రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, June 26, 2015

రైటర్స్ కార్నర్



బాలీవుడ్ రచయిత్రి దేవికా భగత్ 



దేవికా భగత్...బాలీవుడ్ లో అతికొద్ది మంది రచయిత్రుల్లో ప్రత్యేకతలు గల రచయిత్రి.  రాసే కథలు, స్క్రీన్ ప్లేలూ, సంభాషణలూ ఒక సినిమాకీ ఇంకో సినిమాకీ పోలికే వుండదు. 2003 లో  సినిమా రంగ ప్రవేశం చేసి ‘డ్రీమింగ్ లాసా’ అనే  టిబెట్ సినిమాకీ,  హాలీవుడ్ హిట్ ‘బోర్న్ సుప్రమసీ’ కీ  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2007 లో ఆమె జీవితం మలుపు తిరిగింది.   అభయ్ డియోల్ నటించిన ‘మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్’  అనే  విజయవంతమైన మర్డర్ మిస్టరీకి కథ- స్క్రీన్ ప్లే- సంభాషణలూ సమకూర్చి రచయిత్రిగా మారారు. అటు తర్వాత రణబీర్ కపూర్ నటించిన  ‘బచ్ నా యే హసీనో’, షారుఖ్ ఖాన్ నటించిన  ‘జబ్ తక్ హై జాన్’ లకి స్క్రీన్ ప్లే రచయిత్రిగానూ,  సోనమ్ కపూర్ నటించిన ‘ఐషా’, రణవీర్ సింగ్ నటించిన ‘లేడీస్ వర్సెస్ రాకీ బహల్’,  జాన్ అబ్రహాం నటించిన ‘ఐ- మీ- ఔర్ మై’ లకు స్క్రీన్ ప్లే- సంభాషణల రచయిత్రిగానూ, తాజాగా 2014 లో అభయ్ డియోల్ నటించిన ‘ఒన్ బై టూ’ తో దర్శకురాలిగానూ మారిన ఈ ముప్ఫై ఆరేళ్ళ సక్సెస్ ఫుల్ లేడీ,  స్క్రీన్ ప్లే రైటింగ్- డైరెక్షన్ కోర్సుల్లో న్యూయార్క్ యూనివర్సిటీ పట్టభద్రురాలు. ‘ఉమెన్స్ వెబ్ డాట్ ఇన్’  కి ఈమె ఇచ్చిన ఇంటర్వూ పాఠం ఈ కింద చూద్దాం..

˜హిందీ సినిమాలకి మీరు స్క్రీన్ ప్లే రచయిత్రిగా ఎలామారారు?


         నేను న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి స్క్రీన్ ప్లే రైటింగ్- డైరెక్షన్ లలో డిగ్రీ తీసుకున్నాక ఇండియా తిరిగొచ్చాను. నా ఆలోచన ఏమిటంటే నా సొంత కథనల్ని ప్రమోట్ చేసుకోవాలన్నా, భవిష్యత్తులో డైరెక్టర్ గా మారాలాన్నా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే ఆ ద్వారాలు తెర్చుకుంటాయని! కానీ రెండు మూడు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే సరికి సృజనాత్మకంగా నేను కోల్పోతున్నదేమిటో తెలిసి వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను చేస్తున్నదంతా షూటింగు స్పాట్ లో, పోస్ట్ ప్రొడక్షన్ లో రైటింగ్ తో సంబంధం లేని పనే. కానీ తప్పదు. అప్పుడు ఇంకో సినిమాకి అసిస్టెంట్ డైరక్టర్ గా అవకాశం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక స్క్రిప్టు రాసుకున్నాను. అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పెద్ద దర్శకుడు ఇంతియాజ్ అలీ ని కలుసుకోగలిగాను! ఆయన నా పట్ల ఆసక్తి కనబర్చి నేను రాసిన స్క్రిప్టు చదివారు. అది ట్రాష్ అని నాకూ తెలుసు. కానీ నాలో స్క్రీన్ ప్లే రైటర్ అయ్యే టాలెంట్ వుందని ఆయన పసిగట్టారు. తన తర్వాతి సినిమాకి నాకు వర్క్ ఆఫర్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా షూటింగ్ దశకే వెళ్ళలేదు. అయితే రైటింగ్ లో ఆ కొంత అనుభవమే  నాకు బోలెడు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆతర్వాత దర్శకుడు నవదీప్ సింగ్ ని కలుసుకున్నాను. ఇక ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’ రూపు దాల్చడం మొదలయ్యింది..దీంతో నా అదృష్టం ఎలా మలుపు తిరిగిందో మీకు తెలిసిందే! 

    మీరు రాసే సినిమాలు డిఫరెంట్ జానర్స్ తో ఉంటున్నాయి. మీ రచనల మీద దేని ప్రభావం ఎక్కువ వుందంటారు?
        నావరకూ జానర్ అనేది నేను కావాలని కోరుకునేది కాదు. ముందు కథా, ఆ కథలో పాత్రలూ మాత్రమే నాకు ముఖ్యం, అవే నాకు ఏ తరహా సినిమా అవుతుందో దారి చూపుతాయి. నేనిష్ట పడేది ఎక్కువగా క్యారక్టర్స్ కథలే. నన్ను నా క్యారక్టర్సూ, వాటి కథా ప్రపంచమూ నడిపించాలని కోరుకుంటాను. నా కథల్ని మెయిన్ స్ట్రీం అనో, ఆఫ్ బీట్ అనో వర్గీకరించడం కూడా నా కిష్ట ముండదు. అయితే ప్రాజెక్టు కయ్యే బడ్జెట్టు స్క్రీన్ ప్లే లో ఏది ఉండాలో ఏది కూడదో నిర్ణయిస్తుంది కాబట్టి ఈ దృష్ట్యా స్క్రిప్టులు రాయక తప్పదు. 
˜   స్క్రీన్ రైటింగ్ ప్రాసెస్ లో అతి కష్టమైనది క్రియేటివ్ కంట్రోల్ ని కాపాడుకోవడం. కొన్నిసార్లు ఆ కంట్రోల్ ని వదులుకోవాల్సి వస్తుంది కూడా ఒక  రైటర్ గా. అలాటి మీకు అస్సలు ఇష్టంలేని మార్పుచేర్పులు స్క్రిప్టుల్లో చేయాల్సిన అగత్యం ఎప్పుడైనా ఎదురయ్యిందంటారా?
         
