రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, September 23, 2022

1216 : కాశ్మీర్ సినిమా!

 

     క తరానికి తరం సినిమా హాలు మొహం చూడకుండా పెరిగారు. సినిమా హాలు ఎలా వుంటుందో వాళ్ళకి తెలీదు, సినిమా హాల్లో సినిమాలు చూసి ఎరుగరు.  సినిమా హాల్లో సినిమా చూడాలంటే 300 కిలోమీటర్లు జమ్మూ వరకూ వెళ్ళాలి. గత 30 ఏళ్ళుగా కాశ్మీర్ లో ప్రేక్షకుల దుస్థితి ఇది. డీవీడీలు, పెన్ డ్రైవ్ లు వేసుకుని సినిమాలు చూడాల్సిన పరిస్థితి. ఆ మధ్య ప్రభుత్వం ఇంటర్నెట్ ని నిలిపివేయడంతో ఆన్ లైన్లో కూడా సినిమాలు చూడలేని దురవస్థ. ఇక దీని కంతటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం కాశ్మీర్లో రెండు మల్టీప్లెక్సులు ప్రారంభించింది. ఫుల్వామాలో ఒకటి, సోఫియాన్ లో ఒకటి. రెండూ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలే. ఉగ్రవాదులకీ, భద్రతా దళాలకీ మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే రణ రంగాలే.

        నేపథ్యంలో గత మంగళవారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ రెండు చోట్లలో రెండు ఐనాక్స్ మల్టీప్లెక్సులు ప్రారంభించారు. లాల్ సింగ్ చద్దా ప్రారంభోత్సవ చలన చిత్రంగా ప్రదర్శించారు. లాల్ సింగ్ చద్దా అనగానే ఇటీవల బాయ్ కాట్ గ్యాంగులు గుర్తుకొస్తారు. ఈ గ్యాంగులు లాల్ సింగ్ చద్దా ఆడకుండా చావుదెబ్బ కొట్టి వదిలారు. థియేటర్ల ముందు ఈ సినిమాకి రావద్దని మైకులు పట్టుకుని మరీ హెచ్చరించారు. అలాటిది కాశ్మీర్ లో సైలెంట్ గా వున్నారు. అక్కడ తమ ప్రభుత్వమే ఈ సినిమాని ప్రదర్శిస్తోంది కదా? ప్రభుత్వానికి కూడా కాశ్మీర్లో ప్రధానంగా వుండే ముస్లిం ప్రేక్షకుల్ని మల్టీప్లెక్సులకి ఆకర్షించాల్సిన అవసరముంది కదా? అలాంటప్పుడు అమీర్ ఖాన్ ని ఆలింగనం చేసుకుని లాల్ సింగ్ చద్దా కాకుండా, కాశ్మీర్ ఫైల్స్ ని ప్రదర్శిస్తుందా?

మరి ప్రేక్షకులు వచ్చారా? వస్తున్నారా? కరోనా మహమ్మారి తగ్గినా దేశంలో థియేటర్లకి రావడానికి ప్రేక్షకులు గుండెలరజేత బట్టుకుని సందుమొగలోంచి వెళ్ళాలా వద్దా అని ఎలా పొంచి పొంచి చూసే వాళ్ళో, అదే కాశ్మీర్ ప్రేక్షకుల పరిస్థితి. అక్కడిప్పుడు కరోనా లేదు, టెర్రరిస్టులున్నారు. ఈ టెర్రరిస్టులే 30 ఏళ్ళ క్రితం సినిమా హాళ్ళు మూయించేశారు. ఎప్పుడు తెరవడానికి ప్రయత్నించినా దాడులు చేశారు.

మూసివేతల చరిత్ర

        1989 ఆగస్ట్ లో, ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ నేతృత్వంలో అంతగా తెలియని మిలిటెంట్ గ్రూపు అల్లా టైగర్స్ కాశ్మీర్లో థియేటర్లు, బార్ లు మూసివేయాలని హెచ్చరికని జారీ చేసింది. లా షరకేయా వాలా గరాబేయా, ఇస్లామియా, ఇస్లామియా (ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు ఇస్లాం ఈజ్ ది బెస్ట్) అనే 1979 నాటి ఇరాన్ విప్లవ నినాదాన్ని మార్మోగించింది. సినిమాలు ఇస్లాం వ్యతిరేకమని హెచ్చరించింది. స్థానికులు ఖాతరు చేయకపోవడంతో కొన్ని సినిమా హాళ్ళు తగులబెట్టారు. దాంతో డిసెంబర్ కల్లా మిగిలిన సినిమా హాళ్ళు మూసేశారు. మొత్తం లోయలో రీగల్, ఫిర్దౌస్, షీరాజ్, నీలం, బ్రాడ్‌వే, ఖైబర్, సమద్, రెజీనా, షాకర్ మొదలైన 12 సినిమా హాళ్ళు వుండేవి. బాలీవుడ్ సినిమాలు జోరుగా ఆడేవి.

