రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Wednesday, November 2, 2016
Tuesday, November 1, 2016
తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -ఉపసంహారం- 2
స్క్రీన్ ప్లే సూత్రాల్ని ఎవరికి వాళ్ళు ఆకాశంలోకి
చూస్తూ సృష్టించలేదు. వచ్చిన సినిమాలనే చూస్తూ వాటి కథానిర్మాణాల్లోంచి
సిద్ధాంతాలు చేశారు. పదార్ధం లేకుండా శాస్త్రం లేదు. నాట్యం పుట్టక ముందు నాట్య
శాస్త్రం లేదు, సినిమాలు పుట్టక ముందు స్క్రీన్ ప్లే శాస్త్రమూ లేదు. కొన్ని వందల స్క్రిప్టులు చదివిన
అనుభవంతోనే సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే మీద పుస్తకాలు రాయగలిగాడు. ఇరవై ఏళ్ళూ
సినిమాల్నీ పురాణాల్నీ పరిశీలన చేసిన మీదటే జేమ్స్ బానెట్ అలాటి సంచలన పుస్తకం రాయగలిగాడు. కాబట్టి
స్క్రీన్ ప్లే సూత్రాలు సొంత కవిత్వాలనీ, అలాటి
ఒకడి సొంత కవిత్వం మనకక్కర్లేదనీ విజ్ఞత గలవాళ్ళు అనుకోరు!
కావాల్సింది
సూత్రాల్ని తెలుగు సినిమాలకి అడాప్ట్ చేసుకునే మెళకువే. ఎలా అడాప్ట్
చేసుకోవాలన్న దానిపైనే ఈ తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు ఆధారపడ్డాయి. విభిన్న అభిరుచులు గలవాళ్ళకి విభిన్న
స్క్రీన్ ప్లేలు రాస్తున్నప్పుడు జరిగే
మేధోమథనంలోంచి ఈ అన్వయింపు సులభంగా జరిగిపోతూ వచ్చింది. మరొకటేమిటంటే, ఆయా కాలాల్లో స్క్రీన్ ప్లే పుస్తకాల్లో ఇచ్చిన సమాచారమే సమాచారం కాదు. వాటి మీద
ఆధారపడితే క్రియేటివిటీ అక్కడికక్కడే
ఘనీభవించి పోతుంది. సినిమా రచన అనేది నిత్య చలనశీలమైనది. కొత్త కొత్త సమాచారాన్ని
ప్రతినిత్యం తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతూంటుంది. ఈ సమాచారాన్ని గానీ, టిప్స్ ని
గానీ హాలీవుడ్ నుంచి వెలువడే అనేక స్క్రీన్ ప్లే వెబ్ సైట్స్ అందిస్తూంటాయి. వీటి
మీద కూడా ఓ కన్నేసి వుంచాల్సి ఉంటుంది.
ఉదాహరణకి,
స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి ఒక గోల్ ఏర్పడాలని అన్ని
స్క్రీన్ ప్లే పుస్తకాల్లోనూ చెప్తారు. తెలిసిందే
కదా, ‘శివ’ లో కూడా నాగార్జున జేడీని సైకిలు చైను తో కొట్టడంతో మాఫియాని అంతమొందించే గోల్ పెట్టుకున్నాడని
అర్ధమవుతోంది కరెక్టే, ఏ సినిమాలోనైనా ఇలా
ఏదో ఒక గోల్ ఏర్పడుతుంది నిజమేనని సింపుల్
గా అన్పించవచ్చు. ఐతే ఏ స్క్రీన్ ప్లే
పుస్తకాల్లోనైనా ఈ భౌతిక స్థితే చెప్పి
వదిలేస్తారు. కానీ చాలా పూర్వం, ఒక స్క్రీన్ ప్లే వెబ్ సైట్ లో ఒక గెస్ట్ రైటర్ ఈ
గోల్ కి కళ్ళెదుట వున్న భౌతిక స్థితితే కాకుండా, కంటికి కన్పించని మానసిక స్థితి కూడా
ఉంటుందనీ, అప్పుడే అది సజీవ పాత్రగా కన్పిస్తుందనీ ఒక ఆర్టికల్ రాసుకొచ్చాడు.
ఇదెక్కడ్నించీ తెలుసుకున్నాడు? సినిమాల్లోంచే. ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే కంటికి కన్పించే గోల్ తో పాటూ, కంటికి కన్పించని
మానసిక స్థితిలో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషనూ అనే నాల్గు ఎలిమెంట్స్
ఉంటాయనీ తేల్చాడు. పరిశీలిస్తే ఇవి ‘శివ’ లో
లేవా? వున్నాయి. దీన్ని కూడా స్ట్రక్చర్ లో భాగంగా చేసి గోల్ ఎలిమెంట్స్ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇలా
గోల్ కో అంతర్నిర్మాణం ఉంటుందనీ, ఆ
అంతర్నిర్మాణంలో వుండే నాల్గు ఎలిమెంట్స్ ని కూడా ప్లే చేస్తూ కథ నడిపితే బలంగా
వస్తుందనీ తెలుసుకున్నాక, ఒక కొత్త స్పృహతో స్క్రీన్ ప్లేలు రాసుకుంటారు కదా?
ఇలాగే సినిమాలకి కథలు మాత్రమే పనికొస్తాయనీ, గాథలు పనికి రావనీ ఒక గొప్ప సత్యాన్ని ఇంకో వెబ్ సైట్లో ఇంకో నిపుణుడు రాసుకొచ్చాడు. ఇది కూడా నిజమే కదా, గాథలుగా తీసిన ‘బ్రహ్మోత్సవం’, ‘పైసా’ లాంటి తెలుగు సినిమాలు ఎలావున్నాయో చూశాం. అంటే కథకీ, గాథకీ తేడా తెలుసుకుని జగ్రత్తపడ్డం కూడా అవసరమే నన్న మాట. ఇలాగే టైం అండ్ టెన్షన్ థియరీ గురించి, ప్లాట్ పాయింట్ వన్ లోనే కథకి ముగింపూ ఉంటుందన్న అవగాహన గురించీ, ఇలా మరెన్నో స్క్రిప్టింగ్ టూల్స్ ని పుస్తకాలు గాక ఇతర ప్రాప్తి స్థానాల్లో గమనించాక, వీటిని ‘శివ’ కి అన్వయించి చూసుకుని ఇలా తెలుగు స్ట్రక్చర్ లో భాగం చేశామన్నమాట. కథకి క్లయిమాక్స్ తెలిపోయిందంటే ఆ లోపం ప్లాట్ పాయింట్ వన్ లోనే ఉంటుందని ఏ పుస్తకాల్లో చెప్తారు? దివంగత దర్శకుడు బిల్లీ వైల్డర్ అనుభవంలోంచి వచ్చిందీ సంగతి.
ఇక
ఇప్పటి తెలుగు సినిమాల దృష్ట్యా జోసఫ్ క్యాంప్ బెల్ గ్రంథంలోని గొప్ప విషయాల్ని
తీసుకోలేం. దర్శకుడు దేవ కట్టా 2005 లో మొదటి సినిమా ‘వెన్నెల’ తీశాక, యూఎస్ నుంచీ
ఈ వ్యాసకర్తకి ఫోన్ చేసి కథ అడిగినప్పుడు, అయిన పరిచయంలో, జోసెఫ్ క్యాంప్ బెల్ ని చదువు కున్నానన్నారు. తర్వాత
‘ప్రస్థానం’ తీసినప్పుడు ఆ ఛాయలు కొంతమేర కన్పించాయి గానీ, ఆ తర్వాత తీసిన
‘ఆటోనగర్ సూర్య’, ‘డైనమైట్’ లలో ఆచరణ సాధ్యం కాలేదు. గొప్ప క్లాసిక్స్ తీయాలంటే
క్యాంప్ బెల్ ని అనుసరించవచ్చు, ‘బాహుబలి’ తీయాలంటే కూడా అనుసరించవచ్చు. అప్పట్లో
‘స్టార్ వార్స్’ క్యాంప్ బెల్ ని అనుసరించి తీసిందే.
అలాగే జేమ్స్ బానెట్ నుంచి కూడా మొత్తం తీసుకోలేం. ప్రేక్షకులకి కథతో ఏర్పడాల్సిన బలమైన సైకలాజికల్ కనెక్షన్ కి బానెట్ చెప్పుకొచ్చిన కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే అనే టూల్ ని మాత్రమే తెలుగు స్క్రీన్ ప్లేలకి చాలునని దాన్ని మాత్రం తీసుకుని స్ట్రక్చర్ లో భాగంగా చేశాం. ఇలా తెలుగు స్క్రీన్ ప్లేల పటిష్టతకి ఏవేవి అవసరపడతాయో పరిశీలించి, వాటిని స్ట్రక్చర్ లో చేర్చుకున్నాం.
కథా చర్చల్లో తెలిసివస్తున్న ఇంకో ప్రధానాంశం ఏమిటంటే, ఐడియా దగ్గరే వైఫల్యం చెందడం. రెండు వాక్యాల్లో తమ కథల లైన్ ఏమిటో చెప్పలేకపోవడం, కథంతా చెప్పుకు రావడం. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. విత్తనం దగ్గరే తత్తర పాటుతో వుంటే ఇక కథా వ్యవసాయం ఇంకేం చేయగలరు. ఎవరైనా మా విత్తనం ఇదీ అని చెప్పినా ఆ విత్తనం పుచ్చి పోయి ఉంటోంది. ఇది తీవ్ర ఆందోళనకి లోను జేసింది. తెలుగుకి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రాయాలంటే ఇక్కడ్నించే ప్రారంభించాలన్న అవగాహనా కుదిరింది. ఔత్సాహికులు రాసుకొస్తున్న కథల్లో కన్ఫ్యూజన్ అంతా తొట్టతొలుత కథకి బీజం పడే ఐడియా దగ్గరే ఉంటోందని అర్ధమైంది. అంటే స్ట్రక్చర్ సంగతులు అయిడియా దగ్గర్నుంచే మొదలెట్టాలన్నమాట. స్క్రీన్ ప్లే పుస్తకాల్లో బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే వుంటుంది. బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్లో వాటి తాలూకు బిజినెస్ గురించి వుంటుంది. వాటిలో ప్రధాన పాత్ర ప్రయాణం గురించి వుంటుంది. లైన్ ఆర్డర్ ఎలా వేసుకోవాలో వుండదు. అలాగే అసలు కథకి ఐడియాని ఎలా నిర్మించుకోవాలో వుండదు.
