రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, జనవరి 2019, బుధవారం

725 : రివ్యూ


దర్శకత్వం : విజయ్ రాత్నాకర్ గుట్టే
తారాగణం : అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా, సుజాన్ బెర్నెర్ట్, ఆహ్నా కుమ్రా, అర్జున్ మాథుర్ తదితరులు
రచన : విజయ్ రాత్నాకర్ గుట్టే, మాయాంక్ తివారీ, కార్ల్ డన్, ఆదిత్యా సిన్హా, సంగీతం : సుదీప్ రాయ్, సాధూ తివారీ, ఛాయాగ్రహణం : సచిన్ కృష్ణ్
బ్యానర్ : రుద్రా ప్రొడక్షన్స్, బొహ్రా బ్రదర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సునీల్ బొహ్రా, ధవల్ గడా
విడుదల : జనవరి 11, 2019

***
          దేళ్ళపాటు దేశాన్ని ఏకధాటిగా పాలించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పాలనా తీరు మీద తీసిన బయోపిక్ వివాదాస్పదమవక ముందే దీనికాధారమని  చెప్పుకున్న పుస్తకం వివాదాస్పదమైంది (ఆధారమని చెప్పుకోవడం పూర్తి నిజం కాదు). అది నైతికతకి సంబంధించి. ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర నాలుగేళ్ళు  మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, మన్మోహన్ సింగ్ పనితీరునే, బలహీనతలనే బయటపెడుతూ పుస్తకం రాయడం విశ్వాసఘాతంగా విమర్శలొచ్చాయి. ఈ విషయంలో మాత్రం సంజయ బారులోని మీడియా సలహాదారు పక్కకెళ్ళి, పూర్వాశ్రమంలోని  ప్రొఫెషనల్ జర్నలిస్టు బయటికొచ్చాడు. తీరా చూస్తే పుస్తకంలో జనాలకి తెలియని కొత్త విషయాలు లేవు, సినిమాలోనూ లేవు. అంతా సద్దుమణిగింది. కాకపోతే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆజమాయిషీలో మన్మోహన్ ఎలా ఫీలయ్యేవారో మనం ప్రత్యక్షంగా చూడలేదు. అమూర్తంగా వుండిపోయిన ఆ భావోద్వేగాల్ని ఈ సినిమా దృశ్యరూపంలో పెట్టి ఆ లోటు తీర్చిందంతే. అయ్యోపాపం అన్పించేలా, గుండెలు కలుక్కుమనేలా మాజీ ప్రధాని పరిస్థితిని కళ్ళకి కట్టిన అనుపమ్ ఖేర్ కూడా, ఈ చారిత్రక అవసరాన్ని తీర్చారు. 

          
విచిత్రమేమిటంటే, కొందరు ప్రధానుల్ని చూస్తే కోపం వస్తుంది. మన్మోహన్ ఒక్కరినే చూస్తే అయ్యో పాపం అన్పిస్తుంది. అయ్యో పాపం అనుకుంటూనే పదేళ్ళు గడిపాం.  ఇందులో నాల్గేళ్ళ కాలాన్ని  సంజయ బారు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ గా తన జ్ఞాపకాలు రాస్తే, ఇదే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కింది. ఓ కొత్త దర్శకుడి చేతిలో ఇదెలా తెరకెక్కిందో చూసే ముందు, ఓసారి ఈ కొత్త దర్శకుడు విజయ రత్నాకర్ గుట్టే ఘనమైన బయోపిక్ కూడా చూద్దాం. ఇతను గత ఆగస్టులో నకిలీ పత్రాలతో పాల్పడిన రూ 34 కోట్ల జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ స్కాము కేసులో అరెస్టయ్యాడు. మహారాష్ట్ర నేత అయిన ఇతడి తండ్రి, వేలాది రైతుల పేర నకిలీ పత్రాలు సృష్టించి -  బ్యాంకులనుంచి రూ 5400 కోట్ల రుణాలు కాజేసిన కేసులో నిందితుడు. బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఇతడి తల్లి మొన్నే  జనవరి 13 న ఇతడి తండ్రి మీదా, మరో ఆరుగురు కుటుంబ సభ్యుల మీదా ఆస్తికోసం హింసిస్తున్నారని కేసు పెట్టింది. థ్రిల్లింగ్ బయోపిక్. ఇలాటి తన స్మెలింగ్ చేతులు మహానుభావుడి మీద వేశాడు.

కథ 
      2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ఘనవిజయం సాధించిన దృశ్యాలతో మొదలవుతుంది. అయితే ప్రధానిగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయత కారణంగా గద్దెనెక్క లేని పరిస్థితి. బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, ఉమాభారతిలు, శివసేన బాల్ థాక్రే తదితరులు సోనియాని తస్మాత్  జాగ్రత్తంటూ ప్రసంగాలు చేస్తారు. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం సోనియమ్మే రావాలని ఆందోళనలు చేస్తారు. సోనియా దీర్ఘంగా ఆలోచించి ఆర్ధికవేత్త, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రీ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుని ప్రతిపాదించడంతో కాంగ్రెస్ బడా నేతల్లో కలవరం పుడుతుంది. అక్కడేవున్న ప్రణబ్ ముఖర్జీ ముఖం వివర్ణమవుతుంది – ఒకప్పుడు తన జ్యూనియర్ అదృష్ట జాతకుడయ్యాడని. మొత్తానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. ప్రధానిగా మన్మోహన్ కార్యాలయంలోకి తన స్టయిల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు, చిన్నప్పటి ముచ్చట గుర్తుకొస్తుంది. తండ్రి తనని స్కూల్లో చేర్పిస్తూ పేరు చెప్పినప్పుడు- ఏం పేరూ అంటాడు మాస్టారు. ఏదోవొకటి రాసుకోండి, వీడేమైనా ప్రధాన మంత్రి అవుతాడా –అని తండ్రి అంటాడు. ఇలా ఆల్రెడీ ప్రధాని సీటు రిజర్వ్ అయిపోయిన ముచ్చట ప్రణబ్ ముఖర్జీకి తెలీక ఆ వివర్ణ ముఖారవిందమేమో.

