రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 14, 2022

1131 : రివ్యూ!


 

దర్శకత్వం: విమల్‌ కృష్ణ
తారాగణం : : సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, ఫిష్ వెంకట్ తదితరులు
రచన: విమల్‌ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం : సాయిప్రకాష్
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ
విడుదల :  12 ఫిబ్రవరి 2022 
***

          సిద్ధు జొన్నలగడ్డ  2009 నుంచీ సినిమాల్లో నటిస్తున్నా, 2016 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ తో వెలుగులో కొచ్చాడు. 2020 లో కృష్ణ అండ్ హిజ్ లీలా తో మరోసారి ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఇప్పుడు డీజే టిల్లు తో యూత్ కి బాగా దగ్గరయ్యాడు. 2018 లో మహెబూబా లో హీరోయిన్ గా పరిచయమైన నేహాశెట్టి, తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటించి ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ పక్కన డీజే టిల్లు లో కన్పిస్తోంది. దీంతో విమల్ కృష్ణ కొత్త దర్శకుడుగా పరిచయమయ్యాడు. పెద్ద బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణం చేపట్టింది. సితార వారి ఈ ప్రతిష్టాత్మక సినిమా ఎలావుందో ఇక చూద్దాం...

కథ
బాలగంగాధర తిలక్ అలియాస్ టిల్లు (జొన్నల‌గ‌డ్డ‌) హైదరాబాద్ లో డీజే (డిస్క్ జాకీ) గా వుంటాడు. తల్లిదండ్రులతో వుంటాడు. డీజే గెటప్ లో అతిగానే కాస్ట్యూమ్స్ వేసుకుని తిరుగుతాడు. హైదరాబాదీ తెలుగు మాట్లాడతాడు. కేర్లెస్ గా బిహీవ్ చేస్తాడు. టార్గెట్ ఆడియెన్స్ కి అతను మిక్స్ చేసే సాంగ్స్ కలెక్షన్స్ కి పెళ్ళిళ్ళలో బాగా గిరాకీ వుంటుంది. అతడికో కల వుంటుంది. ఎలాగైనా షార్ట్ కట్స్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలని.

        ఇలావుండగా  రాధిక (నేహాశెట్టి) అనే ఓ సింగర్ ని చూసి వెంటపడతాడు. ఆమెకో బాయ్ ఫ్రెండ్ వుంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతూంటాడు. ఇది చూసి ఆమె టిల్లు తో తిరగడం మొదలెడుతుంది టిట్ ఫర్ టాట్ గా. ఒకరోజు బాయ్ ఫ్రెండ్ ఆమెతో గొడవ పడి,  ప్రమాదవశాత్తూ ఆమె చేతిలో చచ్చి పోతాడు. ఈ హత్యలో టిల్లు కూడా ఇరుక్కునే పరిస్థితి వుండడంతో ఆమెకి సాయపడి శవాన్ని మాయం చేస్తాడు. ఇది కనిపెట్టి ఓ బ్లాక్ మెయిలర్ (నర్రా శ్రీనివాస్), పోలీసులూ (బ్రహ్మాజీ, ఫిష్ వెంకట్) టిల్లూ రాధికల వెంటపడతారు. ఇక వీళ్ళని తప్పించుకోవడానికి టిల్లు ఏం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

హాలీవుడ్ లో చిక్ ఫ్లిక్ లేదా చిక్ లిట్ అనే కొత్త జానర్ సినిమాలొస్తూంటాయి. జెన్ జెడ్ (జెడ్ జనరేషన్) లైటర్ వీన్ ఫన్ రోమాన్సులు, రోమాంటిక్ థిల్లర్స్ వీటిలో వుంటాయి. ఇవి వాలంటైన్స్ డే కి విడుదలవుతూంటాయి. ఇవి ఆదునిక జెన్ జెడ్ హీరోయిన్ పాత్రలతో అమ్మాయిల్ని ఎక్కువ ఆకర్షించే జానర్ మర్యాదలతో వుంటాయి. యూత్ సినిమాల పేరుతో మనం తీస్తున్న సినిమాలకి యువ ఫ్రేక్షకుల్లో యువకులే తప్ప యువతులుండరు. పేరుకే యూత్ సినిమాలు, చూసేదీ మగ యువజాతే.

        స్టయిలిష్ గా తీసిన డీజే టిల్లు (హీరోకి పెట్టిన బాలగంగాధర తిలక్ పేరులో, తిలక్ కి టిల్లు అని నిక్ నేమ్ పెట్టారు. హిందీలో టిల్లు అంటే పొట్టోడు అని అర్ధం) లో హీరోయిన్ క్యారక్టర్ కూడా ప్రధానమైనదే. సినిమా ఆట్మాస్ఫియర్ పరంగా చిక్ లిట్ కి సరిపోయే మేకింగ్ తో వుంది. ఇందులో హీరోకే క్యారక్టర్ తప్ప, హీరోయిన్ క్యారక్టర్ తో బాటు కథ లేకుండా పోయింది. ఫలితంగా ఇంటర్వెల్ కి చాలించుకున్న పొట్టి సినిమా అయింది. కేవలం హీరో క్యారక్టర్ ప్రదర్శించే మేల్ ఇగోయిజపు టక్కుటమారాలే, అది పుట్టించే నవ్వులే సినిమా అన్నట్టుగా తయారయ్యింది. ఈ టక్కుటమారాలూ నవ్వులతో కూడిన మేల్ ఇగోయిజం కూడా ఫస్టాఫ్ వరకే. ఇంత ఏకఛత్రాధిపత్య మేల్ ఇగోయిజమూ  సెకండాఫ్ ని కాపాడలేకపోయింది. సెకండాఫ్ కథ ఎటు పోయిందో, హీరో క్యారక్టర్ ఏం చేస్తోందో అర్ధం పర్ధం లేకుండా పోయింది. ప్రేక్షకులు అల్పసంతోషులు. ఇదే చాలన్నట్టు బ్రహ్మరధం పడుతున్నట్టు వార్తలు. ఆల్ ది బెస్ట్.

నటనలు- సాంకేతికాలు  

జొన్నలగడ్డ కోసం తీసిన సినిమా ఇది. కాబట్టి తన ఫంకీ క్యారక్టర్ వరకూ తీసుకుని- చూసుకుని- నటించాడు. స్వాంకీ గెటప్, హైదరాబాదీ తెలుగు, హౌలే గాడి ప్రవర్తన, లింగో, తెలివి తేటలు, డైలాగ్ కామెడీ... వీటిని సాధనాలుగా పెట్టుకుని ప్రేక్షకుల్ని తెగ నవ్వించాడు. అటు ఇస్మార్ట్ శంకర్ క్యారక్టర్ని తీసుకుని, ఇటు జాతి రత్నాలు కామెడీ చేసినట్టు. సినిమాలో ఏదెలా వున్నా కొత్తగా నవ్విస్తే చాలన్న ప్రేక్షకుల నాడీ పట్టుకుని దాంతో ఆడుకున్నాడు. అయితే జాతిరత్నాలు కామెడీకి నేటివిటీ వుంది.

        హీరోయిన్ నేహాశెట్టి క్యారక్టర్ జొన్నలగడ్డకి పోటీ రాకుండా చూసుకున్నారు. లేకపోతే చిక్ లిట్ కాకపోయినా కనీసం రోమాంటిక్ కామెడీ జానర్ కైనా న్యాయం చేస్తూ, నువ్వెంతంటే నువ్వెంతనే కౌంటరిచ్చే, పోటీనిచ్చే  సరైన క్యారక్టరైజేషన్ తో యాక్టివ్ పాత్రగా వుండేది. రోమాంటిక్ డ్రామా జానర్లో లాగా శాడ్ గా పాసివ్ గా వుండిపోయింది. ఇంతకంటే నేహా గురించి చెప్పుకోవడానికి లేదు.

        ఇక మిగిలిన క్యారక్టర్స్ లో ప్రిన్స్ తప్ప, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, జడ్జిగా ప్రగతి కామెడీ పాత్రలేశారు. తమన్ నేపథ్య సంగీతం స్టయిలిష్ మూవీకి తగ్గట్టు లేదు, రొటీన్ కామెడీ సినిమాల్లో వినిపించే ఇన్ స్టృమెంట్సే వాడేశారు చిడతలు వాయిస్తున్నట్టు. మళ్ళీ పాటలకి వేరు. ఇక కెమెరా వర్క్, డీఐ అతి రంగులతో లౌడ్ గా వున్నాయి. కొత్త దర్శకుడి దర్శకత్వం లేని కథకి ఎలా వుంటుందో అలావుంది. జొన్నలగడ్డ స్వయంగా రాసుకున్న డైలాగులు హైలైట్ అని టాక్.

