రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, February 20, 2015

బందిపోటు బాధ!

పంచ్,పెప్,కిక్,ఫట్ !

కథ-మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం :  మోహన కృష్ణ ఇంద్రగంటి 
తారాగణం :  అల్లరి నరేష్‌, ఈషా, శ్రీనివాస్ అవసరాల, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, రావు రమేష్‌, చంద్రమోహన్‌, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్‌సప్తగిరి, సాయాజీ షిండే
కెమెరా
:  పి.జి. విందా, సంగీతం : కళ్యాణి కోడూరి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల  
బ్యానర్ : ఈవీవీ సినిమా
నిర్మాత: రాజేష్ ఈదర
విడుదల : 20, పిబ్రవరి 2015,  సెన్సార్  U/A
***
      అల్లరి నరేష్ అల్లరి అంతా నానాటికీ అల్లరై పోతోంది. నవ్వుమీద తనకు తాను జీవితకాల నిషేధమేదో  విధించుకున్నట్టు, నవ్వించగల  డైరెక్టర్లని పక్కన  పెట్టేసి, రెగ్యులర్ దర్శకుల్నీ, వాళ్ళలోనూ క్లాస్ టచ్ గల సీరియస్ దర్శకుల్నీ ఏరికోరి మరీ,  వెరైటీ పేరుతో ప్రోత్సహిస్తూ, తను కొవ్వొత్తిలా కరిగిపోతూ చాలా త్యాగం చేసుకుంటున్నాడు సొంత కెరీర్ని. వరుసగా పదకొండో సినిమా కూడా సక్సెస్ కాకుండా చూసుకోవడానికి కంకణం కట్టుకున్నట్టు - కుండపోత కామెడీకి నిండుకుండ లాంటి దివంగత తండ్రి ఈవీవీ సత్యనారాయణ సొంత బ్యానర్ ‘ఈవీవీ సినిమా’ ద్వారా శుభమా అంటూ నిర్మించిన ఈ తొలి సినిమానూ త్యాగాల బాట పట్టించడమే కామెడీ యేమో! ‘అంతా నీ కోసం అందుకే ఈ వేషం చీకటిలో ఏదో కన్నాను’-  అని ఎన్టీఆర్ ‘బందిపోటు’ లో పాటలాగా, వేషభాషలు మార్చి, ‘అంతా మీకోసం అందుకే ఈ క్లాస్ వేషం పనికొస్తాను పెట్టుకోండిక  క్లాస్ హీరోగా’ – అంటూ ప్రమోట్ చేసుకోవడానికి పనికొచ్చే సినిమా తీసినట్టయ్యింది చివరికి –ఇదింకా కామెడీ! 


       దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, ఈసారి అల్లరి నరేష్ లాంటి ఏకైక టాప్ మాస్ కామెడీ హీరోతో నైనా తను తీసే కథా కథనాల స్థాయిని పై లెవెల్ కి తీసుకుపోతాడేమో అని మనం ఆశగా ఎదురుచూడ్డం కూడా, కామెడీ అయిపోవడం డబుల్ ఐరనీ ఇక్కడ. 

        తను సున్నిత హాస్యం పలికించే కోవకి చెందిన దర్శకుడైనప్పుడు- దానికి కమిటై వుండాల్సింది. హిందీలో ‘రంగీలా’, ‘ఎస్ బాస్’, ‘దౌడ్’ ఫేమ్ రచయిత సంజయ్ చెల్ దర్శకుడుగా మారి,  ఏకంగా సంజయ్ దత్ లాంటి హీమాన్ తో ‘ఖూబ్ సూరత్’ (1999) లాంటి సున్నిత హాస్య భరిత చలనచిత్రాన్ని ఎలా విజయవంతంగా తీయగాలిగాడో తెలుసుకోగలిగితే- ఈ జానర్ నిర్వచనం తెలుస్తుంది. న్యూయార్క్ లో స్క్రీన్ ప్లే కోర్సు చేసిన ఇంద్రగంటికి తానిప్పుడు తలపోసిన సినిమా కథ జానరేమిటో తెలిసే వుంటే- ఇదిలా ఎందుకు ఎటూ కాని కిచిడీ అయ్యిందో ఆలోచించాల్సిన అవసరముంది. 

        జానర్ జడ్జిమెంటులో స్పష్టత కొరవడ్డం ఈ ‘బందిపోటు’ కి పడ్డ ఓ అన్యాయపు శిక్ష!

బందిపోటా- బురిడీ మాస్టరా?
          దొరల వేషంలో వుండే  దొంగల్ని దెబ్బతీయడమే వృత్తి గా పెట్టుకున్న విశ్వ( అల్లరి నరేష్) ఒకసారి అలా కొందర్ని బకరాల్ని చేస్తూ  జాహ్నవి (ఈషా)  అనే అమ్మాయి కెమెరాకి చిక్కుతాడు. ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓ ముగ్గుర్ని బకరా గాళ్ళని చేసి ఆటాడుకోవాలని అంటుంది. ఈ ముగ్గురూ మకరందరావు ( తనికెళ్ళ భరణి), శేషగిరి (రావు రమేష్), భలే బాబు (పోసాని కృష్ణ మురళి) లు తన తండ్రిని మోసం చేసిన పెద్దమనుషులు. వీళ్ళ ఫైనాన్స్ కంపెనీలో పని చేసిన  తన తండ్రి సత్యనారాయణ ( శుభలేఖ సుధాకర్)  వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్న తీరుకి తిరగబడితే, కుట్ర చేసి జైలుకి పంపారనీ; దీంతో తన తల్లి గుండె పోటుతో చనిపోయిందనీ; పదేళ్ళు శిక్ష అనుభవించి పక్షపాతంతో తండ్రి విడుదలై వచ్చాడనీ; ఇప్పుడా ఘరానా పెద్దమనుషుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనీ అంటుందామె. 


విశ్వ ఒప్పుకుని ఒక్కొక్కర్నీ ఒక్కో విధంగా  బకరాలు చేయడం మొదలెడతాడు. ముగ్గుర్నీ బకారాల్ని చేశాక్ జాహ్నవి మెప్పునీ  ప్రేమనూ పొందుతాడు. ఇదీ కథ!


ఎవరెలా చేశారు
           నరేష్ కిదో కష్టమైన పాత్రేం కాదు. కాస్ట్యూమ్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో క్లాస్ గా కన్పిస్తూ అదికూడా పాత్రలో తగిన డెప్త్, ఎమోషన్ లేకపోవడంతో తక్కువ శ్రమతో నటించి సరిపుచ్చుకున్నాడు. ఇదే తన మార్కు వూర కామెడీ అయ్యుంటే చాలా పనుండేది తన టాలెంట్ తో. ప్రేక్షకులు తననుంచి ఆశించేది వూర కామెడీనే. బాపు తీసిన ‘సుందర కాండ’ తో, కె. విశ్వనాథ్ తీసిన ‘శుభప్రదం’  తో ఏం జరిగాయి? ఇప్పుడూ అంతకి మించి ఏమీ జరగదు. స్కూల్స్ పరంగా తూర్పు పడమరల్లాంటి ఇంద్రగంటీ నరేష్ ల కాంబినేషన్ సహజంగానే అతకలేదు.  ఇమేజి మేకోవర్ అంటే క్యారక్టర్ మేకోవర్ అని కూడా అర్ధం జేసుకోక పోవడం వల్ల ఇద్దరూ అభాసు అయ్యారు. క్యారక్టర్ మేకోవర్ అవసరాన్ని గుర్తించి వుంటే, క్లాస్ ఇమేజి మేకోవర్ కి సూటయ్యే క్లాస్ కామెడీయైనా ప్రేక్షకులకి మహాద్భాగ్యంగా దక్కేది. క్యారక్టర్ మేకోవర్ ని కూడా గుర్తించి వుంటే, కథ కూడా కిచిడీ జానర్ తో కాకుండా, సజాతి జానర్లతో ఏక సూత్రతతో సూటిగా హృదయాల్ని తాకేది. దీని గురించి వివరంగా కింది పేరాల్లో తర్వాత చూద్దాం. 


        హీరోయిన్ ఈషాకి  పెద్దగా పాత్రే లేదు. కానీ ఆమె ఎంట్రీలో ‘బందిపోటి’ అని పెద్ద బిల్డప్పిస్తూ లెటర్స్ వేసి ప్రేక్షకులకి ఆ పాత్ర పట్ల ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసి, ఆనక ఉస్సూరన్పించడమే జరిగింది. తన దృష్టిలో హీరో ఏదో ఒక ‘అద్భుతం’ చేయగానే,  కొత్త కాస్ట్యూమ్స్ పట్టుకుని పాటకోసం రెడీగా వుండడమే ఈమె ‘బందిపోటీ’ తనపు డ్యూటీ అయ్యింది. 

        దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల తనికెళ్ళ అనుచరుడిగా ఉత్తుత్తి తెగ బిజీ పాత్రలో ఏదో జరిగిపోతోందన్నట్టు హడావిడి చేస్తాడు. 

         తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని త్రయం ఎంతకీ ఎదగని తమ పాసివ్ పాత్రల్ని చూసుకుని విచారిస్తున్నట్టుగా, ఒకే ఎక్స్ ప్రెషన్స్ ని  రిపీట్ చేస్తూ పోయారు. పాత్రల లోతుపాతుల్ని బట్టే అభినయాలు కదా? హీరో అంత దెబ్బ తీసినా ఏమీ చేయకుండా ఏదో చేసేద్దామని పదేపదే ఆవేశపడే అవే దృశ్యాలతో అవే ఎక్స్ ప్రెషన్స్ కాక ఏం వస్తాయి? సాయాజీ షిండే పరిస్థితీ ఇంతే. కమెడియన్ సప్తగిరి కూడా ఛానెల్లో కూర్చుని అవే డైలాగుల్ని వల్లెవేయడం.

         సంపూర్ణేష్ బాబు ఎందుకున్నాడో అర్ధం గాదు.  
హీరోకి నేస్తం గా ఉంటూ ఏ పనీ చెయ్యకుండా, హీరో చేసే వాటికి బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ తనలో తానూ కిచకిచ నవ్వుకుంటూ ఉంటాడు. ట్రైన్ కూపే సీనులో హీరో పోసానీని బకరా చేస్తున్నప్పుడైతే,  అటక మీద కూర్చుని చూస్తూ ఈ నవ్వుల్నీ నవ్వుకోలేక మరీ  దయనీయ స్థితికి జారిపోయాడు సంపూర్ణేష్. పాపం దర్శకుడు విధించిన శిక్ష! పాపులర్ నటుల్ని కథలో ఇన్వాల్వ్ చేసి కథనీ, తద్వారా వాళ్ళ నటనలతో సినిమానీ  ఎలా ఎలివేట్ చేసుకోవచ్చో తెలియకపోవడం వల్ల ఇలా జరిగింది బహుశా.
   