          ఈ క్రమంలో ప్రభుత్వం మీద తన పట్టు వుండాలని సోనియా గాంధీ, జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేయడం మన్మోహన్ సింగ్ ని చికాకు పెడుతుంది. మేనిఫెస్టో హామీల అమలుకి జాతీయ సలహా మండలి అంటే రెండో అధికార కేంద్రమే. దీనికి తను తలొగ్గి పనిచేయాలి. పైగా సోనియా దూతగా  పులోక్ చటర్జీ (బాబీ పర్వేజ్) అనే బ్యూరోక్రాట్ నియమితుడై, యూపీఏ ప్రభుత్వపు కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు తీరుని పర్యవేక్షించడానికి రావడం చిర్రెత్తిస్తుంది. ఇంకా సోనియా రాజకీయ కార్యదర్శి రూపంలో అహ్మద్ పటేల్ (విపిన్ శర్మ) ప్రధాన మంత్రి కార్యాలయంలో హల్చల్ చేయడం మన్మోహన్ ని ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా పార్టీ వ్యక్తులు రెండో అధికార  కేంద్రంగా ప్రధానమంత్రి కార్యాలయంలో పెత్తనం చేస్తూంటే, చాటుగా తన మీద జోకులేస్తూంటే, మన్మోహన్ కిక ప్రధానిగా తన స్థానం అర్ధమైపోతుంది.

          ఈ దశలో బిజినెస్ స్టాండర్డ్ పత్రికా సంపాదకుడైన సంజయ బారు (అక్షయ్ ఖన్నా) ని పిలిపించుకుని మీడియా సలహాదారుగా నియమించుకుంటారు సింగ్. వీళ్ళది 30 ఏళ్ల గురు శిష్య సంబంధం. డాక్టర్ సాబ్ ని తిరగేసి మడతేసి చదివేయగలడు బారు. పాలనానుభవం లేని మన్మోహన్ కి చిట్కాలు నేర్పుతూంటాడు. మహాభారతంలో రెండు కుటుంబాలున్నాయని మన్మోహన్ అంటే, కాదు దేశంలో ఒకే కుటుంబం వుందని తను అంటాడు. ఇతడి మీద పీతూరీలు సోనియాకి యమ స్పీడుగా అందుతూంటాయి. ఐతే  అహ్మద్ పటేల్ ని కూడా యమ స్పీడుగా నియంత్రించగల మంత్రాంగం తెలిసిన వాడు బారు. 

          రెండో అధికార కేంద్రం నుంచి మన్మోహన్ ఇబ్బందులెదుర్కొంటూనే ఆర్థిక విధానాల రూపకల్పనల్లో పైచేయి సాధిస్తారు. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తన మానసిక పుత్రికైతే, ఈ క్రెడిట్ కూడా తనకి దక్కనివ్వదు రెండో అధికార కేంద్రం. ఇక కీలక అణు ఒప్పందం ఘట్టం ఎదురయ్యేసరికి తన తడాఖా చూపిస్తారు ప్రధాని. యూపీఏకి మద్దతిస్తున్న వామపక్షాలు అమెరికాతో ఈ అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వున్నాయి. మన్మోహన్ గనుక వెనుకడుగేయక పోతే మద్దతు ఉపసంహరించుకుంటారు. సోనియా వెనుకడుగేయమనే వొత్తిడి చేస్తూంటే, మన్మోహన్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఈ దెబ్బకి వామపక్షాలు పోయినా, సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ దేవుడు పంపిన దూతలా దిగుతారు. ఇలా మొదటి పాలనా కాలం (2004 – 09) మన్మోహన విజయంతో ముగుస్తుంది.

          రెండో పాలానా కాలానికి (2009-14) సంజయ బారు వుండరు. బారు మీద  మీడియాలో ఉద్దేశపూర్వక వ్యతిరేక కథనాలు ప్లాంట్ చేస్తూంటే, ఒకసారి వెళ్లి మేడమ్ ని కలవమని మన్మోహన్ చెప్తారు. నేను చెంచాగిరీ చేసే పార్టీ లీడర్ని కాను, మొండి పట్టుదలకి పోయే జర్నలిస్టునని రాజీనామా చేసి వెళ్ళిపోతారు బారు. 

          రెండో పాలనాకాలం మన్మోహన్ కి తెలియకుండా అవినీతితో పాపపంకిలమై పోతుంది.  ఇప్పుడు రాజీనామా చేయాలనుకోరు. చేస్తే దాని పరిణామాలు పార్టీ మీదా, పార్టీతో తన మీదా ఎలా వుంటాయో తెలుసు. ఈ అడకత్తెరలో పోకచెక్క నరకం అనుభవిస్తూనే రాజీ పడిపోతారు. దేశానికి నేనేమని చెప్పాలని అంటే, మీరు చెప్పక్కర్లేదు, పార్టీ చెప్తుందని సోనియా అనడం. కపిల్ సిబల్ ని దింపి 2జి, కోల్ గేట్ వగైరా స్కాముల్ని తిమ్మిని బొమ్మిని చేయడం.

          ఇక తను మూడోసారి ప్రధానిగా వుండనని ఎన్నికల ప్రచారం నుంచి      తప్పుకుంటారు మన్మోహన్. బిజెపి రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుంది. రెండో పాలనా కాలానికి తను అపజయ బాధ మిగుల్చుకుని మౌనంగా నిష్క్రమిస్తారు మన్మోహన్.

