రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, అక్టోబర్ 2022, ఆదివారం

1223 : రివ్యూ!


రచన- దర్శకత్వం పుష్కర్-గాయత్రి

తారాగణం : హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్ తదితరులు  
హిందీ చిత్రానువాదం
: బెనజీర్ అలీ ఫిదా, మాటలు : బెనజీర్ అలీ ఫిదా, గాయత్రి, మనోజ్ ముంతషీర్; సంగీతం :
సామ్ సి.ఎస్, ఛాయాగ్రహణం : పిఎస్ వినోద్
బ్యానర్స్ : వైనాట్ స్టూడియోస్
, రిలయెన్స్ ఎంటర్ టైంమెంట్, టీ సిరీస్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్, థీమ్ స్టూడియోస్
నిర్మాతలు :
ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, భూషణ్ కుమార్
విడుదల : సెప్టెంబర్ 30, 2022
***

        ణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కి పోటీగా హిందీ విక్రమ్ - వేదా విడుదలైంది. ఇందులో సైఫలీ ఖాన్ - షారుక్ ఖాన్ లు మొదట నటించాల్సింది తర్వాత సైఫలీ ఖాన్ -అమీర్ ఖాన్ ల పేర్లు వినబడి, అమీర్ ఖాన్ కూడా తిరస్కరించడంతో ఆఖరికి సైఫలీఖాన్- హృతిక్ రోషన్ ల కాంబినేషన్లో తెరకెక్కింది. తమిళ దర్శకులు పుష్కర్- గాయత్రి లు తమిళ పానిండియాయే అయిన మణిరత్నం సినిమాతో పోటీ పడుతూ విక్రమ్ -వేదా కమర్షియల్ మాస్ తో ముందుకొచ్చారు. హిందీ ప్రేక్షకులకి కావాల్సింది మాస్ సినిమాలే. ఒకవేళ ఇది పోటీ పడకపోయినా మణిరత్నం సినిమా జాతకం వేరేగా వుండేది కాదు. మణిరత్నం సినిమా తమిళ ప్రేక్షకులకే పరిమితమైన శ్రమ ఫలితమని తేలిపోయింది. కనుక ఇప్పుడు విక్రమ్- వేదా ఫలితమేమిటి? పోటీలేని వాతావరణంలో హిట్టయ్యే విషయం ఏమైనా ఇందులో వుందా? ఐదు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి దీనిపై వ్యయం చేసిన 175 కోట్లు సురక్షితమేనా? ఇవి తెలుసుకుందాం...


కథ
లక్నోలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎసెస్పీ విక్రమ్ (సైఫలీ ఖాన్) క్రూరుడైన  కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వేదా బేతాళ్ (హృతిక్ రోషన్) అనుచరుల్నిఎన్ కౌంటర్ చేసి చంపేస్తాడు. ఇక వేదా కోసం వేట మొదలెడతాడు. వేదా 16 మందిని చంపి లక్నోని గడగడ లాడిస్తున్నాడు. ఐతే విక్రమ్ ఇంకో ఎన్ కౌంటర్ కి ప్లాన్ చేస్తూంటే, స్వయంగా వచ్చి వేదా లొంగిపోవడం ఆశ్చర్య పరుస్తుంది. ఇంటరాగేషన్లో వేదా ఒక కథ చెప్తానని చెప్పుకొస్తాడు. కథ చెప్పి, ఈ కథలో న్యాయం చెప్పమంటాడు. విక్రమ్ న్యాయం చెప్తాడు. ఆ న్యాయమే తను చేశానంటాడు వేదా. విక్రమ్ ఇరుకునపడతాడు. తను చెప్పిన న్యాయమే వేదా చేసి వుంటే ఇక అన్యాయం ఎక్కడుంది? న్యాయాన్యాయాల పట్ల అతను అభిప్రాయం మార్చుకోవాల్సిన పరిస్థితి...

        ఇంతలో విక్రమ్ భార్య లాయర్ ప్రియ (రాధికా ఆప్టే) వచ్చి వేదాని బెయిల్ మీద విడిపించేస్తుంది. ఆగ్రహంతో విక్రమ్ మళ్ళీ వేదాని పట్టుకుంటే ఈసారి అతనింకో కథ చెప్పి న్యాయం చెప్పమంటాడు. విక్రమ్ న్యాయం చెప్తే ఆ న్యాయమే చేశానంటాడు వేదా...ఇలా న్యాయాన్యాయాల ప్రశ్న విక్రమ్ నైతిక బలాన్నే దెబ్బతీస్తూంటుంది. ఈ సమస్యని అతనెలా పరిష్కరించాడు
? వేదా ఇంకో కథ కూడా చెప్తాడు. ఇక విసిగిన  వేదాకి విక్రమ్ ఏం న్యాయం చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో భార్య ప్రియా పాత్రేంటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
గ్యాంగ్ స్టర్ జానర్ కథ. దర్శకులు పుష్కర్ - గాయత్రిలు చెప్పినట్టు బేతాళ కథల ఆధారంగా చెప్పిన కథ. విక్రమ్ ని ఇరుకునబెట్టే వేదా చెప్పే కథలు విక్రమార్క బేతాళ కథల్లాంటి తన జీవితానుభవాలే.