         టెక్నికల్ గా విందా కెమెరా వర్క్ నీటుగా వుంది. కల్యాణీ కోడూరి పాటలకంటే కూడా నేపధ్య సంగీతమే బావుంది. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల అనవసరంగా సాగిన సెకండాఫ్ లో ఎన్నికల ప్రహసనానికి  సాధ్యమైనంత కోత పెట్టి వుంటే బావుండేది.


స్క్రీన్ ప్లే సంగతులు

       ఓపెనింగ్ లో పాత తరం ప్రసిద్ధ క్రైం/డిటెక్టివ్  నవలా రచయితలైన రేమండ్ చాండ్లర్, ఎడ్గార్ వాలెస్ ల పేర్లు వేసి వాళ్లకి అంకిత మిచ్చాడు దర్శకుడు ఈ సినిమాని. దీంతో ఆ రచయితల స్థాయి కథని చూడ బోతున్నామన్న ఉత్కంఠ రేగుతుంది మనకి. దర్శకుడి ఉత్తమాభిరుచిపట్ల గౌరవం పెరుగుతుంది. ప్రారంభంలో ఒక సీనుతో హీరో డబ్బున్న దగాకోరుల్ని ఎలా బకరాలుగా చేస్తాడో చూపించేసి, ఆతర్వాత చప్పున పాయింట్ ఎస్టాబ్లిష్  చేసేస్తాడు దర్శకుడు. అంటే స్క్రీన్ ప్లే పరంగా ఇరవై నిమిషాల్లోపే  మిడిల్  విభాగంలో పడుతుందన్న మాట కథ. ఇది చాలా రిలీఫ్ మనకి! ఐతే అంతే చిక్కూ ఎదర వుంది ఈ కథని ఎంజాయ్ చేయడానికి. ఒక చోట రేమండ్ చాండ్లర్ అంటాడు- There is no trap so deadly as the trap you set for yourself  -  అని. మనకి మనం బిగించుకునే ఉచ్చు కంటే ప్రమాద కరమైన ఉచ్చు మరేదీ లేదని చాండ్లర్ భావం. ఆయన సౌజన్యంతో దర్శకుడు ఈ పనే చేసుకున్నాడు చేతులార. 


      అక్కడ ఎస్టాబ్లిష్ చేసే పాయింట్ ఏమిటంటే, హీరోయిన్ వచ్చేసి, హీరో సాయం కోరుతూ బ్లాక్ మెయిల్ చేస్తుంది- తన తండ్రిని మోసం చేసిన ముగ్గుర్నీ బకారాలుగా చేసి ఆడుకోవాలని. హీరో ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? బ్లాక్ మెయిల్ కి భయపడా? తనలాంటి ఘరానా బురిడీ మాస్టర్ కి ఒక అమెచ్యూరిష్ పిల్ల చేసే బ్లాక్ మెయిల్ చేష్ట ఓ లెక్కా? కాకపోవచ్చు. ఐతే  ఒక కారణం తో ఈ ‘ప్రాజెక్టు’ (!)  ఒప్పుకుంటున్నా నంటాడు. ఆ కారణాన్ని సినిమా  చివరి వరకూ  రివీల్ చేయడు. ఇదొక అనవసర సస్పెన్స్. ఇంతా చేసి ఈ సస్పెన్స్ ఏమిటంటే, తన కుటుంబమూ  అటు  హీరోయిన్ నాన్న లాగే ఆ మోసగాళ్ళ కుట్ర కి బలయ్యిందని, అందుకే తనూ ఆమెలాగే ఫీలయ్యి ఈ ‘ప్రాజెక్టు’ (!)  చేపట్టానని చివరికి జస్టిఫై చేసుకుంటాడు. అంటే పదేళ్ళు దాటిపోయినా  హీరోయిన్  వచ్చి చెప్పే దాకా  తన కుటుంబానికి జరిగిన అన్యాయం తనకే గుర్తుకి రాలేదన్నమాట. కనుక ఈ  జస్టిఫికేషనూ, సస్పెన్సూ కూడా  పే-ఆఫ్ కాకుండా తేలిపోయాయి. ఆ హీరోయిన్ కూడా జరిగిన మోసానికి తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలయ్యీ  పదేళ్ళు గడిచాక తీరిగ్గా ఇప్పుడే కళ్ళు తెర్చినట్టుంది!

         పాయింటుని ఎస్టాబ్లిష్ చేసే ఇలాటి కీలక ఘట్టంలో భలే ఆషామాషీ పాత్రలివి. ‘టెంపర్’ విజయాన్ని పురస్కరించుకుని రచయిత వక్కంతం వంశీ ఒక సరైన మాట చెప్పాడు : కథలు పైపైన చెప్పేస్తున్నారు, అది పనికి రాదనీ. పనికొస్తుందని ఇంద్రగంటి నిరూపించ దల్చుకున్నాడు. కనుక పాయింట్ ఎస్టాబ్లిష్ మెంట్ ఇంత పలచన. ఇప్పటి ప్రేక్షకులు పైపైన సినిమాలు చూసేయడానికి అలవాటు పడ్డారేమో గానీ, సినిమాల్ని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఎంత లైటర్ వీన్ కామెడీ అయినా పైపైన తీసేసి ఆ ప్రేక్షకుల్నే మెప్పించడం సాధ్యమవుతుందా? 

          ఇంకా వుంది. జరిగిన మోసానికి హీరోయిన్ లాగే స్వీయానుభవంతో హీరో కూడా ఫీలయ్యినప్పుడు, ఆమె బ్లాక్ మెయిల్ బిల్డప్ అంతా అప్రస్తుతమై పోయిందిగా? హీరోయిన్ కి ఆ ట్రాకే అనవసరంగా? హీరో బందిపోటు అయితే, బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంతో హీరోయిన్  ‘బందిపోటి’ అని పన్ గా లెటర్స్ వేయడం మిస్ లీడింగే కదా? ఇది రెండో లోపం. 

          ఇక మూడో లోపం : ఇది సినిమా. డిటెక్టివ్ నవల కాదు. హీరోయిన్ సమస్య తనదిగా  భావించి హీరో చేపట్టాలంటే ముందు కొంత టైం అండ్ స్పేస్ కావాలి. హీరోయిన్ తో పరిచయం, ఆమెతో ప్రేమ, ఎమోషనల్ బాండింగ్- ఆ తర్వాతే ఆమె సమస్య తెలిసి రియాక్ట్ అవడం.  ‘ఊసరవెల్లి’ లో సెకెండ్ హీరోయిన్ తమన్నా సమస్య తీసుకుని  పోరాడ్డానికి ఎన్టీఆర్ కి ఆమెతో అసలు ఇలాటి బాండింగ్ లేకపోయింది. అందుకే ఆ సినిమా ఫలితం అలా వచ్చింది.  తాజాగా  ‘టెంపర్’ లో కూడా సెకెండ్ హీరోయిన్ మధురిమ సమస్యకి రియాక్టై పోరాడుతాడు ఎన్టీఆర్. ఇక్కడ ప్రేమిస్తున్న మెయిన్ హీరోయిన్ కాజల్ కాబట్టి, ఆమె అల్టిమేటం ఇవ్వడంతో ఆమె కోసమే- అంటే తన లవ్ ఇంటరెస్ట్ కోసం - మధురిమ  సమస్యేమిటో చూస్తాడు. తీరా చూస్తే, ఈ సమస్య తన నిర్లక్ష్యం వల్లే ఉత్పన్నమయ్యింది. దీంతో ఆడియెన్స్ కి ఈ పాయింట్ ఎస్టాబ్లిష్ మెంట్, తద్వారా ఎన్టీఆర్  చేసే పోరాటం బలంగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుత సినిమా కథలో హీరో హీరోయిన్ల మధ్య ముందుగా ఎలాటి బలీయమైన అనుబంధం లేదు. ఇందుకే ఆడియెన్స్ కనెక్ట్ ఆమడదూరంలో ఉండిపోయింది.
        నిజమే, ‘బందిపోటు’ దర్శకుడు అభిమానించే రేమండ్ చాండ్లర్ ఏ నవల్లోనైనా ఆడపాత్ర వుందంటే, ఆమె  డిటెక్టివ్ ఫిలిప్ మార్లో తో  ఎలాటి పూర్వ పరిచయం లేకుండానే  వచ్చి తన సమస్య చెప్పుకుని సాయం కోరుతుంది. అది డిటెక్టివ్ కథ కాబట్టి సమస్య సెటప్ అలాగే వుంటుంది. ఆ జానర్ నియమాల ప్రకారం వాళ్ళిద్దరి మధ్య డిటెక్టివ్- క్లయంట్ సంబంధమే ఉండాలి తప్ప మరో ప్రేమ సంబంధం డెవలప్ కాకూడదు కాబట్టి అలాటి కల్పన వుంటుంది. ఆ డిటెక్టివ్ కూడా క్లయంట్ మీద ప్రేమ పుట్టో, లేదా తన వ్యక్తిగత సమస్య కూడా అలాగే ఉండో కేసు తీసుకోడు. కేవలం తన ప్రొఫెషనల్ బాధ్యత అనే చట్రం లో ఫీజు మాట్లాడుకుని పూనుకుంటాడు. ఈ సెటప్ ని  సినిమాలో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ‘బందిపోటు’ సినిమాలో లాగా అర్ధవిహీనంగా వుంటుంది. డిటెక్టివ్ కథ కాకపోతే, సినిమాల్లో హీరోయిన్ కోసం హీరో వూరికే పరోపకారి పాపన్న పాత్ర పోషించడు. నిన్ను ప్రేమిస్తాను, చెయ్- అని ఆమె అంటే కుప్పిగంతులేసుకుంటూ చేసుకుంటూ పోతాడు. దటీజ్ సినిమాటిక్ క్రియేషన్. 

         నాల్గవది : సమస్యలో వున్న సరుకు. ఒక ఫైనాన్స్ కంపెనీ మోసం చేయడం. ఇది దృశ్య మాధ్యమమైన సినిమాకి ఎంత మాత్రమూ చాలని సమస్య. చాలా కురచ కాన్వాస్. గతంలో కృషి బ్యాంకు ఉదంతం దరిమిలా అలాటి మోసం పాయింటుగా పెట్టుకుని అనేక స్క్రిప్టులు వచ్చి పడ్డాయి. అవేవీ తెరకెక్కలేదు. కారణం, సినిమాకి చాలని అత్తెసరు సరుకు కావడం. సబ్ ప్లాట్ గా పనికొస్తుందేమో.