స్క్రిప్టు రైటరు దర్శకుల లేదా నిర్మాతల విజన్ ని సాకారం చేయాల్సి వుంటుంది. కథ నాదైనా వాళ్ళదైనా అది వర్కౌట్ అయ్యేలా చూస్తాను.  స్క్రిప్ట్ రైటర్ గా నాకు సొంత క్రియేటివ్ ఆలోచనల లుండొచ్చు, కానీ ఇక్కడ నేను మాత్రమే కాకుండా అవతల ఇంకా దర్శకుల, నిర్మాతల, అగోచరంగా వుండే ప్రేక్షక సమూహపు అభిలాషలూ వుంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయక తప్పదు. నిజమే, అప్పుడప్పుడు  స్క్రిప్టు మీటింగ్స్ లో క్రియేటివ్ పోరాటాలు జరుగుతాయి. కానీ స్క్రిప్టులో ఏదైనా మార్చాల్సి వస్తే నేనెప్పుడూ బ్యాడ్ ఫీలింగ్స్ పెట్టుకోను. బ్యాడ్ ఫీలింగ్స్ నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ సినిమా నుంచే తప్పుకుంటాను. స్క్రిప్ట్ రైటింగ్ అనేది నిరంతర పరిణామ ప్రక్రియ. ఇందులో మడిగట్టుకుని ఏదీ వుండదు. 
   క్యారక్టర్ కథలిష్టమన్నారు. మీరు రాస్తున్నప్పుడు ఉద్భవించే క్యారక్టర్లు ఎంతవరకు తెరమీదికి వచ్చేసరికి జీవం పోసుకుంటున్నాయంటారు?
           నేనెప్పుడూ ఫలానా యాక్టర్ అని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాయలేదు. అది క్యారక్టర్లని ఓ చట్రంలో బిగించేస్తుంది. నేనొకసారి ఓ సినిమాకి స్క్రిప్టు రాస్తున్నప్పుడు ఆ నిర్మాత చాలా సార్లు హీరో జాన్ అబ్రహాం అంటూ చెప్పసాగారు. ఆయన చెప్పినప్పుడల్లా సీన్లు రాస్తున్నప్పుడు జాన్ అబ్రహాం ని షర్టు లేకుండా ఊహించుకుంటూ చాలా ఇబ్బంది పడేదాన్ని!
          అంతిమంగా నా ఊహాలోకంలోని పాత్రల్ని వెండితెరమీద ఏ ఏ తారలు నటిస్తున్నారనేది నాకెప్పుడూ ముఖ్యం కాదు. ఆ పాత్రలకి వాళ్ళెలా ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నదే ప్రధానం. కాగితాల మీద క్యారక్టర్లకి ప్రాణముండదు. ఆయా  తారలూ దర్శకుడూ కలిసి తెరమీద ప్రాణ ప్రతిష్ట చేయాల్సి వుంటుంది. తారల ఎంపిక సమయంలో నిర్మాతలు, దర్శకులు నా సూచనలు అడుగుతారు. అయితే అంతిమ నిర్ణయం వాళ్ళదే. రిహార్సల్స్ సమయంలో ఒక్కోసారి ఆ నటుడు లేదా నటికి సరిపోయేలా పాత్రల్లో మార్పులు చేయాల్సి వుంటుంది కూడా! 
˜   
ఏదైనా ఉదాహరణ చెప్తారా? 
      ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’  సినిమా విషయంలో జరిగింది...ఆ కథలో హీరో పాత్ర సత్యవీర్ నలభై ఐదేళ్ళ నడివయసు వ్యక్తి నిజానికి. కానీ ఆ పాత్రకి అభయ్ డియోల్ ని అనుకున్నాక వయస్సుని ముప్ఫై కి తగ్గిస్తూ పాత్రలో మార్పులు చేయాల్సి వచ్చింది- పాత్ర జీవితంతో సహా. అది మంచికే జరిగిందనుకుంటాను. ముప్ఫై యేళ్ళ హీరోకి ఈ కథ డిమాండ్ చేసే ఇన్వెస్టిగేషన్ కోణం పట్ల జిజ్ఞాస, కుశాగ్రబుద్ధీ ఎక్కువ వుంటాయి కదా?


మీరు చూడాలనుకుంటే ఎలాటి సినిమాలు ఇష్టపడతారు?
          ఫిలిం స్కూల్ కోర్సు చేస్తున్నప్పుడు వరల్డ్ సినిమా మాకు పరిచయం చేశారు. నా వరకూ మాత్రం హాంకాంగ్ దర్శకుడు వాంగ్ కార్ వాయ్, హాలీవుడ్ దర్శకులు కోయెన్ బ్రదర్స్ సినిమాల్ని ఇష్టంగా చూస్తాను. ఇంకా పాల్ థామస్, ఆండర్సన్, అలెగ్జాండర్ పైన్, వేస్ ఆండర్సన్, జేసన్ రీట్మన్, కెమెరాన్ క్రోవ్.. సినిమాలూ ఇష్టమే. ఈ పేర్ల వరస చూస్తూంటే  వీళ్ళు నా కెందుకిష్టమో మీకర్ధమయ్యే వుంటుంది- వీళ్ళందరివీ క్యారక్టర్ డ్రైవెన్ సినిమాలే! 
   
˜   మీరు బాగా ఇష్టపడి రాయాలని కోరుకుంటున్న కథ- కానీ దాన్ని ఇండియాలో తీయడం అసాధ్యంలే అన్పించిన కథ ఏదైనా ఉందా?
             ఉంది! ముగ్గురు నిర్మాతల దగ్గర ప్రయత్నించాను కూడా. ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళ దృష్టిలో అది చాలా డార్క్ మూవీ అవుతుంది. ఓ ఐదేళ్ళల్లో సాధ్యం  కావచ్చను కుంటున్నాను...

˜   హిందీ సినిమాలు పూర్తిగా నగరీ కరణ చెందాయని విమర్శలున్నాయి. పాత బాలీవుడ్ సినిమాల్లాగా అవి బి సెంటర్ ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోతున్నాయి..ఇది నిజమేనా? మీరే ప్రేక్షకుల కోసం రాయాలని కోరుకుంటారు?

         
మొత్తం పరిశ్రమ గురించి నేను కామెంట్ చేయలేను గానీ, నా వరకూ చెప్పగలను. నేను ఫలానా ప్రేక్షకులని మనసులో పెట్టుకుని రాయలేను. నాకు తెలిసింది, నాకు అనుభవమయ్యింది మాత్రమే రాయగలను. నాకు తెలీని ప్రపంచాల గురించి నేనేమీ రాయలేను. అది బూటకంగా వుంటుంది కూడా. ఇక హిందీ సినిమాలు నగరీకరణ చెందడం గురించి.. ‘మనోరమ -సిక్స్ ఫీట్ అండర్’ పల్లెటూళ్ళో జరిగే పల్లెటూరి కథే కదా? కాకపోతే సహజంగా తీశాం. బీ సెంటర్ ప్రేక్షకులకి వాళ్ళ సహజ కథలే వాళ్లకి నచ్చకపోతే ఏం చేస్తాం. నేనేం స్ఫూర్తి పొందానో అది రాయకుండా, వాళ్లకి కావాల్సిందేదో రాస్తూ పోతే చాలా గందరగోళంలో పడిపోతాను!

అమృతా రాజన్


Wednesday, June 24, 2015

కథా? గాథా?


