రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 3, 2025

1391 : స్పెషల్ ఆర్టికల్ -3


 

లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఎల్ ఓ ఏ) స్ట్రక్చర్ మానసికమైనదే కాదు, శారీరకమైనది కూడా. మనసెలా వుంటే శరీరం అలా వుంటుంది కాబట్టి. శరీర సహకారం లేకుండా మనసులో ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని ఎన్ని అఫర్మేషన్లు చేసుకున్నా వృధా.శరీరం అనుమతిస్తేనే అఫర్మేషన్లు పనిచేస్తాయి. మెదడు నుంచి గుండెకి, గుండెనుంచి పొట్టకీ వేగాస్ నాడి వ్యాపించి వుంటుంది. పొట్ట (గట్) ని సెకండ్ బ్రెయిన్ అనీ, గుండెని థర్డ్ బ్రెయిన్ అనీ అంటారు. మెదడులో రోజల్లా ఎంతలేదన్నా 60-80 వేల ఆలోచనలు పుట్టుకొస్తూంటాయి. నెగెటివ్ ఆలోచనలు 80 శాతం వుంటే పాజిటివ్ ఆలోచనలు 20 శాతం వుంటాయి. ఒక్కో ఆలోచనతో 2.5 ఓల్టుల  విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ ఆలోచనలు మెదడులో న్యూరాన్లలో పుట్టి వేగాస్ నాడి ద్వారా గుండెకీ పొట్టకీ చేరతాయి. అలా శరీర కణజాలం (మొత్తం 80 ట్రిలియన్ల కణాలు) అంతటా వ్యాపించి జ్ఞాపకాలుగా తిష్టవేస్తాయి. అంటే మెదడు భాషంతా శరీర కణ జాలమంతా విని జ్ఞాపకాలుగా రికార్డు చేసుకుంటాయన్న మాట. మనుషులు వెధవ్వేషాలేసి  తప్పించుకోకుండా శిక్షించడానికి డీఫాల్టుగా ఈ ఏర్పాటు అన్నమాట. మెదడు నుంచి పాజిటివ్ ఆలోచనలు వస్తే శరీర కణాలన్నీ ఆరోగ్యంతో డాన్సు చేస్తాయి. నెగెటివ్ ఆలోచనలు అందితే ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మంచి మంచి రోగాలతో శిక్షిస్తాయి. ఇక్కడ బేసిక్ లా ఆఫ్ ఎట్రాక్షన్ తో ఏం జరుగుతుందంటే, దీంతో చేసే అఫర్మేషన్స్ లో  ఫీలింగ్ వుండదు. ఫీలింగ్ లేకుండా బోలెడు ఎమోషన్ తో ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని ఎంత అరిచి గీపెట్టినా గాలిలో కలిసిపోవడ మే తప్ప విశ్వానికి అందవు. విశ్వానికి అర్ధమయ్యేది తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలు కాదు- ఫీలింగు భాష. కాబట్టి అలా చేసే అఫర్మేషన్లు  శరీరాన్ని దాటి వెళ్ళవు, మెదడులో పుట్టే విద్యుత్ శరీరానికే పరిమితమైపోతుంది. అఫర్మేషన్లు లేదా ఇంకేవైనా ఆలోచనలు  విశ్వానికి చేరాలంటే శరీరం వెలుపల విద్యుదయస్కాంత క్షేత్రమంటూ పుట్టాలి. ఈ విద్యుదయస్కాంత క్షేత్రం గుండెల్లో ఫీలింగ్ వల్ల ఏర్పడుతుంది. మెదడులో ఎమోషన్లు పుడితే గుండెల్లో ఫీలింగులు పుడతాయి. మెదడులో బంపర్ ఎమోషన్స్ తో చేసిన అఫర్మేషన్లని వేగాస్ నాడి  గుండెకి అందిస్తూ, ‘నీకు ఓకేనా?’ అని అడుగుతుంది. అప్పుడు గుండె చిరాకు పడి ఇందులో ఫీలింగు లేదని రిజెక్ట్ చేస్తుంది. మరి చేసిన అఫర్మేషన్స్ తో గుండెల్లో ఫీలింగు పుట్టాలంటే ఏం చేయాలి? ఇదే అడ్వాన్సుడు లా ఆఫ్ ఎట్రాక్షన్ నేర్పుతుంది...