అక్షయ్ ఖన్నాతో దర్శకుడు
 ఎలావుంది కథ         కథలా లేదు, ఇదే సమస్య. చాలా విషయాలున్నాయి. విషయాలన్నీ కథగా లేవు. ఇది కథలా కాకుండా, డాక్యుమెంటరీలా, న్యూస్ బులెటిన్ లా సాగుతూనే వుంటుంది. ఎంతకీ కథ మొదలవదు. ‘బాహుబలి’ గానీ, ‘ఎన్టీఆర్ బయోపిక్’ గానీ మొదటి భాగాలు ఉపోద్ఘాతాలు మాత్రమే. కథలు కావు. కథలు రెండో భాగంలో మొదలవుతాయి. ‘బాహుబలి’ మొదటి భాగం కథలేని ఉపోద్ఘాతమైనా తట్టుకుందంటే దాని వ్యవహారం వేరు, మేకింగ్ వేరు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ని రెండు భాగాలుగా కాకుండా, ఒకే మూవీగా కథే చెప్పేసి వుంటే ఫలితాలు వేరేగా వుండేవి. కథకీ ఉపోద్ఘాతానికీ, కథకీ గాథకీ తేడాల పట్ల అప్రమత్తంగా లేకపోతే ఇలాగే వుంటుంది. అయితే మన్మోహన్ బయోపిక్ రెండు భాగాలుగా తీయాలనుకున్నది కాదు. అలాంటప్పుడు తీసిన ఒక్కదాన్నీ కథగా తీయక, దర్శకుడితో బాటు మరో ముగ్గురు రచయితలూ ఉపోద్ఘాతంలా రాస్తూ తీస్తూ కూర్చోవడంతో, ఇదొక సినిమానే కాకుండా పోయింది. న్యూస్ బులెటిన్ లా తయారయ్యింది. 


        ఇది బయోపిక్ అనుకుంటే దీని ఉద్దేశం మన్మోహన్ కి క్లీన్ చిట్ నిస్తూ సోనియాని వేరేగా చూపించడమని తెలిసిపోతూనే వుంటుంది. రెండు పాలనా కాలాల్లోనూ సోనియా పోషించిన తెరవెనుక పాత్ర దేశానికి తెలిసిన విషయమే. ఇప్పుడీ ఎన్నికల సమయంలో ఈ బయోపిక్ తో ఏవైనా రాజకీయ ఉద్దేశాలుంటే, ఈ కాలం చెల్లిన పాత విషయాలతో అవి నెరవేరవు. ఇక మొన్నటి  దాకా రాహుల్ గాంధీని అన్ ఫిట్ అంటూ వచ్చారు. అంతకంటే అన్ ఫిట్ గా రాజకీయంగా మన్మోహన్ వున్నట్టు చిత్రించారు. దీనికి సోనియా బాధ్యత లేదు. స్వాభావికంగా ఆయనంతే. ఆయన సమర్ధుడైన బ్యూరోక్రాట్ మాత్రమే. కానీ ఆ సమర్ధతనైనా ప్రదర్శించుకోలేని అశక్తత  సోనియా వల్లే ఎదురైంది. ఇవన్నీ ఎవరు కేర్ చేస్తారు ఈ డాక్యుమెంటరీ లేదా న్యూస్ బులెటిన్ 
చూస్తూ.

        కేర్ చేసే ప్రక్రియ వేరే వుంది. అదేమిటో చివర చూద్దాం. అయితే ఈ బయోపిక్ వల్ల నెరవేరే ప్రయోజనం ఏమైనా వుంటే ఇదొక్కటే – హైకమాండ్ వల్ల మన్మోహన్ పడ్డ అవమానాలకి ఆయన మనోభావాలు అప్పుడెలా వుండేవో, ఎలా లోలోపల అణుచుకుంటూ వ్యధననుభవించి వుంటారో మనం ప్రత్యక్షంగా చూసి వుండే అవకాశం లేదు. చూడాలన్పించే ప్రేక్షకులకి ఈ బయోపిక్ తో  ఆ కోరిక నెరవేర వచ్చు. ఆయా సమయాల్లో మన్మోహన్ ఈ బయోపిక్ లో చూపించిన విధంగానే బాధపడ్డారని నిర్ధారణగా చెప్పలేం. కానీ సన్నివేశాల పరంగా వీలైనంత లాజికల్ గా కల్పన చేసి  ప్రేక్షకుల ముందుంచారు. అనేక చోట్ల కళ్ళు చెమర్చేలా ఆయనలోని మనకి తెలియని వ్యక్తిగత కోణాన్ని ఆవిష్కరించారు. బయోపిక్ లో ఇతర విషయాలన్నీ తెలిసిన పాత వాటికే రీప్లే, ఇదొక్కటే కొత్తగా తెలిసే విషయం. వ్యక్తిగా మన్మోహన్ అంతరంగ చిత్రణ. దీనికే మనం ప్రభావితం అవుతాం.

ఎవరెలా చేశారు 
     మాజీ ప్రధాని భౌతిక అనుకరణే గాక, మానసిక లోకాన్నీ అనుపమ్ ఖేర్ నిరుపమానంగా కళ్ళకి కట్టారు. మన్మోహన్ మాటలకి తగ్గట్టుగా ముఖంలో భావాలుండవు. ఎప్పుడూ ఒకేలా వుంటుంది ఆయన వదనం. ఇందువల్ల అనుపమ్ ఖేర్ కి ఎక్స్ ప్రెషన్స్ తో బాధ తప్పినా, సమయోచితంగా పలికే మాటలతోనే భావోద్వేగాల్ని అందించాల్సిన భారం మీద పడింది. ఈ కష్టాన్ని కష్టపడి మోశారు. భౌతిక అనుకరణలో మన్మోహనే అన్పించారు. మన్మోహన్ మార్కు నడక మాత్రం సూపర్ ఇమిటేషన్. ఒక విషయంలో మాత్రం మన్మోహన్ చాలా నిష్కర్షగా వుంటారని చూపించారు. తనని కలవడానికి ఏ పని మీద ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా నసగకుండా, ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చేసి చేతులు జోడిస్తారు. ఆ వ్యక్తి ఇక గబుక్కున లేచెళ్ళిపోవడమే. మన్మోహన్ ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చేశాక మళ్ళీ మారు మాట్లాడానికి వుండదు.  ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కి కూడా ఇదే పరిస్థితి.  ఇలా వచ్చి కూర్చుని సమస్య చెప్పుకున్నారో లేదో, మన్మోహన్ నుంచి ఒక్క క్షణంలో రెండు ముక్కల్లో తేల్చివేత ప్లస్ నమస్కారం ఎదురయ్యేసరికి - అలా లేచెళ్ళిపోతారు అయోమయంగా. మన్మోహన్ అలా దండం పెట్టడం వెనుక – పైన హైకమాండ్ వుంది, నన్నొదిలెయ్యండ్రా బాబూ అన్న అర్ధముందేమో స్పష్టత లేదు. ఈ సన్నివేశాల్లో అనుపమ్ ఖేర్ బెస్ట్ అనిపించారు.