రచన, దర్శకత్వం: ఆర్‌. చంద్రు
తారాగణం: సుధీర్‌బాబు, నందిత, చైతన్య కృష్ణ, పోసాని కృష్ణమురళి, గిరిబాబు,
 పవిత్ర, రఘుబాబు, సప్తగిరి తదితరులు
సంగీతం: హరి, కూర్పు: రమేష్‌ కొల్లూరి, ఛాయాగ్రహణం: కె.ఎస్‌. చంద్రశేఖర్‌
బ్యానర్‌: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌, నిర్మాతలు: శిరీష-శ్రీధర్‌
విడుదల : జూన్‌ 19, 2015
*
All drama is conflict; without conflict there is no character; without character there is no action; without action there is no story. And without story there is no screenplay
 
Syd Field

ట్రెండ్ సెట్టింగ్ ప్రేమకథ లొస్తాయన్న ఆశ ప్రేక్షకుల కెలాగూ లేదు, కనీసం ట్రెండ్ లో వున్న ప్రేమకథలైనా చూడాలని ఆశపడడ్డం కూడా అత్యాశే అయిపోతే నష్టం ప్రేక్షకులకి కాదు- అలాటి తెలుగు ప్రేమ సినిమాలకే! ప్రేమ సినిమాలకి థియేటర్లు ఓపెనింగ్స్ కూడా లేక వెలవెలబోతూ,  రోమాంటిక్ థ్రిల్లర్లూ, హార్రర్ కామెడీలూ వస్తే హౌస్ ఫుల్సూ నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో ఇంకా  పసలేని ప్రేమ సినిమాలు – అందునా కనీసం రోమాంటిక్ కామెడీ కూడా కాని విషాద ప్రేమకథలకి మార్కెట్ ఉంటుందా?

          ఎందుకు ప్రేమసినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి? వీటిని చూసే నేటి యువప్రేక్షకులు  ప్రేమల విషయంలో చాలా ముందున్నారు. సినిమాల్లో చూపిస్తున్న ప్రేమల్లాగా మడిగట్టుకు లేరు. వాళ్ళ దృష్టిలో సినిమాల్లో చూపిస్తున్నది తమ తరం సమస్యలతో కూడిన ప్రేమలు కావు, వెనకటి తరం మూస ఫార్ములా ప్రేమల దగ్గరే సినిమాలు ఆగిపోయాయి. స్టార్ సినిమాలు ఎంత పాత మూసగా వున్నా ఉన్మాదంతో ఊగిపోయి హిట్ చేయగలరు గానీ, అదే మూసగా ప్రేమ సినిమాలోస్తే భరించే స్థితిలో లేరు నేటి యువ ప్రేక్షకులు. ప్రేమ సినిమాల విషయానికొచ్చేసరికి వాటిని తమతో పర్సనల్ గా పోల్చి చూసుకుంటున్నారు. తమ psyche తో కనెక్ట్ కాని పాత మూస ప్రేమలన్నిటినీ తిప్పికొడుతున్నారు. ఇలా టార్గెట్ ఆడియెన్స్ తో కనెక్ట్ కోల్పోయామని కూడా తెలుసుకోకుండా దర్శకులు పనిగట్టుకుని కాలం తీరిన ప్రేమల్నే, ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో చూపించి నట్టుగా కాలం కాటేసిన విషాదంతపు ప్రేమల్ని సైతం తీసుకుంటూ పోతున్నారు. వాళ్ళ మార్కెట్ స్పృహకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ మధ్యే ‘వారధి’ అనే వొక విషాద ప్రేమ సినిమా ఫలితాలు ఎలావున్నాయో చూశాక, మళ్ళీ ఇంకో ట్రాజిక్ లవ్ స్టోరీతో  ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అంటూ వచ్చేసింది. కొసమెరుపేమిటంటే, ఇలాటి ప్రేమ కథతో ఇది కృష్ణమ్మ పరువే తీసింది! తాను ఏం చెప్తున్నాడో తనకే తెలీకుండా ఈ ప్రేమకి కృష్ణమ్మ పరువు తీసే ముగింపునే ఇచ్చాడన్నమాట ఈ దర్శకుడు! 

          ఇది దశాబ్దాలు గడుస్తున్నా కొలిక్కి రాని కృష్ణ అనే ప్రేమికుడి బాధామయ ప్రేమగాధ. ‘గాథ’ అని అనడమెందుకంటే, ఇది ‘కథ’ కాదు కాబట్టి. ‘కథ’కీ- ‘గాథ’ కీ తేడాల గురించీ, గాథలు సినిమాలకి ఎందుకు పనికిరావో మర్మం గురించీ, గత కొన్ని ఇలాటి సినిమాల రివ్యూల్లోనే  చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం ఈ గాథే మిటో చూద్దాం!

రాధాకృష్ణులు వీళ్ళు!  
       వూళ్ళో చదువుకంటే పశువులు తోలుకోవడమే బెటర్ అనుకునే కృష్ణ (సుధీర్ బాబు)  అనే పిల్లాడికి ఏడో క్లాసు తప్పినా స్ట్రెంత్ లేదని ఎనిమిదో క్లాసులో పడేస్తే కొత్తగా వచ్చి జాయి నవుతుంది రాధ ( నందిత) అనే పిల్ల. ఈమెని చూసి వెంటనే ఎట్రాక్ట్ అయిపోయి, ఈమె మెప్పుకోసం బాగా చదువుకుంటూ ప్రతిగా ఆమె ప్రేమని ఆశిస్తాడు, కానీ తానుగా  చెప్పుకోలేడు. ఆ స్కూల్లో ప్రేమ ఇంటర్మీడియేట్ కి చేరినా ఇదే పరిస్థితి. అప్పుడొక ప్రేమలేఖ రాస్తే ఆమె తల్లి ( ప్రగతి) చేతిలోపడి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది. ప్రిన్సిపాల్ ( పోసాని) కృష్ణనీ, రాధనీ విడివిడిగా విచారిస్తాడు. రాధ తనకి చనిపోయిన తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమ తెలీదనీ, తనకు తల్లే సర్వస్వమనీ  చెప్పేస్తుంది ప్రిన్సిపాల్ కి. ఇది విన్న కృష్ణ డీలా పడిపోతాడు.

          ఎంసెట్ పాసయి ఇంజనీరింగ్ లో చేరతాడు. ఆ నగరంలోనే వేరే కాలేజీలో బీకాం చదువుతున్న రాధ మళ్ళీ తారస పడుతుంది. అతణ్ణి ఫ్రెండ్ లాగానే చూస్తుంది. ఇంజనీరింగ్ పాసయి జాబ్ లో కూడా చేరాక కృష్ణకి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పుడు వూళ్ళో రాధని ని కలవడానికి వెళ్తే,  ఆమె తల్లి చెప్తుంది : భర్త పెన్షన్ మీద ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తను రాధ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాననీ, పెళ్లి పేరుతో ఆమెని తననుంచి విడదీస్తే చిన్నకూతురుతో బాటు ఆత్మహత్య చేసుకుంటాననీ బెదిరిస్తుంది.  చేసేది లేక అమెరికా వెళ్ళిపోతాడు కృష్ణ. 

