరిత్రలో లేదు. ఎందుకు తీయలేదంటే ఒక వ్యక్తి గురించి ప్రేక్షకులకి ఒక సినిమా చాలు. ఇంకా డబ్బా కొడతాం రమ్మంటే రారు. మహాత్మా గాంధీతోనూ ఇంతే. మొదటిదాన్ని బ్యాలెన్సు లేకుండా ‘కథగా’ ముగించి, రెండో దాన్ని ఇంకో పాయింటుతో సీక్వెల్ గా తీస్తే వస్తారు. 

          ‘ఎన్టీఆర్’ బయోపిక్ ని రెండు భాగాలుగా తీసినప్పుడు మొదటి భాగంలో కథ లేదు, ఉపోద్ఘాతమే వుంది. ఉపోద్ఘాతం సినిమా ఎలా అవుతుంది, ప్రేక్షకుల మీద అఘాయిత్యం తప్ప. ఇది వివరంగా పైనే చెప్పుకున్నాం. ‘బాహుబలి’ మొదటి భాగం కథ ప్రారంభం కాని ఉపోద్ఘాతమైనా హిట్టయిందనా? దాని మేకింగ్ తో అదలాగే హిట్టవుతుంది. దాంతో ఈ బయోపిక్ కి పోలిక లేదు. బయోపిక్ మొదటి భాగాన్ని కథగా తీయాల్సిందే. అంటే నట జీవితంలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఒక ప్రధాన సమస్య తీసుకుని,  దాని చుట్టూ ఆయన సంఘర్షణ, పరిష్కారం చూపాల్సిందే. సినిమా జీవితంలో ఆయన ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏముందని. ఆయనే హీరో, అక్కడాయనకి ‘విలన్లు’ లేరు. రాజకీయ జీవితంలోనే ‘విలన్లు’ న్నారు. కథంతా ఇక్కడే వుంది – రాజకీయ జీవితంలో. కనుక మొదటి భాగం కథ కుదరక, ఆయన సినిమా జర్నీ తాలూకు డైరీ మాత్రంగానే మిగిలింది.  డైరీ సినిమా అవదని చెప్పుకున్నాం. 

          టెక్నికల్ గా ఒప్పు ఏమిటంటే, బయోపిక్ మొదటి భాగంతో బాటు రెండో భాగం కలుపుకుని మొత్తం ఒకే స్క్రీన్ ప్లే అనుకుంటే, ఈ స్క్రీన్ ప్లేలో మొదటి భాగం బిగినింగ్ విభాగం లక్షణాలని పుణికి పుచ్చుకుంది. ఎలాగంటే,  బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ అనే నాల్గు టూల్స్ వుంటాయని తెలిసిందే. ఈ నాల్గూ వున్నాయి : 1. ఎన్టీఆర్ పాత్ర పరిచయం, 2. సినిమా నేపధ్య వాతావరణం, 3. ఆయనలో రాజకీయ భావాల్ని పాదుకోల్పే ఉదంతాలతో (రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన, తిరుపతి భక్తులు వగైరా) సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు (పార్టీ ప్రకటన). 

          ఇది బిగినింగ్, అంటే కథకి ఉపోద్ఘాతం. అంటే ఈ బిగినింగ్ (ఉపోద్ఘాతం) తో మొదటి భాగం ముగిసింది. ఇక దీనితర్వాత రెండో భాగంలో మొదలయ్యేదే మిడిల్ విభాగం, అంటే కథా ప్రారంభం. రెండో భాగంలోనే కథకి ముగింపుతో కూడిన ఎండ్ విభాగం (ఇలా వుంటుందో లేదో తెలీదు).  

          కాబట్టి మొదటి భాగం స్క్రీన్ ప్లేలో బిగినింగ్ వరకూ వచ్చి ఆగిందన్నమాట. ఇవే బిగినింగ్ విభాగపు టూల్స్ తో ‘బాహుబలి’ మొదటి భాగం కూడా ఆగుతుంది. రెండో భాగంలోనే  కథా ప్రారంభం (మిడిల్), ముగింపూ (ఎండ్) వుంటాయి.

        అయితే మొదటి భాగం ‘బహుబలి’ లో కథ లేకుండా ఉపోద్ఘాతం వుండడం వేరు, ఇదే బయోపిక్ లో వుండడం వేరు. ఉపోద్ఘాతమైనా ‘బాహుబలి’ తట్టుకున్న కాన్వాస్, మేకింగ్ వేరు; బయోపిక్ మొదటి భాగం కాన్వాస్, మేకింగ్ వేరు. ఈ మొదటి భాగాన్ని పూర్తి కథే నిలబెట్టాలి. కానీ పూర్తి కథ కుదరని మొదటి భాగమిది. అప్పుడు ‘సిటిజన్ కేన్’  స్కీములో పెట్టినా ‘మహానటి’ ముద్ర పడుతుంది. ఇది బావుండదు. వేరే చూడాలి. ఇన్నోవేషన్ కి వేరే కథనరీతులున్నాయోమో రీసెర్చి చేసుకోవాలి. 

          కానీ మౌలిక ప్రశ్న ఉండనే వుంది :  బయోపిక్ కి రెండు భాగాలేమిటని. ఇక ఈ వ్యాసం ముగిస్తూండగా ఒక రచయిత ఫోన్ చేసి రెండో భాగంతో సందేహాన్ని వ్యక్తపర్చాడు. రెండో భాగం ఎక్కడ ముగిస్తారు? ఎందుకంటే మొదటి భాగాన్ని ఎన్టీఆర్ సతీమణి బసవతా రకమ్మ గారి పాయింటాఫ్ వ్యూలో, ఆమె జ్ఞాపకాలుగా ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు ప్రారంభించారు. మరి ఆవిడ ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక 1985లో అస్తమించారు. అంటే రెండోభాగం ఇంతవరకే వుంటుందా? పాయింటే! ఆవిడ పాయింటాఫ్ వ్యూ అయితే ఇంతవరకే వుండాలి. ఎన్టీఆర్ నిర్యాణం వరకూ వుండకూడదు. వుండాలంటే ఏం చేశారో చూడాలి. ఉండకపోతే 1985 వరకు ఆ కొద్ది కాలానికి కథే చేశారా లేక మళ్ళీ...???

సికిందర్