రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 19, 2022

1236 : రివ్యూ!


 

దర్శకత్వం : అనుభూతీ  కశ్యప్
తారాగణం : ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, షెఫాలీ షా, షీబా చద్దా, అభయ్ మిశ్రా, ఇంద్రనీల్ సేన్ గుప్తా
కథ :  సౌరభ్ భరత్, విశాల్ వాఘ్; మాటలు :  సుమిత్ సక్సేనా; స్క్రీన్ ప్లే : అనుభూతీ  కశ్యప్, సుమిత్ సక్సేనా, సౌరభ్ భారత్, విశాల్ వాఘ్
సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : ఈషిత్ నరేన్
నిర్మాణం : జంగ్లీ పిక్చర్స్
విడుదల : అక్టోబర్ 14, 2022
***
           డాక్టర్ గైనకాలజిస్టుగా ఆడవాళ్ళకి వైద్యం చేస్తే ఎలా వుంటుంది? అసాధారణ కథలతో సినిమాలు నటిస్తున్న ఆయుష్మాన్ ఖురానా మరోసారి గందరగోళం సృష్టించడానికి హాస్పిటల్ కామెడీతో విచ్చేశాడు. కొత్త దర్శకురాలు అనుభూతీ కశ్యప్ కొత్త ఐడియాతో అందరూ లేడీ డాక్టర్లూ -లేడీ పేషంట్ల మధ్య మేల్ డాక్టరుగా ఆయుష్మాన్ ని ఇరకాటంలో పడేసి, కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. గైనకాలజిస్టులు లేడీ డాక్టర్లే వుండాలా? మగ డాక్టర్ని మనుషులు భరించరా? మనుషులు ఇంకా మారరా? డాక్టర్ కి ఆడా మగా జెండర్ ఏమిటి? ఆయుష్మాన్ డాక్టరుగా కొనసాగాలా, లేక తనలోని మనిషిని మేల్కొల్పాలా?... వంటి ప్రశ్నలతో డాక్టర్ జీ ని ప్రేక్షకుల ముందుంచింది. ఇదెలా వుందో సారి చూద్దాం...

కథ

ఎంబిబిఎస్ పూర్తి చేసిన  డాక్టర్ ఉదయ్ (ఆయుష్మాన్ ఖురానా) పీడియాట్రిక్స్ లో చేరాలనుకుంటాడు. కానీ భోపాల్ మెడికల్ కాలేజీలో కూడా సీటు దొరక్కపోవడంతో గైనకాలజీలో చేరిపోతాడు. క్లాస్ రూమ్ లో వీడెవడ్రా అన్నట్టు జ్యూనియర్ లేడీ డాక్టర్లు చూస్తారు. సీనియర్ లేడీ డాక్టర్లు అతడికి ఆడవాళ్ళ బట్టలు తొడిగి పురుడు కూడా పోసేసి ర్యాగింగ్ చేస్తారు. జూనియర్లు జోకులతో ఆటలు పట్టిస్తారు. చీఫ్ డాక్టర్ నందిని (షెఫాలీ షా) ఇవేమీ పట్టించుకోకుండా ఉదయ్ తో ప్రొఫెషనల్ గా వుంటుంది. హాస్పిటల్లో డ్యూటీలు వేస్తూంటుంది. పురుడు పోయాలంటే భయపడి చస్తున్న అతడికి జ్యూనియర్ డాక్టర్ ఫాతిమా (రకుల్ ప్రీత్ సింగ్) తోడుండి భయం పోగొడుతుంది. ఆమెతో స్నేహం చేస్తాడు. తర్వాత ప్రేమలో పడతాడు.

ఇంటిదగ్గర ఉదయ్ కి సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని ఏ యాప్ పడితే ఆ యాప్ లో చేరిపోయే తల్లి శోభా (షీబా చద్దా) వుంటుంది. ఈమె బూతు యాప్ టిండర్లో కూడా చేరిపోయేసరికి తలబాదుకుంటాడు ఉదయ్. ఇంకోవైపు ఏళ్ళ తరబడి ఐఏఎస్ చదువుతున్న చెడ్డీ (అభయ్ మిశ్రా) అనే ఫ్రెండ్ వుంటాడు. వీడు షర్టు వేసుకోకుండా చెడ్డీ మీద అర్ధ నగ్నంగా వుంటాడు. చెడ్డీ సలహాలిస్తూ వుంటాడు. మరో వైపు ఉదయ్  బంధువు డాక్టర్ అశోక్ (ఇంద్రనీల్ సేన్గుప్తా) వేరే సలహాలిస్తూంటాడు.