          చాలా ఏళ్ళు గడిచిపోయాక, వూళ్ళో అప్పట్లో  కృష్ణతో కలిసి స్కూల్లో చదువుకుని మానే సిన కొందరు డ్రాపౌట్స్ తమ పూర్వ విద్యార్థుల్ని  కలుసుకోవాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. అప్పుడు కృష్ణ అమెరికా నుంచి వస్తాడు. ఈ సారైనా రాధని పొందగలనా, ఎక్కడుందామె, పెళ్లయిపోయిందా-  అన్న సందేహాలతో.

          తీరా వచ్చి  ఆమెని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే, కాలు పోగొట్టుకుని వికలాంగురాలిలా వుంటుంది. (
spoiler alert ఇక్కడ అప్రస్తుతం, ఈ తరహా గాథ ముగింపు వెల్లడించకుండా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి)

          ఇదీ విషయం. ఈ ఏకపక్ష ప్రేమలో ఎవరెలా చేశారో ఈ కింద  చూద్దాం. 

సాత్విక విషాదాలు!
          హీరోగా సుధీర్ బాబు పూర్తిగా రాముడు మంచి బాలుడు లాంటి పాసివ్ పాత్ర పోషించడంతో, అందుకు తగ్గట్టుగానే సాత్వికంగానే వుంది నటన. ‘మోసగాళ్ళకు మోసగాడు’ కంటే నటనలో బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. కానీ తన ప్రతిభని బయట పెట్టుకోవాలంటే ఇలాంటి బాక్సాఫీసు వ్యతిరేక పాసివ్ పాత్రలు పోషించడం కాదు. ముందు వచ్చే ఆఫర్స్ లో పాసివ్ పాత్రలుంటే వాటిని పసిగట్టి తిప్పికొట్టే నైపుణ్యం సంపాదించుకోవాలి. ప్రేమకథల్లో నటించాలనుకుంటే అవి ట్రెండీగా ఉండేట్టు చూసుకోవాలి. కనీసం గత దశాబ్దంన్నర  కాలంగా వెండితెర మీద ఏ తెలుగు హీరో కూడా పాత్రపరంగా భోరుమని ఏడ్చే సన్నివేశాలతో ఇబ్బంది పెట్టలేదు. అలాటిది తను ఎందుకు ఏడుస్తున్నాడో తెలీకుండా ఒక సన్నివేశంలో కుళ్ళి- కుళ్ళి- కుళ్ళి- కరువుదీరా  ఏడ్వడం వల్ల ప్రయోజనమేమిటో తెలుసుకోవాలి. ఈరోజుల్లో తను శోక రసంలో కూడా మేటి అన్పించుకుంటే వొరిగేదేమిటి? 

          సుధీర్ బాబుదే పాసివ్/ సాత్విక  పాత్ర అనుకుంటే, హీరోయిన్ నందితది మరీ విషాదంతో కూడిన పాసివ్ పాత్ర!  పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూడ్డం తప్ప ఈమె చేసిందేమీ లేదు. మాటలు కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఈమె నుంచి ప్రేక్షకులాశించే రోమాంటిక్ ఎలిమెంట్ ఏ కోశానా కన్పించకుండా చాలా చాలా జాగ్రత్త తీసుకున్నాడు కన్నడ నేటివిటీ దర్శకుడు! 

          పాటలు ఎక్కువైపోయాయి. ఛాయాగ్రహణం లో పెద్దగా ప్రత్యేకత లేదు. సినిమా నిడివి కూడా ఎక్కువే.

స్క్రీన్ ప్లే సంగతులు
       రెండు లోపాలు  ఈ ప్రేమ సినిమాని బలహీన పర్చాయి- మొదటిది ట్రెండ్ లో లేని ప్రేమ, రెండోది ఆ ప్రేమని కూడా ఒక కథలా గాక గాథగా చెప్పడం!
తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు మాత్రమే శాపాలనుకున్నాం- ఇప్పుడు కథలు గాక గాథ లు చెప్పడంతో ఇంకో శాపం కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు!
          ఎప్పుడో పూర్వకాలంలో బాగా ప్రూవైన ఈ బాపతు ‘ప్రేమ త్రెడ్’ ఇప్పుడూ వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో, ఇప్పటి ట్రెండ్ ని పట్టించుకోలేదు. ఈ  త్రెడ్ కూడా ఓ గాథ లాగా వుందని కూడా గమనించినట్టు లేదు. ‘గాథ’ అనేది ఒక స్టేట్ మెంట్ మాత్రమే. నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా ముగిసింది - అని విధికి తలవంచిన పాత్ర పరాజితుడిగా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలాకాక ‘కథ’ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. నేనకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నాను- అని పాత్ర విజేతగా ప్రకటిస్తుంది.

          ‘కథ’ అనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ తో  పనుండదు. హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించికుని ఇంకేదో చేసి- - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం పిడుగు పడి చావడంతో ముగియదు. గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  

          “
 స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్యపరంగా చూసేందుకు కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై,  దాంతో మొదలయ్యే సంఘర్షణ తప్పొప్పుల – లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ ఇవతల పారేసి తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది”

          ఇదీ మణిరత్నం తీసిన ‘ఓకే బంగారం’  స్క్రీన్ ప్లేసంగతుల్లో చెప్పుకున్న విషయం. ఇలా సరీగ్గా ‘ఓకే బంగారం’ లాంటి గాథ చట్రంలోనే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ కూడా ఇరుక్కుంది. ఈ రివ్యూ మొట్టమొదట్లో పైన పేర్కొన్న సిడ్ ఫీల్డ్  కొటేషన్ ప్రకారం చూస్తే, దీన్నొక స్క్రీన్ ప్లే అనుకోవడం ఎలా అనేదే ప్రశ్న! గాథ తో మణిరత్నం ఆల్రెడీ చేసిన తప్పునే మళ్ళీ చేయాలా! 

         సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ తో ఈ గాథ చెప్పుకొచ్చారు. పూర్వ విద్యార్ధుల సమావేశ ప్రతిపాదన, దాంతో అమెరికా నుంచి హీరో తరలివస్తూ రాధగురించి జ్ఞాపకాల్లో వెళ్ళడమనే దృశ్యాలతో ఈ  ‘గాథ’  ని ఎత్తుకున్నారు. దాన్నక్కడ ఆపి - ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అన్ని పరిమితుల్నీఅతిక్రమించి క్లైమాక్స్ దాకా సాగింది. ఎత్తుకున్న గాథ( అమెరికానుంచి వస్తున్న హీరోకి హీరోయిన్ తో ఏం జరుగుతుందన్న ప్రధాన గాథ)  క్లయిమాక్స్ దాకా ఆగిపోయింది.  ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన గాథ అవదు.  ప్రధాన గాథకి సందర్భవశాత్తూ అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే ఫ్లాష్ బ్యాక్ అని ఇదివరకు చెప్పుకున్నాం.