          అణు ఒప్పందం అంశంలో రాజీనామాకి సిద్ధపడినప్పుడు సోనియాతో సన్నివేశంలో బ్యాలెన్సుడుగా కన్పించే తనే, రెండోసారి ఎన్నికలప్పుడు తను ప్రచార సారధ్యం వహిస్తానంటూ మొండితనం ప్రదర్శించే ఘట్టంలో ఖేర్ మెరుస్తారు. మన్మోహన్ ఎంత చిన్న పిల్లవాడంటే – మీరిలా రాజ్యసభ సభ్యుడిగా పరోక్షంగా వుండి పోవడం కాదు, ముందుకొచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పార్టీని గెలిపించాలి, పార్టీలో మీకు ప్రత్యాన్మాయం లేదు – అని సంజయ బారు నూరిపోస్తే గానీ మన్మోహన్ కి ఇగో తన్నుకు రాదు. ఈ ఇగో ప్రదర్శనే సోనియాతో మొండితనం. కానీ ఎన్నికలు గెలిచి రెండోసారి ప్రధాని అయ్యాక, గెలుపు క్రెడిట్ ఆయనది కాదని పార్టీ అన్నప్పుడు- మన్మోహన్ మౌన ఆక్రందనని నటించిన ఖేర్ అద్భుతం. ఒక్క అణు ఒప్పందం విషయంలో హీరో తప్ప, మిగతా అన్ని విషయాల్లో మన్మోహన్ ని జీరో చేసే స్వపక్ష రాజకీయంతో మన్మోహన్ పూర్తిగా పాసివ్ పాత్రే. ఇలాటి సజీవ వెరైటీ పాసివ్ పాత్ర ఇంకే కాల్పనిక కథల్లోనూ కన్పించదు. ఈ వెరైటీ పాసివ్ పాత్రని అనుపమ్ ఖేర్ అర్ధవంతంగా పోషించారు.  

        ఆనుపమ్ ఖేర్ వెరైటీ పాసివ్ పాత్రయితే, సంజయబారుగా నటించిన అక్షయ్ ఖన్నా పక్కా చలాకీ యాక్టివ్ పాత్ర. సున్నిత హాస్యంతో సన్నివేశాల్లో హుషారు నింపేది తనే. అనుపమ్ ఖేర్ ని కంటికి రెప్పలా కాపాడే, పాపాయిలా ట్రీట్ చేస్తూ గుడ్ డాడీతనాన్ని ప్రదర్శించే,  శిష్యపరమాణువుగా ఖన్నా ఎక్సెలెంట్. మన్మోహన్ – సంజయ బారుల కెమిస్ట్రీ ఇలా వుండేదా అనేలా పాత్రచిత్రణ సాగింది. మన్మోహన్ ని ఆటలు పట్టిస్తూ గట్టిగా నవ్వే వ్యక్తి బారు ఒక్కడే అన్నట్టు వుంటుంది. అణు ఒప్పందం సందర్భంగా మన్మోహన్ (ఖేర్), బారు (ఖన్నా) ని పిల్చి- నువ్వెళ్ళి అమెరికా రాయబారితో ఏం మంతనా లాడేవ్? కే సెరాసెరా అంటూ ఏదో  కోడ్ లాంగ్వేజీ వాడేవట, ఏంటది? – అని బుంగమూతి పెట్టినప్పుడు-  బారు (ఖన్నా) పడీ పడీ నవ్వి- కే సెరా సెరా అంటే జరిగేది జరుగుతుందని అర్ధమండీ, అది హిచ్ కాక్ సినిమాలో పాట – అనగానే, మన్మోహన్ సతీమణి ఆ పాటందుకుని పాడేస్తే – మన్మోహన్ అమాయకత్వం బయటపడడం.  ఇలాటి కొంటెతనంతో వుంటుంది ఖన్నా పాత్ర, నటనా. ఇంకా ఈ పాత్రలో నటనా పరంగా ఫోర్త్ వాల్ ని ఛేదించి – ప్రేక్షకులవైపు తిరిగి కామెంట్లు విసిరే, ప్రేక్షకులకి వివరించే వ్యాఖ్యాతగా కూడా వుంటాడు. అయితే ముగింపుగా చివరి షాట్ లో మన్మోహన్ భవనంలోకి వెళ్తూంటారు. వెనుకనుంచి అక్షయ్ ఖన్నా ‘డాక్టర్ సాబ్’  అని పిలుస్తాడు. ఆయనకి వినపడక వెళ్ళిపోతూంటారు. మళ్ళీ పిలుస్తాడు. వినపడదు. ఇక ‘డాక్టర్ సాబ్!’ అని గట్టిగా అరుస్తాడు. ఇది బాగాలేదు. పెద్దాయన్ని అరుపులు అరిచి పిలవడం బాగా లేదు. బాధతో నిష్క్రమిస్తున్న పెద్దమనిషిని గద్దించడం అస్సలు బాగాలేదు. వినపడకపోతే దగ్గరికెళ్ళి మాట్లాడ వచ్చు. ఈ ముగింపు షాట్ చాలా బ్యాడ్ టేస్టు. 

