రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 19, 2023

1307 : రివ్యూ!


రచన - దర్శకత్వం : వెంకీ అట్లూరి
తారాగణం : ధనుష్, సంయుక్తా మీనన్, సుమంత్, సముద్రని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : జె యువరాజ్
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్
నిర్మాతలు : నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
విడుదల : ఫిబ్రవరి 17, 2023
***
        వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ తో సార్ తెలుగు- తమిళ ద్విభాషా చలన చిత్రంగా మన ముందుకొచ్చింది. తమిళ టైటిల్ వాతి (వాది).  తెలుగులో ధనుష్ కిది మొదటి సినిమా. ధనుష్ కి హిందీలో మార్కెట్ వున్నా హిందీలో విడుదల చేయలేదు. వెంకీ అట్లూరి 2021 లో నితిన్ తో రంగ్ దే తీశాడు గానీ అది హిట్ కి చాల్లేదు. 2019 లో అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్నూ తీసినా అంతే. 2018 లో తొలి సినిమాగా  వరుణ్ తేజ్ తో తొలిప్రేమ మాత్రమే హిట్టు. ఇప్పుడు ధనుష్ తో ఇంకో ప్రేమకథ కాకుండా సామాజిక సినిమా తీశాడు. దీంతో ఒక సందేశమివ్వదలిచాడు. ఈ సందేశమేమిటి, ఇది ఏ కాలానికి సంబంధించింది, దీనికి మార్కెట్ యాస్పెక్ట్ ఎంతవరకుందీ... మొదలైనవిషయాల్ని విపులంగా పరిశీలిద్దాం...

కథ 
1991 లో ఆర్ధిక సరళీకరణ చేపట్టి 32 ఏళ్ళు దాటాయి. ఈ సరళీకరణలో భాగంగా వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్ని ప్రైవటీకరణ చేయడంతో ఇంటర్ ప్రైవేటు కాలేజీలు జోరుగా పుట్టుకొచ్చి ర్యాంకుల పరుగులో ప్రభుత్వ జ్యూనియర్ కాలేజీలు మూతబడే స్థితికొచ్చాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకి ఇంటర్ విద్య దూరమైంది. దీంతో 1999 లో ఒక కార్పొరేట్ కాలేజీ అధిపతి త్రిపాఠీ (సముద్రకని) ప్రభుత్వ జ్యూనియర్ కాలేజీల్ని చేపట్టి బాధిత వర్గాల్ని చదివిస్తానని ప్రతిపాదన చేస్తాడు. దీనికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో మూతబడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్ని తెరిచి, తన కాలేజీల్లో ప్రతిభలేని లెక్చరర్లని అక్కడికి పంపిస్తాడు. ఆ లెక్చరర్లతో ఆ విద్యార్థులు ఫెయిలవుతూంటే, కాలేజీల్ని మూయించేసి పేద, మధ్య తరగతి విద్యార్ధులు ఇక విధిలేక అప్పులు చేసి తన కార్పొరేట్ కాలేజీల్లో చేరేలా పన్నాగం పన్నుతాడు.
        
ఈ పన్నాగం తెలియని బాలు అలియాస్ బాలగంగాధర తిలక్ (ధనుష్) మ్యాథ్స్ లెక్చరర్ గా ఆ పల్లెటూరికొస్తాడు. ఆ కాలేజీలో బయాలజీ లెక్చరర్ మీనాక్షీ (సంయుక్తా మీనన్) తప్ప విద్యార్దులెవరూ వుండరు. వాళ్ళంతా రకరకాల పనులు చేస్తూ కుటుంబాలకి తోడ్పడుతూంటారు. బాలు వాళ్ళందర్నీ కూడగట్టి చదివించి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేట్టు చేయడంతో త్రిపాఠీ  దిమ్మతిరుగుతుంది. వచ్చేసి అసలు విషయం చెప్తాడు. అతడి పన్నాగానికి బాలు ఎదురు తిరగడంతో ఉద్యోగంలోంచి తీసేస్తాడు.
        
ఇప్పుడు బాలు ప్రతీ విద్యార్థికీ ఉన్నత విద్య అందాలన్న పట్టుదలతో వాళ్ళని  ఎంసెట్ కి ఎలా సిద్ధం చేశాడు, ఈ ప్రయత్నంలో త్రిపాఠీ ఎన్ని ఆటంకాలు సృష్టించాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

కాన్సెప్ట్ వచ్చేసి -విద్య గుడిలో ప్రసాదం లాంటిదని, దాన్ని పంచాలే గానీ ఫైవ్ స్టార్ హోటల్లో వంటకంలా కాదనీ చెప్పడం గురించి. సింపుల్ గా చెప్పుకుంటే విద్యని వ్యాపారం చేయరాదనడం. ఇది 1990 లలో ఓకే. అప్పుడప్పుడే విద్య కార్పొరేట్ వ్యాపారమవుతూండడంతో. అది గడిచి 30 ఏళ్ళు ముందుకొచ్చేశాక - మూడు తరాల ఇంటర్ విద్యార్ధులు ఈ కొత్త విధానంలోకి మారిపోయాక -ఈ కాన్సెప్ట్ కి ఇప్పుడు కాలం చెల్లినట్టే. అంటే కాన్సెప్ట్ కి యూత్ అప్పీల్ కొరవడింది.
        
ఆర్ధిక సరళీకరణ, ప్రపంచీకరణ -వీటితో ఉద్యోగావకాశాలు, జీతనాతాలూ అపారంగా పెరిగిపోయాక అలాటి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యని చవకలో అందించే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం వల్లకాక ప్రయివేటీకరణ చేశాక- ఉధృతి పెరిగిన ఉద్యోగావకాశాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? పేద, మధ్యతరగతి వర్గాలు సైతం ఈ మార్గంలోకి వచ్చేస్తున్నారు. ఎల్ కేజీ నుంచే ఇంగ్లీషు మీడియంకి పిల్లల్ని రెడీ చేస్తూ. గుడిసెలో కూలీ ఇంగ్లీషు మీడియంకే పంపుతున్న దృశ్యాలున్నాయి. ప్రపంచీకరణలో ఎవరూ వెనుకబడి లేరు. సన్నివేశం ఇదైతే ఇచ్చిన సందేశం సంధికాలపు నాటిది.
       
ఇక విదేశీ యూనివర్శిటీలకే ప్రభుత్వం ద్వారాలు తెరుస్తున్నప్పుడు దేశంలో యూనివర్శిటీల పరిస్థితేమిటి
? ఇవి కూడా ప్రభుత్వ కాలేజీల్లా శిథిల మవాల్సిందేగా. కాబట్టి సమస్య ప్రభుత్వంతో వుంది. ప్రభుత్వం - కార్పొరేట్లు ఒక నెట్వర్క్. దీన్ని బ్రేక్ చేయడం సాధ్యంకాదు. 
        
