రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, అక్టోబర్ 2022, సోమవారం

1234 : రివ్యూ!


రచన - దర్శకత్వం : రిషభ్ శెట్టి
తారాగణం : రిషభ్ శెట్టి, సప్తమీ గౌడ, కిషోర్, ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, ఉగ్రం రవి తదితరులు
సంగీతం : అజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం  : అరవింద్ కశ్యప్
నిర్మాణం : హొంబాళే ఫిల్మ్స్‌
పంపిణీ : (తెలుగు) గీతా ఆర్ట్స్
నిర్మాత : విజయ్ కిరగందూర్ 
విడుదల : అక్టోబర్ 15, 2022
***

        సెప్టెంబర్ 30 న విడుదలైన 'కాంతార' కన్నడ ఒరిజినల్ రికార్డు స్థాయి వసూళ్ళని  రాబడుతూ దూసుకెళ్తోంది. అక్టోబర్ 14 న విడుదలైన హిందీ వెర్షన్ కూడా సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 15 న తెలుగు వెర్షన్ విడుదలైంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ కన్నడ పానిండియా బాక్సాఫీసు ఇప్పటికి 200 కోట్లు దాటేసింది. పానిండియా సినిమాకి వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదని తేల్చేసింది. గత ఐదేళ్ళుగా కన్నడ సినిమాల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళుతున్న శెట్టి సోదరుల (రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ శెట్టి) భావజాలాన్ని ఇటీవల ‘చార్లీ 777, గరుడ గమన వృషభ వాహన’, ఇప్పుడు ‘కాంతార’ చాటుతున్నాయి. కన్నడ ప్రజల బ్రతుకు నుంచే కథలు తీసుకుని కన్నడ అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రాంతీయాభిమానంతో కమర్షియల్ సినిమాలకిదో కొత్త నమూనా.

        టుడు, రచయిత, దర్శకుడు అయిన రిషభ్ శెట్టి ఈసారి కన్నడ సంస్కృతిని పర్యావరణ పరిరక్షణతో ముడిపెట్టి అద్భుత దృశ్య వైభవాన్ని సృష్టించాడు. కన్నడలో ఉడిపి కేంద్రంగా ఉపప్రాంతీయ సినిమారంగం అయిన తుళువుడ్ నుంచి అభయసింహా తీసిన మత్స్యకారుల జీవన చిత్రం ‘పడ్డాయి లో కన్నడ సంస్కృతిని జోడించి ఓ దృశ్య కావ్యాన్ని సృష్టించాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా. రిషభ్ శెట్టి కమర్షియల్ సినిమా తీశాడు. కేజీఎఫ్‌ రెండు భాగాలతో ప్రఖ్యాతి గాంచిన  హోంబళే ఫిల్మ్స్ సంస్థ ‘కాంతార’ తో మరో ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అసలు ‘కాంతార’ లో వున్నదేమిటి, దీన్నెందుకు తప్పకుండా చూడాలీ అనే అంశాలు పరిశీలిద్దాం...  

కథ

1846లో ఓ దక్షిణ కర్ణాటక రాజు మనశ్శాంతి లేక అడవిలో తిరుగుతున్నప్పుడు కనిపించిన ఓ శిల ప్రశాంతతని చేకూరుస్తుంది. అది గిరిజనులు పూజించే దైవమహిమగల శిల. దాన్ని అడుగుతాడు. దాని బదులు వాళ్ళకి చాలా భూమిని దానమిస్తాడు. 1970 లలో ఆ రాజు వంశస్థుడు ఆ భూమిని క్లెయిమ్ చేస్తూ వస్తాడు. కోర్టు కెళ్తాడు. కోర్టు గుమ్మంలోనే రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. ఇదంతా ఆ శిలలో దాగున్న దైవం భూత కోలా మహిమ అనుకుంటారు. గిరిజనులు పూర్వం నుంచీ ప్రతీ యేటా భూత కోలా పండుగ జరుపుకుంటూ వుంటారు. దాన్ని కోలం అంటారు.