           అయితే మన్మోహన్ ఈ బాధామయ నిష్క్రమణని చూపించిన విధానం కూడా ఆయన మనోవిశ్లేషణా యుక్తంగా లేక డొల్లగా వుంది. సినిమా పాత్ర ముగింపులో ఏదో నేర్చుకున్న సెన్స్ తోనే  వుంటుంది. ఇక్కడలా లేదు. సంజయ బారు ప్రకారం, మన్మోహన్ సింగ్ తన కింద జరుగుతున్న అవినీతిని చూసీ చూడనట్టు వుండడానికి హైకమాండ్ కారణం కాదు. ఆయన వ్యక్తిగత కారణమే వుంది. బ్యూరోక్రాట్ గా వున్నప్పుడు తను అవినీతి అంటని ఉన్నతాధికారిగా తనని తానూ కాపాడుకునే ఒక సిద్ధాంత నిష్ఠకి కట్టుబడే వారు. అదే సమయంలో ఆ సిద్ధాంతపు నిష్ఠని ఇతరుల మీద రుద్దకూడదని అనుకునే వారు. బ్యూరోక్రాట్ గా పనికొచ్చిన ఆ సిద్ధాంత నిష్ఠ, ప్రధాన మంత్రిగా పనికి రాదని తెలుసుకోలేక పోయారు. ఇప్పుడు కూడా బ్యూరోక్రాట్ గానే భావించుకోవడం వల్ల,  తన సిద్ధాంతపు నిష్ఠని ఇతరుమీదా అమలుచేయాలన్న ఆలోచన రాలేదు. వచ్చి వుంటే స్కాములు జరిగుండేవి కావేమో. జరిగిపోయాక రాజీనామా కూడా చేయలేని పరిణామాల్లో చిక్కుకున్నారు. తను మొదటిసారి మాత్రమే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. రెండోసారి కాదు. రెండోసారి యూపీఏని తనే అధికారంలోకి తెచ్చారు. తనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలాటిది తన ఈ కష్టార్జితం కేవలం తన సైకాలజీ వల్ల వృధా పోయిందన్నఎరుకతో, ఎవేర్నెస్ తో, ఒక పశ్చాత్తాపంతో  ముగించి వుంటే, మన్మోహన్ ఎంతో ఉన్నతంగా కన్పించేవారు. హైకమాండ్ నే దోషిగా నిలబెట్టాలన్న రాజకీయ ఉద్దేశాలుంటే ఇప్పుడున్న ముగింపు ఇంతే. 

          ఇంకొక్క ఆర్టిస్టు మాత్రమే ఈ బయోపిక్ లో ఆకట్టుకుంటారు. ఆమె మన్మోహన్ సతీమణి గురు శరణ్ కౌర్ గా నటించిన దివ్యా సేథ్ షా. సోనియాగాంధీగా నటించిన జర్మన్ నటి సుజాన్ బెర్నెర్ట్ పర్లేదు. సోనియా గాంధీ హిందీ మాడ్యులేషన్ కి డబ్బింగ్ ఆర్టిస్టు ఇంకా బెటర్. రాహుల్ గాంధీగా అర్జున్ మాథుర్ కుదర్లేదు. సీన్లు మూడే వుంటాయి. ప్రియాంకా గాంధీగా ఆహ్నా కుమ్రా ఓ మోస్తరు. ఇంకా పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం, గులాం నబీ ఆజాద్, శివరాజ్ పాటిల్, కపిల్ సిబల్, అహ్మద్ పటేల్, అర్జున్ సింగ్, నట్వర్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పేయీ, ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, నవీన్ పట్నాయక్, సీతారాం ఏచూరీ, ప్రకాష్ కారత్, నాటి అమెరికా  అధ్యక్షుడు జార్జి బుష్, నాటి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ మొదలైన నాయకులుగా;  జేఎన్ దీక్షిత్, ఎంకే నారాయణన్, బ్రజేష్ మిశ్రా మొదలైన బ్యూరోక్రాట్లుగా; ఎన్. రామ్, వీర్ సింఘ్వీ, అర్నాబ్ గోస్వామి మొదలైన పాత్రికేయులుగా  కొత్త కొత్త  నటులు కనిపిస్తారు. వీళ్ళతో వుండేవి ఒక సీను, లేదా ఒక షాట్ మాత్రమే. కానీ దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకి వేసిన జ్యూనియర్ నటుడు ఘోరమైన విగ్గు పెట్టుకుని, కింది దాకా లేని ప్యాంటు వేసుకుని జోకర్ లా వున్నాడు.   

          బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ నీటుగా వున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం సహా ఇతర లొకేషన్స్ అన్నీ రిచ్ గా వున్నాయి. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలుని ఓ మాదిరి సెట్ వేసి మేనేజి చేశారు. ఈ బయోపిక్ ని గంటా 50 నిమిషాల్లో ముగించారు. 

          ఏ మాటకామాటే చెప్పుకుంటే, కొత్త దర్శకుడికి ఎంత థ్రిల్లింగ్ బయోపిక్ వున్నా అవినీతికి సినిమా రంగంలో వెలివేత లేదు. మీటూకి తక్షణ బహిష్కారమే. ఇప్పుడు కొత్తగా మీటూ దెబ్బకి రాజ్ కుమార్ హిరానీ చేతిలో వున్న ప్రాజెక్టు కోల్పోయి కూర్చున్నాడు. మన్మోహన్ బయోపిక్ దర్శకుడికి  తన అవినీతితో ఇది ఎదురు కాలేదు. తను అవినీతిలో ఎంత రాణించినా, దర్శకత్వంతో నటింపజేసుకోవడం, సీన్లు తీయడం మాత్రం క్లాసుగానే  కానిచ్చాడు. ఒక్క సబ్జెక్టు తయారు చేసుకునే విషయంలోనే విఫలమయ్యాడు. అయితే, అవినీతి కుటుంబం నుంచి వచ్చిన వాడే, ఇంకో రాజకీయ కుటుంబం అవినీతికి పాల్పడిందని సినిమా తీయడమే కొసమెరుపు.