ఇలా హాస్పిటల్లో, ఇంట్లో కామెడీలు, ఫాతిమాతో ప్రేమ దృశ్యాలతో సాగుతూ సాగుతూ వుంటుంది. ఇంతకీ కథేమిటి? కథా? అదొకటుంటుందా? దీనికి పనిగట్టుకుని సెకండాఫ్ వెతకాలి.

ఎలావుంది కథ

ఇది హాస్పిటల్ కామెడీ కథ. ఫస్టాఫ్ ఒక కథ కాని కథలా, సెకండాఫ్ ఇంకో కథలా వుండే సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడ్డ రచనా సంవిధాన దుర్విధానం. ఆడవాళ్ళకి వైద్యం చేసే మేల్ గైనకాలజిస్టు కాన్సెప్టు కొత్తదే. దీన్నెలా చెప్పాలో తెలిసేంత సృజనాత్మక వినాశ సామర్థ్యం లేదు. కొత్త దర్శకురాలితో బాటు ముత్యాల్లాంటి నల్గురు రచయితలూ కలిసి హైలెస్సా అని తలా ఓ వైపు లాగితే తాళ్ళు తెగాయి. చివరికి నాల్గు దిక్కుల్లో పంచ ముఖాలుగా ఈ కథని లాగడం పురుడు పోసినంత సులువు కాదని అర్ధమైనట్టుంది, అలా వదిలేశారు. మంది ఎక్కువైతే పాకం పాయకరావు పేట అవుతుందన్నట్టు డాక్టర్ జీ చెడింది. తెర మీద ఒక మేల్ డాక్టర్ -అందరూ ఫిమేల్ డాక్టర్లు, తెర వెనుక ఒక ఫిమేల్ డైరెక్టర్- అందరూ మేల్ రైటర్లు- మ్యాచింగ్ కుదర్లేదు...

కొత్త కథ, కొత్త పాత్రలు కావడం వల్ల ఫస్టాఫ్ ఆకర్షిస్తుంది ఫన్నీ దృశ్యాలతో. అయితే ఈ కామెడీలు కూడా అదుపు తప్పి అశ్లీలంగా మారిన దృశ్యాలున్నాయి. నా దగ్గర లేని దానికి నేనెలా వైద్యం చెయ్యను?- వంటి డబుల్ మీనింగులున్నాయి. ఒక సీన్లో భార్యని తీసుకుని భర్త వస్తాడు. చీర పైకి లేపమని ఆయుష్మాన్ చూస్తూంటే, మా ఆవిడ్నే రేప్ చేస్తావురా అని ఆయుష్మాన్ ని ఉరికించి ఉరికించి కొట్టే సీను మాత్రం బాగా పేలింది. ఇలాటి పరిస్థితి ఎదురయ్యే అవకాశమున్నదే. 

కానీ సెకండాఫ్ కొచ్చేసరికి సీరియస్ గా మారిపోయి ఇంకో సినిమా చూస్తున్నట్టుంది. నిజానికి ఈ డాక్టర్ పాత్ర  లేడీస్ ఓన్లీ అనే కొత్త వైద్య ప్రపంచంలో ఏలా తనని మార్చుకుని ఇమిడిపోవాలన్న లక్ష్యంతో సాగాలి. దీన్ని హాస్యంగానే చెప్పాలి. డాక్టర్ కాని డాక్టర్ మున్నాభాయ్ ఎంబిబిఎస్ మొత్తం హాస్యంగానే సాగుతుంది. అసలు దర్శకురాలు లేవనెత్తిన ప్రశ్నలకైనా  సరైన సమాధానాలు చెప్పాలి. కానీ వీటితో సంబంధం లేని ఏవేవో విషయాలతో, మధ్యలో విఫల ప్రేమ కథతో ఎమోషన్లు, సెంటి మెంట్లు, మెలోడ్రామాలతో లేనిపోయి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టారు. చివర్లో మాత్రం లింగ అసమానతల గురించి, వైద్య నీతి గురించీ మెసేజి ఇస్తూ ఎలాగో ముగించారు.