విక్రమ్ - వేదా తమిళంలో 2017 లో మాధవన్- విజయ్ సేతుపతిలతో హిట్టయిన విక్రమ్- వేదా కి రీమేక్. అప్పట్లో దీని బడ్జెట్ 11 కోట్లకి 66 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ రీమేక్ కి 175 కోట్ల బడ్జెట్. మొదటి రోజు 12 కోట్లే వసూలు చేసింది. ఓవర్సీస్ కలుపుకుని 20 కోట్లు. ఇది హిందీ పొన్నియిన్ సెల్వన్ కి 10 రెట్లు ఎక్కువే అయినా, ఈ అంకె నిరాశాజనకంగా వుంది. మూడేళ్ళ తర్వాత హృతిక్ రోషన్ తెర మీదికొచ్చి, సినిమాకి మీడియా రెస్పాన్స్ బాగుండి, రెండో రోజు 25 శాతం కలెక్షన్లు పెరిగాయి. అనుకున్న క్రేజ్ రాకపోవడానికి కారణం సినిమాలో విషయంతో వుందా అంటే అదేమీ కాదు. పేదరికం, ఆకలి, నిరుద్యోగం, అధిక ధరలు పీడిస్తున్న నార్త్ ప్రేక్షకులకి మత భక్తి ఫాంటసీల్లో ఊరట లభిస్తుందేమో. మత భక్తే ఈ పరిస్థితి తెచ్చినా. బాలీవుడ్ కి చాలా గడ్డు రోజులు.

ఈ గ్యాంగ్ స్టర్ కథని ఏది న్యాయం?  ఏది అన్యాయం - అన్న నైతిక ఆవరణలో డ్రమెటిక్ క్వశ్చన్ ఏర్పాటు చేసి చెప్పిన విధానమే  జీవం పోసిందని చెప్పాలి. చాలా పూర్వం, అంటే 1971 లో గుమ్మడి హీరోగా నటించిన బ్లాక్ అండ్ వైట్ నేనూ మనిషినే ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇందులో జడ్జి పాత్రలో గుమ్మడియే హత్య చేస్తాడు. ఆ సమయంలో అతను జడ్జి కాదు, మనిషి. అయినా నేరం గిట్టుబాటు కాదని తెలిసీ మనిషి కుండే ప్రతీకారేచ్ఛతో తనలోని రెండో మనిషి వైపే మొగ్గి హత్య చేసేస్తాడు. ఇప్పుడు తమ్ముడి పాత్రలో పోలీసు అధికారిగా హీరో కృష్ణ ముందు నైతిక ప్రశ్న. ఇప్పుడు తను పోలీసు అధికారిగా డ్యూటీ చేయాలా, లేక తనూ ఓ మనిషిగా రక్త సంబంధాలకి లొంగిపోవాలా? బలమైన భావోద్వేగాలతో కూడిన క్రైమ్ డ్రామా ఇది. ఇందులో ఆ రోజుల్లోనే బుల్లెట్స్ తో బాలస్టిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ చూపించారు.

        గ్యాంగ్ స్టర్ వేదా విసిరే నైతిక ప్రశ్నలతో పోలీసు అధికారి విక్రమ్ డైలమా ఇలాంటిదే. గమనిస్తే పోలీసులకంటే నేరస్థులకి ఎక్కువ ఫిలాసఫీ వుంటుందేమో. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణని ఇదే డ్రైవ్ చేస్తూంటుంది. చివరికి అంతిమ న్యాయం డిమాండ్ చేసినప్పుడు ఇద్దరి మధ్య మెక్సికన్ స్టాండాఫ్ సీను. తమిళ కథని ఎక్కడా మార్చకుండా రీమేక్ చేశారు. కథలో మలుపులు ఉత్కంఠని పెంచుతూ కదలకుండా కూర్చోబెడతాయి.

నటనలు -సాంకేతికాలు
స్టార్స్ ఇద్దరివీ సమాన స్థాయి పాత్రలుడిఫరెంట్ నటనలు. సైఫ్ పోలీసు- హృతిక్ క్రిమినల్ యాంటీ పాత్రల మధ్య విడదీయలేని బంధంతో (బేతాళ కథల వల్ల) శతృత్వం, మిత్రుత్వం రెండూ వుంటాయిచివరికి మిత్రులైపోతారా అన్న సస్పెన్సుని పెంచుతూ. ఈ మాస్ యాక్షన్ పాత్రల్లో ఇద్దరూ ఆకట్టుకునే పరిస్థితి. లాయర్ పాత్రలో రాధికా ఆప్టే కూడా అంతే ప్లస్ అయింది. ఇతర పోలీసు పాత్రల్లో నటులూ ఫర్వాలేదు.

        ఓ రెండు పాటలకి పెద్దగా ప్రాధాన్యం లేదుగానీ
, సామ్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఈ స్టయిలిష్ గ్యాంగ్ స్టర్ మూవీకి స్టయిలిష్ గానే కుదిరింది. హృతిక్ కి రాజ్ కపూర్ పాటల పిచ్చి వుంటుంది. ఒక ఫైట్ లో రేడియోలో కిసీకీ ముస్కురాహటో పే హో నిసార్ సాంగ్ వస్తూంటే, తన్మయం చెందుతూ చేసే ఫైట్ ఫన్నీగా వుంటుంది. ఫైట్ సీన్స్ కూడా స్టయిలిష్ గా కంపోజ్ చేశారు. పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం ఒక హైలైట్ లక్నో నగర దృశ్యాలతో.