చివరికేమిటి 
       బయోపిక్ ని సినిమాలా తీయకుండా ఓ డాక్యుమెంటరీలా, న్యూస్ బులెటిన్ లా తీశాడు. ఇప్పుడు దేశంలో బయోపిక్ ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంతే జోరుగా చాలా మంది నష్టపోతారు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన బయోపిక్ అనే దృశ్యమాధ్యమంతో పరిచయం, అనుభవం లేనట్టుంది. బయోపిక్ స్క్రీన్ ప్లే కూడా మామూలు సినిమా స్క్రీన్ ప్లేలానే వుంటుందని తెలీనట్టుంది. తీస్తున్న బయోపిక్స్ లో కథకీ ఉపోద్ఘాతానికీ, కథకీ డాక్యుమెంటరీకి, కథకీ న్యూస్ బులెటిన్ కీ తేడాలు తెలీక ఏదో తీసేస్తున్నారు. ఈ సీజన్లో రాజ్ కుమార్ హిరానీ ఒక్కడే సంజయ్ దత్ జీవితం మీద ‘సంజు’ అనే బలమైన బయోపిక్ ని సినిమాలాగా తీసి 600 కోట్లు ఆర్జించాడు. సినిమాని సినిమాలాగా చూడాలని దబాయిస్తూంటారు. ముందు సినిమాని సినిమాలాగా తీయాలని మాత్రం బుర్రకెక్కదు. 

          సినిమా కోసం బయోపిక్ నైనా సినిమా కథగానే తీయకపోవడం ఇక్కడ జరుగుతున్న పొరపాటు. బయోపిక్ తో సినిమా అనే ప్రక్రియ ఒక్కటే సక్సెస్ అవుతుంది. డాక్యుమెంటరీలూ, న్యూస్ బులెటిన్ల ప్రసారాలూ కాదు. సినిమా అంటే కథ, కథ, కథే
 తప్ప, మరోటి కాదు! కథే కూర్చోబెడుతుంది, కథనే కేర్ చేస్తారు ప్రేక్షకులు. 

          మన్మోహన్ బయోపిక్ కి తీసుకున్న సంజయ బారు పుస్తకంలో ‘సినిమా’ లో చూపించిన మన్మోహన్ బయోపిక్ అంతా లేదు. సంజయ బారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దగ్గర పనిచేసిన కాలానికే (2004 – 2008) పుస్తకం పరిమితమైంది. మన్మోహన్ రెండో పదవీకాలంలో జరిగిన అవినీతి గురించి పుస్తకం చివరి మాటగా కొంత  ప్రస్తావించి వదిలేశారు, అంతే. 


        మన్మోహన్ అణు ఒప్పందంతో సాధించిన పై చేయితో ఇంటర్వెల్ వేసి ఫస్టాఫ్ ముగించారు. ఇంతవరకే పుస్తకం. దీని తర్వాత సెకండాఫ్ పుస్తకం కాని దర్శకుడి మస్తకం. సెకండాఫ్ లో చూపించిన వాటితో పుస్తకానికి సంబంధం లేదు. అయినా పుస్తకం ఆధారంగానే మొత్తం బయోపిక్ తీసినట్టు ప్రచారం చేసుకున్నారు. పైగా సంజయ బారు పాత్రని సెకండాఫ్ లో పొడిగిస్తూ కల్పన చేశారు. 

          సెకండాఫ్ లో మన్మోహన్ మళ్ళీ ప్రధాని అయ్యాక చూపించినవి దర్శకుడు అక్కడా ఇక్కడా సేకరించిన మీడియాలో వచ్చిన విడివిడి వార్తలే. ముగింపుగా వచ్చే అవినీతి స్కాము దృశ్యాలు కూడా వార్తా సేకరణనలే. ఫస్టాఫ్ కి ముగింపుగా  అణు ఒప్పందంతో విజయం, సెకండాఫ్ ముగింపుగా అనినీతి తో పరాజయంగా పెట్టుకుని, ఇదే గొప్ప స్క్రీన్ ప్లే డిజైన్ అనీ, దీంతో మన్మోహన్ బయోపిక్ కి సమగ్రత వచ్చేసిందనీ అభిప్రాయపడ్డాడు యాక్సిడెంటల్ దర్శకుడు. రాజకీయ ఉద్దేశాలతో తీసే సినిమాలేవీ సక్కదనంతో వుండవు. చెత్తంతా పేరుకుంటుంది. రాజకీయ ఉద్దేశాలకి వున్న మీడియా వెరైటీలు చాలవన్నట్టు సినిమాల మీద పడడం. 

