రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 24, 2017

     డార్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ఫిలిం నోయర్సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలేనని కూడా చెప్పుకున్నాం. 1930 లలో అమెరికాలో ఆర్ధిక మాంద్యం రేపిన కల్లోల నేపధ్యంలో ఈ రకమైన నేరపూరిత కథలతో ఫిలిం నోయర్ అనే జానర్ ప్రారంభమయిందని కూడా గుర్తు చేసుకున్నాం. సమాజంతో- ఆ సమాజంలో వుండే ప్రేక్షకులతో  ముడిపెట్టకుండా హాలీవుడ్ కూడా మనం అనుకరిస్తున్న కమర్షియల్  సినిమాలు తీయలేదని  తెలుసుకున్నాం. ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో ఆర్ధిక రంగ పురోభివృద్ధి నేపధ్యంలో  పెరిగిపోతున్న నేర మనస్తత్వాల్ని బయట పెట్టే  డార్క్ మూవీస్ జానర్ వైపు తెలుగు మేకర్లు కన్నెత్తి చూడ్డం లేదనికూడా విచారపడ్డాం. ఇంకే సీరియస్ సినిమాకీ లేని  ప్రేక్షకుల్నికూర్చోబెట్టగలిగే శక్తి ఒక్క డార్క్ మూవీస్ కే  వుందని సోదాహరణంగా అర్ధం జేసుకున్నాం.  ఈ పని తెలుగులోకి వచ్చేసి తమిళ, మలయాళ డబ్బింగులు పూర్తి చేస్తున్నాయని కూడా చెప్పుకున్నాం. తెలుగు మేకర్లు మాత్రం ఇంకా వారం వారం అవే ప్రేమపురాణాలు, అవే దెయ్యాల అరుపులూ  చూపిస్తూ  కాలక్షేపం చేస్తున్నారని కూడా బాధపడ్డాం. ఇప్పుడొక వేళ తమిళులు తీస్తే నేను తీయలేనా అని తెలుగు మేకర్ ఎవరైనా డార్క్ మూవీకి సమకట్టి ప్రేమలూ దెయ్యాల ముచ్చట్లకి తెర దించే ప్రయత్నం చేశాడే అనుకుందాం- అప్పుడతను ఏం తీయవచ్చు? బ్రహ్మాండంగా  డార్క్ మూవీ తీస్తున్నాననుకుని భీకర యాక్షన్ మూవీ తీసి పడేస్తే?  రోమాంటిక్ కామెడీలు తీస్తున్నాననుకుంటూ రోమాంటిక్ డ్రామాలు తీసి దెబ్బతిన్న రక్తమే కదా? అలాగే ఇదీ!

          ఇందుకే డార్క్ మూవీ జానర్ మర్యాదలేంటో  తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. తీసే సినిమాల కోసం స్క్రీన్ ప్లే సూత్రాలు అక్కర్లేదనుకున్నా అభ్యంతరం లేదు-  ఎవరికెలా తోస్తే అలా తీసి ఫ్లాప్ చేసుకోవచ్చు - కనీసం జానర్ తేడాలేమిటో కూడా తెలీక సినిమాలు తీయడానికి సాహసించడం మాత్రం తెలివితక్కువ తనమే. ఇడ్లీ, వడ రెండిటి తయారీ విధానం ఒకటి కాదు. ఇడ్లీ పిండిని  సలసల కాగే నూనెలో వేసి వడ తయారు చేయరు. యాక్షన్ మూవీ నూనెలో డార్క్ మూవీ కథ వేస్తే కూడా మిగిలేది మసే. ఆ మసి డార్క్ గానే వుంటుంది. అప్పుడది మసైన డార్క్ మూవీ అయి థియేటర్ల దగ్గర ప్రేక్షకులకి మసి పూసి పంపుతుంది. తమిళ, మలయాళ డార్క్ మూవీసేమో  అత్తరు పూస్తూ ఆనందింప జేస్తూంటాయి. 

       యాక్షన్ మూవీస్ తో,  సస్పెన్స్ థ్రిల్లర్స్ తో పూర్తిగా విభేదిస్తుంది డార్క్ మూవీ జానర్.  1930 ల నుంచీ 50 ల వరకూ తెలుపు నలుపు సినిమాల కాలంలో వచ్చిన ఫిలిం నోయర్ సినిమాల్ని క్లాసిక్ నోయర్ అంటారు. అది వాటికి  స్వర్ణయుగం. కలర్ ఫిలిం తో 1960 లనుంచి ఇదే క్లాసిక్ నోయర్ నియో నోయర్ గా ఆధునికీకరణ చెంది, ఇప్పటి దాకా ఇదే  కొనసాగుతోంది. మనకు దక్షిణ భాషల్లో ‘నోయర్’ సినిమాలు పెద్దగా లేవు. తమిళంలో మొదటి పక్కా నియో నోయర్ సినిమాగా ‘అరణ్యకాండం’ 2011లో చరిత్ర కెక్కింది. దీనికి ఐదు కోట్లు పెడితే ఏడు  కోట్లు వచ్చాయి. దీని దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజాకి ఉత్తమ కొత్త దర్శకుడుగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఉత్తమ ఎడిటింగ్ కి కూడా దీనికి జాతీయ అవార్డు లభించింది. తెలుగులో యాక్షన్ – సస్పెన్స్ థ్రిల్లర్స్ తప్ప నోయర్ సినిమాల జాడ ఇప్పటికీ లేదు.  

          అయితే 1971 లో కృష్ణ- గుమ్మడిలు నటించిన ‘నేనూ మనిషినే’ వుంది బ్లాక్ అండ్ వైట్ లో. దీని దర్శకుడు జివిఆర్ శేషగిరిరావు. దీంట్లో  కనీసం ‘కథాపరంగా’ నోయర్ సినిమా లక్షణాలన్నీ కన్పిస్తాయి (నోయర్ సినిమాలకి   కథాపరమైన హంగులు, చిత్రీకరణ పరమైన హంగులు అని రెండుంటాయి) గుమ్మడి పాత్ర, వస్త్రధారణ, ధూమపానం మొదలైనవి క్లాసిక్ నోయర్ సినిమాల రీతుల్ని పట్టిస్తాయి. జడ్జి పాత్రలో ఆయన హత్య చేయడం, పోలీసు అధికారి పాత్రలో కృష్ణ నేరపరిశోధన చేయడం- ఆ నేర పరిశోధనలో అప్పట్లోనే తుపాకీ గుళ్ళ బాలస్టిక్స్  శాస్త్రాన్ని చర్చించడం వగైరా వుంటాయి. 

          ఇది 1971 లో  తమిళంలో మేజర్ సౌందర రాజన్- రవిచంద్రన్ లతో వచ్చిన  ‘జస్టిస్ విశ్వనాథన్’ కి రీమేక్. ‘జస్టిస్ విశ్వనాథన్’ 1980 లో రజనీకాంత్ తో ‘పొల్లదవన్’ గా మళ్ళీ రీమేక్ అయింది. 1976 లో  కన్నడలో రాజ్ కుమార్ తో ‘ప్రేమద కణికే’ గా రీమేక్ అయింది. వీటన్నిటికీ మూలాధారం 1969 లో అశోక్ కుమార్- జీతేంద్రలతో హిందీలో వచ్చిన ‘దో భాయ్’ అని సలీమ్-  జావేద్ లు రచన చేసిన సినిమా. అయితే హిందీలో దీనికంటే ముందు 1951 లో సాక్షాత్తూ గురుదత్ ‘బాజీ’ (గేమ్) అనే నోయర్ మూవీ దేవానంద్ తో తీశారు. దీనికి అమెరికన్ నోయర్ మూవీ ‘గిల్డా’  స్ఫూర్తి. 

          ఇక ఈ శతాబ్దం లోనే తీసుకుంటే హిందీలో షైతాన్, మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దార్, పాంచ్, కహానీ, కహానీ -2, పింక్  వంటి అనేక డార్క్ మూవీస్ వచ్చాయి. తమిళంలో జిగర్తండా, 16-డి, నగరం, మెట్రో మొదలైనవి వచ్చాయి. మలయాళంలో ‘దృశ్యం’ వచ్చింది. హాలీవుడ్ నుంచి క్రిమ్సన్  రివర్స్, మోమెంటో, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, గాన్ బేబీ గాన్...వంటివి ఎన్నో వచ్చాయి. తెలుగులో రాలేదు. ‘కీచక’ నోయర్ మూవీ అన్నారు గానీ, అదలా వుండదు. 

          నోయర్ మూవీ లేదా డార్క్ మూవీ అంటే మనిషిలోని, లేదా సమాజంలోని నేరపూరితమైన చీకటి కోణాల్ని వెలుగులోకి తెచ్చేది. దీని కథాంశం పోలీస్ ప్రోసీజురల్ (నేరపరిశోధన) అయివుండాలి, లేదా గ్యాంగ్ స్టర్ కథైనా అయివుండాలి. ఈ రెండు ప్రక్తియలు తప్ప ఇంకో  కథా ప్రపంచంలో డార్క్ మూవీస్ ని స్థాపించే సాంప్రదాయం లేదు. మనం వచ్చిందే పండగ అనుకుని జిగర్తండా, 16-డి, నగరం, మెట్రో మొదలైన వాటిని డార్క్ మూవీస్ గా కీర్తిస్తున్నాం గానీ ఇవి పూర్తిగా డార్క్ మూవీస్ నిర్వచనానికి సరిపోవు. రచన మాత్రమే డార్క్ మూవీ నిర్వచనానికి సరిపోయి, చిత్రీకరణకి సరిపోకపోతే అది పాక్షిక డార్క్ మూవీయే అవుతుంది. 