          అయితే ఇంత సుదీర్ఘ మైన ఫ్లాష్ బ్యాక్ ఓ ‘కథ’ లో ఉపయోగపడినట్టుగా ఏ  ‘గాథ’లోనూ  ఉపయోగపడదు. కథల్లో  3-1-2 అనే నాన్ లీనియర్ పద్ధతిలో ఉపయోగపడుతుంది. అంటే ఎండ్- బిగినింగ్- మిడిల్ అన్న వరసలో. చిరంజీవినటించిన ‘ఖైదీ’ సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ కథనమే వుంటుంది. అది క్లైమాక్స్ తో ప్రారంభమై, అసలేం జరిగిందో చెప్పడానికి బిగినింగ్ ని ఎత్తుకుని, మిడిల్ లో ఆ బిగినింగ్ తాలూకు సంఘర్షణ సృష్టించుకుని, తిరిగి క్లయిమాక్స్ కొచ్చి,  ఆ సంఘర్షణని పరిష్కరించుకుంటుంది. ఇది ‘కథ’ కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లో సమస్య- సంఘర్షణ వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ముగిశాక పరిష్కారం వుంటుంది. 

          ఇదే ఫ్లాష్ బ్యాక్ ‘గాథ’ లో వుంటే అది కేవలం సమాచారాన్ని అందించే వనరుగా మాత్రమే  పనిచేస్తుంది తప్ప, ఓ సమస్యా దానితో సంఘర్షణా ఆసక్తికర కథనం వుండదు. ఈ సినిమాలో చూపినట్టు కేవలం అనుభవాల పేర్పు మాత్రంగానే వుంటుంది. ఎన్ని అనుభవాలని చూస్తాం! 


          అందుకని ఈ సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ అంతా అసలు కొసరు ‘గాథ’ కి కేవలం ఉపోద్ఘతంలాగా ఉండిపోయింది. కనుక కథల్లో  పనికొచ్చినట్టుగా ఫ్లాష్ బ్యాక్ ( నాన్ లీనియర్ ) కథనం గాథల్లో  పనికి రాదనీ అర్ధం జేసుకోవాలి.   

          ఉంటే ప్రేక్షకుల ఆసక్తి ప్రధాన గాథ మీదే ఉండొచ్చు తప్ప ఫ్లాష్ బ్యాక్ మీద కాదు. ప్రధాన గాథ ని ఎంత ఎక్కువ సేపు ఆపితే అంత ఆసక్తి ఆవిరైపోతుంది. 

     ఇలావుండగా, ఇది గాథ అవడంతో దీనికో స్ట్రక్చర్ కూడా లేకుండా పోయింది. స్ట్రక్చర్ సమస్య వున్నప్పుడు, దాంతో సంఘర్షణ వున్నప్పుడూ మాత్రమే  వుంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ప్రధాన గాథ కి  అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే  కావడం వల్ల, సహజంగానే ఇందులో  సంఘర్షణ అనేది కూడా లేకుండా పోయింది. గాథల్లో  ఫ్లాష్ బ్యాక్ పెడితే  దాంట్లో ఎప్పుడూ సంఘర్షణ అనేది వుండదు, ఇది గుర్తు పెట్టుకోవాలి. ‘సమస్య ( బిగినింగ్) – సంఘర్షణ (మిడిల్) – పరిష్కారం (ఎండ్)’  అనే త్రిలోకాలు కథలకి  మాత్రమే దఖలు పడిన కథాంగాలు. గాథల్లో, వాటి ఫ్లాష్ బ్యాకుల్లో సెర్చి లైట్ వేసి గాలించినా ఇవి కన్పించవు. 

          కనుక ఈ విధంగానే కేవలం హీరో వివిధ దశల ప్రేమ సమాచారాన్ని మాత్రమే  ఇస్తూ క్లయిమాక్స్ దాకా సాగింది ఫ్లాష్ బ్యాక్! ఒక గాథని  చెప్పడానికి ఇన్నేసి గంటల సమాచారం అవసరమా! సమాచారమే ( ఫ్లాష్ బ్యాకే) ఇంత తినేస్తే  ఇక మొదట్లో ఎత్తుకున్న ప్రధాన గాథ కి ఏం సమయం మిగులుతుంది? 

          ఈ సినిమాలో ప్రధాన  గాథ ఎలా మిగిలిందంటే, రాథని చూడ్డానికి అమెరికానుంచి వచ్చిన వాడు, చివర్లో ఎప్పుడో  చూశాడు- కలుసుకుని సుఖాంతం - పోనీ దుఃఖాంతం చేసుకున్నాడు! అమెరికానుంచి రావడానికీ, చివర్లో ఎప్పుడో  కలుసుకోవడానికీ మధ్య అంతా తన ఫ్లాష్ బ్యాక్ వేసుకుని కాలక్షేపం చేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో దమ్ములేదు, పిసరంత మిగిలిన ప్రథాన గాథ లోనూ దమ్ములేనట్టే. 

          ఈ గాథలో కూడా సమస్య పుట్టడానికి తావిచ్చిన ఘట్టాలు లేకపోలేదు, అవి రెండున్నాయి- ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో ఇంకోటి. ఫస్టాఫ్ లో హీరో ప్రేమ లేఖతో ప్రిన్సిపాల్  సీన్లో హీరోయిన్ తనకి హీరో మీద ప్రేమ లేదన్నట్టు పరోక్షంగా చెప్పినప్పుడు హీరోకి సమస్య పుట్టినట్టే.  అయితే ఇది గాథ గాబట్టి,  సరేలెమ్మని ఈ సమస్య తాలూకు బాధని దిగమింగుకుని వెళ్ళిపోయాడు. ఇదే కథ అయ్యుంటే ఈ సమస్యని సాధించడానికి పాటుపడేవాడు. సంఘర్షణ మొదలయ్యేది. 

          దీనితర్వాత సెకండాఫ్ లో- హీరోయిన్ తల్లి- నా కూతురితో పెళ్ళన్నావంటే ఉరేసుకు చస్తానని బెదిరించినప్పుడూ హీరో చక్కగా ‘గాథ’ లక్షణాలకి న్యాయం చేస్తూ సరేలెమ్మని ఈ సారి అమెరికాకే వెళ్ళిపోయాడు. ఇదే కథ అయ్యుంటే, ఆ తల్లికీ ఆమె చిన్న కూతురి భవిష్యత్తుకీ తగిన హామీ ఇచ్చి ఒప్పించుకునే వాడు!

          పలాయనం చిత్తగించేదే గాథ ల్లో కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి ఊరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలు లభిస్తూంటాయి.

          దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు.