హాలీవుడ్
లో లిటరరీ ఏజెంట్లు మార్కెట్ దృక్కోణంలో ఐడియా ఎలా ఉండాలో చెప్తూంటారు. ఈ లిటరరీ ఏజెంట్లే స్క్రీన్ రైటర్ల స్క్రిప్టుల్ని
స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చేరవేసి బేరసారాలు చేసే పనిలో వుంటారు. వీళ్ళు ఈ
ట్రెండ్ కి, ఇప్పటి సీజన్ కి ఫలానా ఈ ఈ అయిడియాలు వర్కౌట్ అవుతాయని చెబుతూంటారు.
మనదగ్గర ఇది మాత్రమే చాలదని అర్ధమయ్యింది. ఐడియాకి మార్కెట్ దృక్కోణమే గాకుండా,
ఐడియాకి క్రియేటివ్ దృక్కోణం కూడా తప్పని సరి చేయాలన్న ఆలోచనపుట్టింది. మొట్టమొదట సినిమా
తీయడానికి పుట్టే ఐడియాలోనే మొత్తం
స్క్రీన్ ప్లేకి సంబంధించిన డీఎన్ఏ అంతా లేకపోతే, ఆపైన ఆ స్క్రీన్ ప్లే నిలబడదనీ,
దాంతో సినిమా కూడా నిలబడదనీ పరమసత్యం
బోధపడింది. ఆ డీఎన్ఏ ‘ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్’ అయి వుండాలని
నిర్ణయించి- కథలు పట్టుకొచ్చే వాళ్ళతో కూర్చుని మూడు నాల్గు రోజులు ముందు ఈ దృష్టితోనే ఐడియాల మీద కసరత్తు చేయడం, చేయించడం మొదలైంది.
అలా క్రియేటివ్ దృక్కోణాన్ని కూడా కలుపుకుని ‘ఐడియాలో కథ వుందా?’ అన్న మూడవ అధ్యాయం
పుట్టింది. ఇక్కడ్నించే మిగిలిన అధ్యాయాలకి బాట పడింది.
హాలీవుడ్ లో సినాప్సిస్ రైటింగ్ కే ప్రత్యేక శిక్షణాలయాలు ఎందుకున్నాయో నాల్గవ అధ్యాయంలో చెప్పుకున్నాం. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించినందునే, ‘ఐడియా’ తర్వాత ‘సినాప్సిస్ రైటింగ్’ అధ్యాయాన్ని సృష్టించాం. వీటి తర్వాతే స్క్రీన్ ప్లే కి బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల చర్చలో కెళ్ళాం. ఈ విభాగాల వేర్వేరు బిజినెస్సుల్ని, లైన్ ఆర్డర్ సహితంగా చెప్పుకుంటూ వచ్చాం. దీనికి ఉదాహరణగా ‘శివ’ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇందులో ఒకే కథ వుంటుంది, కథకి అడ్డుపడే వేరే ఉపకథలూ, కామెడీ ట్రాకులూ వగైరా వుండవు. సీను తర్వాత సీనుగా ఒకే కథ సూటిగా సాగుతూంటే, స్ట్రక్చర్ ని ఫాలో అవడం చాలా సులభంగా వుంటుంది. పైగా సిడ్ ఫీల్డ్ బుక్కు, ‘శివ’ ఒక్కటే.
ఈ
వ్యాసకర్త సరళమైన, బలమైన సమకాలీన తెలుగు కమర్షియల్ సినిమా కథలకి సిడ్ ఫీల్డ్ నే
నమ్ముకోవాలని పక్కగా ఏనాడో డిసైడ్ అయ్యాడు. సిడ్ ఫీల్డ్ నమూనా ప్రకారం ప్లాట్
పాయింట్స్ -1, 2 లు, పించ్ పాయింట్స్ -1, 2 లు, ఒక మిడ్ పాయింట్ – ఈ 5 మాత్రమే గుర్తుపెట్టుకుంటే
చాలు- ఏ కథయినా సులభంగా వచ్చేస్తుంది. పండితులకి మాత్రమే అర్ధమయ్యే సంక్లిష్ట
శాస్త్రంగా ఉంటున్న స్క్రీన్ ప్లే కోర్సుని యువతరం కోసం నేలకు దించి, సరళతరం చేసి,
సుబోధకం చేశాడు ఫీల్డ్. ఇంకా తర్వాత చాలామంది
త్రీ యాక్ట్స్ కాదు, ఫోర్ యాక్ట్స్ అనీ, ఎయిట్ యాక్ట్స్ అనీ నానా సంక్లిష్టం
చేసి పుస్తకాలు రాస్తున్నారు. ఇవన్నీ ఔత్సాహికులు ఈ వ్యాసకర్త దృష్టికి
తెచ్చి ప్రశ్నిస్తున్నారు. ఎందుకీ సందేహాలు. తెలుగు సినిమాలు ఎప్పుడైనా
త్రీయాక్స్ట్ కి మించి ఉన్నాయా? పోనీ ఇతర భాషల సినిమాలూ, హాలీవుడ్ సినిమాలైనా అలా ఉన్నాయా? ఉన్న త్రీ
యాక్ట్స్ నే విభజించి 4, 8, 16, 32 ...ఎన్నైనా చేయవచ్చు. ఒక టీని మహా అయితే 1/3 చేసుకుని తాగవచ్చు, 1/4, 1/8, 1/16, 1/32
చేసుకుని ఎలా తాగుతారు. ఏం చేస్తున్నారంటే -జోసెఫ్ క్యాంప్ బెల్, జేమ్స్ బానెట్ లలో
కన్పించే హీరోస్ జర్నీ తాలూకు పదీ
పన్నెండు మజిలీల్నే యాక్స్ట్ కింద పెంచి చూపిస్తున్నారు. లేదా ఏ కథలోనైనా వుండే
ఎనిమిది సీక్వెన్సుల్ని ఎనిమిది యాక్ట్స్ గా చూపిస్తున్నారు. ఇవన్నీ బాగా పాపులర్
అయిపోయిన సిడ్ ఫీల్డ్ అంటే ఈర్ష్యతో చేస్తున్న పనులు. ఒక పాత స్కూలు పండితుడు తన
స్క్రీన్ ప్లే పుస్తకంలో సిడ్ ఫీల్డ్ ని
పరోక్షంగా తిట్టాడు కూడా. ఈ పీఠాల కోసం జరిగే పోరాటాల్లో లేగ దూడల్లా మనం నలిగిపోనవసరంలేదు.
సింపుల్ గా ‘శివ’ కి సరిపోయిన సిడ్ ఫీల్డ్ నమూనానే తీసుకుని, దీనికి స్థానిక అవసరాలకి అనుగుణంగా, పైన చెప్పుకున్నలాంటి ఆయా ఎలిమెంట్స్ ఎన్నింటినో కలుపుకుని, మన నమూనా
తయారు చేసుకున్నాం.
ఇలా
డీ ఫాల్టుగా వున్న శాస్త్రాన్ని తెలుగుకి కస్టమైజ్ చేస్తూ పోతూంటే ‘తెలుగు సినిమా
స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అనే సబ్జెక్టు
చేతికొచ్చింది. ఇదంతా సుదీర్ఘ కాలంగా ఎంతోమంది అసోషియేట్ డైరెక్టర్లతో, కొందరు కో-
డైరెక్టర్లతో, డైరెక్టర్లతో చేస్తూ వచ్చిన
స్క్రీన్ ప్లేల వల్ల ప్రాక్టికల్ అనుభవంతోనే సాధ్యమైంది. మరొకటేమిటంటే, శాస్త్రాన్ని శాస్త్రంగా చూడక, దాన్ని ఓన్
చేసుకుని, మన ఐడియాలజీగా, ఫిలాసఫీగా వొంటబట్టించుకుంటే తప్ప ఇది రాయడానికి ధైర్యం
చాల్లేదు.
ఇక ఎన్నారై రాజేంద్ర ఆక్షేపించినట్టు ఈ వ్యాసాల్ని అకడెమిక్ భాషలో రాయలేదు. సినిమా జర్నలిజం పండిత భాషలో వుండదు. ముళ్ళపూడి వెంటకరమణ గారు పండిత భాషలో సినిమా వ్యాసాలు రాయలేదు. సిడ్ ఫీల్డ్, జేమ్స్ బానెట్ లు కూడా పండిత భాషలో రాయలేదు. ఈ వ్యాసాల్ని పదో తరగతి చదివిన సినిమా అసిస్టెంట్ కుర్రాడికి కూడా సులభంగా అర్ధమయ్యే వాడుక భాషలోనే రాశాం.
చివరిగా, ఈ వ్యాసాల్ని తమ సాహిత్య మాసపత్రిక ‘పాలపిట్ట’ లో ప్రచురిస్తూ వచ్చిన ఎడిటర్ గుడిపాటి వెంకటేశ్వర్లు, వర్కింగ్ ఎడిటర్ కె.పి. అశోక్ కుమార్ గార్లకు ధన్యవాదాలు. ‘సినిమా బజార్ డాట్ కాం’ లో ఈ వ్యాసాల్ని ప్రచురణకి తీసుకున్న పి. సతీష్ గారికీ ధన్యవాదాలు. ఈ వ్యాసాల్ని హిందీలోకి అనువదించి, యూనివర్శిటీ తరపున పుస్తకంగా వేస్తామని తెలిపిన రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ అయ్యర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
-సికిందర్
Sunday, October 30, 2016
తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ - ఉపసంహారం!
తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- అనే ఈ శీర్షిక అంటేనే సింహస్వప్నంలా వుండేది ఈ వ్యాసకర్తకి. ఈ శీర్షిక నిర్ణయించి దీనికింద తెలుగు సినిమా స్క్రీన్ ప్లే లు ఎలా రాసుకోవాలో తెలియజెప్పడం చాలా సాహసం కిందే లెక్క. 1998 లో సినిమా రివ్యూలు రాయడానికే తగిన అర్హత వుండాలని స్వీయ నిబంధన విధించుకుని, స్క్రీన్ ప్లే సబ్జెక్టు మీద పుస్తకాలూ అవీ చదువుకుని – అర్హతల సంగతెలా వున్నా- కాస్త జ్ఞానం మాత్రం సంపాదించుకున్నాక, రివ్యూలు రాయడం కొనసాగిస్తూంటే వచ్చిన ధైర్యంతో, ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అంటూ ఇంకో పతాకం ఎగరేయడమన్నది తొందరపాటుతనమే అవుతుందని చాలా కాలం దీని జోలికే పోలేదు. అయినా చేతులు వూరుకోక 2003 లో సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ నమూనాతో పోలుస్తూ తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేలు ఎన్నిరకాలుగా ఇష్టానుసారంగా వుండి విఫలమవుతున్నాయో ఒక పెద్దవ్యాసం ‘ఆంధ్రభూమి’ లో రాసినప్పుడు భారీ స్పందన వచ్చింది. అలా స్పందించిన ముఖ్యుల్లో దర్శకుడు కె. దశరథ్ - ‘స్క్రీన్ ప్లే మీద పుస్తకం రాయండి, నిధులు నేను సమకూరుస్తా’ నన్నారు. రిఫరెన్స్ పుస్తకాలు కూడా ఇచ్చారు. అవన్నీ చదివి రాయడం మొదలుపెట్టి మొదటి అధ్యాయాన్ని అన్నపూర్ణా స్టూడియోలో వున్న ఆయనకి చూపిస్తే, మొదటి పేజీ చదువుతూనే విసిరికొట్టారు. ఆ కాగితాలు ఏరుకుని సారీ చెప్పి వచ్చేశాడీ వ్యాసకర్త. అక్కడితో ఆ ప్రయత్నం ఆగిపోయింది.
తర్వాత 2005 లో సినిమాల ఆసక్తి వున్న రాజేంద్ర
అనే ఎన్నారై ఈ వ్యాసకర్తని వెతుక్కుంటూ
వచ్చి, స్క్రీన్ ప్లే పుస్తకం రాసే ఆఫరిచ్చి, కొన్ని ఇంగ్లీషు పుస్తకాలిచ్చారు. మళ్ళీ
కొత్త ప్రయత్నం మొదలు. అది రాస్తూ కొన్ని పేజీలు చూపిస్తే, ఆయన ఇంకెవరికో
చూపించి, భాష అకడెమిక్ గా లేదన్నారు. అది కూడా అలా ఆగిపోయింది. ఈ రెండు అనుభవాలతో
తేలిందేమిటంటే, సినిమాలు చూసిన అనుభవంతో, రివ్యూలు రాస్తున్నామన్న ధైర్యంతో, స్క్రీన్ ప్లే మీద పుస్తకాలు చూసి రాయలేమనీ,
చేసి రాయాలనీ!
ఇంగ్లీషులో నాలుగు స్క్రీన్ ప్లే పుస్తకాలు ముందేసుకుని అందులోంచి కొంతా ఇందులోంచి కొంతా మిశ్రమం చేసి తెలుగులో ఓ స్క్రీన్ ప్లే పుస్తకం అచ్చేస్తే బ్రహ్మాండంగా అమ్ముడుబోతుందని తెలుసు. తెలుగులో స్క్రీన్ ప్లే పుస్తకాల కొరత చాలా వుంది. పైగా ఇంగ్లీషు పుస్తకాల్లో లభించే పరిపూర్ణ జ్ఞానాన్ని భాషా సమస్య వల్ల చాలా మంది నోచుకోలేకపోతున్నారు. టాలీవుడ్ రచనా పరంగా ఎదగకపోవడానికి ఇదొక కారణం. ఓ నాలుగు ఇంగ్లీషు పుస్తకాల్ని తెలుగులో కాపీ కొట్టి అచ్చేసినా భారీగా అమ్ముడుపోతాయి. కానీ ఇది మోసం చేయడమే అవుతుంది. అలా రాసిన పుస్తకాలు ఎవరికీ ప్రాక్టికల్ గానూ ఉపయోగపడవు. వాటిని చదివి ఎవరైనా తెలుగులో స్క్రీన్ ప్లేలు రాసే ప్రయత్నం చేస్తే, అవి అస్థిపంజరాల్లా తయారవుతాయే తప్ప, రక్త మాంసాలేర్పడవు. ఎవరికైనా రక్తమాంసాల్లాగా తెలుగులో ఈ పుస్తకాలు ఉపయోగపడాలంటే, ప్రాక్టికల్ అనుభవం సంపాదించుకున్న తర్వాతే అలాటి పుస్తకాలు రాయాలని అర్ధమయ్యింది. ఈ రక్తమాంసాల అన్వేణషకే ప్రాక్టికల్ అనుభవం అనే కూడలికి చేరాల్సి వచ్చింది....కూలివాని చెమటలోనే ధనమున్నదిరా అన్నట్టు.
రివ్యూలు రాయడానికి ఎంత స్క్రీన్ ప్లే జ్ఞానం సంపాదించుకున్నా, ఆ జ్ఞానం స్క్రీన్ ప్లే మీద క్షుణ్ణంగా పుస్తకాలు రాయడానికి చాలదు. 2003 లో సుభాష్ రెడ్డి అనే ఎన్నారై ఓ జర్నలిస్టు మిత్రుడి ద్వారా ఈ వ్యాసకర్తని సోలో రైటర్ గా పెట్టుకుని సినిమా తీయడం ప్రారంభించారు. ప్రారంభంలో సోలో రైటర్ గా వున్న ఈ వ్యాసకర్త కాస్తా, ఆయనే రాసేస్తూంటే ఫేర్ చేసేసే బంటులా మారిపోయాడు. ఆ సినిమా పేరు ‘సిటీ’.
తర్వాత 2005 లో చల్లా శ్రీనివాస్ తో కలిసి ఈ వ్యాసకర్త ‘భూకైలాస్’ అనే కథని, స్క్రీన్ ప్లేని శివ నాగేశ్వర రావు గారికిచ్చి, మంచి బలమైన ఆత్మవిశ్వాసంతో వుంటే, తీరా డైలాగ్ వెర్షన్ వచ్చేసరికి సమూలంగా రూపు రేఖలే మారిపోయి- ఆ దశలో వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేక- పేర్లు వేయవద్దని బతిమాలుకుని, ఆయన బాధ పడ్డా తప్పుకోవాల్సి వచ్చింది.
2008 లో టి. ప్రభాకర్ గారితో ‘బతుకమ్మ’ చేసినప్పుడు మధుఫిలిం ఇనిస్టిట్యూట్ నటరాజ్ గారు, ఆయన మిత్రుడు రచయిత దేవరాజ్ కలిసి ఈ వ్యాసకర్తని ప్రభాకర్ గారి ఎదుట హాజరుపర్చారు. ఆ కథంతా విని- ‘ఇందులో మీరు భావకవిత్వం చెబుతున్నారా, విప్లవ కవిత్వమా? ఈ కథ విప్లవ కవిత్వంలో భావకవిత్వం చెప్తున్నట్టుంది’ అన్నాడీ వ్యాసకర్త (అప్పటికి జానర్ మర్యాద గురించి ఏమాత్రం జ్ఞానం లేదు ఈ వ్యాసకర్తకి. ఇప్పుడు సింహావలోకనం చేసుకుంటే జానర్ మర్యాద గురించిన మాటలే ఆనాడు వచ్చేశాయని అర్ధమవుతోంది).
ఆ మాటతో ఈ వ్యాసకర్తని పట్టేసుకుని వదల్లేదు ప్రభాకర్ గారు. ‘బతుకమ్మ’ డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేసేదాకా ఆయనతో వుండాల్సివచ్చింది. సినిమాకి స్ట్రక్చర్ అనేది ఒకటుంటుందని తెలుసుకుని, ఇది తెలీకుండానే పది సినిమాలు తీసినందుకు పశ్చాత్తాపపడ్డారు. స్ట్రక్చర్ ని గుర్తించి గౌరవించినందుకు ఈ వ్యాసకర్త గర్వపడ్డాడు. ఆయనే కాదు, ఇంకా నటరాజ్, దేవరాజ్ లతో బాటు కో- డైరెక్టర్ త్రినాథ్, అసోసియేట్ శ్రీనివాస్ కూడా స్ట్రక్చర్ రుచి తెలుసుకుని దానికే సలాం చేశారు. మూలాలు ఆంధ్రాలో వున్నా, తెలంగాణలో పుట్టిపెరిగి తిరుగుతున్న ఈ వ్యాసకర్తకి తెలంగాణా జీవితం, చరిత్ర బాగానే తెలుసు. ‘బతుకమ్మ’ లాంటి తెలంగాణా సినిమాకి రాయడం ఓ అదృష్టంగానే ఫీలయ్యాడు. కానీ తీరా సినిమా పూర్తయ్యాక చూస్తే అదే స్ట్రక్చర్ అనే పదార్థాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది.
తిరిగి 2010 లో ప్రభాకర్ గారే మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ గురించి పరిశోధనాత్మక కథ మొదలెట్టారు. ఇది రెండేళ్ళూ సాగింది. వరంగల్ మెడికల్ కాలేజీకి బృందంగా వెళ్లి, హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి ఈ వ్యాసకర్త ఒక్కడే వెళ్లి మెడికల్ కాలేజీల, హాస్టల్స్ ల, లాబ్స్ ల పనితీరు, ర్యాగింగ్ సమస్యా పరిశీలించి వచ్చి రెండేళ్ళూ రాశారు. స్క్రిప్టుని లాక్ చేసి వెళ్ళిపోయాక, కథంటే ఏమిటో ఏమీ తెలీని ఒక కొత్త రచయిత ఎంటరై మార్చేశాడు. దాని స్క్రీన్ ప్లే కి ఈ వ్యాసకర్త పేరు వేయవద్దని చెప్పినా వేసేశారు. ఆ సినిమా ఒక్క రోజు ఆడింది. విజయవాడలో ఒక్క ఆట ఆడింది. అందులో వుండాల్సిన స్ట్రక్చర్, కంటెంట్, పాయింట్ ఏవీ లేవు. ఆ సినిమా పేరు ‘కాలేజీ స్టోరీ’ గా ఆ రచయిత వచ్చాకే మారిపోయింది.
