రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 5, 2023

1343 : స్పెషల్ ఆర్టికల్


  పానిండియా సినిమా అనేది ఇక అరిగిపోయిన ట్రెండ్ గా మారిపోయి, ఆస్కార్ లెవెల్ సరికొత్త నినాదంగా ముందుకు రానుందా? ఇక ఆస్కార్ అవార్డుల్ని టార్గెట్ చేస్తూ భారీ సినిమాలు నిర్మిస్తారా? నిర్మిస్తూనే ఈ మేరకు ముందే ప్రకటన కూడా చేస్తారా? తమిళంలో పా. రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న భారీ చారిత్రక ప్రతిష్టాత్మకం తంగలాన్ విషయంలో ఇదే జరుగుతోంది. ప్రస్తుతం ఇది నిర్మాణం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకి సిద్ధమవుతోంది. షూటింగు సమయంలో గాయపడిన విక్రమ్ కోలుకుని తిరిగి షూటింగులో పాల్గొన్నాడు. ఇటీవల విక్రమ్ బర్త్ డే కి విడుదల చేసిన తంగలాన్ మేకింగ్ వీడియో ఫ్యాన్స్ కి అదిరిపోయింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కెఇ జ్ఞానవేల్ రాజా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. అయితే, జ్ఞానవేల్ భాగస్వామి ధనంజయన్ 2023-24 ఆస్కార్ రేసులోకి `తంగలాన్`ని తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్టు యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం పెద్ద వార్తయింది. ఆస్కారే కాదు మరో 8 అంతర్జాతీయ అవార్డుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నట్టు ఇంటర్వ్యూ సారాంశం.

లా ప్రతిష్టాత్మక అవార్డుల కోసం సినిమా నిర్మిస్తున్నట్టు ఇంతకి ముందెవరూ ప్రకటించలేదు. కానీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రస్థానంతో తమిళ ఆత్మగౌరవం మేల్కొన్నట్టుంది...మనం కూడా  ఆస్కార్ మీద ఓ చేయేద్దామని  తంగలాన్ తలపెట్టినట్టుంది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు నిర్మించిన మణిరత్నం కూడా ఆస్కార్ కి పంపే ఆలోచన చేయలేదు. తంగలాన్ ని కోలార్ గోల్డ్ మైన్స్ (కేజీఎఫ్) లో పనిచేసే బడుగు వర్గాలు బ్రిటిష్ పాలన దౌర్జన్యాలని ఎదుర్కొనే కథాంశం తో పా. రంజిత్ రూపొందిస్తున్నాడు. ఇందులో విక్రమ్ తో బాటు పశుపతి, మాళవికా  మోహనన్, పార్వతి తిరువోతు తదితరులు నటిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాష్ కుమార్. అయితే ఇప్పుడు ప్రశ్నేమిటంటే తంగలాన్ నిజంగా ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశముందా?


ఆస్కార్ ట్విస్టు కూడా చూడాలి!

ఐతే ఇక్కడొక ట్విస్టు వుంది. 2024 నుంచి ఆస్కార్ పోటీలకి కొత్త నిబంధనలు అమల్లోకొస్తున్నాయి.  దీని ప్రకారం ఒక భారతీయ సినిమా ఆస్కార్ ఉత్తమ చలన చిత్రంగా ఎన్నటికీ నామినేట్ అయ్యే అవకాశముండదు. ప్రజాస్వామ్యంలో తక్కువ ప్రాతినిధ్యం గల జాతి, లేదా జాతి సమూహం నుంచి కనీసం ఒక ప్రధాన నటుడు / నటి వుండాలన్నది ఒక నిబంధన. కాబట్టి, భారతీయులందరినీ ఒకే గాటన కట్టి, తక్కువ ప్రాతినిధ్యం గల సమూహం' గా ఆస్కార్ అకాడమీ నిర్ణయించేంత వరకు భారతీయ సినిమాలు నామినేట్ అయ్యే అవకాశముండదు.
       
2024
ఆస్కార్ అవార్డుల వేడుకకి ఇంకా తొమ్మిది నెలల సమయం వుంది. వేడుక  వచ్చే ఏడాది మార్చి 10 న జరగనుంది. ఈ సంవత్సరం నుంచి ఆస్కార్ ఉత్తమ చలన  చిత్రం అవార్డుకి నామినేట్ కావాలంటే, ఆస్కార్‌లని నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్దేశించిన కింది నాలుగు షరతుల్లో కనీసం రెండింటిని ఒక చలన చిత్రం సంతృప్తి పరచాలి.

         
1.  
చలన చిత్రంలో తప్పనిసరిగా కనీసం ఒక ప్రధాన నటుడు / నటి లేదా ముఖ్యమైన సహాయ నటులు, తక్కువ ప్రాతినిధ్యం గల సమూహం నుంచి- అంటే మహిళలు, మైనారిటీలు, LGBTQ+ కమ్యూనిటీ, వికలాంగులుల నుంచి వుండాలి.

2.
చలనచిత్ర సృజనాత్మక బృందం తప్పనిసరిగా తక్కువ ప్రాతినిధ్యం గల  సమూహాల నుంచి వారి కనీస సంఖ్య లేదా శాతాన్ని కలిగి ఉండాలి. స్టూడియో ఫ్లోర్‌లోని సిబ్బంది నుంచి నాయకత్వ స్థానాల వరకు - నిర్మాత, దర్శకుడు, రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ మొదలైన వారంతా ఈ పరిధిలోకి వస్తారు.

3.
చలన చిత్రాన్ని పంపిణీ చేసే, లేదా ఫైనాన్సింగ్ చేసే కంపెనీ తప్పని సరిగా తక్కువ ప్రాతినిధ్యం గల సమూహాలకి చెందిన వారికి అప్రెంటిస్‌షిప్‌లు లేదా ఇంటర్న్ షిప్ చెల్లించి వుండాలి.

4.
స్టూడియో లేదా చలనచిత్ర సంస్థలు మార్కెటింగ్, ప్రచారం లేదా పంపిణీ బృందాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా మహిళల్ని, తక్కువ ప్రాతినిధ్యం గల జాతికి చెందిన వారిని, లేదా జాతి సమూహానికి చెందిన వారిని కలిగి వుండాలి.