పాత్రోచితానుచితాలు 
       ఇలాటి గాథల్లో పాత్రచిత్రణల గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు. ఎందుకంటే, ఇవి గాథల్లో వుండే లక్షణాలతోనే  తుచా తప్పకుండా ప్రవర్తిస్తాయి. కథల్లో ఇలాటి పాసివ్ పాత్రలుంటే చెప్పుకోవడానికి చాలావుంటుంది. కనుక ఈ గాథలో గాథ లక్షణాల్ని ప్రస్ఫుటం జేస్తూ,  హీరో ఎప్పుడూ పాసివ్ గానే, కార్య విహీనుడిగానే ఉంటాడు. ప్రేమకోసం కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు గానీ, కాలుకదిపి ఓ చిన్న ప్రయత్నం చెయ్యడు. తను చదువుకుని, పెద్ద ఉద్యోగంలో చేరడానికి కాసేపు ఉపాధ్యాయులు కారణమనీ, మరికాసేపు అబ్దుల్ కలాం ఆజాద్ అనీ, ఇంకాస్సేపు హీరోయిన్ స్ఫూర్తి నిచ్చిందనీ, ఆ పూర్వ విద్యార్థుల మీటింగ్ లో ఒకే ఉపన్యాసంలో పరస్పర విరుద్ధంగా కూడా మాట్లాడతాడు.

          హీరోయిన్ కీ తుచా తప్పకుండా ఓ దృక్పథం లేదు. కాసేపు సీఏ చదువుతానని చెప్పి, బీకాం లో చేరుతుంది, మళ్ళీ సీఏ చేస్తున్నానని అంటుంది. పైగా వయసుకి మించిన హూందా తనంతో వుంటుంది. ఆత్మరక్షణ కోసం ప్రకృతి స్త్రీకి ఓ సహజాతాన్ని ( ఇన్ స్టింక్ట్) ఏర్పాటుచేసింది. దాంతో తనతో మెలుగుతున్న ఓ మగాడు ఏంటో ఇట్టే పసిగట్టేయగలదు. అప్పడా  మగాణ్ణి బట్టి జాగ్రత్తపడాలో, ప్రొసీడవచ్చో చర్య తీసుకోగలదు. కానీ ఇక్కడ ఏళ్ల తరబడీ తనతోపాటు చదువుతూ సన్నిహితంగా మెలుగుతున్న, ప్రేమని వెల్లడించలేని అర్భకుణ్ణి  చదవలేని ఆడతనం-  పోనీ జడత్వం ఈమెది! పెద్దపెద్ద కళ్ళేసుకుని చూడ్డం తప్ప ఆ కళ్ళయినా చెప్పే భాషేమీ వుండదు. తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమే  తెలియదట, తల్లే సర్వస్వ మట. మరి ఈ సినిమాలో ఎందుకున్నట్టు. సినిమాల్లో హీరోయిన్ వుండేది ఇందుకేనా? 

          చివరికి తల్లి యాక్సిడెంట్ లో చనిపోయి, అదే యాక్సిడెంట్లో  తను కాలూ పోగొట్టుకుని ( దర్శకుడి ఈజీ సొల్యూషన్ –ఈ దైవిక ఘటన! ) కడు దయనీయంగా దర్శన మిచ్చింది వచ్చిన హీరోకి! 

          అక్కడి కృష్ణా నదిలో బండ రాయిమీద ఏది రాస్తే అదే జరుగుతుందని అక్కడి వాళ్ళ నమ్మకమని ముందెప్పుడో చెప్పిస్తాడు దర్శకుడు. అప్పుడు ఆ బండ రాయిమీద ఆమెకి తెలియకుండా ఐ లవ్యూ అని రాస్తాడు హీరో. చిట్టచివర్లో ఆ వూరొచ్చినప్పుడు ఆమెకూడా రాసిన అక్షరాలూ చూస్తాడు హీరో. ఇంకేముంది...లవ్ సక్సెస్, అక్కడ ఏం రాస్తే అది నిజమౌతుందన్న మాట నిజమవుతోందని మనం సంతోషిస్తూండగానే- అవిటిదానిగా హీరోయిన్ దర్శనం! 

          వావ్, కృష్ణమ్మ ఇంత ఘోరంగా కలిపిందా!

సికిందర్ 



Monday, June 15, 2015

నాటి రహస్యం!


          జానపద వీరుణ్ణి కౌబాయ్ హీరోగా మార్చేసి, మొత్తం భారతీయ సినిమానే కొత్త జానర్ లోకి కదం తొక్కించిన యాక్షన్ సినిమాల డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్. కె ఎస్ ఆర్  దాస్ - కృష్ణ- ఓ కౌబాయ్ పాత్రా కలిస్తే అదొక ‘మోసగాళ్ళకు మోసగాడు’ అయి తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తే, మళ్ళీ భాష మార్చుకుని నూట పాతిక దేశాల్లో ‘ట్రెజర్ హంట్’ గా డబ్బింగై రికార్డులు కూడా  సృష్టించింది!  
          ఇవ్వాళ్ళ నాలుగైదు దేశాల్లో ఓవర్సీస్ వ్యాపారం చేసుకోగల్గుతోంది తెలుగు సినిమా. దీన్నే ‘ప్రపంచవ్యాప్తంగా విడుదల’ అంటున్నారు. కానీ నాలుగు దశాబ్దాల క్రితమే ‘మోసగాళ్ళకు మోసగాడు’ సాధించిన యూనివర్శల్ సక్సెస్ స్టోరీ ముందు ఇదెంత! ఎల్లెలెరుగని సక్సెస్ కొత్త కొత్తగా చేసే సాహసాల వల్లే వస్తుంది!


ఇది హీరో కృష్ణ సాహసం. కానీ దీనికంటే ముందు కె ఎస్ ఆర్ దాస్ చేసిన సాహసం వుంది. 1970 లోనే విజయలలిత తో ‘రౌడీ రాణి’ తీసి, ఆలిండియా లోనే మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా ఆయన నిలబెట్టాడు. తనూ మొట్ట మొదటి యాక్షన్ సినిమా డైరెక్టర్ అయ్యాడు. అలాగే 1971 లో కృష్ణ నటిస్తూ నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తో దేశానికి మొట్ట మొదటి కౌబాయ్ సినిమాని అందిస్తూ, చరిత్రని సృష్టించాడు కె ఎస్ ఆర్ దాస్.   ప్రతీ ట్రెండ్ సెట్టర్ ఒక చారిత్రక అవసరం కోసం పుడతాడు. 1970 ల నాటికి ఆదరణ కోల్పోతున్న  జానపద సినిమాల స్లాట్ ని కె ఎస్ ఆర్ దాస్ తన కౌబాయ్- యాక్షన్ చిత్రాల పరంపరతో భర్తీ చేస్తూ, సగటు ప్రేక్షకుల్నితండోపతండాలుగా కొత్త ఉత్సాహంతో థియేటర్లకి రప్పించిన ఘనత సాధించాడు. కానీ ఏదైతే ఫారిన్ అన్పిస్తుందో దానికి సినిమా పండితుల ఆదరణ లభించదు. కాబట్టి యాక్షన్ దాదా దాస్ ఎలాటి అవార్డులకీ అర్హుడు కాలేకపోయారు. ఇది చూడముచ్చటగా సినిమా పండితులు చేసిన చారిత్రక తప్పిదం (ఈ వ్యాసం చదివి బెంగళూరు నుంచి కె ఎస్ ఆర్ దాస్ ఫోన్ చేసి బాధని పంచుకున్నారు).