దశాబ్దం తర్వాత 1999లో, ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం- రీగల్, నీలం, బ్రాడ్‌వే థియేటర్లు మూడూ తిరిగి ప్రారంభిస్తే, రీగల్ థియేటర్లో బాంబు దాడికి పాల్పడ్డారు టెర్రరిస్టులు. ఒక ప్రేక్షకుడు మరణించి, 12 మంది గాయపడ్డారు. దీంతో మళ్ళీ మూత బడ్డాయి. ఆ తర్వాత చాలా సినిమా హాళ్ళు షాపింగ్ కాంప్లెక్సులుగా, నర్సింగ్‌హోమ్‌లుగా, పారామిలటరీ బలగాల శిబిరాలుగా మారిపోయాయి.

ఇక సైన్యమే పూనుకుని నాలుగు థియేటర్లని ప్రారంభిస్తూ, వాటికి మాజీ సైనికాధికారుల పేర్లు పెట్టింది. టెర్రరిస్టుల నుంచి తీవ్ర బెదిరింపుల కారణంగా వాటిని మూసేసి కాన్ఫరెన్సు హాళ్ళుగా ఉపయోగించుకో సాగారు. ఇలా స్వయంగా భద్రతా దళాలే అభయమిచ్చినా ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. అలాంటిది ఫుల్వామా, సోఫియాన్ లాంటి హై రిస్కు ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు ప్రారంభిస్తే ప్రేక్షకుల ప్రతిస్పందన అంతంత మాత్రంగానే వుంది. ఇక కుటుంబాలు కదిలివచ్చి సినిమాలు చూసే ప్రసక్తే లేదు.

కాశ్మీర్‌లో అధిక భద్రతా ఏర్పాట్లు వున్నప్పటికీ లక్ష్యిత దాడులు జరుగుతున్నప్పుడు, మల్టీప్లెక్సులు టెర్రరిస్టులకి  సంభావ్య లక్ష్యంగా మారవచ్చని భద్రతా అధికారులలోని ఒక వర్గం భయపడుతోంది. అయినప్పటికీ, అక్కడి సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఇది మంచి మార్పు అని కొనియాడుతున్నారు. సౌదీ అరేబియాలోనే 2017 లో తిరిగి థియేటర్లు తెరిస్తే కాశ్మీర్లో ఎందుకు మతమౌఢ్యమని ఉగ్రవాదుల్ని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదం క్షీణిస్తోందనీ,  రాబోయే నెలల్లో కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఎవరూ వుండరనీ అంటున్నారు.

రాజకీయ పక్షాలు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో వుంటాయి. వాళ్ళదో వెర్షన్. దురదృష్టవశాత్తూ అందరూ ఇక్కడ నటులుగా మారుతున్నారు, అంతా బావున్నట్టు నటిస్తున్నారు. పుల్వామా, సోపియాన్‌లలో ప్రారంభించినవి మల్టీ ప్లెక్సులా? అవి రెండు ఆడిటోరియాలలో  ప్రొజెక్టర్‌లు అమర్చిన సమావేశ గదులు. ఇవి ఒక జోకు! అని పిడిపి ప్రతినిధి కొట్టి పారేశాడు.

పూర్వవైభవం తిరిగొస్తుందా?

          కాశ్మీర్‌లో సినిమా చరిత్ర స్వాతంత్ర్య పూర్వమే ప్రారంభమైంది. 1932 లో కాశ్మీర్ టాకీస్ పేరుతో మొట్టమొదటి సినిమా హాలుని భాయ్ అనంత్ సింగ్ గౌరీ శ్రీనగర్లో స్థాపించారు. తర్వాత పల్లాడియం సినిమా గా పాశ్చాత్యీ కరణ చేశారు పేరుని. ఇది ఇప్పుడు శిథిలావస్థలో వుంది. ఒక వైపు సినిమా హాళ్ళు పెరుగుతూ, మరోవైపు సినిమా షూటింగులు జరుగుతూ కళావైభవంతో వుండేది కాశ్మీర్. కాశ్మీర్ లో షూటింగ్ చేయని, కనీసం ఒక పాట చిత్రీకరించని హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లేవు. ఈ వైభవం పునరుద్ధరణ కోసం తిరిగి కృషి కూడా ప్రారంభమైంది. ప్రదర్శనా రంగాన్నే కాకుండా నిర్మాణ రంగాన్ని కూడా తిరిగి గాడిలో పెట్టాలని.

