రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 6, 2023

1390 : కొత్త సమాచారం

 


        ల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ - ఐనాక్స్ లిమిటెడ్ ప్రీమియం, లగ్జరీ సినిమా ఫార్మాట్స్ ని విస్తరించే ప్రణాళికని శరవేగంగా ముందుకు తీసికెళ్తోంది. కంపెనీ ఇటీవలే ముంబాయి లోని జియో వరల్డ్ ప్లాజాలో రెండవ మైసన్ సినిమా ని ప్రారంభించింది. ఈ కాంప్లెక్స్ లో  రెండు ఇన్సిగ్నియా స్క్రీన్‌లు, లేజర్ టెక్నాలజీతో కూడిన ఒక ఐమాక్స్  స్క్రీన్, మూడు ప్రీమియర్ స్క్రీన్స్ ఏర్పాటయ్యాయి. ఇంకా గాట్స్ బీ పేరుతో ఒక బార్, లాంజ్ ప్రారంభమయ్యాయి. వీటిలో సెలబ్రిటీ షెఫ్‌లు సారా టాడ్, విక్కీ రత్నానీ, యుటాకా సైటో, మయాంక్ తివారీ క్యూరేట్ చేసిన ఫుడ్ అండ్ బెవరేజీ మెనూ లభ్యమవుతోంది.
        
ప్పటికి పీవీఆర్ - ఐనాక్స్ దేశంలో ఐమాక్స్, 4డీఎక్స్, ప్లే హౌస్, గోల్డ్, లక్స్, పీఎక్స్ఎల్, ఓనిక్స్, డ్రైవ్-ఇన్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లు సహా 1,711 స్క్రీన్స్ కి యాజమాన్యం వహిస్తోంది. 2022 డిసెంబర్‌లో ఫ్రెంచ్ ఎగ్జిబిటర్ సీజీఆర్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, దేశానికి దాని హై-ఎండ్ ఐస్ థియేటర్స్ ఫార్మాట్‌ని తీసుకు వచ్చింది. ఇది ప్రధాన స్క్రీన్‌తో పాటు పరిధీయ దృష్టిని సృష్టించే సైడ్ ప్యానెల్స్ ని కలిగి వుంటూ తెరమీద రంగుల, కదలికల మెరుగైన కలబోతని అందిస్తుంది. 
       
పీవీఆర్-ఇనాక్స్
సురక్షిత, సన్నిహిత సినిమా వీక్షణానుభవాన్ని అందించడానికి ఒపెరా హౌస్‌ల సరళిలో ప్రత్యేక అంచెలవారీ బాల్కనీలు లేదా 'పాడ్‌ లతో ప్రేక్షకుల కోసం సరికొత్త, ప్రీమియం థియేటర్లని రూపొందించడానికి ఫ్రెంచ్ సినిమా ఆర్కిటెక్చరల్ డిజైన్ కంపెనీ ఓమా సినిమాతో జతకట్టింది. మన దేశం ఒక వైవిధ్యమైన సినిమా మార్కెట్ తో వుంది. ఈ నేపథ్యంలో పీవీఆర్- ఐనాక్స్ నిర్వహిస్తున్న కాంప్లెక్సులు జనాభా ఆధారంగా అందిస్తున్న సేవల్ని అనుకూలీకరిస్తోంది.

మైసన్ ప్రాపర్టీలోని ఆరు స్క్రీన్‌లలో సగటు టిక్కెట్ ధర రూ. 700. లగ్జరీ ఫార్మాట్‌ల ధర రూ. 1,200. ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్స్ ని కొంతకాలంగా విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీటిలో ఆడించడానికి సంవత్సరంలో సగం రోజులు కూడా ఈ ఫార్మాట్స్ లో తగినన్ని సినిమాలు రావడం లేదు.  ఒకప్పుడు 70 ఎంఎం థియేటర్లలో ఆడించడానికి తగినన్ని 70 ఎంఎం సినిమాలు లేక 35 ఎం ఎం సినిమాలు ఆడించినట్టు, ఐమాక్స్, 4డీఎక్స్ థియేటర్లలో రెగ్యులర్ ఫార్మాట్స్ సినిమాల్ని ఆడించుకోవాల్సి వస్తోంది- వీటి టిక్కెట్ ధరలతో.

ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్స్ లో  అప్పుడప్పుడు విడుదలయ్యే సినిమాలు కూడా హాలీవుడ్ సినిమాలే. ప్రీమియం ఫార్మాట్‌ సినిమాలు కూడా ఎక్కువ రోజులు ఆడడం లేదు. పైగా కొన్ని సినిమాలు ఈ ప్రీమియం థియేటర్స్ కలిగివున్న సాంకేతికాల్ని అందుకోలేక పోతున్నాయి. భారీ బడ్జెట్ దృశ్యాల కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ థియేటర్స్ అభివృద్ధిలో ముందున్నాయి, సినిమాలు వెనకున్నాయి.
       