ఇలా 4 కొత్త నిబంధనల్ని ముందుకి తెచ్చింది అకాడెమీ.
హాలీవుడ్ అలవాటుగా  దైహిక జాత్యాహంకారంతో బాధపడుతోందనే అభిప్రాయముంది. దీన్ని తొలగించడానికే ప్రధానంగా నల్ల జాతికి చెందిన వారిని దృష్టిలో వుంచుకుని ఈ కొత్త నిబంధనల్ని ప్రకటించింది అకాడెమీ. దీన్ని విదేశీ సినిమాలన్నిటికీ వర్తింప జేసింది. అయితే అకాడమీ నిర్దేశించిన కొత్త ప్రమాణాలు స్పష్టంగా దాని గత పాపాలకి ప్రాయశ్చిత్తం చేసే ప్రయత్నమని, అందుకే ఉద్యోగ రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెడుతోందనీ పరిశీలకులు చెప్తున్నారు.

కళలు ఎప్పుడూ సమాన అవకాశాల
రంగమని, వాస్తవానికి కళలు అన్యాయమైన ప్రపంచమనీ, కానీ సృజనాత్మక ఆలోచనల పరిధిని పరిమితం చేయడానికి చట్టాలు చేయడం వల్ల  అది మరింత న్యాయమై పోతుందనీ; చరిత్ర అంతా చెబుతున్నట్లుగా, కళల శ్రేష్ఠతని అరికట్టడంలో మాత్రమే నిబంధనలు విజయం సాధిస్తాయనీ చెబుతూ, ఉద్యోగ రిజర్వేషన్లని విమర్శిస్తున్నారు.

కనుక పై నిబంధనల్ని బట్టి చూస్తే
,
భారతీయులందరినీ ఒకే గాటన కట్టి, అణగారిన వర్గంగా ఆస్కార్ అకాడమీ నిర్ణయించేంత వరకు, భారతీయ సినిమాలు నామినేట్ అయ్యే అవకాశముండదని తేల్చేస్తున్నారు. తంగలాన్ సహ నిర్మాత ఇది తెలిసే ఆస్కార్ ప్రకటన చేశారో లేదో గానీ, సినిమాలో బ్రిటిష్ వారిపై పోరాడుతున్నది అణగారిన వర్గాలకి చెందిన వారుగానే కనపడుతున్నారు మరి- నటీనటుల జాతుల సంగతి పక్కన పెడితే!

ఈ నేపథ్యంలో ఇక ఆస్కార్ లెవెల్ ఆలోచనలు మానుకుని
, పానిండియా తోనే సరిపెట్టు కుంటారేమో చూడాలి!

—సికిందర్


Saturday, July 1, 2023

1342 : స్పెషల్ ఆర్టికల్


 

2023 జనవరి-జూన్ తొలి 6 మాసాల్లో తెలుగు సినిమాలు వివిధ హీరోలతో వివిధ జానర్లలో పుష్కలంగా విడుదలయ్యాయి. మాస్ యాక్షన్, స్పై, పౌరాణికం, సామాజికం, రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్, హార్రర్, అడ్వెంచర్ మొదలైన జానర్లలో ప్రేక్షకుల్ని మెప్పించడానికి, ఓటీటీల్ని ఆకర్షించడానికీ విపరీతంగా పోటీ పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచీ వూరు పేరు తెలియని కొత్త హీరోల వరకూ బాక్సాఫీసు రణరంగంలో తలబడ్డారు. చిరంజీవి, బాలకృష్ణ, ధనుష్, నాని, సాయి ధరమ్ తేజ్, ప్రియదర్శి, సుహాస్, శ్రీవిష్ణు మాత్రమే బావుటా ఎగరేసి; ప్రభాస్, రవితేజ, కళ్యాణ్ రామ్, నాగచైతన్య, అఖిల్, గోపీచంద్, నరేష్, నిఖిల్, సుధీర్ బాబు, విశ్వక్ సేన్, నాగ శౌర్య, బెల్లంకొండ గణేష్, సిద్ధార్థ్, సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరం, సమంత ప్రభృతులు సిగ్నల్స్ దించేశారు.     

        క 87 మంది కొత్త హీరోలందరూ ఫిలిం రీళ్ళ కాలపు సినిమాలతో బాక్సుల్లో చేరిపోయి డిస్పోజల్ కి సిద్ధంగా వున్నారు. ఈ ఆరు మాసాల కాలంలో రికార్డు బ్రేక్ చేస్తూ 118 సినిమాలు విడుదలయ్యాయి. సగటున నెలకి 20 సినిమాలు. వారానికి 5 సినిమాలు. ప్రతిరోజూ 0.83 సినిమా తీసి ప్రేక్షకుల చేతుల్లో పెట్టారు. 118 సినిమాల్లో ప్రముఖ హీరోలు నటించినవి 31 అయితే, కొత్త హీరోలతో తీసినవి 87. ప్రముఖ హీరోలు నటించిన 31 లో 7 మాత్రమే హిట్టయితే, 24 ఫ్లాపయ్యాయి. ఇక కొత్త హీరోల మొత్తం 87  సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాయి. విడుదలైన మొత్తం 118 సినిమాల్లో 7 మాత్రమే ప్రముఖ హీరోలవి హిట్టయితే, మిగిలిన 111 సినిమాలూ ఫ్లాపయ్యాయి. విజయాల శాతం 5.93 మాత్రమే.
        
వాల్తేరు వీరయ్య (చిరంజీవి), వీర సింహా రెడ్డి (బాలకృష్ణ), సార్ (ధనుష్), దసరా (నాని), విరూపాక్ష (సాయి ధరమ్ తేజ్), బలగం (ప్రియదర్శి), “రైటర్ పద్మభూషణ్ (సుహాస్), సామజవరగమన (శ్రీవిష్ణు) హిట్టయిన సినిమాలు.
       
ప్రముఖ హీరోల ఫ్లాపయిన సినిమాలు-
ఆదిపురుష్ (ప్రభాస్), రావణాసుర (రవితేజ), అమిగోస్ (కళ్యాణ్ రామ్), కస్టడీ (నాగచైతన్య), ఏజెంట్ (అఖిల్), రామబాణం (గోపీచంద్), ఉగ్రం (నరేష్), స్పై (నిఖిల్), హంట్ (సుధీర్ బాబు), దాస్ కా ధమ్కీ (విశ్వక్ సేన్), ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (నాగ శౌర్య), నేను స్టూడెంట్ సార్ (బెల్లంకొండ గణేష్), టక్కర్ (సిద్ధార్థ్), శ్రీదేవీ శోభన్ బాబు’, అన్నీ మంచి శకునములే (సంతోష్ శోభన్), వినరో భాగ్యము విష్ణు కథ’, మీటర్ (కిరణ్ అబ్బవరం), మళ్ళీ పెళ్ళి (నరేష్), పరేషాన్ (తిరువీర్), శాకుంతలం (సమంత) ప్రభృతులు సిగ్నల్స్ దించేశారు.
       