        ఐదవది : జానర్ మిస్ మ్యాచ్. ఇప్పుడు అమెరికన్ పాపులర్ సాహిత్యంలో యూత్ ని దృష్టిలో పెట్టుకుని, రియలిస్టిక్ ఫిక్షన్ అనే కొత్త జానర్ పరిచయమౌతోంది. ఇందులో మిల్స్ అండ్ బూన్స్ టైపు సాఫ్ట్ రోమాన్స్ కి తావుండదు. తియ్యటి కలల ప్రపంచంలో స్వైర విహారం వుండదు. అలాటి చాప్టర్లు చొరబడితే పబ్లిషర్ ఆ వర్క్ ని తిరస్కరిస్తాడు. జానర్ స్పష్టత కి అక్కడ సాహిత్యంలోనే కాదు, సినిమాల్లోనూ కట్టుబడి వుంటారు. కానీ మనం మాత్రం నవరసాల పోషణ అనే శాస్త్రాన్ని ప్రపంచానికి  ఇచ్చికూడా-వాటిని పట్టించుకోకుండా సొంత పైత్యాల్ని రుద్దుతూంటాం. 
  
        దర్శకుడు ఎస్టాబ్లిష్ చేసిన పాయింటు ఫైనాన్స్  కంపెనీ చేసిన మోసం, దానికి బలైన హీరోయిన్ తండ్రి జీవితం. ఈ పాయింటులో హాస్యరసం లేదు, కరుణ రసముంది. కరుణ రసం సీరియస్ యాక్షన్ ( అద్భుత, వీర లేదా రౌద్ర రసాల) కథనాన్ని  కోరుతుంది. కరుణ రసానికి హస్యరసపు కథనం అభాసు అవుతుంది. అద్భుత రసం (అడ్వెంచర్/థ్రిల్లర్) తో హాస్యరసం (కామెడీ) పండుతుంది. కనుక ఇక్కడ నేపధ్యంలో తల్లిదండ్రులతో విషాదకర  పాయింటు వున్న  హీరోయిన్,  కామెడీగా విలన్లని ఆటలు పట్టించి వినోదించాలనుకోవడమే, దానికి హీరో వంత  పాడడమే రసాల మిస్ మ్యాచ్ అయిపోయింది- బత్తాయి రసంలో కుంకుడు రసం పోసినట్టు.

          బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ పాయింటులో  కరుణ-శోక రసాలున్నాయి. చాలా రిస్కీ అటెంప్ట్. శ్రీధర్- సంగీత ల వైవాహిక జీవితంలో రావు గోపాల రావు రూపంలో విలన్ విషపు చుక్కలు చిమ్మి విడదీసే కరుణ- శోక రసాల ఉత్పత్తి. దీనికి తగుమాత్రం షుగర్ కోటింగ్ వేయకపోతే వినోదభరితం చేయడం కష్టం. అందుకని ఈ చేదు మాత్రని ఇంటర్వెల్ కి జరిపేసి,  ప్రథమార్ధమంతా అన్ని పాత్రల ఆనందమయ జీవితాలతో, అద్భుత రస ప్రధానంగా హాస్య రసపు ఆధరువుతో ఓలలాడించారు. అప్పుడు విశ్రాంతి ఘట్టంలో ఆ శోక- కరుణ రసాలతో లాకులు బార్లా తెరిచేశారు. మళ్ళీ ఈ రసాల ఉప్పెనలో ఎత్తుకున్న అసలు కథనం కొట్టుకు పోకుండా, ద్వితీయార్ధంలో తిరిగి దాని అద్భుత – హాస్య రసాల ట్రాకులో యధాతధంగా ఆ కథనాన్ని పెట్టేశారు. ఎలా పెట్టారనేది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇదిక్కడ అప్రస్తుతం. ఇక్కడ దృష్టికి తెస్తున్న దేమిటంటే, ఇలా కాకుండా ‘బందిపోటు’ కథా  నేపధ్యంలో వున్న కరుణ రసాన్ని మొదటే ఓపెన్ చేసేశారు! దీంతో కథనం కామెడీ – థ్రిల్లర్ ల మధ్య ఎటూ సర్దుబాటు కాలేక ఇలాటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉండాల్సిన పంచ్, పెప్, కిక్కూ సర్వం మటాషై పోయాయి.
         కేవలం బిగినింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఓ పాయింటు పట్టుకుని ఇంత పోస్ట్ మార్టం అవసరమా అంటే, తప్పకుండా అవసరం. ఎందుకంటే, అనారోగ్యమంతా ఇక్కడే వుంది గనుక. చాండ్లర్ చెప్పిన ఉచ్చులో ఇక్కడే ఇరుక్కోవడం జరిగింది గనుక. పాయింటు కథకి పునాది వేస్తుంది. ఈ పునాది ఎఫెక్టు మొత్తం కథా సౌధం మీదా పడుతుంది. ఎప్పుడైతే కథ బిగినింగ్ విభాగపు చివర్న ఎస్టాబ్లిష్ చేసే పాయింటు,  లేదా సమస్య బలంగా ఉండదో, అప్పుడా కథ నడక కూడా అంతే నత్త నడక నడవడంతో బాటు, ఎండ్ విభాగం- అంటే,  క్లైమాక్స్ కూడా బలహీనంగా తేలి పోతుంది. బలహీన పాయింటు ఎస్టాబ్లిష్ మెంట్ = బలహీన ముగింపు! ఇదొక జగమెరిగిన రూలు. సినిమా కథని మొదటే స్ట్రక్చర్ లో పెట్టి ఆలోచించడం ఎంత అవసరమో, దాని పాయింటు అనే బీజం విఛ్ఛిత్తి జరిగినప్పుడు అదెలాగెలా శాఖోప శాఖలుగా విస్తరించగలదో  ముందే చూసుకోవడం అంతే అవసరం. ఈ కథలో పాయింటు విఛ్ఛిత్తి జరిగినప్పుడు దీని శాఖలు ఇలా విస్తరించాయ్-


1. అర్ధం లేని హీరో గోల్ గా..

2. అర్ధంలేని హీరోయిన్ బ్లాక్ మెయిల్ గా.. 
3. సినిమాటిక్ కాని హీరో- హీరోయిన్ల మధ్య ప్రపోజల్ గా..
4. సినిమా కథకి చాలని ఫైనాన్స్ కంపెనీ మోసంగా.. 
5. కరుణ- అద్భుత- హాస్య రసాలు- జానర్ మిస్ మ్యాచింగ్ గా..
ఇలా ఈ చీడ పట్టిన శాఖలతో కథావృక్షం వోరిగిపోయింది. 
**

సెటప్స్ అండ్ పే- ఆఫ్స్ 
      ఈ స్క్రీన్ ప్లే పొడవునా కొట్టొచ్చే ఇంకో ధోరణి ఏమిటంటే, ఆసక్తి రేపుతూ వివిధ అంశాల్ని  సెటప్ చేయడం, తీరా వాటిని  పే- ఆఫ్ చేసే సమయం వచ్చేసరికి అవి చెల్లని చెక్కులై పోవడం. ‘బందిపోటి’ బిల్డప్ తో హీరోయిన్ ఏమైందో, హీరో ’ప్రాజెక్టు’ (!) ఒప్పుకోవడానికి కారణం చెప్తానని ఎలా చివరికి జస్టిఫై చేశాడో పైన చూశాం. ఇంకా ‘బందిపోటు’ అనే టైటిల్ సెటప్ కీ, అలాటి బందిపోటే కాని హీరో పాత్రతో పే-ఆఫ్ కూడా ఇంతే. ఇంటర్వెల్లో రావు రమేష్ ఆకాశంలో చూడకూడని దేదో చూశాడని హడావిడి చేసి, ఆడియెన్స్ ని టెన్షన్ పెట్టేసి తీరా అదేమిటో చూపించకుండా విశ్రాంతి కార్డు వేయడం సెటప్స్ అండ్ పే- ఆఫ్స్ నిర్వాకానికి పరాకాష్ఠ! ఏమిటో అర్ధం కాని ఇంటర్వెల్ తో మన మతులుపోవడమే.


            ఇంటర్వెల్ అయ్యాక అదేమిటో చూపించినప్పుడు – హీరో ప్లే చేసిన పాత మూసఫార్ములా ట్రిక్కుగా తేలి, పే-ఆఫ్ అవుటాఫ్ క్వశ్చన్ అయింది. తనికెళ్ళ గోతిలో చితగ్గొట్టినట్టు చూపించిన టేప్ రికార్డర్, తర్వాత సప్తగిరి తీసి చూసినప్పుడు చెక్కు చెదరకుండా వుంటుంది. హీరోయిన్ ఇంట్లో దండ వేసిన ఆమె తల్లి ఫోటో చూపిస్తారు. ఆవిడ (పదేళ్ళ క్రితమే) పైలోకాలకి చేరుకుందని తెలిసిపోతున్నా, ‘ఆవిడిప్పుడు లేదు!’ అని హీరోయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది!

        చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బద్ధ శత్రువులైన రావు రమేష్ – తనికెళ్ళ భరణి ఒకటై తమని దెబ్బ తీసిన హీరోని చంపెయ్యాలని నిర్ణయించుకుంటారు. తీరా హీరో ఇంకో తమ శత్రువు పోసానీని బకరా చేస్తూంటే చంపడం మానేసి చూసి ఆనందిస్తూంటారు. హీరోకి ఎక్కడా ఆటంకాలు ఏర్పడని వన్ వే పోకడతో కథనమే పాసివ్ అయ్యింది, అదలా ఉంచుదాం. కానీ మొదటి ఇద్దరు విలన్లతోనే హీరోకి ఇలా dead – lock లేదా mexican stand-off  సిట్యుయేషన్ ఏర్పడినప్పుడు, కనీసం దీన్నయినా ఎక్సైటింగ్ గా క్లైమాక్స్ కి తీసి కెళ్ళడం లో విఫలమయ్యాడు దర్శకుడు. ఇలాటి వెన్నో.


         అల్లరి నరేష్ ఇమేజి మేకోవర్ సరే, కానీ పాత్రకి ఆ మేకోవర్ లేక విలన్లని బురిడీ కొట్టించడానికి పాల్పడిన ట్రిక్కులు అన్నీ చాలాచాలా సినిమాల్లో వచ్చేసిన పాత మూసఫార్ములా బాపతు వ్యవహరాలేగా? ఇక ఇమేజి మేకోవర్ దేనికి?

           తన బ్రాండ్ వూర కామెడీతో మూస క్యారక్టర్లే ది బెస్ట్ అని అల్లరి నరేష్ తెలుసుకుంటే మంచిదేమో.  బెటర్ లక్ నెక్స్ట్ టైమ్!


సికిందర్



Tuesday, February 17, 2015

స్ట్రక్చర్- 4


సినాప్సిస్ స్క్రీన్ ప్లేకి బ్లూప్రింట్!