కాశ్మీర్ - బాలీవుడ్‌ల మధ్య కొత్త అనుబంధాన్ని ఏర్పరిస్తే స్థానిక కళాకారులకి, ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున సహాయకారి అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పాటల షూటింగ్ కోసం దాదాపు 500 ప్రతిపాదనలు ఆమోదం కోసం వేచి వున్నాయి. వీటిలో 120 కి పైగా ప్రతిపాదనలని ఆమోదించారు. నిర్మాతలు ఒక నిర్దిష్ట శాతం స్థానిక కళాకారులని నియమించడం తప్పనిసరని ఒక షరతు పెడుతున్నారు. ఇదివరకు జరుగుతూ వుండిన చలనచిత్రోత్సవాలని కూడా పునరుద్ధరించాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం అనంత్‌నాగ్, శ్రీనగర్, బండిపోరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్త్వార్, రియాసీలలోనూ సినిమా హాళ్ళు త్వరలో ప్రారంభించనున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే సాధారణ పరిస్థితులు నెలకొనాలి. దీనికి ప్రభుత్వం మీద చాలా భారం వుంది. కాశ్మీర్ ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడం మామూలు విషయం కాదు. మార్చే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరిగితే కాశ్మీర్ కే కాదు, బాలీవుడ్ కే కాదు, దక్షిణ పానిండియా సినిమాలకీ రెవెన్యూ పరంగా కొత్త మార్గాలు తెరచుకుంటాయి. పోరు ఉగ్రవాదంతో ఆర్ధిక వాదంగా మారాలి.

—సికిందర్

Wednesday, September 21, 2022

1215 : చివరి షో!


 

    2023 -95ఆస్కార్ అవార్డుల ఎంట్రీకి ఎవరికీ తెలియని, ఇంకా విడుదల కాని  గుజరాతీ చలన చిత్రం  చెల్లో షో (చివరి షో) ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సంవత్సరం విడుదలై విజయవంతమైన అనేక భారీ, చిన్న, మధ్య తరహా సినిమాలతో పోటీ పడి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ఆశ్చర్యమే. రణబీర్ కపూర్-ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర’, ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్’, మాధవన్ దర్శకత్వం వహించిన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’, అమితాబ్ బచ్చన్ నటించిన ఝుండ్’, రాజ్‌కుమార్ రావ్-భూమీ పెడ్నేకర్ నటించిన బధాయి దో’, ఆయుష్మాన్ ఖురానా నటించిన అనేక్ లతో బాటు వివేక్ అగ్నిహోత్రి నిర్మించిన కాశ్మీర్ ఫైల్స్’, తమిళ థ్రిల్లర్ ఇరవిన్ నిల్’, (నాన్-లీనియర్ మలయాళ డ్రామా అరియిప్పు’, బెంగాలీ బయోగ్రాఫికల్ అపరాజితో’’- మొదలైన 10 సినిమాలనూ వెనక్కి నెట్టేసి నెగ్గింది.

        సినిమా పరిశ్రమకి  చెందిన 17 మంది విభిన్న స్వరాలతో కూడిన జ్యూరీ ఈ ఏకగ్రీవ ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా నిర్మాత టిఎస్ నాగభరణ (అధ్యక్షుడు), నిర్మాత సంగీత్ శివన్, సంగీత దర్శకుడు జతిన్ పండిత్, కాస్ట్యూమ్ డిజైనర్లు నిఖత్ -నీరూషా, నిర్మాత అంజన్ బోస్, సౌండ్ రికార్డిస్ట్ మందర్ కమలాపుర్కర్, ఎడిటర్ ప్రతీక్ గుప్తా తదితరులు వున్నారు.

చెల్లో షో ని ఎంపిక చేయడానికి కారణం, ఇది దేశంలో
వందలాది సింగిల్-స్క్రీన్ సినిమాహాళ్ళు కనుమరుగై పోతున్న సంక్షుభిత పరిస్థితిని కళ్లెదుట వుంచడమేనని జ్యూరీ భావించడం. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ గుజరాతీ ప్రాంతీయ సినిమాలో భవిన్ రాబరి, వికాస్ బాటా, రిచా మీనా, భవేష్ శ్రీమాలి, డిపెన్ రావల్, రాహుల్ కోలీ నటించారు.

2021 జూన్లో న్యూయార్క్ లో నిర్వహించిన 20 వ
రాబర్ట్ డెనిరో ట్రిబెకా చలన చిత్రోత్సవంలో దీన్ని ప్రదర్శించారు. అక్టోబర్ 2021లో స్పెయిన్ లో జరిగిన 66వ వల్లాడోలిడ్ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఇది దేశంలో ఇంకా విడుదల కాలేదు. ఓటీటీల్లో కూడా లేదు. అక్టోబర్ 14న ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో థియేటర్లలో విడుదలవుతుంది.

ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా ఆస్కార్‌
అవార్డు గెలుచుకోలేదు. ఈ రెండు దశాబ్దాల్లో ఉత్తమ అంతర్జాతీయ మూవీ కేటగిరీలో ప్రవేశం సంపాదించిన  భారతీయ సినిమా 2001లో ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో  అమీర్ ఖాన్-నటించిన లగాన్ ఒక్కటే. దీనికి ముందు మదర్ ఇండియా (1958), ‘సలామ్ బాంబే (1989) ఎంట్రీ సంపాదించుకున్నాయి.

ఇంతకీ
చెల్లో షో లో కథ ఏమిటి? కథ ఏదైనా, ఇది 1988 లో విడుదలైన సుప్రసిద్ధ క్లాసిక్, ఆస్కార్ తో బాటు ఇంకా అనేక అవార్డులు సాధించుకున్న ఇటలీ మూవీ సినిమా పారడిసో కి అనుసరణలా వుంది. ఈ ఇటాలియన్ మూవీలో  సినిమాలంటే పడిచచ్చే చిన్న కుర్రాడు ఇంట్లో కొట్టినా తిట్టినా బడి ఎగ్గొట్టి, సినిమా హాల్లో దూరుతూంటాడు. ఫ్రీగా సినిమాలు చూసేందుకు ప్రొజెక్షన్ అతనితో స్నేహం చేసి, ప్రొజెక్షన్ రూమ్ లొంచే సినిమాలు చూస్తాడు. కాల క్రమంలో పెద్ద సినిమా దర్శకుడై, చిన్నప్పటి తన అభిమాన థియేటర్ ని చూసుకోవడానికి వస్తే, ఆ థియేటర్ ని షాపింగ్ కాంప్లెక్స్ కోసం కూల్చేస్తూంటారు.

ఈ సినిమా భవిష్య వాణి చెప్పింది. చూపించినట్టుగానే తర్వాతి కాలంలో టీవీ విప్లవం వల్ల థియేటర్లు కూల్చివేసి
, లాభసాటి ఆదాయ వనరులుగా షాపింగ్ కాంప్లెక్సులు కట్టుకోవడం మొదలైంది. మన దగ్గర కూడా 2000 తర్వాత టీవీ దెబ్బకి చాలా థియేటర్లు షాపింగ్ కాంప్లెక్సులుగా, కళ్యాణ మండపాలుగా మారిపోయిన దృశ్యాలు చూశాం. ఇదొక దశ.

దీని తర్వాత ఇప్పుడు మల్టీప్లెక్సుల దెబ్బకి మిగిలిన సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళు కూడా మూతబడ్డం మొదలెట్టాయి. ఈ దశనే
చెల్లో షో చిత్రిస్తోంది...ఇందులో
సమయ్ (భవిన్ రాబారి) అనే తొమ్మిదేళ్ళ కుర్రాడు సినిమాల పిచ్చితో చదువుకోకుండా థియేటర్ని పట్టుకు వేలాడుతూంటాడు. రోజూ సినిమా చూసేందుకు డబ్బుల్లేక ప్రొజెక్షనిస్ట్ ఫజల్ (భావేష్ శ్రీమాలి) తో ​​స్నేహం చేస్తాడు. స్కూలుకని తల్లి (రిచా మీనా) కట్టిచ్చే టిఫిను తెచ్చి ఫజల్ కిచ్చి మస్కా కొడుతూంటాడు. గుజరాతీ వంటకాలు తినమరిగిన ఫజల్, సమయ్ ని  ప్రొజెక్షన్ బూత్ లో కూర్చోబెట్టుకుని సినిమాలు చూపిస్తూంటాడు.

ఇలా సమయ్ సినిమా ప్రదర్శనలో సాంకేతికాలు తెలుసుకుని సొంతంగా థియేటర్ ప్రారంభించుకోవాలని నేస్తాలని కూడగడతాడు. ఎవరికీ తెలియని చోట శివారు పాడుబడ్డ భవనంలో పని ప్రారంభిస్తారు. పారేసిన పరికరాలూ అవీ సేకరించి ప్రొజెక్టరు సృష్టిస్తారు. అందులో రీళ్ళు వేసి నడిపించడానికి రైల్వే స్టేషన్ మీద పడతారు. రైల్వే స్టేషన్లో పంపిణీ దారులకి వచ్చే సినిమా రీళ్ళు దొంగిలించి షోలు వేసుకుని ఎంజాయ్ చేస్తూంటారు.

ఇలా ఆనందిస్తూ ఆనందిస్తూ వుండగా రీళ్ళు రావడం మానేస్తాయి. ఫిలిమ్ రీళ్ళు మాయమై డిజిటల్ సినిమాలు వచ్చేస్తున్నాయన్న మాట!
  ఈ పరిణామం సమయ్ తో బాటు ఫజల్ జీవితాన్నీ ప్రశ్నార్ధకం చేస్తుంది. గుండెలు పగిలి విలపిస్తారు. మన ఉన్నత కులస్థులకి సినిమాలు అప్రదిష్టరా అని తండ్రి మందలించినా సమయ్ గుండె తట్టుకోదు...