ఈ అనుభవాలన్నీ మంచివే, ఈ దర్శకులందరూ మంచి వాళ్ళే. ఎన్నారై రాజేంద్ర కి ఈ వ్యాసకర్త వర్క్ నచ్చకపోయినా ఆయన ఇచ్చిన జేమ్స్ బానెట్ పుస్తకం కొత్తలోకాలకి కళ్ళు తెరిపించింది. తెలుగు సినిమాల కథల్లో ఇంకేం కీలకాంశం లోపిస్తోందో, ఆ పుస్తకంవల్ల తెలిసి వచ్చింది. దశరథ్ కాగితాలు విసిరికొట్టే పూర్తి హక్కు ఆయనకుంది. దీంతో ఆయనకేదో నిరూపించి చూపించాలని ఈనాటి వరకూ అనుకోలేదు. అది నెగెటివిజం అవుతుంది. ఆయన వల్ల స్క్రీన్ ప్లే పుస్తకాన్ని కేవలం పుస్తకాలు చదివి రాయలేమన్న గొప్ప జ్ఞానోదయమైంది, ఇంతకంటే ఏం కావాలి? అసలు స్క్రీన్ ప్లే మీద పుస్తకం ఎందుకు రాయాలి, రాయకపోతే ఎవరైనా కొడతారా, సినిమా ఫీల్డు మునిగిపోతుందా, ఏం ఘోరం జరుగుతుందని? ఏదో రివ్యూలు రాసుకోవడానికి స్క్రీన్ ప్లే జ్ఞానాన్ని సముపార్జించుకుని, ఈ అనుభవంతో స్క్రీన్ ప్లే మీద రక్తమాంసాల్లేని పుస్తకం రాయకూడదని దూరంగా వుంటూంటే, ఎవరో ఒకళ్ళు ముందుకు తోయడం ఎందుకు జరుగుతోందో తెలీదు. దశరథ్ అయినా, రాజేంద్ర అయినా ఇంకో పబ్లిషర్ అయినా, మరో పత్రికా యజమాని అయినా సికిందర్ అనే వాడు స్క్రీన్ ప్లే బుక్ రాయగలడు, రాస్తాడు, రాయించాలి వీడి చేత - అని ఎలా అంచనా కొచ్చేవారో అర్ధంగాదు. ఈ అంచనాలని అందుకోలేకపోయాక- రక్తమాంసాల కోసం ప్రాక్టికల్ అనుభవం అనీ ఒకటి పెట్టుకున్నాక, ఒక సమస్య వుంది. స్వభావరీత్యా ఈ వ్యాసకర్త దేనికీ ఎవర్నీ అప్రోచ్ కాడు. ఎవరైనా వచ్చి అడగాల్సిందే. అడిగితేనే చేసి పెడతాడు. అడగక పోతే తన మానాన తాను రివ్యూలు రాసుకుంటూ కన్పించకుండా వుంటాడు. అప్పుడప్పుడు అలా అడిగిన వాళ్ళతోనే ప్రాక్టికల్ అనుభవాన్ని గడించాల్సి వస్తోంది. ఎప్పుడో దశరథ్ అడిగితే ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ- స్క్రీన్ ప్లే ఇచ్చినా, ఇంకో అసోసియేట్ కి రవితేజ కోసం స్క్రీన్ ప్లే చేసినా, మరో పెద్ద సినిమాల కో- డైరెక్టర్ కి రవితేజ కోసమే ఒకటి, జగపతి బాబుకోసం మరొకటీ రాసిపెట్టినా, ఇంకో దర్శకుడు కల్యాణ్ రామ్ కి చెప్పడానికి ఫ్యామిలీ కథ అడిగి రాయించుకున్నా- ఇలా ఇలాటివన్నీ ‘అడిగితేనే ఇచ్చివేయు’ పథకం కింద కొనసాగినవే- సాగుతున్నవే. అయితే ఇవేవీ తెరరూపం దాల్చ లేదు, దాలుస్తాయన్న నమ్మకమూ లేదు- ఏదో అద్భుతం జరిగితే తప్ప!
ఇలా
అడిగే వాళ్ళల్లో అదేం విచిత్రమో గానీ, అసోషియేట్లు పెరిగిపోయారు, ఇంకా
పెరుగుతున్నారు. కో డైరెక్టర్లు, డైరెక్టర్లూ తక్కువే. గత ఎనిమిదేళ్ళుగా మొత్తం
కలిపి 23 మందికి 48 స్క్రీన్ ప్లేలు రాశాడీ వ్యాసకర్త. ఇవన్నీ చిన్న, మధ్యతరహా సినిమాలే.
అయినా రకరకాల కారణాలవల్ల (కంటెంట్ కారణంగా కాదు) పట్టాలెక్కించలేక స్ట్రగుల్ చేస్తున్నారు.
వీళ్ళల్లో ఓ ముగ్గురు మాత్రం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నారు.
(ఇంకా వుంది)
-సికిందర్
Friday, October 28, 2016
రివ్యూ!
రచన-
దర్శకత్వం : గోకుల్
తారాగణం : కార్తీ, శ్రీ దివ్య, నయనతార, వివేక్, శరత్ లోహితశ్వా, మధుసూదన రావు, సిద్ధార్థ్ విపిన్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : ఓం ప్రకాష్
బ్యానర్ : పివిపి సినిమా- డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు : పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ ఏన్, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు,
ఎస్.ఆర్.ప్రభు
తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్
సంపాదించుకున్న తమిళ స్టార్ కార్తీ మొన్నా మధ్య ‘ఊపిరి’ లో కన్పించి ఎంటర్ టైన్
చేశాడు. తిరిగి ఇప్పుడు ‘కాష్మోరా’ అనే మరో ఎంటర్ టైనర్ తో భారీ రేంజిలో
దిగుమతయ్యాడు ద్విపాత్రాభినయం చేస్తూ. మంత్ర తంత్ర మాయాజాలాల డార్క్ ఫాంటసీలు
అప్పుడప్పుడు వస్తున్నవే కానీ, కార్తీ నటించిన ఈ డార్క్ ఫాంటసీ అనేక విషయాల్లో
వేరు. రొడ్ద కొట్టుడుగా వస్తున్న హార్రర్ కామెడీలకి దూరంగా దర్శకుడు గోకుల్ దీన్నో
సాటరికల్ ఫాంటసీగా తీశాడు. దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద అమీర్ ఖాన్ తో ‘పీకే’
తీసినట్టు, దెయ్యాల్ని నమ్మే వాళ్ళ మీద గోకుల్ ‘కాష్మోరా’ తో వ్యంగ్య బాణా లేశాడు.
ఐతే ఇది కేవలం సెటైరేనా ఇంకేదైనా విషయముందా ఇందులో, ఒకసారి ఈ కింద పరిశీలిద్దాం....తారాగణం : కార్తీ, శ్రీ దివ్య, నయనతార, వివేక్, శరత్ లోహితశ్వా, మధుసూదన రావు, సిద్ధార్థ్ విపిన్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : ఓం ప్రకాష్
బ్యానర్ : పివిపి సినిమా- డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు : పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ ఏన్, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు,
ఎస్.ఆర్.ప్రభు
కథ :
కాష్మోరా (కార్తీ) అనే భూత వైద్యుడు ‘దెయ్యాల్ని వదిలిస్తూ’
డబ్బులు సంపాదిస్తూంటాడు. ఇతడి ఖాతాదార్లుగా
మూఢ నమ్మకాల సామాన్యుల నుంచీ, అడ్డ మార్గాల రాజకీయ నాయకుల వరకూ చాలామంది వుంటారు. భక్తులుగా
మారిపోయిన ఇలాంటి వాళ్ళ కోసం కాష్మోరా తల్లి దండ్రులు, బామ్మ, చెల్లెలూ ఆశ్రమం కూడా
నడుపుతూ, పాలూ గుడ్ల దగ్గర్నుంచీ డబ్బులూ
నగలూ నైవేద్యాల రూపంలో స్వాహా చేస్తూంటారు. కాష్మోరా టీవీ స్టార్ కూడా అయిపోతాడు.
దెయ్యాలున్నాయంటూ అతను ఇచ్చే టీవీ కార్యక్రమాలకి విపరీతమైన టీఆర్పీ వుంటుంది. తమ
కుటుంబ సభ్యులం ఐదుగురం రోహిణీ నక్షత్రంలో పుట్టామనీ, ఇలా అలెగ్జాండర్ కుటుంబంలో,
ఆతర్వాత శ్రీకృష్ణ దేవరాయాలి కుటుంబంలో మాత్రమే ఐదుగురు సభ్యులు రోహిణీ నక్షత్రంలో
పుట్టారనీ పోల్చుకుని గొప్పలు చెప్పుకుంటాడు.
దెయ్యాల మీద రీసెర్చి చేస్తున్న యామిని (శ్రీ దివ్య) కాష్మోరా దగ్గర చేరుతుంది. క్యాష్ అనే ముద్దు పేరుగల కాష్మోరా జనాల మూఢ నమ్మకాల్ని క్యాష్ చేసుకుంటున్నాడనీ, అతడికే విద్యా రాదనీ ఆమెకి అనుమానం. ఇంకో ధనకోటి (శరత్ లోహితశ్వా) అనే మంత్రి ఓ హత్య చేయించి అందులోంచి బయట పడేందుకు కాష్మోరాని ఆశ్రయిస్తాడు. కాష్మోరా తన చేతబడి గిమ్మిక్కులతో ధనకోటి సమస్య పరిష్కరిస్తాడు. కోర్టులో కేసు కొట్టేసే సరికి అది కాష్మోరా ఎఫెక్టే నని నమ్మకం పెరుగుతుంది ధనకోటికి. ఓ రోజు ఐటీ వాళ్ళు దాడులు చేయబోతున్నారని తెలిసి బ్లాక్ మనీ, భూముల పత్రాలూ మూటలు కట్టి కాష్మోరా ఆశ్రమంలో కాష్మోరా తండ్రి దగ్గర దాస్తాడు. కాష్మోరా తండ్రి పెళ్ళాం, తల్లీ, కూతురూ సహా ఆ 500 కోట్ల సొత్తుతో ఉడాయిస్తాడు. ఈ ఘనకార్యం తెలిసి కాష్మోరా కూడా హేపీగా వాళ్లతో జాయినవుతాడు. అంతా కలిసి పారిపోతూ బెంగుళూరు మార్గంలో ఓ పురాతన కోటలో పడతారు.