కాబట్టి విద్య గుడిలో ప్రసాదం లాంటిదని ప్రభుత్వానికి నచ్చజెప్పి ప్రభుత్వంలో మార్పు తేవడానికి సందేశమివ్వచ్చు. ఇది కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అంటే ఈ కాన్సెప్టుకి బాక్సాఫీసు అప్పీల్ లేదు. పైగా ఈ కథలో ప్రభుత్వానికి కాక కార్పొరేట్ త్రిపాఠీకే సందేశమిచ్చారు విచిత్రంగా. అతనెందుకు విద్యని ప్రసాదంలా పంచుతాడు. తను చదివించిన ఇంజనీరు ఉచితంగా ఉద్యోగం ఏమైనా చేస్తాడా.
        
ఇది చాలనట్టు ముగింపులో త్రిపాఠీ కిచ్చిన సందేశంతో హీరోయే కాన్సెప్టుకి వ్యతిరేకంగా పోతాడు- త్రిపాఠీ వ్యాపారానికే సహకరించే ట్విస్టుతో!
       
చాలా గందరగోళంగా వుంది కాన్సెప్ట్. కమర్షియల్ ఫార్ములా ట్రిక్కుతో ముగింపు నిజ జీవితంలో సాధ్యం కాదు. ఈ సినిమా కాలక్షేపానికి తీస్తే అదివేరు. ఎత్తుకున్నది సామాజిక సమస్య. దీన్ని ఫార్ములా కథగా చెప్పాలా
, వాస్తవికంగా చెప్పాలా స్పష్టతలేక రెండిటి గజిబిజి కన్పిస్తుంది.
       
ముందు ప్రభుత్వ కాలేజీలు కాదు
, అసలు విద్యార్ధుల్ని కాలేజీలకి చేరవేసే ప్రభుత్వ బడులే సరిగ్గా లేవు. ఈ స్థితి గురించి తీసిన సినిమాలు వాస్తవికంగానే తీశారు- తమిళంలోనే 2019 లో జ్యోతిక ప్రభుత్వ టీచరుగా 'రాట్చసి', 2012 లో సముద్రకని ప్రభుత్వ టీచర్ గా 'సట్టై' వచ్చాయి రియలిస్టిక్ గా. 2018 లో 'కాంతారా' హీరో రిషభ్ శెట్టి దర్శకత్వంలో కన్నడలో తీసిన
సర్కారీ. హి. ప్రా. శాలేకాసరగోడుకొడుగే -రామన్న రాయ్’ అనే ప్రభుత్వ బడి పిల్లలతో ఫన్నీ రియలిస్టిక్ హిట్ చెప్పుకోదగ్గది.

నిజ సమస్యతో కూడిన ఈ వాస్తవిక కథా చిత్రానికి కేంద్ర జాతీయ అవార్డుతో బాటుకర్ణాటక రాష్ట్ర అవార్డు లభించాయి. అంతేగాక, చాలా వినోద భరితంగా ఈ వాస్తవిక సినిమాని రెండు కోట్ల బడ్జెట్ తో తీస్తే, 20 కోట్లు బాక్సాఫీసు వచ్చింది కన్నడలో! ఏమిటిది? గురిపెట్టిన మార్కెట్ యాస్పెక్టేనా? కానీ ఏ కాలం మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటన్న  స్పృహ టాలీవుడ్ లో ఏం అవసరం - కష్టపడకుండా సినిమాలు చుట్టేసే సులభోపాయముండగా?
        
2003 లో నిజంగా జరిగిన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశాడు రిషభ్. ‘సర్కారీ. హి. ప్రా. శాలేకాసరగోడుకొడుగే -రామన్న రాయ్’ అనేది  కర్ణాటక - కేరళ సరిహద్దులో కేరళకి చెందిన కన్నడ మీడియం పాఠశాల పోస్టల్ చిరునామా. సర్కారీ. హి. ప్రా. శాలే- లేదా సర్కారీ హిరియా ప్రాథమిక శాలే అంటేప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఈ వూళ్ళో కన్నడ మాట్లాడే ప్రజలెక్కువ. కన్నడ - కేరళ మిశ్రమ సంస్కృతితోసరదాగా మాట్లాడే స్నేహభావంతోదేనికీ ఇబ్బంది పడని సుఖమయ జీవితాలతో ఆనందంగా వుంటారు.
        
స్కూలు ఇలా వుండదు. చదువుకోవడానికి పుస్తకాలుండవుతొడుక్కోవడానికి యూనీఫారాలుండవుఆడుకోవడానికి ఆటలుండవుటీచర్లకి జీతాలుండవుబిల్డింగుకి మరమ్మత్తు లుండవు. అత్యంత నీచాతి నీచంగా వుంటుంది. కారణం 60 మంది కూడా లేని కన్నడ పిల్లల కోసం స్కూలు నడపడం శుద్ధ దండగని కేరళ విద్యాశాఖాధికారి అనుకోవడమే.
        
అందుకని ఈ స్కూలుని మూసేసి మలయాళ మీడియం స్కూలు తెరిచే ఆలోచనతో వుంటాడు. దీంతో ఈ స్కూలు కూలే స్థితిలో వుందనీ, అందుకని దీన్ని కూల్చేయాలనీ సిఫార్సు చేస్తూ రాసిన ఉత్తరం మీద బలవంతంగా హెడ్ మాస్టారుతో సంతకం పెట్టించుకుంటాడు. పేద పిల్లలకి ఆధారమైన ఈ స్కూలు కూల్చేస్తారనే సరికి బడి పిల్లలు ఆందోళన మొదలెడతారు. ఎట్టి పరిస్థితిలో స్కూలుని కాపాడుకోవాలనే సంకల్పంతో న్యాయ పోరాటానికి దిగుతారు. పట్నం వెళ్ళి లాయర్ని మాట్లాడుకుని న్యాయపోరాటం మొదలెడతారు.
        
ఈ బడి పిల్లలతో చిల్డ్రన్ మూవీని చిల్డ్రన్ మూవీగానే తీశాడు జానర్ మర్యాదలతో. మొత్తం రకరకాల పిల్లకాయల కామెడీయే. తెలిసీ తెలీని పిల్లల జ్ఞానంతో ఇదొక బాల హాస్యలోకం. ప్రశ్నించే బాల హాస్యలోకం. దర్శకుడికి మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. చదువుల మీద వేసిన సెటైర్లు మెత్తగా చురక అంటిస్తాయి. ఈ హాస్యలోకంలో అప్పుడే బాల ప్రేమ లోకం కూడా వుంది. పిల్ల కాయల కౌమార ప్రేమాయణం. సినిమా వేషాలు. వూరెలా వుందో పిల్లలూ అలా ఆనందంగా వుంటారు. స్కూలు సమస్యతో హాస్యంగానే పోరాడతారు. హాస్యం కూడా సమస్యల్ని సాధిస్తుందని నిరూపిస్తారు. ఇదొక కొత్త కోణం యాంత్రిక సినిమా కథలకి. ఒక వాస్తవిక సినిమాని వినోదంగా కూడా తీయవచ్చని చేసి చూపించాడు దర్శకుడు రిషభ్ శెట్టి. భాషా వివక్షభాషాధిక్య భావం సామాజిక అల్లికకి చెరుపు చేస్తాయని సున్నితంగా హెచ్చరించాడు.
        
