రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జూన్ 2015, ఆదివారం

ఇదే కథ?

కథ : మల్లాది వెంకటకృష్ణమూర్తి
తారాగణం :  ఛార్మీ,  సత్యదేవ్, బ్రహ్మానందం, టార్జాన్‌, సాక్షి రాంరెడ్డి తదితరులు
సంగీతం :  
సునీల్‌ కశ్యప్‌ ;   ఛాయాగ్రహణం :  పి.జి. విందా ;
బ్యానర్ : 
సి కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. ; శ్రీ శుభస్వేత ; సమర్పణ: ఛార్మి కౌర్‌ ;
నిర్మాతలు: శ్వేతాలానా, వరుణ్‌, తేజ ;  సహ నిర్మాత: బి.ఏ. రాజు
రచన – దర్శకత్వం :  పూరీ జగన్నాథ్
విడుదల :  జూన్  12, 2015     సెన్సార్ :  U/A
*

టాప్ డైరెక్టర్ చిన్న బడ్జెట్ సినిమాకి దర్శకత్వం వహిస్తే అదెలాటి రూపం ధరిస్తుంది?  అది కూడా బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాల బిల్డప్స్ తోనే  కృత్రిమంగా వుండి తీరుతుంది. టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్  తన ప్రారంభదినాల్లో తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లాంటి సున్నిత కథా చిత్రం ఇంకెప్పుడైనా తీయగలరా? అనుమానమే! ఆయన ‘జ్యోతిలక్ష్మి’ అనే ‘మిసెస్ పరాంకుశం’ నవలాధారంగా చిన్న కథతో కూడిన స్మాల్ మూవీని కూడా ‘టెంపర్’ లాంటి వయొలెంట్ మూవీ హంగామా తోనే చాతనయినంత  గజిబిజి చేయగలరు.  టాప్ హీరోలతో బిగ్ యాక్షన్ మూవీస్ తీసీ తీసీ  అక్కడే ఘనీభవించిన క్రియేటివిటీ తాలూకు ప్రభావమేమో ఇది!

          దాదాపు నలభై ఏళ్ల క్రితం  ప్రసిద్ధ నవలారచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ‘మిసెస్ పరాంకుశం’ ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు. మూలకథ తీసుకుని మిగతా నేపధ్య వాతావరణాన్ని తప్పకుండా ఈ కాలానికి తగ్గట్టు అప్ డేట్ చేయాల్సిందే సినిమాకోసం. ఐతే ఇలా జరిగిందా? చూద్దాం..

రెండు కథల రంగేళి!
       సత్య ( సత్యదేవ్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి ఓ వేశ్యని ప్రేమించి పెళ్ళాడాలని వుంటుంది. అలాటి ఓ వేశ్య జ్యోతి లక్ష్మి( ఛార్మీ) ఓ చోట కంటపడి మిస్సవుతుంది. ఆమె కోసం వెతుకులాట అతణ్ణి ఓ వ్యభిచార గృహానికి చేరవేస్తుంది. అక్కడే ఆమెని కలుస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. ఇతణ్ణి పిచ్చి వాడి కింద జమకడుతుంది. పెళ్ళికూడా చేసుకుంటానంటాడు. ఇంకా పిచ్చివాడి కింద లెక్కేస్తుంది. ఎలాగో ఒప్పించి ఆమెని తీసుకుని పారిపోతాడు. పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్ళికి అతడి అక్క కూడా వుంటుంది. కాపురం పెడతారు. మొదటి రాత్రే కండోమ్ గురించి గొడవపడి తాళిని తెంపేస్తుంది. మళ్ళీ రాజీ పడుతుంది. ఈమెని పట్టుకోవడం కోసం బ్రోతల్ హౌస్ ఓనర్ ప్రయత్నిస్తూంటాడు. సత్యని గాయపరుస్తాడు. 

          ఇలా వుండగా అటు వేశ్యా గృహంలో ఓ అమ్మాయిని పోలీస్ కేసులో ఇరికించి ఆమె కుటుంబం పరువు తీస్తాడు బ్రోతల్ హౌస్ ఓనర్. ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో జ్యోతి లక్ష్మి ‘నేను వెళ్ళనా అంటుంది?’ వెళ్ళ మంటాడు సత్య. ఇక జ్యోతిలక్ష్మి చెలరేగి ఆ వ్యభిచార కొంపని మూయించడం కోసం, వ్యభిచారిణులకి వాళ్ళ విటుల చేత తగిన న్యాయం జరిపించడం కోసం పోరాటం మొదలెడుతుంది..