ఆ కోటే కాష్మోరా పాలిట యమలోకం అవుతుంది. దెయ్యాల పేరు చెప్పుకుని వ్యాపారం చేసుకున్న అతడికి ఇప్పుడు నిజ దెయ్యాలతో పీకులాట మొదలవుతుంది. ఇక్కడి పదమూడు దెయ్యాల్లో రాజానాయాక్ (కార్తీ) అనే హెడ్ దెయ్యం కాష్మోరాకి కండిషన్ పెడుతుంది. ఓ శాపం వల్ల తను భూమ్మీదే ఏడు శతాబ్దాలుగా ప్రేతాత్మలా వుండిపోయాననీ, రోహిణీ నక్షత్రంలో పుట్టిన ఐదుగురు కుటుంబ సభ్యులే తనకి శాప విముక్తి కలిగించగలరని తాళపత్రాల్లో రాసి ఉందనీ, కాష్మోరా టీవీ ప్రోగ్రాంలో ఇచ్చిన స్టేట్ మెంట్ చూశాక- తన శాప విముక్తికి ఇతనే తగిన వాడని తెలిసి ఇక్కడికి రప్పించుకున్నాననీ అంటుంది. తనకి శాప విముక్తి కల్గిస్తేనే ఇక్కడ్నించీ బయటపడతారనీ భయపెడుతుంది. టీవీ ప్రోగ్రాంలో వాగిన వాగుడు ఇలా కొంపలు ముంచుతుందని తెలీని, మంత్ర తంత్రాలు రాని కాష్మోరా ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.
ఎలావుంది కథ
డార్క్ ఫాంటసీ జానర్లో క్షుద్ర విద్యలతో మూఢనమ్మకాల మీద
సెటైర్ గా ఉంటూ వినోద ప్రధానంగా వుంది. ప్రథమార్ధమంతా ‘పీకే’ నీ, ‘ఓ మై గాడ్’ నీ
గుర్తుకు తెచ్చే సోషల్ కామెంట్ లా వుంది- కాకపోతే ఈ రెండు సినిమాలూ దైవ భక్తి మీద వ్యంగ్యాస్త్రాలు. భూతవైద్యాల పేరుతో
జరుగుతున్న మోసాలకి, మధ్య యుగాలనాటి ఓ శాపాన్ని సవాలుగా పెట్టి- జయించేది సహజ
బుద్ధి వికాసాలే తప్ప, వక్రబుద్ధులతో ఏదీ సాధించలేరనీ చెబుతున్నట్టూ వుంది. బీభత్స భయానకాలకంటే కూడా హస్యరస- అద్భుత రసాల
సమ్మేళనంగా అర్ధవంతంగానూ వుంది.
ఎవరెలా చేశారు
ద్విపాత్రాభినయంతో కార్తీ ఈ ఫాంటసీకి చాలా హైలైట్ అనే చెప్పాలి.
మొదటి బోగస్ మంత్ర గాడి పాత్రని అతను రొటీన్ ఆవారా తాగుబోతు మాస్ పాత్రలా చేయకుండా
రక్షించాడు. బయట బ్లాక్ మ్యాజిక్ లు చేస్తూ, కాలేజీలో చేరి హీరోయిన్ వెంటపడే,
పాటలు పాడే, రొష్టు ఫార్ములా పాత్రగా కూడా కన్పించకపోవడం చాలాచాలా రిలీఫ్. ఇలా జరిగి
వుంటే ఆద్యంతం అతడి పాత్ర ఉత్థాన పతనాల
క్యారక్టర్ ఆర్క్ ఏర్పడి తేజోవంతంగా కన్పించేది కాదు. చిన్న పిల్లల్ని కూడా
అలరించే విధంగా వుండేది కూడా కాదు. చేతబడులంటూ
చేసే మోసాల్ని బాగా నవ్వొచ్చే విధంగా నటించి చూపే ఏకైక ఎజెండా ముందు, ఎలాటి ప్రేమ ట్రాకులూ
డ్యూయెట్లూ అవసరపడలేదు. ముందు బోగస్ మంత్ర గాడిగా తనలోకంలో తను ఎదురు లేని కింగ్, తర్వాత దెయ్యాల కోటలో
పడ్డాక పడే తిప్పలతో తానొక జోకర్, చివరికి తంటాలు పడి తనలోని – మరుగున పడిపోయిన అసలు మానవ బుద్ధికి
పని చెప్పాకే తానొక మొనార్క్! మోస బుద్ధుల కొద్దీ నరకంలో పడితే, ఆ మోస బుద్ధులే కాపాడలేవు,
మంచి బుద్ధులు ఉపయోగిస్తే వాటికి బయటి నుంచి
పాజిటివ్ శక్తులు తోడ్పడతాయి- ఇలా పాజిటివ్ శక్తుల్ని ఆకర్షించే మంచి బుద్ధులతోనే బ్రతికి
పైకెదగాలే తప్ప మరో షార్ట్ కట్ లేదనే- ఈ కొట్టొచ్చి నట్టుండే ‘క్యారక్టర్ నోట్’ తో
ఇంత కలర్‌ఫుల్ గా ముగిసే పాత్ర - చాలా కాలం తర్వాత దక్షిణ భారత వెండి తెర మీద ఒక క్లాసిక్
ఎగ్జాంపుల్ అనొచ్చు. ఐతే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ కాలంలో మనం ఇన్వాల్వ్ మెంట్ లేకుండా సినిమాల్ని
పైపైన చూసేసి వదిలేస్తున్నాం. ఇన్వాల్వ్ మెంట్ తో అంతగా పనుండదు కాబట్టే ఆవారా టపోరీ
పాత్రలకి అంత బాగా ఎడిక్ట్ ఐపోయాం.
దుష్టపాత్రగా రెండో పాత్ర కార్తీక్ లాంటి ఇంకా జ్యూనియర్ స్టార్ కి పెద్ద పరీక్షే అయినా, ఇదేం లెక్క కాదన్నట్టు అవలీలగా నటించేశాడు. దురదృష్టమేమిటంటే, ఇలా రెండో పాత్రగా దుష్ట పాత్ర పోషించే స్టార్స్ కి ఎంతబాగా నటించినా ఉత్తమ విలన్ అవార్డు లివ్వరు! మొండెం నుంచి తల వేర్పడి మాట్లాడే, పోరాడే రాజానాయక్ దుష్ట పాత్రలో కార్తీక్ ని పోల్చుకోలేం, అది కార్తీక్ అని చెప్తే తప్ప.
నయనతార మధ్యయుగాలనాటి వీరత్వమున్న, దగాపడిన యువరాణి రత్నమహాదేవిగా తన అనుభవంతో పాత్రని నిలబెట్టింది. ఆమెతో సీన్స్ అన్నీ ఉద్విగ్నభరితంగా వున్నాయి. ఇక మిగతా పాత్రల్లో కార్తీ తండ్రిగా నటించిన కమెడియన్ వివేక్ (వివేకానందన్) ఇంకో ఎట్రాక్షన్. మంత్రి పాత్రలో విలన్ గా శరత్ లోహితశ్వావి అచ్చం విలన్ కుండే విగ్రహం, కళ్ళూ.
టెక్నికల్ గా క్వాలిటీ వుంది. సీజీ చేసిన దృశ్యాలు వున్నతంగా వున్నాయి. భారతీయ సినిమాల్లో మొదటి సారిగా వాడామని చెప్తున్న 360- డిగ్రీల ఆమ్ని డైరెక్షనల్ కెమెరా, దక్షిణ భారత సినిమాల్లో తొలిసారిగా ఉపయోగించామంటున్న త్రీడీ ఫేస్ స్కాన్ టెక్నాలజీలతో కెమెరామాన్ ఓం ప్రకాష్ ఎక్కడా కృత్రిమత్వం లేకుండా, ఎగుడుదిగుళ్ళు కన్పించకుండా చిత్రీకరణ జరపడం మంచి పనితనం. అయితే సంతోష్ నారాయణ్ సంగీతం పాటలకి తప్ప, బిజిఎం కి ఘోరంగా వుంది.
చివరికేమిటి
దర్శకుడు గోకుల్ కథ చెప్పాడు, టెక్నాలజీ చూపించుకోలేదు. టెక్నాలజీని డామినేట్ చేయకుండా
కథలో కలిపేసుకున్నాడు. ఇలాటి చాలా భారీ సినిమాల్లో టెక్నాలజీ ముందడుగు వేస్తూ, ఎప్పటికప్పుడు
అప్ డేట్ అవుతూ కనిపిస్తూ వుంటుంది. కానీ కథా కథనాలు, విషయమూ యోజనాల వెనకబడిపోయి అనాగరికంగా
మనమీద స్వారీ చేస్తూంటాయి. ఇలాటిది జరగ లేదిక్కడ. దీని కథా కథనాలు స్ట్రక్చరల్ ఫ్రేమ్
వర్క్ లో టెక్నాలజీనే మరిపించేస్తాయి. ఒక అనుభూతికి లోను జేస్తాయి. అయితే రెండు లోపాలు
కూడా లేకపోలేదు- ప్రధాన కథలో నేటివిటీకి, ఎమోషనల్ కనెక్ట్ కీ సంబంధించి. కార్తీ పాత్ర
పోరాటం ఎమోషనల్ గా మనల్ని కూడా తీసుకుపోవాలంటే, ఈ పాత్ర విలువైనదేదో కోల్పోయే, అయ్యో పాపం అన్పించే, పరిస్థితిని ఎదుర్కోవాలి. ఇది జరగలేదు. అలాగే మధ్య
యుగాలనాటి పాజిటివ్ శక్తికి ప్రతీకగా నయనతార పాత్ర, నేటివిటీకి
కనెక్ట్ అయ్యే సెంటిమెంట్లతో- ఒక స్పిరిచ్యువల్ అనుభవాన్నివ్వాలి. ఇలాటివి కోడి రామకృష్ణ
బాగా ఆలోచిస్తారు. గోకుల్ కూడా ఆలోచించి వుంటే మరింత సమగ్రంగా వుండేది ఈ ఫాంటసీ.
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in
Saturday, October 22, 2016
రివ్యూ!