          సంజయ బారు పుస్తకం ఒక పాయింటుతో సాగే రాజకీయ డ్రామా కాదు. ప్రధాని రోజువారీ కార్యకలాపాల్లో చోటు చేసుకున్న వివిధ ఘట్టాల వృత్తాంతం, వాటి వెనుక తనకి తెలిసిన నిజానిజాలు. బయోపిక్ తీస్తూ పుస్తకంలోని ఈ తోచిన ఘట్టాలు పేర్చుకుంటూ పోయారు. ఒకదానితో వొకటి సంబంధం లేని చిరు చిరు ఘట్టాలు. కారబ్బూందీ పొట్లాలు. ఓడిశా సీఎం ఆర్ధిక సాయం అడగడానికి వచ్చి వెళ్ళడం, పాక్ ప్రధానితో మన్మోహన్ రెండు ముక్కలు కాశ్మీర్ గురించి మాట్లాడడం, చంద్రఖర్రావ్ (కేసీఆర్) తెలంగాణా గురించి మీతో ఏమన్నారని ఒక నాయకుడు మన్మోహన్ ని అడగడం...ఇలా మన్మోహన్ తో పుస్తకంలో నచ్చిన బిట్లు ఏరుకుని వేసుకుంటూ పోయాడు. వీటి పూర్వాపరాలేమిటో తెలియజేయకుండా. వీటికి కథతో సంబంధమేమిటో అర్ధంగాకుండా. నట్వర్ సింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ సూట్ లోకి వెళ్ళబోతూ ఆగిపోతారు. షాట్ కట్ అయిపోతుంది. ఎందుకు ఆగిపోయారో చెప్పడు.  మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మన్మోహన్ ఆర్డినెన్స్ పత్రాలు చించెయ్యగానే కట్, అర్నాబ్ గోస్వామీ రాహుల్ ని ఇంటర్వూ చేసిన ఘట్టంలో అర్నాబ్ ఒక ప్రశ్నేదో అడగ్గానే కట్...బిట్టు బిట్టుకీ కట్ కట్టులు. ఏదో కాస్త పొడుగ్గా జరగాలి కాబట్టి ఇంటర్వెల్ ముందు అణు ఒప్పందం గురించిన కాస్త డ్రామా, ముగింపులో అవినీతి గురించిన ఇంకాస్తా డ్రామా. 

      ఈ నానాజాతి సమితి బిట్లలో మళ్ళీ ఎక్కడా రాని వ్యక్తుల్ని  ఘనంగా పరిచయం చేయడం – బ్యూరోక్రాట్లు పులోక్ ఛటర్జీ, ఎంకే నారాయణన్, జేఎన్ దీక్షిత్... జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ పరిచయం కాగానే, ప్రేక్షకుల వైపు తిరిగి – మీ మీద ఫైలుంది అంటారు. వామ్మో ఈయనేదో చేస్తాడనుకుంటాం. మనిషి మళ్ళీ కన్పించకుండా మాయం. ఇలా పే ఆఫ్ కాని బిల్డప్పులే. ఇలా వివిధ వార్తల నానాజాతి సమితిలా వుంటుంది స్క్రీన్ ప్లే అనే పదార్ధం. 

          బయోపిక్ స్క్రీన్ ప్లేకి  ఎప్పుడో ‘గాంధీ’ తీసిన రిచర్డ్ అటెన్ బరో ఒక మార్గం వేశాడు. ఇటీవల 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘లింకన్’ వుంది. ఇంకా చాలామంది తీసిన చాలా బయోపిక్ లు వున్నాయి. బయోపిక్ అంటే మామూలు సినిమా కథలాగే ఆ వ్యక్తి పాత్ర,  అది ఎదుర్కొనే సమస్య, కనుగొనే పరిష్కారం, చివర విజయమో అపజయమో, ఇంతే.

          బయోపిక్ అంటే పుట్టిందగ్గర్నుంచీ చచ్చిందాకా ఆ వ్యక్తి జీవితాన్ని పూసగుచ్చినట్టు చూపించడం కాదు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఒకే ఒక్క మలుపు, లేదా ఒక లక్ష్యం కోసం ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్య మాత్రమే సినిమాకి బయోపిక్ అవుతుంది. మహాత్మా గాంధీ లక్ష్యం స్వాతంత్ర్య సముపార్జన. దీనికి ప్రేరణ 1) దక్షిణాఫ్రికా రైల్లో జరిగిన అవమానం, అప్పుడు 2) సహాయ నిరాకరణోద్యమం, 3) క్విట్ ఇండియా - స్వాతంత్ర్య సిద్ధి, 4) మతకల్లోలాలు – మరణం. ఇంతే, శాఖోపశాఖలుగా విస్తరించిన మహాత్ముడి జీవితంలో ఈ నాల్గే ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ గా తీసుకుని, అజరామరమైన చలనచిత్రరాజాన్ని ప్రపంచానికందించాడు అటెన్ బరో. అంతేగానీ మహాత్ముడు ఎలా సత్యనిష్టుడో చిన్నప్పటి సీన్లేద్దాం, కుటుంబం సీన్లేద్దాం, ఆ బిట్లు వేద్దాం, ఈ బిట్లు తెచ్చి వేద్దామని కలగాపులగం చేయలేదు. మహాత్ముడి వ్యక్తిగత జీవితమే చూపించాలంటే,  ఆ పాయింటుతో అది వేరే బయోపిక్ అవుతుంది. ‘గాంధీ మై ఫాదర్’ అనీ గాంధీ మీద కోపం వచ్చేలా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తీయనే తీశాడు. 

      ఇలాగే స్పీల్ బెర్గ్ ‘లింకన్’ తీసినప్పుడు సినిమా కథగానే తీశాడు. వెండితెర వున్నది కథల కోసం తప్ప, గాథలతో, ఉపోద్ఘాతాలతో, డాక్యుమెంటరీలతో, న్యూస్ బులెటిన్ లతో, బుర్రలేని కాకమ్మ కబుర్లతో గలీజు చేయడానికి కాదు. వెయ్యి మంది చూస్తూ కూర్చునే హాల్లో వేళాకోళం వేషాలు కాదు. టికెట్లతో తిక్క వేషాలు కాదు. ‘లింకన్’ తీసినప్పుడు స్పీల్ బెర్గ్ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం – అగ్నిపరీక్ష లాంటిది – 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దీనికోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే (మన యాక్సిడెంటల్ దర్శకుడిలాగే )వాటిని పక్కన పడేశాడు. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. కసరత్తు చేస్తే కుదరదన్పించింది. రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలతో బయోపిక్ తీసి పెద్ద విజయం సాధించాడు ( బడ్జెట్ 65 మిలియన్ డాలర్లు,  బిజినెస్ 275 మిలియన్ డాలర్లు).