ఏ సంవత్సరం చూసినా అత్యధికంగా చిన్న సినిమాలే వుంటాయి. ఈ ఆరునెలల కాలంలో 87 సినిమాలతో 74 శాతం చిన్న సినిమాలు మార్కెట్ ని ఆక్రమించాయి. ఇవన్నీ చిరునామా లేకుండా పోయాయి. అయినా ఇదే సంఖ్యలో వస్తూనే వుంటాయి. ముప్పాతిక శాతం  చిన్న సినిమా  ల్ని తీసేస్తే
, పాతిక శాతం ప్రముఖ హీరోల సినిమాలతోనే మార్కెట్ నడుస్తూంటుంది. వీటిలో మళ్ళీ విజయాలు 5 శాతమే. సినిమాల నాణ్యత దగ్గర వస్తోంది సమస్య. నాణ్యత  లోపిస్తే వందల కోట్లు వెచ్చించి తీసిన ఆదిపురుష్ లాంటి పానిండియా సినిమాల్ని కూడా తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. హిట్టయితే ఎందుకు హిట్టయ్యిందో, ఫ్లాపైతే ఎందుకు ఫ్లాపయ్యిందో నాణ్యతా ప్రమాణాల మూల్యాంకన లేకపోవడం వల్ల ఈ సమస్య.
       
నెట్ ఫ్లిక్స్ యుగంలో హాలీవుడ్ స్టూడియోలు ఏ సినిమాలు నిర్మించాలి
, ఏవి నిర్మించకూడదు, నిర్మించే వాటిని ఎలా నిర్మించాలీ అనే విషయంలో నిశ్శబ్దంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) నుపయోగించుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. వాళ్ళ మార్కెట్ రీసెర్చిలు, ఆడియెన్స్ సర్వేలూ ఎలాగూ వుంటాయి. సినిమాల్ని
ఎలా పంపిణీ చేయాలీ  అనే దానిపై వ్యూహాత్మక నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో కూడా పరిశీలించ వచ్చు. స్టూడియో ఎగ్జిక్యూటివ్‌లు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించే కీలక ప్రమాణాలు నిర్దేశించి వుంటాయి.
       
తెలుగులో హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొడితేనే సరిపోదు
, వాళ్ళ వ్యాపార మోడల్ ని కూడా కాపీ కొడితేనే ఏవైనా ఫలితాలు వస్తాయి. వ్యాపార మోడల్ సినిమాలు తీయడానికి అవసరమైన క్రియేటివ్ మోడల్స్ తో ముడిపడి వుంటుంది. ఈ రెండు మోడల్స్ లేక ఏ మోడల్లో తెలుగు సినిమాలు తీసినా విజయాల శాతం పెరిగే అవకాశం లేదు. ఈ డిజిటల్ యుగంలో ఫిలిం రీళ్ళ నాటి సినిమాలే మార్కెట్లోకి ఇలాగే వస్తూంటాయి.
—సికిందర్

 

Friday, June 30, 2023

1341 : రివ్యూ!


 

రచన-దర్శకత్వం : రామ్ అబ్బరాజు
తారాగణం : శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్,  వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు తదితరులు
సంగీతం : గోపీసుందర్, ఛాయాగ్రహణం : రామ్ రెడ్డి
సమర్పణ : అనిల్ సుంకర, సహ నిర్మాత : బాలాజీ గుత్తా, నిర్మాత : రాజేష్ దండ
విడుదల : జూన్ 29, 2023
***

        శ్రీవిష్ణు గత నాల్గేళ్ళలో బ్రోచేవారెవరురా’, రాజరాజ చోర తప్పితే, నటించిన మిగతా ఐదు సినిమాలతో ఫ్లాపు లెదుర్కొని, ప్రస్తుతం మరో తన లెవెల్ కామెడీతో వచ్చాడు. సామజవరగమన అనే ఈ కామెడీకి వివాహభోజనంబు తీసిన రామ్ అబ్బరాజు దర్శకుడు. ప్యూర్ కామెడీ సినిమాలు కరువైపోయిన ఈ రోజుల్లో, ఆరోగ్యకర హాస్యంతో ఓ సినిమా తీయడమే కాదు, దాన్ని సక్సెస్ చేయడం కష్టమైన పనే. ఈ పనిని  ఎలా సాధించారో చూద్దాం...

కథ

బాలు (శ్రీవిష్ణు) మల్టీప్లెక్స్ లో బుకింగ్ క్లర్క్ గా వుంటాడు. ఇంటిదగ్గర తల్లిదండ్రులుంటారు. తండ్రి ఉమామహేశ్వరరావు (నరేష్) కి విచిత్ర సమస్య వుంటుంది. అతను డిగ్రీ పాసైతేనే కోట్ల రూపాయల ఆస్తి అతడికి చెందేలా వీలునామా రాశాడు తండ్రి. దీంతో 30 ఏళ్ళుగా డిగ్రీ పాసయ్యేందుకు పరీక్షలు రాస్తూనే వుంటాడు ఉమామహేశ్వరరావు. తండ్రి చేత పదేపదే పరీక్షలు రాయిస్తూ విసిగిపోతాడు బాలు. బాలు గతంలో ప్రేమలో దెబ్బతిని వుంటాడు. దాంతో ఏ అమ్మాయి లవ్యూ చెప్పినా చిర్రెత్తుకొచ్చి రాఖీ కట్టించుకుంటాడు. ఒక పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికొచ్చిన సరయూ (రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం పెరిగి బాలు ఇంట్లో పేయింగ్ గెస్టుగా దిగుతుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. పడ్డాక సరయూ తనకి చెల్లెలి వరస అని తెలుస్తుంది.
       
ఇప్పుడేం చేశాడు బాలు
? ప్రేమలో ఈ చిక్కు ఎలా వీడింది? తండ్రి డిగ్రీ పాసై ఆస్తికి వారసుడయ్యాడా? ఈ ప్రశ్నలతో మిగతా కథ కొనసాగుతుంది.