రచన – దర్శకత్వం : పూరీ జగన్నాథ్
తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్,
జగపతిబాబు, అదితీ ఆర్య,
వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, అలీ, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: ముఖేష్ జి.
బ్యానర్: నందమూరి తారక రామారావు ఆర్ట్స్, నిర్మాత: నందమూరి కల్యాణ్ రామ్
విడుదల : అక్టోబరు 21, 2016
***
వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, అలీ, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: ముఖేష్ జి.
బ్యానర్: నందమూరి తారక రామారావు ఆర్ట్స్, నిర్మాత: నందమూరి కల్యాణ్ రామ్
విడుదల : అక్టోబరు 21, 2016
***
నిర్మాత –నటుడు కల్యాణ్ రామ్ మరోసారి అదృష్ట పరీక్షకి నిలబడ్డారు- ఈసారి
నిలబడి తీరాలన్న దృఢ చిత్తంతో- సిక్స్
ప్యాక్ బాడీతో – ‘ఇజం’ అనే మోడర్నిజపు టైటిల్ తో- పూరీజగన్నాథ్ సౌజన్యంతో. ఎంత
బడ్జెట్ అయినా వెనుకాడకుండా రిస్కు తీసుకునే కల్యాణ్ కి సక్సెస్ ఎందుకు రాదు-
తప్పకుండా వస్తుంది, ధరించే పాత్రలో కూడా సిక్స్ ప్యాక్ అంత విషయమున్నప్పుడు. మరి
ఈసారి ఏం జరిగింది? రిస్కు ని తన పంచ్
డైలాగు ప్రకారం ‘డకింగ్’ చేయగల్గారా, లేక తనే డకౌట్ అయ్యారా ఓసారి చూద్దాం....
కథ
సుల్తాన్ అనే పేరుతో కల్యాణ్ రామ్ అలియాస్ సత్యా
మార్తాండ్ (కల్యాణ్ రామ్) తన సిక్స్ ప్యాక్ దేహదారుఢ్యంతో మొరాకో లోని ఓ దీవిలో స్ట్రీట్ ఫైట్లు చేసి జీవనం
గడుపుతూంటాడు. ఓ స్ట్రీట్ ఫైట్ సందర్భంగా అలియా ఖాన్ (అదితీ ఆర్య) అనే అమ్మాయిని
చూడగానే మనసు పారేసుకుని వెంటపడతాడు. ఈమె బడా డాన్ జావేద్ ఇబ్రహీం (జగపతి బాబు) కూతురు.
జావేద్ ఇబ్రహీం ప్యారడైజ్ బ్యాంకు నడుపుతూ
ఇండియాలోని నల్లకుబేరుల ధనం దాస్తూంటాడు. ఇండియాలో ఇతడి ఏజెంటుగా కోటిలింగాల (పోసాని) అనే మంత్రి వుంటాడు.
ఆలియా వెంటపడుతున్న సత్యా మార్తాండ్ (అసలు పేరు) ఆమె కన్పిస్తే తాళి కట్టేస్తానని కూడా బెదిరిస్తూంటాడు. ఇతడి నస
తండ్రికి చెప్పుకుంటుంది. ఇతణ్ణి చంపమని
గ్యాంగ్ కి చెప్తాడు. అసలు తనని కలుస్తూ కబుర్లు చెప్తున్న కల్యాణ్ రామ్ అనే బీడీ
ఫ్రెండే తన కూతుర్ని వేధిస్తున్న రోమియో అని జావేద్ కి తెలీదు. పైగా డబ్బున్న
వాళ్ళ కూతుళ్ళని ఎలా ప్రేమించాలో చిట్కాలు కూడా చెప్తూంటాడు. ఓ పెళ్ళిళ్ళ ఏజెంట్
(అలీ) కి చెప్పి కూతురికి సంబంధాలు చూస్తూంటాడు. ఓ పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు
ఇంట్లోకి జొరబడి జావేద్ లాప్ టాప్ ఎత్తుకు పోతాడు సత్య. ఇక తనని కలుస్తున్న
కల్యాణ్ రామే సత్య అని జావేద్ కి తెలిసిపోతుంది. అంతే కాదు, ఈ సత్య తన
బ్యాంకుని కొల్లగొట్టేందుకు వల పన్ని
వచ్చిన ‘గ్రాండ్ లీక్స్’ అనే అజ్ఞాత వెబ్సైట్ నడుపుతున్న జర్నలిస్టు అని కూడా
తెలిసిపోతుంది... ఇక సత్య తన బ్యాంకు కొల్లగొట్టకుండా, లక్షలాది కోట్ల నల్లధనం
ఇండియాలో ప్రజలకి పంచకుండా అడ్డుకోవడానికి ఇప్పుడు జావేద్ ఏమేం చేశాడన్నది మిగతా
కథ.
ఎలావుంది కథ
ఈ మధ్య వీకీ లీక్స్ అంటూ, పనామా పేపర్స్ అంటూ నల్ల కుబేరుల బండారాలు
పడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా విదేశాల్లోని నల్లధనం
తెచ్చి ఇండియాలో తలా ఇరవై లక్షలు పౌరుల జేబుల్లో కుక్కి చక్కిలిగింతలు పెడతానని అంటున్న- లేదా అనేసి మరచిపోతున్న
విషయం కూడా తెలిసిందే. తీరా చూస్తే తేలిందేమంటే- ఆ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న
నల్లధనం స్వచ్ఛ భారత్ చేసి పూచిక పుల్ల సహా వూడ్చేసి తీసుకురావాలన్నా కూడా అదసలు నల్లధనమని ముందు రుజువు
చెయ్యాలి ప్రభుత్వం. రుజువు చెయ్యాలంటే కింది కోర్టుల నుంచీ పై సుప్రీం కోర్టు
దాకా ఈ ‘నల్ల’ ఖతాదార్లతో ఇన్ కం టాక్స్ శాఖవాళ్ళు ఎంతకాలం కొట్లాడుతూ కూర్చోవాలో తెలీదు. ఎన్నేళ్ళూ,
ఎన్ని యుగాలూ పడుతుందో తెలీదు. ఎన్ని కేసులు రుజువవుతాయో కూడా తెలీదు. పైగా ఇంకో
తిరకాసుంది- దొంగా దొంగా అంటూంటే దొంగేమైనా దోచిన సొత్తు దగ్గర వుంచుకుంటాడా? ఆ
విదేశీ బ్యాంకుల్లోంచి నల్లకుబేరులు తమతమ
నల్లధనాల్ని ఎప్పుడో తరలించేసుకుని - నల్లతనాల్ని చెరిపేసుకుని తెల్లగా
మారిపోయారు. తెల్లధనంగా ఆ సొమ్మంతా విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి స్వదేశంలోకే
దింపి రియల్ ఎస్టేట్ రంగాన్ని దివ్యంగా వెలగబెడుతున్నారు! ఇలా డిమాండ్ కి మించిన
భవనాలు నిర్మించేస్తూంటే అవి ఖాళీగా పడి ఉంటున్నాయి, ఐనా వాళ్లకేం నష్టం.
ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి ఆ బ్యాంకుని హ్యాకింగ్ చేసి నల్లధనమంతా తెచ్చి క్లయిమాక్స్ లో దేశ వ్యాప్తంగా ప్రజలకి తలా ఇంత పంచి చక్కిలిగింతలు పెట్టడానికి - ఎక్కడ్నించి వస్తుందని? తమ ఖాతాల్ని నల్ల ఖతాదార్లు ఎప్పుడో తామే ‘హ్యాకింగ్’ చేసుకున్నారు పూరీ కంటే ముందే. ఇంకా జనాలకి- పోనీ ప్రేక్షకుల్ని ఆ డబ్బింకా స్విస్ బ్యాంకుల్లోనే వున్నట్టు ఎలా నమ్మిస్తారు. అక్కడి నల్లధనం చక్కగా తెల్లధనంగా మారిపోయి ఇండియాకే విదేశీ పెట్టుబడులుగా వెనక్కి వస్తోందిగా - ఎందరికో ఉపాధి కూడా కల్పిస్తూ.
ఇంత విశాల కాన్వాస్ వున్న ఓ సామాజిక అంశాన్ని పూరీ తెర కెక్కించే ముందు వాస్తవాల్ని చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి రాజకీయ, సామాజిక స్పృహ కొంచెం ఎక్కువే. ఏ స్పృహా వుండని రొటీన్ మసాలా సినిమాల్ని ఎన్నైనా సహిస్తారు గానీ, ఇలాటి తప్పుడు సమాచారంతో నిజం లేని ‘ఇజం’ ని కూడా హజం చేసుకుంటారులే అని తక్కువ అంచనా వేయడం తొందరపాటు తనమే అవుతుంది.
ఎవరెలా చేశారు?
కల్యాణ్ రామ్ ఈ సినిమా స్వయంగా నిర్మించి ఎంత లాభ పడినా పడకున్నా నటనలో మాత్రం
మంచి శిక్షణ పొందడానికి ఈ సినిమా అవకాశం కల్పించింది. శిక్షకుడు పూరీ జగన్నాథ్
కల్యాణ్ ని నటనలో ఉత్తమ విద్యార్థిగా తీర్చి దిద్దారు. డైలాగులు పలికించడంలోనేమి,
కత్తిలానటింపజేయ
డంలోనేమి కల్యాణ్ కెరీర్ ని నిత్య కల్యాణం పచ్చ తోరణం చేశారు
పూరీ. కాకపోతే పాత్రే, పాత్ర చిత్రణే వాస్తవ దూరంగా ఉండాల్సి వచ్చాయి. కోర్టు
సీనులో కల్యాణ్ భావావేశం, వాక్పటిమ తన పాత్ర సిక్స్ ప్యాక్ దారుఢ్యంతో సింక్
కాకపోవడం- కథలో చివరికొచ్చేసరికి తను సిక్స్ ప్యాక్ అన్న సంగతి మర్చిపోవడం వల్ల
జరిగిందేమో. కోర్టు సీన్లకి ఇంకా నందమూరి వంశానిదే పెట్టింది పేరని చెప్పొచ్చు.