అలాగే ఇంటర్ విద్యార్ధులతో సార్ ని టీనేజర్లకి వర్తించే కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీగా తీయాల్సింది పోయి- మామూలు ఫార్ములా కమర్షియల్ గా కాసేపు, రియలిస్టిక్ గా కాసేపూ చేసి చుట్టేశారు. ఒక ఐడియాని ఎవరికోసం ఏ జానర్ లో తీయాలన్న క్రియేటివ్ సంస్కారం లోపించడంతో అసభ్యంగా తయారయ్యింది వ్యవహారం.
        
80 లలో, 90 లలో వచ్చిన హీరోల సినిమాల సన్నివేశాలు చూస్తున్నట్టు వుంటుంది నేటి కాలానికి. గతించిన కాలపు కథలతో/సమస్యలతో సినిమాలు నేటి యూత్ కి దేనికి, వర్తమానంలో విద్యార్ధులెదుర్కొంటున్న సమస్యలుండగా? ఇలా సందేశం, కథా ప్రయోజనం ఆశించకుండా కేవలం ధనుష్ కోసం చూడాలీ సినిమా.

నటనలు- సాంకేతికాలు

నటనా పరంగా ధనుష్ సినిమాకి చేయాల్సిన న్యాయమంతా చేశాడు. అవమానం, ఉద్వేగం, ఆందోళన, విజయం వంటి సన్నివేశాల్లో సానుభూతిని రాబట్టుకుంటూ పాత్ర పోషణ చేశాడు. శృతిమించిన మెలోడ్రామా - గ్రామ బహిష్కార సన్నివేశం, తన మీద దాడితో గాయపడ్డ సన్నివేశం మొదలైనవాటితో ఓల్డ్ స్కూల్ సినిమాని తలపించాడు. అలాగే తెలుగు ప్రేక్షకులు గుర్తించని తమిళ సుబ్రహ్మణ్య భారతి గెటప్ లో కథకి అతకని ఓవరాక్షన్ కూడా చేశాడు. హీరోయిన్ తో ప్రేమ, విలన్ తో వైరం కమర్షియల్ పంథాలో నటించాడు. వీలైనన్ని మాస్ సన్నివేశాలు, ఫైట్లు చేశాడు. తన పాత్ర కమర్షియలా, రియలిస్టిక్కా పట్టించుకోకుండా ఎప్పుడేది కోరాడో దర్శకుడు అది చేసుకుంటూ పోయాడు.  
        
హీరోయిన్ సంయుక్త సైడ్ అయిపోకుండా సెకండాఫ్ లో కూడా ధనుష్ కి తోడ్పడే పాత్ర నటించింది. సముద్రకని విలనీ, ఎత్తుగడలు తెలిసిన ఫార్ములా ప్రకారం నటించాడు. కెమెరా వర్క్ అంతంత మాత్రంగా వుంటే, సంగీతం- పాటలు ఏమాత్రం కుదరలేదు. దర్శకత్వం ఓల్డ్ స్కూలుకి చెందింది. విజువల్ అప్పీల్ కోసం పల్లెటూరిని డిజైనర్ పల్లె దృశ్యాలతో చూపించ వచ్చు. అది జరగలేదు. కథ ఎత్తుగడ బావుంది. విద్యార్ధులు ఒక వీడియో కేసెట్ చూడడం, అందులో పాఠాలు చెప్తున్న లెక్చరర్ ఎవరా అని వెళ్ళి కలెక్టర్ ని కలుసుకోవడం, ఆ కలెక్టర్ సార్ గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకు రావడం.
        
వీడియో దొరకడం, దాంతో అన్వేషణ ప్రారంభించదమన్నది ఫౌండ్ ఫుటేజ్ సినిమా జానర్ టెక్నిక్ కింది కొస్తుంది. దీంతో ఈ పాత కథని నేటి తరానికి బోలెడు సస్పెన్సుతో, థ్రిల్స్ తో ఆకట్టుకునేలా తీయొచ్చు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పరంగా ఎంత బలహీనంగా వుందో, వూహకందే టెంప్లెట్ సీన్లతో అంత తీసికట్టుగానూ వుంది. మధ్యలో కథకవసరం లేని సీన్లు కూడా. ఇది పేద, మధ్యతరగతి ప్రజలు ఒక యూనిట్ గా ఖరీదైన చదువులతో పోరాడే కథైనప్పుడు, మధ్యలో అనవసరంగా కులసమస్య తెచ్చి సీన్లు సృష్టించడం కథకి మూల బిందువైన యూనిట్ ని భంగపర్చడమే. రస భంగం కల్గించడమే.
—సికిందర్

 

Wednesday, February 15, 2023

1306 : రివ్యూ!

రచన -దర్శకత్వం : అభినవ్ సుందర్ నాయక్
తారాగణం : వినీత్ శ్రీనివాసన్, ఆర్ష చాందినీ బైజు, తన్వీ రామ్, సూరజ్ వెంజర మూడు తదితరులు
సంగీతం : శిబి మాథ్యూ అలెక్స్, ఛాయాగ్రహణం :  విశ్వజిత్ ఒడుక్కతిల్
బ్యానర్ : జాయ్ మూవీ ప్రొడక్షన్స్
నిర్మాత : అజిత్ జాయ్
***

    డిస్నీ + హాట్ స్టార్ లో జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ మలయాళంలో థియేట్రికల్ గానూ హిట్టయ్యింది. దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. కన్నడలో సైతం భారీ యాక్షన్ పానిండియా సినిమాలు తీస్తూంటే, మలయాళం నుంచి  వాటి పంథాలో అవి నేటివిటీకి దగ్గరలో సహజత్వంతో కూడిన సినిమాలు వస్తున్నాయి. ఇదే పంథాలో కొనసాగుతూ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ఎందుకని అంత పేరు తెచ్చుకుంటోందో ఒకసారి పరిశీలిద్దాం...

కథ
వాయనాడ్ లో ముకుందన్ ఉన్ని (వినీత్ శ్రీనివాసన్) లాయర్ గా స్ట్రగుల్ చేస్తూంటాడు. కేసుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. బాగా సంపన్నుడిగా స్థిరపడాలన్న కోరిక నెరవేరడం లేదు. అందుకు సంవత్సరాలుగా చాలా క్రమశిక్షణతో కూడిన నిర్మాణాత్మక జీవితం గడిపాడు. ఒక రోజు తల్లి నిచ్చెన మీంచి పడిపోవడంతో కాలు విరుగుతుంది. శస్త్రచికిత్సకి డబ్బుండదు. యాక్సిడెంట్ కేసులు చూసే అడ్వొకేట్ వేణు (సూరజ్ వెంజర మూడు) ముకుందన్ కేసుని రోడ్డు ప్రమాదం కేసుగా మార్చి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తాడు. దీంతో ముకుందన్ తల్లికి శస్త్ర చికిత్స చేయిస్తాడు. హాస్పిటల్ రిసెప్షనిస్టు మీనాక్షి (ఆర్ష చాందినీ బైజు) ని ప్రేమిస్తాడు. ఇదే సమయంలో వైద్య బీమా క్లెయిమ్‌ల ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుంటాడు.