        చివరిగా
, దర్శకులు పుష్కర్- గాయత్రీలు రీమేక్ కి న్యాయమే చేశారు. రొటీన్ మూస ఫార్ములా ధోరణులకి పోకుండా నియో నోయర్ పోకడలతో - నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్- శైలిలో గ్యాంగ్ స్టర్ మూవీని రాసి తీశారు. బాగా రాస్తే బాగా తీయొచ్చు, బాగా రాయక పోతే ఎంత బాగా తీసినా పొన్నియిన్ సెల్వనే!
—సికిందర్


, 

30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

1222 : కోలీవుడ్ కాలింగ్

ది లాక్ డౌన్ సమయం. చెన్నైలో దర్శకుడు  శంకర్ తోటి దర్శకులతో అనేక జూమ్ కాల్ సెషన్స్ ని ప్రారంభించాడు. ఆ దర్శకుల్లో మణిరత్నం, లింగుసామి, కార్తీక్ సుబ్బరాజ్  కూడా వున్నారు. ఆ మాటామంతీ జరుగుతున్నప్పుడు శంకర్ ఒకటి అడిగాడు : తను దర్శకత్వం వహించడానికి తగ్గ కథ ఎవరి దగ్గరైనా వుందాని. వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ స్పందించాడు. తను చాలా సంవత్సరాల క్రితం ఒక  రాజకీయ కథ రాసుకున్నాడు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చాలా కాలం క్రితం భావించాడు. ఆ కథ శంకర్ కి చెప్పడంతో వెంటనే ఓకే చేశాడు శంకర్. ఆ కథే రాంచరణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15’ (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కుతోంది.

            2012 లో శంకర్ హిందీ త్రీ ఇడియెట్స్ని రీమేక్ చేశాడు స్నేహితుడుగా. ఇది ఫ్లాపయ్యింది. ఆ తర్వాత తీశాడు. డిఫరెంట్‌గా ట్రై చేసినా ఇది కూడా  డిజాస్టర్‌గా మారింది. ఆ భారీ పరాజయం తర్వాత శంకర్ సీక్వెల్స్ ఆలోచనలో పడ్డాడు. వెంటనే 2018 లో రోబోకి సీక్వెల్‌గా ‘2.0’ తీశాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆర్థిక వైఫల్యంగా మిగిలిపోయింది. ఇక 2019 లో కమల్ హాసన్‌తో కలిసి భారతీయుడుసీక్వెల్  ఇండియన్ 2’ ప్రారంభించాడు. ఇది అనేక సమస్యలతో, వివాదాలతో ఇంకా పూర్తి కాలేదు.

            ఇలా వుండగా, ‘అపరిచితుడుని రణవీర్ సింగ్ తో హీందీలో రీమేక్ చేద్దామని ప్రయత్నించాడు. దాని ఒరిజినల్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో కాపీరైట్ వివాదంతో కోర్టులో పడింది. పైగా ఆస్కార్ రవిచంద్రన్ అపరిచితుడుని శంకర్ కంటే భారీ యెత్తున హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీయబోతున్నట్టు ప్రకటించాడు.

            ఇక రాంచరణ్ తో తీస్తున్న ఆర్సీ 15’ గతంలో తానే తీసిన ఒకే ఒక్కడుతరహా కథ. ముఖ్యమంత్రిపై పోరాడే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ కనిపిస్తాడు. ఈ కథ శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ లు తన కథ నుంచి కాపీ కొట్టేశారని  చిన్నస్వామి అనే నిర్మాత కంప్లెయింట్ చేశాడు.

            పైనుంచీ కిందివరకూ, ఇదంతా చూస్తూంటే శంకర్ పరిస్థితి గందరగోళమని అన్పిస్తోంది కదూ? మామూలు గందరగోళం కాదు. తీసిన సినిమాలకే రీమేకులు, తీసిన సినిమాలకే సీక్వెల్సులు దగ్గర్నుంచీ, ‘నేను దర్శకత్వం వహించడానికి తగిన కథ వుందాఅని అడిగేవరకూ, ఇంకా కథల కాపీ వివాదాలు చుట్టుముట్టడం వరకూ అంతా గందరగోళమే. ఇది చాలనట్టు ఆర్సీ 15’ లో రాంచరణ్ ని ఇంకెలా గ్రాండ్ గా చూపించాలన్న సమస్య ఒకటి. ఎంత గ్రాండ్ గా చూపించాలో అంత గ్రాండ్ గానూ ఆర్ ఆర్ ఆర్లో ఎస్ ఎస్ రాజమౌళి చూపించేశాక, తనకి ఇంకేం మిగిలినట్టు?

            దేశంలో నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ గా వెలిగిపోతున్న శంకర్ కి ఒకేసారి ఇన్ని సమస్యలు, సవాళ్ళు దేనికి? 2012 కి పూర్వం లేవే? అప్పుడంతా పట్టిందల్లా బంగారమే. రోబో, శివాజీ, అపరిచితుడు, బాయ్స్, ఒకే ఒక్కడు, జీన్స్, భారతీయుడు, ప్రేమికుడు, జంటిల్ మన్...అన్నీ అలా అలా బ్రహ్మాండమైన హిట్సే. కథల కొరతలేదు, సమస్యల్లేవు, వివాదాల్లేవు. ఏ కథ పట్టినా హిట్ కొట్టడమే. అలాటిది 2012 నుంచి ఈ దశాబ్దమంతా ఎందుకు కథల సమస్యలో పడ్డాడు?