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఆ మధ్య జ్యూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు కల్యాణ్ రామ్. అయితే
కల్యాణ్ రామ్ కోర్టు సీను నటన ఫరవా లేదనిపించినా విషయపరంగా ఈ సీనుకి, ఇందులోని పూరీ
రాసిన డైలాగులకీ చోటెంతన్నది ప్రశ్న. కథే దేశంలోని అవాస్తవాల మీద అల్లినప్పుడు
అందులోని సమస్తం అప్రస్తుతమే అయిపోతాయి కూడా
ఆటోమేటిగ్గా.
జగపతిబాబుది కిల్ అయిన పాత్ర. ఇంతటి కథకి తన విలన్ పాత్ర ఎలా వుండాలి. జోకర్ గా మారిపోయి చివరికి విలనే కాకుండా పోయింది పాత్ర. హాలీవుడ్ లో, కొంత వరకు బాలీవుడ్ లో ఎలా వుంటుందంటే నటులు స్క్రిప్టు పంపించమంటారు. ఆ స్క్రిప్టు చదివి కథతో బాటు, ఇతర పాత్రలతో ఇంటరాక్షన్ తో బాటు, తమ పాత్రని ఫాలో అయి, దాని సమగ్రతని బేరీజు వేసుకుంటారు. తేడా వుంటే సరిదిద్దమంటారు. తెలుగులో నటులు స్క్రిప్టు అడగరు. ఇచ్చినా చదవరు. చదవడం, రాయడం అన్నవి చాలా లో - క్లాస్ యాక్టివిటీస్. ఆ పూటకి సీ ను పేపరు చూసి నటించి వెళ్ళిపోవడమే. పాత్ర సౌష్టవం, సమగ్రత, ట్రావెల్ ఎలా ఉన్నాయనేది అవసరమే లేదు. అందుకే ఇలాటి జావేద్ భాయ్ లాంటి క్యారెక్టర్ ల రూపంలో నటులు నీరసం తెప్పిస్తారు ప్రేక్షకులకి. పాత్రచిత్రణ తెలిసిన నటులు తెలుగులో వున్నారో లేదో వెతుక్కోవాలి.
సినిమాలో ఇంకా చాలా పాత్రలున్నాయి. వాటి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. యాక్షన్ సీన్స్ బాగా కంపోజ్ చేశారు. కెమెరా వర్క్ బ్రిలియెంట్ గా వుంది. పాటల గురించి చెప్పాలంటే, ఈ థీమ్ లో వుండాల్సిన రకం పాటలు మాత్రం కావివి.
స్క్రీన్ ప్లే సంగతులు
పూరీ సినిమాలకి షాట్స్ ప్లే వుంటుంది తప్ప స్క్రీన్ ప్లే
ఏముంటుంది. ఆయన సరదాగా ఓల్డ్ స్కూల్ దర్శకుడు. ఎలాటి కథనైనా సరదాగా అదే ఓల్డ్ సీసాలో పోసేస్తారు. ఆయనకి బ్యాంకాక్ బీచిలో సీసా
ఏదో దొరికివుంటుంది. అందులో సందేశమేదో ఆకర్షించి వుంటుంది (మెసేజ్ ఇన్ ది బాటిల్
లాగా - దీని మీద ‘శివమణి- 98480 22338’ అని సినిమా కూడా తీశారు). అందుకే అక్కడి బీచి కెళ్ళిపోయి ప్రతీ సినిమాకీ అంత సరదాగా
పదిహేను రోజుల్లో స్క్రిప్టులు రాసేయ గల్గుతున్నారు. పదిహేను రోజుల్లో!! గిన్నీస్
లో చేరాల్సిన రికార్డ్!! ఆయనది లేజీ రైటింగ్ అనలేం గానీ, క్యాజువల్ రైటింగ్.
క్యాజువల్ గా అలా అలా పైపైన ఏదో రాసేసుకుని తీసేస్తారంతే. మరి అంతే క్యాజువల్ గా
ప్రేక్షకులు చూడాలిగా! క్యాజువాలిటీ వార్డులో చేరేంత పనవుతోంది.
కోన వెంకట్- గోపీ మోహన్ లని వుండే వాళ్ళు. వాళ్ళు అదే పనిగా ఒకటే సింగిల్ విండో స్కీమ్ పెట్టుకుని, ఏ సూపర్ స్టార్ వచ్చినా అందులోకే తోసి పారేసి- సూపర్ స్టార్ గారు విలన్ గారింట్లో చేరి కామెడీ చేయుట అను బ్రహ్మనందపు ఆటగా ఆడించీ ఆడించీ, ఒక్క ప్లాట్ పాయింట్ టూ లాంటి దెబ్బకి సింగిల్ విండో మూసేసి వెళ్ళిపోయారు. పూరీ ఇంకా అదే ఓల్డ్ సీసాతో కొనసాగడమంటే -క్లయిమాక్స్ దాకా వెళ్ళకుండా రేపోమాపో ఆ ప్లాట్ పాయింట్ టూ దెబ్బకి తనుకూడా దగ్గరవుతున్నట్టే.
శంకర్ ‘భారతీయుడు’ తీయకుండా వుండి వుంటే ‘భారతీయుడు’ ని కూడా పూరీ ‘ఇజం’ లాగే తన సీసాలో పోసి తీసేస్తారు. భూమి బల్ల పరుపుగా వుందని ఆనాడెవరో నమ్మినట్టు, తను కూడా ఎలాటి కథనైనా బల్ల పరుపుగా చదును చేసేస్తారు. శంకర్ ‘ఇజం’ తీయాలనుకుంటే ఫ్యూచరిస్టిక్ జానర్ లోకి తీసికెళ్ళి 2050 లలో కథ స్థాపిస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు దీంతో కాలీన స్పృహ లేదు. బిగ్ కాన్వాస్ ని డిమాండ్ చేసే ఇలాటి హై కాన్సెప్ట్ సబ్జెక్టుని అంతే అద్భుత ప్రపంచంలోకి తీసికెళ్ళి శంకర్ సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తారు. పూరీ విజన్ కి హైకాన్సెప్ట్, బిగ్ కాన్వాస్, ఉదాత్త కథా, మానమర్యాదలూ అనే ఉన్నత దృశ్యాలు అందవు. ‘ఈడియెట్’ కాడ్నించీ ‘ఇజం’ వరకూ అదే పాత మూస టెంప్లెట్ పెట్టుకుని అందులోకే భారత రామాయణాల్ని కూడా తోసేసి తన బ్రాండ్ టపోరీ కథలుగా మార్చేయగలరు. హీరోయిన్ ఏ పోలీస్ కమీషనర్ కూతురో, మాఫియా కూతురో, రాజకీయ నాయకుడి కూతురో అయివుండాలి; హీరో ఆవారా టపోరీగా ఉంటూ ఆమెని ప్రేమించమని వేధిస్తూ వుండాలి; ప్రేమించాక తానో అండర్ కవర్ ఏజెంటుగా బయటపడాలి; ఆ తర్వాత ఆమె విలన్ తండ్రితో ఆడుకోవాలి. ఏ సీరియస్ సామాజిక కథయినా కూడా ఈ డ్రామాలోకే సర్దుకోవాలి.
‘ఇజం’ కథని భవనాలు కూలిపోతున్న విషయ గాంభీర్యంతో బ్రహ్మాండంగా ప్రారంభించారు. కానీ జర్నలిస్టు పాత్రకి కూడా అదే బాల్యం నాటి ఫ్లాష్ బ్యాక్, అందులోని అదే అన్యాయం అవసరమా. జర్నలిస్టనే వాడు తన గురించి కాక, సమాజం గురించి ఏదో ఫీలై జర్నలిస్టు అవుతాడు. ఆ తర్వాత తన గురించి ఫీలైపోయి నయూం లాంటి వాళ్ళతో నయా దందాలు చేసుకోవచ్చు దండాలు పెట్టుకుంటూ, అది వేరే విషయం. కానీ తన కేదో అన్యాయం జరిగిందని జర్నలిస్టు అయిపోడు. ఇజం జర్నలిజపు కథ ఒక వాస్తవంగా ఉందనుకుంటున్న సామాజిక సమస్యని డీల్ చేస్తున్నప్పుడు, అంతే వాస్తవికం గా డీల్ చేస్తే సరిపోతుంది. ఫ్లాష్ బ్యాకూ, టపోరీ వేషాలూ అవసరం లేదు. ఈ టపోరీ ప్రేమ కథని ప్లాట్ పాయింట్ అనేదే లేకుండా ఇంటర్వెల్ వరకూ సాగదీసి ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ టైపు ఎండ్ సస్పెన్స్ కాని ఎండ్ సస్పెన్స్ కథనంతో నడపనవసరమే లేదు. సామాజిక కథ జానర్ మర్యాద ఇక్కడే తప్పిపోయింది. అసలు చివరి దాకా ప్రేమ కథ అనే సపరేట్ ట్రాకే జానర్ మర్యాదకి ప్రధాన దెబ్బ. ఇతివృత్తపు రసపోషణకి పెద్ద అడ్డంకి. సెకండాఫ్ లో కూడా ప్రధాన కథకి అడ్డుపడే - పదే పదే హీరోయిన్ ప్రేమ గోల తాలూకు ట్రాకు - ప్రధాన కథతో సంబంధం లేకుండా పాటలూ - మాస్ ప్రేక్షకులకి కూడా చీకాకే.
ఫస్టాఫ్ లో ఎడతెగకుండా ఇంటర్వెల్ వరకూ గంటా అయిదు నిమిషాలూ, సెకండాఫ్ లో మళ్ళీ అడపాదడపా ఇంకో అరగంటా తినేసే టపోరీ ప్రేమకే ఇంత సమయం పోతే, ప్రధాన కథకి మిగిలింది కేవలం 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల ‘కథ’ కి పూర్తి వందశాతం టికెట్ ధర చెల్లించుకుంటున్నారు ప్రేక్షకులు. పదిహేను రోజుల్లో స్క్రిప్టు ఎలా పూర్తయి పోతోందంటే ఇలాగే - ఓ అరగంటకి మాత్రమే సరిపడా ప్రధాన కథ ఆలోచించి, ఇక ఆలోచించనవసరం లేని మిగతా భాగాన్ని తయారుగా వున్న బాటిల్లోంచి తీసి ఒంపెయ్యడం వల్లే.