నం ఫ్రీక్వెన్సీ తో మాత్రమే విశ్వంతో సంభాషించగలం. ఫ్రీక్వెన్సీ ఎలా పుడుతుంది? ఫ్రీక్వెన్సీ కంటే ముందు స్వాభావికంగా వైబ్రేషన్ వుంటుంది. సృష్టిలో సమస్తం వైబ్రేషన్ ని విడుదల చేస్తూంటాయి. సృష్టిలో ప్రతిదీ అణువులతో ఏర్పడి వుంది. ఈ అణువులు పరమాణువులతో కూడి వుంటాయి. ఈ పరమాణువుల కేంద్రకం (న్యూక్లియస్) లో న్యూట్రాన్లు, ప్రోటాన్లు వుంటాయి. వీటి చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ వుంటాయి. మన శరీరం సహా ప్రతి జీవిలో, ప్రతీ వస్తువులో పదార్ధ నిర్మాణమిదే. ఎలక్ట్రాన్ల పరిభ్రమణతో వైబ్రేషన్ (కంపనం) పుడుతుంది. ఈ వైబ్రేషన్స్ తీవ్రతని ఫ్రీక్వెన్సీ నిర్ణయిస్తుంది. ఫ్రీక్వెన్సీ ఫీలింగుల వల్ల పుడుతుంది. ఫీలింగు బలహీనంగా వుంటే బలహీన ఫ్రీక్వెన్సీ, బలంగా వుంటే బలమైన ఫ్రీక్వెన్సీ పుడతాయి. బలమైన ఫ్రీక్వెన్సీ విశ్వానికి చేరి మనకే తిరిగి వస్తుంది. వస్తున్నప్పుడు మనం కోరుకున్న గిఫ్ట్ తెచ్చి మన చేతిలో పెడుతుంది. ఇదే గమ్మత్తు!

బలమైన ఫీలింగుతో ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని అఫర్మేషన్స్ ఇస్తే, విశ్వం స్పందించి దానికదే నిర్మాతని ఎక్కడో వెతికి గిఫ్ట్ రూపంలో అందిస్తుంది. అయితే ముందు ఫీలింగ్స్ కి కేంద్రమైన గుండెకి ఫీలింగ్స్ ని ఎలా తెలియజేయాలి? సింపుల్. చేస్తున్న అఫర్మేషన్ కి ‘ఎందుకంటే’ అని జోడించి చెప్పాలి. ‘నేను దర్శకుడ్ని అయ్యాను, ఎందుకంటే ఇది మా నాన్న కోరిక’, లేదా ‘ఎందుకంటే నన్ను పంపించిన మా వూరి వాళ్ళ కోరిక’, లేదా ‘ఎందుకంటే ప్రేక్షకులకి మరపురాని అనుభూతి నిచ్చేందుకు’, లేదా ‘ఎందుకంటే పేదలకి అన్నం పెట్టేందుకు’ ...

 ఇలా సెంటిమెంటు జోడిస్తే గుండె ఫీలై ఓకే చేసి వేగాస్ నాడికి ఓకే చెప్తుంది. వేగాస్ నాడి మెదడుకి చెప్తుంది. మెదడు అఫర్మేషన్స్ వల్ల తనలో పుట్టిన ఎమోషన్స్ కి, గుండె నుంచి వచ్చిన ఫీలింగ్స్ తో వైబ్రేషన్స్ కి జోడిస్తే, విద్యుదయస్కాంత క్షేత్రమేర్పడి ఫ్రీక్వెన్సీ పుట్టి విశ్వం లోకి దూసుకెళ్ళి పోతుంది. విశ్వం పెద్ద మాయాజాలం. వెంటనే ఈ ఫీలింగుని గుర్తిస్తుంది. ఎందుకు గుర్తిస్తుంది? విశ్వమంటే  విశ్వమంత ప్రేమగనుక. ఎవరిపట్లా బేధ భావం చూపక మనందరికీ ప్రేమని పంచి పెట్టాలనే పని చేస్తుంది. కాబట్టి దర్శకుడ వ్వాలన్న గోల్ ని ఎంతో ప్రేమిస్తూ వుండాలి.