చివరికేమిటి
డీజేగా వున్న టిల్లు సింగర్ రాధికని చూసి ప్రేమలో పడ్డం, ఆమెతో హత్యలో ఇరుక్కోవడం, బ్లాక్ మెయిలర్ ని, పోలీసుల్నీ ఎదుర్కోవడం ఫస్టాఫ్. ఇంతవరకూ సిట్యుయేషన్స్, సిట్ కామ్, జొన్నలగడ్డ వన్ మాన్ షోగా బాగానే వున్నాయి. లాజిక్, అర్ధం పర్ధం ఏమీ చూడకూడదు. జొన్నలగడ్డ గిమ్మిక్స్ కి నవ్వుతూ వుండాలి. హీరోయిన్ అచేతనంగా వుండిపోతుంది- ఓకే- కానీ సెకండాఫ్ ఓపెన్ చేయగానే హీరోయిన్ తడాఖాతో కథ నడుపుకుని వుంటే కథ వుండేది. చిక్ లిట్ లో, రోమాంటిక్ కామెడీల్లో,  హీరో హీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులుగా వుంటారు. ఇక్కడ ప్రత్యర్ధి అయిన రాధిక క్యారక్టర్ని ఆమెకో హిడెన్ ఎజెండా కల్పించి యాక్టివేట్ చేసి వుంటే- హీరోకి కష్టాలూ తిప్పలూ పెరిగిపోయి క్యారక్టర్ నిలబడేది, కథ వుండేది. యువప్రేక్షకుల్లో భాగమైన యువతులు కూడా తరలివచ్చి హారతులు పట్టేవాళ్లు.

        కానీ సెకండాఫ్ ఓపెన్ చేస్తే కథేమీ లేదు సినిమాలో. అంటే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది స్ట్రక్చర్, స్క్రీన్ ప్లే, సినిమా, ఏదనుకుంటే అది. సెకండాఫ్ కథ ఎలా నడపాలో తెలియక- జొన్నలగడ్డ జ్ఞాపక శక్తిని కోల్పోయే  డ్రామా, కామెడీ, కోర్టు విచారణ డ్రామా, కామెడీ అనే రెండు అర్ధంపర్ధం లేని బ్లాకులు పెట్టుకుని సెకండాఫ్ ని నింపేశారు.  జొన్నలగడ్డ క్యారక్టర్ నడవడానికి బలవంతంగా కల్పించిన సిల్లీ సీన్లు ఇవి. ఆ మధ్య సినిమాల్లో సెకండాఫ్ లో బ్రహ్మానందం బకరా కామెడీ తప్పనిసరి టెంప్లెట్ అయినట్టు- ఆ టెంప్లెట్లు, పాత ఫార్ములా ట్రోప్స్ పెట్టుకుని- ఒక సోకాల్డ్ స్టయిలిష్ యూత్ మూవీ తీసేశారు. ఇక ముగింపయితే చెప్పకర్లేదు. చిక్ లిట్ సినిమాలు  ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వాలంటైన్స్ డే కి  విడుదలవుతూంటాయి. 'డీజే టిల్లు' కాకతాళీయంగానే వాలంటైన్స్ డే కి రెండ్రోజుల ముందు విడుదలైంది- బాయ్స్ కి తప్ప గర్ల్స్ కి చెందని   యూత్ సినిమాగా. 
        కానీ మూవీ హిట్, అంతే. దటీజ్ ది పాయింట్.

-సికిందర్

(అనివార్య కారణాల వల్ల రివ్యూలు
ఆలస్యమవుతున్నాయి
. వాట్సాపులు,
కాల్స్ చేయకుండా సహకరించగలరు)

Sunday, February 13, 2022

1130 : రివ్యూ!

 

రచన- దర్శకత్వం : అభిమన్యు
తారాగణం : ప్రియమణి
, శాంతీ రావు, శరణ్యా ప్రదీప్, సమీరా, నెట్టూరి నిరజ, ప్రదీప్ రుద్ర,  జాన్ విజయ్, కిషోర్ కుమార్ తదితరులు
సంగీతం :
 జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్, ఛాయాగ్రహణం: వై. దీపక్
బ్యానర్ : ఎస్ వి సి సి డిజిటల్
సమర్పణ
: భరత్ కమ్మ
నిర్మాతలు:
 బాపినీడు, సుధీర్
విడుదల : ఫిబ్రవరి
11, 2022 (ఆహా)

***

        సినిమాలకు దూరమైన ప్రియమణి డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద బిజీ అవుతోంది. ఫ్యామిలీ మాన్’, హిజ్ స్టోరీ వంటి రెండు విజయవంతమైన వెబ్ సిరీస్ తర్వాత, ఆహా ఓటీటీ లో భామా కలాపం వెబ్ మూవీ నటించింది. వెబ్ స్టార్ గా వెలగడంతో ఇప్పుడు ఆరు హిందీ, తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. తెలుగులో విరాటపర్వం ఇంకా విడుదల కావాల్సి వుంది. భామా కలాపం వెబ్ మూవీకి ఆమెని తీసుకోవడం ఒక మంచి మార్కెట్ యాస్పెక్ట్. కొత్త దర్శకుడు, నిర్మాతలూ ప్రియమణితో తలపెట్టిన ఈ వెబ్ మూవీ క్రైమ్ జానర్ కి సంబంధించింది.

        వెబ్ ప్రపంచంలో ప్రేమలు, పెళ్ళిళ్ళ రోత కంటెంట్ కంటే క్రైమ్ కెక్కువ గిరాకీ వుంది. కొన్ని సినిమాలు సినిమాల పేరిట థియేటర్లో రిలీజవుతున్నాయి. తీరా చూస్తే అవి వెబ్ కి సరిపోయే వెబ్ మూవీస్ లెవెల్లో వుంటున్నాయి. ఒకప్పుడు కొన్ని సినిమాలు తీరా చూస్తే షార్ట్ మూవీస్ కి సరిపోయే కంటెంట్ తో వుంటూ థియేటర్లో ఫ్లాపయ్యేవి. ఇప్పుడు వెబ్ కంటెంట్ అని తెలుసుకోక కొన్ని థియేటర్ సినిమాలు తీసి పడేసి దెబ్బ తినేస్తున్నారు. అదే థియేటర్ సినిమా తీసి వెబ్ లో రిలీజ్ చేస్తే? ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు భామా కలాపం విషయంలో జరిగింది. దీన్ని వెబ్ మూవీగా అనుకుని తీశారు గానీ, నిజానికిది థియేటర్లో రిలీజ్ చేయాల్సిన మూవీ. ఇదెలా వుందో ఒకసారి చూద్దాం...

కథ

        అనుపమా మోహన్ (ప్రియమణి) ఓ స్కూలు కెళ్ళే కొడుకుతో, ఆఫీసు కెళ్ళే భర్త మోహన్ (ప్రదీప్ రుద్ర) తో అపార్ట్ మెంట్ లో వుంటుంది. యూట్యూబ్ లో వంటల ఛానెల్ నిర్వహిస్తూ వుంటుంది. అదే సమయంలో మిసెస్ పీపింగ్ టామ్ గా తలనెప్పులు తెస్తూంటుంది. ఎంతసేపూ ఇతరుల ఫ్లాట్స్ లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం, ఆ ముచ్చట్లేసుకోవడం. ఏ ఇంట్లో గొడవ జరిగినా తలదూర్చి చూడడం, ఇతరులకి చెప్పడం. ఇలా చేయడం అదో మానసిక తృప్తి ఆమెకి. దీంతో ఆమెకి అపార్ట్ మెంట్ డిటెక్టివ్ అనే పేరొస్తుంది. ఇక  ఈమె చేష్టల్ని భరించలేక మీటింగ్ పెడతారు ఈమె సంగతి తేల్చుకోవాలని అపార్ట్ మెంట్ వాసులు. అప్పుడు ఓ డానియేల్ బాబు (కిషోర్ కుమార్) అనే పాస్టర్ ప్రవచనాలు చెప్పి ఆమెని కాపాడేస్తాడు.