అంతరించిపోతున్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళ పట్ల ప్రజలకుండే అనుబంధాల్నీ
, జ్ఞాపకాలనీ, తీపి గుర్తుల్నీ హృద్యంగా కళ్ళ ముందుంచుతుందీ సినిమా! ఇలాటి సినిమాలు తెలుగులో ఎప్పుడొస్తాయో ఆస్కార్స్ కి వెళ్ళి తెలుగు ప్రతిభని ప్రపంచానికి చాటాడానికి...

—సికిందర్

 

Tuesday, September 20, 2022

1214 : రివ్యూ!

రచన - దర్శకత్వం : ధృవ
తారాగణం :
ధృవ, ప్రీతీ సుందర్, భావనా మణికంన్, లావణ్య, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ తదితరులు

సంగీతం: అనంత నారాయణ, ఛాయాగ్రహణం : విజయ్ భాస్కర్ సద్దాల

నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృధ్వీ
విడుదల :
సెప్టెంబర్ 16, 2022 (ఆహా ఓటీటీ)

***

    టీవల ఓదెల రైల్వే స్టేషన్ అనే సీరియల్ కిల్లర్ సినిమా విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. ఇలాటిదే తెలంగాణా గిరిజన ప్రాంతపు నేపథ్యంలో కిరోసిన్ సీరియల్ కిల్లర్ సినిమా ఇంకొకటి. పేర్లు తీసేస్తే రెండూ ఒకలాగే వుంటాయి. అవే పాత్రలు, ప్రాంతాలు, హత్యలు, దర్యాప్తులు, కథా కథనాలు. సీరియల్ కిల్లర్ సినిమాలు భారతీ రాజా దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ఎర్ర గులాబీలు స్థాయిని అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీటిలో ప్రధానంగా వుండాల్సింది సీరియల్ హంతకుడి మానసిక ప్రవృత్తి. అమెరికాలో 46 మదిని చంపిన బర్డ్ జేక్, 21 మందిని చంపిన బైలీబ్రదర్స్ వంటి  సీరియల్ కిల్లర్స్ ని చూస్తే వెన్నులో  వణుకు పుడుతుంది. వాళ్ళ సైకో ఎనాలిసిస్ చేసినప్పుడు భయంకర సత్యాలు తెలుస్తాయి. సీరియల్ కిల్లర్ సినిమాలు చూసినప్పుడు మన చుట్టూ మనకి తెలియకుండా సీరియల్ కిల్లర్ వుండొచ్చన్న హెచ్చరికని చేసేలా వుంటాయి. ఇలా ఒక ప్రయోజనం లేకుండా సీరియల్ కిల్లర్  సినిమాల్ని తీసి లాభం లేదు.

        దొక తెలంగాణా గిరిజన గూడెం. అక్కడ అడవిలో గౌరీ (లావణ్య) అనే యువతి హత్య జరుగుతుంది. ఎవరో చంపి శవాన్ని దహనం చేశారు. పోలీసులు రంగంలోకి దిగుతారు. అక్కడి సర్పంచ్ నాయక్ (మధుసూదన రావు), ఎమ్మెల్యే వీరబాబు (బ్రహ్మాజీ) ఒత్తిడికి లొంగి ఒక అమాయకుడ్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు పోలీసులు. పోలీసు ఉన్నతాధికారి ఈ గూడెం చుట్టు పక్కల ఇది మూడో హత్య అనీ చెప్పి, వెంటనే ఈ హత్యల మిస్టరీ తేల్చేందుకు ఏసీపీ వైభవ్ (ధృవ) ని అక్కడికి పంపిస్తాడు.

ఏసీపీ వైభవ్ ఇంటరాగేషన్ స్పెషలిస్టు. అతను గౌరీ హత్య కేసు చేపట్టి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అరెస్ట్ చేసిన అమాయకుడ్ని విడుదల చేసి ఎస్సైని సస్పెండ్ చేస్తాడు. అనుమానితుల్ని ప్రశ్నిస్తాడు. కొందర్ని పట్టుకుని కొడతాడు. ఇంతలో ఆ ప్రాంతాని కొచ్చిన సిటీ అమ్మాయి హత్య జరుగుతుంది. ఈమె శవాన్ని కూడా కిరోసిన్ పోసి కాల్చేశాడు హంతకుడు.  ఎవరీ సీరియల్ కిల్లర్? ఏసీపీ వైభవ్ ఎలా పట్టుకూన్నాడు? పట్టుకునే లోగా ఇంకిన్ని హత్యలు జరిగాయా? ఇదీ మిగతా కథ.