నటనలు -సాంకేతికాలు

ఆయుష్మాన్ ఫస్టాఫ్ వరకూ ఓకే, సెకండాఫ్ మాత్రం ఫన్ వదిలేసి సీరియస్ గా, విషాదంగా వుండడం బాక్సాఫీసు అప్పీలులా లేదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర చాలా మంది లేడీ డాక్టర్ పాత్రల మధ్య సరీగ్గా ఎస్టాబ్లిష్ కాదు. సెకండాఫ్ లో వేరే బాయ్ ఫ్రెండ్ వున్నాడని ఆయుష్మాన్ కి గుడ్ బై చెప్పేస్తుంది. చివర్లో ఆ బాయ్ ఫ్రెండ్ తో పెళ్ళికే కనిపించేది. చీఫ్ డాక్టర్ గా షెఫాలీ షా మాత్రం కాస్త ముద్ర వేస్తుంది తన పాత్రతో.

ఆయుష్మాన్ తల్లిగా సోషల్ మీడియా స్టార్ అవ్వాలని రొమాంటిక్ గా మారే షీబా చద్దా పాత్ర కూడా మంచిదే. ఇన్నాళ్ళూ భర్త పోయినా తను కొడుకు కోసం పెళ్ళి చేసుకోలేదు. ఇప్పుడు కొడుకు సెటిలయ్యాక తానూ పెళ్ళి చేసుకుని సెటిలవ్వాలనే ఆమె ఆలోచన ప్రేమాయణానికే దారి తీస్తుంది. 1989 లో విడుదలైన సన్నీ డియోల్, శ్రీదేవి, రజనీ కాంత్ ల చాల్ బాజ్ లో ఫ్యాషన్ పిచ్చిగల సీనియర్ నటి రోహిణీ హట్టంగడి కామెడీని గుర్తుకు తెచ్చే నటన షీబాది.   

ఇక పాటలైతే వున్నాయి గానీ కామెడీ సినిమా కుండాల్సిన పెప్ లేదు. గుర్తుండవు. భోపాల్ నగరంలో కెమెరా వర్క్ మాత్రం బాగానే వుంది.

—సికిందర్

Tuesday, October 18, 2022

1235 : రివ్యూ!

రచన- దర్శకత్వం : ఫణి కృష్ణ
తారాగణం : ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్, వినోదిని, సప్తగిరి, నర్రా శ్రీనివాస్, రవి ప్రకాష్ 
సంగీతం : ధృవన్, ఛాయాగ్రహణం : సతీష్ ముత్యాల
బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత : కెకె రాధా మోహన్
విడుదల : అక్టోబర్ 14, 2022
***

            ది సాయికుమార్ 2011 లో ప్రేమకావాలిఅనే హిట్ తో రంగ ప్రవేశం చేసిన తర్వాత, వరుసగా నటించిన 16 సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినా ఒక్కో కొత్త దర్శకుడు నమ్మకం సడలని ఆశా భావంతో ఆదిని ఆదుకుంటూ, తన రంగ ప్రవేశ హీరోగా ఆదితో సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు. ఈ శ్రేణిలో ఫణి కృష్ణ అనే కొత్త దర్శకుడు కూడా చేరి అదృష్ట పరీక్షకి నిలబడ్డాడు. ట్రైలర్ చూస్తే ఇద్దరు హీరోయిన్లతో ఆది రోమాంటిక్ ఎంటర్టయినర్ గా వుంది. రెండు పాటలు కూడా యూట్యూబ్ లో హిట్టయ్యాయి. మాస్ హీరోగా ఎదగాలని కొన్ని విఫల యత్నాలు చేసిన ఆది, ఈ సారి తిరిగి తన లవర్ బాయ్ పాత్రకి తిరిగి వచ్చాడు. ఇదైనా ఫర్వాలేదన్పించుకుందా, లేక 16 పక్కన ఇంకో అంకె చేరిందా తెలుసుకుందాం...