          హిందీలో వచ్చిన పింక్ తప్ప షైతాన్, మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దార్, పాంచ్, కహానీ, కహానీ -2 ఇవన్నీ రచనా పరంగానూ చిత్రీకరణపరంగానూ డార్క్ మూవీస్ నిర్వచనానికి దగ్గరగా వుంటాయి. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే,  ఇప్పుడు విజువల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రతీదీ చూసేసి తెలుకున్న జ్ఞానంతో వ్యవహరిస్తున్నాం. పూర్వంలాగా చదివి అర్ధం చేసుకున్న శాస్త్రీయ అవగాహనతో పనిచేయలేకపోతున్నాం. నాల్గు నోయర్ సినిమాలు చూసేసి ఓహో ఇంతేకదా అని తీసేస్తున్నారు. కానీ నోయర్ సినిమాల గురించి చదివితే వీటికి పాత్రలే కాదు, కెమెరా కూడా ఫలానా ఫలానా అర్ధాలతో యాంగిల్స్ పెడుతుందనీ, లైటింగ్ చూపిస్తుందనీ, నీడల్ని సృష్టిస్తుందనీ వీటికున్న ప్రత్యేక శాస్త్రాన్ని అర్ధం జేసుకోగల్గుతారు. అప్పుడు నిర్దుష్టమైన నోయర్ మూవీని తీయగల్గుతారు.   హాలీవుడ్ ని నమ్మి చెడిన వాడు లేడు. ఇంకా యూరోపియన్ మూవీస్ ని, కొరియన్ మూవీస్ నీ కాపీ చేసి చెడిపోయిన వాళ్ళున్నారు. ఏ జానర్ నైనా హాలీవుడ్ ప్రధాన స్రవంతి వ్యాపార సినిమా కింద  మార్చుకుని ప్రపంచం మీదికి వదుల్తుంది. హాలీవుడ్ అంటేనే పక్కా వ్యాపారస్తుల అడ్డా. కాబట్టి హాలీవుడ్ నుంచి ఏవో అర్ధంకాని ఫిలిం నోయర్, నియో నోయర్ పదాల్ని చూసి ఇదేదో మన జాతి వ్యవహారం కాదని, వ్యాపారం కూడా కాదని  భయపడి పారిపోనవసరం లేదు. ముఖ్యంగా నిర్మాతలు. నిర్మాతలు సరీగ్గా సినిమా వ్యాపారం గురించి తెలుసుకుంటే మేకర్ల ఆటలు సాగకుండా వుంటాయి. అమ్మో నోయర్ వద్దని నిర్మాతలు ఎంతగా భయపడుతూ కూర్చుంటే,  అంతగా మేకర్లు ప్రేమల్ని, దెయ్యాల్నీ తెచ్చి అంటగట్టి పోతూంటారు. అప్పుడు అంతే జోరుగా పక్క రాష్ట్రాల సినిమాల వాళ్ళూ తెలుగు రాష్ట్రాల్లో ఈస్టిండియా కంపెనీ లైపోతారు.

        ముందుగా ఈ జానర్ కి రచనా పరమైన హంగులేమిటో చూద్దాం : ఈ హంగులని హాలీవుడ్ నుంచి యధాతధంగా కాపీ కొట్టి ఇక్కడ చెప్పడంలేదు. ఇది హాలీవుడ్ టెంప్లెట్ కాదు. హాలీవుడ్  టెంప్లెట్ ని తెలుగు నేటివిటీకి  ఎలా మల్చుకోవచ్చో  కస్టమైజ్ చేసి చూపిస్తున్నాం, అంతే. 

          1. కాలనేపధ్యం :  దేశీయ సినిమా మార్కెట్ లో ఇవాళ్ళ బీదల పాట్ల కథలకి చోటు లేదు. బస్తీ ప్రజలు కూడా నిరంతర  గ్లోబలైజేషన్ ఫలాలు ఆరగిస్తూ  బీదలపాట్లు, ఆకలి పోరాటాలు, ఈతిబాధలు మర్చిపోయారు. స్మార్ట్ ఫోన్, డిష్ యాంటెన్నా, ఏర్ కూలర్ సుఖాలు మరుగుతున్నాక, మళ్ళీ వాళ్ళ కథలే వెండి తెర మీద చూడ్డానికి ఇష్ట పడ్డం లేదు. 

          పైగా మునుపెన్నడూ కనీ వినీ ఎరుగనంత  వందల వేల  కోట్లు వెనకేసుకుంటున్న  నయా సంపన్నుల సమాజం పట్ల కుతూహలాన్ని పెంచుకుంటున్నారు. ఇదివరకు సంపన్నులని  చూసి వొళ్ళు మండి  యాంగ్రీ యంగ్ మేన్లు  పుట్టుకొచ్చే వాళ్ళు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ లవుతున్నారు. ఇంతేసి సంపాదించుకుంటున్న నయా  సంపన్నులు ఎలా జీవిస్తూంటారన్న కుతూహలంతో వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడా లనుకుంటున్నారు. ఇక్కడ గమ్మత్తేమిటంటే,  ఇదివరకు కామన్ మాన్ యాంగ్రీ యంగ్ మాన్ అయ్యే వాడు, ఇప్పుడు నయా సంపన్నులే యాంగ్రీ యంగ్ మాన్ లవుతున్నారు, కామన్ మాన్ ప్రశాంతంగా వుంటున్నాడు. ఒక ఎంపీ కొడుకు డబ్బు మదంతో టోల్ గేట్ ని ధ్వంసం చేస్తాడు, ఇంకో మంత్రి కొడుకు డబ్బు మదంతో ఒకమ్మాయితో స్టాకింగ్ కి పాల్పడతాడు. ఇంకో ఎంపీయే అధికార మదంతో విమాన  సిబ్బందిని చెప్పుతో కొడతాడు. కామన్ మాన్ తగినంత ఆర్ధిక భద్రతతో రిగ్రెసివ్ గా వుంటే, సంపన్నుడు అవసరానికి మించిన డబ్బుతో ఎగ్రెసివ్ అవుతున్నాడు. ఇలా రివర్స్ రోల్స్  పోషిస్తున్న కొత్త కాలం నడుస్తోంది.

       నియో నోయర్ సినిమా కథకి  ఈ కాలనేపధ్యాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎగ్రెసివ్ సంపన్నుడి జీవన శైలుల్ని రిగ్రెసివ్ కామన్ మాన్ చూడాలని కుతూహల పడుతున్నాడు. నైట్ లైఫ్ పేరుతో నయా సంపన్నులు పాల్పడే విశృంఖలత్వాన్ని చూసే భాగ్యం తనకి కలగాలనుకుంటున్నాడు. ఆ విశృంఖలత్వంతో వాళ్ళు లేనిపోని కేసుల్లో ఇరుక్కుని గింజుకుంటూంటే చూసి ఆనందించాలనుకుంటున్నాడు. షైతాన్, కహానీ-2, పింక్, 16- డి ల విజయ రహస్యమిదే. ఇవి సంపన్నేతరుల కుతూహలాన్ని తీరుస్తూ సంపన్నుల పట్ల వాళ్ళ కచ్చి ని కూడా తీర్చాయి. 1930 లలో అమెరికా ఆర్ధిక సంక్షోభ కాలనేపధ్యంలో పుట్టిన తొలితరం ఫిలిం నోయర్ సినిమాల విజయ రహస్యం కూడా ఇదే : సంపన్నుల డొల్లతనాన్ని రట్టు చెయ్యడం. ఇదే ఇప్పుడు దేశీయంగా ఆర్ధిక పురోభివృద్ధి నేపధ్యంలో మన దగ్గర పునరావృతమవుతోందని గుర్తించాలి.

          కాబట్టి డార్క్ మూవీస్ సినిమాలు తెరమీద సంపన్నుల పాట్లు వర్సెస్ తెరముందు సామాన్యుడి వినోదం ఫ్రేం వర్క్ లో వుండి  తీరాల్సిందే. డార్క్ మూవీస్ కదా అని, మర్డర్స్ కదా అని,  బస్తీ హత్యలు, గుడిసె ఖూనీలూ చూపిస్తే కాలనేపధ్యాన్ని కాల రాసినట్టే. గ్లామరస్ గా కళ్ళు చెదిరేట్టు సంపన్నుల నేర మనస్తత్వాల్ని  చూపడం మినహా డార్క్ మూవీస్ తో ఇంకెలాటి  గిమ్మిక్కులు పనిచెయ్యవు. గ్లోబలైజేషన్ దెబ్బకి రకరకాల సామాజిక, అస్తిత్వ వాదాలన్నీ వెనక్కెళ్ళి పోయాయి. ఆ వాదాలు ఏలిన కాలంలో కూడా రిక్షా వాడి మీద కవిత్వం రాస్తే రిక్షా వాడే చదవలేదు. ఆ రాసిన కవుల ప్రతిభాపాటవాల మీద  చర్చలు పెట్టుకోవడానికే అవి పనికొచ్చాయి. కవికి సామాజిక స్పృహ వుండేది గానీ, రాసిన కవితలే సమాజానికి ఉపయోగ పడేవి కావు. ఇలాకాక డిటెక్టివ్ సాహిత్యం రిక్షావాణ్ణి  పఠితని చేసి ఏంతో  కొంత సామాజిక ప్రయోజనం సాధించింది. ఆ డిటెక్టివ్ సాహిత్యపు వినోదమే ఇప్పుడు డార్క్ మూవీస్ లో సామాన్యుడికి కావాలి. తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని చూసినా వాటిలో బాధితులుగా సంపన్నులే వుండడాన్ని గమనించగలం. 

