ఈ ఆదివారం ఈ సినిమా బ్లాగులో పొసగని ఆర్టికల్ కి
చోటు కల్పించాల్సి వస్తోంది. కొంత కాలంగా కొందరు సినిమా వాళ్ళు పదేపదే కోరడం వల్ల
తప్పనిసరై పోతోంది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నేర్చుకోవడమెలా అనేది ఇక్కడ ప్రధానమై
వుండగా, అంత కంటే ప్రధానం చేసి అసలు సినిమా అవకాశాలు పొందడమెలా చెప్పమంటున్నారు.
సుమారు ఆరు నెలల క్రితం ఒక ఆర్టికల్ లో చేసిన చిన్న ప్రస్తావనని పట్టుకుని
అవకాశాలు -ముఖ్యంగా దర్శకత్వ అవకాశాలు - పొందే మార్గాన్ని వివరించమంటున్నారు.
దర్శకత్వ అవకాశాలే కాదు, ఇంకే రంగంలో ఇంకే అవకాశాలు పొందాలన్నా ఒకటే స్ట్రక్చర్
వుంది. ఈ స్ట్రక్చర్ ని పాటించడమే కష్టం. లేకపోతే ఈ ప్రపంచం అవకాశాలు పొందిన
వాళ్ళతో నిండిపోయి వుండేది. కఠోర రమైన క్రమశిక్షణ కోరే ఈ స్ట్రక్చర్ ని దాదాపు
ఎవ్వరూ పాటించరు. అందువల్ల స్ట్రగుల్ చేస్తూనే వుంటారు. స్ట్రగుల్ కి అలవాటుపడి పోతారు.
అదే జీవితమై పోతుంది.
అయినా ఇంతగా అడుగుతున్నారు కాబట్టి
మాట్లాడుకుందాం. దర్శకత్వ అవకాశాల కోసం నెలల తరబడి, ఏళ్ళ తరబడి ప్రయత్నిస్తున్న
వాళ్ళు చాలా మందే వున్నారు. ప్రతీ ఏడాది దాదాపు వంద మందికి కొత్త నిర్మాతలు దొరికి,
ఒక సినిమా తీసి ఆ నిర్మాతా కొత్త దర్శకుడూ
ఫ్లాపయి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఏడాది మరో వంద మంది కొత్త నిర్మాతలు కొత్త
దర్శకులకి దొరికీ, వాళ్ళూ ఆ సినిమాతో ఫ్లాపయి వెళ్ళిపోతున్నారు. ఇదిలా రిపీటవుతూనే వుంది. అయితే ప్రతీ ఏడాది వంద మంది
కొత్త నిర్మాతలు ఫీల్డుకి వస్తూంటే నా కెందుకు దొరకడం లేదని రెండు సినిమాలు తీసిన
దర్శకుడి ఆవేదన. వాళ్ళ కళ్ళ ముందే కొత్తగా వచ్చిన కొందరు ఇట్టే అవకాశాలు
చేజిక్కించుకుని దర్శకులై పోతున్నారు.
ఇదెలా జరుగుతోంది? వీళ్ళ స్ట్రక్చర్ ఏమిటి? ఏమీ
లేదు, విషయం లేక పోయినా మాటకారితనంతో పనైపోతోంది. లేదా ఇంకేవో చేసి పెడితే కొందరి
పనైపోతోంది. ఇలా చేయలేని వాళ్ళు రిక్త హస్తాలతో మిగిలిపోతున్నారు. అయితే చేస్తున్న
వాళ్ళని చూసి కుంగి పోనవసరం లేదు. ఒక స్ట్రక్చర్
తో చేయడం గురించి ఆలోచించాలి. అంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు, సక్సెస్ సూత్రాలు
చెప్పే స్ట్రక్చర్. సినిమా ఫీల్డు ఎలాంటిదంటే ఇక్కడ దర్శకుడు సినిమా తీయాలంటే
నిర్మాతే పెట్టుబడి పెట్టాలి. ఇంకే రంగంలో- అంటే సర్వీసులు, పరిశ్రమలు, ఇంకేవైనా
వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఎవరి చుట్టూ తిరగనవసరం లేదు. బ్యాంకు రుణాలు పొంది తామే
బాసులవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వమిస్తున్న
ముద్ర్రా యోజన రుణాలకి ఎటువంటి హామీ కూడా అవసరం లేదు. సినిమా రంగంలో ఈ రుణాలు
లభించవు. పెట్టుబడికి నిర్మాతలొక్కరే దిక్కు. ఇదీ సమస్య.