కథ

తల్లిదండ్రులు చనిపోయిన అభిరామ్ (ఆది) అన్నావదినెల దగ్గర పెరుగుతాడు. వదిన గారాబంతో అల్లరిగా తయారవుతాడు. చెప్పింది పూర్తిగా వినకుండా తొందరపాటు తనంతో పనులు చేసుకుపోయి స్నేహితుల్ని చిక్కుల్లో పడేస్తూంటాడు. ఇలా క్రేజీ ఫెలోగా పేరు తెచ్చుకుంటాడు. ఇతడ్ని దారిలో పెట్టాలని అన్న ఓ కంపెనీలో చేర్పిస్తాడు. అక్కడ మధుమిత (దిగంగనా సూర్యవంశీ) వుంటుంది. క్రేజీ ఫెలోగా ఇతడి చేష్టల్ని ఇదివరకే చూసిన ఈమె ద్వేషించడం మొదలెడుతుంది. ఇద్దరూ కీచులాడుకోవడం మొదలెడతారు. ఇలావుండగా అక్కడే పని చేసే  రమేష్ (నర్రా శ్రీనివాస్) అభిరామ్ కి ఒక యాప్ గురించి చెప్తాడు. అభిరామ్ అది డౌన్ లోడ్ చేసుకుని సంపూర్ణేష్ బాబు ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని నాని పేరుతో చాటింగ్ చేస్తూంటాడు. ఇది తెలీక మధుమిత చిన్ని అనే పేరుతో  సూర్యకాంతం ఫోటో పెట్టుకుని చాటింగ్ చేస్తూంటుంది. ఇలా పరస్పరం ఆన్లైన్లో ప్రేమించుకున్నాక కలుసుకోవాలనుకుంటారు. ఇక్కడ తారుమారై అభిరామ్ చిన్ని పేరుతో వున్న వేరే అమ్మాయిని (మిర్నా మీనన్) ని కలుసుకుంటాడు. తర్వాత జరిగిన పరిణామాల్లో అభిరామ్ ని ఈ చిన్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది.

ఇలా అభిరామ్ తను చాటింగ్ చేసింది ఈ చిన్నితో కాదనీ, మధుమితతో అనీ ఎప్పుడు తెలుసుకున్నాడు? తెలుసుకున్నాక ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం ఎలా పరిష్కారమైంది? ఈ అద్భుత సందేహాలు తీర్చుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

ముందుగా ఒక ప్రశ్న:  పై అద్భుత సందేహాలు తీర్చుకోవాల్సిన అవసరం మనకేమైనా వుందా? తీర్చుకోకపోతే ఎవరైనా కొడతారా? ఇంత పాత టెంప్లెట్ కథ తప్ప కొత్త దర్శకుడికి మరేం తోచలేదా? హీరోని అన్నావదినెలు అల్లారుముద్దుగా పెంచడం, హీరో అల్లరల్లరిగా తయారవడం, అన్న దారిలో పెట్టడం, హీరో హీరోయిన్ల కీచులాటలు, ఒకరనుకుని మరొకర్ని ప్రేమించడం, ముక్కోణపు ప్రేమ, మొదటి హీరోయిన్ తోనే సుఖాంతం ...ఇన్ని చూసి చూసి వున్న టెంప్లెట్లే పెట్టుకుని ఈజీగా సినిమా తీసేశాడు.

దీనికి మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే ఒకటి. అంటే ఓ పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం యూత్ సినిమాలంటూ మొదలైన ట్రెండ్ లో లైటర్ వీన్ అంటూ తీసిన ప్రేమ సినిమాల టైపు మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే. ఇద్దరు హీరోయిన్లతో హీరో సమస్య  క్లయిమాక్స్ వరకూ ఆపి, అప్పుడు అయిదు నిమిషాల్లో తేల్చేసే లైటర్ వీన్ ప్రేమ సినిమాల ధోరణితో వుంది. అంటే క్లయిమాక్స్ వచ్చే దాకా కథలోకే వెళ్ళకుండా కాలక్షేపం చేసి, చివరి పావుగంటలో కథలో కొచ్చి, తేల్చేసే ఫ్లాప్ ప్రేమ సినిమాల ధోరణి. దర్శకుడి పైన ఇంకా ఈ సినిమాల ప్రభావం చాలా వుంది. క్లయిమాక్స్ దాకా కామెడీ పేరుతో కాలక్షేపం చేసినప్పుడు, అక్కడున్న ఆ కాస్తా ప్రేమ కథకి కూడా డెప్త్ లేదు. భావోద్వేగాల్లేవు.

దీంతో అయిపోలేదు. మరికొంత మంది కొత్త దర్శకులు ప్రేమ కథలతో సిద్ధమవుతున్నారు. వీటిని ప్రేక్షకులెవ్వరూ లక్ష్యపెట్టరు. ఈ సంవత్సరం తీసిన ప్రేమ సినిమాలన్నీ అడ్రసు లేకుండా పోయాయి. మార్కెట్ ఏమిటో తెలుసుకోనవసరం లేదు, కథంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, సినిమా మాత్రం పడాలి. నిర్మాతని పడెయ్యాలి. సినిమా తీసేసి హీరో-నిర్మాత-తనూ కలిసి ఇంటికెళ్ళిపోవాలి. ఆది ఎన్నిసార్లయినా ఇంటికి పోతాడు. నిర్మాతలు క్యూలో వుంటారు. మరో మూడు సినిమాలతో కూడా రెడీ  అవుతున్నాడు తను.