        అయినా ఆగదు అనుపమ. అటు ఫిరోజ్ అనే పౌల్ట్రీ వ్యాపారి ఫ్లాట్లో రాత్రిపూట భార్యాభర్తలు గొడవ పడడాన్ని గమనించి క్యూరియాసిటీ పెంచుకుంటుంది. తెల్లారి పని మనిషి శిల్పా (శరణ్యా ప్రదీప్) ని పంపించి ఏం జరిగిందో తెలుసుకు రమ్మంటుంది. ఇంట్లో ఎవరూ లేరనీ, భార్య సైరా ( సమీరా) వూరెళ్ళి పోయిందనీ వచ్చి చెప్తుంది శిల్పా. అయినా ఏదో జరగరానిది జరిగిందనీ, అది తెలుసుకోవాలనీ, అనుపమ ఆ ఫ్లాట్ లోకి వెళ్ళగానే అక్కడున్న మణి అనే  క్రిమినల్ ఎటాక్ చేస్తాడు. కాపాడుకునే ప్రయత్నంలో వాణ్ని పొడిచేస్తుంది అనుపమ. వాడక్కడే చస్తాడు.

        ఇది కాదు అసలు విషయం- ఆ ఫ్లాట్లోనే  ఫిరోజ్ చచ్చి పడుంటాడు. పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఫిరోజ్ ని చంపిందెవరు? ఎందుకు చంపారు? భార్య ఏమైంది? మరి అనుపమ మణిని చంపిన సంగతి పోలీసులకి తెలియదా? ఒక ఎగ్ కోసం ఫిరోజ్ ని చంపారని తెలుస్తుంది, ఏమిటా ఎగ్ ? దాని కథేమిటి? అసలీ మిస్టరీ అంతా ఏమిటి? నేరకపోయి ఇరుక్కున్న అనుపమ ఎలా బయటపడింది ఇందులోంచీ? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

'    అంధాధున్ లో వేటగాడి బారినుంచి ఓ కుందేలు తప్పించుకుంటూ ఎగిరి వచ్చి పడడంతో కారు యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కథే మారిపోతుంది. కళ్ళు లేని హీరో నోరు లేని కుందేలు వల్ల ప్రాణాలు కాపాడుకుంటాడు. ఇలాగే భామా కలాపం లో గొర్రెప్పిల్ల కారుకి అడ్డు రావడంతో యాక్సిడెంట్ జరిగి కథ ఇంకో మలుపు తిరుగుతుంది. ఇది ఓపెనింగ్ సీను. గొర్రెప్పిల్లే ఎందుకు? కాన్సెప్ట్ తో సంబంధముంది గనుక.  కలకత్తా మ్యూజియం నుంచి ఒక ఆధ్యాత్మిక మహిమ గల ఎగ్ కొట్టేసి వస్తున్న క్రిమినల్స్, గొర్రెప్పిల్ల అడ్డొచ్చిన ఆ  ప్రమాదంలో 200 కోట్ల విలువైన ఆ  ఎగ్  ని పోగొట్టుకుంటారు. ఆ ఎగ్ ఎగిరివెళ్ళి ఫిరోజ్ పౌల్ట్రీ ట్రక్కులో  పడుతుంది.

        గత నవంబర్లో హాలీవుడ్ నుంచి వచ్చిన రెడ్ నోటీస్ అనే కామిక్ థ్రిల్లర్ లోక్లియోపాత్రా ప్రాచీన ఎగ్ కోసం వేట వుంటుంది. క్లియోపాత్ర ప్రాచీన ఎగ్ అనేది సినిమా కోసం కల్పించిన కథ. చారిత్రక స్పర్శతో ఈ కల్పవల్ల కామిక్ థ్రిల్లర్ కో విషయ గాంభీర్యం ఏర్పడింది. ఇలాగే భామా కలాపం లో ఏసు ప్రభువు పునర్జన్మకి సంకేతంగా వున్న ఎగ్ అని చెప్తూ, ఆధ్యాత్మిక స్పర్శతో కల్పిత కథ చేశారు. ఈ కల్పితాన్ని అసలు దేవుడంటే అర్ధమేమిటో చెప్పడానికి కథలో వాడుకున్నారు. మత ప్రచారకుల మూఢనమ్మకాలకి ప్రజలెలా బలి అవుతారో, దాంతో ఎలాటి దారుణాలు జరుగుతాయో చెప్పే ఈ కాన్సెప్ట్ లో, ఇతరుల విషయాల్లో తలదూర్చి పీతూరీలు చెప్పే అలవాటుతో కూడా ఎలాటి ప్రమాదంలో పడవచ్చో హెచ్చరిక చేశారు. ఈ రెండు ట్రాక్స్ నీ ఏకత్రాటిపై నడిపిస్తూ అర్ధవంతమైన కథ చేశాడు కొత్త దర్శకుడు.

     అయితే ఆ ఎగ్ ఏసు పునర్జన్మకి, అంటే ఏసు రాకకి సంకేతంగా వున్నప్పుడు, కలకత్తా మ్యూజియంలో అనామకంగా ఎందుకుంటుంది? రోమ్ లో పోప్ ఆధీనంలో వుండాలి కదా?

      కాన్సెప్ట్ ఒకటైతే ఇంకేదో కథ చేసే అసమర్ధని ఈ మధ్యే చాలా సినిమాల్లో చూస్తున్నాం- నిన్నటి మహాన్ సహా. కానీ భామా కలాపం లాంటి ఒక కామిక్ సస్పెన్స్ లో కాన్సెప్ట్ కి చేసిన న్యాయం గుడ్ రైటింగ్ కి- గుడ్ మేకింగ్ కీ అద్దం పడుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, కామిక్ థ్రిల్లర్ల  పేరిట వస్తున్న జానర్ మర్యాదలు కూడా తెలియని అమెచ్యూరిష్  సినిమాల మధ్య ఈ  భామా కలాపం ఒక డబుల్ మర్డర్ మిస్టరీ జోన్లో- అదీ కుటుంబ సమేత వీక్షణకి అన్ని అర్హతలున్న సింపుల్ వ్యూయింగ్ మెటీరీయల్- లైట్ రీడింగ్ మెటీరీయల్ చందమామ కథల్లాగా. సినిమాల్లో గుడ్ రైటింగ్ కోసం, గుడ్ మేకింగ్ కోసమూ మొహం వాచివున్న అభిరుచిగల ప్రేక్షకులకి ఈ అనుపమ రుచికర వంటకం ఓ సమతులాహారం అనొచ్చు.  

నటనలు - సాంకేతికాలు

    ఈ మధ్య మహానటి ఫేమ్ హై గ్రేడ్ కీర్తీ సురేష్ నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చూసి, ఏం లో- గ్రేడ్ సినిమాలు సెలెక్టు చేసుకుంటోందిరాబాబూఅని తలబాదుకున్నాం. రెండు వారాల క్రితం సరికొత్తగా తళతళ మెరుస్తూ,  గుడ్ లక్ సఖీ తో  ఆమె అఖండ అపకీర్తి ఆకాశాన్నంటి రెపరెప లాడింది. సఖీమ తల్లికి ఇంతకంటే సాధించాల్సిన ఆశయం లేదు. ఇలాంటప్పుడు ప్రియమణి వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఒక రియలిస్టిక్ జానర్లో హోమ్లీ ఎంటర్ టైనర్ కి కథానాయికై తనలోని నటిని పిండి ఆరేసింది. అసలు అంత సీనియర్ నటి అని కూడా అన్పించకుండా, స్లిమ్ బాడీ షేప్ తో, మంచి ముఖ వర్ఛస్సుతో, హావభావ ప్రకటనతో, క్యారక్టర్ కి యూత్ అప్పీల్ని కిక్కొట్టి టాప్ గేర్ లో నడిపించింది. థియేటర్లో రిలీజై వుంటే మాస్ అప్పీల్ ని కూడా టపాసుల్లా పేల్చేది బాక్సాఫీసు ఆవరణలో.

          సమస్యలో పడ్డాక చివరంటా పాత్రకి అనేక అనుభవాలు. వాటిలో కొన్ని వొళ్ళు జలదరింప జేసేవి. సమస్య లోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఎదురు తిరిగి సమస్యని ఇంకా పెంచేయడం అనే డ్రైవ్ పాత్రని, పాత్రతో బాటు తననీ బిజీగా వుంచుతాయి. కథ తన చేతి నుంచి దాటిపోదు. క్షణం క్షణం థ్రిల్ చేస్తూ, ఒక పక్క అమాయకత్వం, ఇంకో పక్క భయం, తెగింపూ అనే పాత్రోచిత నటనతో సినిమాని భుజానేసుకుని నడిపిస్తుంది. తప్పకుండా ఆమెకి ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆఫర్లు మరిన్ని పెరుగుతాయి.