          అంటే కాల నేపధ్యం కోసం, వాస్తవికత కోసం, హై సొసైటీలో జరిగే సంఘటనల మీద ఓ కన్నేసి వుంచాలి ఈ జానర్ రచయితనే వాడు. అంతేగానీ ఫారిన్ డివిడిలు చూసి ఆ కథలు రాస్తే కాదు. హాలీవుడ్ నియమం ఏమిటంటే, నోయర్ సినిమాలకి రచయిత ఎంత వాస్తవిక కథైనా రాయకూడదు, డిటెక్టివ్ నవలే ఆధారం కావాలి.


(రేపు రెండో సూత్రం : పాత్రల తీరుతెన్నులు)
-సికిందర్

         



 



          

Friday, April 21, 2017

రివ్యూ!









దర్శకత్వం : జోషి 

తారాగణం : మోహన్ లాల్, అమలా పౌల్, సాయికుమార్, బిజూ మోహన్, సిద్దీఖ్, అమీర్ నియాజ్ తదితరులు
రచన :  సాచీ, మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : రతీష్ వేగా, ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్
బ్యానర్ : మ్యాజీన్ మూవీ మేకర్స్
నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్
విడుదల : ఏప్రిల్ 21, 2017

         ***
         మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడి బాక్సాఫీసుకి ఇంకో చేరిక అయ్యాక అడపదపా ఆయన డబ్బింగులు విడుదలవుతున్నాయి. ‘మన్యం పులి’, ‘కనుపాప’ లని కూడా తెలుగులో బాగానే చూశారు. ఇప్పుడు తాజాగా పాత మలయాళం ఒకటి దులిపి తీసి తెలుగు ప్రేక్షకుల ముందుంచారు. 2012 లో మలయాళంలో ఘన విజయం సాధించిన ‘రన్ బేబీ రన్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని  తెలుగులో ‘బ్లాక్ మనీ- అన్నీ కొత్త నోట్లే’ గా విడుదల చేశారు. ఈ వారం మొత్తం 6 చిన్నాచితకా సినిమాలు విడుదలయ్యాయి తెలుగులో : లంక, దడపుట్టిస్తా, ఇద్దరి మధ్య 18, బాయ్ ఫ్రెండ్, ఒక పరిచయం, రిజర్వేషన్. ఇవికాక ‘బ్లాక్ మనీ’ తో కలుపుకుని పిశాచి -2, మాచిదేవ అనే మూడు డబ్బింగులు విడుదలయ్యాయి. ఈ మొత్తం తొమ్మిది సినిమాల్లో ఒక్క ‘బ్లాక్ మనీ’ కే  ప్రేక్షకులున్నారు. ఆరుకి ఆరూ తెలుగు సినిమాలన్నీ ప్రేక్షకుల్లేక యధావిధిగా ఇబ్బంది పడుతున్నాయి. 

          వే పేలవమైన ప్రేమలు, అవే రొటీన్ హార్రర్ లు తీయడం తప్ప ఇంకో  పనే లేకుండా పోయింది తెలుగు నిర్మాతలకీ దర్శకులకీ.  సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే పరిజ్ఞానం ఇప్పటి దర్శకులకి శూన్యం అవడంచేత అవే అర్ధం లేని ప్రేమలు కొందరు, టెంప్లెట్ హార్రర్ లు కొందరూ ఇంకా తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇవైనా పద్ధతిగా తీస్తే ఏ సమస్యా వుండదు. పద్ధతేమిటో కూడా తెలీక  ప్రేక్షకుల్ని దూరం చేసుకుంటున్నారు. తెలుగులో ఓపెన్ గా వున్న సస్పెన్స్ థ్రిల్లర్స్, డార్క్ మూవీస్ మార్కెట్ ని తమిళ మలయాళ సినిమాలు ఇలా  వచ్చేసి భర్తీ చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నా కూడా  ఈ దిశగా స్పృహ తెచ్చుకోవడం లేదు.

          ‘బ్లాక్ మనీ’ దర్శకుడు జోషీ చాలా సీనియర్ దర్శకుడు. 1978 లో మలయాళంలో  రంగప్రవేశం చేసిన ఆయన నాటి నుంచి నేటి వరకూ 81 సినిమాలు తీశారు. 1988 లో కృష్ణంరాజు తో ‘అంతిమ తీర్పు’ అనే సూపర్  హిట్ తీశారు. తాజాగా 2015 లో  ఆయన తీసిన ఒక మలయాళం మోహన్ లాల్- సత్యరాజ్ లతో ‘ఇద్దరూ ఇద్దరే’ గా తెలుగులో డబ్ అయింది. ఇది ఆడలేదు. ఈ సినిమాతో ఆయన పూర్వపు టచ్, నైపుణ్యం కోల్పోయారు. కానీ 2012 లోనే తీసిన ‘బ్లాక్ మనీ’ తో అత్యంత ప్రతిభని చాటుకుంటూ ఆశ్చర్య పర్చారు. ఇప్పటి టెక్నిక్, టెక్నాలజీ తెలిసిన సమర్ధుడైన ఏ కొత్త దర్శకుడో తీసినట్టు పకడ్బందీగా తీశారు!

       ‘బ్లాక్ మనీ’  ఒక మీడియా థ్రిల్లర్. ఒక నేరం చేస్తూ మీడియా సంస్థకి  దొరికిపోయి  భవిష్యత్తు కోల్పోయిన రాజకీయ నాయకుడు,  అదే మీడియా సంస్థని  ఇంకో స్టింగ్ ఆపరేషన్ కి ఎరవేసి  అల్లరిపాలు చేసి – మొదట తను చేసిన నేరం ఇదే మీడియా సంస్థ సృష్టిగా చిత్రీకరిచడం, తిరిగి రాజకీయ భవిష్యత్తుని పొందడమనే కాన్సెప్ట్ తో తయారయ్యిందీ  థ్రిల్లర్. 

        మీడియా సంస్థలు కూడా అమాయకంగా రాజకీయనాయకులు పన్నే వలలో చిక్కుకుని ఫేక్ న్యూస్ తో అల్లరవగలవన్న ఆసక్తికరమైన సబ్జెక్టుని ఇందులో చూపించారు.

        ఈ జానర్ ఏమిటో అర్ధం జేసుకోకుండా కొందరు ఇందులో ఎంటర్ టైన్మెంట్ లేదనీ, కామెడీ లేదనీ రాసేస్తున్నారు. కామెడీ కోసం, ఎంటర్ టైన్మెంట్ కోసం  ‘కాటమరాయుడు’,  ‘మిస్టర్’ లాంటివి మరోసారి ఎంజాయ్ చేసేసి వెబ్సైట్ల నిండా రాసేసుకోవచ్చు. కామెడీ, ఎంటర్ టైన్మెంట్ లు అవసరం లేని ‘బ్లాక్ మనీ’ లో  అవి లేవని అనాలోచితంగా రాసేస్తే, ప్రేక్షకులకి ఎలాటి సంకేతాలు వెళతాయో ఆలోచించాలి. అయినా ఇంకే భాషలో లేని ఈ కామెడీ, ఎంటర్ టైన్మెంట్ ల పిచ్చేమిటసలు? ఇవి లేని కనుపాప, 16-డి, నగరం, మెట్రో మొదలైనవి శుభ్రంగా చూసేశారుగా  తెలుగు ప్రేక్షకులు!

          ఇందులో కొత్తతరహా పాత్ర మోహన్ లాల్ ది. సుప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్’ కి టీవీ విభాగపు  స్ట్రింగర్ (ఫ్రీలాన్స్) కెమెరా మాన్ అతను. పేరు వేణు. ఢిల్లీలో వుంటాడు. హై ప్రొఫైల్ న్యూస్ కెమెరా మాన్ అతను. ఫిలిం ఇనిస్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో  గ్రాడ్యుయేషన్ చేసినా, సినిమాల్లో కల్పిత దృశ్యాలు తీస్తారని ఏవగించుకుని, నిజ దృశ్యాలు తీసే టీవీ మీడియాలో  కొచ్చాడు. ఛానెల్స్ కోసం తను తీసే ఫుటేజీల్ని ఎడిట్ చేసినా ఒప్పుకోని తత్త్వం అతడిది. ఎడిట్ చేస్తే చెడామడా తిడతాడు. జరిగిన సంఘటనల్ని జరిగినట్టు చూపించాలే తప్ప, ఛానెల్ కి ఇష్టమైనవే చూపించి అక్రమాలు చేస్తే వూరుకోడు. 

