రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జూన్ 2024, సోమవారం

1441 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : రాజేష్ జగన్నాధం
తారాగణం : రుణ్ సందేశ్, ఎనీ, శ్రియా రాణిరెడ్డి, తనికెళ్ల భరణి, అన్నీ, భద్రమ్, చత్రపతి శేఖర్, మైమ్ మధు తదితరులు
సంగీతం : సంతు ఓంకార్, ఛాయాగ్రహణం : రమీజ్ నవీత్  నిర్మాత: రాజేష్ జగన్నాధం
విడుదల : జూన్ 21, 2024

***

        తెరమరుగైన హేపీడేస్ హీరో వరుణ్ సందేశ్ చాలాకాలం తర్వాత తెరపైకొచ్చాడు. ఈసారి తనకి అలవాటయిన రోమాంటిక్ సినిమా కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయత్నించాడు. దీనికి రాకేష్ జగన్నాథం కొత్త దర్శకుడు, నిర్మాత.  అయితే వారం వారం ఇంకో మార్గం లేనట్టు అర్షకత్వం వచ్చిపడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్స్ సూచిస్తోంది. నిడివి కూడా రెండు గంటలే వుంది. నిండా టైటిల్ బావుంది. బరువైన కథని సూచిస్తోంది. మరి ఇదెంత బలంగా ఆకట్టుకునే అవకాశముంది? చూద్దాం...

కథ

వివేక్ (వరుణ్ సందేశ్)  మానవ హక్కుల సంఘంలో పని చేస్తూంటాడు. అతడి తండ్రి (తనికెళ్ళ భరణి) జడ్జి. ఇతను మంజు అనే అమ్మాయి హత్య కేసులో బాలరాజు (ఛత్రపతి శేఖర్) కి మరణ శిక్ష విధిస్తాడు. అయితే బాలరాజుని తప్పుడుగా శిక్షించానని బాధపడుతూ మరణిస్తాడు. తండ్రి మాటలు నమ్మిన వివేక్, అమాయకుడైన బాలరాజుని కేసు నుంచి విడిపించడానికి రంగంలోకి దిగుతాడు. సాక్ష్యాధారాల్ని తారుమారు చేసిన ఒక ఎస్సైని, డాక్టర్ ని, లాయర్ని, కానిస్టేబుల్ ని, ఇద్దరు సాక్షుల్నీ కిడ్నాప్ చేసి గదిలో బంధించి నిజం కక్కించే పని చేపడతాడు. ఏమిటా నిజం? మంజునెవరు ఎందుకు చంపారు? బాలరాజునెలా ఇరికించారు? అసలు దోషిని పట్టుకుని ఉరిశిక్ష నుంచి బాలరాజుని వివేక్ ఎలా కాపాడాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఒక బలహీన రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథే. సస్పెన్స్, థ్రిల్ లేకుండా వారం వారం వస్తున్న అమెచ్యూర్ కథే. అయితే ఇది ఇంకో అడుగు ముందుకెసి సస్పెన్స్, థ్రిల్లే గాకుండా యాక్షన్ కూడా లేకుండా గదిలో డైలాగులతో నడిచే కథగా ముందుకొచ్చింది. కళ్ళు మూసుకుని డైలాగులు వింటూంటే కథ అర్ధమైపోతుంది. అంటే విజువల్ మీడియా లక్షణం కూడా లేని రేడియో నాటిక లాంటి కథ అన్నమాట. దీన్ని సినిమాగా తీయకుండా డైలాగులు రికార్డు చేసి ఆడియో విడుదల చేసినా సరిపోయేది.
       