మరి గుండె ఫీలింగ్స్ ని ఎలా గుర్తిస్తుంది? మెదడులో ఎమోషన్స్ కొన్ని హార్మోన్లని ఉత్పత్తి చేస్తాయి. వాటి ద్వారా గుర్తిస్తుంది. అంటే ఎమోషన్స్ మనసుకి సంబందినవైతే, ఫీలింగ్స్ శరీరానికి సంబంధించినవి.

మరిప్పుడు పొట్ట (గట్) చేసే పనేమిటి? ఇది విశ్వం నుంచి వచ్చే సంకేతాల్ని పట్టుకుని అప్రమత్తం చేస్తుంది. దీనినే గట్ ఫీలింగ్ అంటాం. ఈ ఫీలింగ్ ని యాదృచ్చికంగా నమ్మేసి యాక్షన్ తీసుకుంటాం. ఒక గోల్ కోసం అఫర్మేషన్స్ చేస్తూంటే ఎప్పుడైనా విశ్వం అది నెరవేరే సంకేతాలు అందించవచ్చు. అది సిక్స్త్ సెన్స్ రూపంలో కావచ్చు, దివ్యదృష్టి రూపంలో కావచ్చు, మెదడులో మెరుపులు కావచ్చు, కలలూ కావచ్చు. నీ గిఫ్ట్ ప్యాక్ అయింది, అందుకోవడానికి రెడీ అవ్వు అని విశ్వం చెప్పడం. అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు ఎలర్ట్ గా వుండాలి. సంకేతాల్ని పసిగట్టి వాటి అర్ధాల్ని తెలుసుకుంటే ఆమేరకు వెంటనే రంగంలోకి దిగి గిఫ్ట్ అందుకోచ్చు. ఒక్కోసారి నేరుగా నిర్మాత నుంచే ఫోన్ రావచ్చు.మరిన్ని మార్గాలు రేపు మనసుకి సంబందించిన స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత వివరంగా తెలుసుకుందాం.

సికిందర్


Monday, September 1, 2025

1390 : స్పెషల్ ఆర్టికల్


 

 క్కడ అతను కారు దిగి తన్మయత్వంతో గంతులేస్తున్నాడు. కొంత దూరంలో విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలుపుతున్న దిగ్గజ సినిమా ప్రపంచం. ఆ ప్రపంచంలో తనూ పెద్ద స్టార్ అవుతానని బలంగా నమ్ముతూ నృత్యం చేశాడు. ఆ నమ్మకం చెదిరిపోకుండా తనకి తాను 10 మిలియన్ డాలర్లకి చెక్కు రాసుకున్నాడు. దాని వెనుక ‘నటుడిగా నేను సేవలందించి నందుకు నా పారితోషికం’ అని రాసి, నాలుగేళ్ళ గడువుతో తేదీ వేశాడు. దాన్ని పర్సు లో పెట్టుకున్నాడు. తనని పెద్ద స్టార్ గా విజువలైజ్ చేసుకుంటూ, అది సాధించేసినట్టూ, ఆ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టూ మెంటల్ మూవీ చూసుకోసాగాడు. తన జీవిత పరమార్ధంగా, ప్రజల్ని బాధల నుంచి విముక్తి చేయడంగా ప్రకటించుకున్నాడు. ఇక చిన్న చిన్న కామెడీ  షోలు నటించడం మొదలెట్టాడు. రోజులు గడిచిపోతున్నాయి. పర్సులో చెక్కు నలిగిపోతోంది. కామెడీ షోలు ఉధృతం చేశాడు. అప్పుడు మూడేళ్ళకి ఒక నిర్మాత నుంచి కాల్ వచ్చింది- నిన్ను ‘డంబ్ అండ్ డంబర్’ మూవీకి మిలియన్ డాలర్ల పారితోషికంతో హీరోగా తీసుకుంటున్నామని!

