దర్శకత్వం : ఎఫ్. గేరీ గ్రే
తారాగణం : విన్ డిసెల్, డ్వాయన్ జాన్సన్, జేసన్ స్టాథం, మిషెల్ రోడ్రిగ్స్, నాథాలీ ఇమ్మాన్యుయేల్, టిరెస్ గిబ్సన్, స్కాట్ ఈస్ట్ వుడ్, చార్లిజ్ థెరాన్ తదితరులు
రచన : క్రిస్ మోర్గాన్, సంగీతం : బ్రియాన్ టేలర్, ఛాయాగ్రహణం : స్టీఫెన్ ఎఫ్ విండన్
విడుదల : ఏప్రెల్ 14, 2017
***
చాలా సినిమాలు ఒకటి రెండు సీక్వెల్స్
తర్వాత నీరసించిపోతాయి. కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సీక్వెల్స్ సీను తగ్గడంగానీ, ప్రేక్షకుల మోజు తీరడం గానీ జరగడం లేదు. ప్రస్తుత
ఎనిమిదవ సీక్వెల్ కి మూడు రోజుల్లోనే బడ్జెట్ కి రెట్టింపు వసూళ్లు వచ్చాయి.
ఇండియాలోనూ ఇంగ్లీషుతోబాటు హిందీ, తెలుగు, తమిళంతో బాటు, తొలిసారిగా కన్నడ
డబ్బింగ్ వెర్షన్లు దిగ్విజయంగా ఆడేస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి అత్యధిక
ప్రజాదరణ లభిస్తోంది. ఈ ఫ్రాంచైజ్ ప్రారంభమైన నాటి నుంచీ నటిస్తున్న విన్ డిసిల్
తో బాటు ఒక్కో సీక్వెల్ తో పరిచయమవుతూ వస్తున్న స్టార్స్ కి ఇండియాలో అశేష అభిమాను
లేర్పడ్డారు. హై వోల్టేజ్ యాక్షన్
స్టార్స్ అయిన వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఎఫ్ ఎఫ్ -8
ఇప్పుడు ఆలిండియా హిట్టయ్యింది.
కారు రేసులు, దోపిడీలూ వంటి కథాంశాలతో నిర్మాణం జరుపుకుంటూ వస్తున్న ఈ సీక్వెల్స్ ఈ సారి జేమ్స్ బాండ్ సాహసకృత్యాల వైపు మళ్ళింది. ఒక టీముగా వుండి ఒక ఆపరేషన్ పూర్తి చేసే యాక్షన్ స్టార్స్ జట్టు, ఇప్పుడు ఒక్కొకరు ఒక్కో జేమ్స్ బ్యాండ్ లైపోయి రష్యాలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ విజయవంతం చేసి వస్తారు.
ఇందులో
లాజిక్ చూడకూడదు, సాధ్యాసాధ్యాలు అడక్కూడదు- కళ్ళప్పగించి హైపర్ యాక్షన్ సీన్స్ చూస్తూ
ఉండడమే. కారు రేసులో హీరోగారు కారుని రివర్స్ గేరులో వెనక్కి నడిపి రేసు గెల్చినా
దీన్నొక మైండ్ లెస్ యాక్షన్ కామెడీగానే ఎంజాయ్
చేయాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. డిసిల్ భార్యనీ, కొడుకునీ సైఫర్ అనే సైబర్
టెర్రరిస్టు పాత్రలో చార్లిజ్ థెరాన్ కిడ్నాప్
చేసి బంధించి, డిసిల్ చేత విద్రోహ పనులు
చేయిస్తూంటుంది. తమ టీము లోంచి విడిపోయి డిసిల్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్ధంగాని
మిగతా టీం మెంబర్లు అతడి పన్లకి అడ్డు పడుతూంటారు. డిసిల్ కొడుకుని కాపాడుకుంటూ
సైఫర్ ని అణిచేందుకు ఓ ప్లానేసి సాగిపోతాడు- ఈ ప్రయాణం రష్యాకి దారితీస్తుంది- టీం
అంతా అతడి వెంట వుంటుంది.
హాలీవుడ్ ‘హై కాన్సెప్ట్’ సినిమాలు యాక్షన్ భారీగా, స్టోరీలైన్ సింపుల్ గా వుంటాయి. ఈ మర్మం టాలీవుడ్ తెలుసుకోవడం లేదు. యాక్షనూ భారీగా, స్టోరీ లైనూ ఏవేవో లగేజీలతో మోతబరువుగా మారిపోయి తలబొప్పి కట్టిస్తాయి. ఎఫ్ ఎఫ్ – 8 లో ఇంత భారీ యాక్షన్ మధ్య సింపుల్ గా, సెంటి మెంటల్ గా ఓ పసివాడి ప్రాణాలు అనే కథ మాత్రమే!