ఎలావుంది కథ

2021 లో తమిళంలో సంతానం నటించిన కామెడీ పారిస్ జైరాజ్ విడుదలైంది. అందులో సంతానంకి ప్రేమిస్తున్న హీరోయిన్ చెల్లెలి వరస అని తెలుస్తుంది. ఇదే పాయింటు సామజవరగమన లో వుంది. ఈ పాయింటులో చాలా పూర్వం కె బాలచందర్ తీసిన అపూర్వ రాగంగళ్ (తెలుగులో దాసరి నారాయణ రావు తూర్పు పడమర’) హిట్టయ్యింది. అయితే ఇది సీరియస్ కథ. సామజవరగమన లో కామెడీ కథ. ఈ కథతో సంబంధం లేకుండా టైటిల్ పెట్టారు. శంకరాభరణం లో రాజ్యలక్ష్మి ప్రేమిస్తున్న చంద్రమోహన్ తో సామజవరగమన పాట పాడుకుంటూ వుంటే, తండ్రి శంకర శాస్త్రికి దొరికిపోయి - శారదా!- అని అతను గద్దించే ఐకానిక్ సీనుని సెటైర్ గా వాడుకుని టైటిల్ కి న్యాయం చేసి వుండొచ్చు.
       
ఇంటర్వెల్ సీనులో ఓ పెళ్ళిలో శ్రీవిష్ణుకి కమెడియన్ ఫ్రెండ్ సుదర్శన్
, హీరోయిన్ రెబా ని చూపించి, ఆమె నీ చెల్లెలి వరస అవుతుందని చెప్పే సాదాగా అన్పించే ట్విస్టుని, పైన చెప్పిన శంకరాభరణం సీనుతో సెటైర్ చేసి వుండాల్సింది. శ్రీవిష్ణు -రెబాల మీద సామజవరగమన పాట క్రియేట్ చేసి మధ్యలో సుదర్శన్ చేత -ఆమె నీ చెల్లెలురా- అని అరిపించి వుంటే ట్విస్టు చాలా హాస్యభరితంగానూ వుండేది.
       
ఇప్పుడు తెలుగులో జంధ్యాల
, వంశీ, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి ఫక్తు కామెడీలు తీసే దర్శకులు కరువై పోయారు. రోమాంటిక్ కామెడీలు తీసినా ఫస్టాఫ్ నవ్వించి సెకండాఫ్ ఏడ్పించే సినిమాలే తీస్తారు. ప్రస్తుత కామెడీలో ప్రేమకి బ్రేకు పడ్డా, సెకాండాఫ్ కామెడీగానే సాగడంతో ఇది పై దర్శకుల ధోరణిలో ఫక్తు కామెడీ సినిమా అన్పించుకునేలా వుంది.
       
ఈ కామెడీకి చెల్లెలి వరస అనే సంఘర్షణ
, తండ్రి పరీక్షలు రాసే సబ్ ప్లాట్ తో బాటు, హీరో అమ్మాయిల చేత రాఖీలు కట్టించుకునే -మూడూ ఆసక్తిని పెంచే యాంటీ ప్లాట్ కథనాలు తోడ్పడ్డాయి. దీంతో బాటు వదలకుండా ఫన్నీ డైలాగులు, సిట్యుయేషనల్ కామెడీలూ- కథకి బలాన్నిచ్చాయి. రొటీన్ గా సినిమాల్లో అవారాగా తిరిగే కొడుకుని చదువుకోమని తిట్టే తండ్రి వుంటాడు. ఈ పాత ఫార్ములాని ఇక్కడ రివర్స్ చేశారు- కొడుకే తండ్రిని చదువుకోమని తిట్టే ట్రాక్.
       
ఇంకా ప్రధాన కథ లవ్ ట్రాక్ ని  ఎక్కడా బరువెక్కించకుండా చివరి వరకూ కామెడీతోనే నవ్వించేలా క్రియేట్ చేయడం వినోదాత్మక విలువల్ని పెంచింది. మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ధరల గురించి జోకులు
, ఏషియన్- పీవీఆర్ మల్టీప్లెక్సుల మీద సెటైర్లు, సెకండాఫ్ లో కులశేఖర్ పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ, నరేష్ తో ఒక సినిమా స్పూఫ్ మొదలైనవి దర్శకుడి క్రియేటివిటీకి అద్దంపట్టేలా వున్నాయి.
        
అయితే అక్కడక్కడా ద్వంద్వార్ధాలు ప్రయోగించడం క్లీన్ ఎంటర్ టైనర్ కి సెట్ కాలేదు. కథలో లాజిక్కులు వుండవు. కామెడీతో లాగించడమే వుంది. అయితే సెకండాఫ్ లో కొన్ని చోట్ల కథ ముందుకు కదలదు. బోరు కొట్టేలా దృశ్యాలుంటాయి. ఇక చెల్లెలి వరస సమస్యకి పరిష్కారం పైన చెప్పిన తమిళ సినిమాలోనిదే- ప్రేక్షకులు వూహించుకో గలదే.
        
కామెడీకి నటీనటుల టైమింగ్ కూడా బాగా వుండేలా చూసుకుంటూ –ఒక పూర్తి నిడివి కామెడీ సినిమాని సక్సెస్ దిశగా నడిపాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఇంకా ఇలాటివే సినిమాలు తీస్తూ హాస్య దర్శకులు లేని లోటు తీరిస్తే బావుంటుంది.

నటనలు- సాంకేతికాలు

మధ్య తరగతి యువకుడి పాత్రలో చుట్టూ సమస్యలు సృష్టించుకుని యాతన పడే ఫన్నీ క్యారక్టర్ గా శ్రీవిష్ణు నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. యూత్ లో మరింత క్రేజ్ ని పెంచుకునేలా కృషి చేశాడు. తండ్రి పాత్రలో నరేష్ తో కామిక్ బాండింగ్ బాగా కుదిరింది. భయపెట్టి మరీ రాఖీలు కట్టించుకునే సీన్స్ ని కూడా ఎలివేట్ చేశాడు. లాజిక్ చూడని కమర్షియల్ లవర్ గా హీరోయిన్ రెబాతో రోమాన్స్ ని కూడా పండించాడు. చాలా కాలానికి ఒక హిట్ ని సాధించాడు.
       