        అయితే కుకింగ్ ఛానెల్ యూట్యూబర్ గా ఆమెని పూర్తి స్థాయిలో చూపించలేదు. ఆమె ఏం వంటలు చేస్తోందో, యూట్యూబ్ లో ఎందరు చూస్తున్నారో ఏదీ రిజిస్టర్ చేయలేదు. ఇంట్లో ఏం తింటున్నామో వండుకుని, ఆ ఫోటోలు 80 కోట్ల మంది ప్రభుత్వ రేషన్ మీద బ్రతుకుతున్న పేదలున్న దేశంలో, ఫేస్ బుక్ లో టాం టాం చేసుకుంటున్న ఈ రోజుల్లో- కేవలం అనుపమ ఘుమఘుమ అని చెప్పేసి సరిపెట్టకుండా, విజువల్ గా ఈ విషయంలో ఆమె పాపులారిటీ కూడా చూపించి వుంటే, ఈ పాపులారిటీని పణంగా పెట్టి ఆమె చంచల స్వభావంతో దుస్సాహసాలు చేయడం కథకి మరింత బలాన్నీ, భావోద్వేగాల్నీ చేకూర్చేది.

        ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) పల్లవి (శాంతీ రావు), పని మనిషి శిల్ప(రణ్యా ప్రదీప్), ఫిరోజ్ భార్య సైరా వంటి కీలక స్త్రీ పాత్రలుండడం, ఇవి సహజత్వంతో  కూడుకుని వుండడం గమనించొచ్చు. ఇందులో ఐఓ పల్లవి 7 నెలల గర్భవతిగానే, ఆయాస పడుతూ దగ్గరుండి కేసు దర్యాప్తు చేయడం ఆలోచింపజేస్తుంది. ఈమెని నిండు గర్భవతిగా చూపించాల్సిన అవసరమేముంది? ఇది చివర్లో పే ఆఫ్ అయ్యే కాన్సెప్ట్ తో ముడిపడున్న అంశం. మూఢనమ్మకం ఎలాటి పనులు చేయిస్తుందో చూపించడానికి గర్భంలో పిండం అవసరం. ఒక వైపు ఎగ్ అనే మూఢ నమ్మకం, ఇంకో వైపు పిండం అనే మానవత్వం.

        పని మనిషి శిల్పా పాత్రలో శరణ్యా ప్రదీప్ టాలెంట్ కూడా చెప్పుకోదగ్గది. నేరంలో అనుపమతో బాటు తనూ ఇరుక్కుని, అనుపమతో బాటే చేయకూడని పనులు చేస్తూ వుండాల్సిన పరిస్థితిని చాలా సహజంగా నటించింది, అక్కడక్కడా డార్క్ హ్యూమర్ ని జోడిస్తూ.  సైరా పాత్ర నటించిన సమీరా- అల్లాని వదిలేసి ఏసూ అంటూ  మూఢనమ్మకాల పాస్టర్ ని నమ్మి తెచ్చుకునే పరిస్థితిని జాలి పుట్టేలా నటించింది. గుర్తుండి పోయే ఈ నాల్గు కీలక స్త్రీ పాత్రలు ఈ వెబ్ మూవీకి బిగ్ ఎస్సెట్స్ అనాలి. తెలుగు సినిమాల్లో స్త్రీ పాత్రలు ఎడాపెడా కలుపు మొక్కలవుతున్న వేళ.

    ఇక విలన్ నాయర్ (జాన్ విజయ్) వ్యవహారం చూస్తే, ఓ వంద తమిళ మలయాళ కన్నడ సినిమాల నటుడు జాన్ విజయ్ కామిక్ విలనీ పరేష్ రావల్ స్టయిల్లో వుంటుంది సైకో తనంతో. వేష భాషలతో ఎంటర్ టైన్ చేస్తాడు. అలాగే కేరాఫ్ కంచరపాలెం నటుడు కిషోర్ కుమార్ పొలిమేర - కన్నింగ్ పాస్టర్ పాత్ర స్వభావాన్ని అద్భుత ఎక్స్ ప్రెషన్స్ తో ప్రకటించాడు డైలాగ్ డెలివరీ సహా. ఏ నటీ, ఏ నటుడూ కమర్షియల్ నటనలకి పాల్పడకుండా నిజ జీవితపు వ్యక్తుల్లా అన్పించడం ఇందులో గమనించాల్సిన ముఖ్యాంశం.

        సాంకేతికంగా- దృశ్యాల చిత్రీకరణలో ఒక సెటిల్డ్ వాతావరణం కన్పిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ నిదానంగా, నిద్రాణంగా వున్నట్టు- దృశ్య వాతావరణం మోడరన్ హైదరాబాద్ ని ప్రతిబింబించదు. అపార్ట్ మెంట్లో జరిగినవి రెండు మర్డర్స్ అయితే, ఈ పరిస్థితి తీవ్రతకి కాంట్రాస్ట్ గా, నిదానంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, తీరుబడిగా పాత్రల యాక్టివిటీస్ వగైరా సినిమా చూస్తున్నట్టు వుండదు- మనపక్కనే ఇలాటి దృశ్యాలు ఎలా కన్పిస్తాయో అలా వుంటాయి. మర్డర్స్ జరిగిన సీన్ల తర్వాత, దానికి తగ్గట్టు కథ పరుగెత్తక, మూవీ స్లో అవడం బోరు కొట్టేస్తుంది. తర్వాతర్వాత ఈ స్లో పేసింగ్ సహజత్వం కోసమని అర్ధమయ్యాక లీనమైపోతాం.

        చాలా పాత అపార్ట్ మెంట్ భవనం, దాని చుట్టూ పాత ఇళ్ళూ రోడ్లూ, వీటికి తగ్గ కళా దర్శకత్వం- కథ మూడ్ ని స్థాపిస్తాయి. మూడ్ ని ఎలివేట్ చేసే వై. దీపక్ ఛాయాగ్రహణమొక బలం. కానీ జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్ ల సంగీతం అంత మార్కేమీ వేయదు. ఒక బ్యాక్ గ్రౌండ్ పాట వుంది. సినిమా నిడివి రెండు గంటలా 10 నిమిషాలుంది పాటల్లేకుండా డైలాగ్ వెర్షన్ తో. ఈ నిడివి ఈ కథకి ఎక్కువే. ఓ ఇరవై నిమిషాలు తగ్గించేస్తే  హాయిగా వుండేది.

        అయితే ఇది ఎడిటర్ విప్లవ్ చేతిలో లేని విషయం బహుశా. ఏది డిలీట్ చేయాలన్నా సీన్స్ లో మైన్యూట్ డిటైల్స్ అడ్డుపడతాయి. ఏది డిలీట్ చేసినా ఇంకో డిటైల్ కి లీడ్ దెబ్బతింటుంది. రాసేప్పుడే ఇన్ని మైన్యూట్ డిటైల్స్, క్లూస్ లేకుండా జాగ్రత్త పడాలి. ఇల్లాజికల్ గా వున్న ప్రియమణి సూట్ కేసు లాక్కొచ్చే సీను ఎత్తేసి, డైరెక్టుగా ఆమె తనింట్లో సూట్ కేసుని పని మనిషికి చూపించి- ఎలా తెచ్చిందో రెండు డైలాగుల్లో చెప్పేస్తే సరిపోయేది, థ్రిల్ చేసేది. ఇలా చేసి తర్వాత  ముందు కథలో దీని కనెక్టింగ్ సీన్లు కూడా ఎత్తేయొచ్చు. రాసేప్పుడే చేసుకోవాల్సిన ఎడిటింగ్ ఇది. పోతే డైలాగులు ఎక్కడా సినిమాటిక్ గా వుండకపోవడం రిలీఫ్.

చివరికేమిటి

అవసరమైన పాత్రల్ని, వాటి స్వభావాల్ని, కార్యకలాపాల్నీ, కాన్సెప్ట్ నీ  సెటప్ చేయడానికి 30 నిమిషాల పైగా సమయం తీసుకున్నాడు. 40 వ నిమిషంలో మర్డర్స్ జరుగుతాయి. మరిన్ని పాత్రలు కలుస్తాయి. ఇక్కడ్నించీ మొదలయ్యే మిడిల్లో - డెడ్ బాడీతో అనుపమ సంఘర్షణ ఒక విజయం - ఒక అపజయంగా వుంటున్నాక, తనకి తెలీని ఎగ్ వ్యవహారం కూడా మెడకి చుట్టుకుంటుంది విలన్ నాయర్ ఎంట్రీతో. నాయర్ ఎగ్ కావాలంటాడు. ఒక పక్క శవం, ఇంకో పక్క ఈ నాయర్, భర్త, పోలీసులూ- ఈ చదరంగంలో పావులు కదపలేక, ఏ పావు కదిపినా దొరికిపోయే ప్రమాదంలో పడుతూ సాగే పాత్ర అనుపమ. ఇక్కడ రెండు ప్రధాన ప్రశ్నలు వెంటాడుతూంటాయి- చేసిన హత్యలోంచి ఎలా బయటపడుతుంది? భర్తకి తెలిస్తే ఏమవుతుంది?