            తన విజయవంతమైన సినిమాల రహస్యమేమిటి? దీని వెనుక హస్తం ఎవరిది? ఆ హస్తం రచయిత సుజాత లేకపోయేసరికి ఈ పరిస్థితా? 1993 లో  జంటిల్ మన్నుంచీ  రచయిత సుజాతా రంగరాజనే శంకర్ సినిమాలకి క్రియేటివ్ అండ. జంటిల్ మన్ నుంచీ రోబో వరకూ రచయిత సుజాతతో కలిసి జైత్ర యాత్ర. సుజాత రచన శంకర్ సినిమాలకి బలం, బాక్సాఫీసు విజయం. అతను రాసే  డైలాగులు సరళమైనవే  అయినప్పటికీ ప్రభావవంతమైనవి.

            సుజాత తన జీవితకాలంలో పొందిన ప్రజాదరణ తమిళంలో ఆధునిక రచయితలు కొందరే పొందారు. ఇంజనీర్‌గా దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు తను. నవలా రచయితగా ప్రారంభంలో తన ప్రధాన ఇతివృత్తం స్త్రీ-పురుష సంబంధమే. తర్వాత తమిళంలో సైన్స్ ఫిక్షన్ రాసిన తొలి రచయిత తానే అయ్యాడు.

            రజనీకాంత్ నటించిన గాయత్రి’, ‘ప్రియ` వంటి సినిమాలు డెబ్బైల నాటికే సుజాత నవలల ఆధారంగా వచ్చాయి. తర్వాత ఎనభైల మధ్యలో, కమల్ హాసన్ తో సూపర్‌కాప్ థ్రిల్లర్ విక్రమ్‌కథ సుజాతదే. దీనికి సీక్వెల్ గా కమల్ విక్రమ్నిర్మించి ఇటీవల ఆలిండియా హిట్ సాధించారు. సుజాత  ఆ తర్వాత మణి రత్నంతో రోజా`, ‘దొంగా దొంగా’ ‘అమృతసినిమాలకి చాలా ఫలవంతమైన కథా సహకారాన్ని అందించాడు.

            దర్శకుడు శంకర్‌కి వెన్నెముకగా నిలిచిన సుజాత 2010 లో కన్నుమూశాడు. రోబోతను రాసిన చివరి మూవీ. ఆ తర్వాత నుంచి శంకర్ అనాధ అయిపోయాడు. శంకర్ స్వయంగా కథల్ని సృష్టించలేడు. ఐడియాలు మాత్రం చెప్పి సుజాతతో రాయించుకు నేవాడు. సుజాత లేకపోయాక, తన ఐడియాలు కూడా నిండుకున్నట్టున్నాయి- తీసిన తన సినిమాలకి సీక్వెల్సే తీయడం మొదలెట్టాడు. లేదా రీమేక్ చేయడం మొదలెట్టాడు.  సుజాత వంటి రచయిత స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేనప్పటికీ, శంకర్‌తో పాటు ఇతర ప్రతిభావంతులైన రచయితలు సుజాత వదిలిపెట్టిన వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ఫలితాలు మాత్రం అనుకూలంగా రావడం లేదు.

            ఈ సంక్షోభం శంకర్ కి గొడ్డలి పెట్టు వంటింది. సౌత్ నుంచి పానిండియా సినిమాలు వెళ్ళి నార్త్ లో దండయాత్ర చేస్తూంటే, తను ఈ పదేళ్ళలో మూడు వరస ఫ్లాపులు తీసి, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుని వెనుకబడిపోవడం విచారకరం. ఇప్పుడు ఆర్సీ 15’ లో రాంచరణ్ ఎమోషన్స్ సరిగా ప్రకటించడం లేదని, రాంచరణ్ తో తను ఈ సినిమా తీస్తూ తప్పు చేస్తున్నానా అన్న సందిగ్ధంలో పడడం చూస్తే- శంకర్ పరిస్థితి ఏమిటా అన్పించకమానదు.

        పరిస్థితి ఇలా వుండగా ఇంకో సీను తెరపై కొచ్చింది. ఇక ఇప్పుడు శంకర్ నవలని సినిమాగా తీయాలనుకుంటున్నట్టు డిఫరెంట్ దృశ్యం. సొంత  ఐడియాలు, సీక్వెల్సు, రీమేకులూ ఇక పనికి రావనుకున్నాక నవలా సాహిత్యం మీద కన్నేయడం. అదీ చారిత్రక కథ కావడం. ఒక వైపు మణిరత్నం చారిత్రక నవలతో పొన్నియిన్ సెల్వన్’’ తీస్తూంటే, తను కూడా ఆయన మార్గంలో మసకబారిన తన కెరీర్ కి కొత్త దారి కనుక్కుంటున్నట్టు.

        చరిత్రని సినిమాగా తీస్తే గౌరవం పెరుగుతుంది, తమిళ చరిత్రని తెరకెక్కిస్తే తమిళుల గత వైభవం ప్రపంచానికి తెలుస్తుంది. తమిళ ఆత్మాభిమానాన్ని సంతృప్తి పరుస్తుంది. పైగా గత చరిత్ర తెలుసుకోవడానికి అనేక సమాజాలకి చారిత్రక సినిమా అనేది వొక పాపులర్ జ్ఞాన కేంద్రంగా ఆకర్షిస్తుంది. ఇందువల్ల ఈ సెకెండ్ ఇన్నింగ్స్ ని సద్వినియోగం చేసుకుంటే శంకర్ కి మరికొంత కాలం ఆక్సిజన్ సరఫరా లభిస్తుంది.