నటనలు- సాంకేతికాలు

క్రేజీ ఫెలో క్యారక్టర్ ని చాలా లేజీగా నటిస్తున్నట్టు కన్పిస్తాడు ఆది. గెటప్ కొత్తగా ప్రయత్నించాడు తప్ప నటించడం బద్ధకంగా నటించాడు. ఈ సినిమా ఇష్టం లేదేమో. మరో కొత్త దర్శకుడి భవిష్యత్తు కూడా తనకి అవసరం లేదేమో. కామెడీలేదు, పాత్రకి డెప్త్ లేకపోవడంతో భావోద్వేగాలూ లేవు. ఇలా హీరోయిజం కుదరక, రెండు భీకర ఫైట్స్ యాడ్ చేశాడు. ఫైట్స్ మాత్రం బాగా చేశాడు. విజయం కోసం ఫ్లాప్స్ తో ఫైట్ చేస్తున్నట్టే వుంది. తను ఇంకా ఫ్లాప్స్ తో ఫైట్ చేయాల్సిన అవసరంతో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా  ఆశ్చర్యం లేదు.


హీరోయిన్లు ఇద్దరి గురించీ చెప్పుకోవడాని కేమీ లేదు. చెప్పుకోదగ్గ పాత్రలూ కావు. ఇతర నటీనటులూ, కమెడియన్ సప్తగిరి సహా తెర నిండుగా కనిపించడానికి పనికొచ్చారు. అయితే ధ్రువన్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి- వినవే సుకుమారీ, ఎబిసిడిఇఎఫ్ జి - అన్నవి. సతీష్ ముత్యాల కెమెరా పనితనం మాత్రం అతి సాధారణంగా వుంది. ఈ డల్ విజువల్స్ యూత్ సినిమాకెలా వర్కౌట్ అవుతాయనుకున్నారో ఏమో.             

కొత్త దర్శకుడు ఫణి కృష్ణ ఈ కాలపు ప్రేమ సినిమాని పాత సినిమా లాధారంగా తీయడం, పాత ధోరణిలోనే రచన- దర్శకత్వం సాగించడం అసలు సమస్య. ఆదికి ఇంకో ఫ్లాప్ తో గ్రోత్. అసలతను ప్రేక్షకుల్ని కోల్పోయి కూడా చాలా కాలమైంది.

—సికిందర్

 

Monday, October 17, 2022

1234 : రివ్యూ!


రచన - దర్శకత్వం : రిషభ్ శెట్టి
తారాగణం : రిషభ్ శెట్టి, సప్తమీ గౌడ, కిషోర్, ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, ఉగ్రం రవి తదితరులు
సంగీతం : అజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం  : అరవింద్ కశ్యప్
నిర్మాణం : హొంబాళే ఫిల్మ్స్‌
పంపిణీ : (తెలుగు) గీతా ఆర్ట్స్
నిర్మాత : విజయ్ కిరగందూర్ 
విడుదల : అక్టోబర్ 15, 2022
***

        సెప్టెంబర్ 30 న విడుదలైన 'కాంతార' కన్నడ ఒరిజినల్ రికార్డు స్థాయి వసూళ్ళని  రాబడుతూ దూసుకెళ్తోంది. అక్టోబర్ 14 న విడుదలైన హిందీ వెర్షన్ కూడా సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 15 న తెలుగు వెర్షన్ విడుదలైంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ కన్నడ పానిండియా బాక్సాఫీసు ఇప్పటికి 200 కోట్లు దాటేసింది. పానిండియా సినిమాకి వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదని తేల్చేసింది. గత ఐదేళ్ళుగా కన్నడ సినిమాల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళుతున్న శెట్టి సోదరుల (రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ శెట్టి) భావజాలాన్ని ఇటీవల ‘చార్లీ 777, గరుడ గమన వృషభ వాహన’, ఇప్పుడు ‘కాంతార’ చాటుతున్నాయి. కన్నడ ప్రజల బ్రతుకు నుంచే కథలు తీసుకుని కన్నడ అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రాంతీయాభిమానంతో కమర్షియల్ సినిమాలకిదో కొత్త నమూనా.