        మొదటి దానికి ఒక హేపీ మూమెంట్ వచ్చేసి టెన్షనంతా రిలీజ్ చేసేస్తుంది... చచ్చిన శవం బతికే వుండడంతో. ఈ సీను అత్యంత ఇంటలిజెంట్ రైటింగ్. కానీ వాడు మళ్ళీ చావడంతో మొదటికొస్తుంది. ఈ ప్రశ్నకి అంతిమ జవాబు- ఇన్స్ పెక్టర్ రూపంలో వస్తుంది. క్లాసిక్ మూవీ డెత్ విష్ లో చార్లెస్ బ్రాన్సన్ ని, పోలీసు అధికారి కేసులోంచి బయటపడేసే లాంటి ముగింపుతో.

        మరి భర్త సంగతి? వుంటాడా, విడాకులిచ్చి పోతాడా? ఇక్కడ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ హెల్ప్ చేస్తుంది. ఇదేమిటో స్క్రీన్ మీద చూడాల్సిందే.

        ఈ మూవీకున్న ఇంకో బలమేమిటంటే, ప్రతీ ఐదూ పదినిమిషాల కొక సర్ప్రైజ్ చేయడం. చూస్తే కథ ఎగ్ కోసం ఒక హత్య, దీంతోనే ముడిపడి ఇంకో హత్య, ఎగ్ ని చేజిక్కించుకోవడానికి ఒక విలన్ విలనీ- చివరి కేముంది- ఎగ్ కోసం అసలు ఫిరోజ్ ని చంపిన విలన్ గా ఈ విలన దొరికిపోయి- ఎగ్ ప్రభుత్వ పరమవుంతుందన్న కథ లాగే వుంటుంది. ఇలాగే గనుక వుండుంటే విషయం లేని ఎన్నో థ్రిల్లర్స్ లాగా ఇదీ ఫ్లాట్ గా సాగి కుప్ప కూలేది.

        ఇలా కాకుండా సెకండాఫ్ లో ఇంకో విలన్ బయటపడ్డంతో - మొత్తం కథ కొత్త మలుపు తిరిగిపోయింది. ఇలా దాగున్న అసలు విలన్నీ పైకి తీయడం ఎండ్ సస్పెన్స్  కథల సినిమాల్లో సాధారణంగా జరిగేదే, అవి ఫ్లాపయ్యేవే. అసలు విలన్ వున్నాడని చెప్పకుండా, సరైన సమయంలో సర్ప్రైజింగ్ గా బట్టబయలు చేయడమనేది - ఎండ్ సస్పెన్స్ గండాన్ని దాట వేసే టెక్నిక్.

అయితే లాజికల్ గా (కామన్ సెన్సు పరం గా) అనేక లిబర్టీలు తీసుకున్నాడు కొత్త దర్శకుడు. అనుపమ రెండు సార్లు మారు తాళం చెవులు తయారు చేసుకోవడం, అసలు సూట్ కేసుని తన ఫ్లాట్ కి తీసుకు రావడంలోని సామంజస్యం మొదలైనవి. అసలు పోలీసులు ఫిరోజ్ ఫ్లాట్లో వేలిముద్రలు సేకరిస్తే, అక్కడ అనుపమ చంపిన క్రిమినల్  వేలి ముద్రలు సహా అనుపమా వేలిముద్రలూ దొరికిపోయి చిటికెలో కేసు సాల్వ్ అయిపోయేది. ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన కథ అన్నాక- ప్రతీ చోటా కామన్ సెన్సు తో కూడిన కథనం ప్రొఫెషనల్ గా వుండాల్సిందే. లేదంటే పోలీసు పాత్రలు నవ్వుల పాలవుతాయి. అసలు ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తే సస్పెండ్ అవుతారు కూడా.

        భామా కలాపం కాన్సెప్ట్ కూడా సడెన్ గా క్లయిమాక్స్ లో ఎగదన్నుకొస్తుంది- అసలు విలన్ లాగే. అంతవరకూ నడుస్తున్న కథ ఎగ్ కోసమే తప్ప ఇలాటి కాన్సెప్ట్ కోసమని  వూహించలేం. చివర్లో కథని సమప్ చేస్తూ దేవుడంటే అర్ధం గురించి, మూఢ నమ్మకాల గురించీ చెప్పిన మాటలు ఆలోచనాత్మకంగా వుంటూ, మూవీకో హూందాతనాన్ని తెస్తాయి - కొత్త దర్శకుడికి, నిర్మాతలకీ, ఆహా కూ కాస్త గౌరవ మర్యాదలు సహా. జాతీయ మీడియాలో మంచి రేటింగ్స్ పడిన ఈ వెబ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. మహిళా చిత్రాలు రావడం లేదంటారు, ఇది పోషకాలతో వండిన మహిళా చిత్రమే.   

—సికిందర్

 


Friday, February 11, 2022

1129 : రివ్యూ!


 రచన- దర్శకత్వం : రమేష్ వర్మ

తారాగణం - రవితేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్, అనసూయ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్
బ్యానర్ - హవీష్ ప్రొడక్షన్
నిర్మాత - సత్యనారాయణ కోనేరు
విడుదల : ఫిబ్రవరి11, 2022
***

          డిస్కోరాజా’, క్రాక్ ల తర్వాత మాస్ మహా రాజా రవితేజ చాన్నాళ్లు వూరిస్తూ ఖిలాడీ గా విచ్చేశాడు. తన మార్కు కామెడీతో, యాక్షన్ తో ఫ్యాన్స్ ని వూరడించే ప్రయత్నం చేశాడు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లతో కలిసి మాస్- మ్యూజికల్ హంగామా సృష్టించేందుకు విజృంభించాడు. దీనికి దర్శకుడు రమేష్ వర్మ. 2011 లో రవితేజతో వీర తీసిన వర్మ పదేళ్ళ తర్వాత రవితేజతో ఈ రెండో మూవీ తీశాడు. వీర ఫ్లాపయ్యింది. మరిప్పుడు ఖిలాడీ ఎలా వుంది? ఈసారి ఇద్దరూ కలిసి ఏమైనా విజయం సాధించారా, లేక విజయానికి వెయ్యి మైళ్ళ దూరంలో వుండిపోయారా? తెలుసుకుందాం...

కథ

    మోహన్ గాంధీ (రవితేజ) కుటుంబాన్ని చంపుకున్న కేసులో శిక్షపడి జైల్లో వుంటాడు. పూజ (మీనాక్షీ చౌదరి) సైకాలజీ కోర్సు చేస్తూంటుంది. అందులో భాగంగా జైల్లో మోహన్ గాంధీని ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పుడు మోహన్ గాంధీ తన కథ చెప్పుకొస్తాడు. అతను రాజశేఖర్ (రావు రమేష్) ఛైర్మన్ గా నడిపే ఆడిటింగ్ కంపెనీకి జనరల్ మేనేజర్ గా వుంటాడు. చిత్ర (డింపుల్ హయతి) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. చిత్రకి తల్లి చంద్రకళ (అనసూయా భరద్వాజ్), తండ్రి పుట్టపర్తీ (మురళీ శర్మ) వుంటారు. ఇలా వుండగా, రాష్ట్రంలో సీఎం ని దింపేసి తన తండ్రి హోమ్ మంత్రి గురు సింగం (ముఖేష్ రిషి) ని సీఎం చేయాలన్న కుట్రలో భాగంగా ఇటలీ నుంచి పదివేల కోట్లు పంపిస్తాడు గురు సింగం కొడుకు బాలసింగం (నికితిన్ ధీర్). ఆ డబ్బు మిస్ అవుతుంది. ఈ వ్యవహారంలో సీబీఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ (అర్జున్) ఆడిటర్ రాజశేఖర్ ని పట్టుకుంటే, గురుసింగం రాజశేఖర్ ని చంపించేసి, మోహన్ గాందీని పట్టుకుని, డబ్బెక్కడుందో చెప్పాలంటూ బెదిరిస్తాడు. చెప్పక పోవడంతో మోహన్ గాంధీ కుటుంబాన్ని చంపించేసి  ఆ నేరం మోహన్ గాంధీ మీదేసి  జైలుకి పంపించేస్తాడు.

        ఇలా తన కథ చెప్పుకొచ్చిన మోహన్ గాంధీని బెయిల్ మీద విడిపిస్తుంది పూజా. అప్పుడు తెలుస్తుంది ఈ మోహన్ గాంధీ డూప్ చేశాడనీ, ఇతను వేరే నేరాల్లో అరెస్టయిన ఇంటర్నేషనల్ ఖిలాడీ అనీ తెలుసుకుని షాక్ తింటుంది. ఈ ఖిలాడీ ఎవరు, ఇతడి కథ ఏమిటి, జైల్లోంచి బయటపడి ఆ పదివేల కోట్ల కోసం ఏం ఎత్తులేశాడన్నది మిగతా కథ.  

ఎలావుంది కథ

    ఈ కథ చెప్తూంటేనే సిల్లీ కథ అని తెలిసిపోతుంది. రమేష్ వర్మ ఈ కథ చెప్పడం, రవితేజ వెంటనే ఓకే చేయడం ఎలా జరిగిందో అర్ధం గాదు. ఈ కథ మీద నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీగా పెట్టుబడి పెట్టడమేమిటో అసలే అర్ధం గాదు- ఇది 1.5 రేటింగ్ కి మించని కథ. కట్టుకథ!

        కట్టుకథ ఎందుకంటే, ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ  రవితేజ చెప్పే మోహన్ గాందీ కథంతా ఒట్టిదే. నిజంగా జరగలేదు, కట్టు కథ చెప్పాడు. కట్టు కథ చెప్పాడని ఇంటర్వెల్లో తెలుస్తుంది. కాబట్టి ఫస్టాఫ్ లో ఆ సీన్లూ, పాత్రలూ ప్రతీదీ హంబక్కే. ప్రేక్షకులు ఫూల్స్ అయ్యామని, చీటింగ్ కి గురయ్యామనీ ఫీలవ్వడమే.

        ఇదొక ఎత్తైతే, ఇక సెకండాఫ్ లో ఖిలాడీగా రవితేజ ఇచ్చే ట్విస్టు మీద ట్విస్టులు ఫాలో అవలేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఒకెత్తూ! సెకండాఫ్ కథ దర్శకుడికైనా అర్ధమైందో లేదో?

        మొత్తానికి రవితేజ- రమేష్ వర్మలు కలిసి విజయానికి వెయ్యి మైళ్ళు కాదు, కొన్ని కాంతి సంవత్సరాలు దూరంగా వుండిపోయే కథ పట్టుకొచ్చి క్లాస్- మాస్ నెత్తిన కొట్టేశారు!

నటనలు- సాంకేతికాలు

కాసేపు ఫస్టాఫ్ కట్టు కథన్నది పక్కన బెట్టి చూస్తే, చూపించిన ఆ కామెడీ కథనమంతా కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు. వెన్నెల కిషోర్ కామెడీతో రవితేజ జనరల్ మేనేజర్ పాత్ర కూడా వర్కౌట్ కాలేదు. ఇక డింపుల్ హయతీతో లవ్ ట్రాక్, ఆమె పేరెంట్స్ అనసూయా మురళీ శర్మలతో కామెడీ, ఏదీ పుట్టించాల్సిన నవ్వు పుట్టించ లేకపోవడం ట్రాజడీ. పాటలు, ఆ పాటల్లో డింపుల్ హయతీ ఎక్స్ పోజింగ్, సెకండాఫ్ లో ఆమె బికినీ షో, ఇవే మాస్ కి నచ్చేలా వున్నాయి రవితేజ ఫైట్స్ సహా.

        ట్రైలర్ చూస్తే డబుల్ షేడ్స్ టో రవితేజ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా వుంటుంది. సినిమా చూస్తే లోగ్రేడ్ క్వాలిటీ. అంత హై వోల్టేజ్ యాక్షన్ కూడా లేదు.

        హీరోయిన్లిద్దరూ స్కిన్ షోకి వొకరూ, సింప్లిసిటీకి ఒకరూ అన్నట్టుగా మాత్రం బాగా కుదిరారు. ఈ ఖిలాడీ ఆటలో ఇద్దరికీ బోలెడు పని వున్న పాత్రలే దక్కాయి. ఆట ఎంత గందరగోళంగా వుందన్నది వేరే విషయం. ఇక సీబీఐ ఆఫీసర్ గా అర్జున్ అయోమయ పాత్ర. ఖిలాడీని ఎన్నిసార్లు అరెస్టు చేసే అవకాశమొచ్చినా చేయలేక పోతాడు- ఈమాత్రపు కథ అక్కడితో అరెస్టయి పోతుందన్నట్టుగా. అరెస్ట్ చేయకుండా రమేష్ వర్మ అడ్డు తగుల్తూ అర్జున్ ని అరెస్ట్ చేస్తూ పోయాడు- ఖిలాడీని మీరు అరెస్ట్ చేసేస్తే నా అద్భుత కథ ఏం కావాలని!

        రమేష్ వర్మ అద్భుత కథ అంతా- అంత  అద్భుత పోస్ట్ ప్రొడక్షన్ తో కూడా వుంది. పబ్లిసిటీ డిజైనర్ అయిన తను- కనీసం డీఐ క్వాలిటీ అయినా చూసుకోకూడదా? ఇక ఆరు మాస్ పాటలిచ్చిన దేవీశ్రీ ప్రసాద్, ఈ పాటలన్నీ అరగంటలో చేసేశానన్నాడు కాబట్టి- ఇవెంత అరకొర మ్యూజిక్ తోవున్నా, అర్ధంగాని ట్విస్టుల మధ్య ఈ పాటలే కాస్త ప్రాణవాయువులు అనుకుని అరకేజీ తృప్తి పడాలి. అన్నట్టు థియేటర్లో మార్నింగ్ షోకి చాలా పొదుపుగా ప్రేక్షకులున్నారు- దూరం దూరంగా కూర్చుని...144 సెక్షన్ విధించినట్టు.    

—సికిందర్ 

1128 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
తారాగణం : విక్రమ్
, ధృవ్ విక్రమ్, సిమ్రాన్, సనంత్, బాబీ సింహా, వెట్టాయ్ ముత్తుకుమార్, ఆడుకాలం నరేన్ తదితరులు
సంగీతం :  సంతోష్ నారాయణ్
, ఛాయాగ్రహణం : శ్రేయాస్ కృష్ణ
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాత : ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల : 10 ఫిబ్రవరి 2022 (అమెజాన్ ప్రైమ్)
***

        చియాన్ విక్రమ్ 2019 లో మిస్టర్ కేకే’, ఆదిత్య వర్మ ల తర్వాత మూడేళ్ళు విరామం తీసుకుని మహాన్ తో వచ్చాడు. ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి) లో కొడుకు ధృవ్ విక్రమ్ ని హీరోగా పరిచయం చేస్తూ తను కూడా నటించాడు. ఇది ఫ్లాపయ్యాక తిరిగి ఇప్పుడు కొడుకుతో మహాన్ నటించాడు. తండ్రీ కొడుకుల కాంబినేషన్ ఫ్యాన్స్ కి హుషారు పుట్టించింది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం కూడా ఆకర్షణ తీసుకు వచ్చింది. 8 సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, 2021 లో జగమే తందిరం తీసి ఫ్లాపయ్యాడు. జగమే తందిరం’, దీనికి ముందు జిగర్తాండా లలాగే మహాన్ తో కూడా ఇప్పుడు గ్యాంగ్ స్టర్ మూవీనే ప్రయత్నించాడు.

        ఇందులో హీరోయిన్ లేకపోవడం ఒక ప్రత్యేకత. కొడుక్కి హీరోయిన్ లేకపోతే ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారనే ఆలోచనకి దూరంగా, తండ్రీ కొడుకుల సెటిల్ మెంట్ కథని హీరోయిన్ తో డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో నాన్ హీరోయిన్ మూవీగానే ఫ్యాన్స్ మీద ప్రయోగించాడు విక్రమ్. అలాగే ఈ గ్యాంగ్ స్టర్ మూవీతో ఫ్యాన్స్ కి  థియేటర్ అనుభవాన్ని కూడా దూరం చేస్తూ ఓటీటీ విడుదలకి సిద్ధపడ్డాడు. ఫ్యాన్స్ తో కోరి ఇన్ని రిస్కులు  తీసుకున్న విక్రమ్- ధృవ్- సుబ్బరాజ్ త్రయం చివరికి సాధించిందేమిటి? ఏమైనా చెప్పుకోదగ్గ ఘనత సాధించారా? లేక చతికిలబడి మావల్ల కాదన్నారా? ఈ అమూల్య విషయాలు తెలుసుకుందాం... 