Monday, February 16, 2015

టెంపర్..

Social cause Returns!
రచన- దర్శకత్వం: పూరీ జగన్నాథ్
తారాగణం : ఎన్టీఆర్, కాజల్, మధురిమ, ప్రకాష్ రాజ్, పోసాని, కోటా శ్రీ నివాసరావు, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, పోసాని, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రమాప్రభ, కోవై సరళ  తదితరులు
కథ ; వక్కంతం వంశీ,  సంగీతం : అనూప్ రూబెన్స్, నేపధ్య సంగీతం : మణి శర్మ, ఛాయాగ్రహణం : శ్యాం కె నాయుడు, కూర్పు : ఎస్ ఆర్ శేఖర్,
బ్యానర్ :  పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్
 నిర్మాత : బండ్ల  గణేష్
విడుదల : 13 ఫిబ్రవరి, 2015 ,  సెన్సార్ : U/A
***



       మధ్య కాలంలో బిగ్ స్టార్స్ తో తెలుగు కమర్షియల్ సినిమా ఎదుర్కొంటున్న విషయపరమైన వెలితి, తద్వారా అపజయాల పరంపర, ఇంకేం చేయాలో తోచని స్థితి, ఇవన్నీ అనివార్యంగా మర్చిపోయిన మూలాల వైపు తిరిగి చూసేలా చేయడంలో ఆశ్చర్యంలేదు. దీన్ని ఎవరైతే ముందు గుర్తిస్తారో, వాళ్ళు ఈ ప్రతిష్టంభనని బద్దలు కొట్టగల్గుతారు. రొటీన్ యాక్షన్ కామెడీలతో ప్రేక్షకుల హనీమూన్ కూడా ఎప్పుడో ముగిసిపోయింది. తమని సంతృప్తి పర్చడమంటే ఇప్పుడు మాటలు కాదు. బిగ్ స్టార్ ఇప్పుడు ఇంకా ఎక్కడో తమని తాకాలి. నేలకు దిగి రావాలి. చుట్టూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంతు  చిక్కని సమస్యలు అనేకం వేధిస్తున్నాయి. వాటికి సమాధానాలు చెప్పాలి. తదాత్మ్యం చెందేలా చేయాలి. అప్పుడుగానీ బ్రహ్మరధం పట్టడం సాధ్యంగాదు.
      ఇదే జరుగుతోందివ్వాళ. ఈ ప్రతిష్టంభనని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఐతే దీన్ని బ్రేక్ చేయడానికి నానా తిప్పలు పడ్డ మాట కూడా వాస్తవం. ఈ బిగ్ స్టార్ తో ఇంకా ఏదో అభద్రతా భావం వెంటాడినట్టు, చెప్పాలనుకున్న బలమైన పాయింటు చెప్పడానికి పూరీ జగన్నాథ్ సైతం  నానా హైరానా పడాల్సివచ్చింది. మొత్తానికి కిందామీదా పడి మసకబారిన ఇద్దరి ప్రతిష్టనీ తిరిగి వెలిగించుకున్నారు.
      విషయపరంగా నేలవిడిచి సాము చేయనవసరం లేని బిగ్ కమర్షియల్ సినిమాకి, శైశవ దశలో వున్న ఒక నమూనా  ‘టెంపర్’! ఈ నమూనా ఓకే అన్పించుకుంది గనుక ఇప్పుడిక ధైర్యంగా దీన్ని పెంచి పోషించుకో వచ్చు కొన్నాళ్ళపాటు. 

దయలేని దయా 
       అడ్డగోలు అవినీతి పోలీసు అధికారి దయా శంకర్ (ఎన్టీఆర్) కథ ఇది. తిండి లేని అనాధగా చిన్నప్పుడు ఒక పోలీసు అవినీతిని  చూసి అలాటి తను కూడా పోలీసు వాడై బాగా  సంపాదించుకోవాలన్న దుర్బుద్ధితో  పెరిగి డిపార్ట్ మెంట్ లో చేరతాడు. కేసులు చూడకుండా డబ్బులు వసూలు చేసుకోవడమే పని. ఎక్కడో వైజాగ్ లో వాల్తేర్ వాసు అనే ముఠాకోరు ఉంటాడు. అతడి గ్యాంగ్ లో నల్గురు తమ్ముళ్ళు. అతడికి అర్జెంటుగా తనకి సహకరించే పోలీసు వాడు అవసరపడ్డాడు. హైదరాబాద్ లో వున్న అలాటి నీచమైన ఎస్సై దయాని వైజాగ్ ట్రాన్స్ ఫర్ చేసి వాల్తేర్ వాసు పట్ల తన బాధ్యత తీర్చుకుంటాడు హోం మంత్రి( జయప్రకాష్ రెడ్డి). వైజాగ్ చేరిన దయా, వాసుతో చేతులు కలిపి అక్రమాలకి తెరలేపి తన కమిషన్ తను పుచ్చుంటూ ఉంటాడు. నిర్లజ్జగా పాల్పడుతున్న ఇతడి అవినీతిని చూసి అసహ్యించుకుంటూ ఉంటాడు నారాయణ మూర్తి (పోసాని) అనే హెడ్ కానిస్టేబుల్. స్టేషన్ కి ఒకావిడ వచ్చి తన కూతురు తప్పిపోయిందని ఆందోళన చెందుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు దయా.

       వైజాగ్ లోనే జంతు ప్రేమికురాలైన శాన్విఅనే ఒక ఎన్జీవో ( కాజల్ అగర్వాల్) తల్లి (కోవై సరళ), అమ్మమ్మ (రమాప్రభ) లతో వుంటుంది. ఈమెని ని చూసి ప్రేమిస్తాడు. ఈ ప్రేమ కొనసాగుతూండగా వాసు గ్యాంగ్ పొరపాటున ఈమెని కిడ్నాప్ చేయబోతారు. దీంతో ఈమె దయాకి కనువిప్పు కల్గిస్తుంది- తనుకాకపోతే ఇంకెక్కడో ఇంకెవరో అమ్మాయి ఈ గ్యాంగ్ బారిన పడబోతోందనీ, వెళ్లి కాపాడమనీ అల్టిమేటం ఇస్తుంది.
       ఆ అమ్మాయి లక్ష్మీ ( మధురిమ) అనే ఎన్నారై. ఈమెని కిడ్నాప్ చేయకుండా దయా అడ్డుపడడంతో, వాసుకీ ఇతడికీ వైరం మొదలవుతుంది. వాసు బారినుంచి లక్ష్మిని కాపాడిన దయాకి షాకింగ్ రహస్యం తెలుస్తుంది. దీంతో అంతర్మధనం మొదలౌతుంది. ఆనాడు కూతురు కన్పించడం లేదని స్టేషన్ కి వచ్చి మొర  పెట్టుకున్నావిణ్ణి పట్టించుకోకుండా ఘోర తప్పిదం చేశాడు. దాని ఫలితం ఈ దారుణం. దీనికి తనే కారకుడన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు దయా..

        ఇక్కడ్నించీ అతడిలో మార్పు, దుష్ట శిక్షణ అనే బాధ్యతా మొదలై వాసునీ- అతడి గ్యాంగ్ నీ శిక్షించేందుకు ఎంతదూరమైనా పోతాడు దయా.
ఎన్టీఆర్ దండయాత్ర  
           తమాషాగా మారిన తెలుగు కమర్షియల్ సినిమా తీరుతెన్నులపై దండయాత్ర ఈ ఎన్టీఆర్ పాత్ర. చాలా బిగ్ కమర్షియల్స్ వచ్చాయి- స్టార్ కి మేకోవర్ అనీ, మేకప్ ఛేంజ్ అనీ, హేర్ స్టయిల్ డిఫరెంట్ అనీ, సిక్స్ ప్యాక్ అనీ..ఇలా! సినిమాలో అసలంటూ విషయం లేకుండా ఈ బిల్డప్పులతో స్టార్లు ఎంత అనుభవించాలో అంతా అనుభవిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడదే హై ఫ్యాషన్ తో వచ్చాడు. కఠిన వర్కౌట్లు చేసి బాడీని టోనప్ చేసుకున్నాడు. షర్టు తీసి సిక్స్ ప్యాక్ ప్రదర్శించాడు. వివిధ రకాల స్పైక్స్ తో కొత్త హేర్ లుక్, లెదర్ జాకెట్స్ లేని రఫ్ లుక్ గల డిజైనర్ కాస్ట్యూమ్స్, మొదటిసారి ట్రిమ్ చేసిన మీసం..వీటన్నిటినీ మంచి ఈజ్ తో, పవర్ఫుల్ గా క్యారీ చేసే ఇగో- డిఫెన్సివ్ యాటిట్యూడ్..ఈ మేకోవర్ అంతా మళ్ళీ పటాటోపంగా మారకుండా, ఎండమావులతో నరకం చూపిస్తున్న తెలుగు సినిమా కథా కథనాలని, నడిచే బాంబు లాంటి క్యారక్టర్ అనే వెపన్ తో అడ్డదిడ్డంగా వధించేస్తూ-  కొత్త కథా ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 