నిర్మాత ఎందుకు పెట్టుబడిపెట్టాలి
ఏ నిర్మాతైనా కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
నిర్మాత పెట్టుబడి పెట్టడానికి దర్శకుడు తన మీద తానూ ఏం వెచ్చించాడు? ముందు తన మీద
తానూ ఏమీ వెచ్చించకుండా నిర్మాత పెట్టుబడి పెట్టాలనుకోవడం అజ్ఞానమే, అత్యాశ కూడా. నిర్మాతకి
డబ్బు జ్ఞానముంటుంది. దర్శకుడు తన జ్ఞానం
కోసం తన మీద ఏమీ వెచ్చింఛి వుండడు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ తేడా కొడుతోంది. దీంతో అన్
కాన్షస్ గా నిర్మాత వికర్షిస్తున్నాడు. ఇంతే, ఇంతకంటే ఇంకేమీ లేదు.
నేను రెండు సినిమాలకి అసిస్టెంట్ గా పనిచేశాను
కదా, ఈ ఇన్వెస్ట్ మెంట్ చాలదా అనొచ్చు. ఇదొక్కటే కాదు, సమాంతరంగా ఇంకా చాలా
ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే పది సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా, అసోషియేట్ గా, కో డైరెక్టర్
గా స్ట్రగుల్ చేస్తూనే వుండే పరిస్థితి
వుంటుంది. ఏదో విధంగా ఒక సినిమా అవకాశం వస్తే చాలనుకునే వాళ్ళకి ఈ ఆర్టికల్ అవసరం
లేదు. సరైన అవకశాలు పొంది సరైన విజయాలు సాధిస్తూ, దర్శకులుగా స్థిరపడాలనుకునే
వాళ్ళ కోసమే ఈ ఆర్టికల్. దీనికి అవసరమైన ప్రాక్టికల్ స్ట్రక్చర్ ని పాటిస్తే చాలు.
లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఆకర్షణ నియమం) గురించి వినే వుంటారు. స్థూలంగా మనం కోరుకున్నది
విశ్వం అందిస్తుందని చెప్పే ఈ నియమాన్ని
ఇతర రంగాల్లో కూడా చాలా మంది పాటిస్తూనే వుంటారు. కానీ చాలా మందికి కోరుకున్న ఫలితాలే
రావు. కారణం దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడమే. ఇవ్వాళ లా ఆఫ్ ఎట్రాక్షన్ పెద్ద బిజినెస్ అయిపోయింది.
దాదాపు అన్ని భాషల్లో యూ ట్యూబ్ లో లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఎల్ ఓ ఏ) నేర్పే నిపుణులు
కుప్పలుగా పుట్టు కొచ్చేస్తున్నారు. వీళ్ళతో ఎవ్వరూ ఫలితాలు సాధించే అవకాశం లేదు.
వీళ్ళు మాత్రం యూట్యూబ్ వ్యూస్ పెంచుకుని ధనికులై పోతున్నారు. రామ్ వర్మ, డాక్టర్
అమిత్ కుమార్, మితేష్ ఖత్రీ, అజయ్ మిశ్రా వంటి అతి కొద్ది మంది మాత్రమే అసలు లా ఆఫ్
ఎట్రాక్షన్ అంటే ఏమిటో స్పష్టంగా బోధించగలుగుతున్నారు. ఉదాహరణకి ‘నేను దర్శకుడ్ని,
నేను దర్శకుడ్ని’ అని ఎన్నిసార్లు -ఎంత కాలం మనసుకి కమాండ్ ఇచ్చినా ఎవ్వరూ
దర్శకులు కాలేరు. దీనికి జోడించాల్సిన స్ట్రక్చర్ చాలా వుంది. ఎల్ ఓ ఏ లో చాలా
పరిశోధనలు జరుగుతూ నిత్యం అప్డేట్ అవుతోంది. ఇది తెలుసుకోవాలి.
