రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 12, 2026

 

 

 

      సినిమా దర్శకత్వం ఒక ఆర్టు. ఆడియో విజువల్ ఆర్టు. దీంతో ఎందరెందరో దర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమతమ ప్రత్యేక శైలులతో, ముద్రతో, సంతకంతో గుర్తుండి పోతున్నారు. దీంతో వీళ్ళని అభిమానించే ప్రేక్షక వర్గంతో ఒఅ పర్మనెంట్  మార్కెట్  ఏర్పడిపోతోంది. నలభై ఏళ్ళు దాటినా చెక్కుచెదరని మార్కెట్. ఇంత శక్తిమంతమైనది ఇమేజి బిల్డప్. మరి ప్రేక్షక వర్గాన్ని ఇంతగా ప్రభావితం చేసే విజువలార్టుని తమ ఇమేజి క్రియేషన్ కి వినియోగించుకుంటున్న వర్ధమాన దర్శకులెంత మంది?  ఏదో గుండు గుత్తగా సినిమాలు తీసేసి గుర్తింపు లేకుండా, అనామకంగా మిగిలి పోవడమేనా? ఎవరో ఒకరు అద్భుత శైలితో ప్రామిజింగ్ గా ఎంట్రీ ఇచ్చినా, తర్వాతి సినిమాలో ఆ శైలి ఎందుకు కనపడదు? గొప్ప దర్శకుల పర్మనెంట్ ప్రేక్షక వర్గంలో వీళ్ళలో ఎంతమంది వుంటున్నారు? టెక్నిక్ పరంగా ఆ గొప్ప దర్శకుల్ని గుర్తిస్తున్నారా? లేక వాళ్ళ కథలు బావుంటాయనీ, తారాగణం బావుంటుందనీ, ఇలా పైపై ఆకర్షణలు మాత్రమే చూస్తున్నారా? చాలా వరకూ ఇదే జరుగుతోంది. కాబట్టి ఇవి సీరియస్ గా వేసుకోవాల్సిన ప్రశ్నలు. వేసుకుని కళ్ళు తెరవాల్సిన అవసరం.

      ఒక సినిమా హీరో ఢిల్లీలో జాతీయ అవార్డు అందుకోవడానికి రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడను కుందాం. ట్రైను ఎక్కాక ఆ ట్రైను బయల్దేరి వెళ్తోందనుకుందాం. అప్పుడు బయట ఆ స్టేషన్ సహా ట్రైను లోపలి వాతావరణాన్ని ఎలా చిత్రీకరిస్తాడు వర్ధమాన దర్శకుడు లేదా మేకర్?

స్టేషన్ కి హీరో చేరుకోగానే బయట అభిమానుల కోలాహలం, తోపులాట, గోలగోల. లోపల ప్లాట్ ఫాం మీద అతన్ని చూసిన ప్రయాణీకుల కోలాహలం, తోపులాట, గోలగోల. ఎలాగో హీరో తోసుకుంటూ ట్రైను ఎక్కేస్తే ట్రైను లోపల కోలాహలం, తోపులాట, గోలగోల. ఉక్కిరి బి క్కివుతూ హీరో అలసిపోయి సీట్లో కూలబడడం...

అప్పుడు ఈ చిత్రీకరణ అంతా చూసి - ‘నో న్నో!! ...బెత్తం తీసుక్కొడతా అలా తీశావంటే! ముందు వెళ్ళి  జీవితం తెలుసుకో, తర్వాత వచ్చి జీవం పోయ్ సినిమా ఆర్టుకి!’ అని కేకేలేస్తాడు పై లోకాల్లోంచి సత్యజిత్ రే!

ఎందుకంటే సత్యజిత్ రే ఇలా తీశాడు దృశ్యాన్ని - ఉత్తమ్ కుమార్ని సినిమా హీరోగా చూపిస్తూ ‘నాయక్’ తీసినప్పుడు- జాతీయ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ ప్రయాణం కట్టే సీను ఇలా వుంటుంది... ఈ సినిమాకి శబ్ద సౌందర్యమే ప్రధానం. ఎందుకంటే ఆ రైలు ప్రయాణంలో అలాటి పాత్రలుండడం వల్ల శబ్ద సౌందర్యమలా కుదిరింది. 1960 లలోనైనా ఇప్పుడైనా, ఎప్పుడైనా, సంపన్న సమాజం రణగొణ ధ్వనులకి దూరంగా, ఏసీ గదుల్లో నిశ్శబ్ద వాతావరణంలో, నింపాదిగా జీవనం సాగించుకుంటూ వుంటుంది. ఏసీ రైల్లో కూడా అంతే! సంపన్నులు ఏసీ ట్రైన్లో ప్రయాణిస్తూ, వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వుంటే అంతటా సైలెన్సే కదా? దీన్నర్ధం జేసుకుంటేనే కదా దర్శకుడు రిచ్ క్లాస్ సొసైటీ కథని దాని తాలూకు నేపధ్యంలో, ప్యూరిటీతో మనకి అందించి మైమరపించగలడు?
కనుక ఏసీ కూపేలో బయటి శాబ్దాలేవీ అస్సలు విన్పించవు, ఇంజన్ శబ్దంగానీ, పట్టాల శబ్దం గానీ ఏ మాత్రం వినిపించవు. రైలు కూత కూడా వినిపించదు. ఇలా శబ్దాన్ని ఎగవేయడానికి - మొదట్లో ట్రైన్ ఎక్కడానికి స్టేషన్ లోకి  హీరో వస్తున్న దృశ్యాన్ని కూడా ఏసీ కూపేలో  దించిన అద్దాల్లోంచే చూపించారు. లోపలి నుంచి మనం కూడా చూస్తున్నాం కాబట్టి, సహజంగానే బయటి శబ్దాలు వినపడకుండా అయింది. అసలు కథలోకి మొట్ట మొదట రైలు దృశ్యం వచ్చినప్పుడు, నేరుగా ఏసీ కూపేల్లో రిచ్ ప్రయాణీకుల రాక తో, ఇంటీరియర్స్ లోనే సైలెంట్ గా ఓపెనవుతుంది.

ట్రైను నిశ్శబ్దంగా స్మూత్ గా సాగిపోతూంటే, మనం కూడా కథతో పాటు అంతే స్మూత్ గా ఆహ్లాదంగా సాగిపోతున్నట్టు ఫీలవుతాం. కూపేలో ఎవ్వరూ స్వరం పెంచికూడా మాట్లాడరు, అరవరు, కేకేసి కేటరింగ్ ని పిలవరు. ఇది ట్రైను కాదు, విమానం అన్నట్టు ఎక్స్ క్లూజివ్ గా  వుంటుంది సంపన్న జీవుల కథ చూపించడం కోసం. ఇక నేపధ్య సంగీతం ఎప్పుడుంటుందో, వున్నప్పుడు విన్పిస్తోందే లేదో అన్నంత పొదుపుగా వుంటుంది. శబ్ద నియంత్రణతో సత్యజిత్ రే సృష్టించిన ఈ సాంకేతిక ఔన్నత్యాన్ని, ఇదిచ్చే అనుభూతినీ ఇక్కడ తెలుసుకోవడం కంటే, చూసి అనుభవించాల్సిందే. ఇది అనుభవించారా నేటి మేకర్లు? అంతర్ద్రుష్టి తమకే మేరకుంటోంది? సినిమాల్ని చూస్తున్నారా, చదువు తున్నారా?

స్మితా పాటిల్ తో శ్యాం బెనెగల్ తీసిన ‘భూమిక’ మాత్రం? 6 నిమిషాల ప్రారంభ సీనుని 41 షాట్లతో ఎందుకు తీశారు, ఏఏ అర్ధాలతో తీశారు బెనెగల్? 1. మిడ్ షాట్ లో బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తున్న అమోల్ పలేకర్, సిగరెట్ ముట్టుంచుకోవడానికి అగ్గిపెట్టె తీసి ఆగిపోతూ కిందికి చూస్తాడు. అప్పుడు లో- యాంగిల్లో కారు దిగుతున్న స్మిత కన్పిస్తుంది. అతను తనని తాను ఆమెకంటే ఉన్నతంగా భావించుకునే రకం కాబట్టి, పైనుంచి కిందికి ఆమెని  చూస్తున్నట్టు ఒకే లో - యాంగిల్ షాట్ వేశారు. కింద సపరేట్ గా వాళ్ళిద్దర్నీ కలుపుతూ హై యాంగిల్ షాట్స్ వేయలేదు. వేస్తె అర్ధం మారిపోతుంది.

2. ఆమె మెట్లెక్కి ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా అతడి సజెషన్ లో అదే లో- యాంగిల్ షాట్ తలుపు దగ్గర్నుంచి వుంటుంది. ఆమె సజెషన్ లో అతణ్ణి చూస్తున్నట్టు కింది నుంచి హై యాంగిల్ షాట్ వేయలేదు. ఎందుకంటే తలెత్తి తన కంటే అతడ్ని ఉన్నతంగా ఆమె చూసే ప్రసక్తే లేదు కాబట్టి. 

3. ఆమె అలాగే కిందికే చూసుకుంటూ వచ్చి, తలుపు దగ్గర అప్పుడు అతడి మీద ఓ లుక్కేసి లోపలికి వెళ్తున్నప్పుడు, అతడితో సమంగా మీడియం క్లోజప్ లోకి వస్తుంది. ఇప్పుడింకా ఘర్షణ మొదలవని మామూలు స్థితి కాబట్టి, సమంగా మీడియం క్లోజప్ లోకొచ్చింది. తర్వాత ఘర్షణ మొదలయ్యాక ఆమె మామూలు మీడియం క్లోజప్ లో వుండదు, ఫైర్ బ్రాండ్ గా బిగ్ క్లోజప్స్ లో వుంటుంది!

ఇలా మొదటి సీను ఆరు నిమిషాల్లో ఇంకా 38 షాట్లు ఇలాగే పాత్రల మారిపోతున్న మానసిక స్థితిని  చూపిస్తూ కథ చెప్తాడు బెనెగల్. సీన్ అంటే పాత్రల మానసిక స్థితిని కెమెరా చూడ్డమే. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర  వున్నమానసిక స్థితీ, దాంతో ఆ పాత్ర ఎలా ఫీలవుతోందీ ఆ ఫీలూ - మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తున్నాయని బెనెగల్ చెప్పడం.