ఇందులో ఏసీపీ పాత్ర దర్శకుడే పోషించాడు. మిగిలిన పాత్రల్లో అందరూ కొత్త వాళ్ళే. అటవీ ప్రాంతపు లొకేషన్స్ ఎక్కువున్నాయి. గిరిజన గూడెంలో బయటి నుంచి చిన్నపాటి శిథిలమైన పోలీస్ స్టేషన్. లోపలికి వెళ్తే బయటి రూపంతో సంబంధం లేకుండా విశాలమైన అధునాతన హైటెక్ పోలీస్ స్టేషన్. బయటి లొకేషన్ వేరే, లోపలి లొకేషన్ వేరే. వీటిని కలిపి చీట్ చేసినప్పుడు సహజత్వాన్ని పట్టించుకోలేదు. అలాగే పోలీసు వాహనాలు. ఒక వాహనం వైజాగ్ నెంబర్ ప్లేట్ తో వుంటుంది. ఇంకో సీన్లో తెలంగాణా స్టేట్ పోలీస్ అని తగిలించుకుని వస్తుంది. మరింకో సీన్లో హైదరాబాద్  పోలీస్...

ఇంటరాగేషన్ స్పెషలిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆసక్తి రేపే ఏసీపీ పాత్ర ఇంటరాగేషనే చేయడు. కనీసం ఈ ఇంటరాగేషన్ పాయింటునైనా ప్రధానంగా చేసి, పోలీస్ ఇంటరాగేషన్లో తెలియని కోణాలు వెల్లడి చేసి వుంటే కథా పరంగా ఈ సినిమా ఎంతో నిలబడేది. దీని బదులు డైలాగులతోనే కథనం నడుస్తూ వుంటుంది. ఈ డైలాగుల ద్వారా నైనా కథలో మలుపులు, టెన్షన్, సస్పెన్స్, థ్రిల్ వంటివి పుట్టవు. యాక్షన్ సీన్స్ తో పరిగెట్టాల్సిన కథని డైలాగులతోనైనా వేడి పుట్టించకుండా రెంటికీ చెడ్డ రేవడి చేశారు.  
     
ఈ హత్యలు గూడెంలో భయ వాతావరణం కూడా సృష్టించవు. ఆడవాళ్ళ హత్యలు జరుగుతూంటే డోంట్ కేర్ అన్నట్టు ఆడవాళ్ళు వుంటారు. మరిన్ని హత్యలు జరగకుండా ఏసీపీ చర్యలు కూడా తీసుకోడు. ఈ బలహీన పాత్రలు, నటనలు, కథా కథనాలు, దర్శకత్వం కిరోసిన్ కోరుకుంటున్నట్టు వుంటాయి.  ఆ కిరోసిన్ డబ్బా ప్రేక్షకుల చేతిలో.

చివరికి హంతకుడ్ని పట్టుకుని చంపేస్తాడు ఏసీపీ. చంపేసి వాడి మీద కేసు ఎలా ప్రూవ్ చేస్తాడో తెలీదు. ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన కథ. ప్రొఫెషనల్ స్కిల్స్ తో టెర్రిఫిక్ గా తీయాల్సిన రూరల్ థ్రిల్లర్ సినిమా! అనుభవరాహిత్యంతో దీని ప్రాణం తీశాడు దర్శకుడు.

—సికిందర్

 

Monday, September 19, 2022

1213 : రివ్యూ!

రచన - దర్శకత్వం : సుధీర్ వర్మ
తారాగణం : నివేదా థామస్, రెజీనా కసాండ్రా, భానుచందర్, పృథ్వీ, కబీర్ దుహన్ సింగ్ తదితరులు
కథ : మిడ్‌నైట్ రన్నర్స్ ఆధారంగా, స్క్రీన్ ప్లే -మాటలు : అక్షయ్ పి,  సంగీతం : మైకీ మెక్‌క్లియరీ, ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్
నిర్మాతలు : డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్
విడుదల సెప్టెంబర్ 16,  2022
***

        వారం కాస్త భిన్నంగా ఇద్దరు పాపులర్ హీరోయిన్ల సినిమా విడుదలైంది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా జతకట్టి యాక్షన్ కామెడీతో అలరించేందుకు బాక్సాఫీసు ముందుకొచ్చారు. అయితే బాక్సాఫీసు బద్దలు కొట్టారా, లేక ప్రేక్షకుల తలబద్దలు కొట్టారా అన్నది పాయింటు. ఈ పాయింటుకి బలి కాకుండా దీని దర్శకుడు సుధీర్ వర్మ సగంలోనే వదిలేసి సేఫ్ అయిపోయాడు. అనామకంగా ఇంకెవరో పూర్తి చేశారు. అంటే సినిమా జాతకం ఇక్కడే తెలిసి పోతోంది. అయినా బోలెడు డబ్బులుపోసి హక్కులు కొన్న కొరియన్ మూవీ కాబట్టి, రీమేకు ఎలా రూపొందిందన్న ఆసక్తి ఒకటి వుంటుంది. ఓసారి లుక్కేద్దాం...