సాంకేతిక రంగంలో
ఈ అనుభవాలు మామూలే.  సినిమా మాస్ మార్కెట్టా కాదా అనేది ముఖ్యం కాదు. దేశమే ఒక విభిన్న మార్కెట్. ప్రేక్షకుల ఆదాయాలతో, అభిరుచులతో సంబంధం లేకుండా, వాళ్ళని ళ్ళ నుంచి బయటికి  తీసుకురావడమే లక్ష్యంగా పీవీఆర్- ఐనాక్స్ పరిశ్రమిస్తోంది. రెండవ, మూడవ శ్రేణి నగరాల్లో ప్రీమియం ఫార్మాట్స్ ని కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కంపెనీ ఇంత ఆలోచిస్తోంటే సినిమా పరిశ్రమలు మాత్రం ప్రేక్షకుల్ని ళ్ళ నుంచి బయటికి  తీసుకొచ్చే లక్ష్యమే లేకుండా, ఓటీటీల నుంచి భారీ ఆదాయాలు పొందవచ్చనే ఆశతో సెకండాఫ్ సరుకులేని సినిమాల్ని భారీ ఎత్తున్న చుట్టి పారేస్తున్నాయి.

ప్రేక్షకుల సౌకర్యార్ధం పీవీఆర్- ఐనాక్స్ ఇటీవల ప్రారంభించిన పాస్‌పోర్టు ప్లాన్ కొత్త వెర్షన్స్ కూడా తీసుకువస్తోంది. విపరీతమైన మల్టీప్లెక్స్ ధరల పట్ల విమర్శలకి ప్రతిస్పందనగా ప్రారంభించిన ఈ ప్లాను కింద, ప్రేక్షకులు నెలకి రూ. 699 చెల్లించి సోమ- గురువారాల మధ్య  నెలకు 10 సినిమాల వరకు వీక్షించడాని వీలిచ్చే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్ ని పొందవచ్చు. ఇది ప్రీమియం, లగ్జరీ ఫార్మాట్‌ సినిమాలకి వర్తించదు. జాతీయ సెలవుల్లో, వారాంతపు రోజుల్లో వర్తించదు. ఈ పాస్ పై ఒకరికంటే ఎక్కువ మందికి ప్రవేశం లభించదు. సోమ- గురువారాల మధ్య రోజుకి ఒక సినిమాకి మాత్రమే అనుమతి వుంటుంది.
       
ప్రేక్షకులు ఇంట్లో చూసుకోవడానికి ఓటీటీల్లో పెద్ద సినిమాలు ఎప్పుడొస్తాయా అని చకోర పక్షుల్లా ఎదురు చూడకుండా
, థియేటర్లతో తమకున్న చిరకాల బంధాన్నినెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్తూ, ఈ కాలపు హై ఎండ్ థియేటర్స్ ని కాస్త కనికరిస్తే బావుంటుంది.

—సికిందర్

 

Monday, December 4, 2023

1389 : రివ్యూ

 


రచన -దర్శకత్వం: అరుణ్ విక్కిరాల
తారాగణం : సుడిగాలి సుధీర్, డాలీ షా, స్పందన, శివబాలాజీ, రవితేజ నన్నిమాల తదితరులు
నేపథ్య సంగీతం: మార్క్ కె రాబిన్, సంగీతం (పాటలు) : మోహిత్ రెహమానియక్ ఛాయాగ్రహణం: సన్నీ
నిర్మాతలు: వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యల్‌, చిరంజీవి ప‌మిడి
విడుదల :  డిసెంబర్ 1, 2023  
***

        గాలోడు తో హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయత్నించాడు. ఇదొక ప్రయోగమని చెప్పాడు. ఈ ప్రయోగంలో కొత్త తరహా పాత్ర పోషించానన్నాడు. కొత్త దర్శకుడు అరుణ్ విక్కిరాలని ఎంతో కొనియాడేడు. కాలింగ్ సహస్ర అనేది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ టైటిల్. చాలా పరిమిత బడ్జెట్ తో అపరిమిత ఆశలతో హీరో, దర్శకుడు కలిసి తెరకెక్కించారు. లేదా బలాత్కరించారు. గాలోడు తో మాస్ కమర్షియల్ హీరోగా పరిచయమైన సుధీర్, మరి మాస్ కమర్షియల్ కాకుండా తన మీద  చేసుకున్న ఈ ప్రయోగంతో ఏం సాధించాడో చూద్దాం...

కథ

అజయ్ శ్రీవాత్సవ (సుధీర్) బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చి సాఫ్ట్ వేర్ డెవలపర్ గా చేరతాడు. అతడి అక్క హత్యకి గురైంది. ఆమెలాగా అమ్మాయిలు బలి కా కూడదని ఒక యాప్ డెవలప్ చేస్తాడు. ఇక్కడ అన్నయ్యా అని పిలిచే సత్య (రవితేజ) తో కలిసి వుంటాడు. ఒకరోజు సిమ్ కార్డు కొనుగోలు చేస్తాడు. అప్పట్నుంచీ అతడి ఫోన్ కి సహస్ర (డాలీ షా) కావాలని కాల్స్ వస్తూంటాయి. సహస్ర కోసం ఎవరెవరో కాల్స్ చేస్తూంటే అయోమయంలో పడతాడు. ఇంకో పక్క సత్య పరిచయం చేసిన స్వాతి (స్పందన) తో ప్రేమలో పడతాడు. అయితే సారా పేరుతో ఇంకో అమ్మాయి ఉత్తరాలు రాస్తూంటుంది. ఈ సారా ఎవరు? సహస్ర ఎవరు? తన అక్క చావుకీ, సహస్ర కనిపించకపోవడానికీ సంబంధం ఏమైనా వుందా? లూసిఫర్ అనే డార్క్ వెబ్సైట్ ముఠా వ్యహారమేమిటి? ఇవి తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.  

