రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 19, 2021

1090 : రివ్యూ


దర్శకత్వం : మల్లిక్ రామ్
తారాగణం: తేజ సజ్జ, శివానీ రాజశేఖర్, సత్య, శివాజీ రాజా, తులసి తదితరులు
కథ : ప్రశాంత్ వర్మ, స్క్రీన్ ప్లే - మాటలు : లక్ష్మీ భూపాల, సంగీతం: రథన్, ఛాయాగ్రహణం : విద్యాసాగర్
బ్యానర్ : మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్
విడుదల:
నవంబర్ 19, 2021, డిస్నీ + హాట్ స్టార్

        సైన్స్ ఫిక్షన్ ని జత చేసి అద్భుతం అనే ఇంకో ప్రేమ సినిమా కొత్త వాళ్ళతో డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది ఈ రోజు నుంచి. హీరో తేజ సజ్జా, హీరోయిన్ శివానీ రాజశేఖర్, దర్శకుడు మల్లిక్ రామ్ కొత్త వాళ్ళు. రొటీన్ ప్రేమ సినిమాలతో విసిగిన ప్రేక్షకులకి కాస్త డిఫరెంట్ గా సైన్స్ ఫిక్షన్ రోమాన్స్ ఉత్సాహాన్నిచ్చేదే. అద్భుతం అని టైటిల్ కూడా వుంటే అద్భుత జర్నీలో తేలియాడే ఫీల్ కూడా పుట్టి, ఇంట్లోనే కదా థియేటర్ కేళ్ళే పని లేదుగా అని పిల్లా పాపలతో డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోవచ్చు అల్పాహారాలు పెట్టుకుని. ఇక ఒక మౌస్ క్లిక్ తో మొదలవుతుంది ఆట. అప్పుడుంటుంది అసలు తండ్లాట. అదేమిటో చూద్దాం...

కథ
    సూర్య (తేజ సజ్జా) ఒక ఛానెల్లో పని చేస్తూంటాడు. ఒక రోజు ఆఫీసులో అయిన ఒక అనుభవంతో ఆత్మ హత్యకి సిద్ధపడతాడు. ఇంకో చోట వెన్నెల (శివాని) వుంటుంది. ఈమె కూడా ఒక కారణంతో ఆత్మహత్యకి పూనుకుంటుంది. ఇంతలో సూర్య సెల్ కి అతడి నెంబరుతోనే మెసేజి వస్తుంది. అది వెన్నెల సెల్ నుంచి వస్తుంది. తన నెంబర్ వెన్నెల దగ్గరెలా వుంది? తెలుసుకుంటే ఆమే తనూ వేర్వేరు కాలాల్లో వున్నట్టు తెలుస్తుంది. ఆమె 2014 లో, తను 2019 లో. ఇదెలా సాధ్యం? ఇప్పుడేం చేయాలి? ఇద్దరూ ఎలా కలుసుకోవాలి? అసలు ఇద్దరి మధ్య వున్న సంబంధమేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
  వివిధ జానర్ల సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తూంటాయి. వాటిలో ప్రేమ కథలొకటి. ఈ ప్రేమ కథల్లో సైన్స్ ఎక్కువై ప్రేమ తగ్గినా, ప్రేమ ఎక్కువై సైన్స్ తగ్గినా, లేదా సైన్సే మిస్సయినా ఫలితాలు బావుండవు. సైన్స్ సృష్టించిన కథా ప్రపంచంలో ప్రేమ కథలుంటే రెండూ కలిపి అద్భుతంగా ఫీలవగల్గుతాం- మనమూ ఆ కాల్పనిక సైన్స్ ప్రపంచంలో విహరిస్తూ. ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్ (2005), ఎబౌట్ టైమ్ (2013), ఐయాం యువర్ మాన్ (2021) వంటివి కొన్ని. తెలుగులో ఆదిత్య 369 చూసినా మనం మొత్తం వేరే ప్రపంచంలో వున్నట్టు ఫీలవుతాం. అలా ఫీలయ్యేట్టు చేయకపోతే అది సైన్స్ ఫిక్షన్ కాదు.

  అద్భుతం సైన్స్ ఫిక్షన్ జానర్లో లో భిన్న కాలాల టైమ్ జంబ్లింగ్ కథ. వేర్వేరు కాలాల్లో  వున్న హీరో హీరోయిన్ల ఫోన్ కాల్స్ కలిసి మొదలయ్యే కథలు. ఆ మధ్య తెలుగులో ఇలా ప్లే బ్యాక్ అనే సస్పెన్స్ థ్రిల్లర్, గత నెలలోనే నేను లేని నా ప్రేమ కథ అనే రోమాన్స్ వచ్చాయి. అద్భుతం’, నేను లేని నా ప్రేమ కథ ఒకటే. రెండిటి ఇంటర్వెల్ సీన్లు ఒకటే. రెండిట్లోనూ ఎత్తుకున్న సైన్స్ ని వదిలేసి రోటీన్ ప్రేమ కథల్లోనే పడ్డారు. కాబట్టి అద్భుతం ఏదో అద్భుతమనుకుంటే నిరాశ తప్పదు. వారం వారం వస్తున్న అవే పస లేని ప్రేమ సినిమాల్లో ఇదీ ఒకటి.

     నేను లేని నా ప్రేమ కథ లో కాలాల ఎడం 17 ఏళ్ళు వుంటుంది. దాంతో 1983 లో వుంటున్న హీరోయిన్ కథకి పీరియెడ్ లుక్ తో బాటు ఆమె కట్టూబొట్టూ, భాషా ఆ కాలంలోకి తీసికెళ్తాయి. అద్భుతం లో కేవలం అయిదేళ్ళే కాలాల ఎడం. 2014 కీ, 2019 కీ తేడా వుండని కాలం. దీంతో రెండు కాలాల దృశ్యాలూ, పాత్రల తీరులూ ఒకలాగే వుంటాయి. సైన్స్ ఫిక్షన్ ఫీల్ కలగక పోవడానికి ఇదే ప్రధాన కారణం.

        నేను లేని నా ప్రేమ కథ లో కనీసం కథనమైనా డైనమిక్ గా వుంది. అనేక చోట్ల ఓ ప్రశ్న రేకెత్తిస్తూ రీఫ్రెష్ అవుతూ పోయే కథనం. వీటితో మలుపులూ సస్పెన్సూ ఏర్పడే కథనం. అద్భుతం లో ఇది కూడా లేదు. ఏ మలుపులూ సస్పెన్సూ లేని చాలా నీరసమైన పూర్ కథనంగా ఇది వుంటుంది.

        ప్రేమ సినిమాలెన్ని తీసినా వాటికి ఎప్పటికప్పుడు వయసుకొచ్చిన యువ  ప్రేక్షకులు వుంటూనే వుంటారు. అయినా తీస్తున్న ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నాయంటే లేత కుర్రాళ్ళకి కూడా పట్టని ఓల్డ్ సరుకుగా అనిపిస్తున్నాయన్న మాట. సినిమాలు చూసే వయసు కొచ్చిన నేటి లేత కుర్రాళ్ళ ప్రపంచంలో కెళ్ళి నేటివైన ప్రేమ సినిమాల్ని ఆవిష్కరిస్తే తప్ప అద్భుతాలు జరగవు.