ఇక వేణు చేసే పని తను కూడా చేయడం మొదలుపెడతాడు. దీంతో ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఇలా కాదని వేణు ముకుందన్‌కి హాస్పిటల్‌లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తాడు. ముకుందన్ తిరస్కరిస్తాడు. ఆ కాంట్రాక్టు వేణు చేపడతాడు. చేపట్టి హాస్పిటల్లో తనకి కాబోయే క్లయంట్స్ దగ్గరికి రాకుండా ముకుందన్ ని అడ్డుకుంటాడు. దీంతో ముకుందన్ వేణు కారులో నాగుపాము పెట్టడంతో వేణు చచ్చిపోతాడు.
    
ఇప్పుడు ముకుందన్ అనుకున్న స్థాయికి ఎలా ఎదిగాడు? ఫేక్ యాక్సిడెంట్ కేసులతో ఇంకెన్ని అక్రమాలు చేశాడు? అతడికి అడ్డొచ్చిన జడ్జి సైతం ఏమైపోయాడు? బ్లాక్ మెయిల్ చేసిన అసోసియేట్ కేం గతి పట్టింది? ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అని లా ఆఫీసు తెరిచిన ముకుందన్, యాక్సిడెంట్ కేసులు వచ్చే హాస్పిటల్ కి కూడా ఓనరై పోయి మొత్తం దందా ఎలా గుప్పెట్లోకి తెచ్చుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

నకిలీ ఇన్సూరెన్స్ క్లెయిములు దందాగా చేసుకుని కోట్లు ఆర్జించే లాయర్ కథ ఇది. ఇలాటి లాయర్లకి కొదవలేదు. గత అక్టోబర్ లోనే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ క్రింద నకిలీ క్లెయిముల స్కాములు చేసిన 30 మంది న్యాయవాదుల లైసెన్సుల్ని రద్దు చేసింది. ఈ లాయర్లు నకిలీ మోటారు యాక్సిడెంట్ క్లెయిములతో బీమా కంపెనీలకి కోట్లాది రూపాయల నష్టం కల్గించారు. మీరట్, బరేలీ, షాజహాన్‌పూర్‌ల నుంచి ఎక్కువ కేసులు నమోదు చేశారు.
    
అలాగే ఈ సినిమాలో కేరళలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే వాయనాడ్ ని కేంద్రంగా చేసుకుని కథ నడుస్తుంది. ఇందులో లాయర్ ముకుందన్ ఉన్ని దారుణంగా, ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా, చదరంగపు పావులు కదిపినట్టు షాకింగ్ గా ఆపరేట్ చేస్తాడు తన ఉన్నతి కోసం. మంచితనం, మానవత్వం అనేవి లేని జీరో ఫీలింగ్స్ తో పరిస్థితుల్ని సొమ్ము చేసుకుంటాడు. మనుషులు తాము ఎదగకుండా తన ఎదుగుదలకి మాత్రమే ఉపయోగపడాలన్న- టాప్ పొజిషన్ లో తనొక్కడే వుండాలన్న, ఉపయోగ పడ్డాక నాశనమై పోవాలన్న క్రూర మనస్తత్వంతో వుండే పాత్ర కథ.
    
ఇందులో నీతి గురించీ, పరివర్తన గురించీ వుండదు. అలా ముగియదు. శిక్షకూడా వుండదు. పైకి మెత్తగా వుంటూ లోపల కుత్తుకలు కోసే ఆలోచనలతో వుండే సీరియల్ కిల్లర్ మనస్తత్వ అధ్యయనంగా ఈ కథ వుంటుంది. సీరియల్ కిల్లర్ మానసిక కారణాలతో హత్యలు చేస్తాడు. ఈ కథలో హీరో సంపన్నుడవడానికి దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. కథొక్కటే గాకుండా కథతో బాటే పాత్రా ఆందోళన పరుస్తాయి. ఈ ఒక్క పాత్రే కాదు, కథలో ఏ పాత్రా నీతితో వుండదు. స్వార్ధం కోసం పనిచేసే పాత్రలే. కథానాయకుడి పాత్ర మనసులో చీకటి కోణాల ఆవిష్కరణ ఈ కథ.  

నటనలు -సాంకేతికాలు

ముకుందన్ ఉన్ని క్యారక్టర్ స్టడీ ఈ కథయితే, ఈ క్యారక్టర్ నటించిన వినీత్ శ్రీనివాసన్ అతికినట్టు సరిపోయాడు. ముఖం మీద ఏ భావాలూ పలికించడు. ఒకరు చస్తూంటే మాత్రం చిరునవ్వుతో చూస్తాడు. లోపలి భావాల్ని స్వగతంతో వెల్లడిస్తాడు. చేసే క్రూరమైన పనులకి డార్క్ హ్యూమర్ తో, క్రూడ్ జోకులతో ఆ  భావాలుంటాయి. అతడ్ని చూస్తే నవ్వూ కోపం రెండూ వస్తాయి. తను క్రిమినల్ అనీ, కిల్లర్ అనీ ఎవరికీ అనుమానం రాకుండా కూల్ గా బిహేవ్ చేసే నటన అతడి ప్రతిభకి తార్కాణంగా చెప్పుకోవచ్చు.
    
ఒక ఫోర్జరీ కేసులో కోర్టు విచారణ పరిస్థితి ఎదురైనప్పుడు ఆత్మహత్యకి ప్రయత్నిస్తాడు. ప్రతిష్టకి భంగం కలుగుతుందని కాదు, జైలుకి పోతే సంపన్నుడయ్యే మార్గముండదని మనం అర్ధం జేసుకోవాలి. అతడికి ప్రతి దాంట్లో సంపన్నుడయ్యే కోరికే వుంటుంది. వినీత్ శ్రీనివాసన్ జంటిల్ మాన్ లా కన్పించే ఈ నెగెటివ్- యాంటీ హీరో పాత్రని చాలా నీటుగా పోషించాడు.
    
అతడి భార్య పాత్రలో ఆర్ష చాందినీ, అడ్వొకేట్ వేణుగా సూరజ్ వెంజరమూడు, అసోషియేట్ గా సుధీ కొప్పా, ఇంకా ఇతర పాత్రల్లో ప్రతి వొక్కరూ ఈ రియలిస్టిక్ జానర్ కి సహజ నటనతో మూడ్ ని క్రియేట్ చేశారు.
    
విశ్వజిత్ ఛాయాగ్రహణం ఒక హైలైట్. తక్కువ లైటింగ్ తో, కూల్ కలర్స్ తో రియలిస్టిక్ దృశ్యాల సృష్టి చేశాడు. నిజానికి మలయాళం సినిమాలిలాగే వుంటాయి. కేరళ నేటివిటీకి ఈ కలర్- లైటింగ్ స్కీమ్ ని సెట్ చేసుకున్నారు. సిబి మాథ్యూ సంగీతం న్యూవేవ్ ధోరణులతో వుంది. కొత్త దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్  విషయపరంగా, మేకింగ్ పరంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రయత్నం చేశాడు.