క్యాబ్ డ్రైవర్ జిమ్ కేరీ హాలీవుడ్ లో ఎక్కడా హీరో వేషాల కోసం ప్రయత్నాలు చేయలేదు. అలా చేసి వుంటే స్టూడియోల చుట్టూ తిరుగుతూ వుండిపోయే వాడేమో. తన లక్ష్యం కోసం అతను తీసుకున్న యాక్షన్ బయట కామెడీ షోలు నటిస్తూ లోకం దృష్టిలో పడాలనే. నటనని డెవలప్ చేసుకోవాలనే. ఆ కామెడీ షోలతో అతడి టాలెంట్ హాలీవుడ్ కి చేర్చింది! నాలుగేళ్ళు టైం పెట్టుకుంటే మూడేళ్ళకే సంకల్పం చేసుకున్న అవకాశం వరించింది. అదీ అక్షరాలా చెక్కుమీద రాసుకున్న మొత్తంతో!... చూస్తూండగానే అతను పెద్ద కామెడీ స్టార్ అయిపోయాడు. తన జీవిత పరమార్ధం కోసం ‘ది చర్చ్ ఆఫ్ ఫ్రీడం ఫ్రమ్ కన్సర్న్’ ఛారిటీ సంస్థ ప్రారంభించి, లా ఆఫ్ ఎట్రాక్షన్ కోరే పూర్తి స్ట్రక్చర్ కి న్యాయం చేసి, ఇప్పటికీ దశాబ్దాల పాటుగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు విశ్వం ఆశీస్శులతో! జీవిత పరమార్ధం లేకపోతే వ్యక్తిగత లక్ష్యాన్ని నెరవేర్చదు విశ్వం!

జిమ్ కేరీయే కాదు- ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్, విల్ స్మిత్, డెంజిల్ వాషింగ్టన్, ఇడ్రిస్ ఎల్బా వంటి స్టార్లు, ‘ది గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా లా ఆఫ్ ఎట్రాక్షన్ నుపయోగించి కలల్ని పండించుకున్న వాళ్ళే. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, ఆలియా భట్, దీపికా పడుకొనే, అనూష్కా శర్మ, బిపాసా బసు, విద్యాబాలన్, జాహ్నవీ కపూర్ ఎల్ ఓ ఏ తో అవకాశాలు పొందిన వాళ్ళే. .

మరి ఎల్ ఓ ఏ స్ట్రక్చర్ సంగతులేమిటి? అదెలా వుంటుంది? ఎల్ ఓ ఏ కేవలం మనసుకి సంబంధించిందేనా, శరీరానికి కూడా సంబందించిందా? అదెలా? వివరంగా రేపు తెలుసుకుందాం....

సికిందర్

Sunday, August 31, 2025

1389 : స్పెషల్ ఆత్రికల్

ఆదివారం ఈ సినిమా బ్లాగులో పొసగని ఆర్టికల్ కి చోటు కల్పించాల్సి వస్తోంది. కొంత కాలంగా కొందరు సినిమా వాళ్ళు పదేపదే కోరడం వల్ల తప్పనిసరై పోతోంది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నేర్చుకోవడమెలా అనేది ఇక్కడ ప్రధానమై వుండగా, అంత కంటే ప్రధానం చేసి అసలు సినిమా అవకాశాలు పొందడమెలా చెప్పమంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం ఒక ఆర్టికల్ లో చేసిన చిన్న ప్రస్తావనని పట్టుకుని అవకాశాలు -ముఖ్యంగా దర్శకత్వ అవకాశాలు - పొందే మార్గాన్ని వివరించమంటున్నారు. దర్శకత్వ అవకాశాలే కాదు, ఇంకే రంగంలో ఇంకే అవకాశాలు పొందాలన్నా ఒకటే స్ట్రక్చర్ వుంది. ఈ స్ట్రక్చర్ ని పాటించడమే కష్టం. లేకపోతే ఈ ప్రపంచం అవకాశాలు పొందిన వాళ్ళతో నిండిపోయి వుండేది. కఠోర రమైన క్రమశిక్షణ కోరే ఈ స్ట్రక్చర్ ని దాదాపు ఎవ్వరూ పాటించరు. అందువల్ల స్ట్రగుల్ చేస్తూనే వుంటారు. స్ట్రగుల్ కి అలవాటుపడి పోతారు. అదే జీవితమై పోతుంది.