 నటనలు- సాంకేతికాలు
    తేజకిది మొదటి సినిమా. తర్వాత నటించిన సినిమా ముందు వచ్చి వుంటే వచ్చి వుండొచ్చు. ఈ మొదటి సినిమాలో నీటుగా ఆత్మవిశ్వాసంతో నటించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ వుంది. సీన్లు బాగా తీసివుంటే తనకి బావుండేది. పైపైన క్యారక్టర్ ని చిత్రించేయకుండా ఈ కథకి ప్రధాన పాత్రగా చేసి, ఒక గోల్, దాంతో డ్రైవ్ కల్పించి వుంటే స్క్రీన్ ప్లే ఇలా దెబ్బతీసేది కాదు తనని. ప్రారంభంలో ఆత్మహత్యా యత్నానికి బలమైన కారణం ఎలాలేదో, నటించడానికి అలా బలమైన కథ ఎక్కడా లేదు. సెకండాఫ్ లో ఫాదర్ సెంటి మెంటు, ట్రాజడీ కథని పక్కదోవ పట్టించాయే తప్ప తనకుపయోగ పడలేదు. హీరోయిన్ శివానితో ఫోన్ రోమాన్సు కూడా సాగి సాగి, వుండాల్సిన ప్రత్యక్ష రోమాన్స్ అప్పీల్ లేకుండా చేసింది. రెండు పాటల్లో రోమాంటిక్ గా కనిపించాడు.



   కొత్త హీరోయిన్, అలనాటి హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ ఎమోషనల్ సీన్లలో కంటే మిగతా సీన్లలో హీరోని కేర్ చేయని పాత్ర నటించడంలో స్పీడు కనబర్చింది. తేజాకీ తనకీ భవిష్యత్తు వుంది. ఇక తేజ తండ్రిగా శివాజీ రాజా, శివానీ తండ్రిగా దేవీ ప్రసాద్, నానమ్మగా తులసి నటించారు. తేజ ఫ్రెండ్ గా సత్య బాగానే ఎంటర్ టైన్ చేస్తాడు కామెడీతో. ప్రొడక్షన్ విలువలు, విజువల్స్ రిచ్ గా వున్నాయి అద్భుతం టైటిల్ కి తగ్గట్టు. మిగిలిన విషయాలే అద్భుతంగా లేవు.

     పాత ప్రేమకి సైన్స్ ఫిక్షన్ సింగారం. నామ్ కే వాస్తే సైన్స్ ఫిక్షన్. అద్భుతమన్నాక ప్రతీ సీనూ పరవళ్ళు తొక్కుతూ అద్భుతాలు చేయాల్సింది పోయి- అద్భుత రసంతో లవ్ ని ఒక అడ్వెంచర్ గా చూపాల్సింది పోయి, చూసి చూసి వున్న అదే పాత రొటీన్ ప్రేమ డ్రామా కింద మార్చేశారు. కొత్త దర్శకుడి చేతిలో ఏమీ లేదు. ‘జాంబీ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథే తీశాడు.


        ఫస్టాఫ్ ఫోన్ కాల్స్ తోనే లవర్స్ ఇద్దరికీ సరిపోతుంది. తాము వేర్వేరు కాలాల్లో వున్నట్టు తెలుకోవడానికి వాళ్ళకీ, మనకీ చాలా సమయం పడుతుంది. ప్రారంభంలో ఆత్మహత్యా యత్నం సీన్లోనే అలా మెసేజెస్ రావడంతో ఇద్దరూ వేర్వేరు కాలాల్లో వున్నట్టు ఓపెన్ చేసేసి మలుపు తిప్పి వుంటే ఫస్టాఫ్ బోరు అంతా తప్పేది. విషయం లేక ఇంటర్వెల్ వరకూ ఫ్లాట్ గా కథ నడుస్తూంటుంది. విషయం తెలిశాక సెకండాఫ్ లో హీరో పాత ప్రేమ ఫ్లాష్ బ్యాకు వస్తుంది. గతంలో ఇద్దరూ ప్రేమికులేననీ తెలిపే ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక ఇద్దరూ ఇప్పుడు కలుసుకునే కథ. ఈ కథని టైమ్ జంబ్లింగ్ సైన్స్ ఫిక్షన్ కథ చేయకుండా, ఐదేళ్ల క్రితం విడిపోయిన లవర్స్ తిరిగి కలుసుకునే కథగా చేసినా తేడా ఏమీ రాదు. ఇంకో విషయమేమిటంటే టైమ్ జంబ్లింగ్ పాయిటు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం. ఇంత అద్భుతంగా సినిమా చూపిస్తే ఎందుకు చూడరు ప్రేక్షకులు?

—సికిందర్ 

1089 : హాలీవుడ్ రివ్యూ


 

        రెండు వేల ఏళ్ళ క్రితం ఈజిప్షియన్ రాణి క్లియోపాత్రాకి పెళ్ళినాడు పెళ్ళికొడుకు మార్కస్ ఆంటోనియస్ కానుకగా ఇచ్చిన మూడు అండాకార వజ్ర ఖచిత కళాకృతులు (ఎగ్స్) ని , వెతికి తెచ్చిన వారికి 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తానని ప్రకటిస్తాడొక ఈజిప్షియన్ బిలియనీర్. ఇతను వీటిని కుమార్తె  పెళ్ళిలో చదివించాలనుకుంటాడు.    

లా వుండగా, రోమ్ లోని ఒక మ్యూజియంలో క్లియోపాత్రా ఎగ్ అపహరణ కేసుకి సంబంధించి దర్యాప్తులో ఇంటర్ పోల్ ఏజెంట్ ఊర్వశీ దాస్ (రీతూ ఆర్య) తో సహకరించేందుకు ఎఫ్ బీఐ ఏజెంట్ జాన్ హార్ట్లీ (డ్వాయెన్ జాన్సన్) వస్తాడు. మ్యూజియంలో ఒరిజినల్ ఎగ్ ని అపహరించి నకిలీ ఎగ్ వుంచినట్టు గుర్తించిన అతనూ ఊర్వశి, వెంటనే యాక్షన్లోకి దిగుతారు. కళా ఖండాల చోరుడు నోలన్ బూత్ (రేయాన్ రేనాల్డ్స్) ని వెంటాడుతారు. నోలన్ తప్పించుకుని ఎగ్ తో బాలీలోని తన నివాసానికి చేరుకుంటాడు. అక్కడే వున్న జాన్ అతడ్ని పట్టుకుంటాడు. అక్కడికే వచ్చిన ఊర్వశి, నోలన్ తో బాటు జాన్ ని పట్టుకుంటుంది. జాన్ నోలన్ తో కుమ్మక్కయ్యాడని ఆరోపించి, నోలన్ తో బాటు  రష్యన్ జైల్లో వేయిస్తుంది. అక్కడ ఎగ్స్ అన్వేషణలో వున్న బిషప్ (గాల్ గడోట్) వీళ్ళిద్దరితో బేరమాడుతుంది. ఆమెతో బేరం ఒప్పుకుని ప్లాను ప్రకారం నోలన్, జాన్ తో కలిసి జైల్లోంచి తప్పించుకుని ఎగ్స్ వేటలో పడతాడు...
        ఈ వేటలో నోలన్ విజయం సాధించాడా? ప్రపంచానికి తెలియని మూడో ఎగ్ జాడ ఎలా కనుక్కున్నాడు? ఈ క్రమంలో ఎదుర్కొన్న కష్టాలేమిటి? మోసాలేమిటి? జాన్, బిషప్ ల నిజ స్వరూపాలేమిటి? ఇవి తెలియడమే మిగతా కథ.