          ఇలా తయారయింది కథ! ఫస్టాఫ్ సత్య కథ, సెకండాఫ్ వ్యభిచారిణుల కథ!

స్క్రీన్ ప్లే సంగతులు 
             ఒక నవలని సినిమాగా మార్చారు. మార్చినప్పుడు సగం నవల్లో వున్న కథ, మిగతా సగం పూరీ మార్కు అతికించిన కట్ అండ్ పేస్ట్ కథతో సినిమా తీశారు. దీంతో ఇది ఫస్టాఫ్ ఒక కథ- సెకండాఫ్ దాంతో సంబంధం లేని ఇంకో వ్యవహారంగా  తయారయ్యింది. ఇలాటి వింత సినిమాలు గతంలో తెలుగులోనూ, హిందీలోనూ  కొన్ని వచ్చాయి. తెలుగులో రవితేజ ‘దొంగోడు’, జగపతిబాబు ‘ధమ్’, హిందీలో సల్మాన్ ఖాన్ ‘తెరేనామ్’, టబూ ‘హవా’ లాంటివి ఈ కోవకే చెందుతాయి.

          ‘దొంగోడు’ కథా ప్రారంభంలో హీరో చిన్నప్పటి విషాదకర జీవితంతో అదొక కథాత్మగా ఏర్పడ్డ ‘సర్కిల్ ఆఫ్ బీయింగ్’ అనే స్క్రిప్టింగ్ టూల్ ని అందిపుచ్చుకుని అటుపైన కొనసాగాల్సి వుండగా, హీరో పెద్దయ్యాక దీని ఊసే లేక ఆ కథాత్మ తెగిపోతుంది!

          ‘థమ్’ లో నల్గురు యువకుల ప్రేమల్ని చక్కబర్చే హీరో కథగా నడుస్తున్న కథనం కాస్తా, పాత ప్రియురాలు కన్పించగానే హఠాత్తుగా వీళ్ళని వదిలి పారేసి, ఆమెతో ఆ హీరో ప్రేమాయణంగా కథ ప్లేటు ఫిరాయించి ధ్వంసమై పోతుంది!

          ‘తెరేనామ్’ లో కొనసాగుతున్న హీరో హీరోయిన్ల  ప్రేమలతో అస్సలు సంబంధంలేని ఇంకో కథతో అతుకు పడుతుంది!

           ‘హవా’లో- తల్లి కథగా నడుస్తున్న కథనం కాస్తా- ఆమె కూతురి కథగా కథనం మార్చుకుని అలాగే ముగుస్తుంది!

          అలాగే ‘జ్యోతి లక్ష్మి’ లోనూ వేశ్యని  ప్రేమించి పెళ్ళాడిన కథగా నడుస్తున్న పెళ్లి కథ కాస్తా, దాన్ని వదిలేసి పక్కా వేశ్యాగృహపు యాక్షన్ కథలోకి దిగిపోయింది!


        ఈ వ్యాధిని సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు. ఫస్టాఫ్ వరకూ కథ నడుపుకుంటూ వచ్చాక- ఇక ఆ ఇంటర్వెల్ ఘట్టం అనే చౌరాస్తా నుంచి ఎటు వెళ్ళాలో అర్ధంగాక, రాంగ్ రూటులో వెళ్తున్నామని కూడా తెలుసుకోకుండా, సెకండాఫ్  అనే చిట్టడవి లోకి స్టయిలుగా అడుగు పెట్టేయడం ఈ వ్యాధి లక్షణం.  

          ఇంటర్వెల్ దగ్గర నించుని సెకండాఫ్ లోకి చూస్తే అదొక దారీ తెన్నూ తెలీని చిట్టడవి లాగా ఎందుకు కన్పిస్తుందంటే, కథకి ఓ స్ట్రక్చర్ అనేది ఉంటుందని తెలియక పోవడం వల్ల.  ఆ స్ట్రక్చర్ ని కచ్చితంగా పాటించి తీరాలని తెలియక పోవడం వల్ల. లేదా తెలిసీ ప్రయోగాలు చేద్దామని అనుకోవడం వల్ల. ఐతే ప్రయోగం దేంతో చేస్తున్నారనేది ప్రశ్న. స్ట్రక్చర్ తోనా? ట్రీట్ ఏమంట్ తోనా? 

          తెలియక స్ట్రక్చర్ తోనే ప్రయోగాలు చేసేస్తున్నారు! ప్రయోగాలు చేయడంగానీ, ఉన్న రూల్స్ ని బ్రేక్ చేయడంగానీ  ఎక్కడ జరగవచ్చంటే- ట్రీట్ మెంట్ తోనే ! స్ట్రక్చర్ ర్ తో ప్రయోగాలు చేయబోతే ఇలాటి ‘జ్యోతిలక్ష్మి’ లాంటి సినిమాలే వస్తాయి!

          స్ట్రక్చర్ అనేది ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ అనుకుంటే, దాని మీద కథకి ఇచ్చే ట్రీట్ మెంట్ అనేది క్రియేటివ్ ప్రక్రియ. స్ట్రక్చర్ ఒక మారని సైన్స్ అయితే, ట్రీట్ మెంట్ ఎలాగైనా మార్చుకునే వీలున్న క్రియేటివ్ అభివ్యక్తి. అందరిలాగా ఒక యాక్షన్ సీనుతో నేనెందుకు సినిమా ప్రారంభిస్తాను, నేను కామెడీతో మొదలెడతాను- అనుకోవడమే  క్రియేటివిటీ పరంగా రూల్స్ ని బ్రేక్ చేయడం, అంతేగానీ స్ట్రక్చర్ పరంగా కాదు. బిగినింగ్, మిడిల్, ఎండ్ నియమనిబంధనలతో స్ట్రక్చర్ శాశ్వతం. దీన్ని బ్రేక్ చేస్తే అర్ధంపర్ధం లేని కథలే వస్తాయి. 

          ‘A general conventional story telling structure is necessary. If you want to violate those rules, those beginning, middle and end rules, and be truly avant garde, then I am not sure that you are going to be helped by anybody’s advice on screen writing. 

          The only advice you can get is somewhat conventional, but those kinds of stories have worked for thousands of years and will continue to work. The thing is to find new ways to tell them and surprise along the way…
—Lawrence Conner 

          (వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమా టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ ఉండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. ఇలా చెప్పే వాళ్ళు తెలుగు ఫీల్డులో లేరు! )

          ఇంతకీ ఏమిటా యుగాలుగా పాటిస్తూ వస్తున్న సాంప్రదాయబద్ధమైన నియమ నిబంధనలు? ఈ బ్లాగులో పదేపదే చెప్పుకోవడం బోరుగానే ఉండొచ్చు. బిగినింగ్ రూల్ ఏమిటంటే దాని చివర్న సాధించాల్సిన సమస్యని ఏర్పాటు చేయడం. మిడిల్ రూల్ ఏమిటంటే ఆ సమస్య ని సాధించడానికి సంఘర్షించడం, ఎండ్ రూల్ ఏమిటంటే ఆ సమస్యకి సముచితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనడం.

          ఒక నిర్ణీత సమస్య, ఆ నిర్ణీత సమస్యతో మాత్రమే సంఘర్షణ, ఆ నిర్ణీత సమస్యకి మాత్రమే పరిష్కారం- ఇవి పరస్పరాధారభూతాలు. వీటిని ఒకదాన్నుంచి ఇంకోటి విడగొట్టలేం. ఏర్పాటు చేసిన నిర్ణీత సమస్యని వదిలిపెట్టి, ఇంకో సమస్య ఎత్తుకుని ఆ సమస్యని పరిష్కరించడం కథ కాదు. రోగి ఒక రోగం పేరు చెప్పాక, వైద్యుడు దానికి మందులు రాస్తూంటే, మళ్ళీ రోగి రోగం అది కాదనీ, ఫలానా ఇదీ అని ప్లేటు ఫిరాయిస్తే, వైద్యుడు ఈ చీటీ చించి పారేసి, ఇంకో చీటీ మీద వేరే మందులు రాస్తాడనుకోం - నాల్గు పీకవచ్చు రోగిని పట్టుకుని!

          పైన పేర్కొన్నట్టు అవాంట్ గార్డ్- యూరోపియన్ సినిమాలకీ - మన ఆర్ట్ సినిమాలకీ, ఇప్పుడొస్తున్న ఇండీ ఫిలిమ్స్ కీ -  స్ట్రక్చర్ వుండదు. అందుకే ఇవి ఆబాలగోపాలాన్ని ఆకట్టుకోవు, ఫిలిం ఫెస్టివల్స్ లో మేధావుల్ని సంతృప్తి పరుస్తాయి. ఇప్పుడు ‘జ్యోతి లక్ష్మి’ స్ట్రక్చర్ ఎలా  వుందో చూద్దాం.

          సమయం వృధా చేయకుండా బిగినింగ్ ని సరీగ్గా అరగంటలో ముగిస్తూ,  హీరో చేత జ్యోతిలక్ష్మికి తను ప్రేమిస్తున్నట్టు చెప్పించారు. ఈ టర్నింగ్ పాయింటుతో కథలోకి ఎంటర్ అయ్యారు. ఈ టర్నింగ్ పాయింట్- స్టోరీ పాయింట్ – లేదా సమస్య ని ఏర్పాటు చేస్తూ  బిగినింగ్ అధ్యాయాన్ని బాగానే ముగించారు. 

          ఇక్కడ్నించీ మిడిల్ అధ్యాయాన్ని ప్రారంభించారు. జ్యోతిలక్ష్మితో ప్రేమకోసం హీరోకి స్ట్రగుల్  పెట్టి  మిడిల్ నియమాలకి న్యాయం చేశారు. అప్పుడు ఇంటర్వెల్ కి లీడ్ చేసేందుకు సీన్ ని క్రియేట్ చేస్తూ- (పించ్ -1, లేదా ఉత్ప్రేరకం- 1) హీరో చేత జ్యోతిలక్ష్మికి పెళ్లిని ప్రతిపాదించారు. పెళ్లి జరిపించారు. ఇంటర్వెల్లో మొదటి రాత్రి తగాదా పెట్టించి జ్యోతి లక్ష్మి చేత తాళిని తెంపించేశారు. ఇలా మిడిల్ అధ్యాయంలో మిడ్ పాయింట్ కి చేరింది కథ. 

          ఏ కథ? మొదలెట్టిన సత్య కథ. ఇది సత్య కథెందుకయ్యింది? బిగినింగ్ లో, మిడిల్ లో జ్యోతిలక్ష్మిని పొందేందుకు ప్రయత్నించింది అతనే కాబట్టి.  అతడికోసం ఆమె ప్రయత్నించ లేదు కాబట్టి. ఆమెని జీవితంలోకి తెచ్చుకుని తీరా ఇంటర్వెల్లో ఆమె తాళిని తెంపేస్తే బాధతో అలమటించింది అతను కాబట్టి. 

          కనుక యీ మిడిల్ లో మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) దగ్గర్నుంచీ ఇతడి కథే ఆమెతో సంఘర్షణతో కొనసాగాలి. ఇలా జరగలేదు. బ్రోతల్ హౌస్ ఓనర్ జ్యోతిలక్ష్మి కోసం సృష్టించే హింసతో మొదలేట్టేశారు. బిగినింగ్ లో జ్యోతిలక్ష్మి అనే కొరకరాని కొయ్యతో హీరోకి ఏర్పాటు చేసిన ఆసక్తి గొలిపే సమస్యని వదిలేసి, వ్యక్తిత్వాల వైరుధ్యాలతో అదెలా పరిష్కార మయ్యిందో చూపించడం మానేసి, జ్యోతిలక్ష్మీకి  – ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ కీ మధ్య సమస్యగా కొత్త కథ ఎత్తుకుని యాక్షన్ సీన్లతో నింపేశారు!  
   
          ఒక నిర్ణీత సమస్య, ఆ నిర్ణీత సమస్యతో మాత్రమే సంఘర్షణ, ఆ నిర్ణీత సమస్యకి మాత్రమే పరిష్కారం- అన్న ఏక సూత్రతని, కామన్స్ సెన్స్ నీ గాలికి వదిలిపారేశారు! 

          టాప్ డైరక్టర్ అంటే అన్ని సెన్సిబిలిటీస్ నీ బుల్ డోజ్ చేసుకుపోయే ఇల్లాజికల్ తస్మాత్ జాగ్రత్త మూసఫార్ములా మాంత్రికుడేమో! ఒక స్మాల్ మూవీని జాతీయ స్థాయికి చేర్చడానికి మనస్కరించని వెల్త్ క్రియేటరేమో!!

          స్ట్రక్చర్ ప్రకారం బిగినింగ్ లో హీరోకి సమస్య ఏర్పాటు చేశాక, పించ్ వన్ దగ్గర అతడి పెళ్లి ప్రయత్నం మొదలెట్టాక, పెళ్లి చేశాక ఇంటర్వెల్లో అతడిని పెద్ద రిస్కులో పడేశాకా- సెకండాఫ్ లో ఈ మిడిల్ ని ముగించడానికి  లీడ్ గా వేసిన  పించ్-2  దగ్గర,  అతడిసమస్య ఊసే లేకుండా, కథా లేకుండా, వేరే బ్రోతల్ అమ్మాయి ఆత్మహత్యని సృష్టించారు! ఇక దీన్ని పట్టుకుని జ్యోతిలక్ష్మిని వేశ్యల సమస్యమీద యుద్ధానికి పంపేశారు! ఓహ్ గాడ్!!

          ఈ కింది రెండు పటాల్లో ఎలా ఉండాల్సిన కథ ( స్ట్రక్చర్) ఎలా మారిపోయిందో గమనించవచ్చు..
ఉండాల్సిన కథ (స్ట్రక్చర్)

ఉన్న కథ (స్ట్రక్చర్)  

 దీంతో ఏం సినిమా చూశామో అర్ధం కాని పరిస్థితి. మల్లాది రాసిన నవలలో హీరో ఓ వేశ్యని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మర్చాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతను ఎదుర్కొనే కష్టాలూ అవమానాలతో కూడిన కథ అది. సినిమాలో ఈ కథ మొదలెట్టి సగం వరకూ చెప్పి వదిలేసి మరో కథ ఎత్తుకోవడం అన్యాయం. ఈ మరో కథ ఎత్తుకోవడం వల్ల, మొదలెట్టిన సెకను నుంచే చివరి సెకను వరకూ ఒకటే వ్యభిచార కొంప గోలగా – ఓ డార్క్ మూవీలాగా తయారయ్యింది మొత్తం వ్యవహారం!


పాత్రోచితానుచితాలు
           మొదలెట్టిన కథ ప్రకారం చూస్తే,  టైటిల్ రోల్లో జ్యోతిలక్ష్మి పాత్ర యాంటీ హీరోయిన్ పాత్ర అవుతుంది. అంతేగానీ  ఎట్టి పరిస్థితిలోనూ ఆమె సెకండాఫ్ లో చూపిన విధంగా వీర హరోయిన్ అయ్యే అవకాశం లేదు. ఈ సినిమాలో పాత్ర చిత్రణలు పూర్తిగా విఫలమయ్యాయి. పాపం జ్యోతి లక్ష్మిని ఉద్ధరించాలనుకున్న హీరో ఏమైపోయాడో, జ్యోతి లక్ష్మి ఎవరో వేశ్యల్ని ఉద్ధరించడానికి బయల్దేరింది! హీరోని అర్ధం జేసుకుని తను మారదు గాని, ఎవర్నో మార్చడానికి వెళ్తుందట!

          హీరో ఆమెని బయట ఎక్కడో చూసి ప్రేమించానంటాడు. ఆమె ఎక్కడుంటుందో  తెలుసుకోవడం కోసం ఓ బ్రోకర్ ని పట్టుకుని నానా ప్రయత్నాలూ చేస్తాడు. ఆమె పట్టపగలు నడి  రోడ్డుమీద ఒక విటుడి దగ్గర డబ్బులు తీసుకుంటూంటే, హీరో చూసి ఆమే కావాలని డిసైడ్ అయిపోయాడు. అలా ఆమె ఒక సందులో అనాధ పిల్లలకి డబ్బిచ్చి పోతూంటే కూడా హీరో చూశాడు. ఆ తర్వాత ఆమె మిస్సయ్యింది.  హీరో ఆ అనాధ పిల్లల దగ్గరి కెళ్ళి ఆమె గురించి అడిగితే, ఆమె ప్రతిరోజూ వచ్చి డబ్బిచ్చి పోతూంటుందని ఆ పిల్లలు చెప్తారు. అలాంటప్పుడు ఆ మర్నాడు హీరో అక్కడే కాపలా కాస్తే ఆమె దొరికిపోతుంది కదా? బ్రోకర్ని పెట్టుకుని ఊరంతా వెతకడమేంటి!! సినిమా ప్రారంభంనుంచీ ఓ పదినిమిషాల చిత్రీకరణ అంతా డబ్బు వృధా కదా?

          జ్యోతిలక్ష్మే కాదు, ఆ బ్రోతల్ హౌస్ లోంచి ఇంకే వేశ్యా బయటికి వెళ్లేందుకు వీల్లేనంత గృహ నిర్బంధంలో వుంటారు. అలాంటప్పుడు జ్యోతి లక్ష్మి రోజూ బయటికి వస్తున్నట్టు హీరో పాయింటాఫ్ వ్యూలో ఎలా చెప్పించారు / చూపించారు?

          ఆమెకి బయట తిరిగే స్వేచ్చే గనుక వుంటే,  హీరో బయటే ఆమెని కలుసుకోవచ్చుగా- పనిగట్టుకుని బ్రోతల్ హౌస్ కి వెళ్లి కలవాల్సిన  అవసరమేమిటి?

          ఆమెని బయటే ప్రేమించి, బయటే పెళ్ళి ప్రతిపాదనతో తీసికెళ్ళి పోవచ్చుగా- బ్రోతల్ హౌస్ లోంచి సాహసం చేసి- గూండాలని తప్పించుకుని తీసుకు పారిపోవాల్సిన అవసరమేమిటి?

          ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హీరోకి టెక్నాలజీ గురించి బ్రోకర్ అన్ని క్లాసులు తీసుకోవడమేమిటి? 

          హీరో జ్యోతిలక్ష్మి  పెళ్లి చేసుకున్నాక హీరో అక్కని బస్సెక్కిస్తూంటే, అక్కడే ఒకడ్ని చావదన్నుతున్న బ్రోతల్ హౌస్ ఓనర్, జ్యోతిలక్ష్మిని చూసి అప్పుడే పట్టుకోకుండా- బ్రోతల్ హౌస్ కి వెళ్ళిపోయి- తబలావాయిస్తూ అనుచరుల్ని తన్నించదమేమిటి?
 
          హీరోని తీవ్రంగా గాయపరచిన సంఘటనలో హీరోకి సహకరిస్తున్న పోలీసు అధికారి మైపోయాడు? హీరో ఫ్రెండ్ కూడా ఏమై పోయాడు? సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన హీరోకి ట్రీట్ మెంట్ కోసం అతడి ఎక్కౌంట్ లో డబ్బే ఉండదా? మెడిక్లెయిమే ఉండదా? ఇన్స్యూరెన్సే లేదా?జ్యోతిలక్ష్మి అంత యాతన పడాలా?

          పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత తనతో పోలీసుల ప్రవర్తన చూశాకే జ్యోతిలక్ష్మికి ఇల్లాలిగా వుండడంలోని గౌరవమేమిటో  తెలిసివచ్చిందా? ఆమె ఉన్నతి కోసం హీరో చేస్తున్న ప్రయత్నాలకి విలువేలేదా?

          ఇలా ఫేక్ క్యారక్టరైజేషన్స్ తో, ఫేక్ ఎమోషన్స్ తో, ఫేక్ విలువలతో సూడో మేధావితనానికి పోయిన కథనం గురించి ఇంత చాలు. సెకండాఫ్ లో బ్రోతల్ హౌస్- వేశ్యలూ వాళ్ళ ఉద్ధరణా- మేసేజ్ లతో కూడిన మూస యాక్షన్ స్టోరీ విశ్లేషణ జోలికి వెళ్ళడం లేదు –అది స్టోరీ కాదు కాబట్టి!



సికిందర్