హీరోయిన్ రెబా కామిక్ టైమింగ్ తో చెప్పే డైలాగులు
, నటన, ఆమె పాత్ర బ్యాక్ గ్రౌండ్, ఆమె తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ తో సీన్లూ వగైరా బాగా పోషించింది. పరీక్షలు రాసే కామెడీ సీన్లతో నరేష్ పాత్ర సినిమాకి ఓ మూల స్తంభం. ఇక మిగిలిన అన్ని పాత్రల్లో అందరూ కామెడీ పల్లకీని తేలిగ్గా మోసేశారు.
       
గోపీసుందర్ సంగీతంలో ఒక పాటే బావుంది. మిగిలిన పాటలు కామిక్ ఫ్లోకి అడ్డుపడే క్వాలిటీతో వున్నాయి. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం ఉన్నతంగా వుంది కలర్ఫుల్ విజువల్స్ తో. మిగతా సాంకేతిక హంగులు ఫర్వాలేదు. పూర్తి నిడివి కామెడీని నిలబెట్టాలంటే దర్శకత్వ ప్రతిభ కంటే ముందు
, సృజనాత్మక రచన ముఖ్యమని తేల్చి చెప్పే ఈ ఫ్యామ్ –కామ్ (ఫ్యామిలీ కామెడీ) హిట్లు లేని శ్రీవిష్ణుని పై మెట్టు పైకెక్కించింది...

—సికిందర్
 

Thursday, June 29, 2023

1340 : రివ్యూ!

 


దర్శకత్వం : గ్యారీ బిహెచ్
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఈశ్వర్యా మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, ఆర్యన్ రాజేష్, నితిన్ మెహతా, జిష్షూ సేన్ గుప్తా తదితరులు
కథ : కె రాజశేఖర్ రెడ్డి, రచన :  అనిరుద్ధ కృష్ణమూర్తి, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, నేపథ్య సంగీతం : శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
బ్యానర్ : ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : కె రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి
విడుదల : జూన్ 29, 2023
***
        కార్తికేయ 2’ పానిండియా విజయంతో మరో పానిండియా స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నిఖిల్. అంతర్జాతీయ గూఢచార కార్యకలాపాల చిత్రీకరణకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ బాబీని కలుపుకుని దర్శకుడు గ్యారీ బిహెచ్ తో ఈ పానిండియా ప్రయత్నం చేశాడు.  దర్శకుడు గ్యారీ టాలీవుడ్ లో ఎడిటర్ గా పరిచితుడే. క్షణం, 'గూచారి,' 'హిట్: ది ఫస్ట్ కేస్,'  'హిట్: ది సెకండ్ కేస్' సినిమాలకి పనిచేశాడు.  తెలుగుతో బాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నేడు విడుదలైంది.  అయితే ఈ మూవీలో ప్రధానంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించి ఒక రహస్యం వెల్లడిస్తున్నామని ప్రచారం చేశారు. ఆ రహస్యమేమిటో తెలుసుకుందాం...

కథ

జై (నిఖిల్)  రా ఏజెంట్. శ్రీలంకలో వుంటాడు. ఐదేళ్ళ క్రితం చనిపోయాడను కుంటున్న పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాది ఖదీర్ ఖాన్ (నితిన్ మెహతా) బతికే వున్నాడని రా చీఫ్ (మకరంద్ దేశ్ పాండే) కి తెలుస్తుంది. అతను, పాకిస్తాన్ కి చెందిన సైంటిస్టు అబ్దుల్ రెహ్మాన్ (జిష్షూ సేన్ గుప్తా) కలిసి ఇండియా మీద పెద్ద కుట్రకి పథకం వేస్తున్నారని కూడా తెలుసుకుంటాడు. దీంతో ఖదీర్ ఖాన్ ని పట్టుకుని ఈ కుట్రని భగ్నం చేయమని జైని రా చీఫ్ ఆదేశిస్తాడు.
       
జైతో బాటు సహ ఏజెంట్లు వైష్ణవి (ఐశ్వర్యా మీనన్)
, కమల్ (అభినవ్ గోమఠం) ఆపరేషన్ చేపడతారు, గతంలో రా ఏజెంట్ గానే వున్న జై అన్న సుభాష్ (ఆర్యన్ రాజేష్) హత్యకి గురయ్యాడు. ఎవరు హత్య చేశారో తెలుసుకునే వ్యక్తిగత బాధ్యత కూడా జై కుంటుంది. ఇంతలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి చెందిన డీ క్లాసిఫై చేసిన ఫైలు ఖదీర్ ఖాన్ చేజిక్కించు కున్నాడని తెలుస్తుంది.   
       
ఈ ఫైలుతో ఏం చేయదల్చుకున్నాడు ఖదీర్ ఖాన్
? ఆ ఫైల్లో వున్న రహస్య మేమిటి? అన్న హత్య, ఇండియా మీద ఖదీర్ ఖాన్ కుట్ర, ఖదీర్ తస్కరించిన నేతాజీ ఫైలు- ఈ సమస్యలన్నిటినీ  జై ఎలా పరిష్కరించి దేశాన్ని కాపాడాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
దీన్ని పానిండియా సినిమాగా తలపెట్టారు కాబట్టి నార్త్ ప్రేక్షకుల కోసం సుభాష్ చంద్రబోస్ రహస్యం గురించిన కథ కలిపే ప్రయత్నం చేశారని అర్ధమవుతోంది. అయితే ఆ రహస్య మేమిటో చెప్పకుండానే ముగించారు. అసలు కథకి సుభాష్ చంద్ర బోస్ ఫైలుతో  సంబంధం కూడా లేదు. కేవలం ప్రేక్షకుల్ని మభ్యపెట్టడానికే సుభాష్ చంద్రబోస్ ని వాడుకున్నారని స్పష్టమైపోతుంది.  

రహస్య మేంటో చెప్పలేకపోయారుగానీ
, దేశ స్వాతంత్ర్యం గురించి బోస్ కి ముడిపెట్టి కొత్త థియరీ చెప్పారు. స్వాతంత్ర్యం గాంధీ అహింసావాదం వల్ల రాలేదనీ, బోస్ హింసాత్మక మార్గం వల్లే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చారనీ చెప్పుకొచ్చారు.  స్వాతంత్ర్యం సాధించిన ఘనత గాంధీ, నెహ్రూలు తప్పుడుగా పొందారనీ చెప్పారు. ఇది ప్రేక్షక బాహుళ్యంలోకి వెళ్ళలేదు.
        
