రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 19, 2022

1236 : రివ్యూ!


 

దర్శకత్వం : అనుభూతీ  కశ్యప్
తారాగణం : ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, షెఫాలీ షా, షీబా చద్దా, అభయ్ మిశ్రా, ఇంద్రనీల్ సేన్ గుప్తా
కథ :  సౌరభ్ భరత్, విశాల్ వాఘ్; మాటలు :  సుమిత్ సక్సేనా; స్క్రీన్ ప్లే : అనుభూతీ  కశ్యప్, సుమిత్ సక్సేనా, సౌరభ్ భారత్, విశాల్ వాఘ్
సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : ఈషిత్ నరేన్
నిర్మాణం : జంగ్లీ పిక్చర్స్
విడుదల : అక్టోబర్ 14, 2022
***
           డాక్టర్ గైనకాలజిస్టుగా ఆడవాళ్ళకి వైద్యం చేస్తే ఎలా వుంటుంది? అసాధారణ కథలతో సినిమాలు నటిస్తున్న ఆయుష్మాన్ ఖురానా మరోసారి గందరగోళం సృష్టించడానికి హాస్పిటల్ కామెడీతో విచ్చేశాడు. కొత్త దర్శకురాలు అనుభూతీ కశ్యప్ కొత్త ఐడియాతో అందరూ లేడీ డాక్టర్లూ -లేడీ పేషంట్ల మధ్య మేల్ డాక్టరుగా ఆయుష్మాన్ ని ఇరకాటంలో పడేసి, కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. గైనకాలజిస్టులు లేడీ డాక్టర్లే వుండాలా? మగ డాక్టర్ని మనుషులు భరించరా? మనుషులు ఇంకా మారరా? డాక్టర్ కి ఆడా మగా జెండర్ ఏమిటి? ఆయుష్మాన్ డాక్టరుగా కొనసాగాలా, లేక తనలోని మనిషిని మేల్కొల్పాలా?... వంటి ప్రశ్నలతో డాక్టర్ జీ ని ప్రేక్షకుల ముందుంచింది. ఇదెలా వుందో సారి చూద్దాం...

కథ

ఎంబిబిఎస్ పూర్తి చేసిన  డాక్టర్ ఉదయ్ (ఆయుష్మాన్ ఖురానా) పీడియాట్రిక్స్ లో చేరాలనుకుంటాడు. కానీ భోపాల్ మెడికల్ కాలేజీలో కూడా సీటు దొరక్కపోవడంతో గైనకాలజీలో చేరిపోతాడు. క్లాస్ రూమ్ లో వీడెవడ్రా అన్నట్టు జ్యూనియర్ లేడీ డాక్టర్లు చూస్తారు. సీనియర్ లేడీ డాక్టర్లు అతడికి ఆడవాళ్ళ బట్టలు తొడిగి పురుడు కూడా పోసేసి ర్యాగింగ్ చేస్తారు. జూనియర్లు జోకులతో ఆటలు పట్టిస్తారు. చీఫ్ డాక్టర్ నందిని (షెఫాలీ షా) ఇవేమీ పట్టించుకోకుండా ఉదయ్ తో ప్రొఫెషనల్ గా వుంటుంది. హాస్పిటల్లో డ్యూటీలు వేస్తూంటుంది. పురుడు పోయాలంటే భయపడి చస్తున్న అతడికి జ్యూనియర్ డాక్టర్ ఫాతిమా (రకుల్ ప్రీత్ సింగ్) తోడుండి భయం పోగొడుతుంది. ఆమెతో స్నేహం చేస్తాడు. తర్వాత ప్రేమలో పడతాడు.

ఇంటిదగ్గర ఉదయ్ కి సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని ఏ యాప్ పడితే ఆ యాప్ లో చేరిపోయే తల్లి శోభా (షీబా చద్దా) వుంటుంది. ఈమె బూతు యాప్ టిండర్లో కూడా చేరిపోయేసరికి తలబాదుకుంటాడు ఉదయ్. ఇంకోవైపు ఏళ్ళ తరబడి ఐఏఎస్ చదువుతున్న చెడ్డీ (అభయ్ మిశ్రా) అనే ఫ్రెండ్ వుంటాడు. వీడు షర్టు వేసుకోకుండా చెడ్డీ మీద అర్ధ నగ్నంగా వుంటాడు. చెడ్డీ సలహాలిస్తూ వుంటాడు. మరో వైపు ఉదయ్  బంధువు డాక్టర్ అశోక్ (ఇంద్రనీల్ సేన్గుప్తా) వేరే సలహాలిస్తూంటాడు.

ఇలా హాస్పిటల్లో, ఇంట్లో కామెడీలు, ఫాతిమాతో ప్రేమ దృశ్యాలతో సాగుతూ సాగుతూ వుంటుంది. ఇంతకీ కథేమిటి? కథా? అదొకటుంటుందా? దీనికి పనిగట్టుకుని సెకండాఫ్ వెతకాలి.

