రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 24, 2024

1441 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : రాజేష్ జగన్నాధం
తారాగణం : రుణ్ సందేశ్, ఎనీ, శ్రియా రాణిరెడ్డి, తనికెళ్ల భరణి, అన్నీ, భద్రమ్, చత్రపతి శేఖర్, మైమ్ మధు తదితరులు
సంగీతం : సంతు ఓంకార్, ఛాయాగ్రహణం : రమీజ్ నవీత్  నిర్మాత: రాజేష్ జగన్నాధం
విడుదల : జూన్ 21, 2024

***

        తెరమరుగైన హేపీడేస్ హీరో వరుణ్ సందేశ్ చాలాకాలం తర్వాత తెరపైకొచ్చాడు. ఈసారి తనకి అలవాటయిన రోమాంటిక్ సినిమా కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయత్నించాడు. దీనికి రాకేష్ జగన్నాథం కొత్త దర్శకుడు, నిర్మాత.  అయితే వారం వారం ఇంకో మార్గం లేనట్టు అర్షకత్వం వచ్చిపడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్స్ సూచిస్తోంది. నిడివి కూడా రెండు గంటలే వుంది. నిండా టైటిల్ బావుంది. బరువైన కథని సూచిస్తోంది. మరి ఇదెంత బలంగా ఆకట్టుకునే అవకాశముంది? చూద్దాం...

కథ

వివేక్ (వరుణ్ సందేశ్)  మానవ హక్కుల సంఘంలో పని చేస్తూంటాడు. అతడి తండ్రి (తనికెళ్ళ భరణి) జడ్జి. ఇతను మంజు అనే అమ్మాయి హత్య కేసులో బాలరాజు (ఛత్రపతి శేఖర్) కి మరణ శిక్ష విధిస్తాడు. అయితే బాలరాజుని తప్పుడుగా శిక్షించానని బాధపడుతూ మరణిస్తాడు. తండ్రి మాటలు నమ్మిన వివేక్, అమాయకుడైన బాలరాజుని కేసు నుంచి విడిపించడానికి రంగంలోకి దిగుతాడు. సాక్ష్యాధారాల్ని తారుమారు చేసిన ఒక ఎస్సైని, డాక్టర్ ని, లాయర్ని, కానిస్టేబుల్ ని, ఇద్దరు సాక్షుల్నీ కిడ్నాప్ చేసి గదిలో బంధించి నిజం కక్కించే పని చేపడతాడు. ఏమిటా నిజం? మంజునెవరు ఎందుకు చంపారు? బాలరాజునెలా ఇరికించారు? అసలు దోషిని పట్టుకుని ఉరిశిక్ష నుంచి బాలరాజుని వివేక్ ఎలా కాపాడాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఒక బలహీన రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథే. సస్పెన్స్, థ్రిల్ లేకుండా వారం వారం వస్తున్న అమెచ్యూర్ కథే. అయితే ఇది ఇంకో అడుగు ముందుకెసి సస్పెన్స్, థ్రిల్లే గాకుండా యాక్షన్ కూడా లేకుండా గదిలో డైలాగులతో నడిచే కథగా ముందుకొచ్చింది. కళ్ళు మూసుకుని డైలాగులు వింటూంటే కథ అర్ధమైపోతుంది. అంటే విజువల్ మీడియా లక్షణం కూడా లేని రేడియో నాటిక లాంటి కథ అన్నమాట. దీన్ని సినిమాగా తీయకుండా డైలాగులు రికార్డు చేసి ఆడియో విడుదల చేసినా సరిపోయేది.
       
మాస్కు వేసుకున్న వరుణ్ సందేశ్ ఆరుగుర్ని కిడ్నాప్ చేసి గదిలో బంధించడంతో మొదలవుతుంది. వాళ్ళకి మంజు హత్య కేసు వివరించి
, దీన్ని మీరెలా తప్పుదోవ పట్టించారో చెప్పమంటూ హింసిస్తాడు. అప్పుడు ఒకొక్కరూ చెప్పే ఫ్లాష్ బ్యాక్స్ తో కథ వస్తూంటుంది. ఫస్టాఫ్ గదిలో ఈ సంభాషణే, సెకండాఫ్ లోనూ గదిలో టేబుల్ చుట్టూ కూర్చుని ఈ సంభాషణే. గదిదాటి బయటి కెళ్ళదు కథ. ఫ్లాష్ బ్యాక్స్ లోనే బయట పల్లెటూళ్ళో సీన్లు వస్తాయి. ఇలా అడిగి అడిగి అడుగుతూ పోతూంటే, వాళ్ళు చెప్పీ చెప్పీ చెప్తూ పోవడమే కథనం.
       
ఇంతా చేసి ఆ ఆరుగురు తప్పు ఒప్పుకుంటారే తప్ప
, హత్య ఎవరు చేశారో వాళ్ళకీ తెలీదు. ఆ హత్యలో బాలరాజుని మాత్రం ఇరికించారు. ఇక్కడ్నుంచి క్లయిమాక్స్ లో నైనా అసలు దోషిని కనుక్కునేందుకు యాక్షన్ లో కొచ్చి బయట అడ్వెంచర్స్ చేస్తాడనుకుంటే అదీ జరగదు. జైల్లో వున్న బాలరాజునే అడిగితే బాలరాజు చెప్పేస్తాడు మంజుని చంపిందెవరో!
       
ఇలా డైలాగులతో నడిచే కథకి ఫ్లాష్ బ్యాక్స్ లో పల్లెటూళ్ళో వచ్చే సీన్లూ పేలవమే. పల్లెటూళ్ళో రోమాన్స్ చెప్పక్కర్లేదు. ఏ సీన్లో కూడా డ్రామా
, భావోద్వేగాలుండవు. చిత్రీకరణలో దర్శకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తుంది. పొలంలో హత్యకి గురై పడున్న అమ్మాయి శవమైతే – మేకప్ చెదరని గ్లామరస్ ఫేసుతో కళకళ లాడుతూ వుంటుంది. నిర్మాణంలో అన్ని  శాఖల్లోనూ అత్యంత బలహీనం ఈ సస్పెన్స్ థ్రిల్లర్.