   ఇంతకీ ఏమిటా శంకర్ తీసే చారిత్రక సినిమా అంటే, అదొక కళ్ళు తిరిగే వెయ్యికోట్ల మెగా ప్రాజెక్టు. వెయ్యి కోట్లతో సినిమా తీసే అవసరముందా అంటే ప్రకటనలదేముంది ఎంతైనా చెప్పుకోవచ్చని గుసగుసలు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్బడ్జెట్ 500 కోట్లు అవుతున్నప్పుడు దాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ళ  క్రితం అమీర్ ఖాన్ లగాన్తీసినప్పుడు, ఆ డబ్బుతో పది వూళ్ళకి తాగు నీటి సౌకర్యం కల్పించవచ్చని విమర్శలు వచ్చాయి. అప్పట్లో సినిమా నిర్మాణానికి 20 కోట్లు అంటేనే వింత. అందుకని అలాటి విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు వ్యయం చేస్తే  అంత గొప్పగా చూస్తున్నారు. దానికి రెట్టింపు టికెట్ ధర పెట్టినా రొట్టెకి డబ్బుల్లేని వాడు కూడా తెగ ఆనందం అనుభవిస్తున్నాడు.

        వెయ్యి కోట్ల బడ్జెట్ తో సూర్య కథానాయకుడుగా శంకర్ వేల్పారీఅనే చారిత్రాత్మకం  తీస్తున్నట్టు ప్రకటన. వీలైనన్ని ఎక్కువ భాషల్లో దీన్ని విడుదల చేయాలని ప్లాను. క్రీపూ 600-300 నాటి చరిత్ర ఇది. అప్పటి చిన్న రాజ్యమైన పరంబుని ఎంతో గొప్పవాడుగా పేరు తెచ్చుకున్న రాజు పారీపరిపాలించేవాడు. రాజ్యం చుట్టూ వున్న సుమారు 300 గ్రామాల ప్రజలు అతడ్ని ప్రశంసించే వారని చెబుతారు. అతను కళల్ని, సాహిత్యాన్నీ ప్రోత్సహించేవాడు. ఆ కాలాన్ని సంగం శకం అంటారు. సంగం శకం చివరి రాజులలో ఒకడైన పారీ దాతృత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఇలాటి రాజు మీదికి చెర, చోళ, పాండ్యన్ రాజులు యుద్ధాని కెళ్ళారు. ఈ యుద్ధానికి కారకుడు కూడా పారీయేనని చెప్పుకుంటారు.

        ఈ చరిత్రని నవలగా రాసింది ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు, తమిళనాడు అభ్యుదయ రచయితల, కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకటేశన్. దీనికి ముందు రాసిన కావల్ కొట్టంఅనే చారిత్రక నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వేల్పారీనవల రాయడానికి ఆరేళ్ళు పట్టింది. దీనికోసం పశ్చిమ కనుమల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. తమిళ రాజు పారీ పాలించే చిన్న రాజ్యమైన పరంబు  మీదికి ఏకంగా చేర, చోళ, పాండ్యన్ త్రయం యుద్ధం చేయడానికి కారణమేమిటో ఈ నవలలో చెప్పాడు వెంకటేశన్. శంకర్ కోసం దీన్ని చిత్రానువాదం చేసే పనిని ఇప్పటికే ప్రారంభించాడు వెంకటేశన్.

        ఇప్పుడు శంకర్ దీన్ని సూర్యతో ఎంత గొప్పగా తీస్తాడనేది చూడాల్సి వుంది. తనకి ఎవరితోనూ పోలిక వుండేది కాదు. మణిరత్నంతో కూడా. మణిరత్నం తీసే సినిమాలు వేరు, తన సినిమాలు వేరేగా వుండేవి. అలాంటిది ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్’  చారిత్రాత్మకంతో మణిరత్నం సవాలు విసురుతున్నట్టే. ఇప్పటికే దీని మెగా క్వాలిటీని ట్రైలర్ చూసి అంతర్జాతీయ మీడియా ఆకాశాని కెత్తేస్తోంది. దానిదేముంది, ఇది సెప్టెంబర్ 30 న విడుదలవుతోంది...శంకర్ సినిమా పూర్తవడానికి ఏడాది పైనే పడుతుంది...అప్పటికి మణిరత్నం మూవీ పోటీకి వుండదనుకుంటే, అప్పటికి రెండో భాగం వచ్చి ఎదుట నిలబడ వచ్చు.

        ముందుగా శంకర్ ఇప్పుడు నిర్మాణంలో వున్న రెండు సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. కమల్ హాసన్ తో ఇండియన్2’, రాంచరణ్ తో ఆర్సీ15’. ఇవి పూర్తయ్యాకే వేల్పారీప్రారంభమవుతుంది. దీంతో శంకర్ ఉజ్వల భవిష్యత్తు పొంది తీరాలి తప్పదు.

—సికిందర్

*

 

29, సెప్టెంబర్ 2022, గురువారం

1221 : స్పెషల్ రివ్యూ!