        ఈ హై ఓల్టేజ్ డ్రామాలో ఎన్టీఆర్ దొక ఆథర్ బ్యాక్డ్ క్యారక్టర్. ఒక్కోసారి రచయిత మిగతా సినిమా దినుసులన్నిటినీ పక్కనపెట్టి పాత్రలో లీనమైపోయి- అది డ్రైగా మారుతున్నా సరే, దాని సహజ జీవితాన్ని కెలుకుతూ దాని కథే అల్లుకుంటూ కూర్చుంటాడు. దీన్నిసౌమనస్యంతో అర్ధం జేసుకోగలిగితే,  ఆ దర్శకుడు వీలైనంత యధాతధంగా తెరకెక్కించి సక్సెస్ అవుతాడు. ఇలా ఆధర్ బ్యాక్డ్ క్యారక్టర్ – అంటే రచయిత బ్రహ్మరధం పట్టిన పాత్రని - ఏ ఇగోలూ లేకుండా చేపట్టినప్పుడే ఆ స్టార్ కూడా సక్సెస్ అవుతాడు. కథా రచయిత వక్కంతం వంశీతో ఎవరూ ఇగోలకి పోకపోవడం జరిగిన మేలు. మొదటిసారి పరాయి కథకి దర్శకత్వం వహించేందుకు ముందుకొచ్చిన పూరీ కూడా ఒక లక్. లేకపోతే నాలుగేళ్ళుగా మరుగునపడి వున్న ఈ ఆ ఆధర్ బ్యాక్డ్ క్యారెక్టర్ కథ వెలుగు చూసేదే కాదు. 
       ఎన్టీఆర్  ఫ్యాన్స్ కూడా ఇంకెప్పుడూ  గొంతెమ్మ కోర్కెలు కోరి తమ అభిమాన స్టార్ ని ఎక్కడేసిన గొంగళి చేయకుండా వుంటే మంచిది.
        కాజల్ అగర్వాల్, మధురిమ లు కథని మలుపులు తిప్పడానికి  తోడ్పడ్డారు తప్పితే కథా నడకతో వాళ్ళకేం సంబంధం లేదు. పోసాని ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసే ఉత్ప్రేరక పాత్ర పోషించాడు. ప్రకాష్ రాజ్ సైకోతనపు విలనీతో మరోసారి విజృంభించాడు. తనికెళ్ళ ఒకే ఒక్క  చెంప పెట్టుతో కళ్ళు చెమర్చేలా సినిమా ఈక్యూని అమాంతం పెంచేశాడు. ఇక అలీ-సప్తగిరి-వెన్నెల కిషోర్ త్రయం హాస్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇంత హారిబులా?
        గత సృష్టి ‘హార్ట్ ఎటాక్’ లో నిలబెట్టుకున్న నిర్మాణ విలువలు, క్వాలిటీ మేకింగ్ ఈ సారి పూరీ  పట్టుతప్పి చాలా హారిబుల్ గా మారాయి. మూవీ అంతా బి, సి గ్రేడ్ బాపతు లౌడ్ నెస్ తో శబ్ద కాలుష్యమే. అరిచి తప్ప మామూలుగా మాట్లాడుకోలేని ఆర్టిస్టులు,  విధ్వంసం తప్ప సున్నితత్వం లేని మణిశర్మ నేపధ్య సంగీతం – ఎన్టీఆర్ తను అనాధకానని ఎమోట్ అయ్యే సీను సైతం ఈ అరిగిపోయిన విధ్వంస బాణీల్లో  కొట్టుకుపోవడం- ఫ్రెష్ నెస్ లేని అదే పాత తరహా శ్యాం కె. నాయుడు ఛాయాగ్రహణం, విజయ్ కి బడ్జెట్టే చాలనట్టు ‘లో- రేంజి’  ఫైట్లు..ఇలా మేకింగ్ పరంగా ఏ విలువలూ పాటించకుండా లాగించేశారు. అదేమిటో గానీ సరుకులేని సినిమాలకి మేకింగ్ అద్భుతంగా ఉంటోంది. టెక్నీషియన్లు వారెవ్వా అన్పించుకుని- విషయంలేక దర్శకులు టెక్నీషియన్ల ముందు వెలవెలబోవడం. ఈసారి ఈ సాంప్రదాయం తిరగబడింది. అనూప్ రూబెన్స్ సంగీతంలోని పాటలే రిలీఫ్. 
స్క్రీన్ ప్లే సంగతులు 
    ముందుగా  చెప్పుకున్నట్టు- ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న అంత బలమైన బాక్సాఫీసు విన్నింగ్ పాయింటు చెప్పడానికి నానా హైరానా పడ్డారు. అదృష్టవశాత్తూ కలిసివచ్చిన అధర్ బ్యాక్డ్ పాత్ర మీద  పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, ప్రేక్షకులమీద నమ్మకం కుదరనట్టే కన్పిస్తోంది. అందుకే ఫస్టాఫ్ ని అరిగిపోయిన పాత మూస ఫార్ములా అనే సేఫ్ జోన్నే  చూసుకున్నట్టుగా  అన్పిస్తారు. ఈ సేఫ్ జోన్ లో కూడా సిన్సియారిటీ లోపించడంతో మొత్తం కథ కిచిడీ పాకంలా తయారయ్యింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో వున్నట్టు- ఈ సినిమా కథ ప్రాణమంతా ముగింపు సన్నివేశాల్లో పెట్టుకుని, అంతవరకే సినిమా అన్నట్టు బిగదీసుకుని, మిగతా భాగాన్ని గజిబిజిగా వదిలేశారు. 

           సినిమా ప్రారంభమైన  సుమారు గంటా పదినిమిషాల సుదీర్ఘ కాలం తర్వాత -  మిస్టేకెన్ ఐడెంటిటీ తో కాజల్ ని కిడ్నాప్ చేసే ప్రయత్నంతో మొదటి మలుపు వచ్చి కథ మిడిల్లో పడుతుంది.    మేరకు ఈ బిగినింగ్ విభాగానికి ఇటువంటి మలుపు గమ్యం ఐనప్పుడు- ఈ గమ్యానికి చేరవేసే సంబంధిత దృశ్యాల కూర్పు సరిగ్గా లేకపోవడం ఫస్టాఫ్ బ్యాడ్ అనుకోవడానికీ, బోర్ కొట్టడానికీ కారణమయ్యింది. ఒక ముక్కోణం వుంటుంది : రచయిత/దర్శకుడు - కథ- ప్రేక్షకులు అనే ముక్కోణం. ఈ ముక్కోణంలో రచయిత/దర్శకుడు ఏకకాలంలో కథ తోనూ, ప్రేక్షకులతోనూ రోమాన్సులో ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈ రోమాన్సుని సినిమా ముగింపు సన్నివేశాల్లో మాత్రమే ప్రారంభించాడు ఇక్కడ రచయిత/దర్శకుడు.
           మొదట్లో పాత్రపరంగా విలన్ చేతిలో హీరో కీలు బొమ్మ నిజమే, అంత వరకూ ఆ పాత్ర సహజమైన పాసివ్ తనాన్ని ఒప్పుకోక తప్పదు. ఐతే కాజల్ టర్నింగ్ తో నైనా విలన్ మధురిమ కోసం అసలెందు కోసం ప్రయత్నిస్తున్నాడో తెలుసుకుని, హీరో యాక్టివ్ పాత్రగా మారితే  – అలా సినిమా సక్సెస్ కి చాలా అవసరమైన యాక్టివ్ పాత్రగా మారి, ఆ రహస్యం తెలుసుకున్న వాడై,  దాంతో విలన్ ని ఛాలెంజి చేసివుంటే- ఇంటర్వెల్ సీను కూడా అలా ఉత్త అమ్మాయి కోసం ఉత్తుత్తి పెడబొబ్బల ప్రహసనం కాకుండా వుండేది. విలన్ చేసిన అసలు కుట్రేమిటో తెలుసుకోకుండా, హీరో ఎన్ని పాసివ్ అరుపులు అరిచి ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే మాత్రం ఏం ఎలాభం? ఇంకా హీరో గోల్ ఏమిటో తెలియకపోతే ఎలా?
          సస్పెన్స్ తో ముడిపడి వుండే ఏ అంశానికైనా  రెండు పార్శ్వలుంటాయి : ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేవి. ఈ రెండూ మూసిపెట్టి కథ నడిపిస్తే అర్ధంగాదు, బోరు కొడుతుంది. కచ్చితంగా అందులో ఒక పార్శ్వాన్ని విప్పి చూపాల్సిందే. రసపోషణ  కోసం అనివార్యంగా అది మొదటి పార్శ్వ్యమే అవుతుంది- ఏం జరిగింది?అనేది. ఇది ఓపెన్ చేసి కథ నడుపుతూ, అదెలా జరిగింది? అన్నది మాత్రం గుప్పెట్లో ఉంచుకున్నప్పుడే  అదొక సస్పెన్స్ కథవుతుంది.
          ఆ ఏం జరిగిందనే రహస్యం హీరో తెలుకుని ఇంటర్వెల్లో బయట పెడితే  కథ చెడుతుంది నిజమే. ఎందుకంటే అది చేదు మాత్ర. సెకండాఫ్ లో తగు సమయం వరకూ దాన్ని ముట్టుకోకుండా షుగర్ కోటింగ్ తోనే నడపాలి. ఐతే సినిమా మొదట్నించీ కూడా ఈ షుగర్ కోటింగ్ ని పట్టించుకోలేదు. లేకపోతే ఇలా కిచిడీ లా వుండదు. చేదు మాత్రైతే వుంది. కనీసం అది హీరోకి తెలుసనే అర్ధంలో ఇంటర్వెల్ కి వెళ్ళినా సస్పెన్స్ క్రియేట్ అయ్యేది. 
           ఇంటర్వెల్ కైనా హీరో యాక్టివ్ అవ్వాలి, తన గోల్ ఏమిటో తెలుసుకోవాలి. లేకపోతే  అతను ఇంటర్వెల్ ని ఏం చేసీ నిలబెట్ట లేడు. కథని బట్టి దీన్నెలా సాధించాలో అలా సాధించి తీరక తప్పదు. ఈ రెండూ ఇక్కడ ఎష్టాబ్లిష్ చేయకపోతే  అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫస్టాఫ్ తీయడం పూర్తిగా వేస్ట్.
          ‘ద గుడ్-ద బ్యాడ్-ద అగ్లీ’, ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్’,  ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ది వెస్ట్’ వంటి కౌబాయ్ క్లాసిక్స్ తీసిన దర్శకుడు సర్జియో లియోన్, 1971 లో ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డైనమైట్’ అనే మరో కౌబాయ్ అడ్వెంచర్ తీశాడు. దీని ఇంటర్వెల్ సీన్లో హీరో రాడ్ స్టీగర్, ఒక టెర్రి ఫిక్ కాల్పుల సీను చూస్తాడు. సమూలంగా అతడి జీవితాన్ని మార్చివేసే సీను. తనగురించి తానొక నిర్ణయం తీసుకునేందుకు పురిగోల్పే సీను. ఒక కరుడుగట్టిన, క్రూరుడైన బందిపోటుగా బతుకుతున్న తను, ఇక  పెద్ద దోపిడీ ఒకటి చేసేసి తన బంగారు కలలు నేరవేర్చుకోవాలన్న నేర బుద్ధి నుంచి పరివర్తన చెందే సీను. తత్పలితంగా పరివర్తనతో తన నేస్తం జేమ్స్ కోబర్న్ ఆశయాల కోసం ఫ్రీడమ్  ఫైటర్ గా కంకణ బద్ధుడయ్యేందుకు దారి తీయించే సీను.. 
          ‘టెంపర్’  హీరో కూడా అరాచక వాదియే ఐనప్పుడు, అతను మారడం కోసమే కథ నడిపినప్పుడు- కాజల్ అల్టిమేటం అప్పుడే ఆ మార్పు వచ్చినప్పుడు, అది కేవలం  వెర్బల్ గా కాకుండా- పైన ఉదహరించిన సినిమాలోలా విజువల్ గా వస్తే ఇంటర్వెల్లో అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయేవి. ఆ చేదు మాత్ర తాలూకు  విజువల్స్ ని షుగర్ కోటింగ్ చెడకుండా ఎలా ప్రొజెక్ట్ చేయాలన్నది దర్శకుడి ఇష్టం. 
            ఇక విలన్స్ తో హీరో యాక్షన్ ప్లాన్ విషయానికొస్తే, వాళ్ళని వెంటాడి పట్టుకుని అరెస్టు చేసి , కోర్టులో కేసు పెట్టడం పూర్తిగా ఆ హీరో పాత్ర ప్రవృత్తికి  విరుద్ధమే. ఎవరైనా అతనున్న స్థానంలో కాల్చి పారేస్తారు. ఎందుకటే ఒక అవినీతి పరుడైన ఎస్సైగా  వ్యవస్థ ఎలా వుంటుందో అతడికి తెలిసే వుంటుంది. అదే జరిగింది కూడా. కోర్టులో సాక్ష్యం తెల్లబోయేలా చేసింది. సినిమాటిక్ గా చూపించిన ఈ  కథనంలో కూడా, అంత విలువైన సాక్ష్యాన్ని కాపీలు తీసి ఉంచుకోకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరం ఎలా చేస్తాడు? కాపీలు తీసి వుండాల్సిందని తర్వాత బాధపడేలా చేయడం దర్శకుడు కథనంలో లోసుగుల్ని కవర్ చేయడానికి చేసే ప్రయత్నమే. ఈ ప్రయత్నంలో హీరో పాత్ర అసమర్ధంగా తయారయ్యింది. తను మంచి వాడుగా మారినా  అసమర్దుడైతే ఏం లాభం? ఇది సినిమాటిక్ లిబర్టీ సంగతి. ఇక లాజికల్ గా అయితే ఆ సీడీ మీద ఫోరెన్సిక్ రిపోర్టు తీసుకుని పకడ్బందీ సాక్ష్యంగా కోర్టుకి సమర్పిస్తారు. ప్రాసిక్యూటర్ చేతిలో పెట్టరు. కేవలం ఆ సీడీ చూసేసి జడ్జి కూడా మరణ శిక్ష విధించడు. 
           ఆ క్రిమినల్స్ ని హీరో పట్టుకుని కాల్చేస్తూంటే  విలన్ గోల చేసి, అరెస్టు చేయించి ఉండాల్సింది. అప్పుడు  చంపే అవకాశం కోల్పోయిన హీరో,  ఇక కోర్టులోనే తలపడేందుకు సిద్ధపడినట్టు చూపిస్తే పాత్రకి న్యాయం జరిగేది. కానీ కోర్టులో హీరో ఇచ్చే టర్నింగ్ ని తురుపుముక్కగా పెట్టుకున్నారు గనుక,  పాత్ర కిల్ అవుతున్నా పట్టించుకోలేదు. చివరికి హీరో చేసిన పని వాళ్ళని పట్టుకుని చంపడమే అయ్యింది. ఇదేదో అప్పుడే చేసేస్తే పోయేదిగా?
          అలాగే అమెరికా వెళ్ళిపోయినా అక్కడుండి అనుక్షణం టీవీలో ఇక్కడి పరిణామాలు గమనిస్తున్న, ఇంటరాక్టు అవుతున్న మధురిమ, ఇక ఉరి తీస్తున్నారని తెలుసుకుని చెప్పిన మాట ఆ సీడీ తో జరిగిన మోసం బయటపడినప్పుడే ఎందుకు చెప్పలేదు? ఇలా కథా సౌలభ్యం కోసం లాజిక్ ని పక్కన బెడితే,  సినిమాటిక్ గానూ ఇష్టానుసారం నడిపారు. హైదరాబాద్ ఎస్సై ఆంధ్రా కి ట్రాన్స్ఫర్ అవడం ఇంకో హరిబుల్  సినిమాటిక్ లిబర్టీ. కానీ పూరీ సినిమాలతో అభిరుచిగల ప్రేక్షకుల వాయిస్ కి స్థానం వుండదు కాబట్టి ఇలాటి ఎన్ని చేదు మాత్రలనైనా దిగమింగి సినిమా హిట్టని చప్పట్లు కొట్టాల్సిందే.