రెండు వందల ఏళ్ళ చరిత్ర
లా ఆఫ్ ఎట్రాక్షన్ కి రెండు వందల ఏళ్ళ చరిత్ర
వుంది. దీనికంటే ముందే మత గ్రంధాలు చెప్పాయి. మత గ్రంధాలు చెప్పేవి మానవ సైకాలజీ /
సైకో థెరఫీ అనికాక వేరే భాష్యాలు చెప్పడం వల్ల ఎల్ ఓ ఏ బయటపడలేదు. 200 ఏళ్ళక్రితం
పాశ్చాత్య శాస్త్రవేత్తలు సరైన భాష్యం చెప్పి అభివృద్ధి చేశారు, జనసామాన్యం లోకి
తీసికెళ్ళారు. తర్వాత 20 వ శతాబ్దంలో సైన్సులో క్వాంటం ఫిజిక్స్ విప్లవాత్మకంగా ఆభివృద్ధి
చెందడంతో, ఆకర్షణ నియమం స్ట్రక్చర్ మరింత పటిష్టంగా ఏర్పడింది. మనమిక్కడ ఎల్ ఓ ఏ పూర్తి
స్ట్రక్చర్ గురించే తెలుసుకుందాం. క్యాంటం ఫిజిక్స్ ఆధారంగా తర్వాతి వ్యాసంలో
ఎప్పుడైనా చూడొచ్చు.
ఎల్ ఓ ఏ ని వృత్తి వ్యాపారాల కోసమే గాక, మానవ
సంబంధాలు, ఆరోగ్యం, ఆర్ధికం కోసం కూడా ఉపయోగించ వచ్చు. ఏది పొందాలని కోరుకున్నా దాన్ని
ఒక గోల్ అనుకుందాం. ఒక గోల్ అనుకున్నాక, రాత్రి నిద్ర పోయేముందు, ఉదయం మెలకువ
రాగానే ఆ గోల్ కోసం అఫర్మేషన్ (ప్రతిజ్ఞ/ప్రమాణం) చేసుకోవాలి. అంటే దర్శకుడు
కావాలన్నది గోల్ అయితే ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని పదే పదే అనుకోవాలి. దర్శకుడైపోయినట్టు
విజువలైజ్ చేసుకోవాలి. తర్వాత విజన్
బోర్డు తయారు చేసుకుని దాని మీద గోల్ తాలూకు బొమ్మలు అతికించుకోవాలి, తర్వాత యాక్షన్
తీసుకోవాలి. అంటే స్క్రిప్టు రాసుకోవడం మొదలెట్టుకోవాలి, సినిమా వాళ్ళ మధ్య
గడపాలి, సినిమాల గురించే మాట్లాడాలి. నిర్మాతల్ని కలుసుకునే మార్గాలు అలోచించి కలవడానికి
ప్రయత్నించాలి. తిరిగి రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచాక అదే అఫర్మేషన్ చేయాలి.
ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తూపొతే అవకాశాలు రావడం ప్రారంభిస్తాయి. ఇంతేనా?
ఇంత సులభమా? కానే కాదు. ఒకవేళ యాక్సిడెంటల్ గా అవకాశం లభించినా నిర్మాత దగ్గర
ఫ్రీక్వేన్సీ తేడా కొడుతుంది. లా ఆఫ్ ఎట్రాక్షన్ అంతా మనతో ఈ విశ్వం ఆడే ఫ్రీక్వెన్సీల
ఆట తప్ప మరేమీ కాదని ముందు బాగా గుర్తించుకోవాలి. ఇది మూఢనమ్మకాల కలగూరగంప కాదు,
రుజువైన సైన్స్.
ఆ ఫ్రీక్వెన్సీ లేమిటి, అవి ఎక్కడ్నుంచి
పుడతాయి,ఎక్కడికెళ్తాయి, విశ్వ శక్తి పాత్రేమిటి రేపు తెలుసుకుందాం.
−సికిందర్
(ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి)