రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జూన్ 2015, సోమవారం

నాటి రహస్యం!


          జానపద వీరుణ్ణి కౌబాయ్ హీరోగా మార్చేసి, మొత్తం భారతీయ సినిమానే కొత్త జానర్ లోకి కదం తొక్కించిన యాక్షన్ సినిమాల డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్. కె ఎస్ ఆర్  దాస్ - కృష్ణ- ఓ కౌబాయ్ పాత్రా కలిస్తే అదొక ‘మోసగాళ్ళకు మోసగాడు’ అయి తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తే, మళ్ళీ భాష మార్చుకుని నూట పాతిక దేశాల్లో ‘ట్రెజర్ హంట్’ గా డబ్బింగై రికార్డులు కూడా  సృష్టించింది!  
          ఇవ్వాళ్ళ నాలుగైదు దేశాల్లో ఓవర్సీస్ వ్యాపారం చేసుకోగల్గుతోంది తెలుగు సినిమా. దీన్నే ‘ప్రపంచవ్యాప్తంగా విడుదల’ అంటున్నారు. కానీ నాలుగు దశాబ్దాల క్రితమే ‘మోసగాళ్ళకు మోసగాడు’ సాధించిన యూనివర్శల్ సక్సెస్ స్టోరీ ముందు ఇదెంత! ఎల్లెలెరుగని సక్సెస్ కొత్త కొత్తగా చేసే సాహసాల వల్లే వస్తుంది!


ఇది హీరో కృష్ణ సాహసం. కానీ దీనికంటే ముందు కె ఎస్ ఆర్ దాస్ చేసిన సాహసం వుంది. 1970 లోనే విజయలలిత తో ‘రౌడీ రాణి’ తీసి, ఆలిండియా లోనే మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా ఆయన నిలబెట్టాడు. తనూ మొట్ట మొదటి యాక్షన్ సినిమా డైరెక్టర్ అయ్యాడు. అలాగే 1971 లో కృష్ణ నటిస్తూ నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తో దేశానికి మొట్ట మొదటి కౌబాయ్ సినిమాని అందిస్తూ, చరిత్రని సృష్టించాడు కె ఎస్ ఆర్ దాస్.   ప్రతీ ట్రెండ్ సెట్టర్ ఒక చారిత్రక అవసరం కోసం పుడతాడు. 1970 ల నాటికి ఆదరణ కోల్పోతున్న  జానపద సినిమాల స్లాట్ ని కె ఎస్ ఆర్ దాస్ తన కౌబాయ్- యాక్షన్ చిత్రాల పరంపరతో భర్తీ చేస్తూ, సగటు ప్రేక్షకుల్నితండోపతండాలుగా కొత్త ఉత్సాహంతో థియేటర్లకి రప్పించిన ఘనత సాధించాడు. కానీ ఏదైతే ఫారిన్ అన్పిస్తుందో దానికి సినిమా పండితుల ఆదరణ లభించదు. కాబట్టి యాక్షన్ దాదా దాస్ ఎలాటి అవార్డులకీ అర్హుడు కాలేకపోయారు. ఇది చూడముచ్చటగా సినిమా పండితులు చేసిన చారిత్రక తప్పిదం (ఈ వ్యాసం చదివి బెంగళూరు నుంచి కె ఎస్ ఆర్ దాస్ ఫోన్ చేసి బాధని పంచుకున్నారు).