కథ

శాలిని (నివేదా థామస్), దామినీ (రెజీనా కసాండ్రా) పోలీస్ అకాడెమీలో ట్రైనింగ్ కి చేరతారు. అపరిచితులైన ఇద్దరూ కీచులాడుకుంటూ వుంటారు. అకాడెమీ డైరెక్టర్ (భానుచందర్) వాళ్ళ క్రమశిక్షణా రాహిత్యానికి శిక్షిస్తూ వుంటాడు. ఎలాగో ఇద్దరూ కీచులాటలు మాని ఫ్రెండ్స్ అవుతారు. నైట్ పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. తిరిగి వస్తున్నప్పుడు ఓ గ్యాంగ్ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో వెంబడిస్తారు. గ్యాంగ్ దొరక్కపోవడంతో పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. పోలీసులు స్పందించరు. దీంతో తామే రంగంలోకి దిగుతారు కిడ్నాపైన అమ్మాయిని కాపాడేందుకు...

ఎవరా అమ్మాయి? ఎందుకు కిడ్నాప్ చేశారు? గ్యాంగ్ లీడర్ (కబీర్ దుహన్ సింగ్) నడుపుతున్న ఒక స్కామ్ తో కిడ్నాప్ కేం సంబంధం? దీన్నెలా ఛేదించారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

కొరియన్ యాక్షన్ కామెడీ మిడ్ నైట్ రన్నర్స్ హక్కులు కొని రీమేక్ చేశారు. కొరియన్ మూవీ ఇద్దరు హీరోలతో వుంటే, తెలుగులో హీరోయిన్ల కథగా మార్చారు. ఈ కథకి హీరోయిన్లు సారధ్యం వహించడమే సబబు. ఎందుకంటే ఈ కథ స్త్రీ అండ అక్రమ రవాణాకి సంబంధించింది గనుక. స్త్రీ సమస్యకి స్త్రీల పోరాటంగా ఇద్దరు హీరోయిన్లతో యాక్షన్ కామెడీ మంచి ఐడియానే. తెలుగులో దీనికి తగిన నేటివిటీని జోడించి సమస్య తీవ్రత పట్ల అప్రమత్తం చేసి వుంటే దీనికో కథా ప్రయోజనమంటూ చేకూరేది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా సహాయక పునరుత్పత్తి సాంకేతికతా (నియంత్రణ) చట్టం 2021 అమల్లోకి తెచ్చింది. దీంతో బాటు అద్దె గర్భం (నియంత్రణ) చట్టం 2021 కూడా తెచ్చింది. దీని విభాగం హైదరాబాద్ లో కూడా వుంది.  సరోగసీ (అద్దె గర్భం) క్లినిక్‌ల నియంత్రణ, పర్యవేక్షణతో బాటు, దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ విభాగం లక్ష్యం.  దేశవ్యాప్తంగా సమస్య తీవ్ర స్థాయిలో వుంది. దీనిమీద ఒక హిందీ సినిమా కూడా గత సంవత్సరం విడుదలైంది.

హిందీ మూవీ మిమీ ని ‘మాలా ఆయ్ వాచ్చీ (నేను తల్లినవుతా) అనే మరాఠీకి  రీమేక్ గా తీశారు. ఇందులో సరోగసీ (అద్దె గర్భం) కథ మాతృత్వపు భావోద్వేగం చుట్టూ వుంటుంది. ఇది నిజంగా జరిగిన కేసు ఆధారంగా తీశారు. గుజరాత్ఉత్తరప్రదేశ్రాజస్థాన్‌లలో సామూహిక  సరోగేట్‌ కేంద్రాలది పెద్ద అక్రమ వ్యాపారం. ఈ సరోగసీ కేంద్రాల్లో విదేశీయులు తమ బిడ్డని కనడానికి తగిన యువతికి డబ్బు చెల్లించి అద్దె గర్భం తీసుకోవడం, పుట్టిన బిడ్డని తీసుకుని వెళ్ళిపోవడం ఒక దందాగా సాగుతోంది. డబ్బు కోసం పెళ్ళి కాని యువతులు కూడా పాల్పడుతున్న ఈ సీరియస్ సమస్యని సినిమాలో హాస్యాన్ని జోడించి చెప్పి సక్సెస్ అయ్యారు.