చివరికేమిటి
    దీన్ని తెలుగులో రీమేక్ చేస్తారేమో, చేతులు కాలుతాయి. బుట్టబొమ్మ తో కాల్చుకున్నారు. మలయాళం సినిమాల జోలికి పోకుండా తెలుగులో అవే రొటీన్ మూస తీసుకోవడం మంచిది. ఈ మధ్య ఒక స్క్రిప్టు పరిశీలన కొచ్చింది. వొరిజినల్ కథతో చాలా సింపుల్ గా బలంగా కొత్తగా వుంది. మన దగ్గర టాలెంటున్న మేకర్లు లేరని కాదు- టాలెంటున్న నిర్మాతలే లేరు. చేతులు కాల్చుకునే పాత మూస నిర్మాతలే ఇంకా రాజ్యమేలుతున్నారు. ఆ మూసలో మలయాళం సినిమాల్ని తెలుగులోకి తెచ్చుకుని భస్మీ పటలం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు మూసలకే పటం కట్టుకుని వేలాడదీసుకుంటే సరిపోతుంది.
—సికిందర్

 

Monday, February 13, 2023

1305 : సందేహాలు- సమాధానాలు

Q : నేనొక స్క్రిప్టు రాస్తున్నాను సర్. అది ముగ్గురు హీరోలతో కథ. ఒకరితో ఒకరు వైరం పెట్టుకున్న ముగ్గురు హీరోల ముఠాల చుట్టూ కథ తిరుగుతుంది. తరువాత వారి విభేదాలను అంగీకరించి ఉమ్మడి శత్రువుతో పోరాడతారు.

మూడు పాత్రలను సమానంగా ఎలా డెవలప్ చేయాలో నాకు ఖచ్చితంగా తెలియదు.  ఒక పాత్ర ఆధిపత్యంగా కథ చేస్తే మిగిలిన రెండు కేవలం సైడ్‌కిక్‌లుగా ఉండే కథ కాకూడదనుకుంటున్నాను.

కాబట్టి, స్క్రిప్ట్ లో ఈ క్యారెక్టర్‌లను ఎలా సరిగ్గా డెవలప్ చేయాలి, మూడు క్యారెక్టర్‌లతో స్క్రీన్‌ప్లే నిర్మాణాన్ని ఎలా రూపొందించాలి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వారం విడుదలైన అమిగోస్ చూసిన వెంటనే నాకు సందేహాలు పెరిగాయి. అందుకే మీకు రాస్తున్నాను. అమిగోస్ హీరో త్రిపాత్రాభినయంతో చేసిన కథ నాకు పెద్దగా నచ్చ లేదు. ఇంకేదైనా మార్గముంటే చెప్పండి.
—పీవీఆర్, టాలీవుడ్ 
A : హాలీవుడ్ రచయిత్రి లిండా ఆర్సన్ బ్లాగులో, సాంప్రదాయ ఒన్ హీరో / ఒన్ జర్నీ మోడల్ స్క్రిప్టులతో మల్టీ స్టారర్ సినిమాలకి భారీ నష్టాలు జరిగాయని రాసింది. అంటే సింగిల్ హీరోతో త్రీయాక్ట్ స్ట్రక్చర్లో ఏవైతే సినిమాలొస్తూంటాయో, ఆ సింగిల్ హీరో జర్నీతోనే ఇద్దరు ముగ్గురు హీరోలున్న మల్టీ స్టారర్సూ తీయడమన్న మాట. దీంతో మీరన్నట్టు ఒక హీరో ఆధిపత్యంగా, మిగిలిన హీరోలు సైడ్ కిక్ లుగా కథలు వస్తాయి.

మల్టీ స్టారర్స్ లో ప్రతీ హీరో పాత్ర దాని కథనాన్ని అది వెతుక్కోవాలని చూస్తుందని, అలా ఏ హీరో పాత్రకా కథనం రచయిత అందించగల్గినప్పుడు సింగిల్ హీరో త్రీ యాక్ట్ జర్నీకి భిన్నమైన స్క్రిప్టు వస్తుందని లిండా రాసింది. ఈ స్క్రిప్టులు ఎలా రాసుకోవాలో తెలుపుతూ  ది ట్వెంటీ ఫస్ట్ సెంచురీ స్క్రీన్ ప్లే అన్న పుస్తకం రాసింది. ఇది మనం చదవలేదు.

అయితే ఆమె చెప్పిన పాయింటు -సాంప్రదాయ ఒన్ హీరో / ఒన్ జర్నీ మోడల్ స్క్రిప్టులతో మల్టీ స్టారర్ సినిమాలకి భారీ నష్టాలు జరిగాయన్న దాన్ని సీరియస్ గా తీసుకోవాలన్పిస్తోంది. త్రీయాక్ట్ స్ట్రక్చరనేది స్క్రీన్ ప్లేలకి శాశ్వత నమూనా, ఇందులో ఎలాటి సందేహమూ లేదు. సర్వ సాధారణంగా ఉపయోగంలో వుండే ఒక హీరో కథకి అనుసరిస్తూ వస్తున్న యూనివర్సల్ నమూనా. జోసెఫ్ క్యాంప్ బెల్ హీరోస్ జర్నీ అనే మోనోమిథ్ మోడల్ హీరో కథాప్రయాణపు వివిధ దశల వర్ణనే. ఇదీ త్రీయాక్ట్ స్ట్రక్చరే. 

అయితే త్రీయాక్ట్ స్ట్రక్చరనేది కథ చెదిరిపోకుండా కాపాడే చట్రమే తప్ప, అందులోని యాక్ట్స్ తో, ప్లాట్ పాయింట్స్ తో శిలాశాసనమేమీ కాదు. ఈ చట్రానికి లోబడి యాక్ట్స్ తో, ప్లాట్ పాయింట్స్ తో సొంత క్రియేటివిటీకి పాల్పడొచ్చు. అంటే త్రీయాక్ట్స్ ని కస్టమైజ్ చేయొచ్చన్న మాట. త్రీయాక్ట్స్ లోనే ఒక హీరో జర్నీని ఇద్దరు ముగ్గురు హీరోల జర్నీగా మార్చవచ్చు. కాకపోతే ఆ క్రియేటివిటీ ఏమిటనేది కథని బట్టి వుంటుంది. మీ కథకి స్ట్రక్చర్లో క్రియేటివిటీ ఏమిటని ఆలోచించగా...చించగా...ఈ కింది విధంగా వస్తోంది. పనికొస్తే ఉపయోగించుకోండి.