యినా ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మాట్లాడుకుందాం. దర్శకత్వ అవకాశాల కోసం నెలల తరబడి, ఏళ్ళ తరబడి ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మందే వున్నారు. ప్రతీ ఏడాది దాదాపు వంద మందికి కొత్త నిర్మాతలు దొరికి, ఒక సినిమా తీసి ఆ  నిర్మాతా కొత్త దర్శకుడూ ఫ్లాపయి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఏడాది మరో వంద మంది కొత్త నిర్మాతలు కొత్త దర్శకులకి దొరికీ, వాళ్ళూ ఆ సినిమాతో ఫ్లాపయి వెళ్ళిపోతున్నారు. ఇదిలా  రిపీటవుతూనే వుంది. అయితే ప్రతీ ఏడాది వంద మంది కొత్త నిర్మాతలు ఫీల్డుకి వస్తూంటే నా కెందుకు దొరకడం లేదని రెండు సినిమాలు తీసిన దర్శకుడి ఆవేదన. వాళ్ళ కళ్ళ ముందే కొత్తగా వచ్చిన కొందరు ఇట్టే అవకాశాలు చేజిక్కించుకుని దర్శకులై పోతున్నారు.  

ఇదెలా జరుగుతోంది? వీళ్ళ స్ట్రక్చర్ ఏమిటి? ఏమీ లేదు, విషయం లేక పోయినా మాటకారితనంతో పనైపోతోంది. లేదా ఇంకేవో చేసి పెడితే కొందరి పనైపోతోంది. ఇలా చేయలేని వాళ్ళు రిక్త హస్తాలతో మిగిలిపోతున్నారు. అయితే చేస్తున్న వాళ్ళని చూసి  కుంగి పోనవసరం లేదు. ఒక స్ట్రక్చర్ తో చేయడం గురించి ఆలోచించాలి. అంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు, సక్సెస్ సూత్రాలు చెప్పే స్ట్రక్చర్. సినిమా ఫీల్డు ఎలాంటిదంటే ఇక్కడ దర్శకుడు సినిమా తీయాలంటే నిర్మాతే పెట్టుబడి పెట్టాలి. ఇంకే రంగంలో- అంటే సర్వీసులు, పరిశ్రమలు, ఇంకేవైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఎవరి చుట్టూ తిరగనవసరం లేదు. బ్యాంకు రుణాలు పొంది తామే బాసులవ్వచ్చు. కేంద్ర  ప్రభుత్వమిస్తున్న ముద్ర్రా యోజన రుణాలకి ఎటువంటి హామీ కూడా అవసరం లేదు. సినిమా రంగంలో ఈ రుణాలు లభించవు. పెట్టుబడికి నిర్మాతలొక్కరే దిక్కు. ఇదీ సమస్య.

నిర్మాత ఎందుకు పెట్టుబడిపెట్టాలి

    ఏ నిర్మాతైనా కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాలి? నిర్మాత పెట్టుబడి పెట్టడానికి దర్శకుడు తన మీద తానూ ఏం వెచ్చించాడు? ముందు తన మీద తానూ ఏమీ వెచ్చించకుండా నిర్మాత పెట్టుబడి పెట్టాలనుకోవడం అజ్ఞానమే, అత్యాశ కూడా. నిర్మాతకి డబ్బు జ్ఞానముంటుంది. దర్శకుడు  తన జ్ఞానం కోసం తన మీద ఏమీ వెచ్చింఛి వుండడు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ తేడా కొడుతోంది. దీంతో అన్ కాన్షస్ గా నిర్మాత వికర్షిస్తున్నాడు. ఇంతే, ఇంతకంటే  ఇంకేమీ లేదు.