ఎలావుంది కథ

ఈ కథ ఇలా ఎందుకుంది, ఇలా వుండాలి కదా అని మెదడుకి పని చెపుతూ ఎక్సర్ సైజ్ చేయడానికి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. తద్వారా మంచి సినిమా రైటర్స్ అవచ్చు. దర్శకుడికి ఋణపడి వుండొచ్చు. సుడిగాలి సుధీర్ ప్రయోగమంటే మామూలుగా వుండదు కదా? ప్రేక్షకుల మెదళ్ళపై ప్రయోగం. అన్నట్టు డార్క్ వెబ్సైట్ ముఠా అమ్మాయిల్ని టార్చర్ చేస్తూ ఇలాటి ప్రయోగాలే చేస్తూంటుంది. వీళ్ళు ప్రేక్షకుల వెంట పడకపోవడం మంచిదైంది.
       
హార్రర్ ని కలిపిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో లాజిక్స్ ని అడక్కూడదు. ఆత్మతో వుండాల్సిన కథ వుండదు. ఆ సిమ్ కార్డుకి కాల్స్ ఎందుకొస్తున్నాయో తెలీదు. అదే సిమ్ కార్డునుంచి అదే ఫోనుకి మెసేజిలు ఎలా వస్తున్నాయో తెలీదు. ఇవి ఆత్మ చేస్తున్న పనులా తెలీదు. ఇవి తెలుసుకోవడానికి సెకండాఫ్ కెళ్తే ఆత్మ తెలుస్తుంది గానీ
, ఆత్మతో వుండాల్సిన సినిమాటిక్ కథనం వుండదు. కనుక హార్రర్ ఏమీ వుండదు. అమ్మాయిల రక్షణకి యాప్ డెవలప్ చేసిన హీరోకి- ఉత్తరాలు రాసే సారాతో, మెసేజిలు పంపే సహస్రతో సాఫ్ట్ వేర్ సోల్యూషన్ ఏంటో తెలీదు. తెలుసుకునే ప్రయత్నం చేయక, ఇంటర్వెల్ వరకూ కన్ఫ్యూజ్ అవుతూ పిచ్చిగా ఓ కేక వేస్తాడు. ఈ కేకవేసే ఇంటర్వెల్ బ్యాంగ్ లో మంగళవారం లో పాయల్ రాజ్పుత్ లా సహస్రని దెయ్యంలాగా చూపించి షాకివ్వచ్చుగా? దేని ప్లేస్ మెంట్ ఎక్కడుండాలో కథనం తెలియకపోతే ఎలా?
       
సెకండాఫ్ లో సహస్ర ఎవరో తెలుస్తుంది. ఆమెతో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో సహస్ర కథ అత్యంత నీరసంగా వుంటుంది. ఇలా సహస్ర- సారాల మిస్టరీ వీడాక
, డార్క్ వెబ్ సైట్ ముఠాతో యాక్షన్ సీన్లు మొదలవుతాయి.
       
కథా కథనాలుగానీ
, పాత్రచిత్రణలుగానీ, దర్శకత్వంగానీ ఏవీ కనిపించని పోవడమే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అర్ధం అన్నట్టు వుంటుంది. వీటిని కనుక్కునేందుకు ప్రేక్షకులు చేసే ప్రయత్నంతో అనుభవించేదే, సస్పెన్స్, థ్రిల్! గాలోడు సుడిగాలి సుధీర్ ప్రయోగాత్మకంగా అందించిన గాలి సినిమా ఇది.

నటనలు- సాంకేతికలు

జబర్దస్త్ కమెడియన్ అయిన సుధీర్ సాహసించి ఈ సీరియస్ పాత్ర వేసినందుకు అభినందించి తీరాలి. తన నుంచి ప్రేక్షకులాశించే కామెడీతో అలరించని లోటు కనబడనీయకుండా సీరియస్ పాత్రతో చేసిన ప్రయోగం వరకూ మాత్రం సక్సెస్ అయ్యాడు. ఈ సీరియస్ పాత్రకి తగ్గ కథ, భావోద్వేగాలు, కథానాయకుడిగా తనే కథని పరుగులెత్తిస్తూ తగిన సస్పెన్స్, థ్రిల్స్ వుండేట్టు చూసుకోవాల్సిన బాధ్యతని మాత్రం మరిచాడు. వీటిని డిమాండ్ చేసి దర్శకుడి నుంచి పొందడం తన డ్యూటీయే. మాస్ సినిమాలు తీసినంత ఈజీ కాదు సస్పెన్స్ థ్రిల్లర్ తీయడం. సస్పెన్స్ థ్రిల్లర్లు, హార్రర్ లు ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలుగా వుండేవి. ఈ శతాబ్దం ఆరంభంలో బాలీవుడ్ లో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హాష్మీ, జాన్ అబ్రహాం లాంటి స్టార్లు నటించడం మొదలెట్టి వీటికి మెయిన్ స్ట్రీమ్ గ్రేడ్ సినిమాల హోదా కల్పించారు. తెలుగులో బి గ్రేడ్ కే కుదించి వుంచుతున్నారు వీటి విలువ, మార్కెట్ విస్తృతి తెలీక.
       