ఎలావుంది కథ

ఇది హాస్పిటల్ కామెడీ కథ. ఫస్టాఫ్ ఒక కథ కాని కథలా, సెకండాఫ్ ఇంకో కథలా వుండే సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడ్డ రచనా సంవిధాన దుర్విధానం. ఆడవాళ్ళకి వైద్యం చేసే మేల్ గైనకాలజిస్టు కాన్సెప్టు కొత్తదే. దీన్నెలా చెప్పాలో తెలిసేంత సృజనాత్మక వినాశ సామర్థ్యం లేదు. కొత్త దర్శకురాలితో బాటు ముత్యాల్లాంటి నల్గురు రచయితలూ కలిసి హైలెస్సా అని తలా ఓ వైపు లాగితే తాళ్ళు తెగాయి. చివరికి నాల్గు దిక్కుల్లో పంచ ముఖాలుగా ఈ కథని లాగడం పురుడు పోసినంత సులువు కాదని అర్ధమైనట్టుంది, అలా వదిలేశారు. మంది ఎక్కువైతే పాకం పాయకరావు పేట అవుతుందన్నట్టు డాక్టర్ జీ చెడింది. తెర మీద ఒక మేల్ డాక్టర్ -అందరూ ఫిమేల్ డాక్టర్లు, తెర వెనుక ఒక ఫిమేల్ డైరెక్టర్- అందరూ మేల్ రైటర్లు- మ్యాచింగ్ కుదర్లేదు...

కొత్త కథ, కొత్త పాత్రలు కావడం వల్ల ఫస్టాఫ్ ఆకర్షిస్తుంది ఫన్నీ దృశ్యాలతో. అయితే ఈ కామెడీలు కూడా అదుపు తప్పి అశ్లీలంగా మారిన దృశ్యాలున్నాయి. నా దగ్గర లేని దానికి నేనెలా వైద్యం చెయ్యను?- వంటి డబుల్ మీనింగులున్నాయి. ఒక సీన్లో భార్యని తీసుకుని భర్త వస్తాడు. చీర పైకి లేపమని ఆయుష్మాన్ చూస్తూంటే, మా ఆవిడ్నే రేప్ చేస్తావురా అని ఆయుష్మాన్ ని ఉరికించి ఉరికించి కొట్టే సీను మాత్రం బాగా పేలింది. ఇలాటి పరిస్థితి ఎదురయ్యే అవకాశమున్నదే. 

కానీ సెకండాఫ్ కొచ్చేసరికి సీరియస్ గా మారిపోయి ఇంకో సినిమా చూస్తున్నట్టుంది. నిజానికి ఈ డాక్టర్ పాత్ర  లేడీస్ ఓన్లీ అనే కొత్త వైద్య ప్రపంచంలో ఏలా తనని మార్చుకుని ఇమిడిపోవాలన్న లక్ష్యంతో సాగాలి. దీన్ని హాస్యంగానే చెప్పాలి. డాక్టర్ కాని డాక్టర్ మున్నాభాయ్ ఎంబిబిఎస్ మొత్తం హాస్యంగానే సాగుతుంది. అసలు దర్శకురాలు లేవనెత్తిన ప్రశ్నలకైనా  సరైన సమాధానాలు చెప్పాలి. కానీ వీటితో సంబంధం లేని ఏవేవో విషయాలతో, మధ్యలో విఫల ప్రేమ కథతో ఎమోషన్లు, సెంటి మెంట్లు, మెలోడ్రామాలతో లేనిపోయి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టారు. చివర్లో మాత్రం లింగ అసమానతల గురించి, వైద్య నీతి గురించీ మెసేజి ఇస్తూ ఎలాగో ముగించారు.

నటనలు -సాంకేతికాలు

ఆయుష్మాన్ ఫస్టాఫ్ వరకూ ఓకే, సెకండాఫ్ మాత్రం ఫన్ వదిలేసి సీరియస్ గా, విషాదంగా వుండడం బాక్సాఫీసు అప్పీలులా లేదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర చాలా మంది లేడీ డాక్టర్ పాత్రల మధ్య సరీగ్గా ఎస్టాబ్లిష్ కాదు. సెకండాఫ్ లో వేరే బాయ్ ఫ్రెండ్ వున్నాడని ఆయుష్మాన్ కి గుడ్ బై చెప్పేస్తుంది. చివర్లో ఆ బాయ్ ఫ్రెండ్ తో పెళ్ళికే కనిపించేది. చీఫ్ డాక్టర్ గా షెఫాలీ షా మాత్రం కాస్త ముద్ర వేస్తుంది తన పాత్రతో.

ఆయుష్మాన్ తల్లిగా సోషల్ మీడియా స్టార్ అవ్వాలని రొమాంటిక్ గా మారే షీబా చద్దా పాత్ర కూడా మంచిదే. ఇన్నాళ్ళూ భర్త పోయినా తను కొడుకు కోసం పెళ్ళి చేసుకోలేదు. ఇప్పుడు కొడుకు సెటిలయ్యాక తానూ పెళ్ళి చేసుకుని సెటిలవ్వాలనే ఆమె ఆలోచన ప్రేమాయణానికే దారి తీస్తుంది. 1989 లో విడుదలైన సన్నీ డియోల్, శ్రీదేవి, రజనీ కాంత్ ల చాల్ బాజ్ లో ఫ్యాషన్ పిచ్చిగల సీనియర్ నటి రోహిణీ హట్టంగడి కామెడీని గుర్తుకు తెచ్చే నటన షీబాది.   

ఇక పాటలైతే వున్నాయి గానీ కామెడీ సినిమా కుండాల్సిన పెప్ లేదు. గుర్తుండవు. భోపాల్ నగరంలో కెమెరా వర్క్ మాత్రం బాగానే వుంది.

—సికిందర్