నేను రెండు సినిమాలకి అసిస్టెంట్ గా పనిచేశాను కదా, ఈ ఇన్వెస్ట్ మెంట్ చాలదా అనొచ్చు. ఇదొక్కటే కాదు, సమాంతరంగా ఇంకా చాలా ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే పది సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా, అసోషియేట్ గా, కో డైరెక్టర్ గా స్ట్రగుల్ చేస్తూనే వుండే  పరిస్థితి వుంటుంది. ఏదో విధంగా ఒక సినిమా అవకాశం వస్తే చాలనుకునే వాళ్ళకి ఈ ఆర్టికల్ అవసరం లేదు. సరైన అవకశాలు పొంది సరైన విజయాలు సాధిస్తూ, దర్శకులుగా స్థిరపడాలనుకునే వాళ్ళ కోసమే ఈ ఆర్టికల్. దీనికి అవసరమైన ప్రాక్టికల్ స్ట్రక్చర్ ని పాటిస్తే చాలు. లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఆకర్షణ నియమం) గురించి వినే వుంటారు. స్థూలంగా మనం కోరుకున్నది విశ్వం అందిస్తుందని  చెప్పే ఈ నియమాన్ని ఇతర రంగాల్లో కూడా చాలా మంది పాటిస్తూనే వుంటారు. కానీ చాలా మందికి కోరుకున్న ఫలితాలే రావు. కారణం దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడమే.  ఇవ్వాళ లా ఆఫ్ ఎట్రాక్షన్ పెద్ద బిజినెస్ అయిపోయింది. దాదాపు అన్ని భాషల్లో యూ ట్యూబ్ లో లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఎల్ ఓ ఏ) నేర్పే నిపుణులు కుప్పలుగా పుట్టు కొచ్చేస్తున్నారు. వీళ్ళతో ఎవ్వరూ ఫలితాలు సాధించే అవకాశం లేదు. వీళ్ళు మాత్రం యూట్యూబ్ వ్యూస్ పెంచుకుని ధనికులై పోతున్నారు. రామ్ వర్మ, డాక్టర్ అమిత్ కుమార్, మితేష్ ఖత్రీ, అజయ్ మిశ్రా వంటి అతి కొద్ది మంది మాత్రమే అసలు లా ఆఫ్ ఎట్రాక్షన్ అంటే ఏమిటో స్పష్టంగా బోధించగలుగుతున్నారు. ఉదాహరణకి ‘నేను దర్శకుడ్ని, నేను దర్శకుడ్ని’ అని ఎన్నిసార్లు -ఎంత కాలం మనసుకి కమాండ్ ఇచ్చినా ఎవ్వరూ దర్శకులు కాలేరు. దీనికి జోడించాల్సిన స్ట్రక్చర్ చాలా వుంది. ఎల్ ఓ ఏ లో చాలా పరిశోధనలు జరుగుతూ నిత్యం అప్డేట్ అవుతోంది. ఇది తెలుసుకోవాలి.

రెండు వందల ఏళ్ళ చరిత్ర


        లా ఆఫ్ ఎట్రాక్షన్ కి రెండు వందల ఏళ్ళ చరిత్ర వుంది. దీనికంటే ముందే మత గ్రంధాలు చెప్పాయి. మత గ్రంధాలు చెప్పేవి మానవ సైకాలజీ / సైకో థెరఫీ అనికాక వేరే భాష్యాలు చెప్పడం వల్ల ఎల్ ఓ ఏ బయటపడలేదు. 200 ఏళ్ళక్రితం పాశ్చాత్య శాస్త్రవేత్తలు సరైన భాష్యం చెప్పి అభివృద్ధి చేశారు, జనసామాన్యం లోకి తీసికెళ్ళారు. తర్వాత 20 వ శతాబ్దంలో సైన్సులో క్వాంటం ఫిజిక్స్ విప్లవాత్మకంగా ఆభివృద్ధి చెందడంతో, ఆకర్షణ నియమం స్ట్రక్చర్ మరింత పటిష్టంగా ఏర్పడింది. మనమిక్కడ ఎల్ ఓ ఏ పూర్తి స్ట్రక్చర్ గురించే తెలుసుకుందాం. క్యాంటం ఫిజిక్స్ ఆధారంగా తర్వాతి వ్యాసంలో ఎప్పుడైనా చూడొచ్చు.