స్టార్ పవర్ - స్టోరీ పవర్
    నెట్ ఫ్లిక్స్ 200 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి  కొని విడుదల చేసిన ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇందులో క్లియోపాత్రా ఎగ్స్ అనేది సినిమా కోసం కల్పించిన కథ. చారిత్రక స్పర్శ గల ఈ కల్పిత కథ వల్ల సినిమాకో విషయ గాంభీర్యం ఏర్పడింది. దీనికి కాంట్రాస్ట్ గా పూర్తిగా యాక్షన్ కామెడీ చేశారు కథని.  ఎక్కడా సీరియస్ గా వుండదు. ఏది ఎందుకు జరుగుతున్నాయో కూడా లాజిక్ లేకుండా మాస్ అప్పీల్ తో నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. దీనికి సారధులు ముగ్గురు స్టార్స్ - రేయాన్ రెనాల్డ్స్, డ్వాయెన్ జాన్సన్, గాల్ గోడాట్. తెర మీద ఈ స్టార్స్ కన్పిస్తే చాలు, కథ అవసరం లేదన్నట్టు ప్రవర్తించాడు దర్శకుడు రాసన్ మార్షల్ థర్బర్. దీంతో స్టార్ పవర్ తో దేశాదేశాల లొకేషన్స్ లో హంగామాయే తప్ప స్టోరీ పవర్ లేకుండా పోయింది.

        ముగ్గురూ లోకం చుట్టిన వీరుల్లా రోమ్, బాలీ, లండన్, రష్యా, కైరో, అర్జెంటీనా, పారిస్, సార్డినా తిరిగేస్తారు. ఒక్కో దేశం పేరు తెర నిండుగా బండగా పడుతూంటాయి - మాస్ సినిమా కదా? తీరా చూస్తే ఆ దేశాల్లో ఇండోర్స్  లోనే సీన్సు జరుగుతాయి. ఈ మాత్రం ఇండోర్ సీన్స్ కి దేశాలు వెళ్ళడం ఎందుకో అర్ధం గాదు. ప్రతీ దేశంలో ఒక్కో యాక్షన్ సీనుమాత్రం అదరగొట్టేస్తారు. రష్యాలో హెలీకాప్టర్ తో  యాక్షన్ సీను, అర్జెంటీనాలో పారిపోయిన జర్మన్ నాజీకి చెందిన పురాతన కారుతో యాక్షన్ సీను లాంటివి. ఆరుకి ఆరూ యాక్షన్ సీన్సు  స్టార్స్ సెలబ్రిటీ స్టేటస్ తో పోటీ పడతాయి.

లాజిక్ కి డైలాగ్ పంచ్
     భూగర్భంలో ఈ నాజీ రహస్య బంకర్ ని యాక్సిడెంటల్ గా కనుగొన్నాక అందులో విద్యుద్దీపాలు దేదీప్యమానంగా వెలిగి పోతూండడం చూసి, బంకర్లో ఈ లైటింగ్ ఎలా సాధ్యమని మనకి డౌటు వస్తూండగానే, కరెంటు బిల్లు ప్రతీ నెలా కరెక్టుగా కడుతున్నట్టుంది - అనేస్తాడు రెనాల్డ్స్. ఇలా ప్రతీ చోటా లాజిక్ ని డైలాగులతో నవ్వించి ఎగుర గొట్టేస్తూంటారు. అయితే జలపాతం దగ్గర అద్భుత యాక్షన్ నైట్ సీను పట్ట పగలులా ఎలా వెలిగిపోతోందో డైలాగు కొట్టలేదు.

         కళా ఖండాల దొంగగా రెనాల్డ్స్ జేమ్స్ బాండ్ అడ్వెంచర్లు చేయడం ఈ యాక్షన్ కామెడీ ప్రత్యేకత. అతను అతి తెలివైన వాడు, చురుకైన వాడు. కష్ట సమయంలో కూడా డోంట్ కేర్ అన్నట్టు డైలాగులు కొట్టే రకం. నోరు తెరిస్తే కామెడీ పంచులే వస్తాయి. తన వల్ల తనతో బాటు అరెస్టయి జైల్లోపడ్డ ఎఫ్బీఐ ఆఫీసరు జాన్సన్ కి తనే దిక్కు. అలుసుగా తీసుకుని డైలాగులతో హింసిస్తూ వుంటాడు. తెలుగు డబ్బింగ్ డైలాగులు బాగా పేలాయి. జాన్సన్ కూడా డైలాగులు కొట్టడంలో తక్కువేం కాదు- జైల్లో ఫైటింగు సీను వద్దని నేను ఫీలవుతున్నాను- అంటాడొక సారి.

        చేయని నేరానికి జైల్లో పడ్డ జాన్సన్ బాధేమిటంటే, తను నిర్దోషియని నిరూపించుకోవాలంటే రెనాల్డ్స్ తో వుండక తప్పదు. క్లియోపాత్రా ఎగ్స్ ఎక్కడెక్కడెక్కడున్నాయో కనుక్కొని బయటపడాలంటే రెనాల్డ్సే దిక్కు. రెనాల్డ్స్ ఏడ్పించినా ఏడ్వక తప్పదు. దీంతో ఒకరంటే ఒకరికి పడని ఈ పోలీసు-దొంగ జోడీ ప్రయాణ కథ వినోద భరితంగానే వుంటుంది. వీళ్ళిద్దర్నీ గుప్పెట్లో పెట్టుకుని ఆడించే అసలు దొంగ గాల్ గోడాట్ హీరోయిన్ కామెడీ అదనం.

        అయితే ఎగ్స్ తో వుండాల్సిన కథే కథ కాకుండా సినిమా బోలుగా తయారైంది. వీళ్ళకి ప్రత్యర్ధిగా ఇంటర్ పోల్ ఏజెంట్ ఊర్వశీ దాస్ పాత్రలో వున్న బ్రిటిష్ నటి రీతూ ఆర్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. క్లయిమాక్స్ లో పాత తెలుగు సినిమాల్లో లాగా బిలబిలమంటూ పోలీసులతో వచ్చేసి, యూఆర్ అండర్ అరెస్ట్ అంటూ అందర్నీ పట్టుకునే లాంటి సీన్సే ఈమెకుంటాయి. ఇదొక ఆఫ్ స్క్రీన్ కామెడీ.

        రెనాల్డ్స్, జాన్సన్ లకి నాన్న లుండే వాళ్ళు. రెనాల్డ్స్ నాన్న పోలీసు అయితే తను దొంగగా మారాడు. జాన్సన్ నాన్న దొంగ అయితే తను పోలీసు అయ్యాడు. పాత్రల మధ్య ఈ ఫార్ములా డైనమిక్స్ బావున్నాయి. చిన్నప్పుడు తన వాచీ దొంగిలించాడని రెనాల్డ్స్ ని అపార్ధం జేసుకుని మాట్లాడ్డం మానేశాడు నాన్న. పెద్దయ్యాక రెనాల్డ్స్ కి ఆ వాచీ దొరికి కసి దీరా పగుల గొట్టి పారేస్తే, అందులోనే బయట పడింది మూడో ఎగ్ రహస్యం. దాంతో ప్రపంచ యాత్ర ప్రారంభించి ఈ కథకి శ్రీకారం చుట్టాడన్న మాట. కథ పట్టించుకోకుండా స్టార్ కామెడీని ఎంజాయ్ మాత్రం చేయొచ్చు ఈ హాలీవుడ్ మెగా మాస్ మూవీతో.