      ‘మోసగాళ్ళకు మోసగాడు’ దాస్ కి 
దర్శకత్వంలో గోల్డ్ మెడల్ లాంటి సినిమా. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’ లాంటి హాలీవుడ్ సినిమాలు ఈ తెలుగు కౌబాయ్ కి స్ఫూర్తే గానీ నకలు కాదు. నేడు దృశ్యాలే యదేచ్ఛగా కాపీఅవుతున్న నేపధ్యంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో ప్రతీ దృశ్యం  సొంత సృష్టే కావడం గర్వకారణం. లేకపోతే  125 దేశాల్లో విడుదలైన దీని డబ్బింగ్ వెర్షన్ ని తిప్పికొట్టేసే  వాళ్ళు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గర్వ పడాల్సిన ఓ అద్భుత కౌబాయ్ సృష్టి ఈ సినిమాతో  చేశారు మహా కవి ఆరుద్ర. కవులేంటి, కౌబాయ్ లు రాయడమేంటని జుట్లు పీక్కోనక్కర్లేదు. ఆ రోజుల్లో కొందరు కవులూ రచయితలు కూడా నన్న విషయం మరువకూడదు. ఆరుద్ర అలాంటి సృష్టి చేస్తే, హాలీవుడ్ ప్రభావం పడనీ దర్శకుడు దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్సార్ స్వామి దీన్ని తెరకెక్కించారు. అప్పటివరకూ తెలుగు ప్రేక్షకులకి ఏమాత్రం పరిచయం లేని పరాయి పాత్రలో కలర్ కౌబాయ్ గా హీరో కృష్ణ సూటిగా వాళ్ళ హృదయాల్లోకి దూసుకు పోయారు. అంతే, ప్రాణాంతకమైన ఇంత రిస్కుతీసుకుని ఎక్కడో హాలీవుడ్ కౌబాయ్ పాత్రని తెలుగుకి నమ్మించి, టోకున అమ్మించేయడం మామూలు విజయం కాదు, విజయంన్నర విజయమది!

ఇంకా ఈ సినిమాతో ముందు కాలంలో ఎదురవబోయే ఓ సమస్య ని అప్పుడే ఊహించేసినట్టు, దానికో పరిష్కారాన్ని కూడా సూచించేశారు. ఇప్పుడు మారిపోయిన జీవన విధానంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఓ సినిమా దృశ్యం పై ధ్యాస పట్టే అటెన్షన్ స్పాన్  అనేది పది సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ ఆందోళన చెందుతోంది. దీంతో  తెలుగులో కూడా ఎంటీవీ తరహా హడావిడి మెరుపు షాట్స్ కట్ చేస్తున్నారు. దీనివల్ల పసలేని వాక్యాల్లా దృశ్యాలు తే లిపోతున్నాయి. దీనికో పరిష్కారంగా అన్నట్టు ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో దృశ్యాత్మక వైభవాన్ని సంతరించిపెట్టారు. ఆ దృశ్యాత్మక వైభవాన్ని  హీరో పాత్ర ఆలంబనగా సృష్టించారు. వాణిజ్య సినిమాకి హీరో పాత్ర తప్ప మరేదీ ప్రధానాకర్షణ అవదు కాబట్టి,  దృశ్య దృశ్యానికీ మారిపోయే కొత్త కొత్త కౌబాయ్ డ్రెస్సులతో హీరో కృష్ణ కలర్ఫుల్ గా కనువిందు  చేస్తూంటే, ప్రేక్షకుల కళ్ళు తెరకి అతుక్కుపోక ఏమౌతాయి? అప్పుడు అటెన్షన్ స్పాన్ అనే వేధించే సమస్య కి స్థానం ఎక్కడుంటుంది? జీవన వేగంతో పరుగులెత్తే హడావిడీ బిజీ ప్రేక్షకుల పరధ్యానాన్ని దృశ్యం జయించాలంటే, ఎప్పటికప్పుడు అలరించే కంటెంటే ముఖ్యం తప్ప, ఎలాంటి ఫ్లాష్ కట్స్ లతో సారం లేని టెక్నాలజీ కాదని ఆనాడే తేటతెల్లం చేసింది ‘మోసగాళ్ళకు మోసగాడు’! 

     ఎర్రటి రాజస్థాన్ ఎడారులు, బికనీర్ కోట లు, ఆకుపచ్చ- నీలి వర్ణపు ప్రవాహంతో సట్లెజ్ నదీ తీరం, తెల్లటి సిమ్లా మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాక్- చైనా సరిహద్దూ..ఇలా ఎన్నెన్నో అంతర్జాతీయ స్థాయి దృశ్యాల చిత్రీకరణలతో, ఉత్తర భారతాన్ని ప్రపంచానికి చూపెట్టిన దక్షిణ సినిమా ఇది!  మద్రాసు నుంచి ప్రత్యేక రైల్లో రాజస్థాన్ కి యూనిట్ అంతా తరలి వెళ్తోంటే సినిమా వర్గాల్లో ఆందోళన. ఇంత బరితెగించిన హంగామాతో పద్మాలయా బ్యానర్ ఉండేనా పోయేనా అని దిగులు. తీరా బాక్సాఫీసు వైపు చూశాక కళ్ళు చేదిరేట్టు  కనకవర్షం!

         కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, రావుగోపాలరావు, గుమ్మడి, కాంతారావు, ధూళిపాళ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, సాక్షి రంగారావు, త్యాగరాజు, ఆనందమోహన్, కాకరాల, గోకిన రామారావు, సి హెచ్ కృష్ణమూర్తి ...ఇంకా జ్యోతిలక్ష్మి, రాజసులోచన, శాంతకుమారి, ఎస్ వరలక్ష్మి, తదితర హేమాహేమీలతో  కూడిన భారీ తారాగణం!

          పాటలూ హిట్టే! స్వరకల్పన ఆదినారాయణరావు. గీతరచన ఆరుద్ర, అప్పలాచార్య. ‘కోరినది నెరవేరినది’, ‘గురిని సూటిగా చూసేవాడా’, ‘ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా’..పాటలు మాంఛి కిక్కు. అప్పట్లోనే ఫిరోజ్ ఖాన్ తీసిన ‘అపరాథ్’ లోని ‘తుమ్ మిలే జో ముజే’ ( కిషోర్-ఆశా) పాట బాణీకి దగ్గరగా వుండే పాట ‘కోరినది నెరవేరినది’..

        నాగభూషణం తో  ఆరుద్ర యదేచ్ఛగా పలికించేసిన  ‘తల్లి ముండమొయ్య’ ఊతపదం, ‘నమ్మించి పుట్టి ముంచుతావురో కొడుకో! నీ కాష్ఠం వానొచ్చి ఆరిపోతుందిరో కొడుకో! నిన్ను నక్కలు పీక్కు తింటాయిరా కొడుకో- కొడుకో!!’ అనే తిట్లూ సెన్సార్ కి చిక్కకపోవడం అదో అద్భుతం!
     కృష్ణని కొత్తావతారంతో మొట్టమొదటి ఇండియన్ కౌబాయ్ గా ప్రెజెంట్ చేసిన నిపుణుల్లో ఇంకా కాస్ట్యూమర్స్ బాబూరావ్- వెంకట్రావులు, మేకప్ మాన్ మాధవరావు, ఫైట్ మాస్టర్స్ రాఘవులు- మాధవ్ ప్రభృతులు వున్నారు.

ఆరుద్రామృతం!
  ‘వెండి పలకల గ్లాసు’ వంటి డిటెక్టివ్ కథలు రాసిన ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)  కి కౌబాయ్ యాక్షన్ రాయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే దాంతో తెలుగు ప్రేక్షకుల్ని ఒప్పించడం దగ్గరే వస్తుంది సమస్య. తెలుగు ప్రేక్షకుడు అసలే కొరకరాని కొయ్య. వాడికేం నచ్చుతుందో వాణ్ణి పుట్టించిన బ్రహ్మ కూడా కనుక్కోలేడు. మూసని వడ్డిస్తే ఎంతైనా ఆవురావురని ఆరగించేస్తాడని మాత్రం తెలుసు. కానీ ఆ  మూసలో నైనా ముక్కూ  మొహం తెలీని, విచిత్ర వేషధారి  కౌబాయ్ పాత్రని దించడమెలా?