కథ

1968 లో గాంధీ మహాన్ (విక్రమ్) చిన్నపిల్లాడు. తండ్రి మోహన్ దాస్ (ఆడుకాలం నరేన్) స్వాతంత్ర్య పోరాటం చేసిన వాడు, తాత కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గాంధీ భక్తుడు. అందుకని కొడుక్కి గాంధీ మహాన్ అని పేరు పెట్టుకుని గాంధీ ఆదర్శాలతో పెంచే ప్రయత్నం చేస్తాడు మోహన్ దాస్. కానీ కొడుకు సారాబట్టీ నడిపే వాడి కొడుకుతో స్నేహం చేసి, జూదం మద్యం అలవాటు చేసుకుంటాడు. మద్య నిషేధ పోరాటం చేస్తున్న మోహన్ దాస్ దృష్టికి ఇది వచ్చి కొడుకుని కొడతాడు. ఇక అలాటి పనులు చెయ్యనని మాటిస్తాడు కొడుకు గాంధీ మహాన్.

        అలా నలభై ఏళ్ళ వయాసొచ్చేదాకా గాంధేయ మార్గంలో వున్న గాంధీ మహాన్ అలియాస్ మహాన్, లెక్చరర్ గా వుంటాడు. నాచి (అంటే తమిళంలో నిప్పు- నటి   సిమ్రాన్) ని పెళ్ళి చేసుకుని కొడుకుతో వుంటాడు. అయితే తనకి గాంధీ పేరుండడం వల్ల ఆదర్శాలతో గాంధీ భారాన్ని ఇక మోయలేక పోతాడు. 41 వ పుట్టిన్రోజుకి ఏమైనా సరే ఆదర్శాల్ని తెంపి పారేసి ఎంజాయ్ చేయాలని బార్ కెళ్ళి తాగేస్తాడు, పేకాట ఆడేస్తాడు. తీరా చూస్తే ఆ బార్ కమ్ పేకాట డెన్ ఓనర్ చిన్నప్పుడు సారాబట్టీ ఓనర్ కొడుకు సత్యమే (బాబీ సింహా). తన ఫ్రెండే.

        భర్త బార్ కెళ్ళి తాగాడని తెలుసుకున్న నాచి, కొడుకుని తీసుకుని గుడ్ బై కొట్టేసి తండ్రి దగ్గరి కెళ్ళిపోతుంది. ఇక రాదు. మహాన్ సత్యంతో చేయి కలిపి ఇక మద్యం సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. గ్యాంబ్లింగ్ కేసినో ప్రారంభిస్తాడు. సత్యం కొడుకు రాకేష్ (సనంత్), ని సొంత కొడుకులా చూసుకుంటాడు. బాగా డబ్బు సంపాదించి ఎక్కడో పెరుగుతున్న సొంత కొడుకు దాదా భాయ్ నౌరోజీ (ధృవ్ విక్రమ్) కి ఆ డబ్బంతా ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొడుకు దాదాభాయ్ నౌరోజీ అలియాస్ దాదా, పోలీస్ అధికారిగా వచ్చి మద్యం సిండికేట్ పనిబట్టడం మొదలెడతాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ మొదలైపోతుంది. ఒకానొక క్లిష్ట సమయంలో తను సొంత కొడుకు దాదా వైపుండాలా, లేక పెంపుడు కొడుకు రాకేష్ వైపు వుండాలా తేల్చుకోలేక పోతాడు మహాన్. ఏ నిర్ణయం తీసుకున్నా తీవ్ర పరిణామాలే పొంచి వుంటాయి. ఇలా మహాన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిందన్నది మిగతా కథ.  

ఎలావుంది కథ

తప్పు చేయడానిక్కూడా స్వాతంత్ర్యం లేకపోతే అది స్వాతంత్ర్యమే కాదన్న మహాత్మా గాంధీ వాక్కు ఆధారంగా సిద్ధం చేసుకున్న కథ. వాక్కు ఎటో పోయింది, కథ ఎటో పోయింది. మధ్య మనం ఎటూ కాకుండా ఆలోచిస్తూ. వాక్కు సంగతెలా వున్నా, ఈ రెండు గంటలా 48 నిమిషాల అతి భారమైన నిడివిలో మనం దేవులాడుకునేది కనీసం గాంధీయిజమైనా ఎక్కడైనా వుందాని.

        తండ్రి గాంధీయిజాన్ని తుంగలో తొక్కి లిక్కర్ గ్యాంగ్ స్టర్ అయ్యాడు. తల్లీ తాతా కలిసి గాంధీ ఆదర్శాలతోనే పెంచిన కొడుకూ పోలీసాఫీసర్ గా అడ్డగోలు ఎన్ కౌంటర్లు చేసే స్తూ హింసావాదిగా తేలాడు. ఇక తండ్రీ కొడుకుల మధ్య ఆదర్శాల సంఘర్షణైనా ఎక్కడుంది. ఇద్దరి ఆదర్శాలొకటే. హింసతో ఇద్దరూ దారితప్పిన వాళ్ళే. ఇలాటి కథకి గాంధీయిజపు పూత ఎందుకు.

        ఇద్దరూ దారి తప్పిన వాళ్ళయినప్పుడు కనీసం గాంధీయిజం కోసం తపించే తల్లి పాత్రయినా తండ్రీ కొడుకుల్ని దారికి తెచ్చే కేటలిస్ట్ పాత్రగా వుండుంటే ఆ గాంధీయిజమంతా కథకి ఓ కేంద్ర స్థానం వహిస్తూ కాన్సెప్ట్ క్యారీ అయ్యేది. ఇది కూడా జరగలేదు. తల్లి పాత్రకి ప్రాధాన్యమే లేదు. చివరికి తేలేదేమంటే, ఇగోలతో శత్రువులు గా మారిన తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటల్ సెటిల్మెంటే. దీనికి  కూడా పగదీర్చుకునే ముగింపే. చెడుని నిర్మూలించడానికి ఆయుధాలు చేపడితే జరిగేది రెండు దుష్ట శక్తుల మధ్య యుద్ధమే- అన్న గాంధీ సూక్తి లాగా తేలింది కథ. ఈ సూక్తి ప్రకారమైతే ఇద్దరూ చావాలి. ఇది కూడా జరగలేదు.

        తప్పు చేయడానిక్కూడా స్వాతంత్ర్యం లేకపోతే అది స్వాతంత్ర్యమే కాదన్న కొటేషన్ తండ్రి పాత్రకే వర్తిస్తుంది. తండ్రే చెప్తాడీ మాట చివరికి. అయితే ఇందులోంచి కూడా నేర్చుకున్నదేమీ లేదు, మార్చుకున్నదేమీ లేదు. పరిపూర్ణతని సాధించలేదు కథ.

        ఇక మద్య నిషేధం సంగతి. 1968 పూర్వ కథలో మద్య నిషేధమంటే కన్విన్సింగ్ గానే గానే వుంటుంది ఆ కాలాన్ని బట్టి. ఇప్పుడు ఈ కాలంలో మధ్య నిషేధ మేమిటి? మద్యమనేది స్టూడెంట్స్ దగ్గర్నుంచీ ఎందరికో తాగి పారేసే వేల కోట్ల రూపాయల ప్రభుత్వాదాయ వనరుగా, నిత్యావసర వస్తువుగా మారేకా? గృహిణుల కాడ్నించీ అందరూ కామన్ గా తీసుకుంటున్నాక? ఒక వీడియో అనుకోకుండా చూడడమైంది. ప్రఖ్యాత హిందీ గీత రచయిత ఆనంద్ బక్షీ విదేశంలో ఇండియన్స్ కిచ్చిన ప్రోగ్రాంలో ఒక గ్లాసులో మద్యం, నోట్లో సిగరెట్ పెట్టుకుని పాటలు పాడుతూ కన్పించాడు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. లేడీస్ కూడా కామన్ గా తీసుకున్నారు. ఇది 1980 ల నాటి సంగతి.

        ఇది మద్య నిషేధపు కథ కాక, మాదక ద్రవ్యాల నిషేధ కథైవుంటే సరిపోయేది. కానీ ఇలా ఇటు మద్యానికి కాకుండా, అటు గాంధీకీ కాకుండా పోయింది కథ.