      ‘మోసగాళ్ళకు మోసగాడు’ దాస్ కి 
దర్శకత్వంలో గోల్డ్ మెడల్ లాంటి సినిమా. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’ లాంటి హాలీవుడ్ సినిమాలు ఈ తెలుగు కౌబాయ్ కి స్ఫూర్తే గానీ నకలు కాదు. నేడు దృశ్యాలే యదేచ్ఛగా కాపీఅవుతున్న నేపధ్యంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో ప్రతీ దృశ్యం  సొంత సృష్టే కావడం గర్వకారణం. లేకపోతే  125 దేశాల్లో విడుదలైన దీని డబ్బింగ్ వెర్షన్ ని తిప్పికొట్టేసే  వాళ్ళు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గర్వ పడాల్సిన ఓ అద్భుత కౌబాయ్ సృష్టి ఈ సినిమాతో  చేశారు మహా కవి ఆరుద్ర. కవులేంటి, కౌబాయ్ లు రాయడమేంటని జుట్లు పీక్కోనక్కర్లేదు. ఆ రోజుల్లో కొందరు కవులూ రచయితలు కూడా నన్న విషయం మరువకూడదు. ఆరుద్ర అలాంటి సృష్టి చేస్తే, హాలీవుడ్ ప్రభావం పడనీ దర్శకుడు దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్సార్ స్వామి దీన్ని తెరకెక్కించారు. అప్పటివరకూ తెలుగు ప్రేక్షకులకి ఏమాత్రం పరిచయం లేని పరాయి పాత్రలో కలర్ కౌబాయ్ గా హీరో కృష్ణ సూటిగా వాళ్ళ హృదయాల్లోకి దూసుకు పోయారు. అంతే, ప్రాణాంతకమైన ఇంత రిస్కుతీసుకుని ఎక్కడో హాలీవుడ్ కౌబాయ్ పాత్రని తెలుగుకి నమ్మించి, టోకున అమ్మించేయడం మామూలు విజయం కాదు, విజయంన్నర విజయమది!

ఇంకా ఈ సినిమాతో ముందు కాలంలో ఎదురవబోయే ఓ సమస్య ని అప్పుడే ఊహించేసినట్టు, దానికో పరిష్కారాన్ని కూడా సూచించేశారు. ఇప్పుడు మారిపోయిన జీవన విధానంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఓ సినిమా దృశ్యం పై ధ్యాస పట్టే అటెన్షన్ స్పాన్  అనేది పది సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ ఆందోళన చెందుతోంది. దీంతో  తెలుగులో కూడా ఎంటీవీ తరహా హడావిడి మెరుపు షాట్స్ కట్ చేస్తున్నారు. దీనివల్ల పసలేని వాక్యాల్లా దృశ్యాలు తే లిపోతున్నాయి. దీనికో పరిష్కారంగా అన్నట్టు ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో దృశ్యాత్మక వైభవాన్ని సంతరించిపెట్టారు. ఆ దృశ్యాత్మక వైభవాన్ని  హీరో పాత్ర ఆలంబనగా సృష్టించారు. వాణిజ్య సినిమాకి హీరో పాత్ర తప్ప మరేదీ ప్రధానాకర్షణ అవదు కాబట్టి,  దృశ్య దృశ్యానికీ మారిపోయే కొత్త కొత్త కౌబాయ్ డ్రెస్సులతో హీరో కృష్ణ కలర్ఫుల్ గా కనువిందు  చేస్తూంటే, ప్రేక్షకుల కళ్ళు తెరకి అతుక్కుపోక ఏమౌతాయి? అప్పుడు అటెన్షన్ స్పాన్ అనే వేధించే సమస్య కి స్థానం ఎక్కడుంటుంది? జీవన వేగంతో పరుగులెత్తే హడావిడీ బిజీ ప్రేక్షకుల పరధ్యానాన్ని దృశ్యం జయించాలంటే, ఎప్పటికప్పుడు అలరించే కంటెంటే ముఖ్యం తప్ప, ఎలాంటి ఫ్లాష్ కట్స్ లతో సారం లేని టెక్నాలజీ కాదని ఆనాడే తేటతెల్లం చేసింది ‘మోసగాళ్ళకు మోసగాడు’! 

     ఎర్రటి రాజస్థాన్ ఎడారులు, బికనీర్ కోట లు, ఆకుపచ్చ- నీలి వర్ణపు ప్రవాహంతో సట్లెజ్ నదీ తీరం, తెల్లటి సిమ్లా మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాక్- చైనా సరిహద్దూ..ఇలా ఎన్నెన్నో అంతర్జాతీయ స్థాయి దృశ్యాల చిత్రీకరణలతో, ఉత్తర భారతాన్ని ప్రపంచానికి చూపెట్టిన దక్షిణ సినిమా ఇది!  మద్రాసు నుంచి ప్రత్యేక రైల్లో రాజస్థాన్ కి యూనిట్ అంతా తరలి వెళ్తోంటే సినిమా వర్గాల్లో ఆందోళన. ఇంత బరితెగించిన హంగామాతో పద్మాలయా బ్యానర్ ఉండేనా పోయేనా అని దిగులు. తీరా బాక్సాఫీసు వైపు చూశాక కళ్ళు చేదిరేట్టు  కనకవర్షం!

         కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, రావుగోపాలరావు, గుమ్మడి, కాంతారావు, ధూళిపాళ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, సాక్షి రంగారావు, త్యాగరాజు, ఆనందమోహన్, కాకరాల, గోకిన రామారావు, సి హెచ్ కృష్ణమూర్తి ...ఇంకా జ్యోతిలక్ష్మి, రాజసులోచన, శాంతకుమారి, ఎస్ వరలక్ష్మి, తదితర హేమాహేమీలతో  కూడిన భారీ తారాగణం!

          పాటలూ హిట్టే! స్వరకల్పన ఆదినారాయణరావు. గీతరచన ఆరుద్ర, అప్పలాచార్య. ‘కోరినది నెరవేరినది’, ‘గురిని సూటిగా చూసేవాడా’, ‘ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా’..పాటలు మాంఛి కిక్కు. అప్పట్లోనే ఫిరోజ్ ఖాన్ తీసిన ‘అపరాథ్’ లోని ‘తుమ్ మిలే జో ముజే’ ( కిషోర్-ఆశా) పాట బాణీకి దగ్గరగా వుండే పాట ‘కోరినది నెరవేరినది’..