ఎల్ ఓ ఏ ని వృత్తి వ్యాపారాల కోసమే గాక, మానవ సంబంధాలు, ఆరోగ్యం, ఆర్ధికం కోసం కూడా ఉపయోగించ వచ్చు. ఏది పొందాలని కోరుకున్నా దాన్ని ఒక గోల్ అనుకుందాం. ఒక గోల్ అనుకున్నాక, రాత్రి నిద్ర పోయేముందు, ఉదయం మెలకువ రాగానే ఆ గోల్ కోసం అఫర్మేషన్ (ప్రతిజ్ఞ/ప్రమాణం) చేసుకోవాలి. అంటే దర్శకుడు కావాలన్నది గోల్ అయితే ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని పదే పదే అనుకోవాలి. దర్శకుడైపోయినట్టు  విజువలైజ్ చేసుకోవాలి. తర్వాత విజన్ బోర్డు తయారు చేసుకుని దాని మీద గోల్ తాలూకు  బొమ్మలు అతికించుకోవాలి, తర్వాత యాక్షన్ తీసుకోవాలి. అంటే స్క్రిప్టు రాసుకోవడం మొదలెట్టుకోవాలి, సినిమా వాళ్ళ మధ్య గడపాలి, సినిమాల గురించే మాట్లాడాలి. నిర్మాతల్ని కలుసుకునే మార్గాలు అలోచించి కలవడానికి ప్రయత్నించాలి. తిరిగి రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచాక అదే అఫర్మేషన్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తూపొతే అవకాశాలు రావడం ప్రారంభిస్తాయి. ఇంతేనా? ఇంత సులభమా? కానే కాదు. ఒకవేళ యాక్సిడెంటల్ గా అవకాశం లభించినా నిర్మాత దగ్గర ఫ్రీక్వేన్సీ తేడా కొడుతుంది. లా ఆఫ్ ఎట్రాక్షన్ అంతా మనతో ఈ విశ్వం ఆడే ఫ్రీక్వెన్సీల ఆట తప్ప మరేమీ కాదని ముందు బాగా గుర్తించుకోవాలి. ఇది మూఢనమ్మకాల కలగూరగంప కాదు, రుజువైన సైన్స్.

ఆ ఫ్రీక్వెన్సీ లేమిటి, అవి ఎక్కడ్నుంచి పుడతాయి,ఎక్కడికెళ్తాయి, విశ్వ శక్తి పాత్రేమిటి రేపు తెలుసుకుందాం.  

సికిందర్

(ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి)


 

Saturday, August 23, 2025

1388 : స్క్రీన్ ప్లే టిప్స్

 

 

        స్క్రిప్టు రాయడానికి ముందు ఎవరైనా ఏం చేస్తారు? కథ గురించి రూపు దిద్దుకున్న ఆలోచనని పేపరు మీద పెట్టడం ప్రారంభిస్తారు. అయితే ఆ ఆలోచన లేదా కాన్సెప్ట్ -దీనినే స్టోరీ ఐడియా అనుకుంటే, ఈ స్టోరీ ఐడియాతో స్క్రిప్టు ఎలా రాయాలో స్పష్టత లేకుండా రాసుకు పోవడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ స్టోరీ ఐడియాకి ఎంత వరకు న్యాయం జరుగుతుంది? పాత్రలు, సన్నివేశాలు, స్ట్రక్చర్, బీట్ షీట్లు, సంభాషణలు వగైరా ఎంతో బాగా రాయాలన్న ఉత్సాహం వుంటుంది- కానీ ఇవి స్టోరీ ఐడియాకి కనెక్ట్ కాకపోతే ఆ రాసినవన్నీ వృధా పోతాయి. దీనికి పరిష్కారమేమిటి? దీనికి పరిష్కారం PROBLEM లో వుంది. ఎలా? PROBLEM లో Pఅంటే Punishing, Rఅంటే Relatable, O  అంటే Original, B అంటే Believable, L అంటే Life –altering, E అంటే  Entertaining, M అంటే Meaningful. ఈ 7 టూల్స్ ని ఈ క్రింద పరిశీలిద్దాం....

1.                 1. Punishing : పాత్రలు వాటి పరిస్థితిని పరిష్కరించడం పనిష్మెంట్లా తీవ్రంగా అనిపించాలి, 2. Relatable : పాత్ర చిత్రణలు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా వుండాలి, 3. Original : కథకి ఫ్రెష్ యాంగిల్ ఇస్తున్నట్టు స్పష్టమవ్వాలి,4. Believable : కథ నమ్మదగ్గదిగా వుండాలి, 5. Life –altering : పాత్రల్ని ప్రశ్నార్ధకం చేసే పెను సవాళ్లు ఎదురవ్వాలి, 6. Entertaining : జానర్ అనుకూల ఫన్ వుండాలి, Meaningful. స్టోరీ ఐడియా వ్యక్తమయ్యేలా కథ గాఢత్వాన్ని (బ్యాక్ డ్రాప్ డెప్త్) సంతరించుకోవాలి.