గొప్ప దర్శకుల ఈ అంతర్ద్రుష్టి ఎప్పుడో దర్శకత్వంలో స్థిరపడ్డాక ఏర్పడలేదు. అంతర్ద్రుష్టిని డెవలప్ చేసుకునే దర్శకులయ్యారు. మరి నేటి మేకర్లు? కథల మీద కథలు తయారు చేసుకుని పెట్టుకుంటారు. కానీ అసలు ఆ కథలతో తమ విజన్ ఏమిటి, పర్మనెంట్ ప్రేక్షక వర్గాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఏ ఇమేజి తమకుండాలని కోరుకుంటున్నారు ఏమైనా ఆలోచిస్తున్నారా?

అందుకని ప్రముఖ సినిమా సమీక్షకుడు, ప్రచురణకర్త సూర్య ప్రకాష్ జోస్యుల ఎంతో శ్రమించి, మేకర్స్ కి తమకో ఇమేజిని డెవలప్ చేసుకోవడం కోసం, ఒక విలువైన పుస్తకాన్ని మార్కెట్ లోకి తెచ్చారు. ‘ఫిల్మ్ మేకర్స్ కి మాత్రమే - సులువుగా గొప్ప ఫిల్మ్ మేకర్స్ టెక్నిక్స్ తెలుసుకోండి’ అన్న టైటిల్ తో. 196 పేజీలున్న ఈ పుస్తకం ధర 249 రూపాయలు.

ఇందులో కె విశ్వనాథ్ నుంచీ వంశీ వరకూ, రాజ్ కుమార్ హిరానీ నుంచీ అనురాగ్ కశ్యప్ వరకూ, అటు పాశ్చాత్యంలో క్రిస్టఫర్ నోలన్ నుంచీ మైఖేల్ బే వరకూ, 25 మంది ప్రసిద్ధ దర్శకుల కళా జీవితం మొత్తాన్నీ వడబోసి, సారం తీసి, సంగ్రహంగా ముందుంచారు. దీన్ని మినిమలిస్టిక్ (కనిష్ట వాదం) అప్రోచ్ అన్నారు. అంటే మొత్తం వాళ్ళ కళా జీవితాన్ని సింప్లీఫై చేసి నాలుగు వాక్యాల్లో చెప్పడం. అంటే ఎంతో చదివి తెలుసుకునే శ్రమ లేకుండా. సత్యజిత్ రే సినిమాల్ని పరిశీలించి, సింపుల్ గా ఆయన్ని కెమెరా పట్టుకున్న మానవతా వాది అనేశారు. కె. విశ్వనాథ్ సినిమాల్ని పరిశీలించి -‘విశ్వనాథ్ తన సినిమాల్లో ప్రేక్షకుల ఊహాశక్తినే నమ్మారు, ఆయన నిశ్శబ్దాన్నే అతి పెద్ద సంభాషణగా మలిచారు’ అని తేల్చారు. 

ఇలా ఒక్కో దర్శకుడ్ని ప్రసిద్ధి చేసిన అనితరసాధ్య టెక్నిక్స్ ఏమిటో మినిమలిస్టిక్ అప్రోచ్ తో సూటిగా చెప్పుకొస్తూ, ప్రతీ దర్శకుడికీ వుండే విజువల్ సిగ్నేచర్ (సంతకం) ఏమిటో కూడా చెప్పారు. ఉదాహరణకి సత్యజిత్ రే సంతకం చూస్తే - ‘లాంగ్ టేక్స్, లైట్ అండ్ షాడో ప్లే, సింపుల్ కంపోజిషన్స్, హ్యాండ్- డ్రాన్ టైటిల్స్’ కనిపిస్తాయినీ, అదే విశ్వనాథ్ సంతకంగా చూస్తే, ‘క్లోజప్స్, ఆచారాన్ని ప్రతిబింబించే  ఫ్రేమ్స్, భారతీయ నృత్యం ఒక తిరుగుబాటు కావడం, ఎర్తీ టోన్స్’ కనిపిస్తాయనీ అన్నారు. హిందీలో అనురాగ్ కశ్యప్ సంతకం చూస్తే, ‘గ్రాఫిక్ హింస, నియాన్- నోయర్ లైటింగ్, లాంగ్ టేక్స్, మెటా రిఫరెన్సెస్’ తో వుంటుందనీ పేర్కొన్నారు. అలాగే మైఖేల్ బే సంతకం చూస్తే- ‘గోల్డెన్ అవర్ ఎక్స్ ఫ్లోషన్స్, 3600 హీరో షాట్స్, హైపర్ యాక్టివ్ ఎడిటింగ్ అండ్ కెమెరా మూవ్ మెంట్, స్లో- మో హీరోయిక్ వాక్’ అని చెప్పారు.

ఇంకా ఎస్ ఎస్ రాజమౌళి, మణిరత్నం, వెట్రి మారన్, వంశీ, సంజయ్ లీలా భన్సాలీ, ఇమ్తియాజ్ అలీ, ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్, మార్టిన్ స్కార్సెసీ, స్టీవెన్ స్పీల్ బెర్గ్, జేమ్స్ కామెరూన్, చార్లీ చాప్లిన్ ...ఇలా విభిన్న జానర్లని పోషించిన దర్శక మహాశయుల కళా వ్యక్తిత్వాన్ని (ఈ పదం తప్పు కావొచ్చు) సులభతరం చేసి నాలుగు మాటల్లో నేటి మేకర్స్ ముందుంచారు సూర్య ప్రకాష్.

ఇంతేకాదు, ఇంకా ఆయా దర్శకుల్ని ఏ ఫిలాసఫీ లేదా ఏ భావజాలం నడిపిస్తోందీ చెప్పారు. ‘మధ్యతరగతి ఒక సెట్ కాదు, మైండ్ సెట్’ అని ఫిక్స్ అయి వంశీ సినిమాలు తీశారనీ, ‘సాధారణ మనిషి జీవితం లోని అసాధారణ క్షణాలని గాథలుగా మార్చే క్రియేటర్’ అల్ ఫాన్సో క్వారోన్ అనీ చెప్పారు. ఇలా 25 మంది దర్శకులని నడిపిస్తున్న ఫిలాసఫీ ఏమిటో స్పష్టం చేశారు.

ఇలా టెక్నిక్, విజువల్ సిగ్నేచర్, ఫిలాసఫీ ఈ మూడు పార్శ్వాలు వున్నప్పుడు దర్శకుడికి ఓ ఇమేజీ స్థిరపడుతుందని అర్ధం జేసుకోవచ్చు. మేకర్లు ఈ పుస్తకాన్ని ఇంకెలా చూడాలి? నేటి ఒక్కో మేకర్ ఒక్కో జానర్ లో కృషి చేస్తున్న పరిస్థితి లేదు. ఏ జానర్ పడితే ఆ జానర్  సినిమాలు తీస్తూ దేంతోనూ ఒక ఇమేజిని సృష్టించుకోలేక పోతున్నారు. డార్క్ కామెడీ అంటారు, నెక్స్ట్ రోమాంటిక్ కామెడీ అంటారు, ఇంకా నెక్స్ట్ యాక్షన్ అంటారు, హార్రర్ అంటారు... ఇలా జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్పించుకునే ఎందుకూ పనికిరాని దుస్థితిలో వుంటున్నారు. ఒక జంధ్యాల, ఒక ఈవీవీ సత్యనారాయణ, ఒక వంశీ లాగా కామెడీ దర్శకుల్లేని లోటు వుందనీ, కనుక ఈ జానర్ దర్శకుడుగా ఎందుకు పేరు తెచ్చుకోరని అన్నామనుకోండి, మొహం ఎటో తిప్పుకుంటారు. ఇలాటి వర్గానికి ఈ పుస్తకం పనిచెయ్యదు.

నిజంగా ఆసక్తి, అవగాహన వున్న ఒక జానర్ ని నమ్మి, ఆ జానర్ దర్శకుడుగా బ్రాండ్ నేమ్ తో ఓ పాతిక ముప్ఫయ్యేళ్ళు పర్మనెంట్ మార్కెట్ ని సృష్టించుకుని, జీవితాంతం దాని ఫలితాల్ని అనుభవించాలనుకుంటే మాత్రం ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఈ పుస్తకం ఏదో చదివి వదిలెయ్యడం గాక, చదివి ఈ పుస్తకంలా అవ్వాలి. అప్పుడే అవ్వాలనుకున్న మేకర్ అవుతారు. ఇందులో ఆయా జానర్స్ కి పేరుబడ్డ దర్శకుల ప్రస్తావనే వుంది. రోమాంటిక్ జానర్ లో కృషి చేయాలనుకుంటే మణిరత్నం, సంజయ్ లీలా భన్సాలీనీ, లేదూ హై కాన్సెప్ట్ బిగ్ యాక్షన్ జానర్ అనుకుంటే రాజమౌళినీ, మైఖేల్ బేనీ పాటించ వచ్చు. ఇలా ఏ జానర్ కి ఆ దర్శకుడి సంతకాన్ని ఫోర్జరీ చేసినా ఏం కాదు. సినిమాల్ని కాపీ కొడితే కేసవచ్చేమో గానీ, సంతకాల్ని ఫోర్జరీ చేస్తే ఎవరూ పట్టుకోరు. ఆయా జానర్ దర్శకుల టెక్నిక్, సంతకం, ఫిలాసఫీ –ఈ మూడూ ఆధారంగా జేసుకుని బ్రాండ్ ఇమేజిని సృష్టించుకోవచ్చు.

ఈ పుస్తకం పేజీలకి పేజీలు  చదవడానికి ఇబ్బంది అన్పించేలా మ్యాటర్ తో నిండిపోయి లేదు. పేజీకి నాల్గే లైన్లు విషయం వుంటుంది. మిగతా ఖాళీ అంతా హై క్వాలిటీ లైనార్ట్ తో బొమ్మలు నిండిపోయి వుంటాయి. కనుక పేజీలు కంటికింపుగా, రిలీఫ్ గా వుంటాయి. చివరి 35 పేజీలు  ఇంకెందరో దర్శకుల ఫిల్మ్ మేకింగ్ కోట్స్ ఇచ్చారు. ఇవి కూడా ఉపయోగపడతాయి. వర్ధమాన మేకర్స్ కెరీర్ భద్రత కోసం సూర్యప్రకాష్ జోస్యుల దేశంలోనే ఇలాటి తొలి గైడ్ లా రూపకల్పన చేసిన ఈ బుక్ ని,  ‘హ్యాండ్ బుక్ ఆఫ్ డిసిప్లిన్’ గా దగ్గరుంచుకుంటే పోయేదేమీ లేదు, వృత్తి బానిస సంకెళ్ళు తప్ప!

 9704683520 కి ఫోన్ చేసి పుస్తకం పొందవచ్చు.