        నాగభూషణం తో  ఆరుద్ర యదేచ్ఛగా పలికించేసిన  ‘తల్లి ముండమొయ్య’ ఊతపదం, ‘నమ్మించి పుట్టి ముంచుతావురో కొడుకో! నీ కాష్ఠం వానొచ్చి ఆరిపోతుందిరో కొడుకో! నిన్ను నక్కలు పీక్కు తింటాయిరా కొడుకో- కొడుకో!!’ అనే తిట్లూ సెన్సార్ కి చిక్కకపోవడం అదో అద్భుతం!
     కృష్ణని కొత్తావతారంతో మొట్టమొదటి ఇండియన్ కౌబాయ్ గా ప్రెజెంట్ చేసిన నిపుణుల్లో ఇంకా కాస్ట్యూమర్స్ బాబూరావ్- వెంకట్రావులు, మేకప్ మాన్ మాధవరావు, ఫైట్ మాస్టర్స్ రాఘవులు- మాధవ్ ప్రభృతులు వున్నారు.

ఆరుద్రామృతం!
  ‘వెండి పలకల గ్లాసు’ వంటి డిటెక్టివ్ కథలు రాసిన ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)  కి కౌబాయ్ యాక్షన్ రాయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే దాంతో తెలుగు ప్రేక్షకుల్ని ఒప్పించడం దగ్గరే వస్తుంది సమస్య. తెలుగు ప్రేక్షకుడు అసలే కొరకరాని కొయ్య. వాడికేం నచ్చుతుందో వాణ్ణి పుట్టించిన బ్రహ్మ కూడా కనుక్కోలేడు. మూసని వడ్డిస్తే ఎంతైనా ఆవురావురని ఆరగించేస్తాడని మాత్రం తెలుసు. కానీ ఆ  మూసలో నైనా ముక్కూ  మొహం తెలీని, విచిత్ర వేషధారి  కౌబాయ్ పాత్రని దించడమెలా?

         ‘ఏక్  నిరంజన్ ‘ లో పూరీ జగన్నాథ్ విదేశాల్లో కనిపించే బౌంటీ హంటర్ అనే పాత్రలో ప్రభాస్ ని చూపించాడు. అది నేటివిటీ లేక ప్రేక్షకులకి ఎక్కలేదు. ఆరుద్ర ఈ నేటివిటీ గురించే ఆలోచించి వుంటారు. తన కౌబాయ్ హీరో పాత్ర కూడా విదేశీ బౌంటీ హంటరే! అంటే నేరస్థుల్ని చట్టానికి పట్టించి తృణమో పణమో సంపాదించుకునేవాడు. అందుకని ఆరుద్ర కథని సమకాలీనం చేయకుండా తెలివిగా ఇండియాని ఏలిన బ్రిటిష్- ఫ్రెంచి ల కాలంలో స్థాపించారు. అనగనగా బొబ్బిలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అమరవీడు సంస్థానం మీద దాడి చేస్తారు. అక్కడ్నించీ మొదలెడితే గద్వాల, కర్నూలు సంస్థానాల వరకూ ఓ నిధికోసం వేట కొనసాగుతుంది. అప్పటి నేపధ్యవాతావరణం, ఆ నట్ట నడి తెలుగు ప్రాంతంలో విదేశీ సంస్కృతీ, నిధి వేటా అనేవి  ఆరుద్ర సృష్టించిన కృష్ణ ప్రసాద్ (కృష్ణ) పాత్రకి సరిపోయి- క్రిమినల్ పాత్రలో నాగభూషణాన్ని పదే పదే  పట్టిచ్చే బౌంటీ హంటర్ లాగా చూపించినా చెల్లిపోయింది. పైగా విలన్స్ కి బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య..అంటూ మాస్ పేర్లు కూడా తగిలించడంతో అప్పటి నేలక్లాసు ప్రేక్షకులు పేచీ పెట్టకుండా ఆ పాత్రల్ని ఆనందంగా ‘ఓన్’ చేసేసుకున్నారు. 

            ఇక ఆరుద్ర ఈ యాక్షన్ కథ అల్లిన తీరు ఒక అద్భుత విన్యాసమనే చెప్పాలి. కథకి మెయిన్ లైన్ ఒకటి, లూప్ లైన్ ఒకటి పెట్టుకున్నారు. ఇక సరైన సమయంలో సరయిన నిర్ణయం అన్నట్టు కథేమిటో అప్పుడప్పుడే  చెప్పకుండా ప్రేక్షకుల్ని ఊరిస్తూ, ఓ చోట మెయిన్ లైన్లో లూప్ లైన్ ని కలిపేస్తూ పాయింటాఫ్ ఎటాక్ ని సృష్టించారు!

          ఇందువల్ల ఆలశ్యంగా వచ్చిన కథలో ఈ మొదటి మలుపు- టైమింగ్ ని కోల్పోయిందని అన్పించదు. మెయిన్ లైన్ లో సత్యనారాయణ  గ్యాంగ్ తో నిధికి సంబంధించిన కుట్రలు చూపిస్తూ, దీని బ్యాక్ డ్రాప్ లో దీనితో సంబంధంలేని లూప్ లైన్ లో కృష్ణ – నాగభూషణం ళ పరస్పరం దెబ్బ దీసుకునే ఎత్తుగడలతో వినోదాత్మక కథనం నడిపారు. ఫైనల్ గా కృష్ణని  నాగభూషణం అమాంతం పట్టేసుకుని కాళ్ళూ చేతులు కట్టేసి ఎడారిలో పడేసి పగదీర్చుకుని వెళ్ళిపోయాక, ఒంటెల బండిలో కొన ప్రాణాలతో వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి  కృష్ణ చెవిలో నిధి గురించి రహస్యం చెప్పిపోయే ఘట్టం ( పాయింటాఫ్ ఎటాక్) తో,  ఈ లూప్ లైన్ కాస్తా మెయిన్ లైన్ తో స్పర్శిస్తుందన్నమాట  మాట! 

          ఇలా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలూ అన్నీ ఆరుద్రే రాసుకుని వెళ్ళాక, ఒక ఎదురు చూడని అనుభవం ఎదురయ్యిందాయనకి. అదేమిటో సినీ విజ్ఞాన  విశారద ఎస్వీ రామారావు ఇలా చెప్పారు- ఆరుద్ర ఇంత అద్భుతంగా స్క్రిప్టు రాసి చూపించాక, ఆయన్నే దర్శకత్వం వహించమని పట్టుబట్టారు పద్మాలయా నిర్మాతలు జి. ఆది శేషగిరిరావు, జి. హనుమంతరావులు. అయితే ఆరుద్ర అసలు ఒప్పుకోలేదు!


 సికిందర్
ఫిబ్రవరి 2010 ‘సాక్షి’