         ఒక కేసు నిమిత్తం ఢిల్లీ నుంచి వస్తే, ఇక్కడ మిత్రుడు రిషి ( బిజూ మోహన్) నడిపే న్యూస్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్ బీ ఐ) అనే కొత్త ఛానెల్లో జీతాలు చెల్లించడానికి స్టింగ్ ఆపరేషన్లతో  బ్లాక్ మెయిల్స్ చేస్తూంటాడు. 

          భారత్ విజన్ అనే ఇంకో పెద్ద ఛానెల్ వుంటుంది. ఇక్కడ రేణుక (అమలా పౌల్) రిపోర్టర్ గా పని చేస్తూంటుంది. ఢిల్లీ నుంచి వచ్చిన వేణుకి ఈమెతో పాత శత్రుత్వం మళ్ళీ రగుల్కొంటుంది. శత్రుత్వానికి ముందు ఇద్దరూ ప్రేమికులు. ఐదేళ్ళక్రితం ఆరోజు రేపుదయం పెళ్లి చేసుకోబోతున్నారనగా రాత్రికి రాత్రి  బద్ధ శత్రువులైపోతారు. ఒక వ్యాపారవేత్తకి రాజ్యసభ సీటు ఇప్పించడానికి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ (సాయికుమార్) భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న దృశ్యాన్ని రేణుకతో కలిసి వేణు చిత్ర్రీకరిస్తాడు. ఆ వీడియోతో రేణుక మోసం చేస్తుంది. దాంతో వేణు ఆమెతో తెగతెంపులు చేసుకుని ఆజన్మ శత్రువులా చూస్తూంటాడు. 

          ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ఇదే రేణుకతో వేణుకి ఇంకో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మిత్రుడు రిషి ఛానెల్ని  బతికించడానికి. ఈసారి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ ఒకణ్ణి మర్డర్ చేయడానికి ప్లానేశాడు. ఐదేళ్ళ క్రితం రాజ్యసభ సీటుకి లంచం తీసుకుంటూ దొరికిపోయిన సందర్భంలో, పార్టీపరంగా పతనమయ్యాడు. ఇప్పుడేదో చేసి పోయిన ప్రతిష్ట తిరిగి సంపాదించుకుని  పార్టీలో ఎదగాలనుకుంటున్నాడు సీఎం స్థాయికి. లంచం అప్పుడు ఛానెల్ కి ఉప్పందించిన అనుచరుణ్ణి ఇప్పుడు చంపేస్తే తప్ప పోయిన ప్రతిష్ట తిరిగిరాదని నిర్ణయించుకున్నాడు. 

          ఇలా సుదూరంగా క్లబ్ హౌస్ లో మర్డర్ కి ఏర్పాట్లు చేస్తాడు. వేణూ రేణూలు అక్కడ రహస్యంగా చిత్రీకరించడానికి అట్టహాసంగా రకరకాల అధునాతన రిమోట్ కెమెరాలూ, రోబో కెమెరాలూ ఏర్పాటు చేస్తారు. భవానీ ప్రసాద్ మర్డర్ చేసి శవాన్ని వేలాడదీయిస్తాడు. ఇది ఛానెల్లో ప్రసారమై సంచలనం రేగుతుంది. దీంతో ఛానెల్ ధ్వంసమై, వేణూ రేణూలు నేరస్థులై పారిపోవాల్సి వస్తుంది.

         ఇదేంటి- హత్య చేస్తూ ప్రపంచానికి దొరికిపోయిన భవానీ ప్రసాద్ క్షేమంగా వుండి, దాన్ని చిత్రీ కరించిన వేణూ రేణూలు నేరస్థులుగా పారిపోవడమేమిటి? ఇదెలా  జరిగింది? అసలేం జరిగింది? ఇందులోంచి ఈ ఇద్దరూ ఎలా బయట పడ్డారు? బయటపడకుండా భవానీ ప్రసాద్ ఇంకే వలలు బిగిస్తూ పోయాడు? ... ఇవి తెలుసుకోవాలంటే ఈ ఇంటలిజెంట్ క్రైం డ్రామాని చూడాల్సిందే.

          సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడూ తదనంతర పరిణామాలతో సీన్లు అల్లుకుంటూ ముందుకు పరిగెడుతుంది. ఇతర ఫార్ములా మసాలా మాస్ సినిమాలకి ఇలా వుండదు. అందుకే ఇంటర్వెల్ తర్వాత ఎటు వెళ్ళాలో అంతు పట్టక  సెకండాఫ్స్ సెండాఫ్ ఇచ్చేస్తూంటాయి. ఇంటర్వెల్ దగ్గర పాత్రకి ఏర్పాటు చేసిన సమస్య సంగతి క్లయిమాక్స్ లో  చూసుకోవచ్చన్న తేలిక భావంతో  అప్పటిదాకా కామెడీలతో పాటలతో ఫైట్లతో గడిపేస్తారు. 

          సస్పెన్స్  థ్రిల్లర్స్ తో ఇలా సాగదు. అడుగడుగునా what next? ప్రశ్నే పుట్టకపోతే అది బిగిసడలని  సస్పెన్స్  థ్రిల్లర్ అవదు, కూర్చోబెట్టదు. బిగి సడలని కథనం,  కూర్చోబెట్ట గల్గడం- ఈ రెండూ లేకపోతే సస్పన్స్ థ్రిల్లర్ కి నూకలు చెల్లిపోతాయి. ఒక సీనులో ఒక సంఘటన జరిగిందంటే,  దాని పరిణామమేమిటి తర్వాతి సీన్లలో అన్న చందాన కథనం అల్లుకుంటూ పోకపోతే ఈ జానర్ రక్తి కట్టదు. అలా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయే సీన్లలోంచి ఏ వొక్కటి తీసేసినా కథే అర్ధంగానంత గందరగోళం ఏర్పడుతుందన్న మాట. 

          ఈ సినిమాలో అల్లిన సీన్లన్నీ ఇలాంటివే. మొదటి సీను నుంచీ చివరి సీను దాకా వృధాగాఏదీలేదు సరికదా, ఏ వొకటి తీసేసినా సినిమాయే అర్ధంగాకుండా పోయే ప్రమాదముంది. 

          ఇందులో మళ్ళీ ఒక సూపర్ స్టార్ గా మోహన్ లాల్ స్థాయికి తగ్గ చిక్కు ముళ్ళతో, ఇరకాటాలతో దర్శకుడు ఆడుకోవడమే వుంది. మోహన్ లాల్ ఎలాటెలాటి వూహించని ప్రమాదాల్లో ఇరుక్కుంటాడంటే, ఇప్పుడేమిటి- ఎలా బయటపడతాడు- what next?- అన్న ఆదుర్దా కల్గిస్తాడు. అంతే వూహకందని తెలివితేటలతో వాటిలోంచి బయటపడుతూంటాడు. క్లయిమాక్స్ సీన్లో ఇంకా కఠినమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు అమలా పౌల్ తో కలిసి. 

         ఇంటర్వెల్ సీన్ లీడర్ మీద మోహన్ లాల్ పైచేయే అయినా,  ఆ వెంటనే లీడర్ దే పై చేయి అయి క్లయిమాక్స్ దాకా లీడర్ పన్నే వలల్లో దొరక్కుండా తప్పించుకునే యుక్తులే పన్నుతూంటాడు తను. క్లయిమాక్స్ లో లీడర్ మరో మర్డర్ చేయబోతున్నట్టు సమాచారం వదిలి మోహన్ లాల్ ని ట్రాప్ చేసినప్పుడు,  ఆ  మర్డర్ అవబోయేది తనూ అమలా అని గ్రహించి మోహన్ లాల్ ఎలా లీడర్ ని దెబ్బ తీశాడన్నది  అత్యంత బలమైన ముగింపు. 

          ఇందులో మొదటి అరగంట లోపే  మోహన్ లాల్- అమలాల ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడే లీడర్ లంచం వ్యవహారం పట్టుకున్నప్పుడు అమల మోసం చేసిందని మోహన్ లాల్ విడిపోతాడు. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్  ప్రేమ కథలో వాళ్ళ బ్రేకప్ ని మాత్రమే చూపించదు- ఇందులోని ఆ లీడర్ లంచం ఎపిసోడ్  లోంచే ప్రస్తుత ప్రధాన కథ ప్రారంభం కూడా చూపిస్తుంది. ఇదొక గమ్మత్తయిన క్రియేటివిటీ. కొత్తగా బాగా కుదిరింది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ తదనంతర పరిణామాల దొంతరే. ఏదీ వృధాగా వుండదు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ లంచం ఎపిసోడ్ మచ్చ రూపు మాపుకోవడానికే లీడర్ ఈ మర్డర్ ఎపిసోడ్ కి తెర తీస్తాడు. ఇది  ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

          ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో  సినిమాల్లో అరుదుగా కన్పించే అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి : 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అన్నవి.  నిజానికి  ఒక మనిషిని హత్య చేస్తోంటే ఆపాలిగానీ, దాన్ని కెమెరాతో షూట్ చేసి ఛానెల్ పాపులారిటీ పెంచుకోవడం నీతి కాదని వ్యతిరేకిస్తాడు మోహన్ లాల్. అయితే ఆ పవర్ఫుల్ లీడర్ చేతిలో ఈ హత్యని ఆపడం ఎవరితరం కాదని తెలుస్తుంది. హత్యని ఆపలేనప్పుడు హంతకుణ్ణి పట్టుకోవడమే నీతి అన్న వాదం ఎదురవుతుంది. 