1990 లలో ప్రస్తుత కథా కాలానికొస్తే, ఆ గిరిజన గ్రామానికి భూస్వామి దేవేంద్ర (అచ్యుత్ కుమార్) అండగా వుంటాడు. ఇతను రాజు వంశస్థుడే. దొరగా గిరిజనుల సంక్షేమం చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అతడికి సహాయంగా శివ(రిషభ్ శెట్టి) వుంటాడు. ఇతను కంబళ పోటీల్లో (దున్నపోతు పందాలు) మొనగాడు. ఇతడికి కష్టపడి కుటుంబాన్ని ఈడ్చుకొచ్చే కమల (మానసీ సుధీర్) అనే తల్లి వుంటుంది. ఇతను నేస్తాలతో తిరుగుతూ, ఫారెస్ట్ గార్డు ట్రైనింగు పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడే ఉద్యోగంలో చేరిన గిరిజనురాలు లీల(సప్తమీ గౌడ) ని ప్రేమిస్తూ వుంటాడు.

ఈ ప్రాంతానికి ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చిన మురళీ(కిశోర్) కొన్ని చర్యలు చేపడతాడు. గ్రామస్థులు అడవిని పాడు చేస్తున్నారనీ, గ్రామానికి కంచె వేయడం ప్రారంభిస్తాడు. దీన్ని శివ అడ్డుకుంటాడు. వందల సంవత్సరాలుగా ఇక్కడి పౌరులమైన తాము అడవి అందించే ప్రతిదాన్నీ అనుభవించడానికి అర్హులని వాదిస్తాడు. ఈ వివాదం పెరిగి పెరిగి ఘర్షణకి దారి తీసి, ఫారెస్ట్ ఆఫీసర్ మీద హత్యాయత్నం కేసులో ఇరుక్కుని తప్పించుకుంటాడు శివ.

ఇప్పుడు శివ ఈ కేసులోంచి ఎలా బయటపడ్డాడు? మొత్తం గ్రామాన్నే కాజేసే ఇంకా పెద్ద కుట్రని ఎలా ఎదుర్కొన్నాడు? దైవం భూత కోలా పాత్రేమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులుగా తేలారు? చివరికి శివ ఏమయ్యాడు? ఈ ప్రశ్నల కి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

జానపద సాహిత్యాన్ని వాడుకుని ఈ కన్నడ ప్రాంతీయ కథని చెప్పారు. భూత కోల, దైవారాధన, నాగారాధన, కంబళ వంటి స్థానిక సంస్కృతులకి ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, స్మగ్లింగ్, అటవీ భూ ఆక్రమణల అంశాల్ని మేళవిస్తూ - దక్షిణ కన్నడలోని భూత కోలా, కంబళ, కోళ్ళ పందాలు సహా ఆచారాల్ని భాగం చేశారు. సామాజికంగానూ పరిస్థితిని ఏకరువు పెట్టారు. కుల సోపాన క్రమం కారణంగా చెప్పలేనంత అఘాయిత్యాలకి గురవుతున్న స్థానిక గిరిజనుల బాధలని ఆలోచనాత్మకంగా చిత్రించారు. 

2017 లో అభయ్ సింహా మత్స్యకారుల కుట్ర కథ పడ్డాయి తీసినప్పుడు షేక్స్ పియర్ నాటకం మాక్బెత్ ని ఆధారంగా చేసుకున్నాడు. ఇందులో కూడా దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోని కథ చెప్పడానికి యక్షగానాన్ని ఉపయోగించాడు. పురాతనం అధునాతనం విలువల్ని యక్షగానంతో తేటతెల్లం చేశాడు. భూత కోలా జానపద గీత ప్రయోగం కూడా చేశాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా కోవకి చెందింది. దీనికి జాతీయ అవార్డు లభించింది.