ఇక ఇందులో హీరోయిన్ల గురించి చెప్పుకోవడానికేం లేదు. వుమెన్ ప్రొటెక్షన్ గురించి తీసిన సినిమాలో హీరోయిన్లకే స్థానం లేదు. సోషల్ ల్ మీడియా కమెడియన్ రవితేజ సన్నిమాల సోషల్ మీడియాలోనే కామెడీ వీడియోలతో బెటర్. శివబాలాజీ విలన్ పాత్ర వేశాడు. ఇక సంగీతం
, కెమెరా, ఫైట్ సీన్స్ వగైరా హాస్యాస్పదంగా వున్నాయి. దర్శకుడు అరుణ్ విక్కిరాల రాయడంలోనే కాదు, తీయడంలో కూడా సినిమా క్రాఫ్ట్ నేర్చుకోవాల్సిందెంతో వుంది.
—సికిందర్

Saturday, December 2, 2023

1388 : రివ్యూ

 

రచన - దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
తారాగణం: రణబీర్ కపూర్, రశ్మికా మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తీ దిమ్రీ శక్తి కపూర్ తదితరులు
స్క్రీన్ ప్లే: సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సురేష్ బండారు; ఛాయాగ్రహణం : అమిత్ రాయ్, యాక్షన్: సుప్రీం సుందర్, నేపథ్య సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, సంగీతం (పాటలు) : జామ్ 8, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, అషిమ్ కెమ్సన్, గురీందర్ సీగల్.
బ్యానర్లు: టీ -సిరీస్ ఫిలిమ్స్, సెయింట్ ఫిలిమ్స్ లిమిటెడ్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతానీ, క్రిషన్ కుమార్
విడుదల : డిసెంబర్ 1, 2023
***
            ‘అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ హిందీ రీమేక్ తర్వాత మరో హిందీ యానిమల్ తో తిరిగి వచ్చాడు. అయిదు భాషల్లో విడుదలైన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అత్యంత హింసాత్మక సినిమాగా ప్రచారం జరిగి, భారీ ఓపెనింగ్స్ తో ఈ రోజు విడుదలైంది. రణబీర్ కపూర్, రశ్మికా మందన్న, అనిల్ కపూర్ వంటి పాపులర్ స్టార్స్ తో దర్శకుడు సందీప్ రెడ్డి తీసిన తండ్రి కొడుకుల సంబంధాలతో కూడిన ఈ ఫ్యామిలీ కథ కాని ఫ్యామిలీ కథ ఎలా వుందో చూద్దాం...

కథ

ఒక స్టీల్ ఫ్యాక్టరీ యజమాని బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్)  కొడుకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కి తండ్రి అంటే పిచ్చిప్రేమ. తండ్రిని ఒక హీరోగా, రోల్ మోడల్ గా ఆరాధిస్తూంటాడు. కానీ తండ్రి ప్రేమ దక్కదు. తండ్రి తన బిజీ వ్యవహారాలతో కొడుకు విజయ్ కి  సమయమివ్వడు. విజయ్ బయట పడుతున్న గొడవలు చూసి బోర్డింగ్ స్కూల్లో వేస్తాడు తండ్రి. కాలక్రమంలో విజయ్ గీతాంజలి (రశ్మికా మందన్న)ని ప్రేమించి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. ఎనిమిదేళ్ళ తర్వాత తండ్రి మీద హత్యాప్రయత్నం జరిగిందని తెలుసుకుని హుటాహుటీన తిరిగి వచ్చేస్తాడు. తండ్రి మీద హత్యప్రయత్నం చేసిందెవరో పట్టుకుని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు.
       
ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడా
? తండ్రికి శత్రువుగా మారిన అబ్రార్ హక్ (బాబీ డియోల్) ని పట్టుకుని హతమార్చాడా? ఈ యుద్ధంలో మృగంలా మారి భారీ హింసకి తెరతీసిన విజయ్ విజయం సాధించాడా? తండ్రితో సానుకూల సంబంధాలు ఏర్పడ్డాయా?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

తండ్రీ కొడుకుల సంబంధాలతో పాత కథే. ఈ పాత కథకి ఉన్మాద కొడుకు ప్రవర్తన, ప్రతీకారం వంటి జోడింపులతో కొత్త కథగా మార్చాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి లో హీరో కి హీరోయిన్ తో అగ్రెసివ్ ప్రేమైతే, యానిమల్ లో తండ్రితో అగ్రెసివ్ ప్రేమ. సందీప్ రెడ్డి వయోలెంట్ ఫార్ములాతోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని చేస్తున్న ప్రయత్నం. రణబీర్ సింగ్ 2011 లో రాక్ స్టార్ లో మ్యాడ్ లవర్ గా అపూర్వ నటన, ఆ తర్వాత 2012 లో బర్ఫీలో చెవిటి మూగ అనితరసాధ్య హాస్య నటనా పూర్తి చేసుకున్నతర్వాత, యానిమల్ తో హార్డ్ కోర్ క్రూర పాత్రతో పతాక స్థాయికెళ్ళి పోయి విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఈ ప్రత్యేకతలే పాత కథని కొత్తగా మార్చాయి.
       
ఫస్టాఫ్ రణబీర్ పాత్రని పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం వల్ల సుదీర్ఘంగా  గంటన్నర సాగుతుంది. రణబీర్ పాత్ర చిన్నప్పట్నుంచీ తండ్రితో సంబంధా గురించి వివరంగా చెప్పుకొచ్చారు. ఈ సంబంధాలు ఉద్రిక్తతల్ని సృష్టించడం
, ఎడబాటు, ప్రేమా పెళ్ళీ, అమెరికా ప్రయాణం వగైరా సన్నివేశాలతో సాగి, ఎనిమిదేళ్ళ టైమ్ లాప్స్ తర్వాత తండ్రి మీద దాడి జరగడం, ఆ వెంటనే రణబీర్ భార్యాపిల్లలతో తిరిగి వచ్చి, శత్రువు కోసం మృగంగా మారడం వంటి బీభత్సాలతో, ఇంకా సుదీర్ఘమైన ఇంటర్వెల్ యాక్షన్ సీనుతో, ఫస్టాఫ్ పూర్తవుతుంది.
       