అంత భారీ స్థాయిలో తమ బ్యాంకు హీరో కొల్ల గొడుతున్నాడని తెలిసీ వాడితో ప్రేమకోసమే పారిపోయి రావడం, అదీ పిస్తోలు పట్టుకుని హైదరాబాద్ నగరంలో బాహాటంగా తిరగడం, ఎప్పుడో హీరో చెప్పి వున్న అతడి తల్లిపేరు పట్టుకుని ఆధార్ కేంద్రంలో అడ్రసు తెలుసుకుని ఇంటికి వచ్చెయ్యడం- (ఆ పేరు గల మనిషి నగరం మొత్తం మీద ఆమె ఒకత్తే వుందేమో. పోనీ ఇంటి పేరు కూడా తెలీదు దాన్నాధారంగా పట్టుకుందను కోవడానికి- అయినా ఆధార్ కేంద్రాల్లో ఇలా అడ్రసులు ఇచ్చేస్తారా) - పిస్తోలుతో ఆ హీరో తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఆ ఇంట్లో మకాం పెట్టడమూ ఇదంతా- కేవలం ఈ సినిమా ప్రేమ కథే అయితే సరే గానీ, ఒక పెద్ద సామాజిక కథ ఇది. సమాజం కోసం హీరో ఏం చేస్తున్నాడో తెలిసి కూడా అతడి పక్షం వహించి అందులో పాలు పంచుకోకుండా, పిచ్చి ప్రేమంటూ తిరిగే పాత్ర బహుశా ఇంకే బాధ్యత గల సినిమాలోనూ వుండదేమో.
అసలీమె డాన్ కూతురే ఎందుక్కావాలి. హీరోతో బాటు పనిచేస్తున్న అజ్ఞాత జర్నలిస్టుల్లో ఒకత్తి ఎందుకు కాకూడదు. ఈ సినిమా ఏకత్రాటిపై, ఏకసూత్రత అనే బేసిక్ కథా లక్షణంతో ఒకే కథగా ఎందుకు వుండకూడదు. గంటా ముప్పయి ఐదు నిమిషాల టపోరీ ప్రేమ కథగా కూడా ఎందుకుండాలి.
జావేద్ ఇబ్రహీం పాత్రని శంకర్ కిస్తే ఆయన పరమ కర్కోటకుడుగా ఆకాశానికెత్తేస్తాడు. పూరీ చేతిలో ఇది హాస్యాస్పదంగా తయారయ్యింది. పైగా హీరో తన బ్యాంకు పని బడుతున్నాడని తెలిసి కూడా ప్రధాన కథ వదిలేసి, ప్రేమ ట్రాకుని ‘పండించడం’ కోసం కూతుర్నివెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఆ బాపతు విలనిజంతో బిజీగా ఉంటాడు. హీరో హ్యాకింగ్ చేస్తూంటే ఆచూకీ తెలుసుకుని చంపించడానికి మనుషుల్ని పంపుతాడు. అంతేగానీ, హ్యాకింగ్ ని నిరోధించే టెక్నికల్ టీం అతడి అంత పెద్ద బ్యాంకులోనే వుండరు. మొదట హీరోయిన్ ఖాతా హ్యాకింగ్ జరిగిందని ఎలా చేతులెత్తేసి మొత్తుకుంటారో, ఆ తర్వాత సర్వర్ హ్యాకింగ్ అయి సొమ్ములు ఖాళీ అయిపోతున్నప్పుడు కూడా అంతే లబోదిబోమంటారు.
ఇంతకీ అలా ఖాళీ అయిన సొమ్ములు మన దేశవ్యాప్తంగా ప్రజల బ్యాంక్ ఎక్కౌంట్ లలో పడిపోయి- తండోపతండాలుగా వాళ్ళ జేబుల్లో సెల్ ఫోన్లు డబ్బులు పడ్డ మెసేజిలతో ఠింగు ఠింగు మని ఎలా మోగుతాయో అర్ధంగాదు. ఇది చూస్తున్న ఈ సమయంలోనే మన జేబుల్లో మొబైల్స్ కూడా ఇలా మోగివుంటే, ఓ ఇరవైలక్షలతో మనం కూడా కింగు లయ్యేవాళ్ళం కదా పూరీకి పూరాగా ప్రణమిల్లి. అప్పుడు ఈ రివ్యూ ఇలా రాసే బాధ కూడా తప్పేది.
జావేద్ భాయ్ కి హీరో డబ్బులు కొల్ల గొట్టేశాడన్న కసే లేదు, సరే నా కూతుర్ని తీసుకుపొమ్మంటాడు. హీరోకి కూడా ఈ జావేద్ భాయ్ తన ఫ్రెండ్స్ అయిదు గుర్నీ చంపించాడన్నపగే వుండదు. పాపం ఫ్రెండ్స్! ఇలా ‘కరీం బీడీ’ కామెడీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటైపోతారు, ఈసారి మామా అల్లుళ్ళుగా! దావూద్ ఇబ్రహీం- సారీ- జావేద్ ఇబ్రహీం అంటే పూరీకి అంత ప్రేమ ఎందుకో అర్ధం గాదు.
‘బిజినెస్ మాన్’ లో మాఫియా కార్పొరేటీ కరణ అంటూ నడిపిన ప్రహసనం ఎలా వుందో, అలాగే వుంది ఈ బ్లాక్ మనీతో ఫార్సు కూడా. జర్నలిస్టు హీరోని అరెస్టు చేయవచ్చు గానీ, జర్నలిస్టు భావజాలాన్ని అరెస్టు చేయలేరన్నారు. ఏమిటా జర్నలిస్టు భావజాలం- అక్కడ స్విస్ బ్యాంకుల్లో నల్ల డబ్బే లేకపోయాక! వున్నా తీసుకొచ్చే వీలే లేనప్పుడు! ఈ నల్లధనం గురించి వివిధ మాంటేజీలు వేస్తూ తెర మీద వివిధ పత్రికల, మీడియా సంస్థల పేర్లేశారే- వాటిలో వున్న ఒక పత్రిక ‘అవుట్ లుక్’ మ్యాగజైన్ లోనే వుంది అసలు కథ! కాకతాళీయంగా ఈ మొత్తం వ్యవహారంపై ఓ పత్రిక్కి వ్యాసం కూడా రాసి ఇవ్వాల్సి వచ్చింది ఈ వ్యాసకర్త అప్పట్లో.
హీరో హ్యకింగే చేస్తున్నప్పుడు నల్ల డబ్బు తెచ్చేందుకు కోర్టులతో చట్టాలతో పనేముందని అనొచ్చు. హ్యాకింగ్ చేయడానికి వాస్తవంగా అసలక్కడ అలాటి డబ్బే లేదన్నది అలా వుంచితే, హీరో చేసే హ్యాకింగ్ కి ఎథికల్ హ్యాకింగ్ అని నీతివంతమైన పేరెందుకు. ఈ నైతిక ప్రహరీ వెనుక ఎందుకు దాక్కుంటున్నాడు హీరో. అతను చట్టాన్ని చేతిలోకి తీసుకున్న విజిలాంటీ జర్నలిస్టు అయినప్పుడు నేరాన్ని నిర్ద్వంద్వంగా నేరంతోనే కొట్టాలి- ‘డెత్ విష్’ లో విజిలాంటీ క్యారక్టర్ వేసిన చార్లెస్ బ్రాన్సన్ లాగా. అంతే కదా. పెద్ద పెద్ద పదాలు వాడినంత మాత్రాన, బిల్డప్పులిచ్చినంత మాత్రాన, అర్ధవంతమైన ఇంటలెక్చువల్ కథ- పాత్ర అయిపోతాయా? అసలు చిన్నప్పుడే హీరో పంటికి పన్ను అన్నట్టు, తన తండ్రి కాలు విరగ్గొట్టిన వాణ్ణి పెట్రోలు పోసి తగలేట్టేశాడు కదా. అలాంటి సిక్స్ ప్యాక్ వయొలెంట్ విజిలాంటీకి ఇంకా ఎథికల్ హ్యాకింగ్ ఏమిటి- మొరాకోలోనే గొడ్డలి తీసుకుని బ్యాంకు బొక్కసాన్ని బద్దలు కొట్టెయ్యకుండా.
ఇక
‘జర్నలిజం ఇజం ఇజం ఇజం జర్నలిజం -దిస్ ఈజ్ పెట్రియాటిజం’ అంటూ పాట హోరెత్తించారు
చివర్లో. ఈ సినిమా జర్నలిస్టులు చూడాలన్నా తమ వృత్తి గురించి గొప్పగా ఫీలవడానికి
ఏమైనా వుందా. అలా కథ చెప్పారా. ఒక్క
సీనులో కూడా హీరోని జర్నలిస్టు కష్టాలతో చూపించలేదు, ఆ వృత్తినే చూపించలేదు,
చూపించిందంతా టపోరీ ప్రేమా చిన్నప్పటి అన్యాయమూ. మళ్ళీ ఇందులో దేశభక్తిని గుర్తు చేయడమెందుకు,
నిజాల్ని వెలికి తీస్తూనే అన్నేసి లక్షల పేజీల్ని అనునిత్యం నింపుతూనే వుంటారు జర్నలిస్టులు.
ఆ నిజాల్ని ముందు పెట్టుకుని సరైన సమాచారంతో బాధ్యత గల సినిమా తీసి నిరూపించుకోవాల్సింది
పూరీయే దేశభక్తిని! జానర్ మర్యాద అనేది అత్యవసరం ఇప్పటి రోజుల్లో. జానర్ మర్యాద
పాటించిన ఆరేడు సినిమాలే నిలబడ్డాయి గతసంవత్సరం. ప్రేక్షకులు దేనికి ఎందుకు కనెక్ట్
అవుతున్నారో చెప్పలేరు, దర్శకులే ఆ కనెక్షన్ ఏమిటో అర్ధం జేసుకోవాలి- ఇప్పుడు
జానర్ మర్యాద అని! పూరీకి ఆ బాటిల్ వున్నంత కాలం ఇదెప్పుడూ ఆయన సాధించలేరు. ఆయన
సబ్జెక్టులు తీయాల్సింది అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని నమ్ముకుని. అల్లావుద్దీన్
అద్భుత దీపమంటే తనలో వుండే సబ్ కాన్షస్ మైండే!
-సికిందర్
Subscribe to:
Posts (Atom)