త్రీయాక్ట్స్ లో ప్రతీ యాక్ట్ ఒక గోల్ తో వుంటుంది. యాక్ట్ వన్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒక గోల్ తో, యాక్ట్ టూ ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఇంకో గోల్ తో, యాక్ట్ త్రీ ముగింపు దగ్గర మరింకో గోల్ తో వుంటాయి. యాక్ట్ టూ కి ఇంటర్వెల్ దగ్గర సబ్ గోల్ అనేదొకటుంటుంది. యాక్ట్ వన్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి సమస్య నేర్పాటు చేసే గోల్ తో వుంటే, యాక్ట్ టూ ఆ సమస్యకి పరిష్కారాన్ని అందించే గోల్ తో వుంటుంది. యాక్ట్ త్రీ ముగింపులో ఆ సమస్యని బలపర్చే (గెలుపు), లేదా తిరస్కరించే (ఓటమి) గోల్ తో వుంటుంది. సెకండ్ యాక్ట్ ఇంటర్వెల్ దగ్గర సమస్యని తీవ్రతరం చేసే సబ్ గోల్ తో వుంటుంది.

ఇప్పుడు మీ కథ మూడు ముఠాల ముగ్గురు హీరోలతో వుంది. ఇప్పుడు హీరోలంటేనే ముఠాకోర్లు. ఈ ముగ్గురూ తర్వాత తమ విభేదాల్ని పరిష్కరించుకుని ఉమ్మడి శత్రువుతో పోరాడతారని మీ కథ.

దీనికి యాక్ట్ వన్ గోల్- ఎవరికి వారు పోటుగాళ్ళు కావడంతో గెలవలేమని సైలెంట్ అయిపోతారు. యాక్ట్ టూ సబ్ గోల్ (ఇంటర్వెల్) ముగ్గురూ సంధి చేసుకోవడానికి కలుస్తారు. కానీ అంతర్లీనంగా పాత పగలు అలాగే వుంటాయి. దీంతో సంధి కుదరక ఒకరిద్దరు వెళ్ళిపోతారు.

యాక్ట్ టూ గోల్ -ఉమ్మడి శత్రువుతో ప్రమాదాలు పెరగడంతో, ఏదో ట్రాజడీ జరగడంతో, లేదా ఈడీ- సీబీఐ దాడులు జరగడంతో, ఇక పాత పగలు పక్కనబెట్టి, ముగ్గురూ నేషనల్ ఫ్రంట్ కింద ఒకటవుతారు.

యాక్ట్ త్రీ గోల్- ఇప్పుడు ముగ్గురూ ఉమ్మడిగా ఉమ్మడి శత్రువుని మాస్టర్ ప్లానేసి అంతమొందిస్తారు.

ప్రతీ యాక్ట్ గోల్ నీ స్పష్టంగా చూపించాలి. ముగ్గురి మధ్య కామన్ ఆపరేటింగ్ పాయింటు- అంటే తాము ముగ్గురూ ఒకటవాలని వున్న కోరిక- ముగ్గురి మోటివేషన్స్ గా పనిచేయాలి. ముగ్గురికీ ఒకరి పూర్వ కథకి మించి ఒకరి పూర్వ కథ వుండే డైనమిక్స్ కథనానికి మంట పుట్టిస్తూ వుంటాయి. అయితే ముగ్గురికీ  ఒకే ఒమ్మడి గోల్- ఉమ్మడి శత్రువు అంతు. కానీ  యాక్ట్స్ మారితే ముగ్గురికీ వేరే సొంత గోల్స్ పుట్టుకొస్తూంటాయి. ఎందుకంటే ఎవరి కథ వాళ్ళకుంది. ఒకళ్ళకి మించొకరు యాక్టివ్ క్యారక్టర్లు కాబట్టి.   

ఫస్ట్ యాక్ట్ లో ముగ్గురూ పోటుగాళ్ళే. బద్ధ శత్రువులు. సంధి అసాధ్యంగా అన్పిస్తుంది. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా ముగ్గురూ తలపడి ఎవరూ నెగ్గలేమని తగ్గుతారు. ఇలా ముగ్గురూ సైలెంట్ అయిపోవడం చూసి ప్లాట్ పాయింట్ వన్ లో ఉమ్మడి శత్రువు వంతు లేసుకుని ముందు ఒకడి మీద దాడి చేస్తాడు.

యాక్ట్ టూ లో దాడికి గురైన హీరో మిగతా ఇద్దరితో సంధికి ప్రయత్నిస్తాడు. ఆ ఇద్దరి మీద కూడా దాడులు జరగడంతో సంధికి వస్తారు. కానీ అంతర్లీనంగా పాత పగలు అలాగే వుంటాయి. దీంతో సంధి కుదరక వాళ్ళ గోల్స్ తో ఒకరిద్దరు వెళ్ళిపోతారు. దీంతో సబ్ గోల్ (ఇంటర్వెల్) ముగుస్తుంది.

సబ్ గోల్ తర్వాత యాక్ట్ టూ కొనసాగింపులో -ఉమ్మడి శత్రువుతో ప్రమాదాలు భారీగా పెరగడంతో, ఇక పాత పగలు పూర్తిగా పక్కనబెట్టి, ముగ్గురూ ఒకటవుతారు. ఇది ప్లాట్ పాయింట్ టూ గోల్. ప్లాట్ పాయింట్ టూ గోల్ ఎప్పుడూ ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ వన్ గోల్ కి నిలువుటద్దంలా వుంటుంది. ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ వన్ గోల్ లో ముగ్గురిలో ఎవరిదీ పై చేయి కాక సైలెంట్ అయిపోయారు. అంటే ఇక్కడ సంధి తిరస్కారానికి గురైంది. దాంతో ఉమ్మడి శత్రువు ఒకరి మీద దాడి చేశాడు. ప్లాట్ పాయింట్ తో గోల్ లో అదే ఉమ్మడి శత్రువువల్ల ముగ్గురికీ ఉమ్మడిగా తీవ్ర నష్టం జరగడంతో ఫైనల్ గా సంధి చేసుకుంటారు. ఇప్పుడు ముగ్గురి గోల్ ఒకటే అవుతుంది.

ముగ్గురు హీరోలతో ప్రొఫెషనల్స్ గా వాళ్ళ క్యారక్టరైజేషన్స్ మాత్రమే వుంటే కథనం సింపుల్ గా, యాక్షన్ ఎపిసోడ్లతో బలంగా వుంటుంది. వాళ్ళ పర్సనల్ (ఇంటర్నల్) క్యారక్టరైజేషన్స్ జోలికి పోకపోవడం ఉత్తమం. అయితే ప్రతీ క్యారక్టర్ కీ ఒక సెటప్, ఒక ట్విస్టు, ఒక పే ఆఫ్ వుండాలి.