మాస్కు వేసుకున్న వరుణ్ సందేశ్ ఆరుగుర్ని కిడ్నాప్ చేసి గదిలో బంధించడంతో మొదలవుతుంది. వాళ్ళకి మంజు హత్య కేసు వివరించి
, దీన్ని మీరెలా తప్పుదోవ పట్టించారో చెప్పమంటూ హింసిస్తాడు. అప్పుడు ఒకొక్కరూ చెప్పే ఫ్లాష్ బ్యాక్స్ తో కథ వస్తూంటుంది. ఫస్టాఫ్ గదిలో ఈ సంభాషణే, సెకండాఫ్ లోనూ గదిలో టేబుల్ చుట్టూ కూర్చుని ఈ సంభాషణే. గదిదాటి బయటి కెళ్ళదు కథ. ఫ్లాష్ బ్యాక్స్ లోనే బయట పల్లెటూళ్ళో సీన్లు వస్తాయి. ఇలా అడిగి అడిగి అడుగుతూ పోతూంటే, వాళ్ళు చెప్పీ చెప్పీ చెప్తూ పోవడమే కథనం.
       
ఇంతా చేసి ఆ ఆరుగురు తప్పు ఒప్పుకుంటారే తప్ప
, హత్య ఎవరు చేశారో వాళ్ళకీ తెలీదు. ఆ హత్యలో బాలరాజుని మాత్రం ఇరికించారు. ఇక్కడ్నుంచి క్లయిమాక్స్ లో నైనా అసలు దోషిని కనుక్కునేందుకు యాక్షన్ లో కొచ్చి బయట అడ్వెంచర్స్ చేస్తాడనుకుంటే అదీ జరగదు. జైల్లో వున్న బాలరాజునే అడిగితే బాలరాజు చెప్పేస్తాడు మంజుని చంపిందెవరో!
       
ఇలా డైలాగులతో నడిచే కథకి ఫ్లాష్ బ్యాక్స్ లో పల్లెటూళ్ళో వచ్చే సీన్లూ పేలవమే. పల్లెటూళ్ళో రోమాన్స్ చెప్పక్కర్లేదు. ఏ సీన్లో కూడా డ్రామా
, భావోద్వేగాలుండవు. చిత్రీకరణలో దర్శకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తుంది. పొలంలో హత్యకి గురై పడున్న అమ్మాయి శవమైతే – మేకప్ చెదరని గ్లామరస్ ఫేసుతో కళకళ లాడుతూ వుంటుంది. నిర్మాణంలో అన్ని  శాఖల్లోనూ అత్యంత బలహీనం ఈ సస్పెన్స్ థ్రిల్లర్.

నటనలు - సాంకేతికాలు

వరుణ్ సందేశ్ పాత్ర మానవ హక్కుల సంఘం ఉద్యోగి కాకపోయినా వచ్చే నష్టమేం లేదు. పాత్ర ఆ నేపథ్యం లోంచి వచ్చినట్టు కూడా వుండదు. పైగా 40 నిమిషాల పాటు వరుణ్ సందేశ్ మాస్క్ వేసుకుని ప్రేక్షకులకి మొహం చూపించడు. ప్రేక్షకులకి హీరో మొహం కనిపించకపోతే సినిమా ఎలా ఎంజాయ్ చేస్తారు. విలన్ ఆఖరి వరకూ మొహం చూపించకున్నా ఫర్వాలేదు. దీన్ని హీరోకి అప్లై చేస్తే ఎలా? ఆ ఆరుగురి ముందు మాస్కు వేసుకుని, ప్రేక్షకుల ముందు మాస్కు తీసేసి వుండాల్సింది. 40వ నిమిషంలో మాస్కు తీసేసి స్లోమోలో నడుచుకుంటూ పోతే అది బ్యాంగ్ అవుతుందా? అది వరుణ్ సందేశ్ అని ప్రేక్షకులకి ముందే తెలుసు. కాకపోతే మొహం చూడాలని వుంటుంది.
        
డైలాగ్ డెలివరీలో ఇంప్రూవ్ అయ్యాడు. కానీ నటించడానికి ఈ సినిమాలో విషయం లేదు. మిగిలిన పాత్ర ధారులందరూ కూడా బలహీన పాత్రల్ని బరువు మోస్తున్నట్టు నటించారు. సాంకేతికంగా చెప్పుకోవడానికేమీ లేదు. గదిలో బంధించిన కథకి సాంకేతికాలతో అవసరమే వుండదు. మొత్తానికి వరుణ్ సందేశ్ రూటు మార్చి సస్పెన్స్  థ్రిల్లర్ నటించినా కలిసిరాలేదు.
—సికిందర్