ఇంటర్వెల్లోనే కథ పూర్తయినట్టు అర్ధం వస్తుంది. అంటే అద్భుతంగా రాయాలని తలపెట్టిన స్క్రీన్ ప్లే సెకండాఫ్ సిండ్రోమ్ అనే గండంలో పడిందన్నమాట. ఇక ఇలా సెకండాఫ్ లో కథ లేదని అర్ధమై
, సెక్స్ విజ్ఞానం, సెక్స్ మీద లెక్చర్లు వంటి అశ్లీల- అసభ్య సీన్లతో సాగి, ఇంకో ప్రేయసి (తృప్తీ ధిమ్రీ) తో సంబంధాలు, దీంతో భార్యతో గొడవల సుదీర్ఘ సన్నివేశాలూ సాగుతూ సాగుతూ సెకండాఫ్ డల్ గా మారి, విలన్ ఎంట్రీతో  ఊపందుకుని మళ్ళీ హింసాత్మక యాక్షన్ సీన్స్ వగైరాలతో మొత్తానికి పగ తీరుతుంది. ఫస్టాఫ్ నీటుగా, ఫ్రెష్ గా వుంటే,  సెకండాఫ్ కథని తడుముకోవడంతో సరిపోయింది. అయితే ముగింపులో తండ్రీ కొడుకుల మీద దృశ్యం- తండ్రిని కొడుకుగా మారి చూడమనే సీను- నిజంగానే ఈ ఫ్యామిలీ (?) -యాక్షన్ డ్రామాకి మాస్టర్ స్ట్రోక్ అనొచ్చు.
       
ప్రధానంగా ఈ కథ మితిమీరిన హింస
, అభ్యంరకర సెక్స్ డైలాగులు- దృశ్యాల మీద ఆధారపడింది. తండ్రి ప్రేమతో చూడలేదని తండ్రి మీద కోపం తీర్చుకునే ఉద్దేశంతో ఇలా  ప్రవర్తించాడా, లేక తండ్రి మీద హత్యాయత్నానికి నిజంగానే శత్రువు మీద పగతో ఇలా  ఉన్మాదిగా మారేడా అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది.

నటనలు- సాంకేతికాలు

పైన చెప్పుకున్నట్టు ఇది రణబీర్ మూడో అవతారం. ఉన్మాదిలా కూడా నటించడం అతడిగే సాధ్యమైంది. ఈ పాత్రలో ఇంకొకర్నివూహించలేం. టీనేజి. యంగ్ ఏజి, మిడిలేజి పాత్రల్లో అద్భుతంగా నటించాడు. హావభావాలు, భావోద్వేగాలు ప్రకటించడంలో  తనకి తానే సాటి. యాక్షన్ సీన్స్ లో రాక్షసుడిలా మారడం అతి అనిపించినా తప్పదు- సందీప్ రెడ్డి ఫార్ములానే ఇది. సినిమా ఇలాగే వుంటుంది. 
        
ఈ హీరో ఓరియెంటెడ్ బీభత్స భయానక హింసలో, హీరోయిన్ రశ్మికా మందన్నది కరివేపాకు పాత్ర కాలేదు. సంఘర్షణ వున్న నిడివిగల పాత్రే. ఈ పాత్రకి న్యాయం చేసింది. తండ్రి పాత్రలో అనిల్ కపూర్ బలమైన నటనతో వుంటే, విలన్ గా బాబీ డియోల్ దినిరుత్సాహపర్చే బలహీన పాత్ర. క్లయిమాక్స్ లో హీరో రేంజి యాక్షన్ సీన్ కాబట్టి అక్కడ మాత్రం ఎలివేటయ్యాడు.
       
ఎనిమిది మంది సంగీత దర్శకుల 8 ఎనిమిది పాటలు సినిమా నిడివి అతిగా మూడు గంటలా 21 నిమిషాలు పెరగడానికి పనికొచ్చాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం హైలైట్ గా నిలుస్తుంది. సుప్రీం సుందర్ యాక్షన్ కొరియోగ్రఫీ
, అమిత్ రాయ్ ఛాయాగ్రహణం బలమైన సాంకేతిక అంశాలుగా నిలుస్తాయి.
       
అయితే దర్శకుడు సందీప్ రెడ్డి తానే ఎడిటర్ కావడంతో తీసిన దృశ్యాల మీద ప్రేమ వల్ల
, కత్తెర వేయలేక  సినిమా నిడివి అంతులేకుండా పోయింది. మొత్తానికి ఉత్కంఠతో  ఎదురు చూసిన యానిమల్ సెకెండాఫ్ కంటే ఫస్టాఫ్ బెటర్ గా వుంది.
—సికిందర్ 