చెక్‌లిస్ట్ తో స్టోరీ ఐడియాని  అమలు చేయడం ద్వారా నెలల తరబడి చేసిన కృషి వృధా పోకుండా వుంటుంది. మీ పాత్రల్ని అష్టకష్టాలకి గురి చేయాలి. రాసిన ఒక సన్నివేశం సజీవంగా అన్పించక పోవచ్చు. ఎందుకనేది అర్ధం గాదు. రాస్తున్నది యాక్టివ్ పాత్రే అయి వుండొచ్చు. ప్రేక్షకులతో  ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్టే అన్పించ వచ్చు. అయినా సన్నివేశం వర్కౌట్ కావడం లేదనే  అన్పిస్తుంది. అప్పుడు పరిశీలించాల్సింది ఆ సన్నివేశంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వుందా అని. పాత్రలు స్ట్రగుల్ చేస్తూంటే ప్రేక్షకులకి ఇష్టంగా వుంటుంది. మంచి కథ ఒక స్పోర్ట్స్ లాంటిది. ఓడిపోతున్న టీం పట్ల మనం ఆదుర్దాగా వుంటాం, ఎలాగైనా గెలవాలని కోరుకుంటాం. అలాగే  కొండంత కాన్ఫ్లిక్ట్ ని పాత్రలు  ఎదుర్కొంటూంటే టెన్షన్ పడుతూ శుభం జరగాలని కోరుకుంటాం. ఈ చిత్రణ సన్నివేశంలో లోపించిందేమో చూసుకుని సరిదిద్దుకోవాలి.

    సూపర్ హీరో సినిమాల్లో కూడా ఈ నియమాన్నే అనుసరిస్తారు. 90% రన్‌టైమ్‌లో విలన్ హీరో కంటే శక్తివంతంగా వుంటాడు. దీనర్థం ఎటువంటి కారణం లేకుండా పాత్రల పట్ల క్రూరంగా ప్రవర్తించాలని కాదు, సన్నివేశపరమైన సంఘర్షణ మాత్రమే ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుందని అర్థం చేసుకోవాలి. పాత్రలు తగినంతగా కష్టపడకపోతే  ప్రేక్షకులు వాటి పట్ల శ్రద్ధ వహించరనేది గుర్తించాలి.

    ఇక మీ కథ మీద అభిప్రాయాన్ని ప్రొఫెషనల్స్ ని అడిగి తెలుసుకోండి, స్నేహితుల్నో- కుటుంబ సభ్యుల్నో కాదు. ప్రొఫెషనల్ అభిప్రాయాన్ని పొందడం రైటర్ గా వుండడం లోని కష్టమైన పనుల్లో ఒకటి. చాలా మంది రైటర్స్ కి ప్రొఫెషనల్ అభిప్రాయాలు నచ్చవు, ఆహా ఓహో అని మెచ్చుకునే నాన్ ప్రొఫెషనల్ అభిప్రాయాలే నచ్చుతాయి. ఇదెంత తప్పో తర్వాత మీకే తెలుస్తుంది. మీ స్నేహితులు స్క్రీన్ రైటర్లు, మేనేజర్లు లేదా ప్రొఫెషనల్ విశ్లేషకులు కాకపోతే, వారు మీ కథలో పెద్ద లోపాల్ని సరి చేయడానికి చిన్న పరిష్కారాలపై దృష్టి పెట్టవచ్చు. ప్రొఫెషనల్ విశ్లేషకులు మీ పాత్ర గురించి మీరు పట్టించుకోనప్పుడు, గందరగోళంలో వున్నప్పుడు, లేదా వారు విసుగు చెందినప్పుడు మీకు చెబుతారు. అవి బాధించే పెద్ద సవరణలే కావొచ్చు, కానీ చాలా ముఖ్యమైనవి. ప్రొఫెషనల్ కన్సల్టేషన్ కోసం ఫీజు చెల్లించడం తప్పని సరి కావొచ్చు. ముందు మీ కథ మీద మీరు పెట్టుబడి పెట్టకపోతే అమ్మకం జరగడం కూడా కష్టం కావొచ్చు. స్ట్రగుల్ చేస్తూనే వుంటారు. మీ కథ మీద మీరు పెట్టుబడి పెట్టకపోతే, మీ కథ తీసుకుని నిర్మాత ఎందుకు కోట్లు పెట్టుబడి పెడతాడు. ఆలోచించాలి.  

ఎరిక్ బోర్క్
(హాలీవుడ్ నిర్మాత, దర్శకుడు)