నటనలు - సాంకేతికాలు

వరుణ్ సందేశ్ పాత్ర మానవ హక్కుల సంఘం ఉద్యోగి కాకపోయినా వచ్చే నష్టమేం లేదు. పాత్ర ఆ నేపథ్యం లోంచి వచ్చినట్టు కూడా వుండదు. పైగా 40 నిమిషాల పాటు వరుణ్ సందేశ్ మాస్క్ వేసుకుని ప్రేక్షకులకి మొహం చూపించడు. ప్రేక్షకులకి హీరో మొహం కనిపించకపోతే సినిమా ఎలా ఎంజాయ్ చేస్తారు. విలన్ ఆఖరి వరకూ మొహం చూపించకున్నా ఫర్వాలేదు. దీన్ని హీరోకి అప్లై చేస్తే ఎలా? ఆ ఆరుగురి ముందు మాస్కు వేసుకుని, ప్రేక్షకుల ముందు మాస్కు తీసేసి వుండాల్సింది. 40వ నిమిషంలో మాస్కు తీసేసి స్లోమోలో నడుచుకుంటూ పోతే అది బ్యాంగ్ అవుతుందా? అది వరుణ్ సందేశ్ అని ప్రేక్షకులకి ముందే తెలుసు. కాకపోతే మొహం చూడాలని వుంటుంది.
        
డైలాగ్ డెలివరీలో ఇంప్రూవ్ అయ్యాడు. కానీ నటించడానికి ఈ సినిమాలో విషయం లేదు. మిగిలిన పాత్ర ధారులందరూ కూడా బలహీన పాత్రల్ని బరువు మోస్తున్నట్టు నటించారు. సాంకేతికంగా చెప్పుకోవడానికేమీ లేదు. గదిలో బంధించిన కథకి సాంకేతికాలతో అవసరమే వుండదు. మొత్తానికి వరుణ్ సందేశ్ రూటు మార్చి సస్పెన్స్  థ్రిల్లర్ నటించినా కలిసిరాలేదు.
—సికిందర్

 


Tuesday, June 18, 2024

1440 : రివ్యూ!

 

రచన- దర్శకత్వం : నిథిలన్ స్వామినాథన్
తారాగణం : విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్. మమతా మోహన్ దాస్, భారతీ రాజా, అభిరామి, నటరాజ్ తదితరులు
సంగీతం :  ఆజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం  : దినేష్ పురుషోత్తమన్
బ్యానర్స్ : ఎన్‌వీఆర్ సినిమా, ప్యాషన్ స్టూడియోస్
నిర్మాతలు : సుదర్శన్ సుందరం, జగదీష్ ఫళని స్వామి
విడుదల : జూన్ 14, 2024
***

        విజయ్ సేతుపతి 50వ సినిమా అనగానే ఆసక్తి, మార్కెట్ లో కదలిక, సోషల్ మీడియాలో హల్చల్ ఏర్పడ్డాయి. 50 వ సినిమాగా అతనేం ప్రత్యేకత చూపించబోతున్నాడ న్న కుతూహలమొకటి. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తో, కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో కలిపి ఆ ప్రత్యేకత ఎలా వుండబోతోంది? కమర్షియల్ సినిమాని ఏ భిన్న కోణంలో చూపించాడు? ఇందులో తన పాత్ర ఎలాటిది? ముసురు
కుంటున్న ఇన్నిప్రశ్నలతో ఈ తమిళ సినిమా కథ కూడా సంధిస్తున్న ప్రశ్నలేమిటి? ఇవి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం...

కథ

హారాజా (విజయ్ సేతుపతి) చిన్న సెలూన్ పెట్టుకుని జీవిస్తూంటాడు. ఒక ప్రమాదంలో భార్య చనిపోతే కూతురే లోకంగా బ్రతుకుతూంటాడు. ఓ రాత్రి ఇంట్లో దొంగలు పడతారు.  దొంగలు ఇంట్లోంచి లక్ష్మిని ఎత్తుకు పోతారు. మహారాజా పోలీస్ స్టేషన్ కెళ్ళి లక్ష్మిని వెతికి పెట్టమని కంప్లెయింట్ ఇస్తాడు. లక్ష్మి అనేది అతను చెత్తడబ్బాకి పెట్టుకున్న పేరు. చెత్తడబ్బా వెతకడమేమిటని పోలీసులు నవ్వి అవమానించి వెళ్ళగొడతారు. మహారాజా ఏడు లక్షలు లంచమిస్తానంటే ఒప్పుకుని చెత్త డబ్బా వెతకడం మొదలెడతారు.
       
ఏమిటీ చెత్తడబ్బా
? అది ఎంతుకంత ముఖ్యమయింది మహారాజాకి? కూతురితో ఆ చెత్తడబ్బా కున్న సంబంధమేమిటి? పోలీసులు ఆ చెత్తడబ్బాని వెతికి పట్టుకోగలిగారా? అప్పుడేం జరిగింది? అప్పుడు బయటపడ్డ భయంకర రహస్యాలేమిటి? ఇందులో క్రిమినల్ సెల్వన్ (అనురాగ్ కశ్యప్) పాత్రేమిటి? ఇతడికి మహారాజా విధించిన  శిక్షేమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథ చూసి తెలుసుకోవాలి.

ఎలావుంది కథ

ఇది ప్రతీకారంతో కూడిన  సస్పెన్స్ థ్రిల్లర్ కథ. అయితే ప్రతీకార కథ అనేది చివరి వరకూ సస్పెన్స్ లో వుంటుంది. కథ మాత్రం లీనియర్ నేరేషన్ లో వుండదు. ముందుకీ వెనక్కీ నడుస్తూ నాన్ లీనియర్ గా వుంటుంది. చివర్లో ఈ నాన్ లీనియర్ దృశ్యాలన్నీ ఏది ఎప్పుడు ఎందుకు జరిగాయనే  ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తూ కొలిక్కి వస్తాయి. అయితే ఈ దృశ్యాల్ని క్రమపద్ధతిలో పేర్చుకుని కథని అర్ధం చేసుకోవడానికి మాత్రం మెదడుకి శ్రమ కల్గించాల్సిందే.
       
సింపుల్ గా చెప్పాలంటే ఇది విజయ్ సేతుపతి పాత్ర చెత్తడబ్బాని అడ్డు పెట్టుకుని తనకి జరిగిన అన్యాయానికి కారణమైన క్రిమినల్ ముఠాని ట్రాప్ చేసేందుకు పన్నిన పథకం. పోలీసుల సాయంతో ట్రాప్ చేసి పట్టుకున్నాక
, అసలేం జరిగిందనేది అప్పుడు పొరలు పొరలుగా వీడిపోయే కథ. అంటే ఎండ్ సస్పెన్స్ అని నేరుగా తెలియకుండా ఎండ్ సస్పెన్స్ కథ నడపడం. టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో (1955) అనే హాలీవుడ్ మూవీ ఈ తరహా కథా సంవిధానానికి బాట వేసింది. అయితే చివర్లో విప్పాల్సిన ప్రశ్నలు ఎక్కువ వుండకూడదు. వుంటే తికమక, వాటితో మెదడుకి శ్రమా పెరిగిపోతాయి.
       
అయితే ప్రతీ వారం సస్పెన్స్ థ్రిల్లర్స్ పేరిట సినిమాలు వచ్చేసి క్రాఫ్ట్ తెలియక అపహాస్యమవుతున్న వేళ
మహారాజా ఒక మెచ్చదగ్గ ప్రయత్నమే. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ మేధో పరంగా స్క్రిప్టు మీద చాలా వర్క్ చేశాడు, కానీ కథలోంచి ఎక్కువ ప్రశ్నలు లాగి పరీక్షకి పెట్టాడు.
       
ఫస్టాఫ్ విజయ్ సేతుపతి పాత్ర పరిచయం
, చెత్తబుట్ట కోసం పోలీసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్ లో సేతుపతి పడే అవమానాలు, మరో రెండు వేరే పాత్రలతో వేరే సంఘటనలు, తర్వాత ఈ సంఘటనల్లో సేతుపతి పాత్ర కూడా వున్నట్టు  ఫ్లాష్ బ్యాక్ లో రివీలవడం, ఆ పాత్రలతో యాక్షన్ సీను వగైరా వుంటాయి.
       
సెకండాఫ్ లో అనురాగ్ కశ్యప్ క్రిమినల్ పాత్ర కార్యకలాపాలతో కథలో కొత్త సంఘటనలు ప్రారంభమవుతాయి. చెత్తడబ్బా కోసం పోలీసుల వేట సాగుతూనే వుంటుంది. అనురాగ్ కశ్యప్ క్రిమినల్ అని తెలియని సేతుపతితో దృశ్యాలు వస్తాయి. చివరికి పోలీసులు నకిలీ చెత్తడబ్బా తయారు చేసి
, దాని దొంగగా ఒకడ్ని చూపించేసరికి వాడితో సేతుపతి కూతురికి ముడిపెట్టి భయంకర రహస్యాలు వెల్లడవడం మొదలవుతాయి... ఇవి షాకింగ్ గా వుంటాయి. చివర్లో రివీలయ్యే కేవలం కూతురితో ఈ షాకింగ్ ఎలిమెంటే ప్రేక్షకులతో కనెక్ట్ అయి సినిమా సక్సెస్ కి దారితీసింది తప్ప...చిక్కుముడులతో వున్న కథ అర్ధమై కాదు. ఇంతా చేసి ఇది రెండుంపావు గంటల్లో ముగిసిపోయే కథ.

నటనలు- సాంకేతికాలు

తన 50వ సినిమాగా  గుర్తుండిపోయే పాత్ర నటించాడు విజయ్ సేతుపతి. గిరి గీసుకోకుండా ఎలాటి పాత్రనైనా నటించే సేతుపతి కమల్ హాసన్ బాటలో నడుస్తున్నట్టు అని పిస్తాడు. ఈ సినిమాలో ప్రతీ సీనూ అతడికి సవాలే. ఫస్టాఫ్ లో పోలీసులు తనతో ఎలా ప్రవర్తించినా, కొట్టినా బానిసలా పడుండే నటనని అత్యున్నతంగా కనబరుస్తాడు. అతడి విజృంభణ అంతా క్లయిమాక్సులోనే. రాక్షసుడవుతాడు. అంతర్లీనంగా కూతురి సెంటిమెంటుతో భావోద్వేగాల్ని రగిలిస్తూ.
       
సమాజంలో కుటుంబం వున్న మంచివాడిగా కనిపిస్తూ ఘోర నేరాలు చేసే పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా గుర్తుండే పాత్ర నటించాడు. చివరికి అతడి ఖాతాలో పడే శిక్ష ఘోరంగా వుంటుంది. మిగతా పోలీసుల పాత్రలు
, దొంగల పాత్రలు నటించిన నటీనటులందరూ మంచి పనితనం కనబర్చారు. సాంకేతికంగా రియలిస్టికి మూవీ పోకడలతో వుంది. సంగీతం, ఛాయాగ్రహణం, యాక్షన్ సీన్లు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్ వగైరా అన్నీ సహజంగా వుంటాయి.
        
ఇంతా చేసి దీన్ని కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉద్రేకపర్చి వదిలేయలేదు. చెప్పకుండానే కర్మ సిద్ధాంతం చెప్పే కథతో వుంటుంది- నువ్వు యితరులకేం చేస్తావో అదే నీకూ తిరిగొస్తుందని!
—సికిందర్

 

 


Saturday, June 15, 2024

1439 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
తారాగణం : సుధీర్ బాబు
, మాళవికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడ తదితరులు
సంగీతం :
చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : అరవింద్ విశ్వనాథన్  
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత:
 సుమంత్ జి నాయుడు
విడుదల :
 జూన్ 14, 202

***

        వ దళపతి (టైటిల్స్ లో ఇలాగే వేశారు) సుధీర్ బాబు ఒక పూర్తి స్థాయి మాస్ యాక్షన్ కి దిగాడు. చాలా ఇంటర్వ్యూలిచ్చి, ప్రమోట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం బాధ్యత తీసుకున్నాడు. అయితే వరస పరాజయాలతో సతమతమవుతున్న సుధీర్ బాబుకి ఈ కొత్త నేపథ్యపు మాస్ యాక్షన్ ప్రేక్షకుల్లోకి ఎంతవరకు వెళ్తుంది? ఈ సారైనా పాస్ మార్కులు పడతాయా? ఇందులో ప్లస్ మైనస్ లేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

చిత్తూరు జిల్లా  కుప్పంలో తిమ్మారెడ్డి(లక్కీ లక్ష్మణ్ ), అతడి తమ్ముడు బసవ (రవి కాలే), కుమారుడు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) అరాచకాలు చేస్తూంటారు. ప్రజల భూములు లాక్కుని చంపడం కూడా చేస్తూంటారు. ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ లాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరతాడు. ఈ కాలేజీలోనే టీచర్ (మాళవికా శర్మ) ని ప్రేమిస్తాడు. ఇక్కడే సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ పళని స్వామి (సునీల్) తో స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవపడి కొట్టడంతో సస్పెండ్ అవుతాడు సుబ్రహ్మణ్యం. ఉద్యోగం పోయి, ఇంటిదగ్గర తండ్రి (జయప్రకాష్) చేసిన అప్పులు మీద పడి ఏం చేయాలా అని ఆలోచిస్తూంటే, పళని స్వామి దగ్గర ఒక పిస్తోలు కనిపిస్తుంది. దాని డిజైన్ కూడా చూపిస్తాడు పళని స్వామి. ఇక వాటి సాయంతో సుబ్రహ్మణ్యం డబ్బు సంపాదనకి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం మొదలెడతాడు. వాటిని శరత్ రెడ్డికే అమ్ముతాడు. దీంతో అటు తమిళనాడు నుంచి గన్స్ సప్లై చేసే రాజ మాణిక్యంతో  గొడవలొస్తాయి. ఈ గొడవల్లో సుబ్రహ్మణ్యం తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రహ్మణ్యం కొట్టడంతో అతను కోమాలోకి పోతాడు. దీంతో తిమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం మీద పగబడతాడు.
       
ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఏం చేశాడు
? తిమ్మారెడ్డినీ, అతడి తమ్ముడ్నీ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రజలంతా సుబ్రహ్మణ్యంని దేవుడుగా ఎందుకు కొలిచారు? ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వూళ్ళో  అరాచక శక్తుల్ని అణిచే, ప్రజలంతా ఆ అరాచక శక్తుల్ని అణిచిన కథానాయకుడ్ని కొలిచే, వందల సార్లు వచ్చిన రొటీన్ కథకి గన్ కల్చర్ /స్మగ్లింగ్ ని జోడించి కొత్త కథగా తయారు చేశారు. ఈ అరాచక శక్తుల పాత్రల్ని కేజీఎఫ్ సినిమాల్లోంచి దిగుమతి చేసుకున్నారు. గన్ కల్చర్ నార్త్ ఇండియాకి చెందినదైనా, దీన్ని తెలుగు నేటివిటీలోకి  తీసుకురావడానికి కేజీఎఫ్, పుష్ప  సినిమాల ఛాయల్ని అద్దారు. ఫలితంగా ఇది ఈ మధ్య వచ్చి ఫ్లాపయిన రూరల్ యాక్షన్ సినిమాలకి భిన్నంగా తయారయ్యింది. రెండున్నర గంటలు సాగినా బోరుకొట్టకుండా పకడ్బందీ చిత్రీకరణతో రూపొందింది. బలమైన సన్నివేశాలు, డైలాగులూ ఆద్యంతం కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అయితే కరువయ్యిందేమిటంటే ఆ సన్నివేశాల్లో భావోద్వేగాలు. డ్రామాలో భావోద్వేగాలు, యాక్షన్ లో భావోద్వేగాలూ లోపించాయి. అలాగే సస్పెన్స్, టెన్షన్, థ్రిల్స్, కథలో మలుపులూ లేక- కేవలం ఒక నాన్ స్టాప్ యాక్షన్ సినిమాగా తయారయ్యింది. ఒక రొటీన్ ప్రతీకార కథకి గన్ కల్చర్, కేజీఎఫ్, పుష్పల హంగులు కూర్చి, భావోద్వేగాల పరమైన లోపాల్ని కవర్ చేస్తూ, అనుభవజ్ఞుడిలా తీర్చిదిద్దాడు దర్శకుడు.
       
ఫస్టాఫ్ పూర్తిగా కథని సెటప్ చేయడంతో సరిపోతుంది. పోలీస్ స్టేషన్లో సునీల్ పాత్ర చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. వూళ్ళో అరాచకాలు
, ఆ అరాచకాల మధ్య సుధీర్ బాబు పాత్ర దిగడం, పాలి టెక్నిక్ లాబ్ లో పనిచేస్తూ టీచర్ ని ప్రేమించడం, ఒకడ్ని కొట్టడం, దాంతో ఉద్యోగం పోవడం, ఇంటికెళ్ళి  పోయి అప్పులపాయిన తండ్రిని ఓదార్చి తిరిగి రావడం,  సునీల్ పాత్ర దగ్గర పిస్తోలు చూసి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం వగైరా జరుగుతూ, అరాచక శక్తులతో గన్ బిజినెస్, దీంతో తమిళనాడు గన్ స్మగ్లర్ తో గొడవలు, తండ్రి మీద హత్యా ప్రయత్నం, ఆ తర్వాత విలన్ తమ్ముడ్ని కొట్టి కోమాలోకి పంపడం - ఇదంతా ఫస్టాఫ్ కథ.
       
ఈ ఫస్టాఫ్ కథలో లోపాలేమిటంటే
, గన్స్ తయారు చేసి వూళ్ళో అరాచక శక్తులకే అమ్మడం, దాంతో ఇంకింత రెచ్చిపోయి ఆ అరాచక శక్తులు అక్కడి జనాల్నే  కాల్చి చంపడం. ఇది సుధీర్ బాబు పాత్రని దెబ్బతీసే కథనం. అప్పుడైనా తప్పు తెలుసుకుని,  గన్స్ తయారీ ఆపేసి, అరాచక శక్తుల మీద పోరాటం ప్రకటించడు. డబ్బు కోసం ఇంకా భారీ యెత్తున గన్స్ తయారు చేసి ఇతరప్రాంతాలకి స్మగ్లింగ్ చేస్తూంటాడు. ఇక తమిళనాడు గన్ స్మగ్లర్ వచ్చి గొడవ పడడం దేనికో అర్ధం కాదు. సుధీర్ బాబు పాత్ర వూళ్ళోకి రాకముందు ఈ గన్ స్మగ్లర్ అరాచక శక్తులకి గన్స్ అమ్మకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడెందుకొచ్చి గొడవ పడుతున్నాడు?
        
ఇక సెకండాఫ్ పూర్తిగా పగబట్టిన విలన్ కథ. ఈ కథలో సుధీర్ బాబు వూరికి విలన్ పీడా తొలగించి దేవుడవుతాడు. పాత కథే కాబట్టి సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసిపోయే కథ. కాకపోతే పక్కదోవ  పట్టకుండా కథ చెప్పిన విధానం -దీని వేగం - హై ఓల్టేజ్ యాక్షన్ కూర్చోబెడుతాయి. సుధీర్ బాబు అన్ని  రకాల ఆయుధాలు ఎలా తయారు చేశాడో లాజిక్ అడగకూడదు. మిలిటరీ ఆయుధాలు కూడా అతడి చేతిలో వుంటాయి. క్లయిమాక్స్ యాక్షన్ సీన్లో ఇంకో భారీ ఆయుధం తీస్తాడు. ముగింపు మాస్ ప్రేక్షకులకి మాంచి కిక్.

నటనలు- సాంకేతికాలు

కొత్త లుక్ తో, చిత్తూరు భాషతో సాధారణ యువకుడి పాత్రని సుధీర్ బాబు బాగానే పోషించాడు. ఆ ఉగ్ర సుబ్రహ్మణ్యం పాత్ర పోరాటానికి తగిన భావోద్వేగాలు కూడా వుంటే నటన ఆకట్టుకునేది. ఇంటర్వెల్లో విలన్ తమ్ముడ్ని కొట్టి కాన్ఫ్లిక్ట్ ప్రారంభించినప్పుడు అది డొల్లగా వుంది. అప్పటికి ఒక లక్ష్యం, దేన్నైనా పణంగా పెట్టి తీసుకున్న రిస్క్ వంటి గోల్ ఎలిమెంట్స్ కాన్ఫ్లిక్ట్ లో లేకపోవడం వల్ల భావోద్వేగాలు పుట్టకుండా పోయాయి.
        
శివ లో స్టూడెంటైన నాగార్జున మాఫియా రఘువరన్ అనుచరుడు జేడీని కొట్టి కాన్ఫ్లిక్ట్ ని ప్రారంభించినప్పుడు- అందులో ఒక సామాన్య స్టూడెంట్  గా నేరుగా ఓ పెద్ద మాఫియాతో పెట్టుకుంటూ క్రియేట్ చేసిన ఆందోళన, దీంతో అన్న కుటుంబాన్ని పణంగా పెడుతున్న రిస్కు వగైరా వర్కౌటై భావోద్వేగాలు బలంగా పుట్టుకొచ్చాయి.
        
సుధీర్ బాబు విలన్ తమ్ముడ్ని కొట్టడంవల్ల తనకెదురవబోయే ఏ అపాయాల జాడా లేదు. అందువల్ల తర్వాత కథకి ఏ భావోద్వేగాలూ పుట్టకుండా కాన్ఫ్లిక్ట్ డొల్లగా తయార
య్యింది. కష్టపడి బాగా నటించాడు. అయితే జీవంకూడా వుండాలి.
       
హీరోయిన్ మాళవికా శర్మ టెంప్లెట్ పాత్ర నటించింది. ఫస్టాఫ్ లో హీరో ప్రేమకి పనికొచ్చేట్టు
, క్లయిమాక్స్ లో విలన్ కి పనికొచ్చేట్టు కన్పించింది.  సుధీర్ నేస్తం గా సునీల్ గుంభనంగా కన్పించే పాత్ర పోషించాడు సీరియస్ గా. సుధీర్ తండ్రి పాత్రలో జయప్రకాష్ బాధిత పాత్ర హింసాత్మక దృశ్యాలతో నటించాడు.  ఇక విలన్ పాత్రధారులు ముగ్గురూ కేజీఎఫ్ తరహా క్రౌర్యాన్ని ప్రదర్శించారు.
       
సినిమాకి ప్రధాన బలం సాంకేతికాలు.
చైతన్ భరద్వాజ్ సంగీతంగానీ, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణంగానీ టాప్ క్లాస్ గా వున్నాయి. ఆంజనేయులు సమకూర్చిన యాక్షన్ సీన్స్ ఇంకో ఆకర్షణ. జ్ఞాన సాగర్ దర్శకత్వం వీటికి తీసిపోకుండా వుంది. అయితే ఓపెనింగ్స్ చూశాక సినిమాని ఇంకా బలంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం కనపడుతోంది.

—సికిందర్ 


Sunday, June 9, 2024

1438 : రివ్యూ!

 

రచన- దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
తారాగణం : శర్వానంద్, కృతీశెట్టి, సీరత్ కపూర్, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, రాహుల్ రవీంద్రన్, శివ కందూరి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం : హెషమ్  అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : విష్ణుశర్మ, జ్ఞానశేఖర్
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
విడుదల : జూన్ 7, 2024
***
        ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ గత ఏడు సినిమాలతో హిట్లు లేక ఒక హిట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తూ మనమే అనే ఫ్యామిలీ డ్రామాతో వచ్చాడు. ఉప్పెన తో తెలుగులో పాపులరైన హీరోయిన్ కృతీ శెట్టి ఆ తర్వాత శ్యామ్ సింఘరాయ్ తప్ప  తెలుగులో నటించిన అయిదు సినిమాలూ హిట్ కాక ఒక్క తెలుగు హిట్ కోసం తిరిగి అడుగుపెట్టింది. మొదటి సినిమా భలే మంచి రోజు తర్వాత మూడు సినిమాలూ హిట్ కాక ఒక హిట్ కోసం స్ట్రగుల్ చేస్తూ తిరిగి వచ్చాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ ముగ్గురూ మనమే అంటూ తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం వచ్చారు. ఇది కూడా హిట్ కాకపోతే కారణం మనమే అని చెప్పుకోవడానికి వీలుగా అన్నట్టు టైటిల్ పెట్టారు. మరి ఈ ముగ్గురి రిపోర్టు కార్డు ఎలా వుందో చూద్దాం...

కథ

విక్రమ్(శర్వానంద్) లండన్ లో అమ్మాయిల్ని అల్లరి పెడుతూ ప్లే బాయ్ లా గడిపేస్తూంటాడు. అతడికో ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్) వుంటాడు. అనురాగ్ అతడి భార్య శాంతి  (మౌనిక) ఇండియాకి వెళ్ళి ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో వాళ్ళ కొడుకు ఖుషీ (విక్రమ్ ఆదిత్య) అనాథ అవుతాడు. శాంతి  లవ్ మ్యారేజీ చేసుకుందని దూరం పెట్టిన ఆమె పేరెంట్స్ ఖుషీని పెంచుకోవడానికి నిరాకరిస్తారు. దీంతో శాంతి  ఫ్రెండ్ సుభద్ర (కృతీ శెట్టి) ఖుషీని పెంచుకోడానికి ముందుకొస్తుంది. అయితే ఇంగ్లాండ్ లో పుట్టిన ఖుషీకి అక్కడి చట్టాలు వరిస్తాయి.  ఆ చట్ట ప్రకారం కనీసం నాలుగు నెలలు ఎవరైనా కేర్ టేకర్స్ ఖుషీని పేరెంట్స్ లా చూసుకోవాలి, లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాధాశ్రమానికి అప్పజెప్తుంది.
       
దీంతో
విక్రమ్, సుభద్రతో కలిసి లండన్ లో ఖుషీని  చూసుకోడానికి సిద్ధమవుతాడు. ఇటు సుభద్రకి కార్తీక్ తో(శివ కందుకూరి) నిశ్చితార్థం జరిగి వుంటుంది. ఈ నేపథ్యంలో విక్రమ్, సుభద్ర ఖుషీని ఎలా చూసుకున్నారు? ఈ క్రమంలో తలెత్తిన సమస్యలేమిటి? ఖుషీ వల్ల విక్రమ్ జీవితంలో ఎలాటి మార్పు వచ్చింది? సుభద్ర విక్రమ్ తో వుండడానికి కార్తీక్ ఒప్పుకున్నాడా? చనిపోయిన విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్ బిజినెస్ పార్ట్నర్ తో వచ్చిన కష్టాలేమిటి? విక్రమ్, సుభద్రమధ్య ప్రేమ ఎలా పుట్టింది, పుడితే ఆ ప్రేమ ఏమయ్యింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ కథ మార్పు చేర్పులతో హాలీవుడ్ లైఫ్ యాజ్ వి నో ఇట్ (2010) కథలా వుంది. అయితే హాలీవుడ్ కథ పెళ్ళికాని ఇద్దరు యువతీ యువకుల మధ్య పెంపకానికి ఆడపిల్ల (తెలుగులో పిల్లాడు) వస్తే ఏం జరుగుతుందనే పాయింటుతో వుంటుంది. ఈ పాయింటుని డ్రైవ్ చేస్తూ దాని పరిణామాల్ని, పర్యవసానాల్నీ చిత్రించే సన్నివేశాలతో కూడుకుని ఒక ట్రాకులో రెండు గంటల కామెడీ కథ వుంటుంది. కానీ తెలుగులో రెండున్నర గంటలు సాగదీసినా ఏ పాయింటుతో కథ నడుస్తోందో చెప్పలేకపోయాడు దర్శకుడు. సెకండాఫ్ వచ్చేసరికి ఎందుకిలా కన్ఫ్యూజై పోతారు దర్శకులు? ఇది హిట్టవ్వాలంటే మనమే అని ఫ్లాపుల్లో వున్న హీరో హీరోయిన్లు, దర్శకుడు ఇప్పుడైనా కలిసి కూర్చుని పద్ధతిగా ఆలోచించలేదా? లండన్లో శర్వానంద్ పాత్ర ఎలా అవారాగా వుందో అలా అవారాగా, అనాధగా మారిపోయింది కథ!
       
పాయింటు మీద నిలబడితే ఈ పాయింటు లోంచి పుడుతూ వుండే భావోద్వేగాలతో కథకి బలం వస్తుంది. పాయింటునే గుర్తించకపోవడంతో భావోద్వేగాలే లేకుండా చప్పగా మారింది కథ. దర్శకుడు చేసిన ఇంకో పొరపాటు ఏమిటంటే
, మొదటి ఇరవై నిమిషాల్లో పిల్లాడిని చేపట్టాల్సిన పాయింటుకి వచ్చేయడం. ఇంత త్వరగా పాయింటుని ఏర్పాటు చేసిన సినిమాల్ని రెండున్నర గంటల కథ చేయలేక చేతులెత్తేసిన సినిమాలు చాలా వున్నాయి. అందుకని 45 నిమిషాలకో, లేదా ఇంటర్వెల్లోనో పాయింటుని ఎస్టాబ్లిష్ చేసి, కథ చెప్పే సమయాన్ని తగ్గించుకుని సేఫ్ అవుతున్నారు  కొంత మంది.
       
దర్శకుడు ఇది కూడా గుర్తించకుండా హాలీవుడ్ స్ట్రక్చర్ ప్రకారం మొదటి అరగంట లోపు పాయింటుని ఎస్టాబ్లిష్ చేయడంతో
, అసలా ఎస్టాబ్లిష్ చేసిన పాయింటుతోనే కథ నడపాలని గుర్తించకపోవడంతో, ఆ తర్వాత పావుగంటకే ఫస్టాఫ్ లో కథ కుప్పకూలడం ప్రారంభమైంది.
       
పిల్లాడి పెంపకం గురించి శర్వానంద్ ఎన్ని కామెడీలు చేసినా అది పైపైనే వుండిపోయింది తప్ప
, ఎక్కడా ఒక ఫీల్ గుడ్ మూవీలా హృదయపూర్వకంగా నవ్వించలేదు. సినిమా దారి సినిమాదే, ప్రేక్షకుల దారి ప్రేక్షకులదే. ఎక్కడా కనెక్షన్ లేదు, విలన్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ కామెడీలు సహా. కృతీశెట్టికి వేరే నిశ్చితార్ధం పెట్టడం వల్ల కూడా ఉపయోగమేమీ లేదు. చివరికి శర్వానంద్, కృతీ ఒకటవుతారని వూహించేదే. పై హాలీవుడ్ సినిమా మూస ఫార్ములా కథే. అయితే అందులో పాయింటు చుట్టూ కథ వుంటుంది. చివరికి ముగింపుకూడా 2010,  దానికి ముందూ  వచ్చిన సినిమాల్లో లాంటి మూస ముగింపే. ఈ ముగింపైనా తెలుగులో మార్చలేదు. ఇంకా అరిగిపోయిన ముగింపే వర్కౌట్ అవుతుందనుకున్నారు.
       
సెకండాఫ్ పూర్తిగా దారి తప్పింది. ఏవో సన్నివేశాలు వస్తూంటాయి
, పోతూంటాయి. ఏం జరుగుతోందో అర్ధంగాక సహన పరీక్షగా మారుతుంది. మధ్యమధ్యలో వెన్నెల కిషోర్ వచ్చి నవ్వించి పోవడమే బావుంది. రెండున్నర గంటలు చక్కర్లు కొట్టిన కథ చివరికి పిల్లాడి విషయంలో శర్వానంద్, కృతీ తీసుకునే నిర్ణయంతో ఓ ఫార్ములా మలుపు తీసుకుని ముగుస్తుంది.

నటనలు- సాంకేతికాలు

శర్వానంద్ యాక్టివ్ నటన, జోకులు, పాత్ర తీరు, కాస్ట్యూమ్స్ ఇవిమాత్రం బాగా వర్కౌటయ్యాయి. అయితే వీటితో ఎంతసేపు రంజింప జేయగలడు. కృతీ శెట్టి పాత్ర, నటన, శర్వానంద్ తో రోమాన్స్ ఈసారి బాగా కుదిరాయి. కానీ సెకండ్ హీరోయిన్ గా సీరత్ కపూర్ పాత్ర వృధా. అలాగే రాహుల్ రవీంద్రన్ విలన్ పాత్రలో, నటనలో బలం లేదు. వెన్నెల కిషోర్, రామకృష్ణలు కామెడీ పాత్రల్లో నవ్వించే పని మాత్రం లోటులేకుండా చూసుకున్నారు.
       
సందర్భానుసారం వచ్చిపోయే పాటలు 16 వున్నాయి. సినిమాలో విషయం లేనప్పుడు ఇన్ని పాటలెందుకో. హేషమ్ సంగీతంలో రెండు పాటలు మాత్రం బావున్నాయి.  విష్ణుశర్మ
, జ్ఞానశేఖర్ ల ఛాయాగ్రహణం విదేశీ లొకేషన్స్ వల్ల రిచ్ గా వుంది. విజువాల్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఈ భారీ తనంతో సినిమాలో విషయం కూడా సరితూగి వుండాల్సింది. మొత్తానికి ముగ్గురూ మనమే అంటూ ఇలాటి ఉపయోగం లేని ప్రయత్నం చేశారు.

—సికిందర్


Thursday, June 6, 2024

1437 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ఉదయ్ శెట్టి
తారాగణం :  ఆనంద్ దేవరకొండ, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్  తదితరులు.
సంగీతం : చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఆదిత్య జె.
బ్యానర్ : హై-లైఫ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
***
          2023 లో బేబీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించడానికి సమ్మర్ సినిమాతో వచ్చాడు. ఇటీవల వచ్చిన క్రైమ్ కామెడీ లేవీ నిలబడ లేదు. సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నిలబడేందుకు మొరాయించి మొండి చెయ్యి చూపిస్తున్నాయి. అలాటిది మరో కొత్త దర్శకుడు క్రైమ్ కామెడీతో తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మరి దీంతో ఎంత నవ్వించాడు, ఎంత నిలబెట్టాడు అన్నవి ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతుకుతూ ముందుగా కథ లోకి వెళ్దాం...

కథ

గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ), శంకర్(ఇమ్మాన్యుయేల్‌) దొంగతనాలు చేసి జీవిస్తూంటారు. గణేష్‌కి శృతి (నయన్ సారిక) తో ప్రేమ వ్యవహారముంటుంది. ఆమె తాను పనిచేసే షాప్ ఓనర్ తో పెళ్ళికి సిద్ధమవడంతో, గణేష్ హర్ట్ అవుతాడు. ఆమె డబ్బుకోసం పెళ్ళికి సిద్ధపడితే ఈలోగా తానూ డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతానని సవాలు విసురుతాడు. ఓ నగల షాపులో 7 కోట్ల విలువైన వజ్రాన్ని కొట్టేసే ఆఫర్ రావడంతో ఆ వజ్రాన్ని కొట్టేసి అమ్ముకుందామని దాంతో పారిపోతాడు.
        