-సికిందర్

 


Saturday, January 10, 2026


 

          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో ‘పాతాళభైరవి’ తర్వాత ‘దొంగరాముడు’ పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై డెబ్భై యేళ్ళు దాటింది. ఈ డెబ్భై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. సినిమాల్లో పదేళ్ళకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. అప్పటి దేశభక్తి ముందు ఇంకా అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతోతొలివ్యాపార యుగపు (1971 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే పతనమైన విలువలు!

            యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తేఅప్పుడు ఇప్పటి మలి వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరిగిపోతూ వుంటుంది.

నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే.

ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి వ్యాపార యుగంలోనూ గత పదేళ్ళ క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోని విలువలవైపు  ప్రయాణం కడుతోంది.

అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

'దొంగరాముడు' మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, చౌకబారు విలువల ప్రస్తుత మలి వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలుతోంది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. మేరా నామ్ జోకర్లో రాజ్ కపూర్ పాడినట్టు – ‘ఈ సర్కస్ అంతా ఓ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే...’ అంటూ పాట! ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

‘రాజా సాబ్’ రాజ్ కపూర్ పాటలాగా మారేక కూడా, దర్శకుడు మారుతీ పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయని చెప్పుకుని ఆత్మవంచన చేసుకోకుండా, ఈ మలి వ్యాపార యుగపు దైన్యం గురించి సీరియస్ గా చింత  చేయాల్సిన అవసరముందని గుర్తించాలి.

-సికిందర్

 

 

Saturday, December 6, 2025

1405 : స్క్రీన్ ప్లే సంగతులు

డియర్ రీడర్స్,  ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ స్క్రీన్ ప్లే సంగతులు కోసం మీ నుంచి రోజూ మెసేజులు, కాల్స్ వస్తున్నాయి. ఈ ఆలస్యం అనివార్యంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందే … కారణం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’’ పరిస్థితే.

నిన్న డిసెంబర్ 5 తేదీ అనూహ్యంగా ‘అఖండ 2’ విడుదల  వాయిదా పడడంతో, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రన్నింగ్ కి బ్రీతింగ్ స్పేస్ పెరిగినట్టయ్యింది. అయితే ఈ బ్రీతింగ్ స్పేస్ లో ఆక్సిజన్ పీల్చగల్గే స్థితిలో వుందా? బాక్సాఫీసు  అగ్రిగేటర్ సాచ్నిక్ ప్రకారం విడుదల తేదీ నుంచీ అన్ని భాషల్లో వసూళ్ళు పడిపోతూ వచ్చి నిన్న తొమ్మిదవ రోజుకి  12% ఆక్యుపెన్సీ తో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిర్మాతలు, హీరో ప్రెస్ మీట్ పెట్టి పుష్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పుడు ఈ బ్రీతింగ్  స్పేస్ లో ఏం చేసి ఆక్సిజన్ అందించగలరు. చేసిందంతా డీఎన్ఏ లాగా డిజిటల్ ఫార్మాట్ లో సినిమాలో ఫిక్స్ అయిపోయింది. దాన్ని మార్చలేరు. మార్పు చేర్పులన్నీ ముందుగా స్క్రిప్టు దశలోనే  జరగిపోవాలి. కనుక స్క్రిప్టు దశలో ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అన్నవి  తెలుసుకోవాలి. అక్కడే తెలుస్తుంది ఈ పరిస్థితికి కారణం. అంతేగానీ నవంబర్ లో విడుదల చేయడం మంచిది కాదు, అందులోనూ జనాల దగ్గర డబ్బులుండని చివరి రోజుల్లో విడుదల చేశాం- వంటి బాహ్య పరిస్థితుల్ని చెప్పుకుంటే లోపల్నుంచి మార్పు ఎప్పటికీ రాదు. ఓవర్ గా పోకుండా మంచి ఫిల్ గుడ్ మూవీ తీసినా ఆడకపోతే ఇంత కష్టపడి చేయడమెందుకు- స్టాండర్డ్  టెంప్లెట్లో  మాస్ సినిమాలే తీసుకోవచ్చని నిర్మాత చెప్పడం కూడా సరి కాదు. తీసింది పక్కా క్లాస్ జానర్ ఫీల్ గుడ్ మూవీ కాదు, మాస్ జానర్ లోనే ఫీల్ గుడ్ జానర్ ని కలిపి తీశారు. తీసినప్పుడు విధానం తెలుసుకోక తప్పులో కాలేస్తూ పోయారు.

  ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫీల్ గుడ్ కి మాస్ మసాలా జానర్ కలిపిన మిశ్రమంతో అసలు జరిగిందేమిటి? ఎలాజరిగింది? ఎందుకు జరిగింది? దీనికి తరుణోపాయమే మిటి?...ఇవి తెలియజేయడానికి సినిమా వసూళ్ళ పరిస్థితి చూసి గత ఆరు రోజులూ ఆపాల్సి వచ్చింది ఈ స్క్రీన్ ప్లే సంగతుల్ని…ఇప్పుడు ఈ కింద డీప్ ఎనాలిసిస్ లో తప్పొప్పుల్ని తెలుసుకుందాం…

A. కథేమిటి?


1. 2002 లో ఆంధ్రాకింగ్ సూపర్ స్టార్ సూర్య కుమార్ కథ :  సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) 100 వ సినిమా పూర్తి చేయడానికి నిర్మాత దగ్గర ఫైనాన్స్ లేక తనే 3 కోట్ల రూపాయల కోసం విఫలయత్నాలు చేసి, చివరికి ఇల్లమ్మేయడానికి సిద్ధపడతాడు. ఇంతలో అతడి ఎక్కౌంట్ లో 3 కోట్ల రూపాయలు పడతాయి. ఎక్కడిదీ డబ్బు? ఎవరు వేశారు ఎక్కౌంట్ లో? మేనేజర్ (రాజీవ్ కనకాల) ఆరా తీస్తే వేసినతని ఊరూ పేరూ తెలుస్తాయి. ఈ సాగర్ ఎవరని అడిగితే, సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అంజి (శ్రీనివాస రెడ్డి) చెక్ చేసి, ఈ సాగర్ అనే అతను సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్తాడు. రాజమండ్రి దగ్గర గోడపల్లి లంకలో వుంటాడని చెప్పి, ఇతను తనకి తెలుసనీ అతడి గురించి చెప్పడం మొదలెడతాడు.

2. ఫ్లాష్ బ్యాక్ - 1 : సాగర్ గురించి అంజి చెప్పే కథ : చిన్నప్పట్నుంచీ  సాగర్ సూర్య ఫ్యాన్. చిన్నప్పుడు  తండ్రి సింహాద్రి (రావు రమేష్) తో థియేటర్ కొస్తాడు. ఆ రోజు సూర్య కొత్త సినిమా విడుదల. టికెట్లు దొరకవు. టికెట్లు పంచుతున్నఅంజి సింహాద్రికి టికెట్లు నిరాకరిస్తాడు. ఈ టికెట్లు కటౌట్లు పెట్టిన, టపాసులు పేల్చిన ఫ్యాన్స్ కేనని చెప్పేస్తే, వెంటనే చిన్న పిల్లాడయిన సాగర్ ఎవరూ ఊహించని విధంగా కటౌట్ మీదికెక్కేసి ‘ఆంధ్రాకింగ్’ బ్యానర్ కట్టేస్తాడు. ప్రేక్షకుల హర్షాధ్వానాల మధ్య అంజి సింహాద్రికి టికెట్లు ఇచ్చేస్తాడు. తండ్రితో కలిసి సాగర్ సూర్య కొత్త సినిమా చూసి ఎంజాయ్ చేస్తాడు. 

3. సూర్య కథ -2 : ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న సూర్య - ‘నా అభిమాని నాకే డబ్బులు పంపించాడా?’ అని అతడ్ని కలవాలంటాడు. ‘సాయపడింది అతను, రుణ పడింది నేను. నేను వెళ్ళి  తీరాలి’ అని బయల్దేరతాడు ఎవరు చెప్పినా ఆగకుండా.

కారులో ఆ వూరు చేరుకుంటూ మధ్యలో  ఓ హోటల్ దగ్గరాగుతాడు. తూఫాను వల్ల వర్షం కురుస్తూ వుంటుంది. ఆ హోటల్లో టీవీ న్యూస్ వస్తూంటుంది. కొందరు జర్నలిస్టులు ఆందోళన చేస్తూంటారు. జర్నలిస్టు ఈశ్వర్ (రాహుల్ రామకృష్ణ) మీద సూర్య ఫ్యాన్స్ దాడి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇందుకు  ఆంధ్రా కింగ్ సూర్యే వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూంటారు. సూర్య అక్కడికి చేరుకుని క్షమాపణలు చెప్తాడు. ఈశ్వర్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అని కూడా తెలుస్తుంది. మరి నువ్వు నామీద అలా ఎందుకు రాశావని సూర్య అడిగితే, సాగర్ కి తెలియాలనే రాశానంటాడు.

4. ఫ్లాష్ బ్యాక్ -2 : సాగర్ గురించి ఈశ్వర్ చెప్పే కథ : థియేటర్ ముందు సూర్య మరో కొత్త సినిమా రిలీజ్ రోజు. ప్రాంగణం ప్రేక్షకులతో ఫ్యాన్స్ తో కోలాహలంగా వుంటుంది. ఇప్పుడు యువకుడుగా ఎదిగిన సాగర్ హంగామా చేస్తూంటాడు. వెంట ఫ్రెండ్ ఈశ్వర్ వుంటాడు. ఆ థియేటర్ ఓనర్ పురుషోత్తం (మురళీ శర్మ) కొడుకు రంగా (యజుర్వేద్) తన ఫ్రెండ్స్ తో  సాగర్ కి వ్యతిరేకంగా వుంటాడు. సాగర్ తో బాటు వీళ్ళందరూ ఒకే కాలేజీలో స్టూడెంట్స్. ఇప్పుడు రంగా ఫ్రెండ్ ఒకడు సూర్య కటౌట్ ని  పడేసే ప్రయత్నం చేస్తాడు. వెంటనే సాగర్ పెద్ద సాహసం చేసి ఆ కటౌట్ పడిపోకుండా చూస్తాడు. ఇంతలో సినిమా బాక్సు రాలేదని ఎవరో చెప్పేసరికి థియేటర్ లోకి పరిగెడతాడు. అక్కడ సూర్య కొత్త సినిమా రిలీజ్ కి అక్కసుతో వుంటాడు రంగా. అతడితో మాటామాటా పెరిగి, ఈ సినిమా ఫ్లాపయితే కాలేజిలో మీరేం చెప్పినా  చేస్తాననీ, అలాగే సూపర్ హిట్టయితే తను ఏం చెప్పినా చెయ్యాలనీ పందెం కాస్తాడు సాగర్. ఇంతలో ఒకడు వచ్చి బాక్సు రాకపోవడంతో షో క్యాన్సిల్ అయిందని చెప్పేసరికి, సాగర్ కోపంతో థియేటర్ అద్దం పగలడతాడు. ఆ పగిలిన అద్దం లోంచి లోపలున్న పురుషోత్తం కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) కనిపించేసరికి ఆమె అందానికి స్టన్ అవుతాడు. ఆమె పక్కకు జరిగేసరికి మళ్ళీ అటు అద్దం పగలగొడతాడు. ఆ పగిలిన అద్దం లోంచి ఆమె చూసేసరికి  ప్రేమలో పడిపోతాడు.