          1970 లలో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ని ముంచిన వాటర్ గేట్ కుంభకోణాన్ని కూపీలాగి పుస్తకం రాశారు ఇద్దరు జర్నలిస్టులు. ‘ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్’ అన్న పుస్తకం టైటిల్ తోనే గొప్ప సినిమా తీశారు. పుస్తకాన్ని స్క్రీన్ ప్లేగా మార్చే బాధ్యత హాలీవుడ్ లో ఆచార్యుడు లాంటి రైటర్ విలియం గోల్డ్ మాన్ తీసుకున్నాడు. అప్పటికే ఒక ఆస్కార్ అవార్డు తన ఖాతాలో వుంది. పుస్తకంలోని రెండో భాగాన్నితీసి అవతల పడేసి మొదటి భాగంతోనే స్క్రీన్ ప్లే రాశాడు. పుస్తకం రాసిన జర్నలిస్టులిద్దరు గోలగోల చేశారు. ఒక జర్నలిస్టు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇంకో స్క్రీన్ ప్లే కూడా రాశాడు. స్క్రీన్ రైటింగ్ అంటే జర్నలిజం కాదన్నాడు గోల్డ్ మాన్. స్క్రీన్ మీద జర్నలిజాన్ని చూడరన్నాడు. బిగ్ స్టార్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్, దర్శకుడు అలన్ పకూలా కంగారు పడి స్క్రీన్ ప్లే తీసుకుని నెలరోజులు అజ్ఞాతంలో కెళ్ళి పోయారు. దాంతో కుస్తీ పట్టారు. ఇలా కాదు, అలా వుండాలి...అలా కాదు, ఇలా చేద్దాం...రెండో భాగాన్ని ఇలా కలుపుదాం, కాదు అలా కలుపుదామని జుట్లు పీక్కుని పీక్కునీ ఏమీ చేయలేక పెద్దాయనే కరెక్ట్ అని, పెద్దాయన రాసిన శిలాశాసనాన్నే సినిమా తీశారు. ఎక్కడికో వెళ్ళిపోయి చరిత్ర కెక్కింది. ఎన్నో ఆస్కార్ అవార్డు లొచ్చి పడ్డాయి. ఆ స్టార్ కీ, దర్శకుడికీ కాక, పెద్దాయనకే ఇంకోటి పడింది. ఆల్ ది గోల్డ్ మాన్స్ మెన్. 

          మన్మోహన్ బయోపిక్  సగం బారు పుస్తకం, సగం దర్శకుడి మస్తకంగా వుందని చెప్పుకున్నాం. ఆయన పుస్తకంలోని అణు ఒప్పందాన్ని (మొదటి పాలనా కాలం) ఫ్లాష్ బ్యాకుగా పెట్టుకుని, తన మస్తకంలోని అవినీతి స్కాముల్ని (రెండో పాలనా కాలం) కథగా చేసుకుంటే సరిపోయేది. రెండో పాలనా కాలంతో కథ ప్రారంభించి, మధ్యలో మొదటి పాలనా కాలపు ఫ్లాష్ బ్యాక్ పూర్తి చేసి- రెండో పాలనా కాలంతో కథ ముగించేస్తే ఏ గొడవా లేకుండా పోయేది. 


        అంటే అవినీతికి సంబంధించిన పరిణామాలతో మన్మోహన్ ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు- అణు ఒప్పందంతో తన విజయానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకోవడం - ఆ జ్ఞాపకాల్లోంచి బయట పడ్డాక -  అవినీతి కథతో  అలాటి విజయాన్ని చవిచూడలేక ఓడిపోవడమనే ముగింపు అన్నమాట.

          మొదటి పాలనాకాలంతో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో  మొదట రెండో అధికార కేంద్రంతో సంఘర్షణ చూపించి, తర్వాత  అణుఒప్పందం చుట్టూ డ్రామా నడిపితే సరిపోతుంది. మిగతా నానాజాతి సమితి న్యూస్ రీల్ బిట్లన్నీ తీసి విలియం గోల్డ్ మాన్ లా అవతల పారేసినా అడిగే వాళ్ళుండరు. బారు పుస్తంలో రెండో అధికార కేంద్రంతో, అణుఒప్పందంతో వున్న మెటీరియల్ తప్ప మిగాతా ఏవీ బయోపిక్ కి పనికిరావు. పుస్తకంలో రెండో అధికార కేంద్రానికి సంబంధించి చాలా సమాచారముంది.  కేబినేట్ లో మంత్రులు తామే ప్రధాని అన్నట్టు వ్యవహరించడం, ఏకే ఆంటోనీ విదేశీ వ్యవహారాల నుంచీ రక్షణ వ్యవహారాల దాకా దేనితోనూ మన్మోహన్ తో ఏకీభవించక పోవడం, తన జ్యూనియర్ ప్రమోటయ్యాడని ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ ని లక్ష్య పెట్టకపోవడం, విదేశాంగ మంత్రిగా వాషింగ్టన్ వెళ్లి జార్జి బుష్ నీ, కండెలెజ్జా రైస్ నీ కలిసివచ్చాక ఆ సమావేశాన్ని మన్మోహన్ కి రిపోర్టు చేయకుండా మూడు రోజులు తప్పించుకోవడం...ఇలా చాలా వున్నాయి.    
  
          మన్మోహన్ మొదటి పాలనా కాలంలో అణు ఒప్పందం విజయం ప్రధానమైనదే. ఆ కాలంలో ఇంకా విజయాలున్నాయి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో బాటు, ఆర్టీఐ చట్టం, ఆధార్ కార్డు చట్టం, గ్రామీణ హెల్త్ మిషన్ ప్రాజెక్టు మొదలైనవి. వీటిని కూడా భాగం చేయాలి. 

          అప్పుడు మన్మోహన్ బయోపిక్- అవినీతి సమస్య, దాంతో సంఘర్షణ, పరాజయం అనే ప్రధాన కథగా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో వుంటూ – ఇందులో ఫ్లాష్ బ్యాకుగా అణు ఒప్పందపు విజయం వుండి - ఇబ్బంది పెట్టకుండా అర్ధవంతంగా సాగిపోయేది.

సికిందర్
https://telugurajyam.com/