చెన్నై వెళ్తూండగా పోలీసులు చెకింగ్ చేస్తూండడంతో భయపడి వజ్రాన్ని అటుగా తీసికెళ్తున్న వినాయకుడి విగ్రహం తొండంలో పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించి తీసుకొస్తూంటాడు. అయితే కిషోర్ రెడ్డి వూరికి వెళ్ళాల్సిన విగ్రహం ప్రత్యర్ధి వూరికి వెళ్తుంది. దీంతో ఆ విగ్రహం కోసం ప్రయత్నాలు మొదలవుతాయి.
       
విగ్రహం కిషోర్ రెడ్డికి ఎందుకు విలువైనది
? అందులో ఏం దాచి పెట్టి ముంబాయి నుంచి రప్పిస్తున్నాడు? విగ్రహం తొండంలో వజ్రాన్ని పడేసిన గణేష్ కది దక్కిందా లేదా? దాంతో కోటీశ్వరుడై శృతిని పెళ్ళి చేసుకున్నాడా లేదా?  ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే వారం విడుదలైన భజే వాయు వేగం లో తండ్రి ఆపరేషన్ కోసం హీరో కారు కొట్టేసి పారిపోతాడు. ప్రస్తుత సినిమాలో కోటీశ్వరుడవడం కోసం హీరో వజ్రాన్ని కొట్టేసి పారిపోతాడు. రెండూ ఒకే లాంటి కథలు. అయితే మొదటిది బరువైన సెంటిమెంటల్ డ్రామా, రెండోది క్రైమ్ కామెడీ. ఏదో విలువైనది ఎక్కడో మిస్ అవడం, దాని కోసం వివిధ గ్యాంగులు వేటలో పడ్డం కూడా కొత్త కథేమీ కాదు. అనగనగా ఒక రోజు’, స్వామి రారా వంటి హిట్స్ గతంలో వచ్చాయి. ప్రస్తుత సినిమాని కూడా అలాటి హిట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిల్లీ కథ వల్ల పాక్షికంగానే సఫలమయ్యారు.
          
ఫస్టాఫ్ పాయింటుకి రావడానికి లవ్ ట్రాకుతో చాలా సేపు సాగదీశారు. హీరోయిన్ తో సుదీర్ఘ లవ్ ట్రాకు పెట్టి, హీరో ఆమెకి సవాలు  చేసిన తర్వాత వజ్రాన్నిదొంగిలించి పారిపోవడం, దాన్ని వినాయకుడి విగ్రహంలో వేయడం, అది విలన్ ప్రత్యర్ధి వూరికి చేరడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇప్పుడా విగ్రహం ఇటు విలన్ కి, అటు హీరోకీ ఇద్దరికీ అవసరం.
        
ఇప్పుడు సెకండాఫ్ లో ఆ విగ్రహంకోసం ప్రయత్నాల్ని కామెడీగా మార్చి నడిపించారు. ఈ ప్రయత్నాలు సిల్లీగా వున్నా కామెడీ కాబట్టి సీరియస్ గా తీసుకోవద్దన్నట్టు నడిపించారు. కానీ హీరో విలన్ల మధ్య బలమైన ఎత్తుగడలు వుండుంటే ఆ కామెడీ లాజికల్ గా వర్కవుటై క్రియేటివిటీతో ఇంకా బావుండేది. ఈ కామెడీకి సారధి డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా నటించిన వెన్నెల కిషోర్. సెకండాఫ్ పూర్తిగా వెన్నెల కిషోర్ చేసే సిల్లీ కామెడీ మీద ఆధారపడింది. తన స్కిల్స్ తో అంతలా నవ్వించకపోతే సెకండాఫ్ ప్రమాదంలో పడేది.
       
కథలో క్లయిమాక్స్ ట్విస్టు ఒక్కటే ఉత్కంఠ రేపుతుంది. ఇక ముగింపుగా తుపాకులతో కాల్చుకోవడమన్నది
స్వామిరారా లాంటిదే. అయితే మధ్యలో హీరోకి సెకెండ్ హీరోయిన్ ప్రగతీ శ్రీవాస్తవతో ఇంకో లవ్ ట్రాక్ పెట్టడం వర్కౌట్ కాలేదు. అది కథని పక్కదోవ పట్టించింది. మొత్తానికి సిల్లీ కామెడీతో ఈ సాధారణ కథని గట్టెక్కించే ప్రయత్నం చేశారు.

నటనలు – సాంకేతికాలు

ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ నటించడంలో కృషి చేశాడు. పరిమిత భావాలు పలికే మొహంలో కామెడీకి కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ శూన్యమైనా ప్రేక్షకుల్ని గతంలోలా ఇబ్బంది పెట్టకుండా కామెడీ నటించడం కోసం ఫర్వాలేదన్పించే స్థాయిలో కష్టపడ్డాడు. ఇక మిగతా రోమాన్స్, యాక్షన్ మామూలే. అయితే హీరోయిన్లిద్దరికీ పెద్దగా పాత్రల్లేవు. విలన్లుగా  రాజన్, కృష్ణ చైతన్య క్రూరత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయేల్ కామెడీలు మాత్రమే ఈ సినిమాకి హైలైట్.
        
చేతన్ భరద్వాజ్ సంగీతం, ఆదిత్య ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక హంగులు ఫర్వాలేదనిపించేలా వున్నాయి. కొత్త దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి కొత్తదనం కోసం ప్రయత్నించకుండా, రొటీన్ ఫార్ములా సేఫ్ జోన్ లోనే వుండిపోయాడు.

—సికిందర్