      అంతిమంగా సామాజిక సమస్యతో ప్రేక్షకుల్ని విజయవంతంగా కనెక్ట్ చేశామాలేదా అన్నది మాత్రమే ప్రస్తుతమైతే- ముందుగానే చెప్పుకున్నట్టు కిందా మీదా పడి తప్పకుండా ఇందులో సక్సెస్ అయ్యారు. ఇలాగే అన్నిసార్లూ సక్సెస్ కాలేరు. తిరిగి మూలాల వైపు చూసిన శైశవ దశ నమూనా ఇది కాబట్టి, ఈ శాంపిల్ తో ఫస్టాఫ్ –సెకండాఫ్ ఆసాంతం కూడా సోషల్ కాజ్ గల కథా కథనాల్ని ధైర్యంగా ప్రేక్షకులకి ఇకపైన రుచి చూపించవచ్చు.  
సికిందర్

Monday, January 19, 2015

స్ట్రక్చర్ -3

ఐడియాలో కథ ఉందా?

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే 
Why has Scandinavia been producing such good thrillers? Maybe because their filmmakers can't afford millions for CGI and must rely on cheaper elements like, you know, stories and characters.
Roger Ebert, film critic
      పుట్టాలంటే ఐడియా తట్టాలి. ఐడియా తట్టాలంటే మార్కెట్ పట్టాలి. ఇది నిజం. మార్కెట్ లో వస్తువు పోతుందో వస్తువే తయారు చేయాలి. ఒకప్పుడు ఫ్లాట్ ఓపెన్ జీన్స్ కి మార్కెట్ వుండేది. ఇప్పుడూ అవే ఉత్పత్తి చేస్తూ కూర్చుంటే అమ్మకాలుండవు. ఇప్పుడు టైట్ పెన్సిల్ లైన్ జీన్స్ కి క్రేజ్ వచ్చింది. ఇవే తాయారు చేసి అమ్మాలి. దశాబ్దం క్రితంవరకూ సందేశాత్మక కథలతో సినిమాలు ఆడేవి, ఇప్పుడు ఫక్తు ఎంటర్టెయిన్మెంట్ సినిమాలే కావాలి. ఇప్పుడు సినిమా అంటే కేవలం ఎంటర్టెయిన్మెంట్, ఎంటర్టెయిన్మెంట్, ఎంటర్టెయిన్మెంట్ మాత్రమే! ఎంటర్టెయిన్మెంట్ తప్ప మరో లోకం లో విహరించడానికి ఇష్టపడడం లేదు ప్రేక్షకులు. ఎవరా ప్రేక్షకులు? యువప్రేక్షకులే! సినిమాలకి మిగిలిన ఏకైక మహారాజ పోషకులు వీళ్ళే!

    
కాబట్టి వినియోగదార్లు తెలిశారు, వినియోగదార్ల అభిరుచులతో మార్కెట్ తెలిసింది, ఇక అమ్ముడు పోయే సరుకేదో తెలిసిపోయింది. అంతేగానీ, లేని వినియోగ దార్లకోసం, లేని మార్కెట్ కోసం గొప్పగా కష్టపడిపోయి, అద్భుత కళాఖండాలు తీస్తామంటే అవి విడుదలకావు.  డిమాండ్ లో వున్న ఎంటర్టెయిన్మెంట్ సినిమాల పొరల్ని ఒకటొకటిగా విప్పుకుంటూ పోతేఒక పొరలో కామెడీ వుండాలి, ఇంకో పొరలో రోమాన్స్ వుండాలి, ఇంకో పొరలో పంచ్ డైలాగులు పేలాలి, ఇంకో పొరలో యాక్షన్ వుండాలి, మరింకో పొరలో కొత్త ట్రెండ్ లో డాన్సులూ పాటలూ ఉర్రూతలూగించాలి.

     వీటి చుట్టే ప్రస్తుతం సినిమా కథల ఐడియా లుండాలి. అగ్రహీరోల భారీ యాక్షన్ సినిమాలైనా, చిన్న హీరోల ప్రేమ సినిమాలైనా- ఆఖరికి హార్రర్ సినిమాలైనా –వీటన్నిటికీ సామాన్యాంశం గా కామెడీ ఉంటోంది. హాలీవుడ్ సినిమాల్ని ఆగ్ర హీరోల భారీ సినిమాలు అనుకరిస్తే; మిగతా మధ్యతరహా, చిన్నాచితకా సినిమాలన్నీ వేలంవెర్రిగా  ఈ భారీ సినిమాల్ని అనుకరిస్తూ- వాటి నకళ్ళుగా నిస్తేజంగా తయారవుతున్నాయి. 


     ఇవన్నీ అట్టర్ ఫ్లాపు అవుతున్నాయి. పూర్వం కె. రాఘవేంద్రరావు తన తొలి రోజుల్లో తీసిన ‘ఆమెకథ’, ‘జ్యోతి’ వంటి సినిమాలు, దాసరి నారాయణ రావు తీసిన ‘స్వర్గం నరకం’, ‘దేవుడే దిగి వస్తే’ లాంటి సినిమాలు; లేదా బాపు, కె. విశ్వనాథ్, వంశీ మొదలైన దర్శకులు తీసిన ఎన్నో సినిమాలు, ఇవన్నీ అగ్రహీరోల కమర్షియల్ సినిమాల అన్ని మసాలా హంగులతో  విబేధించి, ఒద్దికైన ఫోటో ఫ్రేము కథలతో, కాస్త కళాత్మక విలువలతో, జీవితాలకి దగ్గరగా వుండే పాత్రలతో విజయవంతంగా ఆడేవి.

      ఇప్పుడు యాభై లక్షలతో తీసే సినిమా అయినా, అవే బిగ్ హీరోల సినిమాల కథలతో, అవే కృత్రిమత్వాల్ని పులుముకుని, విజయాలు సాధించాలని విఫలయత్నం చేస్తున్నాయి. జామ పండుని పేదవాడి ఆపిల్ అన్నట్టు, ఈ రకం సినిమాలు పేదవాడి బిగ్ మూవీస్  అనుకుని తీస్తున్నారు కాబోలు. కానీ ఎంత గొప్ప భారీ సినిమా అయినా, పరమ చవకబారు సినిమా అయినా పేదవాడు అదే పది  రూపాయల టికెట్టు పెట్టి  చూస్తాడు. కాబట్టి పేదవాడి సినిమా అంటూ ఏదీ లేదు. కొందరు  నిర్మాతలే పాపం  పేదలుగా మారి,  ‘పేద నిర్మాతల బిగ్ మూవీస్’ తీస్తున్నట్టు తయారయ్యింది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో  ఎందరో  దర్శకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు రాలేకపోతున్నారు. ఫీల్డులో దర్శకులవుదామనుకునే కో- డైరెక్టర్లు అరుదు గానీ, అసోసియేట్ దర్శకులు ఎక్కువ. వీళ్ళు ఒక కారణం చేత కో- డైరెక్టర్ స్థానాకి ప్రమోషన్ కోరుకోకుండా- నేరుగా దర్శకత్వ ప్రయత్నాలు చేస్తూంటారు. వీళ్ళ దగ్గర చిన్న బడ్జెట్లతో తీయడానికి అనేక కొత్త తరహా కథలుంటున్నాయి. వీళ్ళకి  నిర్మాతలు దొరికితే తెలుగు సినిమాల రూపురేఖల్ని పూర్తిగా మార్చెయ్యగలరు. కానీ వీళ్ళు సంప్రదించే  ఛోటా నిర్మాతలకి – డాన్సులున్నాయా, కామెడీ ఉందా, ఫైట్లున్నాయా- ఇదే దృష్టి
!