Wednesday, November 29, 2023

1387 : కొత్త సమాచారం


  దేశంలో పానిండియా సినిమాల ముందు స్మాలిండియా సినిమాలకి స్థానం లేదాపెద్ద పెద్ద పానిండియా సినిమాలతో సమానంగా చిన్న చిన్న స్మాలిండియా సినిమాలు థియేటర్ ప్రేక్షకుల్ని ఆకర్షించడం మానేశాయాదీనికి అవుననే సమాధానం వస్తుంది. ఎప్పుడంటేప్రాంతీయ స్థాయిలో చిన్న సినిమాల నిర్మాతలుదర్శకులు అధ్వాన్నంగా సినిమాలు తీసి వదులుతున్నప్పుడు. మలయాళంలో అయినా సరేతమిళంలో అయినా సరేకన్నడలో అయినా సరేతెలుగులో అయినా సరే. పంజాబీలో అయినా సరేఅది బెంగాలీలో అయినా సరేమరాఠీలో అయినా సరేగుజరాతీలో అయినా సరే. ప్రాంతీయ భాషల లఘు బడ్జెట్ కమర్షియల్ సినిమాలు నిర్మాణంలో ఆర్టిస్టులకిటెక్నీషియన్స్ కీ ఉపాధికల్పించే వనరులుగా తప్ప నిర్మాతలకిథియేటర్లకీ ఎందుకూ పనికిరాని వ్యర్ధపదార్ధాలుగా మిగిలిపోతున్నాయి.

      యితే కాస్త తేడా చూపించినప్పుడు మాత్రం ఇవి పెద్ద హిట్లు. వంద కోట్ల క్లబ్ లోసైతం చేరిపోయే వ్యాపార నమూనాలు. ఒక పక్క జవాన్జైలర్లియో వంటి భారీ-బడ్జెట్ పానిండియా సినిమాల వెంట పరుగెత్తిన ప్రేక్షకులే – 12th ఫెయిల్ (హిందీ)క్యారీ ఆన్ జట్టా (పంజాబీ)బైపన్ భారీ దేవా (మరాఠీ)వేద్ (మరాఠీ), 3 ఎక్కా (గుజరాతీ)మాయాకుమారి (బెంగాలీ)పోర్ తాళిల్ (తమిళం)రోమాంచం (మలయాళం)సప్తసాగరచే ఎల్లో (కన్నడ) వంటి చిన్న సినిమాలకీ కనకవర్షం కురిపించారు. పంజాబీలో క్యారీ ఆన్ జట్టానైతే 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టారు.   
        
తెలుగులో కూడా కీడాకోలామా ఊరి పొలిమేర -2, మ్యాడ్మేం ఫేమస్రైటర్ పద్మభూషణ్బలగంబేబీ మొదలైన 7 చిన్న  సినిమాలని సర్ప్రైజ్ హిట్స్ చేశారు తేడా కనబర్చిన తెలుగు ప్రేక్షకులు. ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమలు పునరుజ్జీవన సంకేతాల్ని చూపుతున్నాయని చిన్న నిర్మాతలు సంతోషిస్తున్నారు. అయితే ఒకటే షరతు- కొంచెం తేడా కనబర్చే వ్యాపార నమూనా ఇవ్వాలి. అప్పుడే పానిండియా ప్రేక్షకుల్ని స్మాలిండియా సినిమాల వైపు కూడా మళ్ళించుకునే వీలవుతుంది. పై సినిమాలన్నీ రొటీన్ మూసకి భిన్నంగా ఏదో తేడా కనబర్చినవే.
       
తెలుగులో ఐదు కోట్లతో తీసిన బేబీ 
80 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ వూహించలేదు. మూడు కోట్లతో బలగం 22 కోట్లుమూడు కోట్లతో మ్యాడ్ 20 కోట్లురెండు కోట్లతో మేం ఫేమస్ 7 కోట్లుమూడు కోట్లతో రైటర్ పద్మ భూషణ్ 12 కోట్లు, 4 కోట్లతో మా ఊరి పొలిమేర-2 14 కోట్లుఆరుకోట్లతో కీడాకోలా 13 కోట్లూ కాసులు కురిపించి నిర్మాతల్నీఅటు థియేటర్లనీ ఆనందపర్చాయి.
       
ఇక్కడ గమనార్హ మేమిటంటే
ఇతర భాషల్లో కంటే తెలుగులోనే ఎక్కువ హిట్స్ తీశారు. అయితే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉత్సాహంతో ముందుకు తీసికెళ్తారాపానిండియా సినిమాలకి తెలుగు ప్రసిద్ధి అయినట్టుస్మాలిండియా సినిమాలకీ ఆ స్థాయిని  తెచ్చి పెడతారాఇది సందేహమే. ఎందుకంటే కొత్త కొత్త దర్శకులు ఏవేవో మూస కంటెంట్ లు వెంట పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్గానిక్ మామ-హైబ్రిడ్ అల్లుడురారా పెనిమిటిఅలా ఇలా ఎలానాతోనేనుకృష్ణ గాడు అంటే ఒక రేంజ్ఏం చేస్తున్నావ్?, నెల్లూరి నెరజాణవారెవ్వా జతగాళ్ళుఒకసారి ప్రేమించాకఅలా నిన్ను చేరి- ఇవన్నీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదలైన 90 చిన్న సినిమాల్లో ప్రేక్షకుల్ని చేరుకోని చవకబారు సినిమాలు. ఈ మత్తులోనే ఇంకా వున్నారు మార్కెట్ స్పృహగణాంకాల పట్టింపూ లేని  కొత్తగా వస్తున్న మేకర్లు.
         