కానీ శాకినీ ఢాకినీ కథలోనే చెప్పిన అండాల కోసం అమ్మాయిల్ని అపహరించే పాయింటుని  అస్సలు పట్టించుకోకుండా, కేవలం ఒక రొటీన్ కిడ్నాప్ కథగా మార్చేసి చేతులు దులుపుకున్నారు. పాత్రల్ని హీరోయిన్ పాత్రలుగా మార్చినప్పుడు, అమ్మాయిలుగా వాళ్ళు ఆడవాళ్ళకి ఎదురవుతున్న కొత్త ప్రమాదాన్ని ఫీలవ్వని అర్ధం లేని పాత్రలుగా చూపించారు. హీరోయిన్ పాత్రలుగా మార్చినప్పుడు కథకి ఇంకో బలం -అసలు బలం కూడా చేకూరే అవకాశం వుంది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరు కిడ్నాప్ కి గురై వుంటే, అండాల స్మగ్లింగ్ కథ భావోద్వేగాలతో ఇంకో లెవెల్లో వుండేది.

కొరియన్ మూవీలో పాయింటు వుంది, ఆ పాయింటు మనకెలా అన్వయమవుతుందో ఆలోచించకుండా రీమేక్ కోసం రీమేక్ అన్నట్టు చుట్టేశారు.  అయినా ఏం ఫర్వాలేదు, వుందిగా మార్చి పైన సెప్టెంబర్ అన్నట్టు థియేటర్స్ లో జీరో అయినా, ఓటీటీలో పెద్ద మొత్తంలో చెక్కు జేబులో వేసుకోవచ్చు. ఓటీటీలు వున్నంత కాలం ఎంత అడ్డగోలుగానైనా  సినిమాలు తీసుకోవచ్చు.

నటనలు- సాంకేతికాలు

పోలీసు పాత్రల్లో నటీమణులిద్దరూ ఫైట్స్ చేయడానికి బాగా ట్రైనింగు పొందారు. ఫైట్స్ బాగా చేశారు. అయితే ఇది యాక్షన్ కామెడీ. కామెడీ మాత్రం చేయలేకపోయారు. కొరియన్ మూవీలో నామమాత్రపు కథని నిలబెట్టింది ఇద్దరు హీరోలు చేసే కామెడీనే. కడుపుబ్బ నవ్వించి నవ్వించి చంపారని ఫారిన్ రివ్యూలు చూస్తే తెలుస్తుంది. సినిమా సబ్ టైటిల్స్ తో యూట్యూబ్ లో ఫ్రీగా వుంది. 20 లలో వున్న యంగ్ హీరోలతో ఇది బడ్డీ/బ్రోమాన్స్ జానర్ మూవీ. ఈ జానర్ మర్యాదల్ని తెలుసుకోకుండా నివేదా, రెజీనాలని మూస హీరోయిన్లుగా సరిపెట్టేశారు. వీళ్ళిద్దరూ కథలో సమస్యని ఫీల్ కాకపోవడంతో భావోద్వేగాలు కూడా కుదరక గ్లామర్ ప్రదర్శన మీద ఆధారపడి నటించేశారు.

 లాజిక్, కామన్ సెన్స్ అన్నవి కూడా లేకుండా ఎలాపడితే అలా సినిమా చుట్టేశారు.  నివేదా, రెజీనా ఓ అమ్మాయి కిడ్నాప్ గురించి అర్ధరాత్రి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే, పోలీసులు పట్టించుకోకపోవడాన్ని కొరియన్ మూవీలో అర్ధాన్ని తెలుసుకోకుండా యధాతధంగా దింపేశారు. కొరియన్ మూవీలో కిడ్నాప్ జరిగేది చైనీయులు ఎక్కువుండే పేటలో. ఆ పేటలో అడుగు పెట్టాలంటే పోలీసుల ధైర్యం చాలదు. ఇదీ కొరియన్ మూవీలో కేసు తిరస్కరించడానికి కారణం. దీని మీద చైనాలో పెద్ద యెత్తున నిరసనలు చెలరేగి మూవీ బ్యాన్ చేసే దాకా పోయింది. దక్షిణ కొరియాలో చైనీయుల్ని అలా చూపించినందుకు. విలన్ కూడా చైనీస్ పాత్రే.

హైదరాబాద్ లో పోలీసులు కంప్లెయింట్ తీసుకోక పోవడానికి తగిన కారణం చూపకుండా, కొరియన్ మూవీ సీన్ని అర్ధం జేసుకోకుండా దింపేశారు. ఇంకోటేమిటంటే పోలీస్ అకాడెమీ డైరెక్టర్ కూడా విన్పించుకోడు!

ఇక సాంకేతికాలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాణ  విలువలు దేని మీదా తగిన శ్రద్ధ పెట్టలేదు. కరోనా కాలంలో అంతరాయాల మధ్య పూర్తి చేయాల్సి వచ్చినందుకు కావొచ్చు మేకింగ్ క్వాలిటీ కూడా బలైంది.

—సికిందర్