       1. కోరిక : మిత్రుడి ఛానెల్ ని బతికించడానికి ఈ ఆపరేషన్ని  చేపట్టాలన్న కోరిక వుంది  మోహన్ లాల్ కి, 2. పణం : దీనికి తన నీతినే  పణంగా పెట్టాల్సి వస్తోంది, 3. పరిణామాల హెచ్చరిక : ఆ పవర్ఫుల్ లీడర్ మీద రెండో సారి ఆపరేషన్ ఏ కొంచెం అటు ఇటైనా తన పేరుమోసిన స్ట్రింగర్ కెమెరామాన్ వృత్తినే కోల్పోతాడు, 4. ఎమోషన్ : ఒక హత్యని  ఆపలేకపోతున్న నిస్సహాయత, వృత్తిరీత్యా విశ్వనీయత కోల్పోతానన్న ఆందోళనా కలిసి సంక్షుభిత ఎమోషన్ ని క్రియేట్ చేశాయి. అతడి మోరల్ కంపాస్ ని ఛిన్నాభిన్నం చేశాయి. 

          దీంతో ఈ పాత్రని  మనం పట్టించుకు తీరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది :
 get your audiences to root for your  character  అనే నియమపాలన ఇక్కడ ఇంత బలంగా ఖచ్చితంగా జరిగింది. వృత్తిలో విలువలకోసం తగాదాలు పెట్టుకునే మోహన్ లాల్ ఆ విలువలకే తిలోదకాలిచ్చే  మోరల్ డైలెమాలో పడేకన్నా బలమైన ప్లాట్ పాయింట్ వన్ ఏముంటుంది? 

          అక్కడికీ హత్య జరిగిపోతూంటే ఆపాలనుకుని వెళ్లిపోబోతూంటే అమల వెనక్కి లాగి పడేస్తుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో చాలా డ్రామా వుంటుంది- మానసిక సంఘర్షణల్లోంచి పుట్టుకొచ్చే సహజ, ప్యూర్ డ్రామా. అనుకున్నట్టే ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం పూర్తయి దానికదే ఎదురు తన్నుతుంది!  ఎదురు తన్నక పోతే అది విలన్ పాత్రచిత్రణే కాదు. లంచం ఎపిసోడ్ అప్పుడు తెలీక దొరికిపోయిన లీడర్ తెలిసీ మళ్ళీ దొరికిపోవాలనుకోడు- హీరోనే  ఇరికించి తప్పించుకోవాలనుకుంటాడు.  

          ఇదే జరిగి మోహన్ లాల్ అమలతోపాటు  అజ్ఞాతంలోకి పారిపోవాల్సి వస్తుంది. మార్కెట్ లో  విశ్వసనీయత కోల్పోయి, రాయిటర్స్ తో  కాంట్రాక్ట్ కోల్పోయి, మిత్రుడి ఛానెల్ ముక్కచెక్కలై, కేసులు మీద పడి  పక్కా నేరస్థుడి స్థితికి దిగజారి పోతాడు. 

          ఇంతకంటే హీరోయిజం ఏం కావాలి మోహన్ లాల్ స్టేచర్ కి. ఇవన్నీ తట్టుకుని, తేరుకుని, పైకిలేచి తన్నే వాడే కదా నిజమైన హీరో. వీటికి  తోడూ ఇంకో ఎమోషనల్ ప్రాబ్లం వుంది- తోకలా తనతో వుంటున్న పాత శత్రువు అమల. ఈమెని పోలీసులకి పట్టించి వదిలించు కోవాలనుకుంటాడు కూడా. బంకలా పట్టుకుని వుంటుంది. ఈ ఏకాంతంలో కూడా, ఈ కష్ట సమయంలో కూడా  పాత  ప్రేమలు తిరిగి పుట్టుకురావడానికి అవకాశం లేదు. బలమైన పాత్రలకి అలాంటిది వుండదు. వృత్తి విలువ దిగజార్చిన ఆమెతో ప్రేమనే తెంచుకున్నాడు. ఆమె కూడా ఐదేళ్ళ క్రితం చేసిన తప్పుకి క్షమాపణ కోరే బలహీనురాలు కాదు. అందుకే అతణ్ణి టీజ్ చేసి, కవ్వించి, నవ్వించి, డ్రీం సాంగ్స్ వేసుకుని సొంతం చేసుకునే నీచానికి పాల్పడదు. మరి వీళ్ళ మధ్య పెరిగిపోతున్న ఈ టెన్షన్ తీరేదెలా? ఇదే ‘చెలియా’ లో  మణిరత్నం చేయలేక చేతులెత్తేశాడు. జోషి 2012 లోనే,  దీన్నే రెండు హై టెన్షన్ వైర్లు గా చేసి, ఎప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతాయా  అని చివరిదాకా వూరించాడు. 

         ఇక్కడ సస్పెన్సు కోసం ప్లాట్ పాయింట్ - టూ  ఘట్టాన్ని వివరించడం లేదు. ఈ క్రైం డ్రామాకి  క్లయిమాక్స్ ఒక సంతృప్తికరమైన ఆర్ట్ వర్క్ అనొచ్చు.

          సీనియర్ దర్శకుడు జోషి ఎక్కడా చాదస్తాలకి పోకుండా, కథనుంచి పక్క దార్లు పట్టకుండా- ఆధునిక ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థని టెక్నాలజీ పరంగా ఇంకే సినిమాలోనూ చూపించని విధంగా- మీడియా పాత్రల్ని ఇంకే సినిమాలోనూ చూపించనంత ప్రొఫెషనల్ గా, అడుగడుగునా వాస్తవిక దృక్పథంతో థ్రిల్ చేస్తూ ఉన్నత స్థాయి చిత్రీకరణ చేశారు. కెమెరా మాన్ రాజశేఖర్ అద్భుత పనితనాన్ని కనబర్చాడు. సంగీత దర్శకుడు రతీష్ వేగా మాత్రం సెకండాఫ్ వచ్చేసరికి వేగాన్ని కంట్రోలు చేసుకోలేకపోయాడు. ఇంటర్వెల్ కే సినిమాతో దిమ్మదిరిగినట్టు, సెకండాఫ్ అంతా సౌండు పెంచేసి  హుదూద్ తూఫాను లాంటిది  సృష్టిస్తే తప్ప, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి న్యాయం చేయలేనని తెగ ఫీలైపోయినట్టు కన్పిస్తాడు.    

          లాజికల్ గా ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల పొజిష నింగుతో ప్రాబ్లం వుంది. ఆ కెమెరాల కళ్ళు గప్పి లీడర్ శవంతో కనికట్టు చేయడం సాధ్యం కాదు. కానీ దీనికి పరిష్కారం కూడా లేదు- అయితే ఇలాటి థ్రిల్లర్స్ లాజికల్ గా లోపాలు లేకుండా వుండాల్సిన అవసరముంది. 

          మళ్ళీ శుక్రవారం ‘బాహుబలి -2’ వచ్చేవరకూ ‘బ్లాక్ మనీ’ కి మార్కెట్లో పోటీ లేదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో సమాంతరంగా మోహన్ లాల్- అమలా పౌల్ ల విచిత్ర బాండింగ్ కూడా చూసి ఈ వేసవిలో ఏసీ లేకుండా ఎంజాయ్ చేసేందుకు ఇదొక అవకాశం. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం తీసిన సినిమాలా అన్పించక, ఇప్పుడే తీసి విడుదల చేసిన ఫ్రెష్ నెస్  అన్నిటా కన్పించడం ఈ డబ్బింగ్ ప్రత్యేకత.