సినిమా ప్రయత్నాల్లోనే వుంటున్న కాస్త అనుభవమున్న కో-డైరెక్టర్లు
అసోసియేట్ డైరెక్టర్లు పెద్ద హీరోల కోసమే ప్రయత్నాలు చేస్తూ వుండి పోతారు. తమకున్న నాలెడ్జితో టైమ్ వేస్ట్ చేసుకోకుండా చిన్న సినిమా ఒకటి బాగా తీసుకోవచ్చుగా అంటే- అది సక్సెస్ అయితే పెద్ద హీరోలే పిలుస్తారు కదా అంటే- చిన్న సినిమా గురించి ఆలోచించడానికే ఇష్టపడరు. కాబట్టి అనుభవంలేని అసిస్టెంట్లే చిన్న సినిమాలకి దిక్కు. ఎవరో ఒకరు తేడా కొట్టకుండాయాదృచ్ఛికంగా కాస్త తేడాగాల సినిమా తీస్తే తప్పస్మాలిండియా అన్పించుకునే అవకాశం లేదు. పెద్ద సినిమాలు అనూహ్యంగా మంచి వసూళ్ళు ఇస్తున్నప్పుడు చిన్న సినిమాల్ని ప్రదర్శించడం సవాలుగా వుంటుంది. మల్టీప్లెక్సుల ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి బహుళ స్క్రీన్‌లు కలిగి వుండడం. ఇది విభిన్న కంటెంట్‌ గల చిన్న సినిమాల్ని ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఏదైనా పెద్ద సినిమా బాక్సాఫీసుని డామినేట్ చేస్తున్నప్పుడుచిన్న సినిమాల్ని విడుదల చేయడానికి ఇష్టపడరు. పెద్ద సినిమాలు లేనప్పుడు మల్టీప్లెక్సుల బహుళ స్క్రీన్ లన్నిటా చిన్న సినిమాలకి పండగే. దీన్ని సద్వినియోగం చేసుకునే చిన్న సినిమాలే వుండడం లేదు. ఒక షోకి పరిమితమైరెండో రోజు ఆ షో కూడా లేకుండా పోయే చావకబారు తనంతోనే  వుంటున్నాయి.
         
హిందీ నిర్మాతపంపిణీదారు సన్నీ ఖన్నా ప్రకారం- కోవిడ్‌ కి ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు లఘుబడ్జెట్ ప్రాంతీయ భాషల సినిమాల విజయాలు తక్కువ వున్నాయి. విడుదలైన అన్ని సినిమాల్లో 10-15% మాత్రమే విజయం పొందుతున్నాయి.

చిన్న సినిమాలు మునుపటి కంటే చాలా ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్నా విజయాలు మాత్రం పెగడం లేదు. ఇంట్లో
చేతిలోథియేటర్లో ఎక్కడబడితే అక్కడ సినిమాలు వెల్లువెత్తుతున్న కాలంలో- స్టడీతోరీసెర్చితో అవగాహన పెంచుకుని తేడాగల సినిమా తీస్తే తప్పసమూహంలో సెర్చి లైట్ లాగా వుంటే తప్పచిన్న సినిమాలకి చావకబారు లేబుల్ వదలదు!

—సికిందర్

 

Tuesday, November 28, 2023

1386 : బాక్సాఫీసు సమాచారం


వంబర్ లో  స్మాల్, మీడియం రేంజి సినిమాలకి పూర్తి ఓపెన్ మార్కెట్ లభించింది. నవంబర్ లో ఒకే ఒక్క పెద్ద సినిమా విడుదల కావడంతో ఈ అరుదైన అవకాశం లభించింది స్మాల్, మీడియం రేంజి మూవీస్ కి. ఆ పెద్ద సినిమా నవంబర్ చివరి వారంలో విడుదలైన ఆది కేశవ. విడుదలైన 20 స్మాల్, మీడియం రేంజి సినిమాల్లో 16 స్మాల్ కాగా, 4 మీడియం. కొత్త వాళ్ళతో 16 స్మాల్ సినిమాలన్నీ సహజంగానే ఫ్లాపయ్యాయి. ఇవి ఫ్లాప్ అని స్క్రిప్టుకి శ్రీకారం చుట్టినప్పుడే తెలిసిపోతుంది. ప్రతీనెలా ఇవి చాలా కమిట్ మెంటుతో ఫ్లాపవ్వాలని ప్రయత్నిస్తూంటాయి. 4 మీడియం రేంజిలో ఒకటి హిట్టవుతూ అవుతూ ఆగిపోయింది. మిగిలిన 3 హిట్టయ్యాయి. ఇక ఒకే ఒక్క పెద్ద సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. అది విష్ణు తేజ్ తో సితారా ఎంటర్ టైంమెంట్స్ నిర్మించిన ఆది కేశవ. ఇది దారితప్పి 2023 లో వచ్చింది. అలాగే ఫ్లాపయిన మీడియం మూవీ మంగళవారం’. హిట్టయిన మీడియం సినిమాలు కీడా కోలా’, మా ఊరి పొలిమేర 2’, కోట బొమ్మాళి పి ఎస్- నవంబర్ లో హిట్టయినవి ఈ మూడు మీడియం రేంజి సినిమాలే. ఎందుకు హిట్టయ్యాయి?