        టుడు, రచయిత, దర్శకుడు అయిన రిషభ్ శెట్టి ఈసారి కన్నడ సంస్కృతిని పర్యావరణ పరిరక్షణతో ముడిపెట్టి అద్భుత దృశ్య వైభవాన్ని సృష్టించాడు. కన్నడలో ఉడిపి కేంద్రంగా ఉపప్రాంతీయ సినిమారంగం అయిన తుళువుడ్ నుంచి అభయసింహా తీసిన మత్స్యకారుల జీవన చిత్రం ‘పడ్డాయి లో కన్నడ సంస్కృతిని జోడించి ఓ దృశ్య కావ్యాన్ని సృష్టించాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా. రిషభ్ శెట్టి కమర్షియల్ సినిమా తీశాడు. కేజీఎఫ్‌ రెండు భాగాలతో ప్రఖ్యాతి గాంచిన  హోంబళే ఫిల్మ్స్ సంస్థ ‘కాంతార’ తో మరో ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అసలు ‘కాంతార’ లో వున్నదేమిటి, దీన్నెందుకు తప్పకుండా చూడాలీ అనే అంశాలు పరిశీలిద్దాం...  

కథ

1846లో ఓ దక్షిణ కర్ణాటక రాజు మనశ్శాంతి లేక అడవిలో తిరుగుతున్నప్పుడు కనిపించిన ఓ శిల ప్రశాంతతని చేకూరుస్తుంది. అది గిరిజనులు పూజించే దైవమహిమగల శిల. దాన్ని అడుగుతాడు. దాని బదులు వాళ్ళకి చాలా భూమిని దానమిస్తాడు. 1970 లలో ఆ రాజు వంశస్థుడు ఆ భూమిని క్లెయిమ్ చేస్తూ వస్తాడు. కోర్టు కెళ్తాడు. కోర్టు గుమ్మంలోనే రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. ఇదంతా ఆ శిలలో దాగున్న దైవం భూత కోలా మహిమ అనుకుంటారు. గిరిజనులు పూర్వం నుంచీ ప్రతీ యేటా భూత కోలా పండుగ జరుపుకుంటూ వుంటారు. దాన్ని కోలం అంటారు.

1990 లలో ప్రస్తుత కథా కాలానికొస్తే, ఆ గిరిజన గ్రామానికి భూస్వామి దేవేంద్ర (అచ్యుత్ కుమార్) అండగా వుంటాడు. ఇతను రాజు వంశస్థుడే. దొరగా గిరిజనుల సంక్షేమం చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అతడికి సహాయంగా శివ(రిషభ్ శెట్టి) వుంటాడు. ఇతను కంబళ పోటీల్లో (దున్నపోతు పందాలు) మొనగాడు. ఇతడికి కష్టపడి కుటుంబాన్ని ఈడ్చుకొచ్చే కమల (మానసీ సుధీర్) అనే తల్లి వుంటుంది. ఇతను నేస్తాలతో తిరుగుతూ, ఫారెస్ట్ గార్డు ట్రైనింగు పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడే ఉద్యోగంలో చేరిన గిరిజనురాలు లీల(సప్తమీ గౌడ) ని ప్రేమిస్తూ వుంటాడు.

ఈ ప్రాంతానికి ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చిన మురళీ(కిశోర్) కొన్ని చర్యలు చేపడతాడు. గ్రామస్థులు అడవిని పాడు చేస్తున్నారనీ, గ్రామానికి కంచె వేయడం ప్రారంభిస్తాడు. దీన్ని శివ అడ్డుకుంటాడు. వందల సంవత్సరాలుగా ఇక్కడి పౌరులమైన తాము అడవి అందించే ప్రతిదాన్నీ అనుభవించడానికి అర్హులని వాదిస్తాడు. ఈ వివాదం పెరిగి పెరిగి ఘర్షణకి దారి తీసి, ఫారెస్ట్ ఆఫీసర్ మీద హత్యాయత్నం కేసులో ఇరుక్కుని తప్పించుకుంటాడు శివ.

ఇప్పుడు శివ ఈ కేసులోంచి ఎలా బయటపడ్డాడు? మొత్తం గ్రామాన్నే కాజేసే ఇంకా పెద్ద కుట్రని ఎలా ఎదుర్కొన్నాడు? దైవం భూత కోలా పాత్రేమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులుగా తేలారు? చివరికి శివ ఏమయ్యాడు? ఈ ప్రశ్నల కి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

జానపద సాహిత్యాన్ని వాడుకుని ఈ కన్నడ ప్రాంతీయ కథని చెప్పారు. భూత కోల, దైవారాధన, నాగారాధన, కంబళ వంటి స్థానిక సంస్కృతులకి ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, స్మగ్లింగ్, అటవీ భూ ఆక్రమణల అంశాల్ని మేళవిస్తూ - దక్షిణ కన్నడలోని భూత కోలా, కంబళ, కోళ్ళ పందాలు సహా ఆచారాల్ని భాగం చేశారు. సామాజికంగానూ పరిస్థితిని ఏకరువు పెట్టారు. కుల సోపాన క్రమం కారణంగా చెప్పలేనంత అఘాయిత్యాలకి గురవుతున్న స్థానిక గిరిజనుల బాధలని ఆలోచనాత్మకంగా చిత్రించారు. 