నటనలు – సాంకేతికాలు

చియాన్ విక్రమ్ మహాన్ గా ఎలాటి ఓవరాక్షన్ లేకుండా రియలిస్టిక్ నటన కనబర్చాడు. సరదాగా ప్రారంభమై సీరియస్ గా మారి, యమ సీరియస్ గా సాగే పాత్ర పరిణామ క్రమాన్ని బాగా రికార్డు చేశాడు. అతడికి పదే పదే వేర్వేరు నైతిక ప్రశ్నలు- వాటి తాలూకు సంఘర్షణలూ ఎదురవుతూంటాయి. తనకీ కొడుక్కీ మధ్య, తనకీ పెంపుడు కొడుక్కీ మధ్య, తనకీ స్నేహితుడు సత్యం కీ మధ్య, తనకీ భార్యకీ మధ్య, చివరికి తనకీ ఇంకో చిన్ననాటి స్నేహితుడే మంత్రికీ మధ్య ...ఒకదాని తర్వాతొకటి ఈ నాల్గు  డోలాయమాన స్థితుల మధ్య వూగిసలాటే ఈ పాత్రకి. ఇవన్నీ బాగా పోషించాడు బాధాతప్త హృదయం గల పాత్రగా.

        కొడుకు పాత్రలో ధృవ్ విక్రమ్ కూడా పకడ్బందీ పాత్రపోషణ, డైలాగ్ డెలివరీ చేశాడు. అయితే ఈ పోలీసు పాత్ర ఎన్ కౌంటర్లతో హింసకి పాల్పడే పాత్ర కావడంతో- తల్లీ తాతల గాంధేయవాద పెంపకం అర్ధం లేకుండా పోయింది. ఎంతసేపూ తండ్రి గ్యాంగునీ, తండ్రి పెంచుకున్న కొడుకునీ చంపుతూ, పగ సాధించేందుకు తండ్రిని వేటాడుతూ వుండే అర్ధం లేని పాత్ర చిత్రణొకటి పంటి కింద రాయిలా వుంటుంది. ఎంత పోలీసైనా అహింసకి కట్టుబడి తండ్రిని మార్చే కాంట్రాస్ట్ పాత్రగా వుంటే -  తండ్రీ కొడుకుల హింస- అహింసల పోరాటంగా కథకి స్పష్టత వచ్చేది. గాంధీయిజం ప్లే అయ్యేది.

        మెంటల్ కొడుకు పాత్రకి 1825-1917 మధ్య కాలపు  పార్శీ మతానికి  చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడైన, మహనీయుడైన దాదాభాయ్ నౌరోజీ పేరెందుకో అర్ధంగాదు!

        తల్లి పాత్రలో సిమ్రాన్ కన్పించేది కాసేపే. ఈ పాత్ర చిత్రణ కూడా కుదర్లేదు. భర్త ఒకసారి తాగాడని కొడుకుని తీసుకుని నీకూ నాకూ రామ్ రామ్ అనేసి వెళ్ళిపోవడం కన్విన్సింగ్ గా వుండదు. నలభై ఏళ్ళూ ఓపిక బట్టుకుని, తను పుట్టిన ఘన కార్యానికి నలభై ఒకటో పుట్టిన్రోజున ఏదో కాస్త తాగితే సంసారం వదిలేసి వెళ్ళి పోవడమేనా? ఈమె ఇలా వెళ్ళిపోయిందన్న కసితోనే  కావచ్చు- అతను ఏకంగా మద్యం సామ్రాజ్యమే  ఏర్పాటు చేసుకుని కూర్చున్నాడు!  

        స్నేహితుడు సత్యంగా బాబీ సింహా పాత్ర చిత్రణ మాత్రం కుదిరింది. బాగానే నటించాడు. ఇంకో స్నేహితుడు మంత్రి జ్ఞానోదయం పాత్రలో వెట్టాయ్ ముత్తుకుమార్ ఫైనల్ విలన్ గా వుంటాడు. బలహీన విలన్.

        సంతోష్ నారాయణ్ సంగీతంలో ఏడు పాటలున్నాయి. ఏడూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే థీమ్ సాంగ్సే. ఈ సాంగ్స్ మారుతున్న కథాకాలంతో శైలి మార్చుకుంటూ సాగుతూంటాయి. ఈ డార్క్ మూవీకి శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం ఎఫెక్ట్స్ వరకూ బావుంది గానీ, కెమెరా కథా కథనాల్లో పాలు పంచుకోలేదు. దీన్ని కథ అనకూడదు, గాథ అనాలి. గాథ అయినప్పుడు కెమెరాతో గాథ చెప్పలేదు. కలంతో చెప్పుకుంటూ పోయారు. దీంతో యాక్షన్ తక్కువ, డైలాగులు ఎక్కువగా- డైలాగ్స్ సీన్సే సోది చెప్తున్నట్టు సాగుతూంటాయి సుదీర్ఘంగా.  

చివరి కేమిటి?

ఇది కథకాదు, గాథ. ఇందులో ఒక ప్రథాన కాన్ఫ్లిక్ట్ చుట్టూ కథనముండదు. పైన చెప్పుకున్నట్టు తండ్రికి ఇతరులతో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చి పోతూ వుంటాయి. పాత్ర పాసివ్ గానూ వుంటుంది, యాక్టివ్ గానూ మారుతూంటుంది. ఫస్టాఫ్ అంతా ఒక టెంప్లెట్. 1968 నుంచీ తండ్రి జీవీతం ఎలా మారుతూ వచ్చిందో చెప్పే డాక్యుమెంటరీ టెంప్లెట్. ఈ ఫస్టాఫ్ లో ప్రత్యర్ధి పాత్ర వుండదు. తండ్రి లిక్కర్ మాఫియాగా ఎలా ఎదిగాడో చెప్పే ఏకపక్ష కథనమే వుంటుంది గంటా 20 నిమిషాలూ. పుష్ప లో స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో టెంప్లెట్ లో చెప్పినట్టుగా. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్లో కొడుకు వస్తే గానీ ప్రత్యర్ధి ఏర్పాటు కాడు. ఫలితంగా ఈ ఫస్టాఫ్ అంతా విషయం లేక బోరు కొట్టే అవకాశముంటుంది.

        పోనీ ఇంటర్వెల్ తర్వాతైనా వెంటనే కొడుకుతో కాన్ఫ్లిక్ట్ కూడా ప్రారంభం కాదు. ఫస్టాఫ్ లో తండ్రి చిన్నప్పట్నుంచీ ఎలా సీన్లు చూపించారో, మళ్ళీ ఇప్పుడు కొడుకు చిన్నప్పట్నుంచీ తల్లి దగ్గర ఎలా పెరిగి పోలీసాఫీసర్ అయ్యాడో- ట్రైనింగు సహా స్పూన్ ఫీడింగ్ చేసే ఫ్లాష్ బ్యాక్ సీన్లు. ఇంకో ఇరవై నిమిషాలు తీసుకుని ఇది పూర్తయితే గానీ, ఫస్ట్ యాక్ట్ పూర్తయి సెకెండ్ యాక్ట్ లో పడదు గాథ. అంటే ఇంటర్వెల్ మీదుగా గంటా 40 నిమిషాల వరకూ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవకుండా, ఫస్ట్ యాక్టే సాగుతుందన్న మాట దీని దుంప తెగ!

        ఇక కొడుకు సహా పైన చెప్పుకున్న వివిధ పాత్రలతో వివిధ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిపోతూంటాయి తండ్రికి. ఒక్కో కాన్ఫ్లిక్ట్ ఒకే బారెడు పదీ పదిహేను నిమిషాల సేపూ సాగే  డైలాగ్స్ సీన్లు. ఇలా సెకండ్ యాక్ట్ నుంచీ థర్డ్ యాక్ట్ ఎండ్ వరకూ కేవలం ఐదారు సీన్లుంటాయి - ఆస్కార్ విన్నర్ స్క్రీన్ ప్లే దేర్ విల్ బి బ్లడ్ లోలాగా. కానీ దేర్ విల్ బి బ్లడ్ గాథ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని చూసి అర్ధం జేసుకుని మహాన్ ని తీసివుంటే, కార్తీక్ సుబ్బరాజ్ గ్రేట్ మూవీని ఇచ్చి వుండేవాడు. సినిమాలో మంచి విషయముంది. దీన్ని సోదిలా చెప్పడంతో ఓ గ్లాసు మందు కొట్టినట్టూ, లేదా ఓ గాంధీతో  క్లాసు పీకించుకున్నట్టూ కాకుండా పోయింది!

—సికిందర్