  దర్శకత్వం : పృథ్వీ రాజ్ సుకుమారన్
తారాగణం : మోహన్ లాల్, సానియా అయ్యప్పన్, మంజూ వారియర్, వివేక్ ఒబెరాయ్, సచిన్ ఖెడేకర్, టోవినో థామస్, సాయికుమార్, ఇంద్రజిత్ సుకుమారన్, ఫ్రాంక్ ఫ్రీ తదితరులు
రచన : మురళీ గోపి, సంగీతం : దీపక్ దేవ్, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్
బ్యానర్ : ఆశిర్వాద్ సినిమాస్
నిర్మాత : ఆంటోనీ పెరంబవూర్
విడుదల : ఏప్రెల్ 12, 2019
***
        లయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన హిట్ ‘లూసిఫర్’ తెలుగులో ఇదే టైటిల్ తో 2019 లో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. ఆన్ లైన్లో ఇది అమెజాన్ లో, యూట్యూబ్ లో అందుబాటులో వుంది. వర్తమాన దేశ రాజకీయాలని కేరళ రాష్ట్ర నేపధ్యంలో పరోక్షంగా చిత్రించే ఈ రాజకీయ థ్రిల్లర్ కి దేశ విదేశ కేరళీయులు స్పందించి విశేషంగా కలెక్షన్లు కట్టబెట్టారు. బయోపిక్స్ పేరుతో, పోలిటిక్స్ పేరుతో  2019 నాటి  ఎన్నికల సీజన్లో ఇతర భాషల్లో ప్పటికే అనేక సినిమా లొచ్చాయి. వాటిలాగా పార్టీ ఎన్నికల ప్రచార సాధనంగా గాక, ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించే కుటిల రాజకీయ శక్తుల ప్రక్షాళనగా ‘లూసిఫర్’  ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవుడి కుడి భుజంగా వెలిగిన దేవదూత లూసిఫర్ ని సాతానుగా ముద్రవేసి స్వర్గం నుంచి బహిష్కరిస్తే  ఏం జరిగిందనే హిబ్రూ పురాణ గాథని,  వర్తమాన పరిస్థితులకి అన్వయించి నిర్మించిన ఈ భారీ ప్రయోగాత్మకం ఎలా వుందో ఒకసారి చూద్దాం...

కథ

ముఖ్యమంత్రి పీకే రాందాస్ (సచిన్ ఖెడేకర్) ఆకస్మిక మృతితో కథ ప్రారంభమవుతుంది. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలో పోటాపోటీలు మొదలవుతాయి. రాందాస్ కుమార్తె ప్రియ (మంజూ వారియర్), ఆమె కుమార్తె జాహ్నవి (సానియా అయ్యప్పన్) లతో బాటు కొడుకు జతిన్, అల్లుడు బాబీ అంత్యక్రియలకి వస్తారని ఎదురు చూస్తూంటారు. విదేశీ యాత్రలో వున్న రాందాస్ కుమారుడు జతిన్ రాందాస్ (టోవినో థామస్) ఇప్పట్లో రాలేనని కబురు పంపుతాడు. ముంబాయిలో బిజినెస్ పనుల్లో వున్న రాందాస్ అల్లుడు బాబీ (వివేక్ ఒబెరాయ్) కూడా తాత్సారం చేస్తూంటాడు. ఇక ప్రియ తనే తండ్రి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేస్తుంది. తర్వాత ఆమె భర్త బాబీ ముంబాయి నుంచి వచ్చి సీఎంగా జతిన్ పేరు ప్రతిపాదిస్తాడు. పార్టీలో నెంబర్ టూ వర్మ (సాయికుమార్) దీన్ని వ్యతిరేకిస్తాడు, ప్రియకి కూడా ఇది మింగుడుపడదు. ప్రతిపక్ష నేత ఇంకో కుట్రతో వుంటాడు. అయినా బాబీ మాట నెగ్గించుకుని, జతిన్ చేత పార్టీ శ్రేణులకి ప్రసంగ మిప్పిస్తాడు. దీంతో ఇతనే మా సీఎం అంటూ హర్షధ్వానాలు చేస్తాయి పార్టీ శ్రేణులు.

ఇదంతా గమనిస్తున్న స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్) ఇందులో బాబీ చేస్తున్న భారీ కుట్రని పసిగడతాడు. ఎక్కడో కొండ ప్రాంతంలో దివంగత సీఎం రాందాస్ కి చెందిన అనాధాశ్రామాన్ని చూసుకుంటున్న ఇతను, ఇక దైవ సమానుడైన రాందాస్ కుటుంబాన్నీ, ఆయన రాజకీయ వారసత్వాన్నీ నిలబెట్టేందుకు కదిలి వస్తాడు. ఎవరీ స్టీఫెన్ గట్టు పల్లి? అతను లూసిఫర్ గా ప్రకటించుకుని ఎలా శత్రువినాశం గావించాడు? అతడికి తోడ్పడిన గ్రూపులెవరు?...అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది అంతరార్ధాలతో, సంకేతాలతో చెప్పిన కేరళ రాజకీయ కుట్రల కథ. అపారమైన డబ్బుతో ప్రభుత్వాల్ని మార్చెయ్యగల  రిచ్ రాజకీయ శక్తికి వ్యతిరేకంగా పోరాడే కథ. ఇక్కడ మతాల గొడవేంటని ప్రశ్నించే కథ. ఇందులో ఓపెన్ గానే డైలాగు వుంది - ‘నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వ్యాపించిన మతోన్మాదమనే కార్చిచ్చు, ఇప్పుడు ఈ రాష్ట్రానికి కూడా వ్యాపించి దహించడం మొదలెట్టింది. దీన్నెదుర్కోవడానికి మనక్కావాల్సింది డబ్బు’ అని.  కొన్ని పాత్రలు కూడా గుర్తించదగ్గ రాజకీయ వాసనేస్తూ వుంటాయి. చివరికి అన్నీ చక్కబడి, ప్రశాంతత నెలకొన్న వాతావరణంలో ముగింపు వాయిసోవర్ కూడా ఇలా వుంటుంది – ఈ ప్రాంతాన్ని స్వర్గ భూమి అని ఎందుకన్నారో చెప్పి, ఇంత కాలం ఇక్కడి ప్రజల్ని కాపాడింది దేవుడు కాదనీ చెబుతూ, ‘ఇక ముందూ కాపాడ బోయేది దేవుడు కాదు...ఇది దేవుడి రాజ్యం కాదు...స్వర్గం నుంచి బహిష్కరింపబడిన దేవదూతల రాజ్యం...’ అని సున్నితంగా వ్యాఖ్యానిస్తారు.