కార్తికేయ 2 తోనే నార్త్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నిఖిల్, ఆ ఉత్సాహంతో  స్పై ని ప్రాపగాండా సినిమాగా తీసినట్టుగా కూడా అర్ధమైపోతుంది. నిర్మాతలు ఇంకో వారం తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేస్తే, పట్టుబట్టి 29 వ తేదీనే నిఖిల్ విడుదల చేయించడంలో ఉద్దేశమిదే అన్పించక మానదు. టెర్రరిస్టులు, దేశం మీద కుట్ర, వాళ్ళని కాల్చి చంపడం ఈ రోజు చూపిస్తేనే కిక్ వస్తుంది. అయితే సినిమాలోనే ఒక డైలాగు వున్నట్టు- అతి తెలివిని వాడుకోవడం వల్ల కథ కాని సుభాష్ చంద్ర బోస్ ఫైలు కథతో ప్రాపగాండా సినిమా ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది.
       
ఓ రెగ్యులర్ సినిమా కథగా చూసినా పాయింటు మీద పాయింట్లు ఇందులో కుమ్మారు. అన్న హత్య
, ఉగ్రవాది కుట్ర, బోస్ ఫైలు - ఇలా విడివిడి పాయింట్లు జొప్పించడంతో ఏ పాయింటు మీద కూడా కథ కాకుండా పోయింది. ఏదో ఒక పాయింటు మీద కథ చెప్పాల్సింది మూడు పాయింట్లు కుమ్మడంతో, దేంతోనూ భావోద్వేగాలు, థ్రిల్, సస్పెన్స్, ట్విస్టులు అన్నవి లేకుండా పోయాయి.
       
ఇక స్పై జానర్ కథా మర్యాదలైతే శూన్యం
, పాత్రచిత్రణలతో సహా.  మరి బాగున్నదేమిటి? యాక్షన్ సీన్స్, ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం. పరిమిత బడ్జెట్ తోనైనా ప్రొడక్షన్ విలువలు బావుండడం.

నటనలు- సాంకేతికాలు

స్పై అనగానే ఒక రూపం కళ్ళ ముందు మెదుల్తుంది. స్టయిలిష్ లుక్, చుట్టూ అమ్మాయిలు, కాస్త రోమాన్స్, ఫన్, ఎక్కువ అడ్వెంచర్స్ చేసే వాడుగా కన్పిస్తాడు. దేశంకోసం పోరాడతాడు కాబట్టి గౌరవ భావం కూడా ప్రేక్షకుల్లో సృష్టించుకుంటాడు. ప్రపంచ సమస్యే తన సమస్యగా వుంటాడు కాబట్టి, రక్త సంబంధాలు, కుటుంబ జీవితమూ లేని ఒంటరిగా సానుభూతి కూడా పొందుతాడు. ఈ స్పై జానర్ మర్యాదలన్నిటినీ తీసి అవతలబెట్టి ఓ రెగ్యులర్ తెలుగు సినిమా యూత్ లా నిఖిల్ ని చూపెట్టారు. ఇది చాలా అన్యాయం.
       
నిఖిల్ ఎక్కడా ఒక స్పై లాగే అన్పించడు. ఓ కామన్ యూత్ లా అన్న హత్యకి రివెంజితో ఎమోషనల్ అవుదామంటే
, ఉగ్రవాదిని పట్టుకునే బాధ్యత, దేశ భక్తితో ఉగ్రవాదిని పట్టుకుందా మంటే, మధ్యలో ఆకస్మాత్తుగా బోస్ ఫైలు కోసం వెదుకులాట. ఇలా అపరిచితుడు టైపులో ఇన్ని రకాలుగా నటిద్దామన్నా, ఒకదాంతో ఒకటి సంబంధం లేని కథా కథనాలతో ఏదీ నిలబెట్టుకో లేకపోయాడు.
       
మిగిలిన అన్ని పాత్రల్లో కూడా అందరూ కృత్రిమంగానే కనిపిస్తారు. హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ నిఖిల్ కంటే ఎక్కువ యాక్టివ్ గా వున్నా
, పాత్ర చిన్నదే. ఇంకో ఏజెంట్ గా అభినవ్ గోమఠం కామెడీ డైలాగులకి పరిమిత మయ్యాడు. ఈ పాత్ర ఏజెంట్ కి తక్కువ, కమెడియన్ కి ఎక్కువగా వుంటుంది. అయితే ఇతడి డైలాగులే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసే పరిస్థితి  వుంది. ఇక విలన్లు నితిన్ మెహతా,
జిష్షూ సేన్ గుప్తా రెంగ్యులర్ విలన్లుగానే నటించారు.
       
చాలా దేశాల్లో లొకేషన్స్ చూపించారు- శ్రీలంక
, జోర్డాన్, న్యూయార్క్ సహా. వీటి చిత్రీకరణ బావుంది. మంచు పర్వతాల్లో, రిసార్ట్స్ లో సీన్లు కూడా బావున్నాయి. వర్షపు రాత్రి పోరాట దృశ్యాలు కూడా బావున్నాయి. క్లయిమాక్స్ కూడా ఓకే. ఈ సినిమాకి కథతో దర్శకుడు పడిన కష్టం కన్నా పోరాటాలతో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ బాబీ పడ్డ శ్రమ ఎక్కువ. ఇక వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ల ఛాయాగ్రహణం స్పై మూవీకి తగ్గట్టు రిచ్ గా వుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం లో పాటలు చూశాక గుర్తుండవు. కానీ శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గది.

చివరికేమిటి

ఇది స్పై మూవీగా తప్ప రివెంజీ మూవీగా, టెర్రరిజం యాక్షన్ మూవీగా, హిస్టారికల్ మూవీగా రకరకాలుగా కన్పిస్తుంది ఈ స్పై’. మూడు విడివిడి అంశాలతో కథ చేసినా మూడిటినీ కలిపి ఒక కథగా కలపలేక పోయారు. అన్న హత్య పూర్వ కథని ది మాగ్నిఫిషెంట్ సెవెన్ లోలాగా చివర్లో షాకింగ్ గా రివీల్ చేసి, హీరో  అన్న హత్యకి పగదీర్చుకోవడంగా అప్పుడు చూపించి వుంటే చాలా ఎమోషనల్ గా వుండేది. కథకి కూడా అడ్డుపడేది కాదు.
       