2017 లో అభయ్ సింహా మత్స్యకారుల కుట్ర కథ పడ్డాయి తీసినప్పుడు షేక్స్ పియర్ నాటకం మాక్బెత్ ని ఆధారంగా చేసుకున్నాడు. ఇందులో కూడా దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోని కథ చెప్పడానికి యక్షగానాన్ని ఉపయోగించాడు. పురాతనం అధునాతనం విలువల్ని యక్షగానంతో తేటతెల్లం చేశాడు. భూత కోలా జానపద గీత ప్రయోగం కూడా చేశాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా కోవకి చెందింది. దీనికి జాతీయ అవార్డు లభించింది.

కాంతార దక్షిణ కన్నడ యాసలో వుంటుంది. మొత్తం శక్తివంతమైన నేపథ్యాన్ని యాక్షన్ జానర్ లో థ్రిల్లింగ్ గా చెప్పారు. యాక్షన్, థ్రిల్, విశ్వాసాలు, జానపద రసపోషణ - వీటి అందమైన సమ్మేళనం ఇటీవలి కాలంలో వెండితెరమీద చేసిన ఉత్తమ ప్రయత్నాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కథలనేవి స్థానిక జీవితంలోనే చాలా వున్నాయనీ, వెతికితే రత్నాలు దొరుకుతాయనీ విశేషమైన రీసెర్చి చేసినట్టు అన్పించే కళాత్మక ప్రయోగం. హిందీలో తుంబడ్ (2018) అనే హార్రర్ కూడా ఈ కోవకి చెందిన జానపద కథల సమ్మేళనంతో కళాత్మకంగా తెరకెక్కిన హిట్ సినిమానే.

నటనలు- సాంకేతికాలు

రాసి, తీసి, నటించిన రిషభ్ శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గిరిజన శివ పాత్రలో రిషభ్ శెట్టి అనే తను కన్పించనంతగా లీనమై పాత్ర పోషణ చేశాడు. ఆనాడు మృగయాలో గిరిజన పాత్ర నటించిన మిథున్ చక్రవర్తిలాగా. పాత్ర ఎక్కడా కుదురుగా వుండదు. మెరుపు వేగంతో పరిగెడుతూ వుంటుంది. ఇందులోనే నేస్తాలతో అల్లరి చేసుకోవడం, తల్లి చేతిలో దెబ్బలు తినడం, ప్రేమించిన అమ్మాయితో సరసాలాడ్డం, తాగడం, కోళ్ళు చేపలు వండుకుని తినడం, దొరకి బంటుగా నిరూపించుకోవడం, ఫారెస్ట్ ఆఫీసర్ తో సిగపట్లకి దిగడం అన్నీ జరిగి పోతూంటాయి.

ఎంత పోరాట పటిమ వున్నా వ్యవస్థ చేతిలో బలయ్యే సామాజిక వర్గమే తనది. ఈ సహజత్వం కోసం హీరోయిజాన్ని దూరం పెట్టి జైలు సీన్లు నటించాడు. గిరిజనుడే కని పిస్తాడు తప్ప తెలుగు స్టార్, తెలుగు హీరో సీజీతో జైలు గోడలు బద్దలు కొడుతూ కనిపించడు. ఇందుకేనేమో పానిండియా స్టార్ ప్రభాస్ రెండు సార్లు ఈ సినిమా చూసినట్టుంది. ఇక ఇరవై నిమిషాల క్లయిమాక్స్ అయితే అపూర్వం, అద్భుతం- ఇంకేమైనా చెప్పుకోవచ్చు. క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు వెళ్ళి వెళ్ళి పతాక స్థాయికి చేరేసరికి -తన పాత్రే పూర్తిగా మారిపోయి (metamorphosis- రూపాంతరం, రూపవిక్రియ) - ప్రేక్షకులు అవాక్కయ్యేలా క్లోజింగ్ ఇమేజితో బలమైన స్టాంపు గుద్ది వదిలాడు. పాత్ర ఇలా మారిపోతుందని ఎవ్వరూ వూహించరు! ఈ పాత్రలో రౌద్రంగా ఆకాశాన్నంటిన నటనా, నాట్యమూ రిషభ్ శెట్టిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టేశాయి! అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే లేచి చప్పట్లు కొడతారు.