—సికిందర్

Thursday, November 18, 2021

1088 : రివ్యూ

దర్శకత్వం : అజయ్ భుయాన్
తారాగణం : రవి దుబే, జోయా ఆఫ్రోజ్, రవి కిషన్, పీయూష్ మిశ్రా, మధుర్ మిట్టల్, నావెద్
అస్లం. రాజేష్ శర్మా, ఋత్విక్ షోరే తదితరులు
కాన్సెప్ట్ : దేబూ పుర్కాయస్థ, కథ : నరేష్ దుబే, శివ్ సింగ్, తేజ్పాల్ రావత్, దేబూ పూర్కాయస్థ, స్క్రీన్ ప్లే: శివ్ సింగ్, మాటలు : అనుకృతీ ఝా, ఛాయాగ్రహణం : మనోజ్ రెడ్డి
బ్యానర్ : ఎమెక్స్ ప్లేయర్
నిర్మాతలు: దీపక్ ధార్, ఋషి నేగీ
విడుదల : నవంబర్ 18, 2021, ఎమెక్స్ ప్లేయర్
***
        పాపులర్ టీవీ స్టార్ రవి దుబే వెబ్ సిరీస్ మత్స్య కాండ్ సీజన్ -1 విడుదలైంది. థ్రిల్లర్ జానర్లో 11 ఎపిసోడ్ల షో ఇది. నాగ చైతన్యతో 2014 లో దడ తీసిన దర్శకుడు అజయ్ భుయాన్, రవి దుబేతో ప్రయోగాత్మక వెబ్ సిరీస్ తీశాడు. బాలీవుడ్ సహాయ నటుడు పీయూష్ మిశ్రా ఓ పాత్ర వేశాడు. భోజ్ పురి సూపర్ స్టార్ రవి కిషన్ కీలక పాత్రలో కన్పిస్తాడు. రివెంజీ దాని చుట్టూ స్కామ్స్ తో సాగే దీని కథాకథనాల నిడివి ఆరు గంటలు. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలు. ఇది పెద్దలకు మాత్రమే వెబ్ సిరీస్.  

        ఇందులో రవి దుబే ఎపిసోడ్ కొక బ్యాంగ్ తో కనిపిస్తాడు. కన్పించినప్పుడు రవి దుబే అని గుర్తుపట్ట లేనంత మాయ చేస్తాడు పాత్రలకే కాదు, ప్రేక్షకులకి కూడా. అతను మాయగాడు. పేరు మత్స్య. మాయగాడుగా అతనెలా మారాడని తెలియజేస్తూ జైలు సీనుతో ప్రారంభమవుతుంది.

        సైనికుడైన మత్స్య తండ్రి కార్గిల్ యుద్ధంలో మరణిస్తాడు. ప్రభుత్వ సాయం కింద అతడి తల్లికి పెట్రోలు బంకు కేటాయిస్తారు. ఆ పెట్రోలు బంకు తగుల బెట్టేసి జైలుకి పోతాడు మత్శ్య. జైల్లో సిబ్బంది హింసిస్తారు. తను బయటికెళ్ళి పగ దీర్చుకునే పనుంది. అందుకని  జైల్లోంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూంటాడు. జైల్లో మహాభారతం బోధించే శివో పాసకుడు ఆనంద్ పండిత్ (పీయూష్ మిశ్రా) వుంటాడు. మత్స్య బయటికెళ్తే బయటి ప్రపంచంలో ఎలా పరిస్థితుల్ని ఎదుర్కోవాలో అభిమన్యుడి కథ భోదిస్తాడు. జైల్లోంచి బయటపడ్డ మత్స్య ఇక మాయగాడుగా మారతాడు. చిటికెలో మాయచేసి దోచుకుని మాయమై పోతూంటాడు. ఈ కేసులు ఏసీపీ తేజ్ రాజ్ సింగ్ (రవి కిషన్) దృష్టికొచ్చి వేట మొదలెడతాడు. తేజ్ రాజ్ కంటే తెలివైన మత్స్య ఎత్తుకి పై ఎత్తులేసి తప్పించుకుంటూ మాయలు చేస్తూంటాడు. ఇతడ్ని తేజ్ రాజ్ ఎలా పట్టుకున్నాడన్నది మిగతా కథ.

      ఇందులో మెజీషియన్ ఊర్వశీగా జోయా ఆఫ్రోజ్ తో రవి దుబేకి రోమాన్స్ వుంటుంది. కామెడీ వుంటుంది.  రవి దుబే పగ దీర్చుకునే విలన్లు కావలసినంత మంది  వున్నారు, ఢిల్లీ, మీరట్, జైపూర్, సాంభార్లలో ఈ గ్యాంగ్ స్టర్స్ తో పగదీర్చుకునే కథకి రవి దుబే ప్రత్యేక ఆకర్షణ. టీవీ సీరియల్స్ తో సాఫ్ట్ రోల్స్ లో కన్పించే ఇతను ఇంత హార్డ్ కోర్ క్రిమినల్ పాత్ర వేసి ఆశ్చర్య పరుస్తాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ బ్యాగేజ్, యాక్షన్ సిల్స్ లో పూర్తిగా కొత్త రవి దుబే ప్రత్యక్షమవడం ఒకెత్తయితే, మాయగాడుగా ఎపిసోడ్ కొక మారు వేషం వేయడం ఒకెత్తు. 11 ఎపిసోడ్లలో 11 మారు వేషాల్లో కన్పిస్తాడు. కన్పించినప్పుడల్లా గుర్తు పట్టలేనంత మాయ చేస్తాడు, థ్రిల్ చేస్తాడు  మనల్ని. ఈ క్రెడిట్ మేకప్ డిపార్ట్ మెంట్ నరేంద్ర ఝెట్వా, మేఘనా సకట్ లకి పోతుంది.     

    గ్యాంగ్ స్టర్స్ మీద పగ దీర్చుకునే రక్త దాహ పాత్ర  రవి దుబేది. మాయలు చేసి అనూహ్య సంఘటనలు సృష్టిస్తూనే, ఎక్కడా తనని పట్టించే ఆధారం వదలని మాస్టర్ క్రిమినల్ గా పాత్రని తీర్చిదిద్దిన తీరుకి క్రెడిట్ రచయితలకి పోతుంది. అలాగే ఏసీపీ గా రవికిషన్ పాత్ర కూడా. కర్కోటకుడైన బ్యాడ్ పోలీసు పాత్ర. ఇతడికీ, ఇతను పట్టుకోవాల్సిన రవి దుబేకీ మధ్యే ఈ ఎపిసోడ్లు కాబట్టి, ఇద్దరి ఎలుకా పిల్లీ చెలగాటపు కథనాన్ని హైలైట్ చేస్తూ కాన్సెప్ట్ ని నిలబెట్టారు.

        గ్యాంగ్ స్టర్స్ తో వెబ్ సిరీస్ అంటేనే ఆయుధాలు, హత్యలు, బూతులూ కాబట్టి ఇవి ఇందులోనూ వున్నాయి. పాత్రలు బండ బూతులు తిడితే తప్ప ఇలాటి వెబ్ సిరీస్ కి నిండుదనం రాదన్నట్టు ప్రేక్షకులకి పళ్ళెంలో పెట్టి అందిస్తున్నారు. ఈ సిరీస్ చూస్తూంటే ఇందులోని బండ బూతులు మన ఇంటి నిండా ప్రతిధ్వనించి దరిద్రంగా వుంటుంది ఇల్లు. ఈ బూతులు తాకిన గోడలు మలినమైపోతాయి.