సైబర్
హ్యాకర్ గా చార్లిజ్ థెరాన్ హ్యాక్
చేయలేనిదంటూ వుండదు. కేవలం ఒక చిప్ తో దేన్నైనా హ్యాక్ చేసేయగలదు. నగరంలో కార్లని
హ్యాక్ చేస్తే అవన్నీ డ్రైవర్ల అదుపులో వుండక అల్లకల్లోలం సృష్టిస్తాయి. రష్యాలో
సబ్ మెరైన్ ని వ్యవస్థని, బెర్లిన్ లో బ్యాంకు వ్యవస్థని కూడా ఆమె హ్యాక్ చేసి విద్రోహాలకి పాల్పడగలదు.
వాయువేగంతో దూసుకెళ్ళే కార్లు, వాటి పేల్చి వేతలు; రష్యా మంచు ప్రాంతంలో మిలిటరీ యాక్షన్, ఆ వాహనాల విధ్వంసాలూ, హేండ్ టు హేండ్ ఫైట్స్, గన్ ఫైట్స్ – బ్లాస్టింగ్స్ – వీటన్నిటి మధ్య మన హై వోల్టేజ్ యాక్షన్ హీరోలు, హీరోయిన్లు చెక్కు చెదరకుండా ఫ్రెష్ గా వుండడం, శత్రువులు మాత్రం చెత్తకింద తుక్కు అవడం, ఈ యాక్షన్ సీన్సులో కామెడీ, అసలు వీళ్ళ టీం బాసే ఒక కమెడియన్... ఏడాది నిండని పసివాడు కూడా నవ్వించడం, ఇలా బిగ్ కమర్షియల్ యాక్షన్ సినిమా కుండాల్సిన మసాలాలన్నీ వున్నాయి.
ఈ హై వోల్టేజ్ యాక్షన్ హీరో హీరోయిన్లు తామంతా ఒకే ఫ్యామిలీ అంటారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఘోరంగా అవమానించుకుంటూ వుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవడున్నాడో ఎవడు చచ్చాడో కూడా పట్టించుకోరు. అంతా ముగిశాక మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ గా కూర్చుని, కొత్తగా తమ ‘ఫ్యామిలీ’ లోకి ఆ పసి ప్రాణిని చేర్చుకుంటారు.
ఇంకొకటి
గమనిస్తే, కథ సింపుల్ లైనుతో వుండి, యాక్షన్ భారీగా వున్నప్పుడు డైలాగ్స్ కూడా
పవర్ఫుల్ గా వుండడం. ఈ హై వోల్టేజ్ యాక్షన్ స్టార్స్ కి హాలీవుడ్ రచయిత రాసిన
డైలాగులూ, వాటికి హిందీ డబ్బింగ్ రైటర్
చేసిన అనువాదమూ ఎక్సెలెంట్. పాత్రల్ని ఉన్నత శిఖరాల్లాగా చూపిస్తున్నప్పుడు వాటి నోట్లోంచి రావాల్సింది
ఇలాటి తూటాల్లాంటి మాటలే. అవి మూసగా వుండక, కొత్త కొత్త ఉపమానాలతో క్రియేటివ్ గా
కూడా వుండాల్సిందే. దీంతో పాటు గట్టిగా నవ్వు తెప్పించే ఒకటీ రెండు పదాల జోకులూ అంతే పవర్ఫుల్ పంచ్ తో
వుండడం గమనించాలి. ఇలా కామెడీ కోసం రాసిన డైలాగులు కూడా రఫ్ గా వుంటాయి. ఈ మూవీ
అంతా యాక్షన్ తో ఎంత ఫన్నో, డైలాగ్ పవర్ తో కూడా అంతే ఫన్.
ఈ వ్యాసకర్త కావాలని ఆబిడ్స్ రామకృష్ణా లో హిందీ వర్షన్ చూశాడు. పై నుంచీ కింది దాకా అన్ని వర్గాల ప్రేక్షకులూ సెకండ్ షో హౌస్ ఫుల్ చేసి, తమ అభిమాన తారల టక్కు టమారాల్ని, గిమ్మిక్కుల్నీ తెగ ఎంజాయ్ చేశారు. ఒక్కో డైలాగుకి ఎగిరెగిరి నవ్వుతూ ఎంజాయ్ చేశారు చివరిదాకా. ఇక్కడ హిందీ డబ్బింగ్ రైటరు పెద్ద హీరో అనేట్టున్నాడు. ఈ ప్రేక్షకుల్లో ఆడవాళ్ళు కూడా వున్నారు.
మొత్తానికి ఎఫ్ ఎఫ్ -8 హిందీ వెర్షన్ పెద్ద హిట్. సోమవారం కూడా ఆన్ లైన్ బుకింగ్స్ హౌస్ ఫుల్స్.