థియేటర్ అద్దాలు పగులగొట్టినందుకు లాకప్ లో వుంటాడు సాగర్, ఈశ్వర్ తో బాటు. అక్కడ లవ్ మూడ్ లో వుంటే కవిత్వం చెప్పి ఎత్తి పొడుస్తాడు ఈశ్వర్. సాగర్ తండ్రి వచ్చి విడిపించుకు పోతాడు. వాళ్ళ వూరు గోడపల్లి కరెంటు లేని లంక. పడవలో నది దాటి చేరుకోవాలి. ఇంటి దగ్గర సాగర్ తల్లి తులసి వుంటుంది.

ఇదయ్యాక,  కాలేజీలో రంగాతో కలబడతాడు సాగర్- సూర్య సినిమా కలెక్షన్స్  తక్కువ చెప్పి ప్రచారం చేస్తున్నందుకు. ఈ గొడవతో ప్రిన్సిపాల్ సాగర్, ఈశ్వర్ లిద్దరికీ కమ్యూనిటీ సర్వీస్ శిక్ష వేస్తాడు. ఇద్దరూ క్యాంటీన్ లో బల్లలు తుడవడం, సప్లయర్ పనులు చేయడం చేస్తూంటారు. అప్పుడు క్యాంటీన్ కొచ్చిన మహాలక్ష్మితో సాగర్ లవ్ ట్రాక్ మొదలవుతుంది. కొత్త సినిమా రిలీజ్ కి సాగర్ కి టికెట్లు దొరక్కపోతే మహాలక్ష్మి ఇప్పిస్తుంది. అప్పుడు అడుగుతుంది సూర్య అంటే ఎందుకింత పిచ్చి అని. సాగర్ చెప్పడం మొదలెడతాడు.

5. ఫ్లాష్ బ్యాక్ - 3: సాగర్ చెప్పే తన చిన్నప్పటి కథ : తండ్రి స్కూల్లో చేర్పించడానికి తీసుకుపోతాడు.  హెడ్ మాస్టర్ సాగర్ కి పరీక్ష  పెడతాడు. నత్తి వల్ల  సమాధానం పలకలేక పోతాడు సాగర్. హెడ్ మాస్టర్ ఫెయిల్ చేసి పంపేస్తాడు. ఇంటికి తీసుకొచ్చి చితకబాదుతాడు తండ్రి సింహాద్రి. ఏడ్చేస్తున్న సాగర్ కి టేప్ రికార్డర్ లో సూర్య మోటివేట్ చేస్తూ పాడే  గేయం వినిపిస్తుంది. దాంతో ఎక్కడలేని శక్తి వచ్చేసి నత్తి పోతుంది. దీంతో అప్పట్నుంచీ సూర్యకి ఫ్యాన్ అయిపోతాడు సాగర్.

6. ఫ్లాష్ బ్యాక్ -4 : సాగర్ గురించి ఈశ్వర్ చెప్పే కథ కంటిన్యూ : సాగర్ మహాలక్ష్మి ఇంటికెళ్ళి ఆమె తండ్రిని సర్ప్రైజ్ చేస్తాడు. మహాలక్ష్మి కంగారు పడుతుంది. అక్కడే వున్న రంగా అడ్డుకుంటాడు. సాగర్ తమ లంకలో తిరునాళ్ళు జరుగుతున్నాయని, తప్పకుండా రావాలనీ  ఆహ్వానించి వెళ్ళి పోతాడు. 

తిరునాళ్ళకి మహాలక్ష్మి వస్తుంది. అప్పుడే ఇటు సమీపంలో సూర్య  సినిమా షూటింగ్ జరుగుతోందని సాగర్ వెళ్ళబోతున్న వాడల్లా, మహాలక్ష్మిని చూసి డైలమాలో పడతాడు. ముందు షూటింగ్ కి వెళ్ళి  రమ్మని పంపించేస్తుంది.

లొకేషన్ లో లోపలెక్కడో షూటింగ్ జరుగుతూంటే మేనేజర్ (రఘుబాబు) ఇలా వచ్చిన సాగర్ ఎవరో తెలుసుకుంటాడు. ఇంతలో సూర్యకి చక్కర కేళీలంటే ఇష్టమని తెలుసుకుని పరిగెడతాడు సాగర్. అరటి తోటలో గెల కోసుకుని వస్తూంటే రంగా, అతడి గ్రూపు ఎటాక్ చేస్తారు. వాళ్ళని చిత్తు చేసి వెళ్ళి, అరటి గెల మేనేజర్ కి అందించి మెప్పు పొందుతాడు సాగర్.

తిరిగి తిరునాళ్ళ కొచ్చిన సాగర్, మహాలక్ష్మితో క్లోజ్ గా గడుపుతాడు. ఆ రాత్రి వాళ్ళ మహాలక్ష్మి థియేటర్ నేమ్ బోర్డు పక్కన ‘ఐ లవ్ యూ’ అని నియాన్ లైట్ల డిస్ ప్లే పెట్టి ఎంజాయ్ చేస్తాడు. థియేటర్ లో బాక్సు సెక్షన్లో  మహాలక్ష్మితో ప్రైవేటుగా కూర్చుని సినిమా చూస్తాడు. థియేటర్ లో వెతుక్కుంటూ వచ్చిన ఆమె తండ్రి పురుషోత్తంకి సాగర్, మహాలక్ష్మిల వ్యవహారం తెలిసిపోయి గొడవకి దిగుతాడు. ఆమె అన్న సాగర్ ని పట్టుకుని కొడతాడు. ఆవారా ఫ్యాన్ బ్యాచ్ కి ఏం అర్హత వుందని ప్రేమిస్తాడని సాగర్ ని ఘోరంగా తిడుతూ అవమానిస్తాడు పురుషోత్తం. సాగర్ ఛాలెంజీ విసురుతాడు- తమ లంకలో బ్రహ్మాండంగా 70 ఎంఎం డిటిఎస్ థియేటర్ మహాలక్ష్మి పేరుతోనే కట్టి, సూర్య నూరవ సినిమా రిలీజ్ చేసి, మహాలక్ష్మిని చేసుకుని చూపిస్తానని ఛాలెంజీ చేస్తాడు. సాగర్ కి పిచ్చిపట్టిందని విభేదించిన  ఈశ్వర్ తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతాడు.

7. సెకండాఫ్ :  సూర్య కథ -2 : రాత్రి తూఫాను వర్షంలో సూర్యతో చేరుకుని మహాలక్ష్మి థియేటర్ ని చూపిస్తాడు ఈశ్వర్. సూర్య సినిమాలు రిలీజ్ అయినప్పుడు సాగర్ ఎలా హంగామా చేస్తాడో చెప్పుకొస్తూంటే,అతడి కళ్ళు వినైల్ బోర్డు మీద పడతాయి. ఆ బోర్డు మీద మహాలక్ష్మి పెళ్ళి ప్రకటన వుంటుంది. 

దీంతో కంగారుపడి సూర్యని మహాలక్ష్మి ఇంటికి తీసికెళ్తాడు ఈశ్వర్. ఆ పెళ్ళిలో ఇలా ఎందుకు చేశావని మహాలక్ష్మిని ప్రశ్నిస్తాడు సూర్య. సాగర్ మోసం చేశాడని చెప్పుకొస్తుంది మహాలక్ష్మి.

8. ఫ్లాష్ బ్యాక్ -5 :  సాగర్ గురించి మహాలక్ష్మి చెప్పే కథ : మహాలక్ష్మి థియేటర్ బుకింగ్ క్లర్క్ (సత్య) సాగర్  థియేటర్ కట్టడానికి 3 కోట్లు అవుతుందని లెక్క వేసి చెప్తాడు. సాగర్ బ్యాంకు లోన్ కోసం వెళ్తే అక్కడ పని  జరగదు. మహాలక్ష్మి తన నగలు తెచ్చి ఇవ్వబోతే తీసుకోడు. ఇక డబ్బు ఎక్కడా పుట్టక, లంకలోనే ఓపెన్ ఏర్  టూరింగ్ టాకీస్ కడతాడు. కరెంటు కోసం జనరేటర్ ఏర్పాటు చేస్తాడు. థియేటర్ కట్టడానికి డబ్బులు కూడబెట్టడా నికి టూరింగ్ టాకీస్ ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా నడుపుతూంటే, రంగా వచ్చేసి ఎటాక్ చేసి తగులబెట్టేస్తాడు. 

దీంతో వూరుకోక సాగర్ ఇసుక వ్యాపారం మొదలెడతాడు. అతడికి వూరంతా తోడ్పడతారు. ఆ ఇసుక మీద సంపాదించిన డబ్బుతో అనుకున్న థియేటర్ కట్టి, కరెంటు రప్పించి, థియేటర్ ప్రారంభోత్సవం కోసం కొత్త సినిమా తెద్దామని వెళ్తే, రంగా ప్రోద్బలంతో డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడు. ఇక సూర్య మేనేజర్ సాయం తీసుకుందామని నగరాని కెళ్ళి కలుస్తాడు. అక్కడ సూర్యకి 3 కోట్లు పుట్టక నూరవ సినిమా ఆగిపోయిందని తెలుసుకుని డిస్టర్బ్ అవుతాడు. తిరిగి వచ్చేసి 3 కోట్ల డబ్బు కోసం థియేటర్ ని పురుషోత్తంకే అమ్మకానికి పెడతాడు. బదులుగా మహాలక్ష్మిని వదులుకుంటా నంటాడు. పురుషోత్తం సంతోషించి సాగర్ కి ఆ డబ్బు ఇచ్చి పంపేసి,  మహాలక్ష్మికి తను అనుకున్న సంబంధం చేయడానికి పూనుకుంటాడు.

9. సూర్య కథ -3 : జరిగిందంతా విన్న సూర్య, తనకోసం సాగర్ చేసిన త్యాగంతో కదిలిపోతాడు. సాగర్ ని వదులుకోవద్దని చెప్పి మహాలక్ష్మి పెళ్ళి మాన్పిస్తాడు. సాగర్ ని కలవడానికి పెరిగిన తూఫాను వర్షంలో బయల్దేరతాడు.  తూఫాను బీభత్సానికి గోడపల్లి వాసులు సాగర్ కట్టిన థియేటర్లో తలదాచుకుంటారు. సూర్య అలా రావడంతో షాకైన సాగర్ - సూర్యల మధ్య మొదటిసారి కలుసుకున్న ఈ సీనులో తనంటే సాగర్ అభిమానం, త్యాగం, ఆత్మవిశ్వాసం చూసి, సాగర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందని తెలుసుకుని, ఆశీర్వదించి నిష్క్రమిస్తాడు. ఇంటికి వెళ్ళి, ఇల్లమ్మేసి జీరో నుంచి స్టార్ట్ అవుదామని మేనేజర్ కి చెప్తాడు. 

B. దర్శకుడి పాయింటాఫ్ వ్యూతో పిక్చరైజేషన్ :


50 కోట్లతో నిర్మించినట్టు చెబుతున్న ఈ సినిమా కథ, సాగర్  మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోవడాన్ని సవాలుగా తీసుకుని అందుకు థియేటర్ నిర్మించి, దాన్ని తన అభిమాన స్టార్ సూర్య ఆగిపోయిన సినిమా పూర్తి చేయడానికి అమ్మేసి, మహాలక్ష్మితో ప్రేమని త్యాగం చేసుకోవడంగా, హృద్యమైన ముగింపుతో వుంది.   

కథకి పదేళ్ళ క్రితం తను ప్లాన్ చేసిన విధంగా, సాగర్ పాత్ర జీవితంగా, అనుకున్న ఫీల్ గుడ్ మూడ్ తో, అనుకున్న బయోపిక్ గా, తన పాయింటాఫ్ వ్యూ పెట్టుకుని, అందుకనుగుణంగా జాగ్రత్తగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు మహేష్ బాబు. సాగర్ కథని ముగింపు తప్ప, ఫ్లాష్ బ్యాక్స్ తో చెప్పుకొచ్చి, భావోద్వేగాలతో బలమైన క్లయిమాక్స్ కి చేర్చాడు. కమర్షియల్ మాస్ సినిమాని ఫీల్ గుడ్ మూవీగా కూడా అందించవచ్చన్న ఒక ఇన్నోవేషన్ కి ప్రయత్నించి -సఫలమో విఫలమో -ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాడు. 

దర్శకుడు ఫిక్సయిన తన పాయింటాఫ్ వ్యూలో - కథలో సాగర్,  సినిమా స్టార్ సూర్య అంటే పడిచచ్చే, అతడి కోసం ఏమైనా చేసే వీరాభిమానిగా కనిపిస్తాడు. అతను సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ కూడా. ఈ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఈశ్వర్ వుంటాడు. వీళ్ళిద్దరూ తప్ప అసోసియేషన్ లో ఇంకెవరూ సభ్యులు కన్పించక పోవడం ఒక వెలితిగా వుంటుంది. అదే అటు రంగాని చూస్తే, సాగర్ కి వ్యతిరేకంగా పెద్ద గ్రూపు నేసుకుని వుంటాడు. అయితే థియేటర్ ఓనర్ కొడుకైన ఈ రంగా, టాప్ స్టార్ ఆంధ్రాకింగ్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ తో శత్రుత్వం కథకి రిలేటెడ్ గా అన్పించదు. అసలు ఫ్యాన్స్ అసోసియేషన్ జోలికెవరైనా వెళ్తారా, పోటీ స్టార్ అభిమానులైతే తప్ప? అలాటిది థియేటర్ ఓనర్ కొడుకే ఇలా శత్రుత్వం పెంచుకుంటే, థియేటర్లో తమ స్టార్ సినిమాలు విడుదల చేయకుండా అడ్డుకునే పవర్ వాళ్ళకుంటుంది. కనుక ఈ సాగర్ తో రంగా పెట్టుకునే గొడవలు కథకి అతకకుండా వుంటూ, సినిమా మేజర్ పార్టుకి కథాపరంగా చూసేందుకు ఇబ్బంది కలిగిస్తూ వుంటాయి. దీన్ని దర్శకుడు గమనించాడో లేదో. దీంతో పాటు తర్వాత తన చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని రంగా సాగర్ మీద మరింత కక్ష పెంచుకోవడం కూడా కన్విన్స్ చేయదు. అసలు థియేటర్ ఓనరైన పురుషోత్తమైనా, దర్శకుడు చెప్పకపోతే, తనే కొడుక్కి చెప్పి ఈ గొడవలు మాన్పించి వుండాల్సింది. 

B (1) సాగర్ సైకో ఎనాలిసిస్ : 

సాధారణంగా సినిమా స్టార్స్ ఫ్యాన్స్ కథల్లో ఎవరైనా ఆశించే టెంప్లెట్ ఏమిటంటే, పోటీ స్టార్ ఫ్యాన్స్ తో కొట్లాటలు వుండాలని. ఇదే ఇక్కడ అదృశ్యమవడంతో, సూర్య ఫ్యాన్ అయిన సాగర్ - ఎవరికీ ఫ్యాన్ కాని రంగాల మధ్య ఘర్షణలు కథకి అడ్డంకిగా మారాయి. దీనికి దర్శకుడు చెప్పేదేమిటంటే, ఫ్యాన్స్ ని అగ్రెసివ్ గా కాకుండా పాజిటివ్ గా చూపించాల

నుకున్నామని. కానీ థియేటర్ కి ఫిలిం  బాక్సు రాలేదని సాగర్ అగ్రెసివ్ గానే- ప్రెసిడెంట్ హోదాని కూడా మర్చిపోయి  థియేటర్ అద్దాలు పగులగొట్టేసి లాకప్ లో పడతాడు. ఒక్కసారి లాకప్ లో పడి, ఎఫ్ ఐ ఆర్ గనుక నమోదైతే, ఇక జీవితంలో విద్యా ఉద్యోగ అవకాశాలు హుళక్కి అయిపోతాయని అతను తెలుసుకుని వుంటే బావుండేది. ఇక్కడ హీరోయిన్ ని చూసి సాగర్ ప్రేమలో పడేందుకు, థియేటర్ కి ఫిలిం బాక్సు రాని పరిస్థితిని కల్పించి, ఆ కారణంగా చూపి అద్దం పగుల గొట్టించి, తద్వారా పగిలిన అద్దంలోంచి ఆమెని సాగర్ కి చూపించాలనే పరస్పర విరుద్ధ కాన్సెప్ట్స్ ని కలిపి సీను చేయడం వల్ల,  ప్రేమ సంగతేమో గానీ, అతడి క్రిమినల్ యాక్టివిటీ హైలైట్ అయి అతడి ప్రెసిడెంటుగిరీని దిగజార్చింది. 

ఫ్యాన్స్ ని అగ్రెసివ్ గా చూపాలని లేకపోతే, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా, ప్రెసిడెంట్ సాగర్ తో విడిపోయిన ఈశ్వర్ నే, ఫ్యాన్స్ కొట్టి చెయ్యి ఎందుకు విరగ్గొట్టారు అతనేదో పత్రికలో తమ స్టార్ కి వ్యతిరేకంగా ఏదో రాశాడని?

కాబట్టి ఈ కథ ఫ్యాన్స్ కీ ఫ్యాన్స్ కీ మధ్య గొడవలతో సహజంగా, రిలేటెడ్ గా వుండాలి- కథ కావల థియేటర్ ఓనర్ కొడుకుతో కాకుండా.  సినిమా స్టార్స్ కుండే ఫ్యాన్స్ ని నిజంగానే పాజిటివ్ గా చూపించాలని వుంటే- రెండు ఫ్యాన్స్ గ్రూపుల మధ్య గొడవల్లేని ఫ్రెండ్ షిప్ తో కూడిన సత్సంబంధాలు చూపించి, నేటి సోషల్ మీడియాలో పరస్పరం దెబ్బతీసుకునే ఫ్యాన్స్ గ్రూపులకి ఆదర్శంగా చేయొచ్చు. దీన్ని ఎవరైనా హర్షిస్తారు. 

పోతే, తను అభిమానించే సూపర్ స్టార్ సూర్య ప్రతిష్ట కోసం ఏమైనా చేసే సాగర్ కి, ఆ స్టార్  పట్ల గల అభిమానానికి డెప్త్ కూడా వుంటే బావుండేది. ఆ డెప్త్ సూర్య పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూనో, మరేవో మానవీయ చర్యలు చేపడుతూనో  వుంటే కనిపిస్తుంది. ఇవి మిస్సయ్యాయి. అంటే సాగర్ తన అభిమాన స్టార్ కి ఆపాదించే విధంగా కథలో ఎలాటి ఎంపతీనీ క్రియేట్ చేయలేదు. ఎంపతీ అనేది ప్రేక్షకుల్ని పాత్రతో, కథతో కనెక్ట్ చేసే బలమైన భావోద్వేగం. ఫ్యాన్స్ కి దేవుడు లాంటి సూపర్ స్టార్ ప్రపంచంలో ఎక్కడైనా ఎల్లలులేని ఆరాధనీయుడే. Praise your lord అనే భక్తి భావంతో తేలిపోయే ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటూ వుంటాడు. ఇలా ప్రేక్షకుల దృష్టిలో సూపర్ స్టార్ అయిన సూర్య, సాగర్ ద్వారా దైవ సమానుడుగా ఎమోషనల్ గా ఎలివేట్ కావాల్సింది కాలేదు. మరొకటేమిటంటే, సాగర్ ఇంట్లో కనీసం ఒక్క సూర్య పోస్టర్ కూడా  లేకపోవడం. 

ఇక సూర్య కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఒక్కసారైనా సూర్యని సాగర్ కలవక పోవడం ఒకటుంది. ఈ కథ జరుగుతున్న 2002 లో వివిధ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తమ స్టార్ ని కలుసుకుని ఫీడ్ బ్యాక్స్ ఇవ్వడం, నటించే సినిమాల విషయంలో సలహా సూచనలివ్వడం చేసేవాళ్ళు. ఇప్పుడూ చేస్తూంటారు. కానీ సాగర్ లంకలో తిరునాళ్ళు  జరుగుతున్నప్పుడు, సమీపంలో సూర్య సినిమా షూటింగ్ జరుగుతూంటే , అక్కడి కెళ్ళిన సాగర్ సూర్యని కలవకుండా బయట బయటే స్టాఫ్ కి సూర్య ఇష్టపడే అరటి గెల ఒకటి అందించేసి రావడం చూస్తే- ఈ రకమైన సాగర్ ధోరణి అతను సూర్యని కలవడానికి సిగ్గు పడుతున్నాడేమో అనే అర్ధాన్నిస్తోందని దర్శకుడు గమనించి వుంటే బావుండేది. వాళ్ళిద్దర్నీ ముగింపులోనే కలపాలన్న ఆలోచన పెట్టుకోవడం వల్ల ఇలాటి లోపాలేర్పడ్డాయి. 

సరే, ముగింపులోనే కలపవచ్చు- ఐతే దానికి తగిన అర్ధాన్నీ జోడించాలి. అంటే పూర్వమెప్పుడో కొత్త ఫ్యాన్ గా అత్యుత్సాహంతో మొదటిసారిగా సూర్యని కలవడానికెళ్తే, ఏదో మూడ్ లో వున్న సూర్య - ఎహె పోరా!-  అని గేటు వేయించేస్తే, దెబ్బతిన్న సాగర్ అప్పట్నుంచీ సూర్యని కలవట్లేదని జస్టిఫై చేయొచ్చు. అయినా అభిమానం చంపుకోలేదని చూపిస్తూ సాగర్ మీద ప్రేక్షకుల  ప్రేమని మరింత పెంచొచ్చు. ఇలా ఈ నేపథ్యంలో  ముగింపులో ఇద్దరూ కలుసుకునేట్టు చేస్తే , అప్పుడు గతంలో తను గెంటేసిన సాగర్ తో సూర్య భావోద్వేగాలు ఎలా వుంటాయి! ఆల్ డ్రామా ఈజ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేకపోతే డ్రామా లేదు. గతంలో సూర్య సాగర్ ని గెంటేసి వుంటే కాన్ఫ్లిక్ట్. 

ఇంకా సాగర్ కి మహాలక్ష్మి చేత టికెట్లు ఇప్పించి ప్రేమని బలీయం చేయడానికి సాగర్ పాత్రని దెబ్బతీసే విధంగా సీను లేకుండా చూడాల్సింది దర్శకుడు. సాగర్ సినిమా టికెట్లు ఇమ్మని అడిగితే బుకింగ్ క్లర్క్ లేవు పొమ్మని కసురుకుంటాడు. సాగర్ నిస్సహాయంగా వుండిపోతే, మహాలక్ష్మి వచ్చి టికెట్లు ఇప్పించి ఆదుకుంటుంది. థియేటర్లో ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కిలా జరగదేమో. కథలో తను సృష్టించిన హీరో పాత్రకి కథకుడే విలువ ఇవ్వకపోతే, ప్రతిష్ట పెంచకపోతే, ప్రేక్షకుల దృష్టిలో పడిపోయిన ఆ క్యారెక్టర్ ని ఇంకెందుకు కేర్ చేస్తారు ప్రేక్షకులు? ఒకటి జస్టిఫై చేయడానికి ఇంకోటి కిల్ చేయడం సరైన పధ్ధతి కాదేమో.

ఇలాటిదే ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకో విషయాన్నీ కిల్ చేసిన సీన్లు దర్శకుడు గమనించినట్టు లేదు- అవి సాగర్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకులో వున్నాయి. చిన్నప్పుడు స్కూల్లో అడిగిన ప్రశ్నకి సాగర్ సమాధానం చెప్పలేక పోయాడని హెడ్ మాస్టర్ అడ్మిషన్ నిరాకరించ వచ్చా? దాంతో తండ్రి ఇంటికి తీసికెళ్ళి ఆ కొడుకుని చితకబాదొచ్చా? కొడుకు సమాధానం  చెప్పలేకపోవడానికి  అతడి క్రానిక్ స్టేజి కెళ్ళిన నత్తియే కారణమని తండ్రికీ, హెడ్ మాస్టర్ కీ తెలియదా? నత్తికి  కారణం మెదడుకీ స్వరపేటికకీ మధ్య నరాల సమస్య. వంశపారంపర్యంగా జన్యు సమస్య కూడా కావొచ్చు. దీనికి స్పీచ్ థెరఫీ అవసరం. ఆ స్పీచ్ థెరఫీకి కొన్ని నెలలు పడుతుందని డాక్టరు చెప్పి వుంటే- ఈ సమస్య నుంచి ఎలాగైనా త్వరగా బైట పడాలని సాగర్ స్ట్రగుల్ చేస్తూంటే, అప్పుడు అనుకోకుండా సూపర్ స్టార్ సూర్య టేపులో పాడిన మోటివేషనల్  గేయం విని - ఉవ్వెత్తున లేచిన భావోద్వేగంతో ఆ లోపాన్ని జయించేశాడని పిక్చరైజ్ చేసి వుంటే ఎంత బావుండేది? పిల్లల సమస్యని అర్ధం జేసుకోకుండా రాక్షసంగా దండించడమే పెద్దరికం అన్నట్టు చూపిస్తే ఎలా? లాఠీ తీసుకుని తండ్రి అలా కొడుతున్న సీను తీవ్రతని సెన్సార్ వాళ్ళు పట్టించుకోవాల్సింది. 

అయితే ఏదో అల్లరి చిల్లరిగా తిరిగి ఫ్యాన్ అయిపోయాడని  చూపకుండా, చిన్నప్పుడు తన జీవితాన్నే మార్చేసిన గేయంతో సూర్య అభిమానిగా మారాడని  బేస్ వేయడం, డెప్త్ వున్న మంచి థీమాటిక్ ఐడియానే.

తర్వాత, సూర్య తన వూళ్ళో జరుగుతున్న తిరునాళ్ళకి ఆహ్వానించేందుకు మహాలక్ష్మి ఇంటికెళ్ళే సీనుతో వచ్చిన సమస్య! ఏంటా సమస్య? చెబితే కోటి రూపాయలు బహుమానం! సరే, చెప్పేద్దాం…ఇటు తిరునాళ్ళు, అటు సూర్య సినిమా షూటింగు ఏకకాలంలో జరుగుతున్నప్పుడు, సాగర్ తిరునాళ్ళకి ఆహ్వానించడమేమిటి? సూర్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా సాగర్ కి షూటింగ్ గురించి ముందే సమాచారముంటుంది. అప్పుడతను షూటింగ్ కి ఆహ్వానించాలి గానీ, తిరుణాళ్ళేమిటి? మహాలక్ష్మి తండ్రి పురుషోత్తం థియేటర్ ఓనరే కాబట్టి షూటింగ్ కి రాకుండా వుండడు. ఇలా ఈ సీను కథకీ, పాత్రలకీ రిలేటెడ్ గా వుంటుంది. తిరునాళ్ళేమిటి? కథలో ఇమడని ఈ తిరునాళ్ళ  దృశ్యాల షూటింగ్ ఖర్చు, దాని పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చూ దండగ అయినట్టే కదా? 

పోతే, లవ్ ట్రాకు లవర్స్ మధ్య మాత్రమే సున్నితంగా నీటుగా వుంది. ఇదే సున్నితత్వం సాగర్ కి మహాలక్ష్మి తండ్రి పురుషోత్తంతో కూడా వుండాలి. ఎందుకంటే, చిన్నప్పట్నుంచీ తన రోల్ మోడల్ గా సూర్యని అభిమానిస్తున్న సాగర్ కి, సూర్యలో వున్న హూందాతనం, వ్యవహారశైలి, దయాగుణం, గ్రేస్ మొదలైన పాజిటివ్ వ్యక్తిత్వ విశిష్టతలకి ప్రభావితమై అవి సాగర్ లో కనిపిస్తూ వుండాలి. విరుద్ధంగా సాగర్ లో పర్సనాలిటీ డిజార్డర్స్ కనిపిస్తున్నాయి. తను కాలేజీ స్టూడెంట్ మాత్రమే కాదు, సూర్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా. కానీ ప్రేమ విషయంలో కూడా అతడి బిహేవియర్ కాలేజీ స్టూడెంట్ అన్నట్టే వుంటుంది. అసలతను కాలేజీ స్టూడెంట్ బిహేవియర్ నుంచి సూర్య గుణగణాల్ని జీర్ణించుకున్న ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బిహేవియర్ కి మారాలి. మారి వుంటే కథ కూడా సరైన గాడిలో పడేది. ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రేమ వ్యవహారాన్ని ఎలా హేండిల్ చేస్తాడో ఓ కొత్తతరహా, ఇది వరకు రాని కొత్త సీన్లతో కథ వచ్చేది. 

కానీ తన పాయింటాఫ్ లో దర్శకుడు సాగర్ క్యారక్టర్ కున్న డబుల్ షేడ్స్ ని  గుర్తించకుండా, కాలేజీ స్టూడెంట్ షేడ్ కే ఫిక్స్ అయిపోయి  కథ లాగించేయడం వల్ల రొటీన్ ఆవారా లవర్ సీన్లే చూడాల్సి వచ్చింది మనకి. ఈ రొటీన్ వల్లే థియేటర్ మీద మహాలక్ష్మి బోర్డు పక్కన ‘ఐ లవ్ యూ’ నియాన్ లైట్ల డిస్ ప్లే పెట్టి పురుషోత్తంని రెచ్చగొట్టాడు.  పురుషోత్తం కూడా సాగర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అన్న స్పృహే లేకుండా ప్రవర్తించడం కూడా పాత్ర చిత్రణ లోపమే. అసలు ఈ కథలో ఎవ్వరూ కూడా సాగర్ ఒక పెద్ద సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అని తెలుసుకుని ఆ రకమైన విలువ, గుర్తింపూ  ఇవ్వకపోవడం ఈ కథ ఎలివేట్ అవకపోవడానికి ప్రధాన కారణం.కథకి కథానాయకుడే ప్రధానాకర్షణగా లేకపోతే, కథని ఇంకేం కాపాడుతుంది? 

ఇంటర్వెల్ సీను లో మహాలక్ష్మితో థియేటర్ లో దొరికిపోయాక పురుషోత్తం కొట్టి గాయపరచి చెప్పే మాటలకి, సాగర్ ఎదురుతిరిగి చేసిన ఛాలెంజిని పరిశీలించాలి. ప్రేమ కథల్లో థియేటర్ కట్టి చూపిస్తా, వంద కోట్లు సంపాదించి చూపిస్తా లాంటి ఎమోషనల్ కంటెంట్ లేని  మూస ఫార్ములా ఛాలెంజిల కిప్పుడు కాలం చెల్లిందనాలి. ఇవి ఎలా సాధిస్తాడో ఓ టెంప్లెట్ లో చూసి చూసి వున్నారు ప్రేక్షకులు. ఇవి నిజ జీవితంలో జరిగేవి కావు. 

ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో సినిమాటిక్ పరిష్కారాలు సంతృప్తి పర్చలేవు. జీవితంలో ఎదురవుతున్న అనుభవాలు వేరు. ఇప్పటి జీవితాల్లో రెండే సమస్యలు వేధిస్తున్నాయి. అయితే రిలేషన్ షిప్ సమస్యలు, కాకపొతే ఆర్ధిక సమస్యలు. కనుక సినిమా థీమ్స్ రోమాంటిక్స్ లేదా ఎకనామిక్స్ అవుతున్నాయి. ధరలు పెరిగిపోతూ. జీతాలు పెరక్క, అసలు ఉపాధులకే గ్యారంటీ లేక స్ట్రగుల్ చేస్తున్న ప్రజలకి -ఎప్పుడు ఉన్నత స్థితికి ఎదుగుతామా అన్నఆందోళనతో జీవితం గడిచిపోతోంది.  ఆ ఉన్నత స్థితికి చేరుకునే, జీవితంలో పనికొచ్చే ప్రాక్టికల్ మార్గాలు చూపాలి తప్ప- మూడు నెలల్లో థియేటర్, వందరోజుల్లో వంద కోట్లు లాంటి మోసపూరిత చిట్కాలు కాదు.

ఫస్టు ఎవరైనా ఒక గోల్ సాధించాలంటే దాని ఎండ్ పిక్చర్ చూడాలి. ఎలా సాధిస్తామన్నది కాదు. సాధిస్తే జీవితం ఎలా వుంటుందో ఆ ఎండ్ పిక్చర్ చూడాలి. డైలాగులు కొట్టి సాగర్ చేసేలాంటి ఛాలెంజీల కిప్పుడు బాక్సాఫీసులో ఏ విలువా లేదు. డైలాగ్ ఛాలెంజిలు కాలం చెల్లి పోయాయి. పురుషోత్తం అలా అవమానిస్తున్నప్పుడు ఛాలెంజి చేయకుండా సాగర్ ఆ ఛాలెంజికి తగ్గ ఎండ్ పిక్చర్ ని ఊహించుకోవాలి.

బ్రహ్మాండమైన 70 ఎం ఎం థియేటర్ కట్టేశాడు, 100 వ సూర్య సినిమాతో ప్రారంభోత్సవం చేశాడు, ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ సూర్య వచ్చేశాడు, మేళతాళాలు మోగుతున్నాయి…సాగర్ ని భుజాలకెత్తుకుని డాన్స్ చేశాడు, జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు, ఇది చూసి చప్పట్లు కొడుతున్నారు, టికెట్లు దొరక్క కొట్టుకుంటున్నారు….అప్పుడే మహాలక్ష్మిని పెళ్ళి చేసుకుని వచ్చేసి  ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు సాగర్. జీవితం సూపర్  రిచ్ గా మారింది. పెద్ద బంగాళా, కార్లు, నౌకర్లు, సంతృప్తిగా పేరెంట్స్. ఆనంద బాష్పాలతో పురుషోత్తం వచ్చి కౌగిలించు కోవడాలు…సాగర్ కట్టలకి కట్టలు నోట్లు లెక్కబెట్టడం…ఇష్టం వచ్చినట్టు ఎండ్ పిక్చర్ ని ఊహించుకోవచ్చు!

 ఎందుకిలా? ఎందుకంటే డైలాగుల కంటే దృశ్య భాషకి ప్రేక్షకుల సబ్ కాన్షస్ మైండ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఏదైనా సాధించాలంటే ముందు దృశ్య భాషలో ఎండ్ పిక్చర్ ని ఊహించుకుంటూ వుంటే, మన సబ్ కాన్షస్ మైండ్ ఇంప్రెస్ అయి అదెలా సాధించాలో అదే చూసుకుంటుంది. ఛాలెంజి చేసుకునే కథలకి తోడ్పడే సైంటిఫిక్ మెథడ్ ఇది. 

(ఆర్టికల్ నిడివి పెరగడం వలన రెండు భాగాలుగా చేశాం. దర్శకుడి పాయింటాఫ్ వ్యూ, స్ట్రక్చర్, జానర్ బెండర్ లతో కూడిన రెడీగా వున్న రెండో భాగాన్ని రేపు చూడండి)

-సికిందర్


Thursday, November 27, 2025

1404 : స్పెషల్ ఆర్టికల్

 

    ఎల్ ఓ ఏ లో ప్రతిజ్ఞ బూనడాన్ని, లేదా ధృవీకరించడాన్ని అఫర్మేషన్ అంటారు. మన విషయానికొస్తే దర్శకత్వమనే  లక్ష్యాన్ని సాధించడానికి ఆ లక్ష్యాన్ని పదే పదే వల్లించడం ద్వారా మెదడుని వున్న స్థితినుంచి కొత్త స్థితికి రీవైరింగ్ చేయడమన్న మాట. చిన్నప్పుడు పాఠాలు బట్టీ పట్టి దాన్ని జ్ఞాపకంగా సబ్ కాన్షస్ మైండ్ లో నిల్వ చేయడం లాంటి దన్న మాట. ఈ అఫర్మేషన్స్ మెదడులోనే కాదు, మెదడుతో కనెక్ట్ అయి వుండే శరీర కణాలన్నిటా చేరిపోతాయి. కాబట్టి అఫర్మేషన్స్ జాగ్రత్తపడి పాజిటివ్ గా వుండేట్టు చూసుకోవాలి. ఒకరి మీద కోపంతో ‘వాడ్ని దెబ్బ కొట్టి నేను డైరెక్టర్ నవుతా!’  అని ఆవేశం చూపిస్తే, అది నెగెటివ్ ఫీలింగ్. అప్పుడా కోపంతో కూడిన ఆ నెగెటివ్ ఫీలింగ్ వెళ్ళి వెళ్ళి లివర్ ని ఎటాక్ చేస్తుంది. ఎలాటి నెగెటివ్ ఫీలింగ్స్ కి ఆ ఎటాక్స్ శరీరమంతటా జరుగుతూంటాయి. ఎవరి మీదయితే నెగెటివ్ ఫీలింగ్ తో వుంటామో, ఆ వ్యక్తికేం కాదు, లక్షణంగా వుంటాడు- మనమే మన శరీరాన్ని దెబ్బతీసుకుని రోగాల బారిన పడతాం. ఏ నెగెటివ్ ఫీలింగ్ ఏ అవయవాన్ని దెబ్బతీసి, ఏ అనారోగ్యాన్ని తెచ్చి పెడుతుందో వెల్ నెస్ కోచ్ లూయీస్ హే తన ప్రసిద్ధ పుస్తకం ‘యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్’  లో పెద్ద లిస్టే ఇచ్చింది.

రి -’నీ వూరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా!’ అని కోపం బద్దలు చేసుకుని మీసం తిప్పి, తొడగొట్టడాన్ని హీరోయిజంగా సినిమాలో చూపించడం తప్పు కాదా అంటే- అదే కదా ఐరనీ, అలాకాకుండా ‘నిన్ను క్షమించాను పో!’ అంటే  సినిమాలు ఆడతాయా? కనుక సినిమాలో తన్నాలి, జీవితంలో క్షమించాలి - ఈ లౌక్యంతో తప్పించుకు తిరగాలి.

కనుక అఫర్మేషన్స్ పాజిటివ్ గా వుండేట్టు చూసుకోవాలి. కొత్తగా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు అప్పటివరకూ మెదడులో వైరింగ్ అయి వున్న పాత నమ్మకాల బలహీన న్యూరల్ పాత్ వేస్ ని చెరిపేసి, కొత్త పాత్ వేస్ తో రీవైరింగ్ చేస్తాయి. మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ఏఎస్) అని రాడార్ వుంటుంది. ఇది రోజంతా పంచేంద్రియాల ద్వారా మెదడుకి భారీగా చేరే 74 గిగా బైట్ల సమాచారాన్ని (ఇది 16 సినిమాలు చూడడంతో సమానం) ఫిల్టర్ చేసి- ఏ సమాచారం ఫీలింగ్ తో వుందో దాన్ని మాత్రమే సబ్ కాన్షస్ మైండ్ కి పంపిస్తుంది. ఫీలింగ్ లేకపోతే గుండె అడ్డుకుంటుంది. సబ్ కాన్షస్ మైండ్ ఆ ఫీలింగ్ తో వున్న సమాచారాన్ని ఇమేజెస్ రూపంలో జ్ఞాపకాలుగా మార్చుకుని నిల్వ చేసుకుంటుంది. ఎప్పుడు ఏ పనికి ఏ ఇమేజి అవరసరముందో దాన్ని ఆర్ ఏ ఎస్ కి పంపిస్తుంది. అప్పుడా ఆర్ ఏ ఎస్ ఆ ఇమేజిని  విశ్వంలోకి ప్రసారం చేసి, దాంతో మన కోరికల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది.ఈ మెకానిజం తెలుసుకోకపోతే ఏదో చెప్తార్లే అని మొత్తం ఎల్ ఓ ఏ నే బేఖాతరు చేసే అవకాశముంది. 


ఈ కింద ఇచ్చిన అఫర్మేషన్ ని ప్రతీ రోజూ ఉదయం లేవగానే చదవాలి. లేదా అయిదారు నిముషాలు వచ్చే ఈ పాఠాన్ని మొబైల్ లో రికార్డు చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు. ముందుగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, అనుకున్న లక్ష్యం పూర్తయన ఫీలింగుతో అపర్మేషన్ చేయాలి. అంటే ఆల్రెడీ దర్శకుడైనట్టు ఫీలవ్వాలి. దర్శకుడవుతాను, దర్శకుడవడం నా లక్ష్యం, లేదా దర్శకుడవ్వాలనుకుంటున్నాను- అనే  భవిష్యత్ కాలానికి చెందే ప్రార్ధన చేయకూడదు. విశ్వానికి భవిష్యత్ కాలం లేదు, భూత కాలం లేదు, వుండే దొక్కటే- స్తంభించిన వర్తమాన కాలం. కాబట్టి ఈ వర్తమానంలో -ఇప్పుడు దర్శకుడి హోదా ఫీలయ్యి ప్రార్ధన పంపాలి.

అఫర్మేషన్ : 

“విశ్వానికి ధన్యవాదాలు. నా వృత్తి జీవితంలో జరిగే దేనికైనా నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. దర్శకత్వ అవకాశాలు సంపాదించడం, కోల్పోవడం రెండింటికీ నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. లక్ష్యాన్నిసాధించడానికి, సాధనలో  విఫలమవడానికీ  నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. ఎందుకంటే నా వృత్తి జీవితంలో ఏం జరుగుతోందో అది పూర్తిగా నా సృష్టి. నా ఆకర్షణ. నా వృత్తితో నేను చెడు సంబంధం కలిగి వున్నందుకు క్షమాపణలు. అవకాశాలు  సంపాదించడం కష్టమని భావించినందుకూ క్షమాపణలు. 