- సికిందర్
http://www.cinemabazaar.in


         










         
         



Wednesday, April 19, 2017


     డార్క్ మూవీస్ కీ  యాక్షన్ మూవీస్ కీ  తేడాల గురించి తెలుసుకుంటే తప్ప డార్క్ మూవీస్ జానర్ కి న్యాయం చేయలేరు. న్యాయం చేయకపోతే నాల్గు డబ్బులు రావు. రోమాంటిక్ కామెడీ జానర్ లక్షణాలు తెలీక రోమాంటిక్ కామెడీ లనుకుంటూ ఎలా ఇప్పుడు మార్కెట్ లేని రోమాంటిక్ డ్రామాలు  తీసేసి దెబ్బ తినేస్తున్నారో,  అలా డార్క్ మూవీస్ అనుకుని యాక్షన్ మూవీస్ తీసేసి దెబ్బ  తినేసే  అవకాశం చాలా  వుంది. రోమాంటిక్ కామెడీలతో చేసిన జానర్ పరమైన తప్పిదాలు మళ్ళీ డార్క్ మూవీస్ తో కూడా జరక్కుండా చూసుకోవాల్సి వుంటుంది. జానర్ స్పృహ, మర్యాద, డిసిప్లిన్ అనేవి లేకపోతే ఈ రకమైన సినిమాలు తీయడమే వృధా. దేని క్రియేటివ్ పరిధి, పరిమితులు దాని కుంటాయి. గుండుగుత్తగా ఆన్ని జానర్స్ కీ కలిపి ఒకే క్రియేటివ్ ప్రపంచం లేదు. క్రియేటివిటీని  జాతీయం చేయడం కుదరదు. క్రియేటివిటీ చిన్న చిన్న గణ రాజ్యాలుగానే వుంటుంది. డార్క్ మూవీస్  ఖచ్చితంగా వాస్తవికతని డిమాండ్ చేస్తాయి. డార్క్ మూవీస్ వాస్తవికత ఎన్నటికీ మాయనిది. ఏ కాలంలో నైనా వాటికి  వాస్తవికతే ఆభరణం.  వాస్తవికత లేకపోతే  డార్క్ మూవీస్ లేవు.  ఈ రోజుల్లో ‘మాభూమి’ లాంటి వాస్తవిక కథా చిత్రం, లేదా ఆర్టు సినిమా తీస్తే ఎవ్వరూ చూడరు. కానీ అదే వాస్తవికతతో కూడిన డార్క్ మూవీస్ తీస్తే చూస్తున్నారు. ‘నగరం’ లాంటి డార్క్ మూవీ వాస్తవికతతో,  జీవనోపాధి కోసం ఓ హీరో పడే పాట్లుగా ఆర్ట్ సినిమా  తీస్తే ఎవరైనా చూస్తారా? ఎవ్వరూ చూడరు బహుశా. 


          యాక్షన్ మూవీస్ కి ఈ వాస్తవికతతో పనిలేదు. ఎందుకంటే వీటి విషయంలో వినోదమే ప్రధానం. ఈ వినోదాన్ని పండించడం కోసం లాజిక్ ని తీసి పక్కన పెడతారు. ‘ఖైదీ’ లాంటి యాక్షన్ మూవీ లో పోలీస్ స్టేషన్ లో  పది మంది పోలీసులని కొట్టి వెళ్ళిపోతాడు చిరంజీవి. ఇలా నిజజీవితంలో సాధ్యం కాకపోయినా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. యాక్షన్ మూవీస్ లో ప్రేక్షకులు కోరుకునేది నిజ జీవితంలో సాధ్యపడని ఈ ఎస్కేపిజమే, లాజిక్ కాదు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ –8’ అనే యాక్షన్ మూవీ చాలా పెద్ద ఎస్కేపిస్టు ఫేర్. టాప్ స్టార్స్ తో యాక్షన్ మూవీస్  ఇలా ఎంత వాస్తవ  విరుద్ధంగా వున్నా వాటికేం ప్రమాదం రాదు. కానీ ఇదే లాజిక్ లేకుండా డార్క్ మూవీస్ తీస్తే అది జానర్ మర్యాద అన్పించుకోదు. జానర్ మర్యాదతో లేనిది ఈ రోజుల్లో ఏదీ ఆడడం లేదని గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం. 


యాక్షన్ మూవీ 
           ఒక డార్క్ మూవీ తీస్తూ అందులో పైన చెప్పుకున్న చిరంజీవి ఫైట్ లాంటిది పెట్టారనుకోండి, అది డార్క్ మూవీగా ఫెయిల్ అయినట్టే. అలాగే చిరంజీవిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారణ చేశారనుకోండి, అనుమానం తీరక లాకప్ లో   పెట్టారనుకోండి- ఇది డార్క్ మూవీ రచన అవుతుంది, యాక్షన్ మూవీ కాదు.

          యాక్షన్ మూవీకి ఎక్కువ బడ్జెట్ కావాలి. వాటిలో స్టంట్స్,  ఛేజెస్ వుండాలి. కాల్చివేతలు, పేల్చివేతలు, విధ్వంసాలు, మారణహోమాలూ  వుండాలి. నాన్ స్టాప్ యాక్షన్ తో వుండాలి. స్పీడు ప్రాణమవ్వాలి. యాక్షన్ సీన్స్ లో లాజిక్ వుండనవసం లేదు. గాలిలో విన్యాసాలు చేసి శత్రువుల్ని తన్న వచ్చు. ఏదో ఒక అంశం గురించి హీరో విలన్లు పోరాడు కోవాలి. విలన్ ఎంత మందిని చంపినా పోలీసులు వచ్చి కేసులు నమోదు చేసుకోనవసరం లేదు. యాక్షన్ లో ఎంత మంది చచ్చినా శవాలకి అంత్య క్రియల గురించి ప్రేక్షకులు బెంగ పెట్టుకోనవరసం లేదు. యాక్షన్ మూవీస్ లో హీరో క్యారక్టర్ డెవలప్ మెంట్ అంత ప్రధానం కాదు. కథ ఫోకస్ అంతా బిగ్ యాక్షన్ మీదే వుంటుంది. స్టోరీ లైన్ సరళంగా వుంటుంది. బోలెడంత కథలో ప్రేక్షకులు చిక్కుబడి పోకుండా బోలెడు యాక్షన్ తో దూసుకెళ్ళేలా చేయడమే యాక్షన్ మూవీస్ ప్రధానోద్దేశం. ‘శివ’ లో బోలెడంత  కథ వుండదు- ఏకత్రాటిపై సింపుల్  కథే  పరిగెడుతూ శివ- భవానీల యాక్షన్ - రియాక్షన్ల సంకుల సమరంగా వుంటుంది.


          యాక్షన్ మూవీస్ రాయడం తేలిక. తీయడం కూడా దర్శకుడికి తేలికే. యాక్షన్ సీన్స్ అన్నీ స్టంట్ మాస్టర్లు తీసేసి వాళ్ళే ఎడిటింగ్ చేసేస్తారు. పాటలు డాన్స్ మాస్టర్లు తీసేసి వాళ్ళే ఎడిటింగ్ చేసేస్తారు. దర్శకుడు తీయడానికి మిగిలేది ఓ గంట టాకీ పార్టు మాత్రమే. 




డార్క్ మూవీ 
          డార్క్ మూవీస్ ఇలా కాదు. యాక్షన్ సీన్స్, పెద్దగా పాటలూ వుండని డార్క్ మూవీస్ మొత్తం కథ మీదే ఆధారపడి నడుస్తాయి. కాబట్టి దర్శకుడికే సినిమా బరువంతా తానే మోసే పనుంటుంది.  ఒక నేరం చుట్టూ జరిగే వాస్తవిక ధోరణిలో గల కథలే వీటిలో వుంటాయి.  వీటిలో స్థాపించే కథలు  నిజ జీవితంలో ఎవరికైనా జరగవచ్చు. ‘పింక్’ లో రిసార్ట్స్ లో తనతో మిస్ బిహేవ్ చేసిన వాణ్ణి సీసా పెట్టి కొట్టి పారిపోయి, ఉల్టా తనే కేసులో ఇరుక్కునే హీరోయిన్ కథ లాంటిది ఎవరికైనా జరగ వచ్చు. ‘16-డి’ లో విశృంఖల ప్రేమాయణాల పర్యవసానంగా జరిగే దారుణాల్లాంటి కథ ఎవరి జీవితాల్లోనైనా సంభవించ వచ్చు.  వీటి కథలు, కథనాలూ సంక్లిష్టంగా వుంటాయి. 

          కాబట్టి వీటిని మెదడు పెట్టి చూడాల్సిందే. మెదడు పెట్టి చూసేలా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగల శక్తి ప్రస్తుతం డార్క్ మూవీస్ కే వుంది. ఆర్ట్ సినిమాల్ని మెదడు పెట్టి చూడాలి. గొప్పగొప్ప సాంఘికాలు, ‘మేఘ సందేశం’ లాంటి మానసిక సంఘర్షణాత్మకాలూ మెదడు పెట్టి చూడాల్సిందే. సామాజిక సినిమాలు, స్త్రీవాద సినిమాలు, భక్తి  సినిమాలూ మొదలైనవి ఖచ్చితంగా మెదడు పెట్టే చూడాలి. ఇందుకు గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులు సిద్ధంగా లేరు.  ఎందుకంటే దేశపరిణామాల్ని బట్టి  ప్రేక్షకుల మనోభావాలుంటాయి. 2000 సంవత్సరం నుంచి ఆర్ధిక సంస్కరణల ఫలితాలూ, ప్రపంచీకరణ ఫలాలూ  ఒకేసారి దండిగా చేతిలో వచ్చి పడుతూంటే వాటిని అనుభవించే స్థితికి చేరుకున్నారు ప్రేక్షకులు. ఉపాధి కోసం, ఉద్యోగాలకోసం ఇక ప్రభుత్వాల మీద ఆధారపడే అవస్థ తప్పింది. పట్టణం నుంచీ పల్లెదాకా టీనేజీ  కుర్రకారు పుష్కలంగా పాకెట్ మనీతో తిరుగుతున్నారు. 1980, 90 లనాటి ఆకలి కేకలు, నిరుద్యోగ పొలికేకలు ఇక లేవు. ఆ కవిత్వాలు, ఆ పోరాటాలు, ఆ ఉద్యమాలు, ఆ తీవ్రవాదమూ, ఆ సినిమాలూ తీసి అవతల పారేసి – ఎంజాయ్ చేస్తున్నారు పల్లెనుంచి నగరం దాకా. 