       కాబట్టి ఐడియా అనేది నిర్మాత పరిధిలోని అంశమని అర్ధంజేసుకోవాలి. ఐడియాలకి ఎంటర్ టైన్మెంట్ కోటింగ్ మాత్రమే ఇవ్వాలనేది యువ ప్రేక్షకుల డిమాండ్ గా గుర్తించాలి. ఎందుకంటే ఈ శతాబ్దం ఆరంభంలో ఐటీ, రియల్ ఎస్టేట్ బూమ్స్ తెచ్చిపెట్టిన విస్తృత ఉపాధి అవకాశాలతో యువతకి  వాళ్ళ వాళ్ళ యోగ్యతలతో చేతినిండా పని దొరికి, జేబు నిండా డబ్బు ఆడుతోంది. పల్లె- పట్టణం అన్న తేడా లేకుండా కనీసం ఒక సెల్ ఫోన్ మెయిన్ టెయిన్ చేస్తూ, రోజుకి ఓ వంద ఖర్చు పెట్టుకోగలిగే  ఆర్ధిక స్వాతంత్ర్యంతో, నిరుద్యోగపు నిరుపేద కేకలు లేకుండా జీవితాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా విప్లవాలు, తిరుగుబాట్లు, ఈతిబాధలు, శోకరసాలూ అంటే కుదరదు. సిద్ధాంతాలూ ఉదాత్త భావాలూ అంటే తిప్పికొడతారు. ఏ చారిత్రిక, సాంస్కృతిక నే పధ్యాలకీ  లొంగని తమదైన ‘నియో-రిచ్’ సంస్కృతిని సృష్టించుకుని పాప్ కార్న్ కళల్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ళకి పాప్ కార్న్ సినిమాలే కావాలి. 

      కాబట్టి ఈ పరిధిలో ఏ ఏ ఐడియాలు సినిమాలకి పనికొస్తాయి? ముందుగా స్థానికత (నేటివిటీ) ప్రతిబింబించే ఐడియాలు సినిమాలకి అవసరం. అవి వాస్తవికంగానూ, నమ్మశక్యంగానూ వుండాలి. డాక్టర్ వల్లంపాటి వెంకటసుబ్బయ్య కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తన ‘కథా శిల్పం’ అనే గ్రంధంలో- ఎక్కడో అరుదుగా నూటికో కోటికో జరిగే సంఘటనల గురించి రాయడం వాస్తవికత అన్పించుకోదని అన్నారు. కనుక ఈ స్థానికతని, వైడ్ యాక్సెప్టెన్స్ నీ దృష్టిలో పెట్టుకున్నాక, అసలు ఏ స్థాయి సినిమాని ఉద్దేశిస్తున్నారనేది  నిర్ణయానికి రావాలి. లో-బడ్జెట్టా? మీడియం బడ్జెట్టా? బిగ్ బడ్జెట్టా? ముందు ఈ కొలత నిర్ణయించుకుంటే దానికి కట్టుబడి ఐడియాల్ని యోచించవచ్చు. నిర్మాతకి ఆర్ధిక వెసులుబాటు కల్గిస్తూ, పదిహేను రోజుల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ముగించగలిగే చిన్న ఐడియానా? లేక 45 రోజుల షెడ్యూల్ తో ఇంకాస్త విస్తారమైన ఐడియనా? మరి లేక వంద రోజుల షెడ్యూల్ తో బిగ్ బడ్జెట్ ఐడియనా? సినిమాకథ రాసుకోవడమంటే ఇష్టానుసారం రాసుకునే సృజనాత్మక వ్యాపకం మాత్రమే కాదు, అదే సమయంలో ప్రొడక్షన్ స్క్రిప్టు రాస్తున్నట్టుగా కూడా భావించాలి. ముందు బడ్జెట్- అప్పుడు ఐడియా. ఐడియా దగ్గర్నుంచే నిర్మాణాత్మకంగా ఇటుకలు పేర్చుకుంటూ పోతే, ఆ రచయిత/దర్శకుడు గట్టి పునాదిమీద ఒక స్పష్టతతో- సాధికారికంగా ఉండగలడు.

       ఐడియాలు ఎక్కడనుంచి వస్తాయి? ఐడియాలు ఎక్కడ్నుంచైనా రావచ్చు – మెదడులోనే  స్ఫురించవచ్చు, ఏదైనా చదివినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు వాటిలోంచీ  పుట్టొచ్చు; లేదా నాలుగు హిట్టయిన తెలుగు సినిమాలని కలిపి ఒక ఈ సైక్లింగ్ ఐడియాని పుట్టించ వచ్చు. ఇంకా లేకపోతే ఏ కొరియన్ సినిమానో  చూసి దాన్నే తెలుగులోకి దించెయ్యా లన్పించొచ్చు. కాపీ కొట్టాలనుకోవడం కూడా ఐడియానే. ఐడియా ఆవిర్భావమంతా వ్యక్తిగతమే. ఆ వచ్చిన ఐడియాని ఎలా విస్తరించాలన్నదే ప్రస్తుతాంశం.


     ఒక బడ్జెట్లో ఐడియాని ఎంపిక చేసుకున్నాక, రెండో మెట్టులో ఆ ఐడియాకి సినిమా కథ అయ్యే లక్షణం వున్నదా చూడాలి. ఇక్కడే కథకీ, గాథకీ తేడా గ్రహించాలి. సినిమాలకి కథలు మాత్రమే  పనికొస్తాయి. గాథలతో ఇంకే సాహిత్య ప్రక్రియనో, లేదా స్టేజి నాటకాన్నో ప్రయత్నించ వచ్చు. కథ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథ- నిస్సహాయంగా ఇదిగో పరిస్థితి ఇలా తయారయ్యిందీ అని స్టేట్ మెంట్ ఇచ్చి వదిలేస్తుంది. కథ ఆర్గ్యుమెంట్ అయితే, గాథ స్టేట్ మెంట్. తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత ‘కథ’లే సినిమాలకి పనికొస్తాయి తప్ప,  సమస్యని ఏకరువు బెడుతూ  స్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే  ‘గాథ’ లు పనికిరావు. 

    ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం...
    2011 లో కృష్ణవంశీ తీసిన ‘మొగుడు’ అనే సినిమాలో, పెళ్లి వ్యవస్థ గురించి చెప్తున్నామని ప్రచారం చేశారు. కానీ ఆ సినిమాలో పెళ్లి వ్యవస్థ గురించి కాకుండా, వేరే బాట పట్టారు. వరకట్నం, విడాకులు, వేరు కాపురాలూ వంటి సమస్యల్లాగే- పెట్టిపోతల దగ్గర, కుటుంబ ఆచారాల దగ్గరా,  పెళ్లి తంతులోనూ, వచ్చే తేడాలుంటాయి. ఇలాటి ఒక కుటుంబ ఆచారం దగ్గర వచ్చిన తేడా మాత్రమే  ఈ కథ. దీనికి పెళ్లి వ్యవస్థతో ఏ సంబంధమూ లేదు. ఈ కథలో రెండు కుటుంబాల మధ్య వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో ‘సైద్ధాంతిక’ విభేదాలు పొడసూపుతాయి. అంటే ఈ విభేదాల్లో ఎవరిది తప్పు, ఎవరిది  ఒప్పు అన్న బలమైన ఆర్గ్యుమెంట్ ని ప్రేక్షకుల పరిశీలనార్ధం దర్శకుడు ఎక్కుపెట్టాడు. అయితే ఇదే ఆర్గ్యుమెంట్ ని పట్టుకుని ముందుకు సాగి వుంటే, ఇదొక ఆలోచనాత్మక కథగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసేది. ఇలా కాకుండా ఈ ఆర్గ్యుమెంట్ ని  (సైద్ధాంతిక విభేదాల్ని) హింసాత్మక చర్యలకి దారితీయించి, నానా బీభత్సం సృష్టించి, దీన్నాపే మరో ప్రతి చర్యగా, చివరాఖరికి హీరో గోపీచంద్ పాత్ర భోరున  ఏడుస్తూ పరిస్థితి ఇదిగో ఇలా తయారయ్యిందీ అని చెప్పుకుని ముగించేస్తుంది. అంటే ఒక పాయింటుతో ఆర్గ్యుమెంటు గా స్థాపించిన కథ, దారితప్పి నిస్సహాయత తో కూడిన స్టేట్ మెంట్ తో ఒక గాథలా ముగిసిందన్నమాట! ఇందుకే ఈ సినిమా ఫ్లాపయ్యింది. ఇదే కృష్ణవంశీ 2013 తీసిన ‘పైసా’ లోనూ ఇలాగే జరిగింది. కోటి రూపాయల కోసం డబ్బున్న అమ్మాయిని కట్టుకోవాలన్న ఆర్గ్యుమెంట్ తో స్థాపించిన ‘ఐడియా’ని,  అర్ధంలేని డబ్బు వేటగా మార్చేసి, ఇదిగో ఇలా జరిగితే ఇలా ముగిసింది పాపం-అని స్టేట్ మెంట్ ఇస్తూ గాథగా మార్చేశారు.