ఉగ్రవాదిని పట్టుకోవడం గురించి కథ ప్రారంభించి
, ఇంటర్వెల్ కి ముందు సుభాస్ చంద్రబోస్ ఫైలు తస్కరించాడని విడిగా చెప్పకుండా, కథా ప్రారంభమే ఫైలు తీసుకుని పారిపోయిన కథగా చూపించి వుంటే- అతుకుడు కథగా వుండేది కాదు.
       
ఆ ఫైలులో రహస్యమేమిటన్నది- తెలియకపోయినా- హిచ్ కాక్ ప్రయోగించే మెక్ గఫిన్ చిట్కాతో చూపించి వుంటే సరిపోయేది. క్వెంటిన్ టరాంటినో తీసిన
పల్ప్ ఫిక్షన్ లో ఒక బ్రీఫ్ కేసు గురించి ముఠాల మధ్య కథ. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో దర్శకుడు చెప్పడు.  చివరికి హీరో దాన్ని చేజిక్కించుకుని ఓపెన్ చేస్తే- అందులో ఏముందో కూడా దర్శకుడు చూపించడు. అందులోంచి వచ్చే మిలమిల మెరిసే మెరుపుతో హీరో మొహం వెలిగిపోవడాన్ని చూపిస్తాడు. చూపిస్తే ఏం చూపించాలి- డ్రగ్సో, వజ్రాలో చూపించాలి. ఇది రొటీనే. అందుకని చూపించకుండా సస్పెన్సు పెంచుతూ ప్రేక్షకుల వూహకి  వదిలేశాడు.
       
సుభాష్ చంద్ర బోస్  రహస్యంతో కూడా ఇలాగే చేయొచ్చు. పోతే
, కథనం బలహీన పడడానికి ముఖ్య కారణం ఉగ్రవాది విలన్ తెరమరుగున వుండడం. అంటే తెర మీద హీరో విలన్ల ప్రత్యక్ష పోరాటం లేకపోవడం. హీరో నిఖిల్, విలన్ని వెతికే ఏక పక్ష కథనంతో సరైన యాక్షన్ లేకుండా పోయింది.
       
నిఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ స్పై మూవీ
, స్టోరీ డిపార్ట్ మెంట్లో తగిన రీసెర్చి, ప్రొఫెషనలిజం లేకపోవడం వలన 29 వ తేదీ అతడి మనోకామనకి దూరంగా వుండిపోయింది.
—సికిందర్

 


1349 : స్పెషల్ ఆర్టికల్


 
        దిపురుష్ మీద చెలరేగుతున్న వివాదాల మంటలు  ది కేరళ స్టోరీ ని కబళిస్తున్నట్టుంది. మే 5న విడుదలై రూ. 30 కోట్ల బడ్జెట్ కి రూ 303 కోట్ల బాక్సాఫీసుతో సంచలన విజయం సాధించిన ది కేరళ స్టోరీ ఓటీటీ విడుదల తేదీ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. చాలా పోటీ, డిమాండ్ వున్నట్టు మీడియాలో రాశారు. అంతే కాదు, దీని ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం జీ5 కొనుగోలు చేసినట్టు, జూన్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టూ వార్తలు కూడా వచ్చాయి. అయితే నిర్మాతలు ఓటీటీ  విడుదలపై అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. 'ది కేరళ స్టోరీ' సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన  దాదాపు నెల తర్వాత ఓటీటీలో విడుదల కానుందని వార్తలు మాత్రం బాగానే వ్యాపించాయి. జూన్ మూడవ వారంలో స్ట్రీమింగ్ జరగనుందని కూడా మే నెలాఖరున తాజా అప్డేట్స్ వచ్చాయి. తర్వాత నిశ్శబ్దం నెలకొంది.

          ఎందుకీ నిశ్శబ్దమని సీనియర్ బాలీవుడ్ జర్నలిస్టు సుభాష్ కె. ఝా కూపీ లాగితే, షాకింగ్ విషయాలు తెలిశాయి. ది కేరళ స్టోరీ  త్వరలో స్ట్రీమింగ్ అవుతుందని రిపోర్టులు చదివిన తర్వాత ఝా, దర్శకుడు సుదీప్తో సేన్ ని అడిగినప్పుడు, ది కేరళ స్టోరీ కోసం తమకు ఇంకా ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచీ  తగిన ఆఫర్ రాలేదని చెప్పాడు. మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని చెప్పాడు. తాము ఇంకా ఏదైనా ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి మెరుగైన డీల్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. అంతేకాదు, ఒక తీవ్ర ఆరోపణ చేశాడు. తమని శిక్షించేందుకు బాలీవుడ్ లోని కొన్ని వర్గాలు ఏకమైనట్టు కనిపిస్తోందన్నాడు.
       
దేనికి
శిక్ష?- అంటే, మా బాక్సాఫీసు విజయం బాలీవుడ్ లోని అనేక వర్గాల్ని కలవరపరిచింది. మా విజయం చూసి ఓర్వలేక శిక్షించడానికి బాలీవుడ్ లోని కొన్ని వర్గాలు  ఏకమయ్యాయని మేము భావిస్తున్నాం అని వివరణ ఇచ్చాడు. ఆ వర్గాలు ఏవో చెప్పడానికి నిరాకరించాడు.
       
జర్నలిస్టు ఝా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్
ఫామ్ ని సంప్రదిస్తే, మేము రాజకీయంగా వివాదాస్పదంగా మారిన సినిమాల జోలికి పోదల్చుకోలేదు అని సమాధానం వచ్చింది. బాలీవుడ్ వర్గాల అభిప్రాయం కోరితే, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఒక వర్గానికి వ్యతిరేకంగా తీసిన సినిమాని ప్రసారం చేసి, ఆ వర్గాన్ని దూరం చేసుకోదనీ చెప్పారు.
       
ఓటీటీ ఛానెల్
లు మరింత తెలివైన, ఆలోచింపజేసే, వినోదాత్మక కంటెంట్ వున్న సినిమాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు, ది కేరళ స్టోరీ లాంటి  ప్రాపగాండా సినిమాకి పల్లకీ మోయవని, దీన్ని అర్ధం జేసుకోవాలనీ చెప్పారు.
       