హీరోయిన్ గా తెల్లటి వర్ణపు మెరిసిపోయే గ్లామర్ నటిని తీసుకోకుండా, గిరిజనురాలిలా కన్పించే స్థానిక నటి సప్తమీ గౌడని తీసుకోవడం మంచి పని. లేకపోతే బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ని తెచ్చుకుంటే 5 కోట్లు ఆమెకే పోయేవి. పైగా కొండపొలం లో రకుల్ ప్రీత్ సింగ్ లా విచిత్రంగా వుండేది. సప్తమీ గౌడ నటన చెప్పుకోదగ్గది. ఫారెస్ట్ గార్డుగా పై అధికారి చేతిలో అవమానాలు భరిస్తూ, చివరికి కోపం బద్ధలై ఆయుధానికి పనిచెప్పే దృశ్యం కథలోంచి పుడుతూ వచ్చిన సహజ భావోద్వేగమే.    దొరగా అచ్యుత్ కుమార్ మృదువైన నటన, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ కరకు ప్రవర్తన కథనానికి పాజిటివ్ నెగెటివ్ డైనమిక్స్ గా వుంటాయి. రిషభ్ తల్లిపాత్ర నటించిన మానసి సుధీర్ సంఘర్షణాత్మక పాత్ర, నటన కూడా గుర్తుండి పోతాయి. ఇక రిషభ్ నేస్తాలుగా నటించిన ఆర్టిస్టులు సహా మిగిలిన నటీనటులందరూ ఒక పకడ్బందీ గిరిజన వాతావరణ సృష్టికి తోడ్పడ్డారు.

సాంకేతికంగా చూస్తే ఇదొక వండరే. అటవీ ప్రాంతాన్నీ, ప్రకృతినీ, గిరిజన నివాసాల్నీ తెర మీద కళాత్మకంగా ఆవిష్కరించాడు కెమెరామాన్ అరవింద్ కశ్యప్. రాత్రి పూట దృశ్యాల లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే  -ముఖ్యంగా క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు - చిత్రకారుడు పెయింటింగ్ వేసినట్టున్నాయి. అజనీష్ లోకనాథ్ ట్రైబల్ బాణీలు, అడవిలో నిగూఢంగా వున్న శక్తి తాలూకు హార్రర్ బాణీలూ ఇవన్నీ నేటివిటీనిసంస్కృతినీ దాటిపోలేదు.  అడవిలో రిపీటయ్యే భూత కోలా ఆర్తనాదం కాంతార టైటిల్ ని ఎలుగెత్తి చాటుతూంటుంది. కాంతార అంటే మాయారణ్యం. 

చివరికేమిటి

ఇందులో కొన్ని బలహీనతలు లేకపోలేదు. లీలతో శివ పాత్ర సంబంధం ఫ్లాట్ గానే కాక అసహజంగా వుంది. గిరిజన కుటుంబం నుంచి చదువుకుని ఫారెస్ట్ గార్డుగా ఉద్యోగం సంపాదించుకునే స్థితికి ఎదిగిన  లీలని కాస్తయినా ఆదర్శంగా చూపాలనుకోలేదు దర్శకుడు. అల్లరిగా వుండే శివ ఆమె విషయానికొచ్చేసరికి గౌరవిస్తూ వుండుంటే, చదువుకున్న తన పట్ల అతడి అభిమానం చూసి ఆమె ప్రేమిస్తూ వుండుంటే ప్రేమ ట్రాకులో డైనమిక్స్ వుండేవి. ఇలాకాక శివ ఆమెని గిచ్చి, గిల్లీ, పక్కలోకి లాగే దృష్టితోనే వుండేసరికి పాత్ర చిత్రణ మట్టి కరిచింది. ఇలాటి బలహీనతలు మరికొన్నున్నాయి.

ఇంతా చేసి ఇది కథ కాదు, గాథ! గాథ ఇంత హిట్టయ్యిందా? గాథలతో తెలుగు సినిమాలు గోతిలో పడుతోంటే కన్నడలో హిట్టా? అదేమరి. ఇదెలా సాధ్యమైందో ఈవారం స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

—సికిందర్