        అజయ్ భుయాన్ దర్శకత్వమెలా వున్నా పదకొండు మారువేషాలనే యూఎస్పీ ఎపిసోడ్స్ ని నిలబెట్టింది. దర్శకత్వం మీద మన దృష్టి పడనంతగా రవి దుబే ఈ మారు వేషాలతో కమ్మేస్తాడు. నాల్గు నగరాల లొకేషన్స్ మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణంలో బావున్నాయి. ఇండోర్స్ కి డార్క్ లైటింగ్ చేశారు. మిస్టరీ, థ్రిల్, డ్రామా ప్రధానంగా ఈ సిరీస్ మొదటి రెండు ఎపిసోడ్లు కదలని కథతో ఆసక్తికరంగా వుండవు. మిగిలిన ఎపిసోడ్స్ గేమ్ అందుకుని వేగం పుంజుకుంటాయి.

—సికిందర్


 

Wednesday, November 17, 2021

1087 : ఓటీటీ న్యూస్



       లయాళ సినిమా రంగం - మాలీవుడ్- ఇవాళ ప్రేక్షకుల భాషే  సినిమా అన్నట్టుగా నాడీ పట్టుకుని ఓటీటీతో విశేషంగా లాభపడుతోంది. భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షక లోకాల్ని సొంతం చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. సినిమా బావుంటే ఏ భాష అనేది ప్రేక్షకులు చూడరు. వాళ్ళ భాషే సినిమా అయిపోతుంది. ఈ కొత్త నిర్వచనాన్ని పట్టుకుని భాషల కతీతంగా ద్వారాలు తెరిచిన ఓటీటీ విప్లవంలో పాలు పంచుకుంటూ కళకళ లాడుతున్నారు మలయాళ దర్శకులు, నిర్మాతలూ.

        ది తెలుగులో జరగాలంటే తెలుగులో ఇంకా చిన్న సినిమాలు ప్రయత్నించే కొత్త దర్శకులైనా పాత మూస ఫార్ములాల లోంచి బయటికి రావాలి. థియేటర్ సినిమాలకి మూస సినిమాలు ఒక విధంగా అవసరం కావొచ్చు. కానీ తీస్తున్న చిన్న సినిమాల క్వాలిటీకి థియేటర్ అనేది ప్రేక్షకులు తొంగి చూడరాని కర్ఫ్యూ ప్రాంతమైంది. ఆ చిన్న సినిమాలు ప్రేక్షకుల మీద లాఠీ చార్జో, ఫైరింగో జరుపుతాయని ప్రేక్షకుల భయం. ఓటీటీ విప్లవం సినిమా నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రత్యామ్నాయం చూపిస్తున్నా, చిన్న సినిమాల ధోరణి మారకపోవడంతో, ఇటు థియేటర్ కీ అటు ఓటీటీకీ పనికి రాకుండా పోతున్నాయి చిన్న సినిమాలు. పెద్ద సినిమాలకంటే తీసే చిన్న సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. ఇవన్నీ రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నాయి.


        ఇతర భాషల సినిమా రంగాల కన్నా మలయాళ రంగం లేదా మాలీవుడ్ ఓటీటీ మార్కెట్ ని పట్టుకుని అభివృద్ధి పథంలో దూసుకు పోతోంది. మలయాళ మేకర్లు ఎంపిక చేసుకుంటున్న జానర్లు, వాటికి నాణ్యమైన సబ్ టైటిల్స్, వీటికి పెరిగిన ఇంటర్నెట్  స్పీడూ తోడై మలయాళం సినిమాల్ని టాప్ లో వుంచుతున్నాయి. 2020 కి పూర్వం మలయాళ సినిమాల్ని చూడని ప్రేక్షకులు కోవిడ్ లాక్ డౌన్స్ తో ఓటీటీకి అలవాటయ్యాక మలయాళ సినిమాలు ప్రధానంగా దృష్టి నాకర్షించాయి. ఈ ఆకర్షణే పెరుగుతూ పోతే వివిధ ఓటీటీల్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలంటే మలయాళ సినిమాలేనని పేరు తెచ్చుకోవడాని కెంతో కాలం పట్టదని పరిశీలకులు అంటున్నారు.

        తెలుగులో చిన్న సినిమాలు తీసినా అవి పెద్ద సినిమాల మసాలాలతోనే తీయడాన్ని ఎంతో అమితంగా కోరుకుని ప్రేమిస్తారు దర్శకులు, నిర్మాతలూ. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్లకీ, ఓటీటీ బాసులకీ తేడా వుంది. డిస్ట్రిబ్యూటర్లు మసాలా సినిమాలు కోరుకుంటారు. ఓటీటీ బాసులు వాస్తవికతని కోరుకుంటారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమాల్ని కోరుకుంటే, ఓటీటీ బాసులు జీవితాల్ని కోరుకుంటారు. నార్మల్ కమర్షియల్ థియేట్రికల్ ఫార్మాట్ ని ఫాలో కారు. ఓటీటీకి అలవాటు పడుతున్న ప్రేక్షకులు కూడా ఇక జీవితాల్నే కోరుకుంటున్నారు. ఈ నాడీ పట్టున్నారు మలయాళ మేకర్లు. వాళ్ళు జీవితాలకి నేటివిటీని కలిపి చూపిస్తూ ఓటీటీల్లో టాప్ బిజినెస్ చేసుకుంటున్నారు.


        తెలుగులో చిన్న సినిమాల క్వాలిటీకి థియేటర్లో ప్రేక్షకులుండరు, ఓటీటీల్లో ఎవరూ కొనరు. థియేటర్లలో విడుదల చేయడానికి బయ్యర్లూ వుండరు. నిర్మాతే విడుదల చేసుకోవాలి. అన్నిసెంటర్లలో విడుదల చేసుకోలేరు. మల్టీ ప్లెక్సులో ఒక షో వేస్తారు. రెండో రోజు చూసి ఎత్తేస్తారు. ఎక్కడ్నించీ నయాపైసా రాదు.

        ఫీచర్ ఫిలిమ్ ఫార్మాట్ లో ఒదగని ఐడియాలెన్నో వున్నాయి. స్టోరీ టెల్లింగ్ విధానాన్నే ఓటీటీ పూర్తిగా మార్చేయడంతో ఆ ఐడియాలు ఇక్కడ వర్కౌట్ అవుతాయి అంటూ మణిరత్నం సైతం అంటున్నారు. కేపిఎంజి -2018 నివేదిక ప్రకారం 2023 కల్లా దేశంలో ఓటీటీ చందాదార్లు 45 శాతానికి పెరిగి, 138 బిలియన్ రూపాయల మార్కెట్ గా అవతరించబోతోంది. ఇది సినిమాలని ఆధారంగా జేసుకునే. ఇది మాకవసరం లేదని అవే మూసలు తీసుకుంటూ మోసపోతామంటే ఎవరూ కాదనరు.
***

Tuesday, November 16, 2021

1086 : ఆర్టికల్

 

      19 వ తేదీ శుక్రవారం 9 సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాల్ని ఉత్పత్తి చేయడంలో టాలీవుడ్ సామర్ధ్యం తక్కువేమీ కాదు, ఈ సామర్ధ్యంతో ప్రేక్షకులే పోటీ పడాలి. పోటీ పడి చూడకపోతే ఓటమి వాళ్ళదే. పెద్ద సినిమాలైతేనే చూస్తాం, చిన్న సినిమాల్ని పట్టించుకోమంటే చిన్న సినిమాలేమైపోవాలి. చిన్న సినిమాల్ని కూడా ప్రోత్సహించాలి. ప్రోత్సహించినప్పుడే చిన్న సినిమాల్ని ఇంకా ఇంకా బాగా తీస్తారు. కొత్త నిర్మాతలు, దర్శకులు, నటులూ, సాంకేతికులూ ఇంకెందరో వస్తారు. ప్రజలు ఎక్కువ తినేది శాఖాహారమే, సినిమాలు ఎక్కువ నిర్మించేది చిన్న సినిమాలే. చిన్న సినిమాలు శాఖాహారం, పెద్ద సినిమాలు నాన్ వెజ్. ఓటీటీల్లో ఎక్కడెక్కడి సినిమాలు చూసి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం కాదు, ఇక్కడి చిన్న చిన్న తెలుగు సినిమాల్ని కూడా థియేటర్లలో చూసి మంచి చెడ్డలు కామెంట్లు పెడితే తెలుగు సినిమాల అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళవుతారు. తెలుగు సినిమాల్ని వదిలేసి ఎక్కడివో సినిమాల్ని పొగడడమేమిటి?

        వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో 9 చిన్న సినిమాలకి అవకాశం చిక్కింది. ఊరికి ఉత్తరాన, మిస్సింగ్, స్ట్రీట్ లైట్, పోస్టర్, మిస్టర్ లోన్లీ, రామ్ అసుర్, రావణ లంక, ఛలో ప్రేమిద్దాం, సావిత్రి వైవ్ ఆఫ్ సత్యమూర్తి ఇవన్నీ విభిన్న జానర్లు. లవ్, సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ. నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లూ అందరూ కొత్త వాళ్ళు. ప్రేక్షకుల ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారు.

***

 

Monday, November 15, 2021

1085 : ఆర్టికల్

 

        కోవిడ్ మహమ్మారి కాలంలో వినోద పరిశ్రమలో పాగావేసి పాతుకుపోయిన ఓటీటీ కంపెనీలు వివిధ భాషల సినిమాల్ని కొని సార్వజనీనం చేస్తూంటే, ఇంకా రీమేకులు అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓటీటీల్లో ఒక భాషలో కొన్న సినిమాల్ని సబ్ టైటిల్స్ వేసి ప్రపంచ వ్యాప్తంగా ఇతర భాషల వారికి అందుబాటులో వుంచుతున్నప్పుడు రీమేకులు అవసరం లేదనే అనాలి.

        కానీ రీమేకులు చేయకపోతే బాలీవుడ్ కి మనుగడ లేనట్టు తయారైంది పరిస్తితి. దక్షిణ సినిమాల రీమేకుల మీద భారీగా ఆధారపడ్డ బాలీవుడ్, ఓటీటీ ట్రెండ్ లోనూ రీమేకులకి వెనుకడుగు వెయ్యడం లేదు. జెర్సీ, హిట్, మాస్టర్, సూరరై పొట్రు, విక్రమ్ వేదా, ఖైదీ, రాట్ససన్, అల వైకుంఠ పురంలో, ఎఫ్2, క్రాక్, నాంది, బ్రోచేవారెవరూరా ...ఇవి కొన్ని మాత్రమే హిందీలోకి రీమేక్ చేస్తున్న తెలుగు, తమిళ సినిమాలు. ఇవన్నీ వివిధ ఓటీటీల్లో విడుదలైనవే. హిందీ రీమేకులుగా ఇవి మళ్ళీ ఓటీటీల్లో దర్శమిస్తాయి.

        అలాగే అయ్యప్పనుం కోషియమ్, లూసిఫర్, కప్పెలా, డ్రైవింగ్ లైసెన్స్, హెలెన్ మొదలైన ఓటీటీల్లో విడుదలైన మలయాళ సినిమాలు తెలుగులో రీమేకవుతున్నాయి. ఓటీటీలో విడుదలైన హిందీ అంధాధున్ కూడా తెలుగులోనూ (మాస్టర్), మలయాళంలోనూ రీమేక్ అయింది. తమిళ అసురన్ కూడా తెలుగులో నారప్పగా రీమేక్ అయింది. అయితే నారప్ప లాక్ డౌన్ కాలంలో థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీలో విడుదలైంది. అసురన్ ని విడుదల చేసిన అమెజానే నారప్పని కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసింది.

        ఓటీటీ కంపెనీలు గానీ, రీమేకులు చేసే నిర్మాతలుగానీ రీమేకులు అవసరమా అని ఆలోచించడం లేదు, ప్రేక్షకులే విసిగిపోయి ప్రశ్నిస్తున్నారు. మేం థియేటర్లోనో ఓటీటీల్లోనో చూసేసిన సినిమాల్ని రీమేక్ చేసి మళ్ళీ థియేటర్లలో, ఓటీటీల్లో వేస్తే ఎలా చూడాలని విమర్శిస్తున్నారు. మేం చందాలు కట్టింది ఓటీటీల్లో చూసిన సినిమాల రీమేకులు మళ్ళీ ఓటీటీల్లో చూడ్డానికేనా అని విరుచుకు పడుతున్నారు. ఇవే ప్రశ్నలు వేస్తూ ప్రింట్, వెబ్ మీడియాల్లో ఆర్టికల్స్ కూడా రాస్త్తున్నారు సినిమా జర్నలిస్టులు.

        ఇదేం పట్టించుకోకుండా నిర్మాతలు, ఓటీటీలు తమపని తాము చేసుకుపోతున్నారు. కానీ మలయాళ రంగం దాని ప్రత్యేకతని అది చాటుకుంటోంది, ఎన్నో మలయాళ సినిమాలు ఇతర భాషల్లో రీమేకవుతున్నా, ఏ ఇతర భాషల సినిమాల్నీ మలయాళ రంగం రీమేక్ ఛేయడం లేదు. తమదైన ఒరిజినల్ కంటెంట్ తోనే సినిమాలు తీస్తున్నారు. ఓటీటీలకి, రీమేకులకి అమ్ముకుంటున్నారు. ఇలా మలయాళ పరిశ్రమలోకి బయటి నుంచి డబ్బులు రావడమేగానీ, మలయాళ పరిశ్రమలోంచి డబ్బులు బయటికి పోవడం జరగడం లేదు. ఈ బిజినెస్ మోడల్ని ఇతరులూ అనుసరిస్తే ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు వస్తాయి. క్వాలిటీ కూడా పెరుగుతుంది.  
***

 

Sunday, November 14, 2021

1084 : సందేహాలు -సమాధానాలు



 Q : చెప్పొద్దు, చూపించాలి’ సిరీస్ చాలా బాగుంది. రాస్తున్నప్పుడు టెక్నికల్ గా చాలా విషయాలు గుర్తు పెట్టుకునేలా వివరంగా చెప్పినందుకు థాంక్స్. నేను ఒక వెబ్ సిరీస్ కు రాస్తున్నప్పుడు వ్యాన్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కు కొత్తగా పెళ్ళి అయ్యిందనే విషయాన్ని బానెట్ మీద ఒక మల్లె పూల పొట్లం పెట్టి ఎస్టాబ్లిష్  చేసి, అతను త్వరగా ఇంటికి వెళ్ళే తొందరలో  ఉన్నాడని డైలాగ్స్ ద్వారా చెప్పించాను. ఈ  విషయంలో డైరెక్టర్ గారు బాగా అప్రిషియేట్ చేశారు.