'అమిగోస్' లో హీరో త్రిపాత్రాభినయపు పాత్రలు వాటి కథలు అవి నడుపుకోక, కథే పాత్రల్ని నడపడం వల్ల యాక్షన్ కథ మొదటికే మోసం వచ్చింది. రైటర్ కథ నడప కూడదన్న బేసిక్స్ ని మరిచారు. మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది.
—సికిందర్

 

Sunday, February 12, 2023

1304 : సినిమా సైన్స్

 

        న అంతర్గత (మానసిక) పరిస్థితిని స్పృహలోకి తీసుకురానప్పుడు, ఆ అంతర్గత పరిస్థితి విధి వలె వెలుపల జరుగుతుందని, అంటే భౌతిక ప్రపంచంలో మన అనుభవంలోకి వస్తుందని- మానసిక నియమం (సైకలాజికల్ రూల్) చెబుతుంది. అంటే, వ్యక్తి అవిభక్తంగా వుండి, తన అంతర్గత వైరుధ్యాల గురించి స్పృహలోకి రానప్పుడు, ప్రపంచం ఆ మానసిక సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) ని భౌతిక ప్రపంచంలో బలవంతంగా అమలు చేస్తుందని అర్ధం. ఇది ప్రముఖ స్విస్ మానసిక విశ్లేషకుడు, సిద్ధాంతకర్త కార్ల్ జంగ్ చెప్పిన మాట. మనం కథని అనేక రూపాల్లో చూడగలం : కథాంశం పరంగా నిర్మాణాత్మకంగా, ఇతివృత్తం పరంగా ప్రతీకాత్మకంగా, దృశ్యపరంగా బొమ్మలుగా చూడగలం. అయితే మనం ఒక కథని పాత్ర కోణం నుంచి పరిశీలిస్తున్నామంటే, మనమా పాత్ర  మానసిక ప్రయాణాన్ని (సైకలాజికల్ జర్నీ) చూస్తున్నట్టే లెక్క.

        నిజానికి పై దృక్కోణం నుంచి చూసినపుడు, కథలోని అన్ని సంఘటనలు, పాత్రలూ అన్నీ కూడా, కథానాయకుడి మానసిక తపన కోసం పనిచేస్తున్నట్టే కనిపించగలవు. వ్యక్తిగతంగా చూసుకుంటే కార్ల్ జంగ్ మాట చాలా ముఖ్యమైనది. అంటే మనం మన మనస్సులోని అన్ని కార్యకలాపాల్ని, చీకటి ప్రేరణల్నీ గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే, విశ్వం బయట ఆ పరిస్థితుల్ని సృష్టించి మనల్ని బలవంతంగా సంఘర్షణలోకి దింపుతుందన్న మాట. సినిమా రచనా పరంగా పై సూత్రీకరణ అంతరార్ధం రెండు రూపాల్లో కన్పిస్తుంది : అనైక్య (ఇమ్మెచ్యూరిటీ) స్థితిలో కథని ప్రారంభించే కథానాయకుడు ఐక్యత (మెచ్యూరిటీ) వైపు వెళ్ళడానికి ఉద్దేశించిన విధిని ఎదుర్కోవడం, రెండవది- కథా సంబంధమైన కథనంలో జరిగే సంఘటనలు కథానాయకుడి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) లోని మూలాంశాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి వుండడం.
        
జోసెఫ్ కాంప్‌బెల్ సూచించినట్టుగా, కథానాయకుడనే వాడు మారాలి, మారాల్సిన అవసరం గుర్తించకపోయినా మారతాడు. కాబట్టి  ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌ లోని పాత్ర డరోతీ కి ఇంద్రధనస్సు దాటుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలని అన్పించినప్పుడు, తన ఇల్లు అనుకున్న వుంటున్న ఇంటిని ఇల్లులా ఫీలవ్వలేని స్థితిలో వుందామె. ఈ ఆమె మానసిక ప్రయాణపు ప్రారంభంలోనే మనం ఇంటికి మించిన ప్రదేశం లేదు అని ఆమె చివరికి గ్రహించే సంఘటనలతోనే ఆమె ప్రయాణం వుంటుందని తెలుసుకుంటాం. అంటే ఆమె ఒక ఇమ్మెచ్యూర్ స్థితి నుంచి మెచ్యూర్డ్ స్థితికి మారుతుందన్నమాట- ఇది తను గుర్తించకపోయినా.
        
కనుక మనం సినిమా రచనలో పాత్ర-ఆధారిత కథని ఈ విధంగా చేపడతాం : కథలోని కథానాయకుడిని లోతుగా శోధించి, అతడి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) మూలాంశమేమిటో నిర్ణయించి, దాని ఆధారంగా అతడి ఎదుగుదలకి తోడ్పడే సంఘటనల్నీ, చర్యల్నీ మిళితం చేసే కథనాన్ని నిర్మిస్తూ, అతడి మానసిక ప్రయాణపు రూట్ మ్యాపుని చూపిస్తాం.
        
కథానాయకుడు ఏ విధమైన పరివర్తనకీ గురికాని సినిమాలున్నాయి. ఆ కథానాయకుల క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) ప్రతికూలంగా వుండవచ్చు. వాస్తవం ఏమిటంటే, ఆ కథానాయకులు చాలా కథల్లో సానుకూల రూపాంతరాన్నే అనుభవిస్తారు. అంటే మార్పుకి లోనవుతారు. కథల్లో పరివర్తన అనేది అనివార్యమని జోసెఫ్ కాంప్‌బెల్ పేర్కొన్నాడు.
        
సినిమా రచయితలు కథలోని మానసిక ప్రయాణాన్ని త్రవ్వడానికి ఉత్తమ మార్గం ఈ రెండు ప్రశ్నలు వేసుకోవడం : కథానాయకుడికి కోరిక ఏమిటి? కథానాయకుడి అవసరం ఏమిటి? కోరుకోవడం పాత్ర చేతనావస్థ లక్ష్యం. పాత్ర మనసులో లక్ష్యం, అంటే  అంతిమ ఫలితం స్పష్టంగా రూపుదిద్దుకుని వుంటుంది. ఇది ఫస్ట్ యాక్ట్ ముగింపులో అంటే ప్లాట్ పాయింట్ వన్ కల్లా ఏర్పడుతుంది. ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌ లో డరొతీ కొరికేమిటి? ఇంద్రధనస్సుని దాటుకుని నివాసాన్ని పొందడం.
        
అవసరం పాత్ర అచేతావస్థ లక్ష్యం. పాత్రకి కొంతవరకు ఈ అంతర్గత లక్ష్యం గురించి తెలిసి వుండ వచ్చు. అయితే ఈ సహజ సిద్ధ స్వభావాన్ని తెలియకుండానే అణిచి వేసుకుంటూ వుంటుంది. నిజ జీవితంలో మన పరిస్థితే. డరోతీ అవసరమేమిటి? ఆమె వుంటున్న ఇంటి పరిసరాల్లో  నివసించే వ్యక్తులతో, తన కుటుంబంతో, పొలంతో అనుభవిస్తున్న అనుభూతుల్లాంటివి పొందడం. లాంటివి ఇంకెక్కడా వుండవు. ఇవి ఆమెకి ఇక్కడే ఇంటి దగ్గరే వున్నాయి తప్ప ఎక్కడో ఇంద్రధనస్సు కావల లేవు.
        