కాంతార దక్షిణ కన్నడ యాసలో వుంటుంది. మొత్తం శక్తివంతమైన నేపథ్యాన్ని యాక్షన్ జానర్ లో థ్రిల్లింగ్ గా చెప్పారు. యాక్షన్, థ్రిల్, విశ్వాసాలు, జానపద రసపోషణ - వీటి అందమైన సమ్మేళనం ఇటీవలి కాలంలో వెండితెరమీద చేసిన ఉత్తమ ప్రయత్నాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కథలనేవి స్థానిక జీవితంలోనే చాలా వున్నాయనీ, వెతికితే రత్నాలు దొరుకుతాయనీ విశేషమైన రీసెర్చి చేసినట్టు అన్పించే కళాత్మక ప్రయోగం. హిందీలో తుంబడ్ (2018) అనే హార్రర్ కూడా ఈ కోవకి చెందిన జానపద కథల సమ్మేళనంతో కళాత్మకంగా తెరకెక్కిన హిట్ సినిమానే.

నటనలు- సాంకేతికాలు

రాసి, తీసి, నటించిన రిషభ్ శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గిరిజన శివ పాత్రలో రిషభ్ శెట్టి అనే తను కన్పించనంతగా లీనమై పాత్ర పోషణ చేశాడు. ఆనాడు మృగయాలో గిరిజన పాత్ర నటించిన మిథున్ చక్రవర్తిలాగా. పాత్ర ఎక్కడా కుదురుగా వుండదు. మెరుపు వేగంతో పరిగెడుతూ వుంటుంది. ఇందులోనే నేస్తాలతో అల్లరి చేసుకోవడం, తల్లి చేతిలో దెబ్బలు తినడం, ప్రేమించిన అమ్మాయితో సరసాలాడ్డం, తాగడం, కోళ్ళు చేపలు వండుకుని తినడం, దొరకి బంటుగా నిరూపించుకోవడం, ఫారెస్ట్ ఆఫీసర్ తో సిగపట్లకి దిగడం అన్నీ జరిగి పోతూంటాయి.

ఎంత పోరాట పటిమ వున్నా వ్యవస్థ చేతిలో బలయ్యే సామాజిక వర్గమే తనది. ఈ సహజత్వం కోసం హీరోయిజాన్ని దూరం పెట్టి జైలు సీన్లు నటించాడు. గిరిజనుడే కని పిస్తాడు తప్ప తెలుగు స్టార్, తెలుగు హీరో సీజీతో జైలు గోడలు బద్దలు కొడుతూ కనిపించడు. ఇందుకేనేమో పానిండియా స్టార్ ప్రభాస్ రెండు సార్లు ఈ సినిమా చూసినట్టుంది. ఇక ఇరవై నిమిషాల క్లయిమాక్స్ అయితే అపూర్వం, అద్భుతం- ఇంకేమైనా చెప్పుకోవచ్చు. క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు వెళ్ళి వెళ్ళి పతాక స్థాయికి చేరేసరికి -తన పాత్రే పూర్తిగా మారిపోయి (metamorphosis- రూపాంతరం, రూపవిక్రియ) - ప్రేక్షకులు అవాక్కయ్యేలా క్లోజింగ్ ఇమేజితో బలమైన స్టాంపు గుద్ది వదిలాడు. పాత్ర ఇలా మారిపోతుందని ఎవ్వరూ వూహించరు! ఈ పాత్రలో రౌద్రంగా ఆకాశాన్నంటిన నటనా, నాట్యమూ రిషభ్ శెట్టిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టేశాయి! అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే లేచి చప్పట్లు కొడతారు.