        చెప్పొద్దు, చూపించాలి-2 లో మీరు రాసిన కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీనును ఇలా చెప్పొచ్చేమో.. వ్యాను స్తంభానికి గుద్దుకున్న షాట్, పక్కనే డ్రైవర్ రక్తంలో తీవ్ర గాయాలతో పడి ఉండడం..వ్యాన్  నుండి రక్తం ధారగా కారుతూ ఉంటే, బ్యాక్ గ్రౌండ్ లో కోళ్ళ అరుపుల శబ్దం.. వ్యాను మీద కోళ్ళ ఫారం కు సంబంధించిన లోగో...
—జయసింహా, రచయిత

A : చెప్పొద్దు, చూపించాలి సిరీస్ నచ్చినందుకు థాంక్స్. మీరు చెప్పిన వెబ్ సిరీస్ సీనుకి స్టోరీ మేకింగ్ చేసి దర్శకుడి మెప్పు పొందడం మంచి విషయం, అభినందనలు. ఐతే ఒక అనుమానం, కొత్తగా పెళ్ళయితేనే పూలు తీసికెళ్తారా? పాత సంసారానికి తీసికెళ్ళరా? పెళ్ళాం మీద ప్రేమ కొత్తలోనే వుంటుందా? కనుక వ్యాను బానెట్ మీద అలా మల్లె పూల పొట్లం వుంచితే కొత్తగా పెళ్ళయిందనే అర్ధమే వస్తోందా, లేక విపరీత అర్ధాలొస్తున్నాయా ఆలోచించండి. ఆ డ్రైవర్ ది పాపం పాత సంసారమే కావొచ్చు. కొత్త సంసారానికి డ్రైవరు త్వరగా ఇంటికెళ్ళాలను కోవడం వ్యాను యజమాని లేదా ఎవరైతే వాళ్ళకి, కామన్ గానే  అన్పించే విషయం. ఇందులో నీతి లేదు, డ్రైవర్ క్యారక్టర్ ఏమీ లేదు.

        కానీ పాత సంసారానికే త్వరగా వెళ్ళాలను కుంటున్నాడంటే అది గొప్ప విషయం, ఇందుకు గౌరవం పెరుగుతుంది డ్రైవర్ మీద. ఇది నీతి, ఇది క్యారక్టర్. ఈ క్యారక్టర్ యజమానికే ప్రశ్నలా కూడా వుంటుంది- తను ఇలా వుంటున్నాడా అన్న ప్రశ్న. అప్పుడిది కేవలం డ్రైవర్ యాక్షన్ సీనుగా కాకుండా, యజమాని రియాక్షన్ సీనుగా డెప్త్ పెంచుకుంటుంది. ఎప్పుడైతే సీను రియాక్షన్ నిస్తుందో అప్పుడు పాసివ్ సీనుగా వుండదు, యాక్టివ్ సీనుగా మారి ఉత్సాహాన్నిస్తుంది. ప్రేమని కొత్త పెళ్ళి, పాత సంసారమని కాలాల్లో బంధించకండి. దానికి కాలం లేదు, అది నిరంతరం. సినిమా క్వాలిటీని వెబ్ సిరీస్ కివ్వకుండా వుంటే బావుంటుందేమో. ఎందుకంటే వెబ్ సిరీస్ కి మంచి క్వాలిటీ ఇవ్వడానికి అడ్డంకులుండవు.

          ఇక చెప్పొద్దు, చూపించాలి-2 లో కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీను సంగతి. ఇందులోనే వివరించినట్టు, ఈ సీనుని లీ చైల్డ్ నవలల్లో రాసే స్లో యాక్షన్- హైడ్రామా ప్రకారం వుంచాం. దీన్నింకా వివరంగా చెప్పుకుందాం : ఈ ప్రక్రియలో శిల్పం ఏమిటంటే పరిస్థితిని తక్షణం వెల్లడించక పోవడం. ఒక్కొక్కటి విప్పి చూపిస్తూ (అంటే స్లో యాక్షన్), సస్పెన్స్ (అంటే హై డ్రామా) ని పెంచడం.

        అందుకని వ్యాను స్తంభానికి గుద్దుకున్నాక ఏం జరిగిందీ పరిస్థితిని వెంటనే చూపించి సీను తేల్చెయ్యకుండా, సస్పెన్స్ లో వుంచేసి కట్ చేసి, ఓపెన్ చేస్తే - డ్రైవరు మూల్గుతూ రోడ్డు పక్కన కూర్చుని వుంటాడు. ఈ షాట్ లో వ్యాను పరిస్థితి ఏంటనే ప్రశ్న లేదా సస్పెన్స్ వుంటుంది. ఇంతలో క్లీనరు అనుకుందాం, ఇదే షాట్లోకి ఎంటరై, సెల్ ఫోన్లో తీసిన ఫోటోలు చూపిస్తూంటాడు. వ్యాను ముందు భాగం నుజ్జయిన ఫోటోలు. సరే, మరి కోళ్ళు ఏమయ్యాయన్న మరో ప్రశ్న లేదా సస్పెన్స్.  అప్పుడు ఇదే షాట్ లో క్లీనర్ చేతిలో రెండు చచ్చిన కోళ్ళు రివీలవుతాయి...ఇదీ ఈ సీనుకి శిల్పం చెక్కిన విధానం. లో - బడ్జెట్లో తీయడానికి స్లో యాక్షన్ -హై డ్రామా సీను విధానం.

        హై బడ్జెట్ కి మీరు రాసినట్టు వుంటే బాగానే వుంటుంది. వ్యాను స్తంభానికి గుద్దుకున్న షాట్, పక్కనే డ్రైవర్ రక్తంలో తీవ్ర గాయాలతో పడి వుండడం, వ్యాన్  నుంచి రక్తం ధారగా కారుతూ వుంటే, బ్యాక్ గ్రౌండ్ లో కోళ్ళ అరుపుల శబ్దం, ఇంకెంతైనా బీభత్సం. వీటిలో వ్యాను మీద కోళ్ళ ఫారంకి సంబంధించిన లోగో అవసరం లేదు. అది కోళ్ళ వ్యాను అని వస్తున్నప్పుడే తెలిసిపోతుంది.

        అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, sensitivities నిహై బడ్జెట్స్ యాక్షన్ సీన్స్ లో sensitivities కి అంత ప్రాధాన్యం వుండదు. ఒకేసారి బ్యాంగ్ ఇచ్చి మొత్తం బీభత్స దృశ్యమంతా బడ్జెట్ వెదజల్లి ఒకేసారి చూపించెయ్యడం. కానీ సస్పెన్స్  బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఏమంటాడంటే There is no terror in the bang, only in the anticipation of it -అంటాడు.

        అంటే సంఘటనకి ఒకేసారి బ్యాంగ్ ఇచ్చేస్తే టెర్రర్ ఫీలింగ్ వుండదని, ఏదో జరగబోతోందని ముందునుంచీ అన్పిస్తూంటే ఆ బ్యాంగ్ కి మంచి ఇంపాక్ట్ వుంటుందని అంటున్నాడు. ఇందుకే వ్యాను స్తంభనికి గుద్దుకున్న షాట్ తీసి, వ్యాను ముందు భాగం నుజ్జయింది కూడా చూపించకుండా కట్ చేసి, రోడ్డు పక్క డ్రైవర్ మూల్గుటూ కూర్చున్న రెండో షాట్ వేస్తే, అసలేమైందన్న సస్పెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు అంచెలంచెలుగా సంఘటన వివరాల్ని క్లీనర్ చేత రివీల్ చేయిస్తూ - చివరికి చచ్చిన కోళ్ళు చూపిస్తే -ఈ విధంగా డెవలప్ అవుతూ వచ్చిన ముగింపుకి ఇంపాక్ట్ వుంటుంది.