       
 కీడా కోలా తొలి తెలంగాణా గ్యాంగ్ స్టర్ సినిమా. కొంత కాలం క్రితం భారీ స్థాయిలో తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమా తెలపెట్టాడు ఓ తెలంగాణ సినిమా తీసిన తెలంగాణ దర్శకు డు. అది ముందుకెళ్ళలేదు. దాని స్థానంలో తొలి తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమాగా కీడాకోలా విడుదలైంది. తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించాడు. గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వస్తూంటాయి. విచిత్ర పాత్రలతో గ్యాంగ్ సినిమాగా రావడం దీని ప్రత్యేకత. విచిత్ర పాత్రలు, వింత కథనాలు. దీనికి కామెడీ జోడిస్తే ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ అయిపోయింది. ఇలా వొక ఔటాఫ్ బాక్స్ సినిమాని ఆదరించారు ప్రేక్షకులు.
        
మా ఊరి పొలిమేర 2 చేతబడి కథతో సినిమా. మా ఊరి పొలిమేర 1 ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది. దీనికి దర్శకుడు అనిల్ విశ్వనాథ్.  మసూద’, విరూపాక్ష చేతబడి సినిమాలని హిట్ చేసిన ప్రేక్షకులు దీన్నీ హిట్ చేశారు. రూరల్ థ్రిల్లర్స్ విషయానికొస్తే, చేతబడి సినిమాలు, గ్రామదేవతల సినిమాలు హిట్టవుతున్నాయి. దెయ్యాలతో హార్రర్ సినిమాలు పాతబడిపోయిన చోట ఇలాటివి సక్సెస్ అవుతున్నాయి. అంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పుడూ వర్కౌటయ్యే ఫార్ములా. కాకపోతే జానర్ మార్చాలి. ఇదే జరిగింది మా ఊరి పొలిమేర రెండు భాగాలతో.
       
కోట బొమ్మాళి పిఎస్ పోలీసు థ్రిల్లర్. పోలీసుల్ని పోలీసులు పట్టుకోవడమే కథ కావడంతో ఇదో కొత్తదనం. శ్రీకాంత్ నటించిన ఈ థ్రిల్లర్ కి దర్శకుడు తేజ మార్ని. ఈ మలయాళ రీమేక్ లో ఇంకా ఎన్నికల రాజకీయాల, కుల సంఘర్షణల కోణాలు జతపడడంతో సామాజికంగా ప్రేక్షకులకి దగ్గరగా వెళ్లింది. మూస ఫార్ములాకి భిన్నంగా ఇది రియలిస్టిక్ జానర్ కావడంతో మార్పుని కోరుకుంటున్న ప్రేక్షకులు దీన్ని హిట్ చేశారు. ఇది కూడా ఔటాఫ్ బాక్స్ సినిమానే.
        
అంటే ఒకప్పుడు అసాధారణ కథలతో ఔటాఫ్ బాక్స్ సినిమాలు తీయడానికి భయపడ్డ నిర్మాతలకి ఈ సినిమాల రిజల్టుతో ప్రేక్షకుల గ్రీన్ సిగ్నల్ లభించినట్టే. కీడా కోలా’, కోటబొమ్మాళి పిఎస్ రెండూ ఔటాఫ్ బాక్స్ సినిమాలే. ఇలా ఈ రెండు ఔటాఫ్ బాక్సులు, ఒకటి దెయ్యాలకి బదులు చేతబడి ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించి హిట్టయ్యాయి.
        
ఇక మంగళవారం. ఇది కూడా ఔటాఫ్ బాక్సే. బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాకపోతే ఓవర్ బడ్జెట్ ని అందుకోలేక ఆగిపోయింది. 7-8 కోట్లలో తీయాలిన సినిమా 12 కోట్లకి పెంచారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ట్రెండింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన ఈ మూవీ నింఫోమేనియాక్ పాత్ర కథ. ఇలాటిది తెలుగులో ఇంతవరకూ రాలేదు. దీనికి గ్రామదేవత కథ జోడించారు. కాంతారా హిట్టయినప్పట్నుంచీ గ్రామ దేవతలు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీన్ని లాజికల్ సస్పెన్సు తో క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే తీశారు. రివ్యూలు కూడా ప్రోత్సాహకరంగా వచ్చాయి. అయితే ప్రేక్షకులు మోయలేనంత ఓవర్ బడ్జెట్టయి పోయింది. ఔటాఫ్ బాక్సుకి ఇంత బడ్జెట్ అవసరం లేదని ఇది చెప్తుంది.
        
ఆదికేశవ టైటిల్ తో సహా 1990 లలో రావాల్సిన సినిమా. దర్శకుడితో సహా దారితప్పి 2023 లో వచ్చింది. వస్తే వచ్చింది, దీన్ని ఫన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా తీసినా బావుండేది. దర్శకుడు ఎన్. శ్రీకాంత్ రెడ్డి అంత శ్రమ తీసుకోదల్చుకోలేదు. కొత్త స్టార్ వైష్ణవ్ తేజ్, డాన్సింగ్ స్టార్ శ్రీలీలలు వుండగా పాత సీమ ఫ్యాక్షన్ కథకే కొత్త శోభ వచ్చేస్తుందనుకుని చుట్టి పారేశాడు. ప్రేక్షకుల్ని తేలిగ్గా తీసుకుని ఇలాటి పాత మూస సినిమాలు తీస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఈ సినిమా తీర్పు చెప్పింది. ఈ పెద్ద సినిమా టీజర్ చూసే ప్రేక్షకులు పసిగట్టేసి కామెంట్లు పెట్టారు. ఈ భారీ ఫ్లాపు అగ్ర నిర్మాతల రాంగ్ ప్రొడక్షన్.
—సికిందర్