స్టీఫెన్ గట్టుపల్లి క్రిస్టియన్, అతడికి తోడ్పడే జయేద్ మసూద్ గ్రూపు (ఈ పాత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు) ముస్లిం, వీళ్ళు కాపాడే రాజకీయ కుటుంబం హిందూ. కేరళ సోషల్ స్ట్రక్చర్ మతసామరస్యంతో కూడి ఎంత బలంగా వుంటుందనడానికి ప్రతీకాలంకారాలుగా ఈ పాత్రలు.

ఇక్కడ ఇంకో ముఖ్యాంశమేమిటంటే, మసూద్ గ్రూపు నాయకుడు మసూద్, ‘ఖురేషీ అబ్రాం’ పేరుతో అంతర్జాతీయ ‘ఇల్యుమినాటిస్ సొసైటీ’ లో సభ్యుడుగా వుంటాడు. శతాబ్దాల చరిత్రగల ‘ఇల్యుమినాటిస్ సొసైటీ’ గురించి తెలిసిందే. ప్రపంచ ధనికుల దగ్గర్నుంచి, మేధావులు, సామాన్యులు కూడా ఈ సొసైటీలో ఎవరైనా చేరవచ్చు. వీళ్ళంతా సామాజిక న్యాయం కోసం, ప్రజానీక సామూహిక అభ్యున్నతి కోసం  కార్యకలాపాలు నిర్వహిస్తూంటారు. ఇక్కడ నీతి ఏమిటంటే, మసూద్ టెర్రరిజం వైపుకెళ్ళకుండా, ఈ సొసైటీలో చేరడం. స్టీఫెన్ గట్టుపల్లి ఈ సొసైటీతోనే సంబంధాలు పెట్టుకోవడం. అధికారం కోసం అల్లుడు బాబీ వేల కోట్లు ఖర్చు పెట్టగల స్థాయిలో వుంటాడు, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్ వర్క్ తో సంబంధాలు పెట్టుకుని. డ్రగ్ మాఫియాతో సంబంధాలంటే టెర్రరిస్టులతో సంబంధాలే అనుకున్న స్టీఫెన్ గట్టుపల్లి- ముగింపులో రష్యా వెళ్లి - బాబీతో సంబంధాలున్న రష్యన్ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ఫొయోడర్ ని అంతమొందిస్తాడు.

ఆ తర్వాత ముంబాయిలో ఓ అతి బడా పారిశ్రామిక వేత్తకి ఫోన్ వస్తుంది. క్రోనీ క్యాపటలిజం. ప్రభుత్వానికి ఆర్ధిక దన్ను. ఇతను ‘ఎవడ్రా నువ్వు?’  అని కొందరు మాఫియా డాన్ల పేర్లు, టెర్రరిస్టుల పేర్లు చెప్తాడు. అవతల ఫోన్ చేసిన మసూద్, ఫోన్ ని  స్టీఫెన్ గట్టుపల్లి కిస్తాడు. స్టీఫెన్ గట్టు పల్లి, ‘ఖురేషీ అబ్రాం’ అని చెప్పి కట్ చేస్తాడు. అంటే ఇక స్టీఫెన్ గట్టుపల్లి ఇప్పుడు తను  కూడా ఇల్యుమినాటిస్ లో చేరిపోయాడన్న మాట.

ఇదంతా నటుడు, గాయకుడు,  రచయిత, జర్నలిస్టు మురళీగోపి నీటుగా రాసిన కథా, స్క్రీన్ ప్లేల గొప్పతనం. నడుస్తున్న చరిత్రని పరోక్షంగా చూపిస్తాడు. ఇంకొక మతిపోయే క్రియేషన్ ఏమిటంటే, కేరళ అడవుల్లో బాబీ తాలూకు డ్రగ్ మాఫియా ముఠా మొత్తాన్నీ (పదుల సంఖ్యలో వుంటారు) అంతమొందించి వచ్చేస్తాడు స్టీఫెన్ గట్టుపల్లి.

ఈ సంఘటనలో స్టీఫెన్ గట్టుపల్లిని పట్టుకోవడానికి సాక్ష్యాధారాల కోసం పోలీసులు వచ్చేస్తారు. అక్కడ శవాలు వుండవు, సెల్ ఫోన్లు వుండవు, ఫైరింగ్ జరిగినట్టు ఎక్కడా ఆనవాళ్ళూ వుండవు. అసలు సంఘటనే జరిగినట్టు వుండదు! ఇది బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ ని గుర్తుకు తెస్తుంది...