“అవకాశాలు సంపాదించేటప్పుడు నా గురించి నన్ను తక్కువ చేసుకుని ఆలోచించినందుకూ క్షమాపణలు. దర్శకత్వ ప్రయత్నాలు చేస్తున్న ఇతరుల గురించి చెడుగా ఆలోచించినందుకూ క్షమాపణలు. నేను కోరుకున్న దర్శకత్వ అవకాశాలు నా జీవితంలోకి వచ్చినందుకూ  ధన్యవాదాలు. దర్శకత్వం నన్ను వరించినందుకూ  ధన్యవాదాలు. దర్శకత్వం నన్ను ధనవంతుడిగా మార్చినందుకూ ధన్యవాదాలు. నా చుట్టూ వున్న దర్శకులని ధనవంతులుగా చేసినందుకూ  ధన్యవాదాలు. వారు కూడా దానికి పూర్తి అర్హులు. ఎందుకంటే విశ్వం దృష్టిలో మనమందరం ఒకటి కాబట్టి.


“నా శరీరంలోని ప్రతి కణం దైవిక కాంతితో ప్రకాశిస్తోంది. ప్రతి శ్వాస నా శరీరానికి సమతుల్యతని, శాంతిని తెస్తోంది. నేను ప్రతిరోజూ ఆరోగ్యంగా మారుతున్నాను. నేను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా బలంగా మారుతున్నాను. నేను నా ప్రతి హృదయ స్పందనని అనుభవిస్తున్నాను. నన్ను నేను కొత్త ప్రాణశక్తితో నింపుతున్నాను. నేను లోతైన శాంతితో నిండిన వ్యక్తిని. ప్రతి ప్రశ్నకు, ప్రతి అవసరానికీ  సమాధానం నాలోనే వుంది. నా దగ్గర వున్న ప్రతిదానికీ నేను చాలా కృతజ్ఞుడ్ని. 

జీవితంలోని అనంతమైన అవకాశాలతో నన్ను అనుసంధానిస్తున్నాను. నేను శక్తివంతమైన అయస్కాంతాన్ని. నా సానుకూల వైబ్‌లు ఎల్లప్పుడూ దర్శకత్వ అవకాశాల్ని ఆకర్షిస్తున్నాయి. 


“ఎస్, ఊహించని అనేక వైపుల నుంచీ దర్శకత్వ అవకాశాలు  నాకు వస్తున్నాయి. ఈ అవకాశాల్ని హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను. నాకు లభించిన అవకాశాల్ని నా జ్ఞానంతో, విచక్షణతో సద్వినియోగం చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజూ కొత్త అవకాశాల్ని ఆకర్షిస్స్తున్నాను. నేను నా పనిని ప్రేమిస్తున్నందున అవకాశాలు నావైపు వస్తున్నాయి. 


“నేను నాకు లభిస్తున్న దర్శకత్వ అవకాశాలకి పూర్తి విలువని జోడించి  తిరిగి ఇస్తున్నాను. నేను ఎంత ఎక్కువ విలువ జోడిస్తూంటే, అన్ని ఎక్కువ అవకాశాలు నాకు లభిస్తున్నాయి. సరైన మార్గంలో అవకాశాలు సంపాదించడానికి నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి. నా కలలన్నింటినీ నెరవేర్చుకోవడానికి నాకు పూర్తి సామర్థ్యం వుంది.  అందువల్ల నా లక్ష్యం వైపు వేగంగా కదులుతున్నాను. నేను కృతజ్ఞతతో, ​​కృతజ్ఞతా భావంతో అవకాశాల్ని స్వీకరిస్తున్నాను. 


“అవకాశం ఒక సానుకూల శక్తి, ఇది నా జీవితంలోకి సులభంగా స్వచ్ఛమైన తరహాలో వస్తోంది. అవతల ప్రతి ఒక్కరి వ్యక్తి విజయాన్నీ నేను ఆనందిస్స్తున్నాను. అందరికీ విజయం, సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందమూ పుష్కలంగా ఇమ్మని విశ్వాన్ని ప్రార్థిస్స్తున్నాను. 


“నేను ఇతరులతో  సులభంగా డబ్బు పంచుకోగలుగుతున్నాను. డబ్బు సంపాదించడం ఇప్పుడు నాకు చాలా సులభం అయ్యేలా నన్ను ఇంత పెద్దవాడిని చేసినందుకు ధన్యవాదాలు. ప్రియమైన దర్శకత్వమా, ఈ రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రకటిస్తున్నాను. నాకు ఇప్పుడు నీతో ప్రేమ సంబంధమే వుంది. నువ్వు చిన్న రూపాల్లో, మధ్యస్థ రూపాల్లో, పెద్ద రూపాల్లో - ఏ రూపంలో నా దగ్గరికి వచ్చినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చిన్నస్థాయి సినిమాని, పెద్ద స్థాయి సినిమానీ  రెండిటినీ ప్రేమిస్తున్నాను. అవకాశం ఈ దిశ నుంచి, ఆ దిశ నుంచి, ఏ దిశ నుంచి వచ్చినా స్వీకరిస్తున్నాను. 


“ప్రియమైన దర్శకత్వమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. విలువైనదిగా భావిస్తున్నాను. ఇతరులని దర్శకులుగా  చేసినందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను వారి పట్ల ఎంత సంతోషంగా వుంటానో!  కొన్నిసార్లు నా నుంఛి దూరంగా వెళ్ళినందుకు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు నా ద్వారా ఇతరులని దర్శకులుగా చేస్తూండ వచ్చు. నా ద్వారా ఇతరులని దర్శకులుగా చేసినా, ఇతరుల ద్వారా నన్ను దర్శకుడ్ని చేసినా రెండూ నాకిష్టమే. నా గతంలో నన్ను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ నన్ను  బాధపెట్టిన, నా అవకాశాల్ని దెబ్బతీసిన వారందరినీ క్షమిస్స్తున్నాను. ఎందుకంటే వారిని నేను ఆకర్షించాను, నాకు జరిగిందంతా నా సృష్టే. దీనికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. 


“నా జీవితంలో వారిని ఆకర్షించినందుకు, నా జీవితంలో ఆ ఫ్రీక్వెన్సీని సృష్టించడానికి నేను చేయవలసినదంతా చేసినందుకూ క్షమాపణలు. అవకాశాల  గురించి నాకు ఒక పాఠం నేర్పించినందుకు వారందరికీ ధన్యవాదాలు. నాకు ఆ పాఠం అవసరమని నాకు తెలుసు. నా గతంలో నన్ను మోసం చేసిన, లేదా అవకాశాలు  సంపాదించడంలో నాకు మద్దతు ఇవ్వని వారందరినీ ఈ రోజు నేను క్షమిస్తున్నాను.


“అదే విధంగా నాకు తెలిసి, లేక తెలియక నేనెవర్నయినా మోసం చేసి వుంటే, బాధించి వుంటే, నష్టపరచి వుంటే, వాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసి వుంటే,  ఆ దివ్యాత్ములందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారికి నా క్షమాపణలు, క్షమాపణలు, హృదయపూర్వక క్షమాపణలు. 


“నిర్మాతలు నాకు అవకాశాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారు నాకిచ్చిన అవకాశానికి ఎంత డబ్బు పెట్టుబడి పెడతారో నేను వారికి 10 రెట్లు తిరిగి ఇస్తున్నానని నమ్ముతున్నారు కాబట్టి. వారు నాకు ఇచ్చే డబ్బుకి నేను కచ్చితంగా విలువని జోడిస్తున్నాను. ప్రతిరోజూ ఇందుకే నేను నా జీవితంలో అవకాశాల్ని ఆకర్షిస్తున్నాను. నేను ప్రతిరోజు  దర్శకుడ్ని అని నమ్ముతున్నాను.  “అందుకే ప్రతిరోజూ అవకాశాల్నిఆకర్షిస్తున్నాను. నేను దర్శకుడిగా మారడం నాకు చాలా సౌకర్యవంతంగా వుంది. నేను కలుగన్న పెద్ద భవంతిలో నివసించడం చాలా సౌకర్యంగా వుంది. నేను నా అందమైన కలల కార్లనీ నడపడం చాలా సౌకర్యంగా వుంది. నేను నా కుటుంబ, బంధు మిత్రుల సౌఖ్యం కోసం డబ్బు ఖర్చుచేయడం చాలా తృప్తిగా వుంది. నేను డబ్బు ఖర్చు చేసే ప్రతిసారీ నేను డబ్బు సంపాదించడానికి దర్శకత్వ అవకాశాలు మరింత పెరుగుతూ వస్తున్నాయి.


“నా చేతినుంచి ఎల్లప్పుడూ డబ్బు ప్రేమతో వెళ్తోంది. వెళ్ళిన చోటల్లా అది ప్రేమతో కొన్ని రెట్లు పెరుగుతోంది. అందుకే నేను ఎల్లప్పుడూ ప్రేమతో డబ్బు ఇస్తున్నాను. కిరాణా షాపులో సరుకులు కొన్నా, బంకులో పెట్రోలు కొట్టించుకున్నా, మరెక్కడ డబ్బు ఖర్చు చేసినా, ఎల్లప్పుడూ ప్రేమతో, దాతృత్వ భావంతో ఇస్తున్నాను. అది కొన్ని రెట్లు పెరిగి నాకు తిరిగి వస్తున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 


“ప్రియమైన విశ్వమా, నేను ప్రతిరోజు ఈ ప్రార్ధన చేసినప్పుడల్లా రోజంతా నిశ్చింతగా గడుపుతున్నాను. నాకు మరో సంతోషకరమైన రోజుని ఇచ్చిన నీకు కృతజ్ఞతలు. నా ఈ రోజు విశ్వం కోసమే, విశ్వానికే నా రోజులన్నీ అంకితం. విశ్వం నాకేమిచ్చినా, ఇవ్వకపోయినా విశ్వం పట్ల నేను సదా కృతజ్ఞతతోనే వుంటాను!” 


ఎవరికైనా కెరీర్ ఒకడుగు ముందుకూ. నాల్గు అడుగులు వెనక్కీ వెళ్తూంటే ఈ అఫర్మేషన్ చేయొచ్చు- ‘నాలో వున్నజ్ఞానం నన్ను అనంతం వైపు నడిపిస్తోంది’


-సికిందర్