ఈ కోరికకీ, అవసరానికీ మధ్య ఉద్రిక్తతలే పాత్ర అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) కి మూలం. తత్ఫలితంగా,  సాధారణ దృష్టిలో దాగి ఒక ముఖ్యమైన నిజముంటుంది : పాత్ర  ఐక్యతా (మెచ్యూరిటీ) బీజాలు ఆ పాత్ర మానసిక ప్రయాణం ప్రారంభించే ముందు తానేమిటో అక్కడే వుంటాయి. ఇది పాత్ర తెలుసుకోవడమే అసలు అవసరం. ఈ తెలివిలో కొచ్చినప్పుడు, దీని ప్రకాశంలో తడిసి తళతళా మెరిసే మెచ్యూరిటీని సాధిస్తుంది పాత్ర. ఈ నిజం ది విజార్డ్ ఆఫ్ ఓజ్ ‘ చివర్లో ప్రతిబింబిస్తుంది- ఇంటికి  తిరిగి వెళ్ళే శక్తి నీకు ఎల్లప్పుడూ వుంది అని గ్లిండా డరోతీకి చెప్పినప్పుడు.
        
ఈ శక్తిని (తెలివిని) ఎల్లప్పుడూ కలిగి వుంటాం. కానీ మన కోరికలు డామినేట్ చేస్తాయి. పాత్ర రూపాంతరపు సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి మంత్రాక్షరా లేవైనా వుంటే, బహుశా పై గ్లిండా మాటలే.
        
కథానాయక పాత్రకి ఈ శక్తి ఎప్పుడూ వుంటుంది, ఈ కింది వాటితో ముడిపడి-
        
1. కథానాయకుడి నమ్మకాలతో, పోరాట నైపుణ్యాలతో, ఆత్మ రక్షణా విధానాలతో, ఫస్ట్ యాక్ట్ లో తన సాధారణ ప్రపంచంలో ప్రవర్తనా విధానాలతో;
        
2. కథానాయకుడు తన అవసరాన్ని అణచివేయడంతో, తిరస్కరించడంతో; అది తన అంతరాత్మలో భాగమైనప్పటికీ గుర్తించక.
        
వీటన్నిటికీ  శక్తి అవసరం. ఈ శక్తి కథానాయకుడి వనరుల్ని పైకి తోడుతుంది. చివరికి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) నుంచి ఐక్యత (మెచ్యూరిటీ) కి ప్రారుద్భవించడానికి తనని తను అనుమతించుకున్నప్పుడు- ఆ శక్తి వరదలా అడ్డంకుల్ని బద్ధలు కొడుతుంది. సెకండ్ యాక్ట్ లో, థర్డ్ యాక్ట్ లో ఆటంకాలన్నిటినీ ముక్కలు చేస్తూ సాగిపోతుంది కథానాయక పాత్ర.
        
ఈ రకమైన సానుకూల రూపాంతరాన్ని మనం సినిమాల్లో పదే పదే చూస్తాం. కథానాయకుడి అనైక్యత ప్రారంభ స్థితి నుంచి పరిణామం చెందడం, వివిధ అడ్డంకుల్ని, పరీక్షల్నీ ఎదుర్కొనే ప్రయాణాన్ని సాగించడం, కొన్ని పాత్రల నుంచి సవాళ్ళు ఎదుర్కోవడం, ఇతర పాత్రల  సహాయంతో చివరికి ఒక తుది పోరాటాన్ని చేయడం, అందులో గెలుపు సాధించి మనిషిగా ఐక్యతా భావమనే విజయపతాకాన్ని ఎగరేయడం.  అందుకే మనం కథ గురించి ఆలోచించినప్పుడు, మనం దాని మానసిక ప్రయాణాన్ని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
—స్కాట్ మేయర్స్,
(స్క్రీన్ ప్లే కోచ్)


Saturday, February 11, 2023

1303 : సందేహాలు- సమాధానాలు

Q :   ఐదు నెలలుగా ఒక స్క్రిప్టు పై పని చేస్తున్నాను. అయితే నేను అనుకున్న పాయింటుతో కథ రావడం లేదు. సెకెండ్ యాక్ట్ కుదరడం లేదు. సెకండ్ యాక్ట్ లో పాయింటుతో సంబంధం లేకుండా సబ్ ప్లాట్ ని క్రియేట్ చేశాను. దాని ప్లేస్‌మెంట్ కారణంగా సబ్ ప్లాటే కథ అన్పించేలా వస్తోంది. కానీ నా కథ మెయిన్ ప్లాట్ కి సబ్ ప్లాట్ కంపల్సరీ అని భావిస్తున్నాను. అసలు సెకెండ్ యాక్ట్ అనుకున్న పాయింటు ప్రకారం రాకపోవడానికి కారణం ఏమిటంటారు. దీన్నెలా సాల్వ్ చేయాలి తెలుపగలరు.
—ఎస్ ఎస్ కె, టాలీవుడ్
A :    సెకండ్ యాక్ట్ సమస్యలకి మూలం ఫస్ట్ యాక్ట్ ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పాటు చేసిన ప్రాబ్లం దగ్గర వుంటుంది. ఈ ప్రాబ్లం బలాబలాలు కథకి అనుకున్న ఐడియా (పాయింటు) బలాబలాల మీద ఆధారపడి వుంటాయి. కాబట్టి ముందుగా మీ కథ ఐడియాని వర్కౌట్ చేయాలి. ఐడియాలో కథ వుందా, గాథ వుందా చెక్ చేసుకోవాలి. గాథ వుంటే కథగా మార్చుకోవాలి. కథ సారాన్ని మూడు వాక్యాల (ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్) స్ట్రక్చర్ లో కూర్చి ఐడియా నిర్మాణాత్మకంగా వుండేట్టు చూసుకోవాలి.
        
ప్లాట్ పాయింట్ వన్ నుంచి సెకెండ్ యాక్ట్ లో పనిచేసేది ఈ నిర్మాణాత్మక ఐడియానే. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఈ నిర్మాణాత్మక ఐడియా పాత్రకి సమస్యని ఏర్పాటు చేసి, ఆ సమస్యని సాధించే గోల్ ని పాత్రకి అందిస్తుంది. కాబట్టి ఈ గోల్ లో నాల్గు ఎలిమెంట్లు వుండేట్టు చూసుకోవాలి. 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. 
        
దీంతో సెకండ్ యాక్ట్ లోకి వెళ్ళినప్పుడు అనుకున్న ఐడియా (పాయింటు) కథని సరఫరా చేస్తూ కథని బలంగా డ్రైవ్ చేస్తూంటుంది. సెకండ్ యాక్టే సినిమా, సెకండ్ యాక్ట్ కొద్దీ కలెక్షన్స్. ఇక సబ్ ఫ్లాట్స్ ప్రధాన కథకి ఎక్కడో కనెక్ట్ అయ్యేట్టు చూసుకుంటే అవి ప్రధాన కథగా మారవు. ఐడియా నిర్మాణం గురించి, అలాగే గోల్ ఎలిమెంట్స్ గురించి పూర్తి సమాచారం కావాలంటే బ్లాగు సెర్చి బాక్సులో ఐడియా అని, గోల్ ఎలిమెంట్స్ అని తెలుగులో టైపు చేయండి. వాటికి సంబంధించిన పేజీలు బయటపడతాయి.  
—సికిందర్