        డ్రైవర్ కి గాయాలూ రక్తాలూ బిగ్ బడ్జెట్స్ వ్యవహారం. డ్రైవర్ కి రక్తాలూ గాయాలకి సంబంధించిన ప్రోస్థెటిక్స్ మేకప్ అవసరం.  లో- బడ్జెట్ అనుకున్నప్పుడు పైన చెప్పుకున్న విధంగా చూపిస్తే ఈ అవసరం తప్పుతుంది. లొకేషన్లో డ్రైవర్ కి ప్రోస్థెటిక్ మేకప్ అంతా చేసి, షాట్ తీసే సమయం, ఖర్చూ తగ్గుతాయి. కేవలం రెండు షాట్స్ లో ఈ సీను క్లుప్తంగా, బలంగా తీయవచ్చు.

        ఇంకోటేమిటంటే, ఈ సంఘటనలో sensitivities ని దృష్టిలో పెట్టుకోవడం అవసరం. ఇక్కడ డ్రైవర్ గాయపడి నందుకు బాధ కలగాలా, లేక కోళ్ళు చచ్చిపోయినందుకు బాధ కలగాలా? ఖచ్చితంగా మూగజీవులు చచ్చిపోయినందుకు బాధ కలగాలి. వ్యానులో కోళ్ళు ఎవరి చేతిలో చికెన్ గా మారి, ఎవరెవరి కడుపుల్లోకి పోతాయన్నది తర్వాతి సంగతి, ముందవి  డ్రైవర్ చేతిలో ప్రాణాలు పెట్టి కూర్చున్నాయి. డ్రైవరేమో యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీశాడు. అందుకని చచ్చిన కోళ్ళని చూసి అయ్యో పాపం అన్పించాలంటే డ్రైవర్ గాయపడ కూడదు. సీనులో వున్న సింపతీ ఫ్యాక్టర్ రెండుగా చీలిపోయి ఇంపాక్ట్ పోతుంది. ఒక షాటులో ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే డీఎన్ఏ కరెక్టుగా వుండి కథకి నిండుదనం వస్తుంది.

        హిచ్ కాక్ బిగ్ బడ్జెట్స్ తీయలేదు. అందుకే స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ కోసం కాగితాల మీద 90 శాతం రాత పని చేసీ చేసీ, 10 శాతం దర్శకత్వం చేసే వాడు. మనం 10 శాతం రాత పని చేసేసి, 90 శాతం దర్శకత్వం చేస్తూ చేస్తూ వుంటాం. రాతలో ఏమీ లేని దానికి. స్మాల్ ఈజ్ హారిబుల్!

Q :  నేను పుష్పక విమానం చూశాను. ఇందులో ఆనంద్ దేవరకొండ క్యారక్టర్ గ్రోత్ కన్పించలేదు నాకు. సినిమాలో ఇతర  లోపాలు ఏమైనా వుంటే సరిచేసినా, క్యారక్టర్ ఇలా గ్రోత్ లేకుండా వుంటే సరిపోతుందా?
—కె. రమేష్, అసోషియేట్

A :   ఆ పాత్ర ప్రభుత్వ లెక్కల టీచర్. కానీ జీవితాన్ని లెక్కించడం తెలీదు. ఇదలా వుంచితే ప్రభుత్వ స్కూల్లో పిల్లలకేం ఉపయోగపడుతున్నాడో ఒక్క సీనూ లేదు. ఓపెన్ గ్రౌండ్ లో చెట్ల కింద టేబుల్ కుర్చీ లేసుకుని, సహ టీచర్లతో కలిసి కూర్చుని, పిల్లల ముందు లంచ్ ని పిక్నిక్ లా ఎంజాయ్ చేయడం తెలుసు. మధ్యాహ్న భోజన పథకాన్ని తామే ఆరగిస్తున్నట్టు. ఇవే సీన్లు రెండు మూడున్నాయి. లోకల్ లీడర్లు వీళ్ళని పట్టుకుని లోపలేయిస్తే సరి.

        ఇదలా వుంచితే, కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్య ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోవడం ఎవరికైనా తెలిస్తే పరువు తక్కువనుకుని, ఈ విషయం దాచి పెట్టడమే ముఖ్యమన్నట్టు భార్య వున్నట్టే నటిస్తూంటాడు. ఇక్కడే లెక్కల మాస్టారికి జీవితాన్ని లెక్కించడం తెలియలేదు. భార్యని పరువు కోసమే ఇంట్లో పెట్టుకుంటాడా? అంతకి మించి తన జీవితంలో ఆమెకి స్థానం లేదా? ఆమె అమెజాన్లో తెప్పించుకున్న ఫోర్ స్టార్, ఫ్రాస్ట్ ఫ్రీ, కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటరా?

       \పాత్రకి స్ట్రగుల్స్ రెండుంటాయి: ఔటర్ స్ట్రగుల్, ఇన్నర్ స్ట్రగుల్. బయట పరిస్థితుల్ని ఎదుర్కొనే ఫిజికల్ యాక్షన్, లోపల మనసులో సంఘర్షించే ఎమోషనల్ యాక్షన్. భార్య లోకానికి భార్యే, కానీ తనకి జీవిత భాగస్వామి. బయట పరువుకోసం ప్రాకులాడ వచ్చు, కానీ ఎప్పటికైనా, బయటి పరిస్థితుల మీద పట్టు సాధించాకైనా, భార్య పట్ల అనురాగాన్ని గుర్తు చేసుకుని, ఆ ఫీల్ తో ఆమె కోసం సంఘర్షించే ఎమోషనల్ యాక్షన్ లేకపోవడం పాత్ర గ్రోత్ లేకుండా నిర్జీవంగా తయారు చేసింది. పాత్ర గ్రోత్ లేకుండా కథ వుండదు.

Q :  షాట్స్ గురించి మారు రాసిన ఆర్టికల్స్ చదివితే నాకు ఒకటి స్ఫురిస్తోంది. షాట్స్ లో గుప్తంగా కూడా కథ చెప్పవచ్చా? ఇలాటి ఉదాహరణ లుంటే ఇస్తారా?
—జేడీ స్వామి, కో డైరెక్టర్

A : అద్భుత కొరియన్ రోమాంటిక్ డ్రామా ది క్లాసిక్ లో టైటిల్స్ లోనే గుప్తంగా కథ చెప్పడం వుంది సింబాలిక్ గా. దీన్ని విశ్లేషిస్తూ గతంలో రాసిన ఆర్టికల్లోని భాగం చూడండి - ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతిఆ తర్వాత ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివరమహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు...

        ఈ చిత్రణ ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు – దేని అస్తమయాన్నిఅక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే. ఇలా ఈ ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. 

        ఒక అస్తమయంతో ఇంకో సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరంఒక ద్వంద్వం ... బావుంది కదూ?

        ఇలాగే కోయెన్ బ్రదర్స్  తీసిన క్లాసిక్ న్యూ నోయర్ జానర్ మూవీ బ్లడ్ సింపుల్ విశ్లేషణా వ్యాసాలు వున్నాయి. సాంతం ఎన్ని సింబాలిజాలతో ఎన్ని గుప్త కథలు ఎలా చెప్పారో మీ అధ్యయనానికి పనికొస్తాయి. బ్లడ్ సింపుల్ అని బ్లాగు సెర్చి బ్లాక్సులో తెలుగులో టైపు చేయండి, ఆర్టికల్స్ డిస్ ప్లే అవుతాయి.

—సికిందర్