ఎవరెలా చేశారు

    మోహన్ లాల్ చాలా అండర్ ప్లే చేస్తూ నటిస్తాడు పాత్రని. అతడి చర్యలే  చెప్తూంటాయి పాత్ర మానసిక తీవ్రతని. హిబ్రూ పురాణ పాత్ర లూసిఫర్ ని పోలిన జీవిత చరిత్ర ఈ పాత్ర కుంటుంది. తను స్వర్గం నుంచి పతనమైనా, ప్రాణసమాన మైన స్వర్గవాసులైన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులని కాపాడి, వారి స్వర్గాన్ని పునఃస్థాపించే ఉదాత్త పాత్రగా, లోక రక్షకుడుగా వుంటాడు. డైలాగులు చాలా తక్కువ. ఫైట్లు చాలా ఎక్కువ. లుంగీ కట్టుకునే ఇరగదీస్తూంటాడు ఎక్కడపడితే అక్కడ శత్రువుల్ని. క్లాస్ కథని సామాన్యులు మెచ్చేలా మాస్ పాత్రతో చెప్పడం ఇక్కడ వ్యాపార వ్యూహం. వారం తిరిగేసరికల్లా వసూళ్ళు వందకోట్లు దాటింది. అరవై దాటినా మోహన్ లాల్ ఇంకా బాక్సాఫీసుని కమాండ్ చేస్తున్నాడు.

సీఎం కూతురి పాత్రలో మంజూ వారియర్ ప్రేక్షకుల మీద అత్యంత బలమైన ప్రభావం చూపే మరో పాత్ర. ఈమె కూతురి పాత్రలో సానియా అయ్యప్పన్ బాధిత పాత్ర. సీఎం అల్లుడు బాబీ పాత్రలో ప్రధాన విలన్ గా క్లాస్ నటనతో వివేక్ ఒబెరాయ్. సీఎం హైఫై కొడుకుగా టోవినో థామస్ పాత్ర, నటన చాలా సర్ప్రైజింగ్ గా వుంటాయి. కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించే ఇతడి మీద ఇంటర్వెల్ సీను హైలైట్ గా వుంటుంది. ఎకాఎకీన వూడిపడే రాజకీయ వారసుల మీద సెటైర్ ఈ పాత్ర. మాతృభాష కూడా రాని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని, డబ్బా కొడుకుల రాజకీయ అరంగేట్రాలకి కొరడా దెబ్బ ఈసీను. కానీ ఇదే సీనులో తను ఎలా విదేశాల్లో సంస్కృతి మరవకుండా, రాజకీయ పరిజ్ఞానాన్ని జోడించుకుని పెరిగాడో మాతృభాషలో అనర్గళంగా చెప్పి ముగించే పాజిటివ్ టచ్ – రాజకీయ నాయకుల వారస రత్నాలకి పాఠంలా వుంటుంది.

చివరికేమిటి

    నటుడు, గాయకుడు, నిర్మాత, పంపిణీదారుడు, దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకుడుగా ఈ తొలి ప్రయత్నంతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. అయితే ఒక్కటే లోపం. అతి స్లోగా సినిమా సాగడం. అయినా మలయాళంలో అంత హిట్టయిందంటే ఇది వాళ్ళ సినిమా, వాళ్ళ సూపర్ స్టార్. పరాయి ప్రేక్షకులకి ఇంత స్లో నడక ట్రెండ్ కి దూరంగా ఇబ్బందిగానే వుంటుంది. పైగా మూడు గంటల నిడివి.

ఐతే అవే రెండు మూడు రకాల కథలతో రొటీనై పోయిన రాజకీయ సినిమాలతో పోలిస్తే,  విషయపరంగా చాలా భిన్నమైనది, బలమైనది. ఇంటర్వెల్ వరకూ సీఎం చనిపోయి, వారసుడెవరన్న ప్రశ్నతో, సీఎం పదవి కోసం ఎత్తుగడల మామూలు కథగానే వుంటుంది. ఐతే సీఎం కొడుకునే విలన్ ప్రతిపాదించడంతో కథ ఇక్కడి నుంచి మారిపోతుంది. సీఎం పదవికోసం కుట్రల కథల రొటీన్ ని ఛేదించి, అడ్డదారుల్లో అధికారాన్ని కైవసం చేసుకునే కుట్ర దారుల నిర్మూలనగా, డిఫరెంట్ గా టేకాఫ్ తీసుకుంటుంది. సీఎం చనిపోవడం, పదవి భర్తీ ఇదంతా షుగర్ కోటింగ్ లా పైకి కన్పించే కథ మాత్రమే. అంతర్లీనంగా చెప్పాలనుకున్న పరోక్ష కథ పూర్తిగా వేరు. ఇదేమిటనేది పైనే చెప్పుకున్నాం.

క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలకి హిందీ ఐటెం సాంగ్ బాగా కిక్కు నిస్తుంది. సినిమాలో వున్నది ఒకే పాట. ఇది చివర్లో సినిమానే పైసా వసూల్ చేస్తుంది. వినోదంతో బాటు విజ్ఞానం కోసం ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని చూడొచ్చు.

ఇది మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్గా రీమేక్ అయింది. ఈ రీమేక్ లో మార్పు చేర్పులు జరిగే వుంటాయి. అయితే అంతరార్ధాలతో, సంకేతాలతో, ప్రతీకాలంకారాలతో, బలమైన పాత్రలతో చాలా డెప్త్ తో డిఫరెంట్ ఫీలింగ్ తీసుకొస్తూ రూపొందిన లూసిఫర్స్థాయిలోనే ఇది వుంటుందా? దేవదూత లూసిఫర్ తో హిబ్రూ పురాణ నేపథ్యం వుంటుందా? ఇల్యూమినాటిస్ గోడచేర్పు వుంటుందా? తెలుగు నేటివిటీ కోసం, చిరంజీవి రొటీన్ ఇమేజి కొనసాగింపు కోసం, మరో రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ గా మారిపోయిందా? ఇవి అక్టోబర్ 5న తెలుసుకుందాం...

—సికిందర్