          ఇది గమనించారు గనుకనే సినిమాల అర్థాన్నే మార్చేసి  కేవలం ఎంటర్ టైన్మెంట్! ఎంటర్ టైన్మెంట్!!  ఎంటర్ టైన్మెంట్!!!  అనే ధోరణిలోనే సినిమాలు  తీస్తూ రంజింప జేస్తూ వచ్చారు. సినిమాల్ని ఇక మెదడు పెట్టి చూసే అవరమే లేకుండా పోయింది. ఎంటర్ టైన్ చేయడానికి నాల్గు వెర్రి వేషాలతో, మూడు జాడింపులతో, ఓ రెండు వాయింపులతో టపటప లాడించేసి  వదిలేస్తే సరి- పెద్ద పెద్ద బకెట్లతో కూల్ డ్రింకులు, పెద్ద పెద్ద ట్రేలు వొళ్ళో పెట్టుకుని ఫాస్ట్ ఫుడ్డులూ లాగిస్తూ చూసేసి దులిపేసుకుని వెళ్ళిపోతున్నారు. మెదడుతో పనేలేదు! సినిమాలు చూడ్డానికి తినడం అవసరమా? 


          ఈ నేపధ్యంలో రివ్యూ రైటర్లు ఈ పాత్ర చిత్రణ ఇలా వుండాల్సింది కాదు, ఇక్కడ ఈమె ఇలా ఏడ్వాల్సింది కాదు, అక్కడ ఆయన అలా అరవాల్సింది కాదు-  అని  విశ్లేషణలు చేస్తే - వీళ్ళెవర్రా? అని తలలు బాదుకుంటున్నారు  ప్రేక్షకులు. మెదడుకి ఆలోచనలు పెట్టే పనే వద్దంటున్నారు. మెదడుని పోటీ పరీక్షలు రాయడానికి, విదేశాల్లో జాబ్స్ చేసుకోవడానికి మాత్రమే కఠినాతి కఠినంగా వాడుకుంటామంటున్నారు. 


          ఇలా ఆర్ధిక సంస్కరణలు - ప్రపంచీకరణ అనే దేశ పరిణామాలతో కూడిన నేపధ్యంలోంచి  అన్ని మాధ్యమాల్లో ఎంటర్ టైన్మెంట్ ప్రధానమైన వాతావరణమే కన్పిస్తూండవచ్చు. ఆకలి బాధలో, ఇంకే సామాజిక సమస్యలో కళా రూపాలుగా స్థానం కోల్పోయి వుండ వచ్చు. కానీ కళా రూపంగా నేరం దాని స్థానాన్ని కోల్పోవడం లేదు. ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణ ఎంత ఎంటర్ టైన్మెంట్ ని తెచ్చిపెట్టాయో- సమాజంలో అన్నే నేరాల్నీ  తెచ్చి పెట్టాయి. మనం ఒకటి అర్ధం జేసుకుంటే, 1930 లలో అమెరికాలో   ఏర్పడిన ఆర్ధిక మాంద్యం  నేపధ్యంలోంచే  ఫిలిం నోయర్ అనే డార్క్ మూవీ జానర్ సినిమాలు పుట్టుకొచ్చాయి. డబ్బు లేకపోయినా నేరాలే, డబ్బెక్కువైపోయినా నేరాలే! అలా ఇప్పుడు ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణ నేపధ్యంలో డబ్బెక్కువైపోయి నేరాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి. ఉన్నత వర్గాల హై ప్రొఫైల్ నేరాలు మునుపెన్నడూ లేనంతగా జరుగుతున్నాయి.  వాళ్ళ ఎంటర్ టైన్మెంట్స్  శృతి మించి నేరాలకి దారి తీస్తున్నాయి. కాబట్టి ఎంటర్ టైన్మెంట్ - నేరాలు ఈ రెండూ ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణలకి రెండు ముఖాలు. వీటిలో ఎంటర్ టైన్మెంట్ అనే ఒకే ముఖాన్ని చూపిస్తూ వచ్చారు సినిమాల్లో. క్రైం ఎలిమెంట్ అనే రెండో ముఖాన్ని కూడా పట్టుకోగల్గడంతో  షైతాన్, జానీ గద్దార్, పింక్,  కహానీ -2, 16- డి, నగరం,  మెట్రో, కనుపాప  లాంటి నియో నోయర్ సినిమాలు వచ్చేసి హిట్టవుతున్నాయి. 


          అయితే ఇందాక చెప్పుకున్నట్టు, ఇలా మెదడు పెట్టి చూడాల్సిన సాంఘికాలు, సామాజికాలు, విప్లవాత్మకాలు, అనేక వాదాలు, మానసిక సంఘర్షణలూ...లాంటి కథలతో కూడిన ఆలోచనాత్మక సినిమాలని చూడ్డానికి ఇష్ట పడని  ప్రేక్షకులు, అంతే మెదడుకి పని కల్పించి చూడాల్సిన పై నియో నోయర్ సినిమాల్ని ఓపిగ్గా ఆలోచనలు లగ్నం చేసి చూసి ఎలా హిట్ చేయగల్గుతున్నారు?


          స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ ఏం చెప్పారో ఒకసారి ఇక్కడ చూడాలి- మనిషి పరిణామ క్రమం సరీసృపాల నుంచి క్షీరదాలకి, క్షీరదాల నుంచి ఆదిమానవుడికి, ఆదిమానవుడి నుంచి వివేక వంతుడైన మనిషి గా ఏర్పడినప్పుడు- ప్రతీ పరిణామ దశలో మెదడు పొరలు కమ్ముకుంటూ వచ్చింది. సరీసృపాల యాంత్రిక,  కేవల భౌతిక మెదడు (రెప్టీలియన్ కాంప్లెక్స్) మీద, భావోద్వేగాలతో కూడిన క్షీరదాల మెదడు (లింబిక్ సిస్టం) పొరకమ్మింది.  భావోద్వేగాలతో కూడిన క్షీరదాల మెదడు మీద ఆలోచనా శక్తి పెంచుకున్న  మనిషి  మెదడు (నియో కార్టెక్స్) పొర కమ్మింది. వీటన్నిటి మధ్యా ఎక్కడో ఆథ్యాత్మిక మెదడు వుంటుంది- దీని స్థానాన్ని ఇంకా కనుగొనలేదు. 




            కాబట్టి  ప్రేక్షకులకి డార్క్ మూవీస్ ఆకర్షించడానికి గల కారణ మేమిటో ఇప్పుడు తెలిసిపోతోంది. పొరలు పొరలుగా మూడు రకాల మెదడులు కలిగివున్నప్పుడు, కింది పొరలో వున్న జంతు సమానమైన వొరిజినల్ సరీసృపాల మెదడుని, ఈ జానర్ సినిమాలు సంతృప్తి పరుస్తున్నాయన్న మాట! నేరాలు ఈ మెదడుతోనే జరుగుతాయి. ఈ మెదడుని అణిచి పెట్టుకుని మనుషులు గొప్ప బుద్ధి గలవాళ్ళుగా వుండడానికి తంటాలు పడుతూంటారు. అది తన్నుకొ చ్చినప్పుడు తప్పుడు పనులన్నీ చేసేస్తారు. 

          తప్పుడు పనులు చేసే మెదడు తమలోనే వుంది కాబట్టి, ఆ తప్పుడు పనులు చేయకుండా వుండేదెలా, లేదా చేసేస్తే బయట పడేదెలా అన్న కుతూహలమే ఈ సినిమాలని దృష్టి కేంద్రీకరించి చూసేలా చేస్తుంది. మనిషి మెదడెలా వుంటుందో, అదెలా పనిచేస్తుందో అర్ధం జేసుకోకుండా సరైన సినిమాలు తీయలేరు. 


         
నేటి పరిస్థితులు డిమాండ్ చేస్తున్న ఈ డార్క్ మూవీస్ జానర్ ని తెలుగు సినిమాలు టచ్ చేయడం లేదు. హిందీ, తమిళ, మలయాళ సినిమాలు ఈ బాటలో నడుస్తున్నాయి. ఇప్పడు  తెలుగులో ప్రారంభించాలంటే ఏం చేయాలి?  వాటిని ఎలా తీర్చిదిద్దాలి?  వాటి జానర్ మర్యాదని ఇతర భాషల్లోలాగా ఎలా కాపాడాలి?  ఒక పూర్తి స్థాయి నియో నోయర్ డార్క్ మూవీ ఎలా వుంటుంది?....మొదలైన విషయాలతో రేపు ముగింపు వ్యాసం చూద్దాం. 


-సికిందర్

http://www.cinemabazaar.in/

Monday, April 17, 2017

రివ్యూ!