         కాబట్టి ఎంపిక చేసుకున్న ఐడియాలో కథ ఉందా, గాథ ఉందా పసిగట్టడం చాలా అవసరం. కథ’ అనే దాంట్లో  ప్రధాన పాత్ర ఆర్గ్యుమెంట్ కారణంగా యాక్టివ్ గా కథ నడిపిస్తే, గాథ’ కి వచ్చేసరికి  ఉత్త స్టేట్ మెంట్ ఇస్తున్న కారణాన పాసివ్ పాత్రగా మారి సినిమాని ఫ్లాప్ చేస్తుంది. దీని గురించి వివరంగా ముందు ముందు టూల్స్ లో చూద్దాం. ఐడియాలో ఆర్గ్యుమెంట్ వుండాలంటే- ఉదాహరణకు- ఒక బాగా డబ్బున్న వాడు పిజ్జా డెలివరీ బాయ్ కి రెండువేలు టిప్ ఇచ్చి ఆశ్చర్యపర్చాడన్న వార్త వచ్చిందనుకుందాం. ఇందులో ఆర్గ్యుమెంట్ లేదు.  ఆ టిప్ తీసుకుని ఎగిరి గంతేశాడన్నట్టు  స్టేట్ మెంట్ మాత్రమే  వుంది. ఇలాకాక, ఆ టిప్ తీసుకున్న తర్వాత, అదే  డబ్బున్న వ్యక్తితో చచ్చే చావొచ్చిందనీ, అందులోంచి ఎలా బయటపడాలా అని హీరో తన్నుకు చచ్చాడనీ, అన్నదాంట్లో ఆర్గ్యుమెంట్ వుంది. సినిమా కథకి ఐడియా వుంది. చాలా వరకూ సంఘటనలూ, వార్తలూ స్టేట్ మెంట్స్ మాత్రంగానే వుంటాయి. వాటిని ఆర్గ్యుమెంట్ గా మార్చుకునే అవకాశం వుంటే అవే సినిమా కథలకి ఐడియా లవుతాయి...


ఐడియాలో కథ ఉండేట్టు చూసుకున్నాక, ఇక తర్వాతి మెట్టు- స్ట్రక్చర్ చూసుకోవడం. ఎంపిక చేసుకున్న ఐడియా లో స్ట్రక్చర్ లేకపోతే కూడా ఆ అయిడియా పనికి రాదు. పైన చెప్పుకున్న ‘మొగుడు’, ‘పైసా’,  ఇంకా చెప్పుకోవాలంటే ఇటీవల విడుదలై అపజయం పాలైన  ‘చక్కిలిగింత’ సినిమాలవి ఒక ఐడియాలే కావు. ఎందుకంటే మొదటి రెండిట్లో సినిమా ఐడియా డిమాండ్ చేసే ఆర్గ్యుమెంట్లే లేవు. మూడో దాంట్లో ఆర్గ్యుమెంట్ ఇంటర్వెల్లో నే అంతమై కథ ముగిసిపోతుంది. ఇదెలాగంటే, అమ్మాయిల వెంట అబ్బాయిలు పడకుండా, అమ్మాయిలే అబ్బాయిల వెంట పడేట్టు చూసుకోవాలన్న హీరో ఆర్గ్యుమెంట్ ఇంటర్వెల్ దగ్గరే ఓడిపోయాడు.

     ఇందుకే ఐడియా దశలోనే అందులో ఆర్గ్యుమెంట్ ‘అంశ’  ఉందా లేదా చూసుకోవడంతో బాటు, ఆ ఆర్గ్యుమెంట్ కి స్ట్రక్చర్ ఉందా లేదా చూసుకోవడం కూడా అవసరమవుతోంది. ఈ స్ట్రక్చరే మొత్తం స్క్రీన్ ప్లే కీ స్ట్రక్చర్ అవుతుంది. సినిమా కథ (ఐడియా) ఆలోచించడమంటే స్ట్రక్చర్ లో పెట్టి ఆలోచించడమే! ఈ బేసిక్ బ్లూ ప్రింట్ లేకుండా ఐడియాతో ఆటలాడుకోవడం శుద్ధ దండగ. కాబట్టి ఇక్కడ ఆపద్ధర్మంగా స్థూలంగా ఒకసారి స్ట్రక్చర్ ని వివరించుకుంటే- ఇందులో బిగినింగ్-మిడిల్-ఎండ్ అనే మూడు విభాగాలుంటాయి. బిగినింగ్ లో సమస్య ఏర్పాటు, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో ఆ సమస్యకి పరిష్కారం అనే  బిజినెస్ లుంటాయి, ఇంతే! ఇంతకి మించి ఏ బ్రహ్మ పదార్ధమూ లేదు. అంటే ఎంపిక చేసుకున్న ఐడియాలో సమస్య-సంఘర్షణ-పరిష్కారం ఈ మూడూ కొట్టొచ్చినట్టు కన్పించాలన్న మాట!

    
 పైన చెప్పుకున్న ఐడియాలో- ఒక బాగా డబ్బున్న వాడు పిజ్జా డెలివరీ బాయ్ కి రెండువేలు టిప్ ఇచ్చి ఆశ్చర్యపర్చాడని వుంది. ఈ లైన్ లో  బిగినింగ్ విభాగం మాత్రమే కన్పిస్తోంది. రెండు వేలు టిప్ ఇవ్వడంతో బిగినింగ్ విభాగానికి కావలసిన సమస్య మాత్రమే ఏర్పాటయింది. దీన్ని పొడిగించి- ఆ టిప్ తీసుకున్న పిజ్జా బాయ్ కి ఆ పెద్ద మనిషితో చచ్చే చావొచ్చిందని చెప్పడంలో మిడిల్ ఏర్పాటై, దీనికి కావలసిన సంఘర్షణ ప్రారంభమైంది- చివరికి  ఈ పెద్ద మనిషి పన్నాగాన్ని తిప్పికొట్టేందుకు పిజ్జా బాయ్ కౌంటర్ ప్లానేశాడుఅని పెట్టుకుంటే  దాంతో ఎండ్ ఏర్పాటై, సమస్యని పరిష్కరిస్తోంది. 

 *  ఒక డబ్బున్న వాడు టిప్ ఇచ్చాడు- (బిగినింగ్, సమస్య)- వాడితో పిజ్జా బాయ్ కి  చచ్చే చావొచ్చింది- (మిడిల్, సంఘర్షణ)- ఇక కౌంటర్ ప్లానేశాడు – ( ఎండ్, పరిష్కారం).
*  ఒక బాడీ బిల్డర్ విక్రం మోడల్ అమీ జాక్సన్ ని ప్రేమిస్తాడు  (బిగినింగ్) అమీ జాక్సన్  ని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నిన ఓ డాక్టరంకుల్ సురేష్ గోపీ, విక్రం కి ఒక ఇంజెక్షనిచ్చి కురూపిని చేస్తాడు  (మిడిల్) - ప్రతీకారంగా ఆ డాక్టరంకుల్నీ వాడి ముఠానీ కురూపుల్ని చేసి కథ ముగిస్తాడు  విక్రం (ఎండ్) - ‘ఐ’ స్టోరీ ఐడియా.
*  ఓ పెళ్ళయిన జంట నాగ చైతన్య- సమంత రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు (బిగినింగ్), వాళ్ళ కొడుకు నాగార్జున పెద్దయి పునర్జన్మెత్తిన తన తండ్రి నాగచైతన్యని చూసి, తల్లి సమంతతో కలపాలని అన్వేషణ ప్రారంభిస్తాడు ( మిడిల్),  ఆ అన్వేషణలో పూర్వజన్మలో తన భార్య శ్రియనీ, తమ కుమారుడే అయిన అక్కినేని నాగేశ్వరరావునీ  కూడా తెలుసుకుని మొత్తం అందర్నీ ఒకటి చేస్తాడు ( ఎండ్) – ‘మనం’ స్టోరీ ఐడియా
*  పాతికేళ్ళుగా దూరమైన అత్తయ్య నదియానీ, ఆమె కూతుళ్ళనీ దగ్గరికి చేర్చమని కోరతాడు తాతయ్య బోమన్ ఇరానీ మనవడు పవన్ కళ్యాణ్ ని (బిగినింగ్), మారుపేరుతో నదియా  ఇంట్లో  దిగిన పవన్ కళ్యాణ్ సమస్య సాధించడం మొదలెట్టి  అవమానాల పాలవుతాడు( మిడిల్), చివరికి ప్రమాదవశాత్తూ తన తల్లి మృతికే కారణమైన తాతయ్యని తనే క్షమించగల్గినప్పుడు,  నువ్వెందుకు క్షమించలేవని  నదియా మనసు మారుస్తాడు పవన్ కళ్యాణ్ (ఎండ్)- ‘అత్తారింటికి దారేది” స్టోరీ ఐడియా.

     ఒక ఐడియాకి ఆర్గ్యుమెంట్ అంశ, స్ట్రక్చర్ సరి చూసుకున్నాక, లాగ్ లైన్ అనుకోవాలి. తెలుగు సినిమా పరిభాషలో దీన్నే ‘లైన్’ అంటారు. ‘లైనేమిటి?’ అని అడగడం పరిపాటి. ఈ లైను చాంతాడంత పొడవుగా చెప్పుకొస్తూంటారు కొందరు. లైను మూడు ముక్కల్లోనే  వుంటుంది. మూడు ముక్కల్లో అయిడియా సెట్ కాలేదంటే ఆ అయిడియాతో ఏం చెప్పలనుకుంటున్నారో గందరగోళ పడుతున్నట్టే.

    లాగ్ లైన్- పైన చెప్పుకున్న ఐడియా స్ట్రక్చర్ లాంటిదే. కాకపోతే ఇలావుంటుంది- పిజ్జా బాయ్ కి డబ్బున్నోడు భారీటిప్ ఇచ్చి ట్రాప్ చేస్తే, అందులోంచి ఎలా పీక్కుని బయట పడ్డాడు పిజ్జా బాయ్?
    * ఆమీ జాక్సన్ ని ప్రేమించిన విక్రంని ఇంజెక్షన్ తో  సురేష్ గోపీ కురూపిని చేస్తే, గ్యాంగ్ తో సహా ఆ సురేష్ గోపీని భయంకరంగా తయారు చేసి వదుల్తాడు విక్రం- ‘ఐ’ లాగ్ లైన్.
   * సమంతా నాగ చైతన్యలకి నాగార్జున పుడితే, నాగార్జున శ్రియలకి నాగేశ్వర రావు పుట్టారు- ‘మనం’ లాగ్ లైన్.
   * అత్తనీ, ఆమె కూతుళ్ళనీ  తెచ్చి తాతతో కలపడానికి పవన్ కళ్యాణ్ పడే  పట్లు- ‘అత్తారింటికి దారేది’ లాగ్ లైన్.

   కథ దేని గురించో తెలియాలంటే ఐడియాకి లాగ్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి. కథ మీద ఫోకస్ కోసం ఇది ఉపయోగ పడుతుంది. ఏ క్షణంలోనూ దారితప్పకుండా తోడ్పడుతుంది.
అప్పుడు  ఐడియాని ఈ కింది విధంగా నిర్వచించ వచ్చు-
                   ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ = ఐడియా!
   ఇలా నిర్మాణాత్మకంగా ఐడియా సృష్టించుకున్నాక, తర్వాతి టూల్ సినాప్సిస్ గురించి తెలుసుకుందాం..

I could be just a writer very easily. I am not a writer. I am a screenwriter, which is half a filmmaker. … But it is not an art form, because screenplays are not works of art. They are invitations to others to collaborate on a work of art.
Paul Schrader
The difference between fiction and reality? Fiction has to make sense.   -Tom Clancy
       ***



సికిందర్