హీరోయిన్ గా తెల్లటి వర్ణపు మెరిసిపోయే గ్లామర్ నటిని తీసుకోకుండా, గిరిజనురాలిలా కన్పించే స్థానిక నటి సప్తమీ గౌడని తీసుకోవడం మంచి పని. లేకపోతే బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ని తెచ్చుకుంటే 5 కోట్లు ఆమెకే పోయేవి. పైగా కొండపొలం లో రకుల్ ప్రీత్ సింగ్ లా విచిత్రంగా వుండేది. సప్తమీ గౌడ నటన చెప్పుకోదగ్గది. ఫారెస్ట్ గార్డుగా పై అధికారి చేతిలో అవమానాలు భరిస్తూ, చివరికి కోపం బద్ధలై ఆయుధానికి పనిచెప్పే దృశ్యం కథలోంచి పుడుతూ వచ్చిన సహజ భావోద్వేగమే.    దొరగా అచ్యుత్ కుమార్ మృదువైన నటన, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ కరకు ప్రవర్తన కథనానికి పాజిటివ్ నెగెటివ్ డైనమిక్స్ గా వుంటాయి. రిషభ్ తల్లిపాత్ర నటించిన మానసి సుధీర్ సంఘర్షణాత్మక పాత్ర, నటన కూడా గుర్తుండి పోతాయి. ఇక రిషభ్ నేస్తాలుగా నటించిన ఆర్టిస్టులు సహా మిగిలిన నటీనటులందరూ ఒక పకడ్బందీ గిరిజన వాతావరణ సృష్టికి తోడ్పడ్డారు.

సాంకేతికంగా చూస్తే ఇదొక వండరే. అటవీ ప్రాంతాన్నీ, ప్రకృతినీ, గిరిజన నివాసాల్నీ తెర మీద కళాత్మకంగా ఆవిష్కరించాడు కెమెరామాన్ అరవింద్ కశ్యప్. రాత్రి పూట దృశ్యాల లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే  -ముఖ్యంగా క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు - చిత్రకారుడు పెయింటింగ్ వేసినట్టున్నాయి. అజనీష్ లోకనాథ్ ట్రైబల్ బాణీలు, అడవిలో నిగూఢంగా వున్న శక్తి తాలూకు హార్రర్ బాణీలూ ఇవన్నీ నేటివిటీనిసంస్కృతినీ దాటిపోలేదు.  అడవిలో రిపీటయ్యే భూత కోలా ఆర్తనాదం కాంతార టైటిల్ ని ఎలుగెత్తి చాటుతూంటుంది. కాంతార అంటే మాయారణ్యం. 

చివరికేమిటి

ఇందులో కొన్ని బలహీనతలు లేకపోలేదు. లీలతో శివ పాత్ర సంబంధం ఫ్లాట్ గానే కాక అసహజంగా వుంది. గిరిజన కుటుంబం నుంచి చదువుకుని ఫారెస్ట్ గార్డుగా ఉద్యోగం సంపాదించుకునే స్థితికి ఎదిగిన  లీలని కాస్తయినా ఆదర్శంగా చూపాలనుకోలేదు దర్శకుడు. అల్లరిగా వుండే శివ ఆమె విషయానికొచ్చేసరికి గౌరవిస్తూ వుండుంటే, చదువుకున్న తన పట్ల అతడి అభిమానం చూసి ఆమె ప్రేమిస్తూ వుండుంటే ప్రేమ ట్రాకులో డైనమిక్స్ వుండేవి. ఇలాకాక శివ ఆమెని గిచ్చి, గిల్లీ, పక్కలోకి లాగే దృష్టితోనే వుండేసరికి పాత్ర చిత్రణ మట్టి కరిచింది. ఇలాటి బలహీనతలు మరికొన్నున్నాయి.

ఇంతా చేసి ఇది కథ కాదు, గాథ! గాథ ఇంత హిట్టయ్యిందా? గాథలతో తెలుగు సినిమాలు గోతిలో పడుతోంటే కన్నడలో హిట్టా? అదేమరి. ఇదెలా సాధ్యమైందో ఈవారం స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

—సికిందర్