దర్శకత్వం : ఎఫ్. గేరీ గ్రే 

తారాగణం : విన్ డిసెల్, డ్వాయన్ జాన్సన్, జేసన్ స్టాథం, మిషెల్ రోడ్రిగ్స్, నాథాలీ ఇమ్మాన్యుయేల్, టిరెస్ గిబ్సన్, స్కాట్ ఈస్ట్ వుడ్, చార్లిజ్ థెరాన్ తదితరులు
రచన : క్రిస్ మోర్గాన్, సంగీతం : బ్రియాన్ టేలర్, ఛాయాగ్రహణం : స్టీఫెన్ ఎఫ్ విండన్
విడుదల :  ఏప్రెల్ 14, 2017

         ***
     చాలా సినిమాలు ఒకటి రెండు సీక్వెల్స్ తర్వాత నీరసించిపోతాయి. కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సీక్వెల్స్  సీను  తగ్గడంగానీ,  ప్రేక్షకుల మోజు తీరడం గానీ జరగడం లేదు. ప్రస్తుత ఎనిమిదవ సీక్వెల్ కి మూడు రోజుల్లోనే బడ్జెట్ కి రెట్టింపు వసూళ్లు వచ్చాయి. ఇండియాలోనూ ఇంగ్లీషుతోబాటు హిందీ, తెలుగు, తమిళంతో బాటు, తొలిసారిగా కన్నడ డబ్బింగ్ వెర్షన్లు దిగ్విజయంగా ఆడేస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి అత్యధిక ప్రజాదరణ లభిస్తోంది. ఈ ఫ్రాంచైజ్ ప్రారంభమైన నాటి నుంచీ నటిస్తున్న విన్ డిసిల్ తో బాటు ఒక్కో సీక్వెల్ తో పరిచయమవుతూ వస్తున్న స్టార్స్ కి ఇండియాలో అశేష అభిమాను లేర్పడ్డారు. హై వోల్టేజ్  యాక్షన్ స్టార్స్ అయిన వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఎఫ్ ఎఫ్ -8 ఇప్పుడు ఆలిండియా హిట్టయ్యింది. 

           కారు రేసులు, దోపిడీలూ వంటి కథాంశాలతో నిర్మాణం జరుపుకుంటూ వస్తున్న ఈ సీక్వెల్స్ ఈ సారి జేమ్స్ బాండ్ సాహసకృత్యాల వైపు మళ్ళింది. ఒక టీముగా వుండి ఒక ఆపరేషన్ పూర్తి చేసే యాక్షన్ స్టార్స్ జట్టు, ఇప్పుడు ఒక్కొకరు ఒక్కో  జేమ్స్ బ్యాండ్ లైపోయి రష్యాలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ విజయవంతం చేసి వస్తారు. 

      ఇందులో లాజిక్ చూడకూడదు, సాధ్యాసాధ్యాలు అడక్కూడదు- కళ్ళప్పగించి హైపర్ యాక్షన్ సీన్స్ చూస్తూ  ఉండడమే. కారు రేసులో హీరోగారు  కారుని రివర్స్ గేరులో వెనక్కి నడిపి రేసు గెల్చినా దీన్నొక మైండ్ లెస్ యాక్షన్ కామెడీగానే  ఎంజాయ్ చేయాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. డిసిల్ భార్యనీ, కొడుకునీ సైఫర్ అనే సైబర్ టెర్రరిస్టు పాత్రలో  చార్లిజ్ థెరాన్ కిడ్నాప్ చేసి బంధించి,  డిసిల్ చేత విద్రోహ పనులు చేయిస్తూంటుంది. తమ టీము లోంచి విడిపోయి డిసిల్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్ధంగాని మిగతా టీం మెంబర్లు అతడి పన్లకి అడ్డు పడుతూంటారు. డిసిల్ కొడుకుని కాపాడుకుంటూ సైఫర్ ని అణిచేందుకు ఓ ప్లానేసి సాగిపోతాడు- ఈ ప్రయాణం రష్యాకి దారితీస్తుంది- టీం అంతా అతడి వెంట వుంటుంది.

          హాలీవుడ్ ‘హై కాన్సెప్ట్’ సినిమాలు యాక్షన్ భారీగా, స్టోరీలైన్ సింపుల్ గా వుంటాయి.  ఈ మర్మం టాలీవుడ్ తెలుసుకోవడం లేదు. యాక్షనూ భారీగా, స్టోరీ లైనూ ఏవేవో లగేజీలతో మోతబరువుగా మారిపోయి తలబొప్పి కట్టిస్తాయి. ఎఫ్ ఎఫ్ – 8 లో ఇంత భారీ యాక్షన్ మధ్య సింపుల్ గా, సెంటి మెంటల్ గా ఓ పసివాడి ప్రాణాలు అనే కథ మాత్రమే!

         సైబర్  హ్యాకర్ గా చార్లిజ్ థెరాన్ హ్యాక్ చేయలేనిదంటూ వుండదు. కేవలం ఒక చిప్ తో దేన్నైనా హ్యాక్ చేసేయగలదు. నగరంలో కార్లని హ్యాక్ చేస్తే అవన్నీ డ్రైవర్ల అదుపులో వుండక అల్లకల్లోలం సృష్టిస్తాయి. రష్యాలో సబ్ మెరైన్ ని వ్యవస్థని, బెర్లిన్ లో బ్యాంకు వ్యవస్థని కూడా  ఆమె హ్యాక్ చేసి విద్రోహాలకి  పాల్పడగలదు. 

          వాయువేగంతో దూసుకెళ్ళే కార్లు, వాటి పేల్చి వేతలు;  రష్యా మంచు ప్రాంతంలో మిలిటరీ యాక్షన్, ఆ వాహనాల విధ్వంసాలూ, హేండ్ టు హేండ్ ఫైట్స్, గన్ ఫైట్స్ – బ్లాస్టింగ్స్ – వీటన్నిటి మధ్య మన హై వోల్టేజ్ యాక్షన్ హీరోలు, హీరోయిన్లు చెక్కు చెదరకుండా ఫ్రెష్ గా వుండడం, శత్రువులు మాత్రం చెత్తకింద తుక్కు అవడం, ఈ యాక్షన్ సీన్సులో కామెడీ, అసలు వీళ్ళ టీం బాసే ఒక కమెడియన్... ఏడాది నిండని పసివాడు కూడా నవ్వించడం, ఇలా బిగ్ కమర్షియల్ యాక్షన్  సినిమా కుండాల్సిన మసాలాలన్నీ వున్నాయి. 

          ఈ హై వోల్టేజ్ యాక్షన్ హీరో హీరోయిన్లు తామంతా ఒకే  ఫ్యామిలీ అంటారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఘోరంగా అవమానించుకుంటూ వుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవడున్నాడో ఎవడు చచ్చాడో కూడా పట్టించుకోరు. అంతా ముగిశాక మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ గా కూర్చుని,  కొత్తగా తమ ‘ఫ్యామిలీ’ లోకి ఆ పసి ప్రాణిని చేర్చుకుంటారు.

     ఇంకొకటి గమనిస్తే, కథ సింపుల్ లైనుతో వుండి, యాక్షన్ భారీగా వున్నప్పుడు డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా వుండడం. ఈ హై వోల్టేజ్ యాక్షన్ స్టార్స్ కి హాలీవుడ్ రచయిత రాసిన డైలాగులూ, వాటికి  హిందీ డబ్బింగ్ రైటర్ చేసిన అనువాదమూ ఎక్సెలెంట్. పాత్రల్ని ఉన్నత శిఖరాల్లాగా  చూపిస్తున్నప్పుడు వాటి నోట్లోంచి రావాల్సింది ఇలాటి తూటాల్లాంటి మాటలే. అవి మూసగా వుండక, కొత్త కొత్త ఉపమానాలతో క్రియేటివ్ గా కూడా వుండాల్సిందే. దీంతో పాటు గట్టిగా నవ్వు తెప్పించే  ఒకటీ రెండు పదాల జోకులూ అంతే పవర్ఫుల్ పంచ్ తో వుండడం గమనించాలి. ఇలా కామెడీ కోసం రాసిన డైలాగులు కూడా రఫ్ గా వుంటాయి. ఈ మూవీ అంతా యాక్షన్ తో ఎంత ఫన్నో, డైలాగ్ పవర్ తో కూడా అంతే ఫన్. 

          ఈ వ్యాసకర్త కావాలని ఆబిడ్స్ రామకృష్ణా లో హిందీ వర్షన్ చూశాడు. పై నుంచీ కింది దాకా అన్ని వర్గాల ప్రేక్షకులూ సెకండ్ షో హౌస్ ఫుల్ చేసి,  తమ అభిమాన తారల టక్కు టమారాల్ని, గిమ్మిక్కుల్నీ తెగ ఎంజాయ్ చేశారు. ఒక్కో  డైలాగుకి  ఎగిరెగిరి నవ్వుతూ ఎంజాయ్ చేశారు చివరిదాకా. ఇక్కడ హిందీ డబ్బింగ్ రైటరు పెద్ద హీరో అనేట్టున్నాడు. ఈ ప్రేక్షకుల్లో ఆడవాళ్ళు కూడా వున్నారు. 

          మొత్తానికి ఎఫ్ ఎఫ్ -8 హిందీ వెర్షన్ పెద్ద హిట్. సోమవారం కూడా ఆన్ లైన్ బుకింగ్స్ హౌస్ ఫుల్స్.

-     -  సికిందర్
www.cinemabazaar.in