ఈ నేపథ్యంలో మతపరంగా ప్రజల మనోభావాల్ని తీవ్రంగా గాయపర్చి ఫ్లాపైన
ఆదిపురుష్ నెగెటివ్ ప్రబావం ఓటీటీలపై పడదని చెప్పలేం. ఆదిపురుష్ కూడా ప్రాపగాండా సినిమాగా ప్రచారమై పోయింది. దీని వివాదాల తీరు చూసి ఓటీటీలు ది కేరళ స్టోరీకి ఇక దూరంగా వుండే అవకాశం లేకపోలేదు. అయితే భారీ చందాదారుల సంఖ్యగల దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దీనికి దూరంగా వుండే పక్షంలో చిన్న కంపెనీలు ముందుకు రావచ్చు. అలాంటప్పుడు నిర్మాతలు మెరుగైన డీల్ ని ఆశించక రాజీపడక తప్పదు.
       
అసలు
ది కేరళ స్టోరీ జీ5 ఓటీటీ ద్వారా విడుదలవుతుందని వచ్చిన ప్రారంభ వార్తలు సైతం నిజం కావని సినిమా దర్శకుడు కొట్టి వేయడంలో కూడా ఒక ప్రశ్న ఎదురవుతోంది- కేంద్రంలో అధికార  పార్టీకి సన్నిహితుడైన జీ5 అధిపతి ది కేరళ స్టోరీ ని స్ట్రీమింగ్ చేయడంలో అభ్యంతర మేముంటుంది?
       
ఇక
ది కేరళ స్టోరీ ని ఓటీటీలు నిరాకరించడానికి పైన చెప్పిన కారణాలే నిజమైతే, ఆదిపురుష్ సంగతేమిటి? ది కేరళ స్టోరీ ఓటీటీ విడుదలపై ఏవైనా ఆశలు మిగిలుంటే వాటికి ఆదిపురుష్ చెక్ పెట్టేసిందన్న అభిప్రాయాలూ కూడా వున్నాయి. మరి అలాటి ఆదిపురుష్ ని ఓటీటీలు ముట్టుకుంటాయా? ఆదిపురుష్ సినిమా విడుదలైన వారమంతా సినిమా థియేట్రికల్ బిజినెస్ కి స్పేస్ నివ్వకుండా ఓటీటీ విడుదల గురించి అప్పుడే మీడియాలో అసంఖ్యాకంగా వార్తలు గుప్పించారు, ఓటీటీ విడుదల తేదీ కూడా ఇచ్చేశారు. సినిమా బాక్సాఫీసు కలెక్షన్స్ ని దెబ్బతీసే ఇలాటి వార్తలు మంచివేనా? రూ. 250 కోట్లకి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుందనీ, నెట్ ఫ్లిక్స్ కాదు అమెజాన్ సొంతం చేసుకుందనీ, ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో ప్రసారమవుతుందనీ రకరకాలుగా స్థానిక, జాతీయ మీడియాలు హోరెత్తించాయి. శుభమా అని ప్రేక్షకులకోసం థియేటర్లలో సినిమా విడుదలైతే, థియేటర్లో ఆడుతున్న సినిమాకి ప్రచారం చేయకుండా, ప్రేక్షకుల్ని థియేటర్లకి రాకుండా చేసే ఓటీటీలకి ప్రచారం చేయడమేమిటో వాళ్ళకే తెలియాలి. ప్రతీ సినిమాకీ ఇదే తంతు చూడొచ్చు.
       
అయితే చుట్టుముట్టిన ఇన్ని వివాదాల మధ్య ఇప్పుడు
ఆదిపురుష్ ఓటీటీ వ్యవహారమేమిటో ఇంకా బయటికి రావడం లేదు. కానీ ఆదిపురుష్ ప్రాపగాండా సినిమా దెబ్బతో రానున్న ప్రాపగాండా సినిమాలకీ గండం తప్పదేమో? మరో రెండు ప్రాపగాండా సినిమాలు జులైలో రాబోతున్నాయి- 72 హూరే’, ఆజ్మీర్ 92’. మొదటిది జులై 7 విడుదల, రెండోది జులై 14 విడుదల. ’72 హూరే (72 మంది అందమైన కన్యలు) అనేది టెర్రరిస్టు నాయకులు అమాయక యువకుల్ని ఆత్మాహుతి దళాలుగా మార్చడానికి వేసే ఎర. ఆత్మహుతి దాడికి పాల్పడితే స్వర్గంలో  72 అందమైన కన్యలతో సుఖ భోగాలు లభిస్తాయని నమ్మిస్తూ టెర్రరిస్టులుగా మార్చేస్తారు. ఈ అంశాన్ని తీసుకుని మరో ప్రాపగాండా సినిమాగా తీశారు. దీనికి సెన్సార్ బోర్డు నిన్న టీజర్ కి అనుమతి నిరాకరించింది. ఇదివరకు సినిమాకి అనుమతి నిచ్చి ఇప్పుడు టీజర్ కి అనుమతి నిరాకరించడం- ఆదిపురుష్ ఎఫక్ట్ వల్ల కావచ్చు. నిన్న ఉత్తరప్రదేశ్ హైకోర్టు కూడా ఆదిపురుష్ పై తీర్పు చెబుతూ, ఖురాన్, బైబిల్ లపై కూడా సినిమాలు తీయరాదని స్పష్టం చేసింది.
       
ఇక
ఆజ్మీర్ 92 నిజంగా జరిగిన కేసు. 1992 లో రాజస్థాన్
లోని అజ్మీర్లో దాదాపు 250 మందికి పైగా ముస్లిమేతరులపై  కొందరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారాలకి, బ్లాక్మెయిలింగ్ కీ పాల్పడిన సంచలన కేసుని తీసుకుని మరింకో ప్రాపగాండా సినిమాగా తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొన్న  ఆదిపురుష్ ప్రాపగాండా సినిమా నేపథ్యంలో- ఈ రెండిటి బాక్సాఫీసు, ఓటీటీ వ్యాపారాలెలా వుంటాయన్నది వచ్చే నెల చూడాల్సిందే. అసలు టెర్రరిజం ఎందుకు పుట్టిందీ, మూల కారకులెవరూ అన్నదానిపై కూడా సినిమా తీస్తే ప్రాపగాండా సినిమాలకి ఒక పరిపూర్ణత వస్తుంది.

—సికిందర్