         ‘ఏక్  నిరంజన్ ‘ లో పూరీ జగన్నాథ్ విదేశాల్లో కనిపించే బౌంటీ హంటర్ అనే పాత్రలో ప్రభాస్ ని చూపించాడు. అది నేటివిటీ లేక ప్రేక్షకులకి ఎక్కలేదు. ఆరుద్ర ఈ నేటివిటీ గురించే ఆలోచించి వుంటారు. తన కౌబాయ్ హీరో పాత్ర కూడా విదేశీ బౌంటీ హంటరే! అంటే నేరస్థుల్ని చట్టానికి పట్టించి తృణమో పణమో సంపాదించుకునేవాడు. అందుకని ఆరుద్ర కథని సమకాలీనం చేయకుండా తెలివిగా ఇండియాని ఏలిన బ్రిటిష్- ఫ్రెంచి ల కాలంలో స్థాపించారు. అనగనగా బొబ్బిలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అమరవీడు సంస్థానం మీద దాడి చేస్తారు. అక్కడ్నించీ మొదలెడితే గద్వాల, కర్నూలు సంస్థానాల వరకూ ఓ నిధికోసం వేట కొనసాగుతుంది. అప్పటి నేపధ్యవాతావరణం, ఆ నట్ట నడి తెలుగు ప్రాంతంలో విదేశీ సంస్కృతీ, నిధి వేటా అనేవి  ఆరుద్ర సృష్టించిన కృష్ణ ప్రసాద్ (కృష్ణ) పాత్రకి సరిపోయి- క్రిమినల్ పాత్రలో నాగభూషణాన్ని పదే పదే  పట్టిచ్చే బౌంటీ హంటర్ లాగా చూపించినా చెల్లిపోయింది. పైగా విలన్స్ కి బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య..అంటూ మాస్ పేర్లు కూడా తగిలించడంతో అప్పటి నేలక్లాసు ప్రేక్షకులు పేచీ పెట్టకుండా ఆ పాత్రల్ని ఆనందంగా ‘ఓన్’ చేసేసుకున్నారు. 

            ఇక ఆరుద్ర ఈ యాక్షన్ కథ అల్లిన తీరు ఒక అద్భుత విన్యాసమనే చెప్పాలి. కథకి మెయిన్ లైన్ ఒకటి, లూప్ లైన్ ఒకటి పెట్టుకున్నారు. ఇక సరైన సమయంలో సరయిన నిర్ణయం అన్నట్టు కథేమిటో అప్పుడప్పుడే  చెప్పకుండా ప్రేక్షకుల్ని ఊరిస్తూ, ఓ చోట మెయిన్ లైన్లో లూప్ లైన్ ని కలిపేస్తూ పాయింటాఫ్ ఎటాక్ ని సృష్టించారు!

          ఇందువల్ల ఆలశ్యంగా వచ్చిన కథలో ఈ మొదటి మలుపు- టైమింగ్ ని కోల్పోయిందని అన్పించదు. మెయిన్ లైన్ లో సత్యనారాయణ  గ్యాంగ్ తో నిధికి సంబంధించిన కుట్రలు చూపిస్తూ, దీని బ్యాక్ డ్రాప్ లో దీనితో సంబంధంలేని లూప్ లైన్ లో కృష్ణ – నాగభూషణం ళ పరస్పరం దెబ్బ దీసుకునే ఎత్తుగడలతో వినోదాత్మక కథనం నడిపారు. ఫైనల్ గా కృష్ణని  నాగభూషణం అమాంతం పట్టేసుకుని కాళ్ళూ చేతులు కట్టేసి ఎడారిలో పడేసి పగదీర్చుకుని వెళ్ళిపోయాక, ఒంటెల బండిలో కొన ప్రాణాలతో వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి  కృష్ణ చెవిలో నిధి గురించి రహస్యం చెప్పిపోయే ఘట్టం ( పాయింటాఫ్ ఎటాక్) తో,  ఈ లూప్ లైన్ కాస్తా మెయిన్ లైన్ తో స్పర్శిస్తుందన్నమాట  మాట! 

          ఇలా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలూ అన్నీ ఆరుద్రే రాసుకుని వెళ్ళాక, ఒక ఎదురు చూడని అనుభవం ఎదురయ్యిందాయనకి. అదేమిటో సినీ విజ్ఞాన  విశారద ఎస్వీ రామారావు ఇలా చెప్పారు- ఆరుద్ర ఇంత అద్భుతంగా స్క్రిప్టు రాసి చూపించాక, ఆయన్నే దర్శకత్వం వహించమని పట్టుబట్టారు పద్మాలయా నిర్మాతలు జి. ఆది శేషగిరిరావు, జి. హనుమంతరావులు. అయితే ఆరుద్ర అసలు ఒప్పుకోలేదు!


 సికిందర్
ఫిబ్రవరి 2010 ‘సాక్షి’